తెలంగాణలో చేనేతరంగ పరిరక్షణకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు – డా. శ్రీరాములు గోసికొండ

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం కావాలి. ఆ ప్రజల్లో అణగారిన వర్గాలు, కులవృత్తులు చేస్తూ పేదరికంతో పోరాడుతూ, గ్లోబలైజేషన్‌ యుగంలో పోటీని తట్టుకోలేక చావు-బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ, కడు దుర్భర జీవితాన్ని

గడుపుతున్న సమూహాలకు తగిన పని కల్పించి, వారి కాళ్ళపై వారిని నిలబడేలా ప్రభుత్వమే చూడాలి. మనిషి కనీస సౌకర్యాలైన కూడు, గూడు, గుడ్డలను వారే సొంతంగా సంపాదించుకునేలాగా చేయడం ప్రభుత్వాల కనీస బాధ్యత. వీటి కోసం ప్రభుత్వాల వైపు దేహీ అన్నట్టుగా ఎదురుచూడరాదు. సరిగ్గా ఇటువంటి దయనీయ పరిస్థిల్లోనే ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నలు. సిరిసిల్లలో 50 సం.లు పైబడ్డ నేతన్నలకు చేద్దామన్నా పనిలేక, తినడానికి తిండి దొరక్క ఉపవాసాలు ఉంటూ, బక్కచిక్కి చావుకు దగ్గరవుతున్నారు. ఏ మార్గం కనబడక, దిక్కుతోచక, ఈ వయసులో వేరే పని చేయలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
చేనేతకు ఒక రక్షణ కవచం- భౌగోళిక గుర్తింపు (జిఐ): మనదేశంలో చేనేత రంగంపై దాదాపు 30 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలు చేనేత వస్త్రాల ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచాయి. వాటిలో బెనారస్‌, భాగల్పూర్‌, కోట, సంబల్పూర్‌, సోలాపూర్‌, మైసూర్‌, కన్నూర్‌, కాసర్గడ్‌, కాంచీపురం, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, పోచంపల్లి, గద్వాల, వరంగల్‌, సిద్దిపేట మొ. ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో మగ్గంపై నేసే వస్త్రాలను వేరే ప్రాంతాల్లో తయారు చేయకుండా నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం, 65 రకాల చేనేత ఉత్పత్తులను 1999 లో రూపొందించిన భౌగోళిక గుర్తింపు (జిఐ) చట్టం కింద చేర్చింది. దీని ద్వారా నేతన్నల యొక్క ప్రయోజనాలు కాపాడుతూనే వినియోగదారులు మోసపోకుండా వారికి ఏ ప్రాంతం యొక్క చేనేత వస్త్రాలు కావాలో ఆ వస్త్రాలను అదే నాణ్యతా ప్రమాణాలతో అందించవచ్చు. ఇలా జిఐ పొందిన వాటిలో తెలంగాణకు చెందిన పోచంపల్లి ఇక్కత్‌ చీరలు, గద్వాల చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, నారాయణపేట చేనేత చీరలు, వరంగల్‌ జంపఖాన (దర్రీస్‌) లు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60 వేల పైచిలుకు నేతన్నలు చేనేత రంగంపై ఆధారపడ్డారు.
భారతీయ సంస్కృతిలో వస్త్రానిది విశిష్ట స్థానం : మనిషి తల్లి గర్భంలో పడినప్పటి నుండి మళ్లీ భూగర్భంలోకి వెళ్లే వరకు వస్త్రంతో అవినాభావ సంబంధం ఉంటుంది. రకరకాల పండుగలు-పబ్బాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, సన్మానాలు, గృహ ప్రవేశానికి, మానవ జీవితంలోని ముఖ్య ఘట్టాలైన సీమంతం, నూతన ఫల పుష్పాలంకరణ, పట్టు పంచలు, పెళ్లి, చివరకు చనిపోయిన తర్వాత, తదితర సందర్భాల్లో కొత్త బట్టలకు ఎంత స్థానం ఉంటుందో వేరే చెప్పనక్కరలేదు. వస్త్రానికి, సంస్కృతికి మధ్య ఉన్న సంబంధాన్ని వస్త్ర వ్యాపారవేత్తలు ముందుగానే పసిగట్టారు. అందుకే ఒకప్పుడు హైదరాబాద్‌లో మాత్రమే ఉండే పెద్దపెద్ద షాపింగ్‌ మాల్స్‌ అయిన చెన్నై, సౌత్‌ ఇండియా, కల్యాణ లక్ష్మి, మాంగళ్య, సీఎంఆర్‌, ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ వంటి షాపులు ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా పాగా వేస్తున్నాయి. ఈ షాపుల్లో దేశవ్యాప్తంగా జిఐ గుర్తింపు పొంది పేరుగాంచిన ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన చేనేత చీరలకు, ఇతర వస్త్రాలకు ఉండే గిరాకీ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా పెళ్ళిళ్ళ సీజన్లో, తర్వాత శ్రావణం-ఆషాడ మాసాల్లో, వివిధ పండగ సమయాల్లో ఈ షాపులు కిక్కిరిసిపోయి, బిజినెస్‌ కోట్ల రూపాయల్లో జరుగుతుంది. కానీ కష్టపడి మగ్గంపై చీరలు నేసిన నేత కార్మికుడికి మిగిలేది ఏమీ లేదు. చాలా సందర్భాల్లో వారు పస్తులు కూడా ఉంటున్నారు. ఇటువంటి ఈ వ్యవస్థ మారాలి. కావున చేనేత సహకార సంఘాలు, నేతన్నలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను మీ షో, అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌, వంటి ఆన్లైన్‌ షాపింగ్‌ వేదికల ద్వారా నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే విధంగా ప్రభుత్వం నేతన్నలకు శిక్షణ ఇప్పించాలి.
నేతన్నలను గుర్తించడంలో ఒక నూతన శాస్త్రీయ విధానం అవసరం: మన దేశంలో జిఐ గుర్తింపు ఉన్న చేనేత వస్త్రాల్లో తెలంగాణ రాష్ట్రం నుండి అయిదింటికి గుర్తింపు ఉంది. కానీ ఈ జీఐ ఉన్నప్పటికీ చేనేత వస్త్రాలపై జనాలకు అంతగా అవగాహనలేక, కొను
గోళ్లు రోజురోజుకూ తక్కువై, వారికి ఉపాధి కరువై బతకడమే గగనమైపోతున్నది. మరి ఇటువంటి సమయంలో ప్రభుత్వము ఏం చేయాలి? ముందుగా ప్రభుత్వం నేతన్నలను ఐదు రకాలుగా విభజించాలి. ఒకటి చేనేత పై ఆధారపడ్డ వారు, రెండవది పవర్‌ లూమ్స్‌ పై ఆధారపడ్డ వారు, మూడవది టెక్స్టైల్‌ కంపెనీల్లో పనిచేసేవారు, నాలుగవది అంగళ్ళలో, ఊళ్ళల్లోకెళ్ళి బట్టలు అమ్మేవారు, అయిదవది చిన్న చిన్న షాపులు పెట్టుకొని వస్త్రాలు అమ్మేవారు. ఈ రోజుల్లో కేవలం చేనేతపై ఆధారపడ్డ వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. చేనేత రంగంలో ఫాయిదా లేకపోవడం వల్ల నేతన్నల్లోనే చాలామంది బట్టలు అమ్ముతుంటారు. వారిని గుర్తించే బాధ్యతను చేనేత సహకార సంఘాలకు అప్పజెప్పాలి. ఇలా బట్టలు అమ్మే నేతన్నలకు కూడా ప్రభుత్వ పథకాలు అందిస్తే, స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. నేతన్నల్లోని యువతరం సొంతంగా బట్టల షాపులు పెట్టుకొని వారి కాళ్ళపై వారు నిలబడగలుగుతారు.
నేతన్నల ఉపాధి కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తమ ఇష్టానుసారం వాడుతున్న ఫ్లెక్సీలను బ్యాన్‌ చేయాలి. తద్వారా పర్యావరణాన్ని కాపాడుతూ, సిరిసిల్ల పవర్‌లూమ్‌ సంక్షోభాన్ని అధిగమించవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో చేనేత వస్త్రాలను ఖచ్చితంగా వాడే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలి. ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీల విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసే స్కూల్‌ యూనిఫామ్‌లను, అలాగే ప్రభుత్వ హాస్టళ్ళల్లో ఉండే వారికి అందించే తువాళ్ళు, బెడ్‌ షీట్లు ఎంత మొత్తంలో కావాలో ప్రతీ సంవత్సరం లెక్కలు వేసి, చేనేత సహకార సంఘాలకి ఆర్డర్‌ ఇస్తే చేనేత కార్మికుల ఉపాధికి ఢోకా ఉండదు. అలాగే ఈ రోజుల్లో స్నాతకోత్సవం (కాన్వకేషన్‌) అనే విద్యా వేడుకలు కేవలం యూనివర్సిటీల్లో కాకుండా ప్రతి స్కూల్‌లోనూ జరుగుతున్నాయి. ఆ కార్యక్రమానికి వాడే గౌనులను తయారుచేయడానికి చేనేత వస్త్రాలను వాడే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. నూలు రేటు తగ్గించి, నేతకూలీని పెంచాలి. ఈ చర్యల ద్వారా నేత కార్మికులకు పని కల్పించబడి వారిని ఆకలిచావుల నుండి రక్షించవచ్చు. ఇంకా, చేనేత సహకార సంఘాల్లో ఉత్పత్తి అయిన వస్త్రాలను వారికి దగ్గరగా ఉండే అంగళ్ళల్లో, జాతర్లలో ‘మొబైల్‌ ఔట్‌లెట్‌’ పెట్టి అమ్మడానికి వీలుగా, ప్రతీ సంఘానికి ఒక మినీ ట్రక్కును ప్రభుత్వమే అందించాలి. ఆసక్తి కనబరిచే మాస్టర్‌ వీవర్లకు, స్వతంత్ర వీవర్లకు ఈ వాహనాలను యాభై శాతం సబ్సిడీతో ఇవ్వాలి. అలాగే ఊరూరా తిరిగి బట్టలమ్మే నేతన్నలకు కూడా యాభై శాతం సబ్సిడీతో టివిఎస్‌ మోపెడ్లు లేదా స్కూటర్లు లేదా బైకులు (ద్వి చక్ర వాహనాలు) ఇచ్చేలా చొరవ తీసుకోవాలి. ప్రభుత్వం నేతన్నల కోసమే ప్రత్యేకంగా ‘వస్త్ర బంధు’ అనే కొత్త పథకానికి అంకురార్పణ చేయాలి. దీని ద్వారా నేతన్నలు బట్టల షాపు పెట్టుకోవడానికి బ్యాంకు ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు పావలా వడ్డీతో రుణం ఇప్పించాలి. ఇది నేతన్నల్లో స్వయం ఉపాధికి బంగారు బాటలు వేస్తుంది.
రాష్ట్ర చేనేత రంగ పరిరక్షణకు ఒక వరం ఐఐహెచ్‌టి: తెలంగాణ రాష్ట్రంలో పత్తి అధికంగా ఉత్పత్తి అవుతున్నందువల్ల వరంగల్‌లో స్పిన్నింగ్‌ మిల్లులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజి (ఐఐహెచ్‌టి) ని ఇక్కత్‌ చీరలకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లిలో ఏర్పాటు చేయాలి. ఆ సంస్థను తెలంగాణ చేనేత వారసత్వాన్ని కాపాడడానికి, రాష్ట్ర వ్యాప్తంగా మగ్గాలపై పనిచేస్తున్న నేతన్నల్లో వివిధ రకాల నైపుణ్యాలు పెంపొందించే విధంగా తీర్చిదిద్దాలి. చేనేతకు సంబంధించి ప్రాక్టికల్‌ ఓరియెంటెడ్‌ కోర్సులను అందించి, తెలంగాణ యువత చేనేతను తమ వృత్తిగా ఎంచుకొనేలా చేయడం ఐఐహెచ్‌టి లక్ష్యం కావాలి. సాంప్రదాయ చేనేత కళకు ఆధునిక టెక్నాలజిని జోడిరచి, కొత్తగా కొన్ని స్వల్పకాలిక వొకేషనల్‌ కోర్సులు, దీర్ఘకాలిక బి.టెక్‌., మార్కెటింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులు రూపకల్పన చేసి, ఈ కళను విశ్వవ్యాప్తం చేయాలి. అలాగే ఐఐటిహెచ్‌ చేనేత రంగంపై, నేతన్నల స్థితిగతులపై ఎప్పటికప్పుడు పరిశోధన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఐఐహెచ్‌టి అనేది చేనేత రంగానికి విద్యా, పరిశోధన, నైపుణ్యాలను ఒకే చోట అందించే కేంద్ర ప్రభుత్వ శిక్షణా సంస్థగా మారాలన్నమాట. చివరగా, చేనేతపై జిఎస్‌టిని తొలగించే విధంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి. దానికోసం, నిర్ణీత కాలానికి చేనేత చేనేత వస్త్ర అమ్మకాల్లోగానీ, ఉత్పత్తిలోగానీ తగ్గుదల ఉంటే, వాటికి సంబంధించిన సరిjైున గణాంకాలను సమర్పించి, శాస్త్రీయ పద్దతిలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. మనసుంటే మార్గం ఉంటుంది. ప్రభుత్వాలు అనుకుంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. కావల్సిందల్లా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మాత్రమే.
ముగింపు: చంద్రమండలానికి సైతం ఉపగ్రహాలను పంపించే స్థాయికి ఎదిగిన మన ప్రభుత్వాలు, తరతరాలుగా నేతపనినే నమ్ముకున్న కార్మికులకు ఎలా ఉపాధి కల్పించాలో తెలియదంటే ఇచ్ఛంత్రమనే అనుకోవాలి. ప్రభుత్వాలు ప్రతీ పనిని ఓట్ల కోణంలోనే చూస్తాయి. వారికి ఒక వర్గం లేదా కులం వారు ఓట్లు వేస్తారనుకుంటే, వారి కోసం ఎటువంటి పాలసీలైనా, చట్టాలైనా చేయడానికి సిద్ధంగా
ఉంటున్నాయి. ప్రభుత్వాల ఈ విపరీత ధోరణి మారాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వర్గం సుఖసంతోషాలతో ఉండాలని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు భావించాలి. నేతన్నల సంక్షేమాన్ని కాంక్షించి, వారికి దీర్ఘకాలికంగా ఆర్థిక చేయూతనిచ్చే పాలసీలు తీసుకురావాలి. రాజకీయాల వలన కులవృత్తులు చేసుకుంటున్న అణగారిన వర్గాలు, ముఖ్యంగా అత్యంత దీనస్థితిలోనున్న నాగరికత నేర్పిన నేతన్నలకి వెన్నుదన్నుగా నిలబడడమే ప్రభుత్వ లక్ష్యం కావాలి. ఈ చర్య ప్రత్యక్షంగా చేనేత రంగాన్ని పరిరక్షిస్తుంది. కాబట్టి ఏ ప్రభుత్వమైనా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముకగా ఉండే వ్యవసాయం, చేనేత, తదితర రంగాలను ఆదుకుంటేనే దేశమైనా, రాష్ట్రమైనా పురోగమిస్తుంది.
(సామాజిక శాస్త్ర సహాయ ఆచార్యులు, నర్సీ మోంజీ డీమ్డ్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.