ప్రాచీన ఘటనలు కథలుగా ఎలా మారతాయి? – కల్లూరి భాస్కరం

అతి ప్రాచీనకాలంలో జరిగిన ఘటనలు చిలవలు, పలవలతో కథలుగా ఎలా మారతాయి, అవి కాలదూరాలను, స్థలదూరాలను, ప్రాంతాల హద్దులను జయిస్తూ ఎలా వ్యాపిస్తాయి, ఆ వ్యాపించే క్రమలో వాటిలో కల్పన ఎంత చేరుతుంది, వాస్తవం ఎంత మిగులుతుంది, లేక మొత్తం అంతా కల్పనే అవుతుందా?!

ఆయా ఘటనలు కథలుగా మారే ఈ ప్రక్రియను ఇంతవరకు ఎవరైనా పరిశీలించారో లేదో, పరిశీలించి ఉంటే ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలను రాబట్టారో నాకు తెలియదు. నా ఉద్దేశంలో ఇది తప్పక పరిశోధించవలసిన అంశం. చిన్నప్పుడు నేను విన్న కొన్ని ముచ్చట్లు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో గుర్తొచ్చి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. వాటిలో మా అమ్మ చెప్పినది ఒకటి. దేవతలకు, రాక్షసులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు రాముడి తండ్రి అయిన దశరథుడు దేవతల పక్షాన యుద్ధం చేశాడు. ఆయన చిన్న భార్య కైక ఆ యుద్ధంలో ఆయన రథానికి సారథిగా ఉంది. యుద్ధం ముమ్మరమైన సమయంలో ఆ రథం ఇరుసుకు ఉండే సీల ఊడిపోయింది. దాంతో రథం పక్కకు ఒరిగిపోతుందేమోనని దశరథుడు భయపడ్డాడు. అప్పుడు కైక ఆ సీల ఉన్న చోట తన వేలు ఉంచి రథం ఒరిగి పోకుండా చూసింది. అందుకు సంతోషించిన దశరథుడు, ‘‘రెండు వరాలిస్తాను, కోరుకోమన్నా’’డు. ‘‘ఇప్పుడు కాదు, అవసరమైనప్పుడు కోరుకుంటా’’నని కైక అంది. రాముడికి పట్టాభిషేకాన్ని నిర్ణయించిన సందర్భంలో ఆ వరాలను అడగాల్సిన అక్కర ఆమెకొచ్చింది. రాముణ్ణి పద్నాలుగేళ్లు అడవికి పంపాలనీ, భరతుడికి పట్టాభిషేకం చేయాలనే రెండు కోరికలూ అలా పుట్టాయి. ఏమైతేనేం, యుద్ధంలో దశరథుడికి కైక చేసిన రథసాయం రామాయణ కథను కీలకమైన మలుపు తిప్పిందన్నమాట.
మా నాన్నగారు ఇంకొకటి కూడా అంటుండేవారు. కైక మనదేశానికి చెందిన స్త్రీ కాదట! రామాయణంలోనే, సుగ్రీవుడి మేనమామ పేరు దధిముఖుడు, అంటే పెరుగులాంటి ముఖం కలిగినవాడని అర్థం. దాన్నిబట్టి అతను కూడా విదేశీయుడని మా నాన్నగారు అంటుండేవారు. ఇవన్నీ నిజాలేనని నేను నమ్ముతూ, మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నానని మీరు అనుకుంటే పొరబడినట్టే. వీటిలో అనేకం కచ్చితంగా ఊహలే అయుంటాయి. అయితే, ఊహలైనా కూడా ఎలా పుడుతాయి, పళ్లేనికి గోడ చేర్పు ఉండాలన్నట్టుగా ఊహలకు కూడా లవలేశమైన వాస్తవమనే ఆధారం ఉండాలి కదా అనే ప్రశ్నలూ తలెత్తుతాయి. అంచేత పైన చెప్పిన ఊహల్లాంటివి ప్రచారంలో ఉన్నాయంటే వాటికి మూలమైన ఘటనలేవో ప్రాచీనకాలంలో జరిగి రకరకాల రూపాల్లో పురాణ, ఇతిహాసాలకు ఎక్కి
ఉండాలి. అలాంటి ఒకటో రెండో ఘటనలు ఆధారంగా ఇంకా ఎన్నెన్నో ఊహలు పుట్టి ఉండాలి.
యుద్ధంలో దశరథుడికి కైక సాయం చేసినట్టు వాల్మీకి రామాయణంలో ఉంది కానీ, ఈ సీల ఊడిపోవడం గురించిన వివరంలేదు. అనేక రామాయణాలున్నాయి కనుక వాటిలో దేనిలోనైనా ఈ వివరం ఉండి ఉండచ్చు. అన్నట్టు దశరథుడి పేరులోనే ‘రథం’ఉంది. ఇలా పేరులో రథనామం ఉన్నవారు మన పురాణ, ఇతిహాసాల్లో చాలామంది కనిపిస్తారు. ఇంకో ఉదాహరణ, బృహద్రథుడు. రథం అన్నప్పుడు చక్రమూ, దానికి ఉండే ఇరుసు వగైరాలు కూడా ఉండాల్సిందే కనుక పై ఉదంతంలో అవి రానే వచ్చాయి. అలాగే రథమన్నప్పుడు గుర్రం కూడా రావలసిందే. కైక తండ్రి పేరు అశ్వపతి. ఇలా పేర్లలో అశ్వనామం ఉన్నవారు కూడా మన పురాణ, ఇతిహాసాల్లో చాలామంది కనిపిస్తారు. అశ్వత్థామ, కువలయాశ్వుడు, అశ్వసేనుడు ఇప్పటికిప్పుడు స్ఫురించిన పేర్లు. ఇక ఋగ్వేదంలో అయితే రథాలూ, గుర్రాల ప్రస్తావన పదేపదే వస్తూనే ఉంటుంది.
ఇప్పుడు మన కాలానికి వద్దాం. ఏకంగా తన పేరులోనే గుర్రమూ, చక్రంతో పాటు భాషను కూడా చేర్చుకుంటూ 2007లో ఒక పుస్తకం వచ్చింది. అది:THE HORSE THE WHEEL AND LANGUAGE * How Bronze-Age Riders from the Eurasian Steppes Shaped the Modern World. ప్రిన్‌ స్టన్‌ యూనివర్సిటీ ప్రచురించిన ఈ పుస్తకం రచయిత, ప్రముఖ పురాతత్వశాస్త్రవేత్త డేవిడ్‌ డబ్ల్యు.ఆంథోనీ (David W. Anthony).. మొత్తం 17 అధ్యాయాలున్న తన పుస్తకంలో ఏయే అధ్యాయాల్లో ఏయే విషయాలను తను చర్చించాడో, ‘మృతసంస్కృతిని పునర్నిర్మించడం ఎలా (How to Reconstruct a Dead Culture)’ శీర్షిక కింద ఆయన సంగ్రహంగా వివరించాడు. ‘అతి ప్రాచీనకాలంలో, అంటే క్రీ.పూ. 3700-3100 మధ్యకాలంలో మెసొపొటేమియా (నేటి ఇరాక్‌, కువైట్‌ ఉన్న ప్రాంతం) పట్టణ నాగరికతల ప్రభావం స్టెప్పీ సమాజాల మీదా, స్టెప్పీ సమాజాల ప్రభావం మెసొపొటేమియా పట్టణనాగరికతల మీదా ఎలా పడిరదో, దక్షిణాదికి చెందిన ఈ నాగరికతా ప్రాంతాలతో జరిపే దూరప్రాంత వాణిజ్యం ద్వారా, స్టెప్పీలకు దగ్గరగా ఉన్న ఉత్తర కాకసస్‌ పర్వత (North Caucasus Mountains) ప్రాంతాల్లో నివసించిన తెగల నాయకులు (chiefs) నమ్మలేనంత స్థాయిలో ఎలా సంపద గడిరచారో- 12వ అధ్యాయంలో చర్చించానని ఆయన అంటాడు. ఇదే సందర్భంలో, ‘తొలినాటి చక్రాల బండ్లు, తొలి రవాణాబండ్లు బహుశా ఈ పర్వత ప్రాంతాల గుండానే స్టెప్పీలలోకి పయనించి ఉంటా The earliest wheeled vehicles, the first wagons, probably rolled into the steppes through these mountains)’ యని ఆయన అంటాడు. ఈ మాటల పక్కనే, ‘దశరథుడు యుద్ధం చేస్తున్నపుడు రథపు ఇరుసు దగ్గర ఉండే సీల ఊడిపోతే కైక ఆ చోట్లో తన వేలు ఉంచిందట’అని మార్జిన్‌లో నేను రాసుకున్నాను.

అతి ప్రాచీన డి.ఎన్‌.ఎ ఆధారంగా మానవాళి జన్యుచరిత్రను ఆవిష్కరించిన డేవిడ్‌ రైక్‌ పుస్తకం అడుగడుగునా ఎంత ఆసక్తిని రేపుతుందో పురావస్తు ఆధారాలు, భాషాసామ్యాలను ముందుకు తేవడం ద్వారా ఇండో-యూరోపియన్లకు చెందిన దాదాపు ఎనిమిదివేల సంవత్సరాల చరిత్రను మన కళ్ళముందు పరచి చూపించిన డేవిడ్‌ ఆంథోనీ పుస్తకం కూడా అంతే ఆసక్తిని రేపుతుంది. నేటి వివిధ ఇండో-యూరోపియన్‌ భాషల్లోని పదజాలం ఆధారంగా ఎనిమిదివేల ఏళ్ల క్రితానికి చెందిన ఈ భాషల మాతృక (ప్రోటో-ఇండో-యూరోపియన్‌) ను ఎలా పునర్నిర్మించారో డేవిడ్‌ ఆంథోనీ చెప్పుకుంటూ వచ్చాడు. వాటిలో బండ్లు, చక్రాలు, ఆ చక్రాలకు చెందిన పరికరాలను చెప్పే పదాలు కూడా ఉన్నాయి. ఒక్క ఇరుసుకు సంబంధించే చెప్పుకుంటే, ప్రోటో-ఇండో-యూరోపియన్‌లో దానిని aks (పునర్నిర్మించిన, వాడుకలోనేని ప్రాచీన భాషా పదాలను ఇలా గుర్తులతో సూచిస్తారు) గా గుర్తించారు. ఇదే లాటిన్‌లో aఞఱం ఓల్డ్‌ ఇంగ్లీష్‌లో eax ఓల్డ్‌ హై జర్మన్‌లో ష్ట్రaవసం- ఓల్డ్‌ ప్రష్యన్‌లో assis ఓల్డ్‌ చర్చి స్లొవానిక్‌లో osi మైసీనియా గ్రీక్‌లో a-ko-so-ne ఓల్డ్‌ ఇండిక్‌లో, అంటే ప్రాచీనసంస్కృతంలో aks a ఇంగ్లీష్‌ లో axle అయింది.

కాకసస్‌-కైక అనే పేర్ల ధ్వనిలో కనిపించే పోలిక ఆ ఉభయుల మధ్య ఏదైనా సంబంధాన్ని చెబుతోందని ఒకవేళ అనుకుంటే, తొలి చక్రాల బండ్లు, రవాణా బండ్లు కాకసస్‌ నుంచే స్టెప్పీలలోకి ప్రవేశించాయన్న వివరాన్ని కూడా దృష్టిలో ఉంచుకుంటే, రథపు ఇరుసు తాలూకు సీల ఊడిపోయిన చోట కైక వేలు ఉంచిందన్న సమాచారం ఎంతో కొంత అర్థవంతంగానే కనిపిస్తుంది. ఆపైన, కాకసస్‌ ప్రాంతానికి, మన ప్రాంతాలకు ఉన్న సంబంధం గురించిన మరికొంత సమాచారానికి, లేదా మరికొన్ని ఊహల్లోకి వెళ్లాలంటే, మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్న బెడ్రిక్‌ హ్రోజ్నీ (bedric Hrozny) ని పలకరించాలి.

నేటి కాస్పియన్‌ (Caspian) సముద్రానికి నైరుతి దిశలో ఉన్న పర్వత ప్రాంతాలను క్రీ.పూ. రెండవ సహస్రాబ్దిలో కస్సైట్లు (kassites) పాలించారనీ, వీరే అయిదువందల ఏళ్లకు పైగా బాబిలోనియా (మెసొపొటేమియాలో భాగం)ను కూడా ఏలారని-ఆయన తన Ancient History of Western Asia, India and Crete అనే పుస్తకంలో ‘ The Caucasus the Hamito-Semites and the Caspian Peoples’ అనే మూడవ అధ్యాయంలో అంటూ, కాస్పియన్‌ సముద్రం, కస్సైట్ల పేరులోని ‘కస్‌’అనే మూలరూపం ఇంకా ఎన్నెన్ని చోట్లకు వ్యాపించిందో కూడా చెప్పాడు. ఆయన ప్రకారం, ఇండో-యూరోపియన్లలో (హ్రోజ్నీ వీరందరినీ ఆర్యులన్నాడు కానీ, డేవిడ్‌ ఆంథోనీ ప్రకారం, ఇరాన్‌-భారత సంబంధం కలిగిన ఇండో-యూరోపియన్లను మాత్రమే ఆర్యులనాలి) కలిసిపోయిన కస్సైట్లు, శ్రేష్ఠమైన గుర్రాల పెంపకానికి ప్రసిద్ధులు. వీరే దక్షిణాదికి చెందిన అసీరియన్లకు గుర్రాలను, కంచు సామగ్రిని, ఇతర సాధనాలను సరఫరా చేసేవారు. వీరి పేరులోని ‘కస్‌’అనే మూలరూపమే కుశ్‌, లేదా కుష్‌ వగైరా రూపాల్లోకి మారింది. కాస్పియన్‌ సముద్రానికి వాయవ్యంగా ఉన్న ప్రాంతాన్ని ఏలినవారిని కాస్పియోయ్‌ (Kaspioi) అనే వారు. వారిలోనే కొందరు ఆ తర్వాత హిందూ-కుష్‌ పర్వతాల్లో ఉన్న కఫీరిస్తాన్‌ (Kafiristan) దాకా వలస వెళ్ళి, ఆ ప్రాంతానికి కాస్పియా అనీ, ఆ పర్వతానికి (హిందూ) కుష్‌, లేదా కుశ్‌ అనే పేరు తెచ్చారు.
ఈ తూర్పు కాస్పియన్‌ జనాల తాలూకు వారసులు గిల్గిత్‌ (Gilgit: ఇప్పుడు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉంది) లో ఇప్పటికీ ఉన్నారు, వీరు ఆధునిక కాకేసియన్‌ (Caucasian) భాషలకు దగ్గరగా ఉండే ‘బురుషష్కి’అనే భాష మాట్లాడతారు. అసలు కాకసస్‌ (Kaukasos) పేరులోనే కస్‌ అనే మూల రూపం ఉంది. కాకసస్‌ పర్వతాల్లో అన్నింటికన్నా ఎత్తైన పర్వతం కజ్బెక్‌ (Kazbek) పేరులో కస్‌ ఉంది. బ్యాక్ట్రియానుంచి వాయవ్య భారతంమీద దాడి చేసిన కుషాణుల పేరులో కూడా కస్‌కు మరో రూపమైన కుష్‌ ఉంది. హ్రోజ్నీ ప్రస్తావించకపోయినా, మన కశ్మీర్‌ పేరులో కూడా కస్‌ లేదా కశ్‌ ఉంది. బ్యాక్ట్రియాను కుశాన్‌ అని పిలిచేవారు.
ఇక కుశ శబ్దం మన వేదపురాణ ఇతిహాసాల్లో ఎన్నెన్ని చోట్ల కనిపిస్తుందో లెక్కేలేదు. యజ్ఞాల్లో, పితృకార్యాల్లో వాడే ఒకవిధమైన గడ్డిని కుశ, లేదా దర్భ అనడం మనకు తెలుసు. కుశధ్వజుడు, కుశనాభుడు, కుశికుడు, కుశుడు (రాముని కుమారుడు) అనే పేర్లలో కుశశబ్దం
ఉంది. విశ్వామిత్రుడు కుశికుని వంశంవాడు కనుక కౌశికుడు అయ్యాడు. టర్కిష్‌ పేర్లైన కిర్గిజ్‌(కిర్గిజ్‌స్తాన్‌), కజక్‌స్తాన్‌ (Kazakstan), రష్యన్‌, ఉక్రెయిన్‌ మాటైన (Kozaks, Kozak)లో కస్‌ మూలరూపం ఉంది. టర్కిష్‌ భాషలో కజక్‌ అనే మాటకు సంచారజీవి, దేశదిమ్మరి, మంచి గుర్రపు రౌతు, బందిపోటు, గడ్డిభూములకు చెందిన దోపిడీదారు అనే అర్థాలున్నాయి. ఈ కస్‌ మూలరూపంతో సంబంధం ఉన్న జనాలు అటు కాకసస్‌ నుంచి ఇటు కశ్మీర్‌ వరకు విస్తరించడం చూస్తే, ఈ అర్థాలలో కొన్నైనా అర్థవంతంగానే కనిపిస్తాయి. ఎంతో విస్తృతీ, వైశాల్యం కలిగిన ఇలాంటి కాకసస్‌-కశ్మీర్‌ లింకులో కైక ఉదంతం ఎక్కడో ఒకచోట ఇమిడిపోతే ఆశ్చర్యపడనక్కర్లేదు. చక్రం సాంకేతికతను బాగా అభివృద్ధి చేసి ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రాంతానికీ, ఆమెకూ మధ్య, నామసామ్యం ద్వారానో, మరోవిధంగానో ముడిపెట్టి ఆ సాంకేతికతలో ఆమెకున్న అనుభవాన్ని అలంకారికంగా అలా సూచించి ఉండవచ్చు.
ఇప్పుడు మళ్ళీ డేవిడ్‌ రైక్‌ దగ్గరికి వద్దాం. అయిదువేల సంవత్సరాలను మించిన వెనకటి కాలానికి చెందిన నేటి ఉత్తర యూరప్‌లోకి ఒకసారి తొంగి చూస్తే, నేడు అక్కడున్న జనానికి ముఖ్యపూర్వీకులైన, లేదా ప్రధాన జన్యువారసత్వాన్ని అందించిన జనాలు అప్పటికింకా అక్కడ అడుగుపెట్టనే లేదన్న ఒక అసాధారణసత్యాన్ని ప్రాచీన DNA వెల్లడిస్తుందంటాడాయన. ఆ తర్వాత The Tide from the East అనే ఉపశీర్షికతో, తూర్పున స్టెప్పీలనబడే గడ్డిభూముల నుంచి జనాల వలస యూరప్‌ను ఎలా ముంచెత్తిందో చెప్పుకుంటూ వచ్చాడు.
ఈ స్టెప్పీలు మధ్య యూరప్‌ నుంచి చైనా వరకు ఎనిమిది వేల కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉన్నాయి. అయిదువేల సంవత్సరాల క్రితానికి ముందు ఈ స్టెప్పీలకు చెందిన నదీలోయలకు దూరంగా ఎవరూ నివసించలేదని పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి. ఎందుకంటే, ఆ ప్రాంతాలలో వర్షపాతం చాలా తక్కువ. అందువల్ల వ్యవసాయానికి కానీ, పశుపోషణకు కానీ అవకాశముండేది కాదు. అయితే, అయిదువేల సంవత్సరాల క్రితం ఈ స్టెప్పీ జనాలకు చెందిన ‘యామ్నాయ సంస్కృతి’ (Yamnaya culture: యామ్నాయ అనే ఈ మాట రష్యన్‌ భాషలో గోతి సమాధు-pit graves-లను సూచిస్తుంది) అడుగుపెట్టడంతో ఇదంతా మారిపోయింది. గొర్రెలు, ఆలమందల పెంపకానికి చెందిన ఆర్థికత మీద ఆధారపడిన ఈ యామ్నాయ సంస్కృతీ జనాలు, ఇదే ప్రాంతంలో నివసించిన తమ వెనకటి సంస్కృతులకు చెందిన జనాల కన్నా ఎక్కువ సమర్థంగా ఈ స్టెప్పీలలోనూ, వాటి చుట్టుపక్కలా ఉన్న వనరులను వాడుకుంటూ అటు యూరప్‌లోని హంగరీ నుంచి ఇటు మధ్యాసియాలోని ఆల్టాయ్‌ పర్వతాల వరకు- సువిశాల ప్రాంతానికి విస్తరించారు. అలా విస్తరించే క్రమంలో అనేకచోట్ల అప్పటికే ఉన్న వివిధ సంస్కృతుల స్థానాన్ని ఆక్రమించుకున్నారు. ఇందుకు వారికి బాగా అందివచ్చిన సాంకేతికత, చక్రం.
యామ్నాయ అడుగుపెట్టడానికి అయిదువందల ఏళ్ళకు ముందే చక్రానికి చెందిన సాంకేతికత యూరేషియా మొత్తంలో ‘దావానలం’లా వ్యాపించిందంటాడు డేవిడ్‌ రైక్‌ (ఇక్కడ ఈ ఉపమానం తగదేమో). తమకు దక్షిణంగా, నల్లసముద్రం, కాస్పియన్‌ సముద్రాలకు మధ్యనున్న కాకసస్‌ ప్రాంతంలోని మైకాప్‌ (Maikop) అనే పేరు కలిగిన మరో సంస్కృతీ జనాలనుంచి చక్రాలు కలిగిన రవాణాబండ్ల వాడకాన్ని యామ్నాయజనం నేర్చుకున్నట్టు కనిపిస్తుంది. యూరేషియాలోని అన్ని సంస్కృతుల జనానికీ చక్రం ఎంతైనా ముఖ్యమే కానీ, స్టెప్పీకి చెందిన యామ్నాయజనానికి మరింత ముఖ్యమైనదిÑ ఎందుకంటే దానివల్ల పూర్తిగా కొత్తదైన ఆర్థికతను, సంస్కృతిని నిర్మించడం వారికి సాధ్యమైంది. దాని సాయంతోనే, అంతవరకూ వెళ్లలేని చోట్లకు కూడా వాళ్ళు వెళ్లగలిగారు. బండ్లలోనే పిల్లాజెల్లను, మంచినీళ్ళతో సహా నిత్యావసరాలన్నింటినీ
ఉంచుకుని, అక్షరాలా వాటిలోనే కాపురం చేస్తూ సంచార జీవితం గడుపుతూ వచ్చారు. ఆవిధంగా బళ్లే వారికి ఇళ్లయ్యాయి.
ఆ తర్వాత గుర్రం అందుబాటులోకి రావడంతో ఈ సంచార జీవనం మరింత విప్లవాత్మకమైన మలుపు తిరిగింది. ఇక అక్కడినుంచి వారు వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండాపోయింది. కాలినడకన వెళ్ళే కాపరి కన్నా గుర్రం మీద వెళ్ళే కాపరి ఎక్కువ సంఖ్యలో పశువులను మేపే అవకాశం రావడం, దానికి తోడు విశాలమైన ప్రాంతాలకు వెళ్లగలిగిరావడంతో పశువుల మందలు అనూహ్యంగా పెరిగిపోయి ఎక్కువ మందలున్న మనిషికి, అవి లేని మనుషుల మీద ఆధిపత్యం లభించడంతో సామాజికంగా హెచ్చుతగ్గుల వ్యవస్థలు పుట్టుకొచ్చాయి. బండ్లు, గుర్రాలు వాళ్ళ జీవన విధానంలో ఎంత ముఖ్యంగా మారిపోయాయంటేÑ ఒక్కోసారి మృతులను వాళ్ళ తాలూకు గుర్రాలతోనూ, బండ్లతోనూ కూడా పూడ్చి పెట్టడం కనిపిస్తుంది.
ఈ పరివర్తన గురించి డేవిడ్‌ ఆంథోనీ ఇంకా చాలా విస్తారంగా, సాధికారంగా రాస్తాడు. డేవిడ్‌ రైక్‌ కూడా ఆయనను, అలాంటి పురాతత్వ నిపుణుల అధ్యయనాలనే ఉపయోగించుకున్నాడు. యామ్నాయ జనం తెచ్చిన జన్యుసంబంధమైన పరివర్తనను డేవిడ్‌ రైక్‌ ఎలా వివరించాడో ఆ తర్వాత చెప్పుకుందాం.
(‘ఇవీ మన మూలాలు’ నుంచి) (ఉదయిని వెబ్‌ మ్యాగజైన్‌ సౌజన్యంతో…)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.