డా|| కొత్తింటి సునంద
సంస్కృతి అంటే ఏమిటి, దాని గుణగణాలేమిటి, దాని పుట్టుపూర్వోత్తరాలేమిటి లాంటి విషయాలు చర్చిస్తారు. మానవపరిణామాన్ని, చరిత్రని శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేసిన వ్యక్తి కొ.కు. రాళ్ళను చెక్కి పరికరాలను చేసుకోడంతో మొదలయిన మానవ సంస్కృతి, పశువుల పెంపకం, వ్యవసాయం, సంచారజీవితం పోయి స్థిర నివాసాలేర్పరుచుకోడం, నగరాలేర్పడడం వంటి అనేక దశల గుండా ప్రయాణిస్తూ నేటి ఈ దశ చేరుకొన్నదంటారు కొ.కు. ఆ ప్రయాణం మానవ మనుగడ ఉన్నంతకాలం కొనసాగుతుంది. మార్పులూ, చేర్పులూ దాని సహజగుణం. మనకు గతంలో మహోత్కృష్టమైన సంస్కృతి వుండేదని దానిని పునరుద్ధరించాలనీ, దానిని విస్మరించడం ద్రోహమని కొందరు చేసే వాదన. అశాస్త్రీయమని ఆయన అభిప్రాయం. 1974లో రాసిన ‘సాంస్కృతిక దృక్పథం’ అనే వ్యాసంలో సంస్కృతి అనేదాన్ని నిర్వచించడం కష్టం. అది చలనాత్మకంగానూ, మిశ్రమంగానూ వుంటుంది. జాతీయ సంస్కృతి అంటాం అలాంటిది విస్పష్టంగా ఏదీ వుండదు అని రాశారు. ”సంస్కృతి అనేది ఒక నది అనుకొంటే, అందులో అనేక ఉపనదులు చేరుతాయి. అది ప్రవహించే పరిసరాలను బట్టి, ఆ నదిలోని నీటి రసాయన స్వభావమూ, వేగమూ కూడా మారుతూంటాయి. ఇంతేకాదు ఈ నదిపాయలు చీలుతుంది. ఈ పాయలు తిరిగి ఏకం కావచ్చు. కాకుండా వేటిదారిన అవి వెళ్ళిపోవచ్చు. ఈ నదిలో అనుక్షణమూ పాత ఒండ్రు దిగుబడి పోతుంది. కొత్తది వచ్చి చేరుతూ వుంటుంది. ఇందులో అసంఖ్యాకమయిన రోగకారక క్రిములు కొట్టుకు వస్తుంటాయి” అంటారు.
1979లో రాసిన ‘సంకర సంస్కృతి’ అనే వ్యాసంలో భాషా సాంకర్యం వల్ల ఇంగ్లీషు ఏ విధంగా అంతర్జాతీయ భాషగా రూపుదిద్దుకొన్నది చెప్తూ సంగీతంలో కూడా సాంకర్యం జరుగుతున్నది, అది ఆహ్వానించతగిన పరిణామమనీ ”కర్ణాటక సంగీతం మడి కట్టుకు కూర్చున్న మేరకు పాచిపట్టిపోక తప్పదు. హిందూస్థానీ అయినా అంతే” అంటారు. సాంకర్యం వలన మేలే కాదు, కీడు గూడా వుంటుంది అంటారు. ఉదాహరణకు ”ఏ ఖండాంతరం నుంచో, లోకాంతరం నుంచో మనుషులు వచ్చి తెలుగు సంస్కృతి గురించి పరిశోధనలు ప్రారంభిస్తే క్షణంలో అయోమయంలో పడిపోతారు.” మన సినిమాలు, కార్టూన్లు, సాహిత్యాలలో తెలుగుతనమే కనపడదు” అంటారు. అది కొ.కు. హాస్యప్రియత్వానికి నిదర్శనం. చెణుకులు విసరడం ఆయన శైలిలో ఒక భాగం.
సంస్కృతీ అనేదొక చైతన్యస్రవంతి. 1979లో రాసిన ‘మన సంస్కృతి’లో ”ఏ మనిషీ ఒకానొక సంస్కృతిలో పుట్టడు. దాన్ని తన చుట్టూ ఉన్న సమాజంనుంచి, తనకు సాధ్యమైన మట్టుకూ, ఇష్టమైన మట్టుకూ అందిపుచ్చుకుంటాడు. సంస్కృతి సామూహికమైనదీ, పరిణామక్రమంలో ఏర్పడినదీ, బాహ్య పరిస్థితులలో మార్పులకు ప్రతిస్పందించేదీ, అందులో జాలి లక్షణాలూ, ప్రాంతీయ లక్షణాలు వుంటాయి.” అంటారు. వ్యక్తులలో భిన్నమైన అభిరుచులు ఆ విధంగా ఏర్పడినవి.
ఇంగ్లీషు భాషలో మ్యాన్ డస్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ అనే సామెత వుంది. మనిషికి తిండి, బట్ట, గూడు కనీసావసరాలు. కాని అవి మాత్రమే వుంటే చాలదు. వేలాది సంవత్సరాలుగా పరిణామం చెందిన మానవుడికింకెన్నో కావాలి. కళలు కావాలి. సాహిత్యం కావాలి. మనిషికి వైజ్ఞానిక దాహం కూడా అనంతర. రకరకాల తృష్ణలు తీర్చుకోడానికి రకరకాల వ్యావృత్తులు చేపట్టడం మనిషికిష్టం. అందుకే కొ.కు. ఇలా అంటారు. సంస్కృతి అనేది మానవుడి ముఖ్యావసరాలలో ఒకటి. జీవిత సమస్యలను ఒక వ్యక్తిగాని, ఒక సమాజం గాని, ఎలా ఎదుర్కొనేది ఎలా పరిష్కరించుకొనేది ఆ జాతి యొక్క లేక వ్యక్తి యొక్క సంస్కారం నిర్ణయిస్తుంది.
”మనుషులను పరిపాలించవలసింది సంస్కారం. ఎందరో ప్రవక్తలూ, ద్రష్టలూ, నీతివేత్తలు, తాత్వికులు, కవులు పుట్టి మన మానవ సంస్కారాన్ని పెంచారు” మానవులను కలిపి వుంచేది సంస్కారం. ”తాత్విక, మత, రాజకీయ, కళాదిక సిద్ధాంతాల సామ్యం వల్ల ప్రజలు ఏకమవుతారు.” సంస్కారం ఒక నది. మానవులను సంస్కారవంతులను చేసే సదుద్దేశంతో చేసిన బోధలు, స్థాపించిన మతాలు సామాజిక పరిణామంలో ఐక్యతను సాధించి సామాజిక అభివృద్ధికి తోడ్పడ్డాయి. ”అయితే ఈ శక్తులతో వుండే చిక్కేమంటే ఇవి ఒక దశలో సామాజికాభివృద్ధికి ఎంతగా తోడ్పడుతాయో మరొకదానిలో అంతగా ప్రతిబంధకాలవుతాయి.” ”సమాజాన్ని కూడగట్టే శక్తుల మధ్య సంఘర్షణలు ఆరంభమైనా, ఆ శక్తులు అభివృద్ధి నిరోధక పాత్ర నిర్వహించటం ఆరంభించినా అశాంతి చెలరేగుతుంది.” ఇది ఆయన ఈ వ్యాసాలలో చేసిన వ్యాఖ్యలు. అవి ఎంత నిజమో మన వర్తమాన చరిత్ర చెబుతుంది.
అభ్యుదయవాది అయిన కొ.కు. జీవితాన్ని ముందుకు నడపడానికి ఉపయోగించే జ్ఞానమే సంస్కృతి అంటారు. 1950లో రాసిన ‘శాస్త్ర దృష్టి – ప్రజాసంస్కృతి’ అనే వ్యాసంలో. అయితే అటువంటి జ్ఞానానికాధారం శాస్త్రదృష్టి. ప్రజలలో శాస్త్రదృష్టి లోపించినప్పుడు, అభివృద్ధి నిరోధక శక్తులు, ప్రజల అజ్ఞానాన్ని ఆధారం చేసుకొని కొందరు వాళ్ళనే విధంగా తైతక్కలాడిస్తారో, తమ స్వార్థ ప్రయోజనాలకు ఏ విధంగా వారిని బలిపశువులను చేస్తారో కొ.కు. చెప్తారు. ఇస్లాం మతంలో విశ్వాసం లేని జిన్నా ముస్లింల మూఢవిశ్వాసాన్నేవిధంగా తన స్వార్థప్రయోజనానికి వాడుకొన్నాడో, మత దురహంకారంతో గాడ్సే గాంధీనెలాగ పొట్టన పెట్టుకొన్నాడో, హిట్లరు జర్మను దేశస్థులనెలాగ పెడదారి పట్టించాడో వివరిస్తారు కొ.కు. బాబ్రీ కూల్చివేత, గోద్రా అల్లర్లు ఆ కోవకు చెందినవే.
‘సంస్కృతి-ప్రభుత్వాలు’ అనే వ్యాసంలో ”ప్రజలను చైతన్యవంతం చేసి వారి మానసిక వికాసానికి అవసరమైన హంగులను సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలది” అంటారు కొ.కు. కాని, ప్రభుత్వాలటువంటి ప్రయత్నాలేవీ చెయ్యడం లేదు. అందుకనే కాబోలు కొ.కు. ”మనదేశంలో మనం ఆటవిక లక్షణాలను సైతం ఆచారాల పేర పట్టుకు వేళ్ళాడుతున్నామంటారు.”
మనలో భౌతికదృష్టి పెరగాల్సిన ఆవశ్యకతను గురించి చెప్తూ కొ.కు. ”సంస్కృతి నాగరికతలు జంటకవుల లాంటివని ఒక దానినింకొకటి పూరిస్తాయి” అనీ తన ఆహారం మీదా, ఉత్పత్తి శక్తి మీదా, మానవుడికి అధికారం పెరిగిన కొద్దీ నాగరికత పెరుగుతుంది అంటారు. మానవుడు తన జీవితాన్ని పూర్తిగా తానే శాసించుకునే రోజు ఏనాటికీ రాకపోవచ్చు – అంటూనే మనవాళ్ళలో దినదినానికి శాస్త్రదృష్టి పెరగకపోగా మూఢనమ్మకాలు పెరుగుతూ వుండడం గురించి విచారం వ్యక్తం చేశారు. తన చిన్నతనంలో ప్రాణాంతకమైన చాలా జబ్బులకు సరైన మందులుండేవి కావని ఈనాడు వైద్యరంగంలో ఎన్నో కొత్త మందులు, చికిత్సా విధానాలొచ్చాయని? ”అయినా ఈనాడు కూడ ఆనాడులాగే అంతకంటే కూడా ఎక్కువగా రోగం రాగానే దేవుడికి మొక్కుకొని ముడుపులు కట్టేవాళ్ళున్నారు” అని వాపోతారు.
ప్రభుత్వాల నిర్వాకం గురించి మాట్లాడుతూ ”స్వాతంత్య్రం పది శాతానికి మాత్రమే చెందింది. తొంభై శాతానికి బహిశ్శత్రువు పోయి అంతశ్శత్రువు వచ్చాడు. ఈ తొంభై శాతానికి హక్కులు లేవు. సాంఘిక హక్కులు లేవు. మనవి అని చెప్పుకునే కళలు లేవు. విద్యాసౌకర్యాలు లేవు. వైద్యసౌకర్యాలు లేవు. ఇల్లు, తిండి, బట్టా లేదు.” అని రాసారు. ఇవి ఆయన పేద ప్రజానీకం గురించి జనరల్‌గా రాసినప్పటికీ నేడు ఆర్థికాభివృద్ధి సాధించే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తున్న సెజ్‌లకు నూటికి నూరుపాళ్ళు వర్తిస్తాయి. పారిశ్రామికాభివృద్ధి సాధించేందుకు వేలాది ఎకరాల వ్యవసాయభూములను విదేశీ, స్వదేశీ వ్యాపారవేత్తలకు వాళ్ళ అవసరాలకు మించిన భూమిని, కొండొకచోట 25000 దాక ధారాదత్తం చేయడం, రైతులనుండి అతిచౌక ధరకో, బలవంతానో లాక్కొని వాళ్ళను నిరాశ్రయులను చేయడం, తగిన పునరావాస కల్పన చేయకపోవడం, ఆ పారిశ్రామికవేత్తలకు నిరంకుశాధికారం కట్టబెట్టడం, ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ప్రాథమిక హక్కులు కూడ లేకుండ బానిసలను చేయడం, బడాబాబులకు పన్ను రాయితీలిచ్చి వాళ్ళ బొక్కసాలు నింపడం ఇదీ స్థూలంగ సెజ్ (ఐజూఎ) ల స్వరూపం. ప్రభుత్వం ”ప్రత్యక్షంగా ధనిక వర్గాలకు, ప్రజలకూ మధ్య జరిగే సంఘర్షణ విషయంలో నిర్మొహమాటంగా ధనికులను బలపరచి ప్రజలను తొక్కి పడుతున్నది” అని అరవై ఏళ్ళక్రితమే నిర్ద్వందంగ చెప్పేశారు కొ.కు. అయినా ”మన నాయకులు ప్రజా ప్రతినిధులుగా ప్రవర్తించక గొర్రెలను తోలేవారల్లే ఎందుకు ప్రవర్తిస్తారు? అరతులం మెదడున్న వారికి కూడా అవమానకరంగా తోచే అబద్ధాలు ఎందుకు చెబుతారు?” అంటారు కొ.కు. భవిష్యద్దర్శనం చేసిన ద్రష్ట, కొకు దూరదృష్టి నభినందిద్దామా, చురకలంటించే ఆయన సున్నిత హాస్యాన్ని ఆనందిద్దామా? ‘ప్రజలు నిజంగా గొర్రెలలాగే వుండటం ఇంకా దారుణం’. ఈ వాక్యం నేడు మన రాష్ట్రంలో జరుగుతూ వున్న రాజకీయ నాటకానికి దర్పణం పడుతున్నట్లనిపిస్తుంది. ‘ఇందిరాయే ఇండియా’, అనే నినాదాన్ని నిరసించిన కొ.కు. మన రాష్ట్ర వర్తమాన రాజకీయాలలో పెరుగుతున్న కుళ్ళుని ప్రజలకే మాత్రమూ సంబంధం లేకుండా, పెరిగిపోతున్న వ్యక్తుల గుత్తాధిపత్యాన్ని, ప్రజల నిస్సహాయత్వాన్ని గురించి ఇంకేమనేవారో.
1971లో రాసిన – ‘మనం ఎవరం’ అనే వ్యాసంలో, మనిషిలో భౌతిక నాగరికత పెరుగుతున్నప్పటికి అంతరంగంలోని ఆటవిక మనస్తత్వం ఇంకా అట్లాగే వుందని మనకనేక సందర్భాలలో బయటపడుతుంటుంది, అనీ, ప్రపంచ యుద్ధాలూ, అపారశక్తి గల మారణాస్త్రాలు మనిషి వేటగాడి మనస్తత్వానికి ప్రత్యక్ష నిదర్శనాలు అనీ, అమెరికను నాగరికత అమెరికను సైనికులలోనూ సైనికాధికారులలోనూ క్రౌర్యాన్ని సంస్కరించలేకపోయింది అనీ రాసారు. ఇది 19-2-1971లో ఆంధ్రజ్యోతిలో వచ్చిన వ్యాసం. ఆయన ఏ యుద్ధం గురించి పై విధంగా స్పందించారో తెలియదు. కాని ఆ మాటలు కూడ అక్షరసత్యాలు. 2004-05లో అబూ గరీబ్ (జులీతి స్త్రనీబిజీబిరిలీ) జైలులో నిర్బంధించి వుంచిన ఖైదీల పట్ల అమెరికను సైనికులు, జైలు అధికారులు ఎంత క్రూరంగ, అమానుషంగ ప్రవర్తించారో తెలిపే వార్తలు, ఫొటోలు ప్రచురితమై ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచాయి.
1971లో రాసిన ‘నాగరికత-కొన్ని సమస్యలు’ అనే వ్యాసంలో ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య వాతావరణ కాలుష్యమంటారు. అప్పటికింకా వాతావరణ కాలుష్యం గురించి ఎవరూ పెద్దగా మాట్లాడినట్లగుపడదు. 1997లో మొదటిసారి ప్రపంచ నాయకులు జపానులో సమావేశమై గ్లోబల్ వార్మింగు తగ్గించేందుకై ‘దక్యోటో ప్రోటోకాల్’ తీర్మానాన్ని చేసారని తెలుస్తోంది. ఆ తరువాత అటువంటి సమావేశాలెన్నో జరిగినాయి. తదుపరి సమావేశం కోపెన్ హాగన్‌లో డిసెంబరు 6-18, 2009లో జరగబోతున్నది. ఆయన దార్శనికతకిదొక ఉదాహరణ.
మొదట్లో మనుషులను కూడగట్టిన వ్యవసాయం క్రమేణ పెనుమార్పులకు లోనయ్యింది. తక్కువ మనుష్యులతో యంత్రాలెక్కువ దిగుబడికి దోహదం చేసాయి. తీరుబడి ఎక్కువైన మనిషి తాత్విక చింతనలో పడి ఏవేవో ఆలోచనలు చేసాడు. ‘సంపద-సంస్కృతి’ అనే వ్యాసంలో – కల్చర్ పెరగటానికి వ్యవసాయం అద్భుతంగా తోడ్పడి, సామాజిక విప్లవం సాధించిన దశలో ఆహారోత్పత్తి శూద్రులకంటగట్టి వాళ్ళననార్యులు అనేశారు అని రాసారు. అన్నదాతను అణగదొక్కడమక్కడ ప్రారంభమై నేడు అన్నదాతల ఆత్మహత్యలదాక సాగింది అనడంలో అతిశయోక్తి లేదేమో. అన్నదాతను అత్యున్నత స్థానంలో వుంచినట్లయితే గొప్ప సామాజిక సంస్కృతి ఏర్పడి వుండేదని ఆయన నమ్మకం.
పారిశ్రామికంగా ఎదిగిన కొద్దీ నాగరికత పెరుగుతోంది. ‘డబ్బు సంస్కృతి పెరుగుతోంది కాని సామాజిక సంస్కృతి పెరగడం లేదని కూడా కొ.కు. రాసారు. డబ్బుతో సినిమా వంటి వ్యాపారకళలు వృద్ధి చెందడం వగైరా మనకు తెలుసు.
ఈ వ్యాసాలలో నేటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న మరెన్నో సాంస్కృతిక సమస్యల గురించి చర్చించి వాటి వల్ల సంస్కృతి ఏ విధంగా పరిణామం చెందుతున్నదీ వివరిస్తారు కొ.కు. ఈ చిన్ని వ్యాసంలో కొ.కు. సంస్కృతి గురించి అందించిన సమగ్ర రూపాన్నందివ్వడమనేది కుదరదు. కొండని అద్దం ముక్కలో చూపించే ప్రయత్నంలాంటిదది. విషయాన్ని లోతుగ, నిశితంగ పరిశీలించడం, కూలంకషగ చర్చించడం సూటిగ, నిర్మొహమాటంగ చెప్పడం, వ్యంగ్యబాణాలు విసరమే కాకుండా సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించడం కొట్టొచ్చినట్లు కనపడతాయి ఆయన రాతలలో. ఈ సమస్యలు మనిషి సృష్టి కనుక పరిష్కారం కూడా మనిషి చేతిలోనే వుందని నమ్మిన ఆశావాది కొ.కు. అభ్యుదయం ఉత్తనే రాదని, ఎన్నో అడ్డంకులను దాటాలని, సమిష్టిగా కృషి చేయాలని ఆయన వాంఛించారు. అందుకే ”మన స్వాతంత్య్రం ప్రజలకి దక్కి జీవితం పెరగాలంటే మన శాస్త్రజ్ఞులూ, న్యాయవేత్తలూ, పండితులూ, కళాకారులూ, సంస్కృతీ సమాజాలుగా ఏర్పడి, జీవితాన్ని సమగ్రంగా ఎప్పటికప్పుడు విమర్శించి ప్రజల్ని జాగృతం చేయాలి” అని కోరుకున్నారు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags