కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యమంతా 1931`1980 మధ్యకాలంలోనిది. చదివిన ఫిజిక్స్ బిఎ, 1930లలో అందివచ్చిన మార్క్సిస్ట్ అవగాహన ఆయన ఆలోచనలకు శాస్త్రీయమైన చూపును ఇచ్చాయి. ఆ క్రమంలోనే అరసం (1942), విరసం (1970) సహజంగా ఆయన చిరునామా అయ్యాయి.
తనకు తెలిసిన మధ్యతరగతి జీవితాన్నే సృజన సాహిత్య వస్తువుగా స్వీకరించిన కుటుంబరావు సమాజంలో అధిక సంఖ్యాకులైన మధ్యతరగతిని చైతన్యవంతం చేయటమే లక్ష్యంగా మొదటినుండి అందులోని వైరుధ్యాలను శాస్త్రీయంగా విశ్లేషించటంలో శ్రద్ధ చూపుతూ వచ్చాడు. సాహిత్యాన్ని భావవిప్లవ సాధనంగా పదునెక్కించాడు. భారత సమాజ ఆధునికీకరణ అనివార్యంగా సనాతన ధర్మంపై తిరుగుబాటు కాక తప్పదని సంస్కరణోద్యమాలు నిరూపించాయి. ఆ నేపథ్యంలో మధ్యతరగతి ఆలోచనలలో, అంతరాత్మలో, ఆచారాలలో, అలవాట్లలో భాగమై లౌకిక మానవ ఆకాంక్షలకు, ఆశలకు అవరోధం అవుతూ జీవితాన్ని దుఃఖభాజనం చేస్తున్న సనాతన ధర్మంతో సాంస్కృతిక రంగంలో చేయవలసిన యుద్ధం ఎలా ఉండాలో చూపించే కర్తవ్యాన్ని తన సాహిత్య సృజన ప్రారంభకాలం నుండే స్వీకరించినవాడు కొడవటిగంటి కుటుంబరావు. నిత్యం, నిరంతరం సనాతన ధర్మం పేరు మీద అసమానతలకు ఆమోదముద్ర వేస్తోన్న సమకాలీన సాంస్కృతిక రాజకీయ సందర్భం నుండి ఆ కథలు ఇప్పుడు చదువుకోవలసినవి, అన్వయించుకోవలసినవి.
1. ‘‘వాళ్ళు వాళ్ళు అనేక విషయాల గురించి అనుకుంటున్న మాటలన్నీ జ్ఞాపకముంచుకొని వాటిని నిజం కింద అంగీకరించి వాటి ప్రకారం ఆచరించటం బుద్ధిని ఉపయోగించటం కాదు. దేని గురించైనా నీ అభిప్రాయం ఒకటి ఏర్పరచుకోవటం ‘బుద్ధి’ ’’` సూరి సిద్ధాంతం (1934) కథలో వాక్యం ఇది. సూరి సిద్ధాంతం శీర్షికతో కొకు వ్రాసిన కథలు నాలుగు. కథకుడికి, అతని స్నేహితుడు సూరికి మధ్య సంవాదాత్మక శైలిలో నడిచే ఉత్తమపురుష కథనాలు ఇవి. మతానికి, ఆచారాలకు, నీతి అవినీతులకు సంబంధించి గతానుగతికంగా వస్తున్న భావాలను విమర్శకు పెట్టటం ద్వారా స్వతంత్ర బుద్ధి వికాసానికి దారులు తీశాడు కొకు.
మతం ఎవరికి వారు సృష్టించుకోవలసిందే తప్ప తాత తండ్రుల మతాలను యధాతథంగా అనుసరించరాదన్నది సూరి అభిప్రాయం. మతం అంటే అతని దృష్టిలో జీవనవిధానం. తమవరకు అందివచ్చిన జ్ఞాన చైతన్యాలను బట్టి, తమ అవసరాలను బట్టి ఎవరి జీవనవిధానం వాళ్ళే నిర్ధారించుకొంటారు. ‘మతం కూడా ఆస్తల్లే, గుణాలల్లే, రోగాలల్లే వంశపారంపర్యంగా వస్తుందా ఏమిటి?’ అని హేళన చేయటంలో అంతరార్థం అదే. మతం వంశపారంపర్యంగా వచ్చేదే అయితే శూద్రులతో భోజనం చేసినప్పుడు, స్టీమరెక్కి విదేశాలకు పోయినప్పుడు, వితంతువును పెళ్ళి చేసుకొన్నప్పుడు ఎలా పోతుందని ప్రశ్నించాడు. మతం వంశపారంపర్యంగా రావటం, కొన్ని పనుల వల్ల పోవటం, ఒక పని వల్ల పోయిన మతం అట్లానే పోక ఏ పని చేద్దామనుకొన్నప్పుడయినా అడ్డుగా వచ్చి నిలవటం ఎంత హాస్యాస్పదమైనవో సూరి మాటల వల్ల స్పష్టమవుతుంది.
ఆచారాలే మతమనుకొనటాన్ని ఖండిస్తూ ఒకప్పుడు ఒక సామాజిక జీవితావసరాలలో భాగంగా రూపొందిన ఆచారాలు యధావిథిగా అన్ని కాలాలకు ఉపయోగపడవని కాలానుగుణంగా మనిషి జీవితంలో రావలసిన వికాసం గురించిన అవగాహన ఉన్న వాళ్ళెవరయినా గ్రహిస్తారని, మనిషి ఉపయోగం కోసమే ఆచారాలు కానీ, ఆచారాల కొరకు మనుషులు కాదని సూరి అభిప్రాయం. ఆహారం వంటి ప్రాథమికావసరాలు కూడా తీరని జనానికి వాటికి బదులు మతాన్నిస్తే మూఢనమ్మకాలు వంటి జబ్బులు ప్రబలిపోతున్నాయంటాడు సూరి.
సనాతన ధర్మం అనేది స్త్రీలను అణగద్రొక్కటానికి, స్త్రీలపై దౌర్జన్యం జరపటానికి, బ్రాహ్మణాధిక్యతను స్థాపిస్తూ తదితర వర్ణాలను, మరీ ముఖ్యంగా పంచములను అవమానించటానికి, అణచివేయటానికి సాంస్కృతిక సమ్మతిని సమకూరుస్తున్న విషయం కొకు అవగాహనలో ఉంది. మానవ జీవితంలో అభివృద్ధికి, మనుషుల మధ్య సమానత్వానికి, స్నేహానికి సనాతన ధర్మం అడ్డు అవుతున్నది కనుకనే కొకు దృష్టిలో చీల్చి చెండాల్సిన అంశాలలో అది ప్రధానమయింది.
లోకంలోని కుసంస్కారాలు జీవన వికాసానికి అవరోధంగా ఉన్నప్పుడు చూసీ చూడనట్లు ప్రవర్తించటం జీవన విధ్వంస కారణమవుతుంది కనుక వాటిని ఏ కొద్దిగానైనా మార్చటానికి ఎవరి పద్ధతులలో వాళ్ళు పనిచేయటం అవసరమని కొకు భావిస్తాడు. అలా ప్రయత్నించే వాళ్ళను జీవలక్షణం కలవాళ్ళు, జీవశక్తి కలవాళ్ళు అని అభిమానంగా పేర్కొంటాడు. జీవశక్తి అంటే కొకు దృష్టిలో కర్మశక్తి. సూరి సిద్ధాంతం 3 కథలో బ్రాహ్మణులను జీవశక్తి మందగించిన వాళ్ళుగా, ఇతర కులాల వాళ్ళని జీవశక్తి ఇంకా చావని వాళ్ళుగా వర్గీకరించి చెప్పాడు. భౌతిక కర్మ నుండి ఉత్పత్తి నుండి వైదొలగిన వర్గం బ్రాహ్మణులైతే తదితర కులాలు ఉత్పత్తి సంబంధంలో ఉన్న వర్గం. విధి నిషేధాల రూపంలో ఉత్పత్తి కులాలను అదుపుచేసే బ్రాహ్మణుల జ్ఞానశక్తిని తీవ్రంగా నిరసించాడీ కథలో. ఆ సందర్భంలోనే సూరి చేత ‘‘సనాతన మతం అన్నవాడినల్లా జైలులో పారెయ్యి!’’ అనిపించాడు.
సనాతన మతం అభివృద్ధి నిరోధకమైనది, అసమానతలను పెంచి పోషించేది అని పూర్తిగా నమ్మాడు కనుకనే సనాతన మతవాదులు సమాజంలో చెలామణిలో ఉండదగిన వాళ్ళు కాదని అనుకొన్నాడు కొకు. అందువల్లనే సనాతన మతవాదుల జైలు నిర్బంధం ఆయన ఆకాంక్ష అయింది. ఆ ప్రజాస్వామిక ఆకాంక్ష ఈ 88 ఏళ్ళ కాలంలో ఆచరణ వాస్తవం కాకపోగా సనాతన ధర్మాన్ని కాదన్న వాళ్ళ తలలకు వెలకట్టే వర్తమానంలో మనం మిగిలాం. అంతేకాదు, సనాతన ధర్మం అనేది సామాజిక, సాంస్కృతిక ఆవరణలు దాటి రాజ్యాధికారంగా మారితే ఎంత ప్రమాదకరమో అది కూడా ఇప్పటి మన అనుభవం. ఆ ప్రమాదాన్ని కొకు 1943 నాటికే గుర్తించాడు అనటానికి నిదర్శనం ‘దేశభక్తుడు’ అనే కథ. వర్తమాన సామాజిక ప్రజాస్వామిక చింతనకు, దాన్ని సహించలేని రాజకీయార్థిక అధికార వికృతికి మధ్య వైరుధ్యాలను వ్యాఖ్యానించగల జీవశక్తి గల ఆ కథ మనం ఇప్పుడు తప్పక అధ్యయనం చేయవలసిందే.
2. కథ శీర్షిక ‘దేశభక్తుడు’. అది 1943 మార్చిలో ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం మహా సభల ప్రత్యేక సంచికలో ప్రచురించబడిరది. బ్రిటిష్ పాలకులు ఇండియాను వదిలివెళ్ళటం, దేశానికి సంపూర్ణ స్వరాజ్యం లక్ష్యంగా జరిగిన ప్రచార కార్యక్రమం ` క్విట్ ఇండియా ఉద్యమం అప్పుడే ముగిసింది. పదమూడు, పధ్నాలుగేళ్ళుగా జాతీయోద్యమాన్ని సన్నిహితంగా చూస్తూ, భిన్నకోణాల నుండి అర్థం చేసుకుంటూ, విలువ కడుతూ వస్తున్న కొకు సమకాలీన జాతీయోద్యమ స్వభావాన్ని అంచనా వేస్తూ, స్వతంత్ర భారత భవిష్యత్తును దర్శిస్తున్నట్లుగా నిర్మించిన కథ ఇది. దీనిని గొలుసు కథ అన్నాడు కొడవటిగంటి కుటుంబరావు (కొకు). సాధారణంగా గొలుసు కథ అన్నా, గొలుసు నవల అన్నా అవి సామూహిక సృజన ప్రక్రియలు. ఒకరు రచన ప్రారంభిస్తారు, వాళ్ళు ఆపిన చోట ప్రారంభించి మరొకళ్ళు కథను నడిపిస్తారు, వాళ్ళు ఆపిన చోట మరొకరు కథను కొనసాగిస్తారు. ఇలా ఒకళ్ళకంటే ఎక్కవమంది చేత భాగాలు భాగాలుగా వ్రాయబడే కథలు, నవలలు గొలుసు కథలు, గొలుసు నవలలు. అయితే నాలుగున్నర పేజీల దేశభక్తుడు కథ కొకు ఒక్కడే వ్రాశాడు. మరి గొలుసు కథ అని ఎందుకు అన్నట్లు? కథ పూర్తయ్యేసరికి మనకు ఆ విషయం అర్థమవుతుంది. దేశ స్వతంత్ర ప్రతిపత్తిని, దేశ ప్రజలందరి సంక్షేమాన్ని కాంక్షించి అందుకు దారులు వెతికే వాళ్ళు, నమ్మిన మార్గంలో నడిచేవాళ్ళు దేశభక్తులు. కొడవటిగంటి కుటుంబరావు కథలో దేశభక్తుడు అలాంటివాడే. దేశం కోసం ఏదో సాధించాలనుకొని తపస్సు చేస్తాడు. తపస్సు ఫలించి దేశమాత ప్రత్యక్షం కావటం, ఆమెకు, దేశభక్తుడికీ మధ్య జరిగిన సంభాషణ ఈ కథలో మొదటి భాగం. తపస్సు ఎందుకు అన్న దేశమాత ప్రశ్నకు దేశ క్షేమం కోసం, అభ్యుదయం కోసం అన్నది అతని జవాబు. ఇప్పుడు దేశానికి వచ్చిన ముప్పేమిటి అన్నది ఆమె ప్రశ్న. దాస్యం అన్నది అతని సమాధానం, దేశ వాసులకు దాస్య విమోచనం అతని ఆకాంక్ష. దాస్యం ఎవరి వల్ల అన్నది ఆమె ప్రశ్న. పాశ్చాత్యుల వల్ల అన్నది అతని జవాబు. వాళ్ళు నీ ప్రజల కాళ్ళూ, చేతులూ కట్టేశారా? అన్నది ఆమె ప్రశ్న. కాదు కానీ వాళ్ళవల్లే దేశ ప్రజలకు దారిద్య్రం అని అతని సమాధానం. వాళ్ళు రాకముందు దారిద్య్రం లేదా అని ఆమె రెట్టించి అడిగిందిÑ అందరూ డబ్బు న్యాయంగానే సంపాదించారా అని నిలదీసింది. కొద్దిమంది దుర్మార్గులు సంఘంలో ఎప్పుడూ ఉంటారు, వాళ్ళు మిగిలినవాళ్ళను దోచి ధనికులవుతారు అని నిజాయితీగా జవాబిచ్చాడు దేశభక్తుడు. వారి తరపునే కదా నువ్వు తపస్సు చేస్తున్నది అని ఆంతర్యాన్ని ఆరా తీసింది ఆమె. కాదు కాదు… నిజంగా దారిద్య్రం అనుభవిస్తున్న కోట్లకొద్దీ ప్రజల కోసం అని వివరణ ఇచ్చాడు అతను. నువ్వు కోరే దేశవిముక్తి ఏ విధంగా వాళ్ళ దారిద్య్రం తొలగిస్తుంది అన్న ఆమె ప్రశ్నకు అతని దగ్గర జవాబు లేకపోయింది. జవాబు తెలుసుకొనటానికి అతను మళ్ళీ తపస్సు ప్రారంభించాడు.
ఈ సంభాషణ ద్వారా కొకు ఏమి చెప్పదలచుకొన్నాడు? స్వాతంత్య్ర ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, పాల్గొంటున్న ప్రజలు అందరూ దేశభక్తులే. దేశ క్షేమం, అభ్యుదయం కోరుతున్నవారే. దేశమంటే మట్టి అనుకొంటే బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని వదిలిపోయి దేశీయులు పాలన చేపడితే సరిపోతుంది. దేశమంటే ప్రజలు అనుకొన్నప్పుడు దేశం క్షేమం, అభ్యుదయం అనేవి వాళ్ళకు భద్రమైన, గౌరవకరమైన జీవిత వనరులను సమకూర్చటం అవుతుంది. అప్పుడు అభ్యుదయానికి గీటురాయి ప్రజలు దారిద్య్రం నుండి విముక్తులు కావటం. అయితే అది పాశ్చాత్యుల పాలన అంతం కావటంతో సాధ్యమవుతుందనుకొనటం భ్రమ అని చెప్పదలచుకొన్నాడు కొకు. అందుకే దేశమాత చేత పాశ్చాత్యులు రాక పూర్వం నీ దేశంలో దరిద్రులు లేరా అన్న ప్రశ్నను వేయించాడు. డబ్బు సంపాదన, సంపదల సమీకరణలో న్యాయం పాత్ర చరిత్రలో ఎంతో తరచి చూడాలన్న సూచన ఇప్పించాడు. మిగిలిన వాళ్ళను దోచుకొనటంలోనే కొద్దిమంది దుర్మార్గులు ధనికులు అవుతుంటారన్న వివేకం ఉండటం వరకు సరే… ఆ వివేకం కలిగిన దేశభక్తుల కార్యదీక్ష దోచుకొనే దుర్మార్గుల ప్రయోజనాల కొరకా, దోపిడీకి గురవుతున్న ప్రజల ప్రయోజనాల కొరకా అన్న ప్రశ్న దేశభక్తుడు ఎవరో నిర్ణయించడానికి అసలైన గీటురాయి. కథలో దేశభక్తుడు నిజంగా దారిద్య్రం అనుభవిస్తున్న కోట్లకొద్దీ ప్రజల కోసం తన తపస్సు అని చెప్పి అసలైన దేశభక్తుడు అయ్యాడు. బ్రిటిష్ వలస పాలన నుండి విముక్తితో ఆ సమస్య తీరేది కాదన్న కొసమెరుపు సూచనతో ముగుస్తుంది ఈ భాగం.
ఆనాటి ఆ దేశభక్తుడు బహుళమై ఈనాడు దేశద్రోహులుగా బెదిరింపులకు, నిఘాలకు, నిర్బంధాలకు, బహిష్కరణలకు, హత్యలకు గురవుతుంటే దారిద్య్ర సృష్టి కర్తలైన దోపిడీ వర్గం దేశభక్తులుగా అధికార స్థానం ఆక్రమించి ఉండటం విషాద వాస్తవం.
ఇక ఈ కథ రెండవ భాగంలో దేశభక్తుడి తపస్సు దేశవాసుల దారిద్య్రం అంతమొందించటం లక్ష్యంగా సాగింది. లక్ష్మీదేవి ప్రత్యక్షం కావటం, వాళ్ళిద్దరి మధ్యా సంభాషణ యథాపూర్వకమే. డబ్బంటే బీదలు పోగొట్టుకొనే వస్తువు, ధనికులు దాచుకొనే వస్తువు అని నిర్వచించి లక్ష్మీదేవి వర్గతత్వం, కులతత్వం ఉన్న సాంఘిక వాతావరణంలో మళ్ళీ మళ్ళీ అలాగే ధనికులూ, బీదలూ ఏర్పడతారు అని చెప్తుంది. కొందరు దరిద్రంలో ఉంటే తప్ప ఫ్యాక్టరీలలో పనిచేయటానికి, రోడ్లు ఊడవటానికి, పాకీ దొడ్లు కడగటానికి మనుషులు దొరుకుతారా అనుకొనే పెట్టబడిదారీ వర్గతత్వం ఒకవైపు, ఒకవేళ ఆర్థిక సమానత్వం సాధ్యమైనా డబ్బుతో కొనరాని వాటన్నింటినీ కింది కులాలకు అందకుండా దాచిపెట్టుకొనే పైకులాల ఆధిపత్య తత్వం మరొకవైపు సమానత్వానికి సవాళ్ళు అవుతాయని మహాలక్ష్మి ముఖంగా చెప్పించాడు కొకు. సామాజిక జీవితంలో స్వార్థం తెచ్చిపెట్టిన కులతత్వాన్ని సంభోదించకుండా దారిద్య్రం నుండి జనాన్ని విముక్తం చేయటం, విముక్తం చేసినా దాన్ని నిలబెట్టటం సాధ్యం కాదన్న అవగాహనను ఇస్తుంది ఈ భాగం. ఇక దేశభక్తుడికి కులతత్వాన్ని అంతం చేయటమే తక్షణ కర్తవ్యం అయింది.
అందుకోసం తపస్సు చేయటం, ప్రత్యక్షమైన శక్తితో సంభాషణ కథలో మూడవ భాగం. ఈసారి ప్రత్యేకమైన శక్తి అతి ముసలి, వెధవ ముండ. పళ్ళూడిపోయిన బోసినోరూ, పొరలు గమ్మిన కళ్ళు పెట్టుకొని కనిపించింది. ఆమె దేశమాత లాగా, మహాలక్ష్మి లాగా ఒంటరిగా రాలేదు. వందిమాగధులతో వచ్చింది. ఆ దృశ్యాన్ని చూసిన కథకుడు ఇలా వర్ణించాడు, ‘‘ఆవిడ తన కాళ్ళ మీద నిలబడలేదనో ఏమో, పాపం దండ కమండలాలు ధరించిన ఒక సన్యాసీ, దర్భకట్టా, పంచాంగమూ చంకలో పెట్టుకొన్న శుద్ధ శ్రోత్రియుడూ ఆమె చెరొక రెక్కా పట్టుకొన్నారు. వెనుకగా వజ్రాల ఉంగరాలు ధరించిన ఒక వైశ్యుడూ, అధికారి దుస్తులు ధరించిన ఒక శూద్రుడూ ఉన్నారు. ఇంకా వెనుకగా కత్తులూ, తుపాకులూ ధరించి చింకి గుడ్డలు కట్టుకొని ఒట్టి అమాయకపు మొహాల వాళ్ళు కొందరున్నారు’’. ఈ దృశ్య చిత్రణ ద్వారా రచయిత ఏమి చెప్పాలనుకొన్నాడు? ఆమె కులదేవత అని దేశభక్తుడి ముఖంగా వాచ్యం చేశాడు. సనాతన ధర్మంలో భాగంగా చెప్పబడుతున్న కులం చాలా పూర్వకాలం నుంచీ ఉన్నది కనుక ఇప్పటికి ముసలిదై ఉంటుంది కదా!? ఆ ఊహ మీద ఆమెను పళ్ళూడిపోయిన బోసినోటి ముసలవ్వగా, దట్టంగా పొరలు కమ్మిన కళ్ళపెద్దవ్వగా బొమ్మ గీశాడు. ఆ తరువాతి కథలో కూడా ఆమె ముసల్ది అనే సంబోధించబడిరది. ఆ రకంగా కులదేవత వికృత రూపి, అశుభ మూర్తి. కాలం చెల్లిన ముసలమ్మను నిలబెడుతున్నది ఎవరు? సన్యాసులు, బ్రాహ్మణులు. సంపన్న వర్గం, శూద్ర వర్గం ఆమె సేవలో తరిస్తున్నది. ఇదంతా కలిసి ఒక అధికార వ్యవస్థ. దీని రక్షణకు సాయుధ సైన్యం కూడా తయారు చేయబడిరది. సైన్య సమీకరణ పేద, సాధారణ జనం నుండి జరిగిందని ‘చింకి గుడ్డల అమాయక మొహాలు’ అన్న విశేషణాలను బట్టి ఊహించవచ్చు.
కులతత్వం అంతం కావాలని, దేశం బాగుపడాలని తపస్సు చేస్తున్నట్లు దేశభక్తుడు చెప్పగానే వర్ణసంకరం కావటం దేశం బాగుపడటమా అని ఎద్దేవా చేసిన సన్యాసి, బ్రాహ్మణుడు చాతుర్వర్ణాలను నేను సృష్టించాను అన్న భగవద్వాక్యాన్ని వల్లె వేయటమే కాక, వర్ణాశ్రమ ధర్మాలు పోతే మనుష్యులకూ, పశువులకూ తేడా ఉండదని తేల్చేశారు. వర్ణాశ్రమ ధర్మాలు పాటించాలనే మహానుభావుల ఆజ్ఞలు పాటించే మనుష్యులకూ, పశువులకూ మాత్రం తేడా ఏముందని దేశభక్తుడు వాళ్ళ వెనుక ఆయుధాలు పట్టుకొని నిలబడిన మూఢుల మొహాలు చూపిస్తూ వేసిన ప్రశ్నను విననట్లే కులదేవత ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రామా, కృష్ణా అని ఇంత దైవ చింతన చేసుకో అని దేశభక్తుడికి హితోపదేశం చేసింది. తన మోక్షం గురించి అంత అక్కర ఉన్నవాళ్ళకు దేశ ప్రజల దుర్దశ పట్టనిది ఎందుకవుతున్నది అని అతను నిలదీయటం ముసలి కులదేవతకు సహించరానిది అయింది. తమ దారికి అడ్డం వస్తున్నాడు కనుక అతనిని దేశద్రోహిగా ప్రకటించింది. దేశవాసుల ప్రతినిధులంతా కూడా అదే అంటున్నారని తన వెనుక నిలబడిన వాళ్ళను చూపింది. దారిద్య్రం సంగతి పట్టించుకోకుండా కులాన్ని నిలబెట్టటానికి తాత్వికతను, జ్ఞానాన్ని, ధనాన్ని, సేవలను అందించటానికి నిలబడినవాళ్ళు దేశవాసుల ప్రతినిధులు కాజాలరు అన్నది దేశభక్తుడి అవగాహన, నిర్ధారణ. అతని ఈ ధిక్కారం అధికారానికి సవాలు అయింది. కులతత్వం అంతం కావాలన్న లక్ష్యంతో తపస్సు ప్రారంభించిన అతన్ని ఆ ప్రయత్నం నుండి విరమించుకోమని ఒత్తిడి చేసింది.
కులతత్వం అంతమయ్యే మార్గాన్ని అన్వేషించటంలో దేశభక్తుడి తపస్సు ఒక మజిలీ. కులతత్వ నిర్మూలనకు ఆచరణ కార్యక్రమం ఇంకా రూపొందించవలసి ఉంది. అయితే కుల అధికార వ్యవస్థ దృష్టిలో కులం పోవాలని ఆలోచించేవాడి మెడ మీద తలకాయ లేకుండా చేయటమే దానికి శిక్ష. ఆయుధపాణులను ఆజ్ఞాపించి దేశభక్తుడిని చంపించటంతో ఈ కథ ముగుస్తుంది. ఈ కథలోని మూడు భాగాలు క్రమంగా దాస్యం, దారిద్య్రం, కులం అనే మూడంశాల మధ్య గొలుసు సంబంధాన్ని స్థాపిస్తాయి. ఒకదాని పరిష్కారం మరొకదానితో ముడిపడి ఉండటాన్ని నిరూపిస్తాయి కనుక కొకు దీనిని గొలుసు కథ అని ఉంటాడు.
దారిద్య్రం దగ్గర నుండి కుల మత తత్వాల వరకు అన్నింటినుండి తన జాతి విముక్తి కోరుకొన్న వాడు దేశద్రోహి అని తీర్పు ఇచ్చింది కులాన్ని ముందు పెట్టుకొన్న బ్రాహ్మణాధికారం. తల తీసెయ్యమని ఆయుధపాణులను ఆజ్ఞాపించింది ముసలిదైన కులదేవత. ‘చింకి గుడ్డల అమాయక మొహాలు’ గల ఆయుధ పాణులు తొలుత అందుకు నిరాకరించి వెనక్కు తగ్గడంతో ఒరనుండి కత్తితీసి వాళ్ళిద్దరి తలలు నరికేశాడు అధికారి. దానిని దేశభక్తుడి ప్రాణం అన్నిటికన్నా తియ్యనిది అనే సూత్రం మీద సంస్కారం ప్రచారం అవుతున్నదన్నమాట అని వ్యాఖ్యానించాడు. ‘శరీర మాంద్యం ఖలు ధర్మ సాధనం’ (ధర్మసాధన కోసం శరీరమే కదా మొదటిది / ప్రధానం) అన్న వాక్యంతో సన్యాసి దానికి ధర్మబద్ధతలను సమకూర్చే ప్రయత్నం చేశాడు. ధర్మసాధన అంటే సనాతన ధర్మ సాధనే. అందుకు ఉపయోగపడని శరీరం విలువలేనిది. నిర్దాక్షిణ్యంగా నిమిషాలలో అంతం చేయవలసినది. అలా అంతం చేయటం ద్వారా సనాతన ధర్మ రాజ్యం ఆజ్ఞ అనుల్లంఘనీయమన్న భయాన్ని సృష్టించటం తక్షణ ప్రయోజనం. బ్రాహ్మణీయ హిందూ మత ఫాసిజం ఎలా ఉంటుందో మచ్చు చూపిన కథ ఇది.
అదే సమయంలో చావైనా, బ్రతుకైనా విలువల కోసం అన్న విషయాన్ని సౌకర్యవంతంగా మరిచిపోతున్న జాతి ఏ విలువలనైనా వదిలేసి ఎలాగైనా బతికెయ్యటమే సంస్కారం అనుకొనే స్థాయికి దిగజారుతున్న స్థితిని గురించిన విషాద స్పృహను దేశభక్తుడి వాక్యంలో ధ్వనింపచేసింది ఈ కథ. అంతేకాదు, దేశభక్తుడి మరణాన్ని కులరాజ్యం లోక కంటకుడి మరణంగా ప్రకటించటం చూస్తాం. ‘‘యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుద్ధనామ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం’’ అని సన్యాసి చదివిన భగవద్గీత శ్లోకం ఈ కథకు అసలైన ముగింపు. ఎప్పుడెప్పుడు ధర్మానికి క్షీణత, అధర్మానికి అభివృద్ధి జరుగుతాయో అప్పుడు నేను అవతరిస్తాను అన్న శ్రీకృష్ణుడి వాక్యం అది. దారిద్య్రం, కులతత్వం నశించాలనటం అధర్మం అయి, అందుకు ఆలోచిస్తున్న వాడిని చంపటం ప్రభుత్వ ధర్మం అయిన తలకిందుల వ్యవస్థకు న్యాయ సంబద్ధతను సమకూర్చే శక్తిగా మతం రాజకీయంతో జతకట్టటం ఇలా జరిగిందన్నమాట.
కులం ఒక సామాజిక అసమ వ్యవస్థకు కారణం. కులం స్థానంలో స్త్రీ పురుష భేదం, మతం ఉత్పత్తి నమూనాలు, సంబంధాలు ఏవైనా పెట్టుకోవచ్చు. వాటి కారణంగా ఏర్పడిన సామాజిక అసమానతలు పోవాలని, పోయే మార్గం ఏమిటా అని ఆలోచించే వాళ్ళు ప్రజల పక్షాన నిలబడ్డ
వాళ్ళు. అందువల్లనే రాజ్యాధికార వ్యవస్థకు ప్రమాదకారులు. కనుకనే వాళ్ళను దేశద్రోహులుగా చెప్పి ఉసురు తీయటం. దేశ ప్రజల కనీసావసరాలు తీరాలని, హక్కులు అందరికీ సమానంగా అనుభవానికి రావాలని, ప్రజలందరూ ఆత్మగౌరవంతో జీవించే అవకాశం ఉండాలని కోరుకోవటం, అలాగని చెప్పటం, వ్రాయటం దాన్ని వాస్తవీకరించే ఆచరణ మార్గాలను ఎన్నుకొని క్రియాశీలురు కావటం దేశ భద్రతకు, సమగ్రతకు, శాంతికి భంగకరమైనవిగా చెప్పబడుతున్నాయి. అసమానతలను, వైషమ్యాలను పెంచి పోషించే సనాతన మత సాంస్కృతిక వారసత్వాన్ని, ఆధునిక గుత్త పెట్టుబడుల బహుళ జాతి ఆర్థిక ప్రయోజనాలను కలగలిపి పాలకవర్గాలు రూపొందించుకున్న విధానాలకు సామాజిక సమ్మతిని సంపాదించుకోవటం వర్తమాన రాజకీయ సమయం. దేశానికి స్వాతంత్య్రం రావటానికి నాలుగేళ్ళ ముందే అధికారం చేపట్టబోయే వర్గం స్వభావాన్ని ఊహించాడా అన్నట్లుగా ఈ కథకు కొకు ఇచ్చిన ముగింపే స్వాతంత్య్ర అమృతోత్సవ కాల ముఖ చిత్రం కావటం కళ్ళముందటి వాస్తవం.
(కొలిమి వెబ్ మ్యాగజైన్ నుండి…)