ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల ఉద్యమానికి మరో పేరైన బాలగోపాల్ అక్టోబర్ 8 రాత్రి పదిగంటలకు అల్సర్‌తో హఠాత్తుగా మరణించాడు. 57 ఏళ్ళ వయస్సులో జరిగిన ఆయన మరణం మానవ హక్కుల ఉద్యమంతో, ప్రజాతంత్ర ఉద్యమాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం హక్కుల కార్యకర్తలకు ఉద్యమాభిమానులకు సాధ్యం కావడం లేదు.
బాలగోపాల్ కందాళ పార్థనాధశర్మ, నాగమణి దంపతుల 5 వ సంతానం. తండ్రి ఉద్యోగరీత్యా శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ఎన్నో ప్రాంతాలకు బదిలీ కావడంతో ఎన్నో ఊళ్ళలో ఆయన విద్యాభ్యాసం సాగింది. వరంగల్ రీజనల్ ఇంజనీరింగు కాలేజీలో గణిత శాస్త్రంలో ఎమ్మెస్సీ, డాక్టరేట్ పూర్తిచేసి, 1980లో ఢిిల్లీలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధనకై చేరారు. అక్కడి జీవితంతో అసంతృప్తి చెందిన ఆయన, ప్రజా ఉద్యమాలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో వరంగల్ తిరిగి వచ్చి ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘంలో సభ్యులైనారు. 1981లో కాకతీయ విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చాక హక్కుల ఉద్యమంలో మరింత క్రియాశీలకంగా పాల్గొనడం ప్రారంబించారు.
1983లో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘానికి (ఎపిసిఎల్‌సి) ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై, 15 ఏళ్ళు ఆ బాధ్యత నిర్వర్తించారు. నక్సలైటు ఉద్యమంపై నిర్భంధం ప్రారంభమైన రోజులలో సంస్థ నాయకత్వాన్ని చేపట్టారు. 1985లో టాడా చట్టం కింద అరెస్టయి మూడు నెలలు వరంగల్ జైలులో గడిపిన ఆయన ఉద్యమకారులు జైలు నిర్భంధానికి గురి కావడం చాలా సహజమైన, అనివార్యమైన పరిణామంగా భావించారు. తను కిడ్నాప్‌కు గురై విడుదలైన సందర్భంగా తన నిర్భంధం కన్నా, గ్రామీణ ప్రాంతాలలో దాడులకు, ఎన్‌కౌంటర్లకు గురౌతున్న గ్రామీణ ప్రాంత యువకుల హక్కులపై మీడియాలో స్పందించాలని భావించారు.
బాలగోపాల్ నాయకత్వంలో హక్కుల ఉద్యమ ఆచరణ, అవగాహన పరస్పరాధారితాలై బలోపేతమయ్యాయి. ఆచరణ ప్రాతిపదికన అవగాహనను, ఉద్యమ ప్రాధాన్యతలను సవరించుకోడానికి, అవగాహన ప్రాతిపదికగా ఆచరణ మెరుగు పరచుకోడానికి ఆయన ఎన్నడూ వెనకాడలేదు. ఈ క్రమంలోనే హక్కుల లేమికి అన్ని రకాల ఆధిపత్యాలు, వాటి ఆధారిత అణచివేతలు కారణమని గుర్తించారు. అన్ని వ్యవస్థీకృత ఆధిపత్యాలు హక్కుల అనుభవానికి వ్యతిరేకమని, కాబట్టి ఏ ఒక్క అధిపత్యం నుండో పుట్టిన అణచివేతను మాత్రమే హక్కుల రంగం తన ప్రధాన కార్యరంగంగా ఎంచుకోజాలదని సృష్టం చేశారు. వివిధ ఆధిపత్య రూపాలకు వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఉద్యమం నుండి హక్కుల దృక్పధం స్వీకరించాల్సింది ఎంతో ఉందని, ఆయా ఉద్యమాలు వ్యక్తీకరించే ఆకాంక్షలకు డిమాండ్లను హక్కుల పరిభాషలో నిర్వచించి వాటికి సార్వజనీనమైన విలువను కల్పించాల్సిన కర్తవ్యం హక్కుల ఉద్యమం మీద ఉందని భావించారు. ఇప్పటికే ఉన్న హక్కుల వ్యవస్థీకరణకు కృషిి చేయడం, లేని హక్కుల గురించి పోరాడడం, చట్టాలలో, పరిపాలనలో, ఆలోచనా రీతులలో ప్రజాతంత్ర విలువల సంస్కృతికై కృషిి చేయడం హక్కుల ఉద్యమం కర్తవ్యంగా ముందుకు తెచ్చారు. స్వతంత్రమైన, విశాలమైన హక్కుల ఉద్యమం అంతిమంగా ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉండాలని ప్రతిపాదించారు. ఆ క్రమంలో ఏర్పడిన అభిప్రాయ భేధాల కారణంగా ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం నుండి బయటకు వచ్చి 1998లో భావసారూప్యం గల సహచరులతో కలిసి మానవ హక్కుల వేదికను ఏర్పరిచారు. 32 మందితో ప్రారంభమైన సంస్థను పదేళ్ళలో 300 మంది చురుకైన సభ్యులతో కూడిన ప్రభావవంతమైన సంస్థగా మలచడంలో బాలగోపాల్ అలుపెరగని కృషిి ఉంది. హక్కుల సిద్ధాంతాన్ని ఆచరణను సృజనాత్మకంగా అన్వయించడంలో, సామాన్యులలో సామాజిక కర్తవ్యం పట్ల నిబద్ధతను, ప్రజాతంత్ర విలువల పట్ల విశ్వాసాన్ని పెంపొందించడంలో ఆయన దార్శనికత కనిపిస్తాయి.
బాలగోపాల్ మానవ హక్కుల ఉద్యమాలలో ఎంత ఎత్తుకు ఎదిగినా అతి సామాన్యంగా ఉండగలిగిన నిగర్వి. అత్యంత సాధారణ జీవితాన్ని గడిపారు. తాను నమ్మిన విశ్వాసాలను నిత్య జీవితంలో ఆచరించి చూపారు. హక్కుల కార్చాచరణే ఊపిరిగా జీవించారు. ఉద్యమం వెలుపల ఆయనకు మరొక జీవితం లేనే లేదు. ఆయన శక్తినంతటిని 1981 నుండి చివరి శ్వాస వరకు అనుక్షణం పేదలకు న్యాయాన్ని అందించడానికి, వారి హక్కులను కాపాడడానికి ఉపయోగించారు. హక్కుల పరిభాషను గ్రామీణ ప్రజలు ఆయన పేరుతోనే గుర్తించారు. బుద్ధిజీవులు సామాజిక రాజకీయ పరిణామాల ప్రజాస్వామిక స్వభావాన్ని అంచనా వేయడానికి ఒక హక్కుల ప్రమాణాన్ని ప్రతిపాదించిన వ్యక్తిగా అతన్ని భావిస్తారు. విలువలు పతనమౌతున్న న్యాయవాద వృత్తిలో అత్యంత నిబద్ధత కలిగిన న్యాయవాదిగా రాణించారు. ప్రజా జీవితంలో నైతిక వర్తనకు దిక్చూచిగా ఉండడమే కాక ప్రజా ప్రయోజనాలకు రాబోయే ముప్పు గురించి హెచ్చరించే కర్తవ్యాన్ని కూడా సమర్ధవంతంగా నిర్వర్తించారు.
ఈ ఏడాది జూలైలో మరణించిన హక్కుల కార్యకర్త నరేంద్రనాధ్ గురించి ఆయనే చెప్పినట్టు ”ప్రజలకు సమస్యలున్నంతకాలం విశ్రమించకూడదని” నమ్మినవారు బాలగోపాల్.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags