వియుక్త (Abstract): భారత సంస్కృతి స్త్రీని శక్తి స్వరూపిణిగా భావిస్తుంది. ప్రాచీన భారతదేశంలో స్త్రీ పురుషుల మధ్య విభేదాలు, వ్యత్యాసాలు లేవు. వారి సమర్ధతను బట్టి స్త్రీలు వివిధ రంగాలలో వారి సత్తా చాటేవారు. కళలు, యుద్ధ విద్యలు, వేద పఠనం, కావ్య రచన, ఇంటి బాధ్యతలు మొదలైన అంశాలతో పాటు పలు ఆర్థిక, రాజకీయ రంగాలలో ప్రతిభ చూపేవారు.
మధ్యయుగంలో విదేశీ దండయాత్రలు వారి భౌతిక రక్షణకు సవాలుగా మారటంతో వారు ఇంటికి పరిమితం చేయబడ్డారు. చదువుకు దూరమై కేవలం కుటుంబ బాధ్యతలు చేసుకునే పనులలో నిమగ్నమయ్యారు. ఇరవయ్యవ శతాబ్దంలో ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మానవహక్కుల పరిరక్షణలో భాగంగా స్త్రీలకు కల్పించిన హక్కులు వారిని మళ్ళీ విద్య,
ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దగ్గర చేశాయి. అయితే అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీపడుతున్న వీరికి పారిశ్రామిక, వ్యాపార రంగాలలో సరైన స్థానం లభించటం లేదనే చెప్పాలి. వ్యవస్థాపనలో భారత మహిళల సంఖ్య 14% మాత్రమే, అంటే కేవలం ఎనిమిది మిలియన్లు మాత్రమే. మహిళా వ్యవస్థాపనలో ఉన్న ఇబ్బందులు, ఆటంకాలను ఈ పరిశోధనా పత్రం ద్వితీయ దతాంశం ఆధారంగా చర్చిస్తుంది.
పరిచయం: శతాబ్దాలుగా మహిళా సాధికారత కోసం భారత మహిళలు చేస్తున్న పోరాటాలు ఇప్పుడిప్పుడే ఫలితాలనిస్తున్నాయి. మహిళలు అన్ని రంగాలలో ఉద్యోగాలు, ఉపాధి సాధిస్తూ ఆర్థిక స్వాతంత్య్ర ఫలాలు అనుభవించటంతో పాటు, కుటుంబ ఆర్థిక అవసరాలకు బాసటగా నిలుస్తున్నారు. ఫలితంగా స్థూల జాతీయోత్పత్తిలో వారి వాటా పెరుగుతూ వస్తోంది. 2023 మార్చి నాటికి 432 మిలియన్ల మహిళలు ఆదాయ ఆర్జనలో ఉండగా, వీరిలో 343 మిలియన్ల మంది అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. స్థూల జాతీయోత్పత్తికి వీరి వాటా 18% అయితే వ్యవస్థాపన, నూతన యూనిట్ల స్థాపన వంటి రంగాలలో మహిళల పాత్ర చాలా పరిమితంగా ఉంది. పీకేసి మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్‌కు చెందిన శ్వేతా కొచర్ ప్రకారం సూక్ష్మ, మధ్య తరహా పారిశ్రామిక యూనిట్ల విషయంలో మహిళా పారిశ్రామికుల సంఖ్య చెప్పుకోదగినదిగా ఉన్నప్పటికీ భారీ యూనిట్లు, సేవా రంగాలకు చెందిన పరిశ్రమలలో వీరు అత్యల్ప సంఖ్యలో ఉన్నారు. దీనికి వారిలోని న్యూనతాభావంతో పాటు శతాబ్దాలుగా వ్యాపారం, పరిశ్రమలు పురుషాధిపత్యంలో కొనసాగటం కూడా ఒక కారణం. వారి సమర్ధతను నిరూపించుకునే అవకాశాలు కూడా వారికి ఇవ్వకపోవటం మరో కారణం. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు, బ్యాంకులు, విత్త సంస్థల రాయితీల వంటివి ఎన్ని ఉన్నా వ్యవస్థాపనలో మహిళల పాత్ర పరిమితంగా ఉండడానికి క్రింది కారణాలు చెప్పుకోవచ్చు.
కుటుంబ బాధ్యతలు మరియు పురుషాధిపత్యం: భారత మహిళలు కుటుంబానికి, పిల్లలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. చాలా సందర్భాలలో కుటుంబ బాధ్యతల కోసం సొంత కేరీర్‌ను పక్కన పెట్టేస్తారు, లేదా కెరీర్‌కి ఎక్కువ సమయం కేటాయించలేరు. అవసరమైతే కుటుంబ బాధ్యతలను పంచుకునే పురుషుల సంఖ్య కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. కానీ చాలా తక్కువ శాతం మాత్రమే.
నిరక్షరాస్యత మరియు సాంఘిక కట్టుబాట్లు: భారతీయ మహిళలలో 60% ఇంకా పూర్తిస్థాయి అక్షరాస్యత లేనివారు. వీరిలోని సృజనను ఇది కొంత పరిమితం చేస్తుంది. అంటే వారు కొత్త సాంకేతికతను, కొత్త ఉత్పత్తి పద్ధతులను, మార్కెటింగ్ వ్యూహాలను అందిపుచ్చుకోవటానికి తక్కువ అవకాశం ఉంటుంది. చిన్న వయసులోనే వివాహం కావటం, కుటుంబం, సమాజం మహిళా పారిశ్రామికులను ప్రోత్సహించకపోవటం మొదలైనవి ఇతర కారణాలు.
విత్త సమస్యలు: ఇది వ్యవస్థాపకుల సాధారణ సమస్య అయినప్పటికీ, మహిళల విషయంలో బ్యాంకులు, ఇతర విత్త సంస్థలు రుణ మంజూరుకు కొంత వెనుకంజ వేస్తాయి. వారి చెల్లింపు సామర్ధ్యంపై అపనమ్మకమే దీనికి కారణం.
మార్కెట్ పోటీ: అనుభవం ఉన్న పురుష పారిశ్రామికవేత్తలతో పోల్చితే మార్కెట్ పోటీని ఎదుర్కోవటంలో వీరు కొంత వెనుకబడుతున్నారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
నష్టభయాన్ని భరించే శక్తి తక్కువ ఉండటం: చిన్న యూనిట్లను నడిపే మహిళలు, విత్త సమస్యలను ఎదుర్కొంటూ ఉండటం వల్ల చిన్న నష్టం వచ్చినా తట్టుకుని నిలబడే సామర్ధ్యం వీరిలో తక్కువగా ఉంటోంది. ఈ సమయంలో వీరికి సమాజం నుంచి నైతిక మద్దతు కూడా కరువవుతోంది.
వ్యవస్థాపక మరియు నిర్వహణ సామర్ధ్యాలు లోపించటం: మహిళా పారిశ్రామిక వేత్తలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, మెంటారింగ్ వంటి విషయాల్లో పూర్తి సౌకర్యాలు, సహకారం వీరికి అందటం లేదు. ఇది వారి వ్యాపార లాభదాయకతపై ప్రభావం చూపుతోంది.
మధ్య దళారీల దోపిడీ: కొనుగోళ్ళు, మార్కెటింగ్, నిర్వహణ వంటి విషయాల్లో మధ్యవర్తులపై ఆధారపడుతున్న మహిళలను వారు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. వారి మార్జిన్ కూడా కలుపుకోవటం వల్ల దాని ప్రభావం లాభదాయకతపై చూపుతోంది.
న్యాయపరమైన సమస్యలు: వివిధ పత్రాలు నింపటం, న్యాయపరమైన లాంఛనాలు పాటించటం వంటి విషయాలలో మహిళా పారిశ్రామిక వేత్తలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటితోపాటు అనేక సామాజికపరమైన, లింగపరమైన వివక్షతలు మహిళలను వ్యవస్థాపన వైపు రాకుండా పరిమితులు విధిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా అనేక ప్రోత్సాహకాలు ప్రకటించినప్పటికీ అవి క్షేత్రస్థాయికి పూర్తిగా చేరటం లేదు.
సూచనలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు వ్యవస్థాపక సౌకర్యాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. కళాశాల విద్యార్థినులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు మొదలైన వారిని దీనిలో భాగస్థులను చేయాలి. ` నైపుణ్య శిక్షణ, విత్త సౌకర్యాలు, ఇంక్యుబేషన్ సౌకర్యాలు వంటి వాటి గురించి విస్తృత ప్రచారం చేయాలి. ` రుణ, సబ్సిడీ సౌకర్యాలు వీలైనంత వేగంగా అందేలా చూడాలి. ` కళాశాల స్థాయిలోనే ఉద్యోగ సాధన కంటే ఉద్యోగ కల్పనపై ప్రేరణా కార్యక్రమాలు నిర్వహించాలి.
ముగింపు: భారతీయ సంస్కృతిలో స్త్రీకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే పరాయి పాలన వల్ల అక్షరాస్యత, ఆర్థిక స్వాతంత్య్రాలకు దూరమైన మహిళలను సమాజంలో గౌరవమైన జీవితంతో పాటు ఆర్థిక కార్యకలాపాలలో భాగం చేయగలిగితే భారతదేశం లాంటి మానవ వనరులు గల దేశాలు మరింత అభివృద్ధి సాధించగలవు.