అందం మూలాగ్రాలు పట్టుకున్న కుటుంబరావు

 వేలూరి రామారావు
ఆడది అనగానే మనకి గుర్తొచ్చేది అందం. అందం వునికి రాజ్యం పుట్టుకలో వెతకాలి. ఆహారసేకరణ దశలోనూ, స్వయం పరిపుష్టి దశలోనూ, వినిమయ దశలోనూ అందం ఒక అంశం కాదు.
భూమిమీద హక్కులూ, స్వాహిత్వమూ వచ్చి రాజ్యం ఏర్పడిన తర్వాత రాజు తయారయ్యేడు. ఎవరో శ్రమచేసి పండించి పోస్తే కూర్చొని తింటున్న రాజుకి తన భద్రత కోసం సైన్యం కావలసి వచ్చింది. ఏ పనీ లేక కూర్చొన్న రాజుకి కాలక్షేపం కోసం వినోదం కావలసి వచ్చింది. లిఖిత సాహిత్యం పుట్టుకతో ”రాతగాళ్లు” తయారయ్యేరు. వీళ్లు రాసింది రాజు కోసమే. రాజు వినోదానికి. రాజు వుల్లాసానికి. రాజు వుత్తేజానికి. అప్పటికి లక్ష్యంగా వున్న పాఠకుడు రాజే. ఖాళీసమయం, నిష్పూచీ, ఐశ్వర్యం తోడై రాజు మితిమీరిన శృంగారం చెయ్యడంలో మళ్లీ మళ్లీ వుద్యుక్తుడు కావడానికి రాజుకి బయటినుంచి ప్రేరణ కావాల్సి వచ్చింది. ఇది గ్రహించిన సాహితీవేత్తలు తమ రచనల్లో శృంగారాన్ని జొప్పించారు. దానికి వాహికగా వుత్ప్రేరకంగా ”అందం” తమ రచనలో జొప్పించారు. అయితే ఈ ”అందం” కేవలం ”సృష్టి” కాదు. చుట్టూ వున్న మనుషుల్లో చేసిన రకరకాల విషయాల్ని గుదిగుచ్చి స్త్రీల అంగాంగ వర్ణనల్ని చేశారు. అలా ”అందం” అనే ఒక విషయం ప్రముఖమయ్యింది. పతివ్రతలూ, దేవతలూ, రాజకన్యలూ ఎవరూ ఈ వర్ణనకి మినహాయింపు కాదు. ఈ వర్ణనలు, రచయితల్ని ఒక రకంగానూ (ఎగ్జిబిషనిజం) శ్రోత అయిన రాజుని మరో రకంగానూ సంతృప్తిపరచేయి. శృంగారానికి భక్తి కలసి అందం ఒక అద్భుతమూ, పవిత్రమూ, వాంఛనీయమూ అయ్యింది.
ఈ నేపథ్యంలో కుటుంబరావు గారు రాసిన కథలు రెండు పరిశీలిద్దాం. ‘ఆకర్షణ లేని అమ్మాయి’, ‘కురూపి భార్య’. ఈ రెండూ ఆయన 1945లోనే రాశారు. అప్పటికి మనదేశంలో మధ్యతరగతి అనేది ఒకటి పెరుగుతోంది. సారంలో ఇది శ్రామికవర్గమే అయినా రూపంలో ఆలోచనల్లో ఇది దోపిడీవర్గానికి దగ్గరగా వుంది. ప్రభువుల సంస్కృతిని తొందరగా ఆమోదించేది మధ్యతరగతి. అందులోనూ కులీన వర్గం. దీని వెనక ఆ తరగతి ప్రయోజనాలున్నాయి (తాత్కాలికంగా). అక్షరాస్యులైన ఈ మధ్యతరగతి పురుషులు ఈ రచనలు, వర్ణనలు చదివి ఆ ప్రభావానికి, వ్యామో హానికీ లోనయ్యేరు. అందం ఒక భావనగా మొదలై అవసరంగా తయారైంది. బానిసలతో సమానమైన హక్కులనుభవిస్తున్న స్త్రీల జీవితాల్ని ఇది ఎంతో నిర్దేశించింది.
కురూపి భార్య కథలో ‘సుందరీ మాణిక్యం – హ్రస్వనామం సుందరి” ఎలా వుంటుంది? ”సన్నగా, పొట్టిగా, నల్లగా వుంటుంది. కాలు పెడగా వేసి నడుస్తుంది. చిన్న కళ్లు”. మామూలుగా ఇవేవీ కూడా స్త్రీపురుషుల సహజ సంబంధాలకి అడ్డురావు. పునరుత్పతికీ అడ్డురావు. కానీ అప్పటి భావజాలం ప్రకారం ఆమె కురూపి. వలస పాలకుల తెల్లతోలు మధ్యతరగతిలో దానిపట్ల ఆకర్షణ పెంచింది. నరాల్లోకి ఇంకిన భావదాస్యం భక్తిని జయించి మెదడు మొద్దుబార్చింది. వేడిదేశాల్లో ప్రజలు నల్లగానే వుంటారు గదా! రాముడూ, కృష్ణుడూ నల్లని వారే కదా! సన్నగా వుండడం ఆరోగ్య, ఆహార సమస్య. పొట్టిగా వుండడం మానవుల్లో వున్న అనేక తెగల్లో ఒక తెగ లక్షణం. కానీ అవి అందానికి కొండగుర్తులుగా మారి ఒక వికృత సంస్కృతిని పుట్టించి ప్రచారం చేశాయి. ఈ సంస్కృతి అనేక సమస్యలకు దారితీసింది. అందంగా వుండడం ఒక అర్హతగానూ, లేకపోవడం ఒక లోపంగానూ మారింది. సుందరిని చేసుకోబోయే వాడి మీద ఎంతో సానుభూతి చూపిస్తారు చుట్టూ వున్నవాళ్లు. ఆ మాటల ప్రభావం వల్ల అప్పటికి ”అందం దేనికి? కూరొండు కుంటామా?” అనుకున్న కథకుడి ”గుండెల్లో డక్కు పుట్టింది”. ఇదీ, సంఘం-స్త్రీలతో సహా చూపించే ప్రభావం. చేసే ప్రచారం. ఈ ప్రచారం మానవసంబంధాల మీద ముఖ్యంగా వివాహ సంబంధాల మీద ఎంతో ప్రభావం చూపుతుంది. అందుకే ”ఆ కురూపి భార్యను ప్రేమించి నేను సంఘానికి చాలా ద్రోహం చేసి వుండాలి” అంటాడు కథకుడు. నిజమే. కథకుడి మీద సానుభూతి చూపించి తన ”ఔదార్యాన్ని” ప్రదర్శించే హక్కునీ, అవకాశాన్నీ పోగొట్టి ద్రోహం చేశాడు. కథకుడు ఆదర్శవాదేమీ కాదు. దుర్మార్గుడూ కాదు. అతనికి ”తప్పనిసరిగా చూడవలసి వచ్చేటప్పటికి అది నా కళ్లకి అట్టే అసహ్యంగా కనిపించలేదు.”
మొదటి రాత్రి సుందరి కళ్లనీళ్ళు పెట్టుకొని చీరచెంగుతో తుడుచుకొంది. చీర నల్లగా అయ్యింది (కాటుక) ”నీ ఒంటిరంగు చూడు తిరిగి ఎట్లా తిరిగి వస్తున్నదో” అంటాడు. ఇది ఏ స్త్రీకయినా, ఏ మనిషికయినా ప్రాణాఘాతమే. ఇది హాస్యం కాదు. వెటకారం కాదు. వెక్కిరింపూ కాదు. క్రౌర్యం. తన జన్మతః వచ్చిన లక్షణం మీద, ఆయువుపట్టు మీద దెబ్బ. మనిషిలో సహజంగానే తన మీద తనకు ప్రేమ వుంటుంది. అభిజాత్యం, స్వాభిమానం లేని మనుషులు జీవించలేరు. కానీ సంఘం వాటిని క్రూరంగా, క్షుద్రంగా నలిపేసింది. అందంలేని మనిషి బతకడం దండగన్న స్థాయికి, వాళ్ళు మనుషుల్లో తక్కువజాతి అన్న దురహంకారానికి దారితీసింది. ఈ ప్రచారం, భావాలు చిన్నప్పటినుంచీ వినీ, వినీ వున్న సుందరిలో ఆత్మన్యూనతా భావం పెరిగిపోయింది. ఆమె తన వ్యక్తిత్వాన్ని తానే చిదిమేసుకొనే స్థాయికి దారితీసింది. ఇది పెద్ద విషాదం. మానవజాతి చరిత్రకే పెద్ద మచ్చ. సుందరి, తన భర్త వ్యాఖ్యకి చాలా తీవ్రంగా స్పందించవలసినది పోయి ”అటువంటిదాన్ని చేసుకున్నారు. ఏరికోరి” అంటుంది. తనకు భర్త దొరకడనీ, దొరికినా ఎక్కువకాలం తనతో వుండడనీ నిర్ణయించు కున్నది. ఈ ఆత్మన్యూనతాభావం ఆమెలో మానసిక వైకల్యాన్ని పెంచింది. అందుకే ”ఇంత కురూపితో ఎన్నాళ్లు కాపురం చేస్తారు, ఎంత నవమన్మథులైతే మాత్రం” అంటుంది. అవకతవకగా కనిపించే వాక్యనిర్మాణం సంఘంలో వున్న అపసవ్య సంస్కృతికి చిహ్నం. భార్య ఎంత తక్కువ అందగత్తె అయితే భర్తకి అంత ఎక్కువ సానుభూతి దొరుకుతుంది. భర్త అందగాడైతే ఇది హెచ్చింపబడుతూ వుంటుంది. ఆ సానుభూతి అతని అహాన్ని తృప్తిపరుస్తుంది. ఆదర్శం చేస్తున్నానన్న గొప్ప తృప్తినిస్తుంది. ఈ అహంతో అతను అతిచరించవచ్చు (శ+అతిచరామి). ఆ తప్పుల్ని సంఘం వుపేక్షిస్తుంది. ”తప్పు పనులు చేసినంత మాత్రాన సంఘం కన్నెర్ర చెయ్యదు. ఆ చేసే తప్పుడు పనులు తప్పుచేసేవాడల్లే చేస్తే”. అలాంటివాళ్లని ”క్షమించి” సంఘం తన అహాన్ని తృప్తిపరచుకొంటుంది. కానీ సుందరిలాంటి వాళ్లు భర్త ప్రవర్తనని ”నేను చక్కనిదాన్నయితే మీరిటువంటి పనులు చేస్తారా?” అని భరించుతూ, సమర్ధించాలి. తన ప్రమేయంలేని కొన్ని భౌతికలక్షణాలు స్త్రీల జీవితంలో నింపిన విషాదాన్ని ఎంతో గొప్పగా, సున్నితంగా విశదం చేసిన కథ ఇది. బానిసత్వాన్ని మించిన విషాదాన్ని హృద్యంగా, సౌందర్యాత్మకంగా చెప్పిన కథ.
అందానికి ప్రధాన లక్ష్యం, లక్షణం ఆకర్షణ. ”ఆకర్షణలేని అమ్మాయి” కథలో దేవకి ”ఏమీ బాగుండేది కాదు. సన్నగా, ఎండిపోయి, కళ్లల్లో ప్రాణాలున్నట్లుండేది.” అయితే ఈ పిల్ల ”యుద్ధం రాగానే షార్టుహేండూ, టైపూ నేర్చుకొని వుద్యోగం సంపాదించింది” ఆర్థిక స్వావలంబన సాధించినా దేవకిలో ఆత్మస్థైర్యం వృద్ధి కాలేదు. అందుకే ధారాళంగా, కలివిడిగా మాట్లాడలేదు. ”ఆమెలో ఆకర్షణ లేకపోవడానికి యిదే పెద్దకారణం”. అందం లేకపోవడంతో పాటు దేవకి అధైర్యానికి కారణం సంఘం విధించిన కట్టుబాట్లు. ‘కరండే’లాటివాడు, దినకర్‌ను ఎరిగి కూడా ఎరగనట్లు ఎందుకు నటిస్తాడు? పలకరిస్తే దేవకిని పరిచయం చెయ్యాలనీ, పరిచయం చేస్తే దేవకి కట్టు తప్పుతుందనీ భయం. తోడుగా సంఘభయం. కరండే సంఘానికి బానిస. దేవకి దానికనుగుణంగానే మసలు కున్నది. ఆంగ్లోఇండియన్‌ పిల్లలు, నీతుల బెడదలేక, ఆత్మవిశ్వాసంతో, చలించి పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో విపరీత ధోరణులకి దిగినా, వాళ్ల సాంగత్యంలో కూడా తన పరిధుల్లో తను నిలబడ్డ పరిణిత దేవకి. అయితే ఆకర్షణకి ప్రధాన కారకం ఆత్మస్థైర్యం. సంఘం ఈ చిన్న విషయాన్ని గుర్తించదు. స్త్రీలో స్థైర్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ చంపేసి విషాదాన్ని నింపుతుంది. దీన్ని ఎదిరించినవాడు దినకర్‌. హృదయ సంస్కారం కలిగినవాడు. దేవకిని తనతో తీసుకెళ్లిన మూడునెలల్లో దేవకి ఎంతో మారింది. ”మొహంలో ఎన్నడూలేని కాంతి వచ్చింది. మనిషి కొద్దిగా ఒళ్లు పెట్టింది. నడకలో వెనక ఎన్నడూలేని చలాకీ కన్పించింది.” ఇలా ఆకర్షణీయంగా తయారౌతుంది. కథలో దినకరూ ఎంతో అందగాడే. ”ఆ క్షణంలో ముద్దుపెట్టు కున్నందుకు పశ్చాత్తాపపడితే యిక నేనేం మనిషిని” అంటాడు. మానవత్వాన్ని మించిన అందం లేదు. అందం వ్యక్తీకరణ కాకూడదు. శక్తీకరణ కావాలి. ఆకర్షణ వెనకవున్న శక్తుల్ని గురించి సున్నితంగా చర్చిస్తూ గొప్ప సంస్కారానికి పునాదులు వేసిన ఈ కథలో దివాకర్‌ పాత్ర చిత్రణే అసామాన్యం. రచయిత ఆలోచించినది పురుషుల గురించి కాదు. స్త్రీల గురించి. కథలో చివరి వాక్యం ”దేవకి సుఖపడు తుందని నాకు తెలుసు” అన్నది రచయిత ప్రాథమ్యాన్ని స్పష్టం చేస్తుంది.
కుటుంబరావు గారు ఈ కథలు రాసేనాటికి మనదేశ జనాభాలో ఎనభై శాతం మంది గ్రామాల్లోనే వున్నారు. గ్రామాల్లో జమీందార్లూ, దేశముఖులూ, రాజులూ వున్నారు. దేశంలో వున్న భూమిలో ఎనభై శాతం మంది కటిక దరిద్రంలో వున్నారు. తిండీ, బట్టా, ఇల్లూ లేని స్థితిలో వున్నవాళ్లకి అందం, ఆకర్షణ లాంటివి అపరిచితాలే. వారి వైవాహిక సంబంధాలు ప్రధానంగా శ్రమ మీద ఆధారపడ్డవే. ”పనీపాటూ తెలిసిన పిల్ల” అయితే చాలు. పరిశ్రమలూ పెద్దగా లేవు. నగరీకరణ తక్కువ. ఆ లెక్కన అందం, ఆకర్షణ అనేవి అల్పసంఖ్యాక ప్రజల సమస్యలే అవుతాయి. మరి కుటుంబరావు గారు అలాంటి సమస్యల మీద రెండు కథలు, ఒక నవల, ఒక గల్పికా ఇంకా ఎన్నో ఎందుకు రాసినట్టు?
సంస్కృతి పైనుంచి కిందికి ప్రవహిస్తుంది. మధ్యతరగతిని ఆవరించిన ఈ భావజాలం క్రమక్రమంగా విస్తరిస్తుంది. వ్యాపారం కోసం, పెట్టుబడి కోసం ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. దానివల్ల అంతరాలు పెరుగుతాయి. ఆశలూ పెరుగుతాయి. రాజ్యం, భూస్వామ్యం పెంచి పోషించిన ఎన్నో అసహజ, వికృత లక్షణాల్లాగే ఈ అందం, ఆకర్షణ అనే వాటిల్లోకి కూడా పెట్టుబడి ప్రవేశిస్తుంది. వ్యాపారం కోసం ప్రచారం చేస్తుంది. ఆ వెల్లువలో, హోరులో మానవీయ విలువలూ, సహజత్వమూ ధ్వంసమౌతాయి. ఇది సిద్ధాంతమే కాదు. వాస్తవం కూడా. ఒక్క ఫ్రాన్సు దేశపు (ల్యాండ్‌ ఆఫ్‌ ఫేషన్స్‌) చరిత్ర మనకి చెప్తుంది.
ఈ విషయం ముందుగానే గ్రహించి మనల్ని హెచ్చరించడానికి పూనుకొన్న దార్శనికులు కొ.కు. కృత్రిమ, అసహజ సంస్కృతికీ, విలువలకీ ప్రత్యామ్నాయంగా సహజత్వం, విలువలూ పెంచవలసిన అవసరాన్ని గుర్తించిన ద్రష్ట. ప్రజారచయిత కుటుంబరావు.
ఇవాళ అందం, ఆకర్షణ అనేవి శ్రామికజనంలో కూడా ప్రవేశించి ఎన్నో వెర్రితలలు వేస్తున్నాయి. కాస్మటిక్సు, బ్యూటీపార్లర్‌లు ఎన్నో వున్నాయి. సినిమాకి ప్రధాన అంశం అందమూ-ఆకర్షణా. ఫలితాల్ని మనం రోజూ రకరకాల విషాద వార్తలుగా చూస్తూనే వున్నాం. ఆ విధంగా ఈనాటికి ఈ కథల ప్రాసంగికత ఎంతో వున్నది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.