వరవరరావు
కొడవటిగంట కుటుంబరావు గారు పుట్టి నూరేళ్లు గడిచిపోయాయి. మొదటి ప్రపంచ యుద్ధానికి ఆరేళ్ల ముందు కొ.కు. పుట్టారు.
అది కూడా ‘ఆంధ్రాప్యారిస్’ అనిపించుకున్న తెనాలిలో. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి ఆయనకు పదేళ్లు. వలన దేశాల్లో ప్రజాస్వామ్య భావాలు చిగురిస్తున్న కాలం.
పారిశ్రామిక విప్లవం, ఫ్రెంచి విప్లవం, ప్యారిస్ కమ్యూన్‌లు జరిగినా, ఆయన తొమ్మిదవ ఏటనే రష్యాలో బోల్షివిక్ విప్లవం జరిగినా మనను పాలించిన ఇంగ్లీషువాడు మనను యుద్ధంలో దించాడు గనుక, దాని వలన వచ్చిన మంచీ చెడూ పరిణామాలన్నీ మనల్ని తాకినవి. బకింగుహామ్ కాలువను, మద్రాసు – కలకత్తా జి.టి. రైల్వే లైనును తాకినవి.
విశ్వవిద్యాలయాలు రావడంతోనే మొదలైన ‘పాత కొత్తల మేలు కలయిక’ను తెలుగు సామాజిక, భాషా, సాహిత్యరంగాల్లో కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి ప్రవేశపెట్టారు. వీళ్లు ముగ్గురూ ఆ కాలపు పరిమితుల్లో అనుకూలాంశమైన సాంఘిక, సాహిత్య, భాషా సంస్కర్తలు. వీళ్లలో వీరేశలింగం గోదావరి తీరాన రాజమహేంద్రవరాన్ని కేంద్రంగా చేసుకొని తన సంఘ సంస్కరణ ఉద్యమాన్ని నిర్వహించారు. రాజమండ్రిగా ఇంగ్లీషు వాడు పిలుచుకున్న ఈ పట్టణం రైల్వేలైన్ మీద కాకినాడ సముద్రానికి దగ్గర్లోనే ఉన్నది. ఇంగ్లీషువాడు ఆదివాసుల ఆవాసాలయిన అడవిని ఏజెన్సీ అని పిలిచిన ప్రాంతానికి ముఖద్వారంలో ఉన్నది. గురజాడ విజయనగరంలోను, గిడుగు పర్లాకిమిడిలోను పూర్తిగా కళింగాంధ్ర ఏజెన్సీలో ఉన్నారు. మన్నెపోరాటం, కాకినాడ కాంగ్రెస్ ఇక్కడ సమాజ జీవితంపై తమ ప్రభావాన్ని చూపినవి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కూడా రాజమండ్రిలో జాతీయోద్యమ కాలంలో ముందు చూపుతో రచనలు చేసారు.
వీళ్లంతా సనాతన బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టినవాళ్లు. మరి వీళ్లకు ఈ కొత్తచూపు ఎక్కడినుంచి అలవడింది? సాహిత్యంలో, ప్రజా ప్రయోజనాల సాధనగా భాషా సాహిత్యాలను రెండు కళ్లుగా ఉపయోగించుకోవాలని గురజాడ, గిడుగులకు ఎందుకనిపించింది?
గురజాడ అప్పారావుకు ఇంగ్లిషు, సంస్కృత అధ్యయనం వల్ల, ముఖ్యంగా ఫ్రెంచి చరిత్ర అధ్యయన, అధ్యాపనాల వల్ల ప్రజాస్వామిక దృష్టి అలవడింది. గిడుగు రామమూర్తికి సవరల వంటి ఆదివాసుల మధ్యన జీవితం వల్ల ప్రజా వ్యవహార భాషా దృష్టి అలవడింది. ఇద్దరూ విశ్వవిద్యాలయ మాధ్యమ నిర్ణయంలో భాగమయ్యారు. కృష్ణా, గోదావరి నదులపై ఆనకట్టలు, రైల్వేలైను, అవి కారణంగా వ్యవసాయంలో మిగులు దిగుబడి, వ్యాపార మార్కెటు వస్తువును సరుకుగా మార్చిన అమ్మడం కొనడమనే సంస్కృతి ప్రవేశించాయి.
సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాలకు పరిమితమైన ‘కన్యాశుల్కం’ గురజాడ చేతిలో నాటకవస్తువు అయ్యే వరకు వచ్చిన మార్పులు ఇవి.
ఆయన కుమారుడు రోహిణీప్రసాద్ మాటల్లో చెప్పాలంటే – ఇటు తెనాలిలో కొ.కు. కళ్లు తెరిచేనాటికే ‘చిన్నతనంలో ఆయన పుట్టి పెరిగిన వాతావరణం కరడుగట్టిన ఛాందసత్వంతో కూడుకున్నది. అందులో అగ్నిహోత్రావధాన్లూ, రామప్పంతుళ్లూ, లుబ్ధావధాన్లూ లెక్కలేనంత మంది ఉండేవారని ఊహించవచ్చు. అలాంటి పోకడలకు గురి అయిన ఆయనకు సమకాలికులూ, ఆయనకన్నా ఒకటి రెండు తరాలు చిన్నవారూ ఈనాటికీ అవలంబిస్తున్న సనాతన పద్ధతులను చూస్తే ఆయన ఏ రాజరామమోహనరాయ్ లాగానో అనిపిస్తారు. అది పరోక్షంగా వీరేశలింగం గారి ప్రభావమో, బ్రిటిష్ వారి వల్ల సంక్రమించిన అధునికత్వమో తెలియదు గానీ ఇరవయ్యో శతాబ్దపు రెండో దశకంలో తెనాలి ప్రాంతంలో అందుబాటులో ఉన్న ప్రగతిశీల భావాలన్నీ ఆయనకు అంది వచ్చాయనిపిస్తుంది…
‘పశ్చిమదేశాల సంస్కారం మన వాళ్లమీద అప్పుడు ఇప్పుడూ కూడా ఉంటూనే ఉంది. అయితే అప్పట్లో అందులోని ఆరోగ్యకర మైన అంశాలను మా నాన్న వంటివారు ఉపయోగించుకున్నట్టు తోస్తుంది. ముఖ్యంగా విజ్ఞాన విషయాలూ, సాహిత్యం, ప్రగతిని కోరే తత్వధోరణులూ మనవాళ్ల వెనుకబాటుతనాన్ని సవాలు చేసాయి. అవి ఆయనకు మొదటి నుంచీ ప్రీతిపాత్రమయాయి. యువతరానిది ముందు చూపు అన్న భావన’ కొ.కు.కు ముందునుంచీ ఉన్నది.
ఈ ఉండడానికి తెనాలిలో త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రారంభించిన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం మొదలుకొని, మంతెనవారి పాలెంలో జరిగిన కమ్యూనిస్టు రాజకీయ పాఠశాల వరకు అన్నీ దోహదం చేసినవి.
సాహిత్య రంగంలో సన్నిహిత బంధువైన గుడిపాటి వెంకటచలం సృష్టించన తుఫాను నుంచి కొ.కు. ఇష్టపూర్వకంగానే దూరంగా ఉండాలనుకోలేదు.
వాస్తవానికి కొ.కు. సాహిత్య వ్యక్తిత్వం, తాత్విక దృక్పథం రూపొందడంలో ప్రధాన ప్రభావాలు వీరేశలింగం, గురజాడ, చలం, మార్స్కిజం. అదనంగా దోహదం చేసినవి ఆయన విజ్ఞాన శాస్త్ర అధ్యయనం, పెట్టుడిని అర్థం చేసుకోవడానికి తోడ్పడిన సినిమా రంగం.
కొ.కు. తన మొదటి కథ 1927 అంటే 19వ ఏట రాసారట. మనకు 1931 నుంచి రాసిన కథలిక్కడ లభించాయి. 1980 దాకా కూడ కథలు రాసారు అంటే ఏభై ఏళ్ల పాటు వందల కథలు రాసారు. అయితే విరసం ఏర్పడిన తర్వాత, అంటే 1970 తర్వాత వేళ్ల మీద లెక్కపెట్టదగినన్ని కథలే రాసారు. వందల సంఖ్యలో వ్యాసాలు రాసారు.
నాలుగు, ఐదు సంపుటాలుగా వెలువడనున్న ఈ కథల్లో ప్రథమ సంపుటంలోని కథాకాలం 1931-37.
అమెరికాలో ఆర్థికమాంద్యం ప్రారంభమైన కాలంతో మొదలై స్పెయిన్ అంతర్యుద్ధం ముగిసిన కాలంతో ముగిసినవి.
దేశంలో జాతీయోద్యమం కాంగ్రెస్‌లో గాంధీజీని ముందుకు తెచ్చింది. భగత్‌సింగు, ఆయన సహచరులు యువతరానికి ఆదర్శమైన అమరులయ్యారు. శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ కాలం.
తెలుగునేల మీద బ్రాహ్మణ వ్యతిరేక, హేతువాద ఉద్యమాలు, కమ్యూనిస్టు ఉద్యమమూ కొనసాగుతున్నకాలం.
ఈ కాలంలో తాను పుట్టి పెరిగిన బ్రాహ్మణ, మధ్యతరగతి కుటుంబాల్లోని మానవ స్వభావాలను, సంబంధాలను చిత్రించిన కథలు ఇవి. ఇవన్నీ ఆస్తి సంబంధంగా నిర్ణయమయ్యే విలువలుగా చూసిన చూపు నుంచి రాసినవి. స్త్రీ పురుష సంబంధాల్లో స్త్రీ స్వేచ్ఛ, ప్రేమ భావాల విషయంలో చలం ప్రభావంతో పాటు వాటిని నిర్దేశించే ఆర్థిక మూలాలు ఆస్తి సంబంధాల్లో ఉన్నాయని చూపే ‘కన్యాశుల్కం’ నాటక ప్రభావం బలంగా కనిపిస్తుంది.
బాల్యవివాహమైనా, వితంతువుగా కొనసాగడమైనా, పెళ్లి, దాంపత్యం విషయంలోనైనా, అత్తా కోడళ్లు – పెత్తనాల విషయమైనా – స్త్రీని కూడ ఆస్తిగా చూసిన ఒక భావజాలం మధ్యతరగతి మానవ సంబంధాలను నిర్ణయిస్తుందనే నిష్ఠుర దృష్టితో రాసిన కథలు ఇవి.
ఎక్కడో ఒక చోట తప్ప ఆయన తన కథల్లో పాత్రల కులాల ప్రస్తావన తేనప్పటికీ ఎక్కువ కథలు బ్రాహ్మణ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినవే అని ఊహించడం కష్టంకాదు. అందువల్ల అన్నింట్లోనూ, కాపీనం, స్వార్థం, మోసం, ఇవి కప్పిపుచ్చుకునే తెలివితేటలు కనిపిస్తాయి. మానవ ప్రవృత్తి ఎంత చిత్ర విచిత్రంగా వ్యక్తంగా కావచ్చు, ఎన్ని వెర్రితలలు వేయవచ్చు, సరియైన దారిపట్టుకుంటే ఎటువంటి ఉన్నత సంస్కారం వైపు పయనించవచ్చు అనడానికి నిదర్శనంగా ఉన్నాయి ఈ కథలు.
ఈ కథల్లో తన అనుభవంలో ఉన్న వివిధ చిత్తవృత్తుల స్త్రీ పురుషుల సంబంధాలను చిత్రించడమే కొ.కు. ప్రధానంగా సాధించాడు. సంస్కరణ దృష్టితో రాసిన కథలు కూడ తక్కువేమీ లేవు. అట్లే ప్రేమను అన్ని విలువల కన్నా ఉన్నతంగా నిలిపే కథలు కూడ తక్కువేమీలేవు. కానీ మొత్తంగా చూసినప్పుడు ఆయన తన అనుభవ సాధికారత నుంచి మన ముందు ప్రవేశపెట్టిన చిత్ర విచిత్రమైన మానుష పాత్రలు, వాళ్ల జీవితాల్లోనే ప్రధాన ఘట్టాలు, మలుపులు ఈ కథలు.
ఒక స్థితిని, ఒక సంఘటనను, ఒక సంబంధాన్ని చెప్పడం నుంచి ఒక స్వభావాన్ని, ఆ స్వభావానికి జీవితంపై ఉండే ప్రభావాన్ని చెప్పడంగా ఉంటాయి ఈ కథలన్నీ. ఆయా జీవిత ఘట్టాలలోంచి మననవి స్థలకాల దేశాల్లోకి తీసుకుపోతాయి.
‘ఒక మనిషి జీవితం తీసుకున్నామంటే మొదటి నుంచీ చివరిదాకా కథగా చెప్పడానికి వీలుపడదు. జీవితంలో కథలు జరుగుతుంటై. ఆ కథ ప్రారంభమై అంతం కావడానికి ఒకరోజు పట్టవచ్చును. పది సంవత్సరాలు పట్టవచ్చును. ఈ లోపల జరిగిందంతా కథలోకి రావటాతనికి వీలులేదు. అది కనుక్కునే నేర్పు కథకుడిది’ అని గోపాలం అనే కథకునితో చెప్పిస్తాడు ‘నమూనా కథ’లో కొ.కు.
ఈ ఒకరోజయినా, పది సంవత్సరాలయినా, ఆ స్వల్ప, దీర్ఘకాలాల్లోని డ్రామాను పట్టుకోవడంలో కథ ఉంది. అంటే స్వభావ సారాన్ని పట్టుకోవడం కావచ్చు. సంఘటనల వల్ల వచ్చిన మార్పును పట్టుకోవడం కావచ్చు. అది జీవితంలో మలుపుకు కారణమవుతుంది. అందులో జీవితం ఉంటుంది. ఆ జీవితం కల్పన కాగలిగిన సందర్భాన్ని పట్టుకోవడమన్న మాట అది.
ఉదాహరణకు రెండు కథలు తీసుకుందాం.
‘సుస్వాగతం’ కథ ఒక సాయంత్రం మొదలై మర్నాడు ఉదయం ముగుస్తుంది. విద్యార్థి దశలో మిత్రునిగా ఉన్న డాక్టర్ సుబ్రహ్మణ్యం ఇంటికి జోగారావు ముందు ఉత్తరం రాసే వస్తాడు. అయినా సుబ్రహ్మణ్యం మొహం తప్పించే ప్రయత్నం చేస్తాడు. సుబ్రహ్మణ్యం చెల్లెలు జానకి వితంతువు. ఆయన ఆ అమ్మాయి మనోభావాలను కానీ, సుఖ దుఃఖాలను గానీ, చివరకు తిన్నదీ, పన్నదీ కూడ పట్టించుకోని ఇరుకు మనిషి. తల్లితో గొడవపడి ఆ రాత్రి జానకి అన్నం తినలేదు. జోగారావు, సుబ్రహ్మణ్యం, జానకి ఒక వరుసలో పడుకున్నారు. ప్రయాణ అలసటవల్ల జోగారావుకు మంచి నిద్రపట్టింది. ఆ కలలో తాను, జానకి కలిసి చదువుకున్నారు. తనేమో అచ్చంగా జానకి మొగుడల్లే వున్న ఒక పెద్ద మనిషికి రెండో పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తుండగా, తల్లి కాలువకు పోతూ తలుపేసుకొమ్మని కేకపెట్టింది. జోగారావుకు మెలకువ వచ్చింది. సుబ్రహ్మణ్యం, జానకి నిద్రపోతున్నారు. కాని జానకి నిద్ర రాత్రి తిండిలేక శోషవల్ల శాశ్వత నిద్రేమోనని జోగారావుకు అనుమానం వచ్చింది. ఊపిరాడుతుందో లేదో చూడాలని ఎంతో భయపడి, మధనపడి, చెమటలు పోయగా చివరకామె ముక్కు దగ్గర వేలుపెట్టి – అమ్మయ్య ఊపిరాడుతున్నది అని తేల్చుకున్నాడు. కాని అప్పుడే సుబ్రహ్మణ్యానికి మెలుకవచ్చింది.
ఇంక సుబ్రహ్మణ్యం ఏం ఊహించుకుంటాడో మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ జానకి వ్యక్తిత్వాన్ని చిత్రించడంలో, జోగారావులో సంఘర్షణను రగిలించడంలో కథ ఉంది.
‘మీ మాట నేను నమ్మాను. మీరు నాకు చూపించిన దయ, జాలి మరవను. కాని మీకిది ఉండదగిన చోటు కాదు. మా అన్నయ్యకు మీరు రాసిన ఉత్తరం అందింది. అదీ కాక నిన్న మా అన్నయ్య ఊరికి పోవడానికి కూడా కారణం ఏమీలేదు, మీరు వస్తారేమోనన్న భయం తప్పితే. ఆయన అవస్థ చూసి మీరిట్లా ఉంటారని – ఇంకో విధమైన మనిషేమోనని కూడా అనుకున్నాను. వెంటనే వెళ్లిపొండి’ అన్నది జానకి.
తిరుగు ప్రయాణంలో రైల్లో జోగారావు తీవ్ర సంఘర్షణకు గురయి,
”నాకు జానకి కావాలి” అనుకున్నాడు.
కథ పరిష్కారంతో ముగియాలనుకుంటే ఇక్కడితో ఆగిపోవచ్చు. లేదా పాత్ర చేతిలోనే పెడితే కొ.కు. రాసినట్లు,
”తీర్పు మనసు చేతుల్లోనే ఉంది” – అని ముగించవచ్చు. కాని కొ.కు. అంతకన్న కఠోర వాస్తవవాది. ఆయనిట్లా ముగించారు:
‘ఓరి జోగులూ! మెరుపు మెరిసి పోవలసిందే! ఆకాశాన అట్టే ఉండమంటే ఎలా ఉంటుంది?’ అన్నది మనసు నిర్దయగా.
ఇంత కథ మారుమూల కొల్లూరుకు రైలు, ఎద్దుబండి ప్రయాణంతో కలుపుకొని ఒక సాయంత్రం మొదలై మర్నాడు వేకువన ముగిసింది. ఎంత జీవితం ఉంది, ఎంత డ్రామా ఉంది.
మరో కథ పెంకె పిల్ల – రామనాథంగారి అల్లుడు ఈ కథలో కథకుడు. రామనాథం చిన్న కూతురు రుక్మిణి పెంకెపిల్ల. పసిపిల్లగా కథకుని ఒడిలో కూర్చుని ముద్దులు పెట్టిచ్చుకునేది. వయసు వచ్చి పెళ్లయినా ఆ పసితనం పోలేదు. రుక్మిణికి స్వేచ్ఛ వల్ల కలిగిన లాభం ఏమిటంటే చురుకుదనం. ఇది తండ్రికి, ఇంట్లో వాళ్లకు సమస్యలు తెచ్చింది. భర్త అనుమానాలకు, అపార్థాలకు దారి తీసింది.
పనిమీద ఈ కథనాయకుడు రుక్మిణి ఊరికి ఇంటికి వెళ్లినపుడు రుక్మిణి మనిషిగా ‘చచ్చిపోయింద’ని గుర్తించాడు. ఆమె భర్త అనుమానాలు, వేధింపులు అన్నీ చెప్పి ‘నాకు సాక్షాత్తు అట్లాగే ఉంది’ అని, ‘మనం నిజంగా చిన్న పిల్లలం అయితే?’…. ‘ఆదుర్దాగా! నువ్వు నన్ను మళ్లీ వెనుకటి మల్లే ముద్దుపెట్టుకుంటావా, బావా’ అని అడుగుతుంది.
‘ఎట్లా పెట్టగలను రుక్మిణీ’ అంటాడు ఇతడు.
‘నా భర్తనన్ను పాపిష్టి దాన్నయ్యానన్నాడు. పెద్దదాన్నయ్యాను కదూ. పాపిష్టి దాన్నికావడమంటే ఇదేనేమో’ అంటుంది రుక్మిణి.
కనీసం ఒక ఇరవయేళ్లు నిడివిగల కథ. పసితనం కాపాడుకునే ఒక స్వేచ్ఛా జీవి తపన. రవీంద్రుని కథల ఆధారంగా సత్యజిత్ రే తీసిన ‘తీన్ కన్య’లో కూడ రుక్మిణి వంటి పాత్ర ఉంటుంది. ఈ కథపై చలం ప్రభావాన్ని కూడ స్పష్టంగా పోల్చుకోవచ్చు.
విచిత్రంగా ఈ సంపుటిలోని చాల కథల్లో ఒక ముద్దుతో నాటకీయమైన ముగింపు ఉంటుంది. స్వచ్ఛతకు, అప్పటిదాకా పడుతున్న మానసిక ఘర్షణకు, వ్యక్తం చేయలేకపోయిన భావం ప్రేమ అని గుర్తింపుకు ముద్దు – ఒక ముగింపు, ఒక పరిష్కారం. చిన్నతనంలో పెళ్లిళ్లయి, దైవమిచ్చిన భార్యాభర్తలుగా లేదా పెద్దలు చేసిన పెళ్లిగా సుదీర్ఘ కాపురాలు చేసి, పిల్లల్ని కని, పెంచిన ఎందరు ప్రేమ వ్యక్తీకరణ అయన ఈ సున్నితమైన సంకేతాన్ని అంత అపూర్వంగా చూస్తున్నారు? ఎందరు కథకులు వేరు వేరు సందర్భాల్లో ఒక ఉన్నత సంస్కార దశకు చేరిన ముగింపుగా ఈ చర్యను ఉపయోగించుకున్నారు?
కన్యాశుల్కం ప్రభావం వల్లనే కావచ్చు కుటుంబరావు తన కథల్లో దృశ్యమానమైన రచనకు, సంభాషణకు కూడ చాల ప్రాధాన్యమిచ్చాడు. గురజాడ ‘దిద్దుబాటు’, ‘మీ పేరేమిటి?’ కథల్లో కూడ ఇటువంటి ఎఫెక్ట్ చూడవచ్చు. కథలో ఉన్న ఒక సౌలభ్యం పాత్రలను ప్రవేశపెట్టి కథకుడు వాటిని నడపవచ్చు. లేదా అవే ఆయన అదుపు తప్పి నడవవచ్చు. కాని రెండు సందర్భాల్లోను తమను చదువుతున్న వాళ్లేకాదు, చూస్తున్నవాళ్లు, వింటున్న వాళ్లు ఉన్నారనే చైతన్యం ఉంటే అవి హావభావాలతో వ్యవహరిస్తాయి. రక్తమాంసాలతో సంచలిస్తాయి. నాటకీయమైన హృదయం ఆ కథలో ఆవిష్కారమవుతుంది. కనుక కథకు డ్రమటిక్ ముగింపే కాదు, కథలో కూడ నాటకీయత ఉండడం ఈ కథల్లో ఎన్నిటినుంచో ఉదహరించవచ్చు.
ఆయన కథానిర్మాణ శైలిలో ఎన్ని గడుసుతనాలు చూపాడంటే ‘పుంలింగాలు’ అనే కథలో శర్మ అనే పాత్ర ఒక కల్పనా కథ శ్రోతలు చెవులు రిక్కించుకుని వినేలా చెప్తాడు.
ఉత్తమ పురుషలో సాగే ఈ కథ – నిజంగానే కల్పనా కథ అని నేను మీకు వేరే చెప్పనక్కర్లేదు అంటూ ఒక సునిశితమైన వ్యాఖ్య చేస్తాడు.
శర్మ దొంగ కానీ వాడి కథకున్న నీతివాడికుంది.
ఈ కల్పన నుంచి రచయిత మనను ఇంకో కల్పనలోకి తీసుకుపోతాడు.
‘ఒరే శర్మా! ఒకసారి మా శివానందమే ఏం చేసాడనుకున్నావు?’ అని ప్రారంభించాను.
‘చెప్పు చెప్పు’ అన్నారంతా.
….
‘ఏం చేసాడురా మీ శివానందం’ అన్నాడు శర్మ. నాకు నిజంగా ఏమీ తెలియదు.
‘ఏదో చెయ్యకుండా ఉండి ఉంటాడా అని అట్లా అన్నాను’ అని సమాధానం చెప్పాను.
ఏమీ చెప్పడానికి లేకపోవడం నుంచి కూడ కుతూహలాన్ని ఉత్సుకతను రేకెత్తించడమూ ఒక నాటకీయత.
కథలో కూడ చెప్పిన విషయాల నుంచి చెప్పని విషయాలు ఇంకేవో ఇంతకన్న ఆసక్తికరమైనవి ఉండి ఉంటాయనే మానసిక స్థితికి మనను లోనుచేసిన కథ మనను వశం చేసుకున్న కథయే అవుతుంది. కథ ముందు మనను తన ఆవరణలోకి తీసుకోవాలి గదా.
వస్తువుగా చూసినపుడు పెళ్లికూతురు, సుస్వాగతం, సూరి సిద్ధాంతం – 2, మాయదారి కడుపు, మొదటి మేఘం, సనాతనిస్టు విభ్రమం వితంతు వివాహాలను సమర్ధించే కథలు.
టిరనీ, ఎవరి పోలిక, దొడ్లో తాచుపాము, పెంపుడు తల్లి, అరణ్యం – వ్యవస్థ అక్రమ సంబంధాలుగా చూసే స్త్రీ, పురుష వివాహేతర సంబంధాల కథలు.
32 డౌన్ క్రాసింగు, మొదటి మేఘం, ఆడవలసిన అబద్ధం, గాలిపాటు, రాయబారి – పెళ్లిలో గానీ, ఇతరత్రా గానీ స్త్రీ పురుషుల మధ్య వికసించవలసిన ప్రేమను హృద్యంగా ప్రోదిచేసిన కథలు.
సూరి సిద్ధాంతం – 1, సూరి సిద్ధాంతం – 3 – మతం, కులం గురించి, బ్రాహ్మణత్వం గురించి రాసిన కథలు.
రాజకీయాలు- వర్ణ వ్యవస్థ నుంచి తిరుగుబాట్ల వరకు ఫ్యూడల్ వ్యవస్థ – రాజ్యం గురించిన కథ. ఎందుకూ కొరగాడు – మహాత్మాగాంధీకి జై అంటూ సాగే ఊరేగింపును అర్థరహితంగా భావించి అడ్డగించిన ఎందుకూ కొరగాని వాని కథ.
రెండు మూడు సైన్సు, గ్రహాల గురించి కథలున్నాయి అనంతం వంటివి.
ఇంకా మిగతావి స్త్రీ పురుష సంబంధాలవో, స్త్రీల గురించి పురుషులకు అపోహల వల్ల, అనుమానాల వల్లనో, ఆధిపత్య భావజాలం వల్లనో ఏర్పరచుకునే అభిప్రాయాలనో ఆధారం చేసుకొని రాసిన కథలు. స్త్రీ పురుష సంబంధాలకు సంబంధించిన కథలన్నీ ఒక దానికొకటి సంబంధంలేని ఎంతో వైవిధ్యం గల మనస్తత్వ చిత్రణలు. వివాహంలోను, వితంతువులకు మళ్లీ పెళ్లి చేయడంలోను, అక్రమ సంబంధంగా లోకం చూసే వివాహేతర సంబంధాల్లోనూ, వేశ్యలుగా భావించే వారి విషయంలోను, పెంపుడు తల్లో, సవతి తల్లో – సహజమైన స్త్రీ వాంఛలు తీరక, ప్రేమరాహిత్యంలో జీవిస్తున్నపుడు జీవితంలోకి వచ్చిన పురుషునితో ఆ ఆత్మీయతను అనుభవించే విషయంలోను, కుటుంబరావుగారు సమాజ నీతికన్న ప్రేమ వికాసానికి చాల ప్రాధాన్యమిచ్చారు.
పెళ్లి కూతురు అనే కథలో భార్య చనిపోయిన ఏభై ఏళ్ల వెంకటేశ్వర్లుకు ఆయన స్నేహితుడు రాఘవరావు తన పదహారేళ్ల కూతురునివ్వ చూపుతాడు. శారద అప్పటికే వెంకటేశ్వర్లు కొడుకు కాంతంను ప్రేమిస్తున్నది. భార్య పట్ల, కొడుకు పట్ల తన ప్రవర్తన వల్ల పశ్చాత్తాపం చెందిన వెంకటేశ్వర్లు పెళ్లి కూతురు శారదను కాంతంకు చేసుకునే పథకంతోనే వస్తాడు.
పెళ్లికూతురుగా శారదను చూడవచ్చిన వెంకటేశ్వర్లుతో సంభాషణంతా ఇద్దరి వ్యక్తిత్వాలకు, ముఖ్యంగా శారద వ్యక్తిత్వానికి, ధైర్యానికి దాఖలా.
అసామాన్యంగా ప్రవర్తించే సామాన్యుల కథగా ‘ఆడవలసిన అబద్ధం’ క్రమంగా ఎటువంటి వాతావరణంలోకి విచ్చుకుంటుందంటే అతని సహజసిద్ధమైన ప్రవర్తన ఆమెలో ప్రేమ చిగురించడానికి దోహదం చేస్తుంది.
ఎవరో సీతారామమ్మను నీ భార్య అంటూ సుబ్బారావు ఇంట్లో దిగబెట్టి పోయారు ఆమె బంధువులు. ఆమె ఆ క్షణం నుంచి ఆయనను భర్తగా స్వీకరించడం తన ధర్మం అనుకున్నది. కాని ఆయనకు మాత్రం ఈ ఆకస్మిక పరిణామానికి జ్ఞాపకశక్తి కోల్పోయానన్న భయమేసింది. ఆమె పట్ల మనం మామూలుగా అసాధారణంగా భావించే అతి సామాన్య సంస్కారంతో వ్యవహరించాడు. ఆమె తన భార్య కాదని, మళ్లీ ఆ తెచ్చిన వారింట్లో దిగబెట్టి వస్తానని తయారు కమ్మన్నాడు.
ఇంతకాలమూ కలిసి ఉన్నందుకు తమ మధ్య స్త్రీ పురుష సహజమైన ప్రేమ అంకురించాలని ఆయననుకున్నాడు.
‘నేను నా భర్తను ప్రేమించటం మిమ్ములను ప్రేమించటం కాదా’ అని ఆమె అమాయకంగా ప్రశ్నిస్తుంది.
‘నేను నీ భర్తను కాదనుకో!’
…..
‘మనం భార్యా భర్తలం కాము!’
‘నాకు మొగడవసరంలేదు. విడిచిపెట్టి వెళ్ళలేను. పనిమనిషి కిందనయినా నన్నిక్కడ ఉండనివ్వండి’ అంటుంది.
అతను కలలో కూడా ఆశించని మాట సీత నోటి నుంచి వచ్చింది. అతనికింకేం కావాలి?
అతను కూడ ఆమె పక్కన చతికిలపడి ఆమెను తన దగ్గరికి లాక్కుని ఆమె దుఃఖమంతా పొయ్యేట్లు ముద్దుపెట్టుకున్నాడు.
చివరకు ఆమె అతనివైపు మొహం తిప్పినపుడు అతడి మొహం మీద చిరునవ్వు వాన కురిసి వెలిసిన మీదట లేత గుబురు ఆకు మీద పడిన సూర్య ప్రకాశం మాదిరిగా ఉంది.
గాలిపాటు, రాయబారి కూడ ఇటువంటి గొప్ప సంస్కారంగల కథలు.
సూరి సిద్ధాంతం – 1, సూరి సిద్ధాంతం – 3, సనాతనిస్టు విభ్రమం, రాజకీయాలు – మనకు తన వ్యాసాల ద్వారా కూడ తర్వాత కాలంలో సుపరిచితమైన కొ.కు. భావజాలానికి దర్పణాలు.
సామాన్య మానవులందరేమో ఆహారం, నిద్రా, మైధునం దశ దాటలేదు. మతం వాళ్లకా మూడు అందకుండా చేస్తున్నది. మత గురువులు పులి విస్తరాకుల మధ్య కాకులు, ఎముకల దగ్గర కుక్కలు, బహిర్దేశంలో పందులవలె వ్యవహరిస్తున్నారు.
ఆచారం తాత గావంచా వంటిది. ‘మీ తాత గావంచా నువ్వుపయోగిస్తావా?’ ‘నాకెలాపనికొస్తుంది.’
ఆచారం అనేది కేవలం పనిముట్టు. మనిషి ఉపయోగం కోసం ఏర్పడ్డది కాదు.
మాలవాళ్లను వెలివెయ్యడం ఎందుకు? నీ బావిలో వాళ్లు నీళ్లు తోడితే నీ ప్రాణం ఏం పోయింది? వాళ్లు నీ యిళ్ల మధ్య ఎందుకు నడవరాదు?… నీ శరీరంలో యేమాలవాడి నెత్తురూ లేదని యేమిటి నిదర్శనం?
ఇంకా ముందుకు వెళ్లి సూరి సిద్ధాంతం – 3 లో – బ్రాహ్మణులలో జీవశక్తి మందగించి పోయిందంటారు. తనలో జీవశక్తి చచ్చిపోయింది కనుక తన ఆటలు సాగుతున్నాయి కనుక ఇంకా జీవశక్తి చావని ఇతర కులాల వాళ్లను ఏ పని చేయవద్దంటాడు.
ఇంకొక పక్కన రోడ్ల పక్కన కూర్చుని చెప్పులు కుట్టే వానిలో జీవశక్తిని చూస్తే ఎవరికైనా గౌరవం కలుగుతుందంటాడు.
సనాతన మతం అన్న వాడినల్లా జైలులో పారేస్తే ఒక సంవత్సరంలో హరిజనుల (అప్పటి ప్రయోగం) నుంచి సూపర్‌మాన్ వస్తాడని, ఈసారి గాంధీ వాళ్లలో పుడతాడని సూరి చెప్పినవి కొ.కు. భావాలే.
వర్ణాశ్రమ ధర్మం గురించి, రాజ్యం రూపొందే క్రమం గురించి, తిరుగుబాటు గురించి ఇంతే తీవ్రమైన విశ్లేషణతో కథల్లో ఒదిగేలా చెప్తాడు కొ.కు.
అంటే కథలో నాటకీయత ఎంత కలగలిసి పోతుందో, సందేశం, ప్రవచనం, ఉపదేశం, చర్చ, ప్రసంగం కూడ అంతగా కలగలిసి పోతాయి.
రాజకీయాలు కథ – ‘అనగా అనగా ఒక పెద్ద రాజ్యం’ అని మొదలుపెట్టి సామాజిక దశలు వివరించి
‘నాలుగు వందల సంవత్సరాలు గడిచినై. ఒక గొల్లవాడు ఆ ప్రాంతాల్లో ఒక దిబ్బమీద మురళివాయించుకుంటూ కూర్చున్నాడు. చుట్టూ దట్టని అరణ్యం, గోవులు నిశ్చింతగా మేస్తున్నాయి. సూర్యుడు చెట్ల సందునుంచి నవ్వుతున్నాడు’ అని ముగిస్తాడు.
మొత్తంగా ఈ కథలన్నీ మనిషిలోపలి ప్రపంచాలను మళ్లీ మనిషికే చూపే కథలు. ఈ లోపలి ప్రపంచాలు శూన్యంలో వేళ్లాడుతున్నవేమీ కాదు. బయటి ప్రపంచం ప్రతిఫలనాలే.
విశాలాంధ్ర ప్రచురణలు కుటుంబరావు సాహిత్యం మొదటి సంపుటంలోని కథలను సృజనలో సమీక్షిస్తూ 1982లో బాలగోపాల్ ఈ శతాబ్దపు మూడవ, నాల్గవ దశాబ్దపు పట్టణ మధ్యతరగతి జీవితంలోని మార్పును కుటుంబరావు శాశ్వతంగా తన కథల్లో పొందుపరచాడంటాడు. పెట్టుబడిదారీ పారిశ్రామిక విప్లవం పందొమ్మిదవ శతాబ్దపు లండన్ నగరంలో సృష్టించిన అధో ప్రపంచాన్ని, ఆ ప్రపంచపు సంస్క ృతిని చార్లెస్ డికెన్స్ నవలల్లో చరిత్రకారులను ఆశ్రయించవలసిన అవసరం లేకుండానే ఎంతబాగా తెలుసుకోగలమో 1930ల, 40ల కోస్తా ఆంధ్ర గురించి కొ.కు. కథల నుంచి అంత బాగా తెలుసుకోగలమంటాడు.