కొ.కు
తాతయ్య అమ్మమ్మని ఇప్పటికి కొడతాడు. నాన్న అమ్మని కొడతాడు. అక్కయ్యని బావ కొడతాడు. మొగవాళ్ళు ఆడాళ్ళని కొడతారు, తిడతారు కూడానూ.
”ఆడబ్రతుకే మధురం” అని రేడియో పాడుతున్నది.
ఎంతో పాపం చేసుకుంటేనేగాని ఆడవాళ్ళయి పుట్టరట. అమ్మమ్మ చెప్పింది. అందుకునే మొగవాళ్ళాడవాళ్ళని కొడతారు, తిడతారు.
మహాపతివ్రతలు కూడా వచ్చే జన్మలో ఆ మొగుడే కావాలని కోరుకుంటారు. ఆడజన్మ వొద్దని ఎందుకు కోరరో? ఈ జన్మలో ఆడవాళ్ళంతా పుణ్యం చేస్తే వచ్చే జన్మని ప్రపంచంలో ఆడవాళ్ళే ఉండరు. అంతా మొగవాళ్ళే ఉంటారు. అప్పుడు మనమంతా కూడా క్రాఫులు పెట్టుకొని, సూట్లేసుకుని, సిగరెట్టు కాలుస్తూ తిరగొచ్చు.
కిందటి జన్మలో చేసుకున్న పాపం విరగడైపోవటానికి ఆడవాళ్ళు మొగవాళ్ళచేత తన్నులూ, తిట్లూ తినాలి. చాకిరి చెయ్యాలి. నాన్న కూడా ఆఫీసుకెళ్ళి చాకిరి చేస్తాడు. అయితే నాన్న కాదివారం శలవు. అదీకాక ఎప్పుడన్నా వొంట్లో బాగుండకపోతే నాన్న ఆఫీసెగ్గొట్టి ఇంట్లో ముసుగుపెట్టుకు పడుకుంటాడు. అమ్మకి ఆదివారాలు లేవు, పని ఎగ్గొట్టటానికి వీల్లేదు. ఎందుకంటే, మరి అమ్మకి జీతం లేదుగా!
కిష్టమూర్తిగారి పెళ్ళాం మంచి ఆడది కాదు. ఆవిణ్ణి మొగుడు కొట్టడు, తిట్టడు. పైగా ముద్దుచేసి పాడుచేస్తున్నాడు. ఆవిడ మొహానికి పౌడరేసుకుంటుంది. మాటిమాటికీ సినిమాలకీ, నాటకాలకీ పోతుంది. మీటింగులకు కూడా పోతుంది. వంట చెయ్యటానికి కట్టెలుపయోగించదు. ఆవిడకి కట్టెలంటే మంట. మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఆవిడకి కిష్టమూర్తిగారే మొగుడవుతాడు గామోలు. అయితే ఆవిడకెప్పుడూ ఆడజన్మే, ఆవిడ ఖర్మం!
ఆడవాళ్ళు చదువుకోరాదు. చదువుకున్నా పెళ్ళయిపోగానే మానాలి. కిష్టమూర్తిగారి పెళ్ళాం పిల్లల తల్లి అయికూడా మొన్న మొన్నటిదాకా చదువుకుంటూనే ఉంది. ఆవిడ ఇప్పుడు బియ్యే పాసయింది. ఆడవాళ్ళంతా చదువు చదువుకుంటే చెడిపోతారు. అయితే కిష్టమూర్తిగారి పెళ్ళాం చెడిపోయినట్లు కనిపించదు. ఎప్పుడూ అందర్నీ నవ్విస్తూ మాట్లాడుతుంది, కాని నిజంగా చెడిపొయ్యే ఉంటుంది. చిన్నపిల్లలకవన్నీ తెలియవు అటువంటి విషయములో (విషయంలో అని కొ.కు రాతిప్రతిలో ఉండవచ్చు) ప్రశ్నలు వెయ్యరాదు.
కొందరాడవాళ్ళు చదువుకోకుండానే చెడిపోతారు. మూల ఇంట్లో హనుమాయమ్మ చెడిపోయిన బాపతేకాని చదువుకోలేదు. చదువుకోకుండా చెడిపోతే అది వాళ్ళ ఖర్మం.
కిష్టమూర్తిగారి పెళ్ళాం పిల్లల్ని కొట్టదు. ”నిన్ను నీ మొగుడు కొడితే ఏం చేస్తావే!” అంటే వాళ్ళ వాణి ”చంపేస్తా!” అంటుంది. వాణి కూడా వాళ్ళమ్మల్లేనే ఎప్పటికీ ఆడదే అవుతుంది. దాన్ని వాళ్లమ్మ పాడుచేస్తున్నది. వాణి అప్పుడే ఇంగ్లీషు చదువుతుంది, సినిమాపాటలు కూడా పాడుతుంది. అయితే ఏం లాభం? పుణ్యమా పురుషార్థమా? పిన్ని కూతురు సుశీల చక్కగా సంస్కృతంలో కుమార సంభవమూ (కాళిదాసు కావ్యం) అవీ చదువుకుంది. పాడు ఇంగిలీషు కాకుండా అది చక్కగా మువ్వగోపాల పదాలు (ప్రఖ్యాత వాగ్గేయకారుడైన క్షేత్రయ పదాలు) కూడా పాడుతుంది. పాడు సినిమా పాటలంటే దానికి అసహ్యం.
”ఆడబ్రతుకే మధురం” అని పాడుతున్నది రేడియో. ఆడవాళ్ళతో అన్నీ చిక్కులే. అమ్మ ఎడంగా ఉన్నప్పుడు నాన్నచేసే అల్లరి అంతా ఇంతా కాదు తెగ గొణుక్కుంటాడు. ఆడవాళ్ళకు అన్నీ బాధలే. పిల్లల్ని కన్నప్పుడు చచ్చినంత పనీ అవుతుంది. బోలెడు డబ్బు ఖర్చు. ఆడవాళ్ళతో అంతా ఖర్చే. ఒక చీర ఖరీదు పెడితే నాలుగు ధోవతులొస్తయ్. పిల్లల్ని కని కొంతమంది ఆడవాళ్ళు చచ్చిపోతారు. ముత్తైదు చావు చావటం ఎంతో పుణ్యం. వాళ్ళు మొగాళ్లై పుడతారేమో. వెంకటసుబ్బమ్మ అవ్వగారు వచ్చే జన్మలో మొగవాడై పుడుతుంది. ఆవిడ కొడుకు స్వాములవారైపోయినాడు. పెద్దన్నయ్య స్వాములవారైపోతే అమ్మకూడా వచ్చే జన్మలో మొగవాడై పుడుతుంది.
ఆడపిల్లలు కూడా ఖర్చే. పెళ్ళిళ్ళు చెయ్యాలంటే బోలెడు కట్నాలు పొయ్యాలి. అందర్ని పిలిచి భోజనాలు పెట్టాలి. అప్పుడు వాళ్ళంతా వచ్చి మర్యాద సరిగా జరగలేదని తిట్టిపోతారు. ఆడపిల్లలకి చిన్నపిల్లలప్పుడు పెళ్ళిచెయ్యటం పుణ్యం. అమ్మకు ఎనిమిదేళ్ళకు పెళ్ళిచేసి తాతయ్య కన్యాదానఫలం పొందాడు. ఇప్పుడంతా పెద్దపిల్లలకు పెళ్ళి చేస్తున్నారు. ఇట్లా చేస్తే పాపం. కలికాలం గనక ఇటువంటివన్నీ వస్తున్నై.
నేను పెద్దదాన్నయితే కొట్టే మొగుణ్ణి మాత్రం చేసుకోను. పుణ్యం లేకపోతే పీడాపాయె. ఎవరు పడుతారమ్మా దెబ్బలూ, తిట్లూనూ? పెద్దదాన్నయితే ఎవరికీ తెలీకుండా కిష్టమూర్తిగార్ని చేసుకుంటాను!…..
”ఆడబ్రతుకే మధురం!” అనే పాట పాడటం మానేసింది రేడియో.
(ప్రచురణ : డిసెంబరు 1947, తల్లిలేని పిల్ల కథల సంపుటి, ప్రజా సాహిత్య పరిషత్తు, తెనాలి.)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags