సంగీతం, తోటపని మా నాన్నకి చాలా యిష్టం

శాంతసుందరి,ఇంటర్వ్యూ: కొండేపూడి నిర్మల

తెలుగు సాహిత్యరంగంలో కథ అనగానే గుర్తువచ్చే ఒక పదిమందిలో కొడవటిగంటి కుటుంబరావు పేరు తప్పకుండా వుంటుంది. కుటుంబరావు శైలినీ కథాకథన శక్తిని ఎంతో ఇష్టంగా అనుసరిస్తున్నవారూ వున్నారు.

కొడవటిగంటి కుటుంబరావు కథకి మాత్రమే పరిమితం కాలేదు. సైన్సు వ్యాసాలు, రాజకీయ సంపాదకీయాలు, సినిమా విశ్లేషణలు ఇలా ఎన్నో రాశారు. బహుముఖంగా విస్తరించిన ఒక వ్యక్తి మానవసంబంధాలు సమాజంలో, కుటుంబంలో ఎలా వుంటాయి? కొ.కు. కూడా అందరి మగవాళ్ళలా పిల్లల్ని ఎత్తుకుని ముద్దుచేస్తూ, భార్య చేతికి కూరగాయల సంచీ యిస్తారా? ఇంకొకలా వుంటారా? అనే ఆసక్తి సగటు పాఠకులందరికీ, ముఖ్యంగా ఆయనతో వ్యక్తిగత పరిచయం లేనివారందరికీ వుంటుంది. ఒక సామాజిక శక్తితో నాన్ననీ, కొడుకునీ, తమ్ముడ్నీ, భర్తనీ చూసుకునే ఆ కుటుంబసభ్యుల అనుభూతులు, అభిప్రాయాలు ఎలా వుంటాయో, వారి మీద ఆయన వేసిన ముద్ర ఎంత బలమైనదో తెలుసుకోవడం ఒక చారిత్రక అవసరం. కొ.కు. పేరుకి తగినట్టు కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే వ్యక్తి. అతని కథలు చదువుతుంటే అందులో వున్న పాత్రల్లో చాలావరకూ మన పక్కింటివాళ్ళో, ఎదురింటివాళ్ళో కనిపిస్తారు. ఆ రకంగా వేర్వేరు వ్యక్తుల్లో వున్న ఒక మూస బలహీనతలు, బలాలు బంధాలు గాఢంగా కనిపిస్తాయి. కొ.కు. గారమ్మాయి శాంతసుందరి వాళ్ళ నాన్న గురించి, నాన్నతో పెనవేసుకున్న బాల్యం, ఎదుగుదల, సాహిత్య సాన్నిహిత్యం గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం.
బాల్యం :
1. పుట్టి పెరిగింది మద్రాసులో. రెండో క్లాసు వరకూ కాన్వెంటులో చదువుకుని, ఆ తరవాత అడయార్‌ థియొసాఫికల్‌ సొసైటీ వారు నడిపే ‘బాల భారతి’ అనే స్కూల్లో 4వ ఫారం (ఎనిమిదో క్లాసు) దాకా చదువు. ఆసరికి ఆ స్కూలుకి గవర్నమెంటు నిధులు అందక దాన్ని మూసేశారు. మతం ప్రసక్తి లేకుండా ఒక కుటుంబంలా ఉండే ఆ స్కూల్లో వేసి మా అమ్మా నాన్నా మాకు చాలా పెద్ద ఉపకారం చేశారని అనాలి. మా వ్యక్తిత్వం రూపొందటంలో ఇంటి వాతావరణంతో పాటు ఆ స్కూలు కూడా చాలా దోహదం చేసింది. ఆ తరవాత రామకృష్ణామఠం వారి బాలికా పాఠశాల, శారదా విద్యాలయాలో నేను ఎస్‌.ఎస్‌.ఎల్‌సీ. పూర్తి చేశాను. అంతవరకూ నా చదువంతా తెలుగు మాధ్యమంలోనే సాగింది.
2. కథా రచయిత్రిగా ఎదగడానికి ప్రేరణ కలిగించే అంశం.
 నాన్న ఎక్కువ మాట్లాడేవారు కారు. కానీ మాతో గడిపే ఆ కొద్ది సమయంలో మా మనసుల్లో రకరకాల విషయాల పట్ల జిజ్ఞాసని కలిగించేవారు. తోటలో పెరిగే కూరలు, పళ్లు నించి అంతరిక్షంలో ఉండే గ్రహ నక్షత్రాల వరకూ, సంగీతం గురించీ, మంచి పుస్తకాల గురించీ, విదేశీ సాహిత్యం గురించీ, ఇతర భారతీయ భాషల పట్ల ఆసక్తి, గౌరవం కలిగి ఉండటం గురించీ, ఆయన మాకు ప్రత్యక్షంగా లెక్చర్లివ్వకపోయినప్పటికీ, వాటి పట్ల ఆసక్తిని మాత్రం రేకెత్తించగలిగారు. సాహిత్యంలో ఎం.ఏ. చదువుకున్న నాకు అందుకే ఇప్పటికీ రకరకాల విషయాలకి సంబంధించిన పుస్తకాలు చదివి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. అలా నేర్చుకునేందుకు ఒక జీవితకాలం సరిపోదే, అనే దిగులూ ఉంది.
 అదే విధంగా డబ్బు, పేరు సంపాదించాలనే ఆసక్తి లేకపోవటం, తను నమ్మిన సిద్ధాంతాలని జీవితంలో పాటించటం నాన్నలో చూశాను. ఆయనని అనుసరించాలనీ, అనుకరించాలనీ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాను. పూజలూ, భక్తీ కన్నా అవతలి మనిషికి సహాయం చెయ్యటం, ఇంకొకరికి హాని చెయ్యకుండా ఉండటం ముఖ్యమని నేర్చుకున్నదీ నాన్న దగ్గరే. కానీ తమాషా ఏమిటంటే ఏదీ కూడా ఆయన మమ్మల్ని కూర్చోపెట్టి వివరించలేదు, తొంభై శాతం చూసీ, వినీ నేర్చుకున్నదే.
3. నాన్నగారి ప్రభావం మీమీద ఎలా వుంది?
 నాన్న పేరుకి తగ్గ వ్యక్తి. ఆఫీసూ, ఇల్లూ తప్ప మరో గొడవ లేదు. ఎక్కడికెళ్లినా అందరం కలిసే వెళ్లేవాళ్లం. వేరే వ్యాపకాలు పెట్టుకోటానికి ఆయనకి టైముండేది కాదు. అందుకే అన్ని వేల పేజీలు రాయగలిగారేమో. ఆయన రాసుకోనప్పుడు హార్మోనియం వాయిస్తూ పాడుకునేవారు, రోజూ తోటపని చేసేవారు. మాది చిన్న ఇల్లూ, చుట్టూ తోటా, దొడ్డీ పెద్దదిగా ఉండేది. పూలమొక్కలూ, పళ్లచెట్లే కాక, కూరగాయలు కూడా పండించటానికి కొన్నాళ్లు ఆయన ప్రయత్నం చేశారు.
5. నాన్నగారిలో మీకు బాగా నచ్చిన అంశాలు :
 నచ్చిన అంశాలు ముందే చెప్పాను. నచ్చని అంశం, ఎన్నో పుస్తకాల గురించి ఎప్పుడూ చెప్పే నాన్న తన రచనలు చదవమని నాకెన్నడూ చెప్పకపోవటం! పెళ్లయాక గణేశ్వర్రావుగారు, ‘అదేమిటి? మీ నాన్న పుస్తకాలు చదవలేదా?’ అంటూ తన దగ్గరున్నవి చదివించారు. నాన్న రచనలంటే మా దృష్టిలో చిన్నప్పుడు ‘చందమామ’ కథలే! ఆయన రచనలు ముందే చదివి ఉంటే ఎంత బావుండేది, అని అనుకుంటూ ఉంటాను! అయినా 19 ఏళ్లకి పెళ్లయి, ఇరవైయో యేట ఢిల్లీ వచ్చేసిన నేను, చదువుతోనూ, సంగీతం ప్రాక్టీసుతోనూ ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా ఉండేదాన్ని.
6. నాన్నగారి దగ్గర మీకు ఎంత స్వేచ్ఛ వుండేది?
 నాన్న దగ్గర పూర్తి స్వేచ్ఛ ఉండేది, కానీ ఆయనంటే మరీ చిన్నప్పుడు భయం ఉండేది. ఆయనకి ప్రథమ కోపం ఎక్కువ, అది ఎలా వచ్చేదో అంత త్వరగానూ పోయేది. కానీ చిన్నతనంలో దాన్ని అర్థం చేసుకోలేకపోయేదాన్ని – అందుకే భయం! కొంచెం పెద్దయాక, ఆయన ఏమీ అనకపోయినా, నా అజ్ఞానం ఆయన దగ్గర బైటపడకుండా ఉంచుకోటానికి, సందేహాలున్నా అడిగేదాన్ని కాను. అది నా తప్పేగాని, ఆయనది కాదు.
 నన్నాయన ఒక్కసారి కూడా గట్టిగా కోప్పడ్డట్టు గాని, నా ఒంటి మీద చెయ్యి వేసినట్టు గాని గుర్తులేదు. మా అల్లరంతా అమ్మ దగ్గరే చేసేవాళ్లం. ఆవిడ దగ్గరే చనువెక్కువ.
7. కొ.కు. కథాకథన శక్తిని ఎలా నిర్వచిస్తారు?
 కొ.కు. కథాకథన శక్తిని విశ్లేషించేంతటి దాన్ని కాను, కానీ ఆయన కథలనీ, నవలల్నీ చదివేప్పుడు ఇలా ఎలా రాయగలిగారు? ఇన్ని ‘పొరల్లో’ ఎలా ఆలోచించగలిగారు, అని ఇప్పటికీ ఆశ్చర్యపోతూ ఉంటాను. అలా ఆలోచించటం, అంత స్పష్టంగా దానిని కథగా మలచటం, ఎంతో ప్రతిభ ఉంటేకాని సాధ్యం కాదని అనిపిస్తుంది. దాన్ని అనుకరించటం కూడా అసాధ్యం అనిపిస్తుంది. జీవితాన్ని ఎంతో లోతుగా పరిశీలించి, అర్థం చేసుకున్నవాళ్లే అలా రాయగలరేమో!
8. మీ కథల మీద నాన్నగారి అభిప్రాయం…?
 దురదృష్టవశాత్తూ నా అనువాదాలని నాన్న ఎక్కువగా చూడనేలేదు. హిందీనించి తెలుగు అనువాదం (నా మొదటి పుస్తకం), ‘హిందీ ఏకాంకికలు’ 1980లో అచ్చయింది. ఆయన కథ ‘ఉభయభ్రష్టుడు’ హిందీలో 74లో వచ్చింది. అది మాత్రం ఆయన చూశారు. కానీ హిందీకి సంబంధించినంత వరకూ, తనకి హిందీ బాగా వచ్చినా కూడా, నాకే పెద్దపీట వేసేవారు. తనకి తెలియని విషయాన్ని, తనకన్నా ఎక్కువ తెలిసినవాళ్ల దగ్గర, వాళ్లు తన పిల్లలైనా సరే, నేర్చుకోవటానికి ఆయన ఎప్పుడూ సంకోచించలేదు.
9. నాన్నగారికి వారసురాలిగా వారి సాహిత్యం విస్తృతం చెయ్యడానికి మీరు ఎంచుకున్న ప్రణాళిక ఏమిటి?
 నాన్న సాహిత్యాన్ని చాలా తక్కువగానే హిందీలోకి తీసుకెళ్లాను. 4 కథలు, 4-5 గల్పికలూ, ఒక నవల. ప్రస్తుతం నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ వాళ్లు ఒక ప్రాజెక్టుని చేపట్టారు. నాన్న కథలు కొన్నింటిని కాత్యాయని విద్మహే ఒక పుస్తకంగా కూరుస్తున్నారు. వాటిని హిందీలోకి నాచేత అనువదింపజెయ్యాలని వాళ్ల ఆలోచన. ఎందుకోగాని నా దృష్టి వర్తమాన రచయితల రచనలవైపే ఉండిపోయింది. పాతతరం వారి కథలని నేను ఎక్కువగా తర్జుమా చెయ్యలేదు. నేనింకా చిన్నదాన్నిగా ఉండగా దయావంతి అనే ఒక అనువాదకురాలు నాన్న కథలని (20-25) హిందీలోకి చాలా చక్కగా అనువదించారు. వాటిని పుస్తకంగా తీసుకొచ్చే ఆలోచనైతే నాకుంది.
10. నాన్నగారితో మీకున్న అనుబంధం, మరచిపోలేని జ్ఞాపకాలు…
 నాన్నతో మరిచిపోలేని జ్ఞాపకాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. ఆయన ఎప్పుడూ మాతోనే ఉండేవారు. ఒక జ్ఞాపకం మట్టుకు నాకు ఇప్పటికీ తల్చుకుంటే నవ్వు వస్తుంది.
 1952లో నాగిరెడ్డి గారు ఒక సినీ కార్నివాల్‌ ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన సినీతారలూ, స్టాఫ్‌ మెంబర్లూ అందరూ ఫ్యాన్సీ డ్రస్సులు వేసుకున్నారు. మా నాన్న పోలీసు వేషం వేసుకునేసరికి, నేనాయన్ని గుర్తుపట్టక గోలగోలగా ఏడ్చాను – నాకప్పుడు 5 ఏళ్లు. చిన్నప్పుడు నాకు కొత్తవాళ్లని చూస్తే విపరీతమైన భయం ఉండేది (ఆ బెరుకు ఇప్పటికీ ఉంది!) నాన్నని చూసి ఎవరో కొత్తమనిషి అనుకున్నాను.
 తోటపని నాకూ నాన్నకీ మాత్రమే సంబంధించినది. బావిలోంచి నేను నీళ్లు తోడిపోస్తే ఆయన మొక్కలకి పోసేవారు. వేసవిలో చెట్టునున్న మామిడికాయలు కొయ్యటం కూడా మేమిద్దరమే చేసేవాళ్లం. ఆవకాయ, మాగాయ పెట్టటం, వాటిని పండించేందుకు గడ్డిలో పెట్టడం, అవన్నీ అమ్మ చేసేది.
 మొదటి పది సంవత్సరాలూ నేను అమ్మకే ఎక్కువ దగ్గరగా ఉండేదాన్ని. 14-15 సంవత్సరాలు నిండాక నాన్నని గమనించటం, ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తించటం మొదలుపెట్టాను. ఆ తరవాత ఐదేళ్లకి ఢిల్లీకి వెళ్లిపోయాను! అందుకే ప్రత్యక్షంగా నేర్చుకున్నదానికన్నా పరోక్షంగా నేర్చుకున్నదీ, కొంత వంశపారంపర్యంగా (జీన్స్‌లో) వచ్చిందీ నన్ను ఆయనలాగా తయారుచేశాయని అనుకుంటున్నాను.
 నిజాయితీ, నిరాడంబరత, క్రమశిక్షణ, ఇటువంటి గుణాలన్నీ మా అమ్మని చూసి కొంతా, నాన్న దగ్గర కొంతా నేర్చుకున్నాను. జీవితాంతం వాటిని నిలుపుకోవాని ప్రయత్నిస్తూనే ఉంటాను.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.