పి. సత్యవతి
కుటుంబరావుగారి రచనాకాలమే బహుకల్లోలాలకు మూలమైన కాలం. ఆ కల్లోలాలనించీ అనేక నూతన ఆలోచనలు ఆవిర్భవిస్తున్న కాలం. చరిత్రలో అతిముఖ్యమైన సంఘటనలు సంభవించిన కాలం. చీకట్లను చీల్చుకుని అరుణోదయ రేఖలు పొటమరిస్తున్న కాలం.
”ఏ కాలపు జీవితాన్ని విమర్శించేది ఆ కాలపు సాహిత్యం, నేటి జీవితాన్ని విమర్శించలేనిదీ నేటి భావాలను సంస్కరించ లేనిదీ నేటి జీవితాన్ని అలంకరించలేనిదీ నేటి సాహిత్యం కాదు, నేను వ్రాసినదైనా సరే…” అనేది ఆయన సిద్ధాంతం. కుటుంబరావుగారు సాహితీ క్షేత్రంలో అడుగుపెట్టి దృష్టి సారించిన సందర్భం, తెలుగు సాహిత్యంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్న సందర్భం. భావ కవిత్వపు ఊపుతగ్గి అభ్యుదయ కవిత్వ అరుణోదయమవుతున్న సందర్భం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వ మంటూ శ్రీశ్రీ చరిత్రకి కొత్తచూపు నిస్తున్నారు. చీకటికొట్టులాంటి సంప్రదాయ సమాజంపై చలం విద్యుల్లతలు ప్రసరి స్తున్నాడు. సమాజానికి కొత్త చూపునిస్తు న్నారు అభ్యుదయవాదులు.
ఇరవయ్యో శతాబ్దపు ప్రథమార్థాన్ని కుటుంబరావు గారి నాలుగైదు నవలల్లో మనం స్పష్టంగా చూడవచ్చు. ముఖ్యంగా 1930లలో సంభవించిన ఆర్థికమాంద్యపు రోజులని, రెండు ప్రపంచయుద్ధాల నడిమికాలాన్ని, ఆ కాలంలో ఆంధ్రదేశపు మధ్యతరగతి జీవితాన్ని తన కథావస్తువుగా ఆయన ఎంచుకున్నారు. కుటుంబరావుగారి ఆత్మకథేమోననిపించే (కాదని ఆయనే ఒకచోట అన్నారు) ‘చదువు’, ‘అరుణోదయం, గడ్డురోజులు, జీవితం, అనుభవం అనే ఈ నాలుగు నవలలలో మధ్యతరగతి జన జీవితంపై అప్పటి పరిస్థితుల ప్రభావాన్ని, ఆ పరిస్థితులను వారు ఎదుర్కున్న తీరునీ విశ్లేషణాత్మకంగా చిత్రించారు. ఈ నవలల్లో ఆయన, ఇరవయ్యో శతాబ్ది ప్రథమార్థంలో సంభవించిన రెండు ప్రపంచ యుద్ధాలు, ఆర్థిక కాటకం, ముస్సోలినీ ఫాసిజం, హిట్లర్ హాలోకాస్ట్, జపాన్‌పై ఆటంబాంబ్, మనదేశంలో జలియన్‌వాలాబాగు దుర్మార్గం, జాతీయోద్యమం, గాంధీ సహాయనిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ, ఖద్దరు ధారణ, కమ్యూనిస్ట్ ఉద్యమం, దేశవిభజన, స్వాతంత్య్రం, గాంధీ హత్య మొదలైన చారిత్రాత్మక సంఘటనలను, ఆయా పాత్రల జీవనగమనంతో సమ్మిశ్రితంచేసి, ఆ సంఘటనలు కొందరిలో భావసంఘర్షణను, వేకువనూ, కొందరిలో ప్రేక్షకమాత్రతనూ కొందరిలో స్వార్ధ ప్రయోజనాలనూ కలిగించిన విధానాన్ని మార్క్సిస్ట్ విమర్శనాత్మక కోణంనించీ విశ్లేషించారు.
దాదాపు ఎనభై సంవత్సరాల తరువాత ఇప్పుడు మళ్ళీ మనం ఎదుర్కుంటున్న ఆర్థికమాంద్యం నేపథ్యంలో ఆనాటి ఆర్థికమాంద్యాన్ని గురించి తెలుసుకోడం అవసరం. ఇప్పట్లాగే అప్పుడూ దీనికి మూలం అమెరికానే. అప్పుడు మనని పాలిస్తున్నది బ్రిటీష్‌వారు కాబట్టి వారి పాలనా విధానాలు కూడా మన కష్టాలను పెంచాయి. 1929 నించీ 1940 వరకూ కొనసాగిన ఈ ఆర్థిక కాటకం (ఊనీలి వీజీలిబిశి ఖిలిచీజీలిరీరీరిళిదీ) ఇరవయ్యో శతాబ్దంలో చాలా ఎక్కువకాలం నిలిచివున్న కాటకం రెండవ ప్రపంచయుద్ధ ప్రారంభంతో గానీ ఇది ముగియలేదు. అమెరికాలో స్టాక్ మార్కెట్ పతనంతో 1929 అక్టోబర్ 29న ప్రారంభమైన ఈ మాంద్యం దేశాలన్నిటికీ పాకింది. మనదేశంలో రైల్వేలు, వ్యవసాయం బాగా దెబ్బతిన్నాయి. సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. ఎగుమతి దిగుమతులు పడిపోయాయి. పన్నుల భారం, పెరిగిన ధరలు సామాన్యునికి నెత్తిమీద గుదిబండ లయ్యాయి. అంతకుముందు వ్యవసాయం తిండిగింజలకెక్కువ ప్రాధాన్యమిచ్చేదిగా వుండగా బ్రిటిష్ పాలకులు వాణిజ్య పంటలు, ముఖ్యంగా పత్తి పంటకి ప్రాముఖ్యమిచ్చారు. మాంచెస్టర్‌లోని తమ నూలుమిల్లుల కోసం..ఈ కాలంలోనే కొత్త పరిశ్రమల స్థాపన కూడా జరిగింది. మొదటి ప్రపంచయుద్ధంలో ముడిసరుకు భారతదేశం నించీ భారీగా తరలించబడింది. ఆయుధాల తయారీకి ఇనుము, ఉక్కు తదితర వనరులు తరలించబడ్డాయి. బ్రిటన్‌లో తయారైన అనేక వస్తువులకి ముడిసరుకు సరఫరా చెయ్యడమే కాక ఆ సరుకులని కొనే వినియోగదారుడు కూడా భారతీయుడే అయినాడు. ఆ విధంగా బ్రిటీష్ వారి ఆర్థికస్థితిని కాపాడే బాధ్యత కూడా పాలితులమైన మనమీదే పడింది. ఆర్థిక కాటకం సమయంలో భారతదేశం చాలా కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ముఖ్యంగా రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయాయి. ఇంట్లో వున్న వెండీ బంగారం అమ్ముకోవలసి వచ్చింది. ”చదువు” నవలలో 1915 నుంచీ 1935 వరకూ గల ఇరవై సంవత్సరాల చారిత్రక, రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యంలో ఆంధ్రదేశంలోని (గుంటూరు జిల్లా) మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పతనాన్ని, దాని మూలాలనూ చిత్రించారు. ఇంగ్లీష్ చదువు సంపన్న వర్గాలనే కాక మధ్యతరగతి వారిని కూడా ఆకర్షిస్తున్న సమయమది. ఇంగ్లీష్ చదువుతో ప్రభుత్వోద్యోగమో మరొక ఉద్యోగమో తథ్యమన్న నమ్మకంతో అనేకమంది అప్పు చేసైనా మగపిల్లల్ని చదివిస్తున్న సమయం. ఈ నవలలో ప్రధాన పాత్ర అయిన సుందరానికీ అతని తల్లికీ కూడా చదువంటే ఇష్టం. తనే తొలి గురువై అక్షరాలు దిద్దబెట్టింది. కొంచెం పొలం భర్త ఉద్యోగం ఇల్లూ వాకిలి వున్న సీతమ్మ భర్త మరణంతో ఆర్థిక కష్టాలనెదుర్కోవలసి వచ్చింది. చాలా పొదుపుగా సంసారం గడుపుతూ కొడుకుని చదివించింది. కూతురు పెళ్ళి, కొడుకు చదువులతో కుంగిపోయిన సీతమ్మ ఆఖరికి అతని చదువు మానుకురమ్మంటుంది. ఆర్థికమాంద్యం ఆమె ఆస్తి యావత్తునూ కబళించింది. ఇష్టం లేకపోయినా సుందరం బనారస్ నించీ చదువు మానుకు రాక తప్పలేదు. ఉద్యోగం కోసం ప్రయత్ని స్తున్నాడు కానీ దొరకడం లేదు. తన కుటుంబానికి నెలకి ఇరవై రూపాయలు చాలు కానీ అవే లేవు. అతను లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదువుతున్నాడు. ఆనాటి మధ్యతరగతికీ ఈనాటి మధ్యతరగతికీ చాలా తేడా వుంది. అప్పటి బ్రిటిష్ ఆర్థికవ్యవస్థని కాపాడ్డానికి వారు దిగుమతి చేసిన వస్తువులను కొనాల్సి వచ్చినట్లే ఇప్పుడు మనకి కొనాల్సిన వస్తువుల జాబితా ఎనభై సంవత్సరాలంత వుంది. సుందరం తన సంసారానికి సరిపోతాయనుకున్న ఇరవైకి ఎన్ని రెట్లయితే ఇప్పుడు సరిపోతాయి? అప్పటి సుందరానికి కావల్సింది అప్పులేని ఒక సాదా సీదా సంసారం. ఇప్పటి సుందరాలకి సకల రుణ సదుపాయాలతో సకల సౌకర్యాలిచ్చే ఉద్యోగం. ఈ నవలలో కుటుంబరావుగారు, సీతమ్మ అన్న శేషగిరి పాత్ర ద్వారా ఆనాటి జాతీయోద్యమాన్ని గురించి కూడా విశ్లేషించారు. సుందరం బనారస్ నించీ తిరిగొచ్చేవేళకి ఆంధ్ర దేశంలో సత్యాగ్రహోద్యమం ఊపుమీదుంది. అరెష్టులు ముమ్మరమయ్యాయి. చాలామంది అరెష్టు కావడానికి ఉబలాటపడుతున్నారు. శేషగిరి కొడుకు జైలుకు వెడతానంటే శేషగిరి వద్దంటాడు. ”నువ్వు కూడా పోయి జైల్లో కూచుంటే ఎట్లా? నాబోటిగాడికి ఎటూ తప్పదు” అంటాడు. ఉద్యమం ఒక లాంఛనం కింద మారడాన్ని సుందరం గుర్తిస్తాడు. ఈ ఇరవై సంవత్సరాల్లో భారతదేశంలో వచ్చిన మార్పుల్ని ప్రస్తావిస్తూ, ”యుద్ధానంతరం సంక్షోభం ఎట్లా ఉన్నదీ తెలిసే అవకాశం లేక, తెలిసినా అది తమ జీవితాలను ఏ విధంగా స్పృశించేదీ అర్థంకాని పీడిత భారత ప్రజలలో చాలా తరగతులకవి మంచి రోజులు. జీవితం చాలారోజులు మంచానపడి తిరిగి కోలుకున్నట్లుగా వున్నది. అదివరకు లేని కొత్తరకం వస్తువులు, బట్టలు వచ్చాయి. జీవితంలో కొత్త చైతన్యం కనిపించింది. గ్రామసీమల్లోని వ్యవసాయిక సమాజంనించీ మధ్యతరగతి వర్గం ఉద్భవించింది. ఆ వర్గం పాశ్చాత్య విద్య వైపు ఆకర్షితమైంది. పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. సంస్కరణోద్యమ ప్రభావం నామమాత్రంగానే వుంది. వితంతు వివాహాలు రహస్యంగానే జరుగుతున్నాయి. శిరోముండనం వంటి మూఢాచారాలు నిలిచేవున్నాయి. శారదా చట్టం వచ్చినా అమలు కావడం లేదు. జాతీయోద్యమ కార్యకర్తలే బాల్యవివాహాలు చేయిస్తున్నారు. కట్నాల సమస్య మధ్యతరగతిని వేధిస్తోంది. ఆంధ్రదేశంలోకి సర్కస్, బయస్కోపులూ స్టేజి నాటకాలు, గ్రామఫోనూ, మూకీ చిత్రాలూ, అమెరికన్ స్టంట్ చిత్రాలూ వచ్చాయి.” ఇది అప్పటి నేపథ్యం.
అరుణోదయంలో ప్రధాన పాత్ర రామమూర్తి. ఇరవై ఎకరాల భూస్వామి. కానీ ఆ ఎకరాలు ఎక్కడున్నాయో ఏం పండిస్తున్నాయో తెలీదు. అతనికా భూమి ఒక ఆదాయ వనరు. అప్పు పుట్టించే ఆస్తి. కష్టపడకుండా కాలుమీద కాలు వేసుకుని కూర్చోగల రామమూర్తికి తను చేసిన అప్పుల వల్ల ఆస్తిపోయి కష్టాలొచ్చి ఉద్యోగం చెయ్యాల్సొచ్చి పట్నం వెళ్ళాడు. ఉద్యోగం చేశాడు. నాటకాలు వ్రాశాడు. చివరికతను యుద్ధసమయాన్ని తనకనుకూలంగా మార్చుకుని చీకటి వ్యాపారంలో కాస్త డబ్బు సంపాదించాడు. మార్కెట్లో దొరకని వస్తువులు, ముడిఫిలిం, కాగితం వంటివి బొంబాయిలో కొని మద్రాసులో ఎక్కువ ధరకి అమ్మడం వంటివి. రామ్మూర్తి ఎప్పుడూ కాలానికి రెండడుగులు వెనకే వుంటాడు. ఈ నవలలో రామమూర్తి ఆలోచనల్లోనించీ అనేక ప్రపంచ పరిణామాలను పాఠకుల దృష్టికి తెస్తారు కుటుంబరావు గారు. కమ్యూనిష్టుల, కాంగ్రెస్‌వాదుల, రాయిష్టుల ఆనాటి భావాలను అభిప్రాయాలను యువకుల మధ్య చర్చల రూపంలో చొప్పిస్తారు. ఇట్లా ఎవరు బడితే వాళ్ళు బస్సుల్లో ట్రాముల్లో రాజకీయాలు మాట్లాడ్డం రామమూర్తికి నచ్చదు. కమ్యూనిష్టులకు సమాజంలో పెరుగుతున్న ఆదరణ వ్యతిరేకతల్ని రామమూర్తి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. చివరికి ఒక కుర్రవాడిచేత ఇలా చెప్పిస్తారు రచయిత” సంఘంలో అశాంతికి ఒకటే కారణం. దోపిడి. అదే లేనినాడు ఏ ప్రచారమూ అశాంతిని వ్యాప్తి చెయ్యలేదు. దోపిడి తరగతుల వారీగ జరుగుతున్నది. జీవితసూత్రాన్ని చేతిలోకి పట్టుకుని కదిలించలేక దానికి చిక్కిపోయినవాడు ఆ పరిస్థితిని ఏమీ చెయ్యలేడు. కిందవాడిని దోస్తాడు. పైవాడి చేత దోపిడి చేయించు కుంటాడు. వాడు ఏ కళలు సృష్టించినా ఏ రాజకీయాల్లో పాల్గొన్నా ఏ ఆర్థిక సమస్య గురించి మాట్లాడినా ప్రపంచానికి పిసరంత ఉపయోగం లేదు. జీవితసూత్రాన్ని చేతపట్టినవాడు దాన్ని మరింత చిక్కుపరుస్తాడో. చిక్కు విడదీస్తాడో, అది వాడి ఆదర్శాలను బట్టి వుంటుంది. వాడు మంచికి పనిచేస్తే వాడివల్ల లోకానికి ఉపయోగం వుంటుంది. చెడుకు పనిచేస్తే అపకారం వుంది. వాడి సాంఘిక చైతన్యం గురించీ, రాజకీయాల గురించీ, వాడు సృష్టించే కళల గురించీ ఉదాశీనంగా వుండటం బుద్ధిమంతుడి లక్షణం కాదు”. ఈ యువకుడే రామమూర్తికి భారతదేశపు పెట్టుబడిదారులు యుద్ధానికి చేసిన సాయంగురించి, దాని మూలాన ఏర్పడిన ద్రవ్యోల్బణం గురించీ అది అదనుగా దొంగ వ్యాపారస్తులు చేసిన సాంఘిక ద్రోహం గురించీ చెప్పి కొన్ని పుస్తకాలిచ్చి చదవమంటాడు. రామమూర్తి సంగతెలా వున్నా సమాజంపై అరుణకిరణం ప్రసారం ప్రారంభమయిన సందర్భాన్ని చెప్పారు కుటుంబరావు గారు. యుద్ధకాలంలో చీకటి వ్యాపారాలు చేసేవాళ్ళు వారసత్వం నవలలో సుదర్శనం వస్తువులు కొని అమ్మితే అతని కొడుకు దొంగ వ్యాపారాలు చేస్తాడు.
1900ల సంవత్సరంలో మొదలై 1950లలో ముగిసిన నవల ”అనుభవంలో కూడా ఆనాటి సమాజ చరిత్రే కాక తరాల మధ్య అంతరాలను గురించి కూడా చిత్రించారు. తమ జీవితాలు ఏమాత్రం తమ అధీనంలో లేని కాలంలో జీవితానికి ఎదురీది కొడుకుని కంటికిరెప్పలా పెంచుకున్న పార్వతమ్మ అవసానదశలో తను వాణ్ణి సరిగ్గా పెంచలేదేమో అనుకుంటుంది, కానీ ఆ కాలం, అప్పటి సమాజం ఆమె చైతన్య పరిధి, ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆమెని అభినందించకుండా వుండలేం. ఈ నవలలో కూడా పార్వతమ్మ కొడుకు నారాయణ పెరుగుదల చదువు వుద్యోగం వివాహం, వీటితోపాటు సమాజచరిత్ర, దాన్నుంచీ అతను నేర్చుకున్న పాఠాలు వుంటాయి. గాంధీ సహాయనిరాకరణ, రెండవ ప్రపంచయుద్ధం తరువాత ఊపందుకున్న జాతీయోద్యమం, దొంగదేశభక్తులు, నిధుల కైంకర్యం, ఇవ్వన్నీ నారాయణ గమనిస్తూ వుంటాడు. అతను ఉద్యోగంలోకి వచ్చాక చదివిన సాహిత్యం, జరిగిన సంఘటనలు అతన్ని కమ్యూనిజం వైపుకి తిప్పాయి. గాంధీ హత్య మొదలు, రజాకార్ మూమెంట్, పోలీస్ చర్య, కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం, చైనాలో రాజకీయాలు, కాటూరు యలమర్రులలో పోలీసుల దుష్కృత్యాలు, సినిమా ప్రభంజనం, డిటెక్టివ్ పుస్తకాలకి గిరాకీ వరకూ యాభై సంవత్సరాల చరిత్ర ఈ నవలలో ప్రస్తావన కొస్తుంది. అంతేకాదు, ఈ నాలుగు నవలలు చదివితే ఆనాటి నాటకాలు, గొప్ప నటులు, రచయితలు, సంగీతకారులు, గాయకులు, పరిచయ మౌతారు. నాటకరంగ ఉత్థాన పతనాలు కళ్ళకు కడతాయి. వ్యక్తిత్వ నిర్మాణానికీ సమాజ చరిత్రకీ కల పారస్పర్యం అర్థం అవుతుంది. ఆ విధంగా ఆనాటిని కళ్ళముందుకి తెచ్చిన కొ.కు. సాహిత్యం ఆనాటిదే కాదు ఎప్పటిదీ…
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags