కేతు విశ్వనాధరెడ్డి
”ఈనాడు పురుష స్వామ్యం అమలులో వున్నది. ఈ సమాజంలో స్త్రీకి పురుషుడితో సమానత్వం అన్నది అసాధ్యం. అది గుర్తించని స్త్రీలు తప్పంతా పురుషుల దృక్పథంలో వున్నదనీ, దాన్ని హితోపదేశాల ద్వారా మార్చితే స్త్రీ జీవితం లోపరహితంగా వుంటుందని భ్రమపడుతున్నారు. వివాహ వ్యవస్థ గొప్ప మార్పులకు గురి అయితేగాని స్త్రీ పురుషుల సమానత్వం సాధ్యంకాదు. ఇప్పుడు వారి మధ్య ఉండే అసమానత కేవలం వ్యక్తిగతమైనది కాదు సామాజికమైనది.”
– కొడవగంటి కుటుంబరావు
‘ఆడజన్మ’లో లక్ష్మికి ముప్పైమూడేళ్ళు దాటకముందే ఆమె జీవితం అయిపోయింది. కూతురు భ్రమ ‘ప్రేమ’ వంచితురాలై గర్భవతి కూడా అయింది. తల్లికున్న రెండెకరాలూ, స్థలమూ రాయించుకున్న ఒక ‘విశాల హృదయుడైన’ క్రూరవాడితో భ్రమర పెళ్ళి అయింది. భ్రమరకు పుట్టేది ఆడపిల్లేనని లక్ష్మి అనుకొంది. మూడు తరాల ఆడవాళ్ళు వీధిలో నిలబడతారని తెలిసిన లక్ష్మి ”భగవంతుడా మాకేది దిక్కు అని ఏడిచింది. భగవంతుడు పలకలేదు.”
ఔట్ కథలో పదమూడేళ్ళ శేషు, పదకొండోఏట బాల్యవితంతు వైంది. ఇంట్లో మళ్ళీ పెళ్ళి ప్రస్తావన వచ్చింది. శేషుకు అసహజమూ, బాధాకరమూ అయిన నవ్వు వచ్చింది. ఏడ్పు వచ్చింది. తుఫానుకు కదిలే రేకుల పాకలాగా చలించిపోయింది-ఆటలో ఔట్!
”నేను పెద్దదాన్నయితే కొట్టే మొగుణ్ణి మాత్రం చేసుకోను. పుణ్యం లేకపోతే పీడా పాయె. ఎవరు పడతారమ్మా దెబ్బలూ, తిట్లూనూ? పెద్దదాన్నయితే ఎవరికీ తెలీకుండా కిష్టమూర్తిగార్ని చేసుకుంటాను” అనుకుంటుంది. ఆడబ్రతుకే మధురం అనే కథలో ఒక చిన్న పిల్ల. ఈ మాట అనుకోవడం పూర్తి అవుతూనే, ఆడబ్రతుకే మధురం అనే పాటను పాడటం మానేసింది రేడియో. అదే రేడియో ఆ పిల్ల ఆడబ్రతుకు దుర్భరత్వాన్ని తలచుకున్నప్పుడు, ఆడబ్రతుకే మధురం అని పాడింది.
ఈ సంపుటిలోని కుటుంబరావు రచనల్లో కన్పించే స్త్రీల సమస్యలు మచ్చుకు ఇవి.
సమాజంలో, కుటుంబంలో, సంసారంలో స్త్రీలకున్న స్థానాన్ని కుటుంబరావు ఈ రచనల్లో విస్తారంగా చిత్రించారు. ఈ రచనలు బాల్య వివాహాలు, బాల్య వైధవ్యాలు, వితంతు పునర్వివాహాలకు సంబంధించినవి. సానిబతుకులు, ద్విభార్యాత్వం, వివాహ వైఫల్యాలు పాతివ్రత్య సమస్యలకు సంబంధించినది. విడాకుల చట్టంలోని తఫిసీల్లకు సంబంధించినవి. అవిభక్త కుటుంబాలలోని భర్తల హద్దులులేని దురహంకారాలకూ, అత్తమామలూ, ఆడబిడ్డలూ ధర్మపత్నికి చేసే అవమానాలకూ, కొవ్వెక్కిన మరుదుల అఘాయిత్యాలకూ సంబంధించినవి. ఆదివారాలు సైతం పని ఎగగొట్టటాలు, జీతబత్యాలు లేని ఆడవాళ్ళ అరవ చాకిరీలకు సంబంధించినవి. ఆస్తి హక్కులేని అభాగ్య పరిస్థితులకూ, వరకట్నాల ఒత్తిడులకూ సంబంధించినవి. స్త్రీల ఉద్యోగ పరిస్థితులకు సంబంధించినవి. అయిదవ సంపుటంలోని ప్రేమకూ, నీతికి, సౌందర్యానికి సంబంధించి రచనలను, ఈ సంపుటంలోని వాటిలో కలుపుకొని చదివితే, దాదాపు అరవై ఏళ్ళ తెలుగువాళ్ళ సామాజిక చరిత్రలోని స్త్రీల జీవితానికి సంబంధించిన భిన్నవార్శ్వాలు మనకు బోధపడతాయి. ఆ భిన్న పార్శ్వాలను చిత్రించడంలో కొ.కు. ప్రదర్శించిన జీవిత అవగాహన, తాత్వికదృష్టి, కళానైపుణ్యమూ మనకు తెలిసివస్తాయి. వాస్తవికతావాద సాహిత్యం అంటే ఏమిటో అర్థమవుతుంది. వాస్తవికవవాద సాహిత్యంలో స్త్రీల సమస్యలకున్న సమకాలిక ప్రాముఖ్యం అవగాహనకు వస్తుంది. దేశ జనాభాలో సగభాగం వున్న స్త్రీల జీవితాలు మొత్తం సమాజ ఆరోగ్యంతో ఏ విధంగా ముడిపడి వున్నాయో వెల్లడవుతుంది.
సాహిత్యంలో వాస్తవికతా వాదం అంటే రచయితకూ, పాఠకుడికీ పరిచితమైన సమకాలిక వస్తువులు రచనకు తీసుకోవడం. మామూలు మనుషులను పాత్రలుగా చిత్రించడం, (విశ్వనాధ సత్యనారాయణ వేయపడగలులోని పసరిక వాస్తవిక పాత్రకాదు. పురాణ వైరి గ్రంథామాల పుస్తకాలలోని చాలా పాత్రలు వాస్తవిక పాత్రలు కావు. ఇటీవలి కొందరు నవలాకారుల్లోని మంత్రతంత్రాలవాళ్ళు కూడా వాస్తవిక పాత్రలు కారు. ఈ కోవకు చెందిన రచనలు మరే ప్రక్రియకు చెందినవన్నా యిబ్బంది లేదుకాని, వాస్తవికతావాద నవలలు మాత్రం కాదు.) పారలౌకిక దృష్టితో కాకుండా కేవలం లౌకిక దృష్టితో మాత్రమే మానవ సంబంధాలనూ, చర్యలనూ వివరించడం వాస్తవికతావాదం. కథనంలో, పాత్రల సంభాషణా రీతుల్లో రోజువారీ భాషను వాడడం, పైకి కనిపించేదిగాకాక, (బిచీచీబిజీలిదీశి), జీవితానికి అద్దంగాగాక (శిజీతిలి శిళి జిరితీలి), చరిత్రగతిలోని కీలకమైన అంశాలలో భాగంగా జీవితం యొక్క సత్యాన్ని (శిజీతిశినీ ళితీ జిరితీలి) తెల్పడం వాస్తవికతావాదం. లౌకిక సంస్కార పురోగతికి సాయపడడం వాస్తవికతావాదం.
స్త్రీల సమస్యలకు సంబంధించిన వాస్తవికతావాద కల్పనా సాహిత్యానికి, తెలుగులో పలువురు బలమైన ప్రతినిధులు కన్పిస్తారు. పంతొమ్మిదో శతాబ్దంలో ందుకూరీ, గురజాడా, ఈ శతాబ్దిలో చలమూ, కుటుంబరావూ, ఈ నలువురి కృషే లేకపోతే ప్రజాతంత్ర భావాల ప్రాచుర్యం జరిగి వుండేదికాదు. ఉన్నవ, శ్రీపాద, బుచ్చిబాబు, గోపీచంద్, చాసో, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, మహీధర వంటి రచయితల కృషి సాధ్యమయ్యేదికాదు. రచయిత్రుల కృషీ, రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి వంటి రచయిత్రుల రచనలూ సాధ్యమయ్యేవి కావు.
ఆధునిక తెలుగు సాహిత్య ఆవిర్భావ వికాసాలు విచిత్రమైనవి. వీరేశలింగం, గురజాడలతో ప్రారంభమైన వాస్తవికతావాదం తదనంతరం కాల్పనికవాదం తలెత్తడం చారిత్రకమైన విడ్డూరం. యూరప్ అంతటా ముందు కాల్పనికవాదం పుట్టింది. ఆ తర్వాత వాస్తవికతావాదం వికసించింది. చారిత్రకగతిలోని వక్రత ఎట్లా వున్నా కందుకూరి, గురజాడ, చలమూ, కుటుంబరావూ తెలుగు కల్పనా సాహిత్యంలో వాస్తవికతావాదానికి బలమైన పునాదులు వేశారు.
ఈ నలుగురి ఉద్యమ స్వభావాల్లో, ఉద్యమ దీక్షల్లో, దృక్పధాల్లో, కళాప్రవృత్తుల్లో రచనా లక్ష్యాలలో, రచనా సంస్కారాలలో తేడాలు వున్నాయి. ఈ తేడాలే వాళ్ళ వాస్తవికతావాద రచనలకు కొన్ని పరిమితులు, పరిధులు విధించాయి.
కుందుకూరి రాసిన సత్యవతీ చరిత్రమూ, ఆడమలయాళము, బ్రాహ్మవివాహము వీటిలో వాస్తవికత స్కంరణకు, ఆదర్శీకరణానికీ పరిమితమైంది. వీరేశలింగం పరిధి సంఘ సంస్కరణ, స్త్రీ విద్య, వితంతు వివాహాలు ప్రధానమైన మహిళోద్యమంతో కూడిన సంఘ సంస్కరణ. కందుకూరి ప్రభావ ఫలితమే 1924లో మొదటి రచయిత్రి పిరాట్టమ్మ రాసిన శోభావతి, 1920 తర్వాత వెలువడిన ఉన్నవ మాలపల్లి.
గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకంలో, మీ పేరేమిటి, సంస్కర్త హృదయం, దిద్దుబాటు కథల్లో సంస్కరణవాద వాస్తవికత ఛాయలు, విమర్శనాత్మక వాస్తవికవాద ఛాయలు కన్పిస్తాయి. మన నైతిక దృష్టికి నచ్చని అంశాలను, అవినీతిని ఆకర్షవంతంగా చేయకుండా గురజాడ చిత్రిస్తారు. వ్యభిచరించే భార్యలూ, స్త్రీలోలురైన భర్తలూ సానిపిల్లకంటే నయంకాదని గురజాడ నిరూపిస్తాడు. వివాహ బంధం అసంఖ్యాకమైన విషాదాలకు కారణమైందని నిరూపిస్తారు. స్త్రీ పురుష సంబంధాలలో పురుషుల ద్వంద్వ ప్రమాణాలను ఎత్తి చూపుతారు. స్త్రీలు ‘బానిసలు’ అన్న ఒక చారిత్రక వాస్తవాన్ని తెలుపుతారు. పెళ్ళి అనేది లౌకికమైన ఒప్పందం కావాలనే ఒక భవిష్యద్దర్శనంతో ‘ఆధునిక మహిళ మానవ చరిత్రను తిరగరాస్తుంది’ అని ప్రకటిస్తారు.
చలం వాస్తవికా వాదంలో కాల్పనికావేశంతో కూడిన సుఖవాద చ్ఛాయలు ప్రధానంగా కన్పిస్తాయి. మైదానం, అరుణ, దైవమిచ్చిన భార్య, హంపీకన్యలు, వివాహం, శశిరేఖ, జీవితాదర్శం, ఆ రాత్రి (కథల సంపుటి), శేషమ్మ వంటి రచనల్లో ఆయన స్త్రీ పురుష ప్రేమను అమలిన శృంగారం నుంచి తప్పించారు. అయితే ఆ ప్రేమ స్త్రీ పురుషుల భావైక్యత సరిహద్దులదాకా రాలేకపోయింది. శారీరక సంపర్కంతోపాటు, అవసరమైన అచ్చమైన అపేక్షలదాకా ఎదగలేకపోయింది. ప్రేమవివాహాలకు సంఘంలో స్త్రీల స్థాయి పెరగవలసిన అవసరం ఉందని చలం గుర్తించలేక పోయాడు. ఆర్థిక స్వాతంత్య్రం, స్త్రీ పురుషుల సంస్కారాల సమానమైన పెరుగుదల ఉన్నత దాంపత్య జీవితానికి పునాదులు వేస్తాయని భావించలేకపోయాడు. అది ఆయన పరిమితి. వివాహబంధంలోని జడత్వ నిర్మూలనం ఆయన పరిధి.
ఈ ముగ్గురూ కుటుంబరావు కంటే ముందు రచనలు చేసినవాళ్ళు. వీళ్ళిచ్చిన ఆయుధాలతోపాటు కుటుంబరావుకు మరో ఆయుధం చేతికంది వచ్చింది. అది మార్క్సిజం. అందువల్ల ఆయన పితృస్వామిక సమాజ పంకిలంలో చిక్కుకున్న అభాగినులను అతి వాస్తవికంగా చిత్రించారు. ఆ పంకిలంలో విచ్చుకుంటున్న పద్మాలలాంటి కొత్తతరం స్త్రీలను చిత్రించారు. ఎలన్ మొయర్స్ (జూజిలిదీ ఖళిలిజీరీ) వంటి స్త్రీ విమోచనోద్యను విమర్శకురాండ్రు నాయికావాదం (నీలిజీళిరిదీరిరీళీ) అనే మాటను కల్పించకముందే, కుటుంబరావు ‘ఆడజన్మ’లో, ‘పంచకళ్యాణి’లో ‘ఆడబ్రతుకే మధురం’, ‘ఔట్’, ‘ఒంటి స్తంభం మేడ’, ‘స్వేచ్ఛ’, ‘రాధమ్మకూతురు’, ‘పరాన్వేషణ’, ‘సజీవప్రేతం’, ‘నిజమైన అపచారం’, ‘తిండిదొంగ’ కథల్లో, ‘సత్యవతి స్వీయకథ’లో స్త్రీలను ప్రధాన పాత్రలుగాచేసి ‘నాయికావాదం’ మరొక రకంగా అమలు జరిపారు. కుటుంబరావు రచనల్లోని స్త్రీలు రాజకీయోద్యమ సాహిత్యంలో మాదిరి, రాజకీయ పోరాటానికి ప్రతినిధులు కాకపోవచ్చు. కానీ సామాజిక చైతన్యానికి నిస్సందేహంగా ప్రతినిధులే.
వీరేశలింగం, చలం దురాచారాలనూ, కుటిలనీతులనూ ఖండించిన సాహిత్యయోధులు. అయితే వీరేశలింగం సంఘ సంస్కరణ కోసం ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్వహించిన ధీరుడు. చలం తానే ఒక ఉద్యమమనుకున్న వ్యక్తివాద రచయిత. గురజాడ ప్రజల సాంఘిక ఉద్యమంలో చాపకింద నీరులాగా పనిచేసిన ఆలోచనాశీలి అయిన కళాకారుడు. వీరేశలింగం సంస్కరణ ప్రియత్వంపట్ల అసంతృప్తికి పారాకాష్ఠ చలం. గురజాడ ఆధునిక భావప్రియత్వం, భావైక్యతలకు శిఖరాగ్రం కుటుంబరావు. అందువల్లనే స్త్రీల సమస్యలకు పరిష్కారాన్ని ఆయన భావిమధుర సంగీతమైన సామ్యవాదంలో దర్శించగలిగారు. అందువల్లనే ‘ఆడజన్మ’లో ”ధనికుల నగ్నసత్యానికి సాక్షులు పీడిత ప్రజలు. మగవాళ్ల నగ్నసత్యానికి సాక్షులు ఆడవాళ్ళు” అని చాటగలిగారు. ధనికుల నగ్నసత్యాలకు బానిసలైన మగవాళ్ళు, నగ్న సత్యానికి బానిసలైన ఆడవాళ్ళు ఆత్మ జ్ఞానం అలవరచుకోకపోతే ముప్పు తప్పదని హెచ్చరించారు. గురజాడలాగా మామూలుగా మాట్లాడే తెలుగులో రచనలు చేశారు. తెలుగు సాహిత్య మాండలికాన్ని గొప్ప నాగరికతా ప్రదాతగా చేయడానికి కృషి చేశారు. వాస్తవికతావాద సాహిత్యానికి ఒక కొత్త అభిముఖ్యాన్ని మార్క్సిస్టు భావాల అభిముఖ్యాన్ని సమకూర్చారు.
కుటుంబరావు తమ రచనల్లో ఆయా స్త్రీల సమస్యలను ఎందుకంత తీవ్రంగా తీసుకున్నారు?
1915-1940 మధ్య జీవితాన్ని చిత్రించిన నవలలు, కథలు చాలా వాటిలో శారదా బిల్లు ప్రస్తావన వస్తుంది. బాల్య వివాహాల రద్దును ఉద్దేశించిన ఈ బిల్లును సంస్కరణవాదుల కృషి మూలంగా బ్రిటిష్ వలన పాలకులు ఒక చట్టంగా 1930లో రూపొందించారు. 1938లో మరొక చట్టం వచ్చింది. అంతదాకా ఫ్రెంచివాళ్ళ ఏలుబడి కింద వున్న ప్రదేశాల్లో, నైజాంలో సనాతన హిందువులు చట్టాలకు తూట్లు పొడిచి బాల్య వివాహాలు చేశారు. బ్రాహ్మణుల్లో సర్వ సాధారణమైన ఈ జాడ్యం బాల్య వైధవ్య సమస్యను తెచ్చి పెట్టింది. 1931 నాటికి 35 కోట్లలోపు జనాభా ఉన్న దేశంలో 8,34,721 మంది బాల వితంతువులున్నారు. ఈ బాల వితంతువుల సమస్య కుటుంబరావును కుట్టి కుదిపింది.
1949లో ద్విభార్యాత్వ నిషేధం జరిగింది. విడాకుల చట్టం (రిఖీ) అమలులోకి వచ్చింది. దేశమంతటికీ వర్తింపచేసే హిందూ వివాహాల చట్టం, ఒఒఙ 1955లో వచ్చింది. సనాతనులు ఈ సంస్కారాన్ని కూడా చట్టరూపంలో ఆమోదించలేదు . భారతదేశంలోని సర్వులకూ అనువర్తించే సివిల్ కోడ్‌ను రూపొందించే ప్రయత్నంలో యిది మొదటి విడత చట్టం అని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పార్లమెంటులో సగర్వంగా ప్రకటించాడు. ఈనాటికీ భారతదేశంలోని అన్ని మతాలకూ అనువర్తించే శాసనం మటుకు రాలేదు. ఈ శాసనాల గొడవ విద్యా గంధంలేని పల్లె ప్రాంతాల వారికి తెలియకపోవడం అటుంచుదాము. డబ్బు, దస్కమూ, చదువూ సంస్కారాలు వున్న సంపన్న కుటుంబాల్లో దాంపత్య జీవితం ఎంత అన్యాయంగా ఉందో అనామిక నవలలో చూడవచ్చు. మగవాడు మరొక స్త్రీని పెళ్ళాడాలనుకొని, ముందు కట్టుకున్న స్త్రీని వదిలించుకోవడానికి ఎంతటి నైచ్యానికి పాలుపడతాడో కుటుంబరావు అనామిక నవలలో చిత్రిస్తారు. సీతా దేవికి విడాకులివ్వాలనుకున్న ఆనందరావు సీతాదేవిని ‘ఆరాధించే’ గోవిందరావు అనే యువకుని కరెస్పాండెంటుగా ఉపయోగించుకోవాలనే క్షుద్రమైన ఆలోచన చేస్తాడు. సైరంధ్రి కథలో కూడా ఈ విడాకుల తతంగాన్ని గమనించండి.
1956 లో హిందూ వారసత్వపు చట్టం వచ్చింది. 1961 లో వరకట్న నిషేధపు చట్టం వచ్చింది. 1976 లో సమాన నష్టపరిహార చట్టం వచ్చింది. మానభంగాలకు కఠిన శిక్షల చట్టం ఈ మధ్యనే వచ్చింది.
ఈ చట్టాలేవీ సమాజంలో నిజమైన సంస్కారాన్ని తీసుకరాలేకపోయాయి. చేసే పనీ, పనిగంటలూ ఒకటే అయినా, మగ కూలీరేట్లు, ఆడ కూలీ రేట్లు వేరువేరుగా ఉండే సమాజ దశ పోనంతవరకూ కేవలం చట్టాలు సంస్కారాన్ని సాధించలేవని కుటుంబరావు అభిప్రాయం. ”సంస్కారం పెరుగుతున్నకొద్దీ చట్టరూపమైన న్యాయమూ, నీతి తరిగిపోవాలి. ఇప్పుడు న్యాయ చట్టం చేసే పని అప్పుడు సంస్కారమే చేస్తుంది. (ఈనాడు మనం ఆడవాళ్లతో సహగమనం చేయించకుండా వుండటానికి ఒక చట్టం అవసరం లేదు)” అని కుటుంబరావు 1937లోనే గుర్తించగలిగారు. కాబట్టి ఆ రకం సంస్కార సాధన కోసం ఆయన తమ రచనలను చేశారు.ఇరవయ్యో శతాబ్ది అరవయ్యో దశకం దాకా పురుషుల జీవితాల్లో వచ్చిన మార్పులనూ, సంస్కారాన్నీ కుటుంబరావు గుర్తించారు. ఈ రచనలన్నీ ఆ మార్పుల గురించే, ఆ సంస్కారాన్ని గురించే, అయితే కొత్తకొత్త రూపాలలో స్త్రీ పీడన పద్ధతులు ఏ విధంగా ఈ సమాజంలో ప్రవేశిస్తున్నాయో కూడా ఆయన ఆవిష్కరించారు. పంచకల్యాణిలోని టార్జాన్ సుధాకరం, భార్యలను సజీవ దహనం చేసే ఈనాటి యువకుల పూర్వీకుడు.
పాతపీడన పద్ధతులు, కొత్తపీడన పద్ధతులూ పురోగమనానికి అడ్డు తగిలేవే. పీడన పద్ధతులను గ్రహించలేక, వాటి మధ్య ఉక్కిరి బిక్కిరి అయ్యేవాళ్ళు, వాటికింద నలిగి నలిగి పోయేవాళ్ళు ”దేవుడా మాకేది దిక్కు” అనక తప్పదు. వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే పసిపిల్లలు సైతం ఆడబ్రతుకును మధురం చేసుకునే ఆలోచనలు చేయక తప్పదు. అందుకోసం పోరాడక తప్పదు.
ఆడబ్రతుకే మధురం కథలోని అమ్మాయిలాంటివాళ్లు ఎదిగినప్పుడు చరిత్రను తప్పకుండా తిరగరాస్తారు. జీవితంనిండా పురోగమనానికి అడ్డు తగిలే శిధిలాలను నిర్మూలించి కొత్త నిర్మాణానికి అవకాశాలు కల్పిస్తారు. భవిష్యత్తుకు అంతరాయంగా వుండే వర్తమాన శక్తులతో పోరాడి ‘ఆధునిక మహిళలు’గా రూపొందుతారు. నిజమైన ఆధునిక మహిళలు ఈ సమాజంలో సంపూర్ణంగా రూపొందలేరు. ఒక్క వర్గరహిత సమాజంలో తప్ప.
కొ.కు. 75వ జయంతి,28.10.84,విజయవాడ.
(విశాలాంధ్ర సౌజన్యంతో)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags