అనువాదం: ఎ.సునీత
కొన్ని సార్లు ఏది ముందు వచ్చిందో – స్త్రీ విముక్తి పోరాటమా లేక లైంగిక విముక్తి ఉద్యమమా – అన్నది తెలుసుకోవటం కష్టమవుతుంది. కొంతమంది కార్యకర్తలకి రెండూ కలగలిసి రెండూ ఒకేసారి జీవితంలోకి వచ్చాయి.
ముఖ్యంగా స్త్రీవాదుల్లో ముందు వరసలో వుండిన బైసెక్సుల్, లెస్బియన్ స్త్రీలకి సంబంధించినంత వరకూ ఇది వాస్తవం. తాము లెస్బియన్లు అవ్వటం వల్ల వారు స్త్రీవాదులుగా మారలేదు. లెస్బియన్లలో అనేక మందికి రాజకీయాలంటే ఆసక్తి లేదు. సంప్రదాయవాదులు, ఏ రకమైన రాడికల్ మార్పులని వాళ్ళు కోరుకోలేదు. స్త్రీవాదానికి వచ్చిన బైసెక్సుల్, లెస్బియన్ స్త్రీలు అప్పటికే వామపక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వుండి వర్గం, జాతి, లైంగికత చుట్టూ కట్టిన గోడలని పగలగొట్టటానికి ప్రయత్నిస్తున్నారు. జెండర్, లైంగికత చుట్టూ వున్న సంప్రదాయ భావనల్ని ధిక్కరించి మానసికంగా స్త్రీల విముక్తి అన్న భావనని వాళ్ళు అప్పటికే స్వంతం చేసుకున్నారు.
లెస్బియన్ అయినంత మాత్రాన ఎవరూ స్త్రీవాది కాలేరు. అలాగే రాజకీయాలూ నేర్చుకోలేరు. అణచివేయబడిన వర్గానికి చెందినంత మాత్రాన వాళ్ళు ఆ అణచివేతని తప్పకుండా ప్రతిఘటించాలని కూడా లేదు. అణచివేయ్యబడిన వర్గాల్లో అలా అందరికీ ప్రతిఘటన స్వతః సిద్ధంగా వచ్చేట్లయితే స్త్రీలందరూ (ఈ భూమ్మీద పుట్టిన ప్రతి లెస్బియన్ తో సహా) స్త్రీవాద, స్త్రీల ఉద్యమంలో భాగం పంచుకునే వాళ్ళే. అనుభవం, చైతన్యం, తమంతట తాముగా రాజకీయ దృక్పధాన్ని ఎంచుకోవటం మూడూ కలిసినపుడే ఆయా స్త్రీలు వామపక్ష ఉద్యమాల దారి పట్టారు. సామ్యవాద ఆలోచనా పరుల్లో, పౌర హక్కుల
ఉద్యమంలో, మిలిటెంట్ నల్ల జాతి ఉద్యమాల్లో ఎవరికీ కనపడని తెరవెనుక పనులూ, ఎవరూ చెయ్యని చాకిరీ చేసిన ఈ స్త్రీలు తమకి కూడా న్యాయం కావాలనటానికి, దాన్ని పొందటానికి సిద్ధమయ్యారు. స్త్రీవాద ఉద్యమానికి సిద్ధమయ్యారు. అత్యంత సంసిద్దత, ధైర్యం, ముందు చూపు ఉన్నవారిలో లెస్బియన్లు అప్పుడూ, ఇప్పుడూ కూడా ముందు వరసలో వున్నారు.
నా మొదటి లైంగిక అనుభవానికి ముందే నేను స్త్రీవాది నయ్యాను. నేనప్పటికి ఒక టీనేజేర్‌ని మాత్రమే. స్త్రీల హక్కుల గురించి తెలుసుకునేటప్పటికే నాకు సమలింగ సంబంధాల గురించి తెలుసు. దక్షిణాది అమెరికాలో మత ఛాందసవాదం, జాత్యహంకార వర్ణ వివక్ష కలిసిన సంకుచిత ప్రపంచంలో మా నల్ల జాతి సమూహంలో సమ లైంగికుల గురించి అందరికీ ఎరుక ఉండేది. వారికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండేది. లెస్బియనిజం కంటే పురుషుల మధ్య సంబంధాల పట్ల ఎక్కువ సమ్మతి
ఉండేది. వేరు చెయ్యబడిన మా చిన్న నల్ల జాతి సమూహంలో లెస్బియన్లందరూ వివాహితులే కానీ, తామెవరో వారికి తెలుసు. తమ అసలు రూపం మూసిన తలుపుల వెనుక, రహస్య పార్టీల్లోనూ, హోటళ్లలోనూ ఆవిష్కరించుకునే వాళ్ళు.
లెస్బియన్ గా పేరుపడిన అటువంటి ఒక స్త్రీ నాకు మార్గదర్శకురాలిగా వుండిరది. ఆమెకి తనకంటూ ఒక వృత్తి పరమయిన జీవితం వుండిరది, బాగా చదివేది, ఒక ఆలోచనా పరురాలు, పార్టీలంటే ఇష్టపడేది. నాకు ఆమె అంటే పూజ్య భావం ఉండేది. ఆమె విచిత్రమైన మనిషని మా ఇద్దరి మధ్య ఏర్పడిన బంధం గురించి మా నాన్న ఫిర్యాదు చేస్తే, మా అమ్మ ఎవరి ఇష్ట ప్రకారం జీవించే స్వేచ్ఛ వారికుంది’ అని అయన అభిప్రాయాన్ని వ్యతిరేకించింది. మా ఎదురింట్లో ఒక గే పురుషుడిని మా సందులోని టీనేజీ అబ్బాయిలు గేలి చేసినప్పుడు మా అమ్మ అక్కడికెళ్లి, అతను ఒక బాధ్యతతో మెలిగే వ్యక్తి, అందరి శ్రేయస్సు చూసుకునే వ్యక్తి, మనం అతన్ని గౌరవించి ప్రేమించాలి’ అంటూ వారిని వారించింది.
నాకు స్త్రీవాదం అనే పదం తెలియక ముందే నేను సమలైంగికుల హక్కులకి ప్రచార కార్యకర్తనయ్యాను. నేను లెస్బియన్ నేమోనని మా కుటుంబం చాలా బాధ పడిపోయింది. నేనసలు పెళ్లి చేసుకోనేమోననే బాధ ఆ తర్వాత దాన్ని భర్తీ చేసింది లెండి. నా గుండె ఎటంటే నేనటే వెళ్తానని, నేనొక అచ్చమైన ఫ్రీక్ నని నాకు అప్పటికే తెలుసు. నా మొదటి పుస్తకం నేను స్త్రీలని కాదా?: నల్ల జాతి స్త్రీలు, స్త్రీవాదం రాసేటప్పటికే అన్ని రకాల లైంగిక ధోరణులు (పర లింగ, సమ లింగ, బైసెక్సుల్) స్త్రీలున్న స్త్రీవాద ఉద్యమంలో నేను క్రియాశీలకంగా పని చేస్తున్నాను. అప్పట్లో మమ్మల్ని మేము రాడికల్ అని నిరూపించుకోవటానికి స్త్రీలతో రాజకీయ సంబంధాలే కాక, శారీరక సంబంధాలు కూడా ఏర్పర్చుకోవాలనే వత్తిడి ఉండేది. అయితే అందరూ నేర్చుకున్న పాఠం ఏమిటంటే సామాజిక విలువల బయట మన లైంగిక ఆచరణ ఉన్నంత మాత్రాన, రాజకీయంగా మనల్ని ప్రగతిశీల వాదులుగా మార్చదు. నా మొదటి పుస్తకంపై నల్ల జాతి లెస్బియన్ స్త్రీలు నాపై దాడి చేసినప్పుడు నేను ఖిన్నురాలి నయ్యాను. నా పుస్తకంలో లెస్బియనిజం లేనందుకు నేను సమలైంగికత వ్యతిరేకినని వాళ్ళు నా పై నింద మోపారు. అయితే దాని గురించి లేకపోవటం అన్నది నా హోమోఫోబియాకు చిహ్నం కాదు. నేనా పుస్తకంలో అసలు లైంగికత గురించే మాట్లాడలేదు. అప్పటికి నాకు దాని గురించి మాట్లాడటానికి సంసిద్ధత లేదు. నాకు అప్పటికి దాని గురించి సరయినంత తెలియదు కూడా. తెలిసుంటే ఎంతో కొంత మాట్లాడే దాన్ని. నా మీద ఎవరూ ఆ నింద వెయ్యకుండా ఆపుకోగలిగేదాన్ని.
శక్తి వంతులయిన వాళ్ళు, ఇతరులంటే శ్రద్ధ కలిగిన లెస్బియన్లని చిన్నప్పటినుండీ చూడటం, వారు తెలియటం వల్ల నేను నేర్చుకున్న ప్రధానమైన పాఠం ఏమిటంటే స్త్రీలకి తమ సంతోషం, శ్రేయస్సు కోసం, లైంగిక తృప్తి కోసం కూడా పురుషులపై ఆధార పడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు అని. ఈ జ్ఞానం వల్ల స్త్రీలకి ప్రపంచం కొత్త కోణంలో కనపడిరది. తమ కోరికలకీ, ఇష్టాలకి చోటు కలుగ చేసింది. ఎన్ని కోట్ల మంది స్త్రీలు తమకి లైంగికంగా, భావోద్వేగ పరంగా పురుషులతో సంతోషం లేకపోయినా వాళ్ళు లేకుండా సంతోషకరమైన జీవితం వూహించుకునే శక్తి లేక వారితో ఆధిపత్య సంబంధాల్లో కొనసాగుతున్నారో మనకు తెలియదు. ఏ స్త్రీ అయినా తన జీవితానికి సార్ధకత బయట వారి ఆమోదంతో మాత్రమే లభిస్తుందని అనుకుంటే మాత్రం ఆమె తనని తాను నిర్వచించుకునే శక్తినంతా వేరే వాళ్లకి ధారపోసేసిందన్న మాట. నా చిన్న తనం నుండే లెస్బియన్ స్త్రీలు నన్ను నేను నిర్వచించుకునే చోటుని కల్పించారు.
రాడికల్ లెస్బియన్ స్త్రీలు స్త్రీవాద ఉద్యమానికి ఈ అసాధారణ విజ్ఞతని తీసుకొచ్చారు. ఎక్కడో అరుదుగా ఒక పర లింగ స్త్రీ పురుషులు లేకుండా, ఆయా సంబంధాల్లో లభించే లైంగిక సమర్ధన లేకుండా కూడా సంతోషకరమైన జీవితం గడపొచ్చని సైద్ధాంతికంగా అర్ధం చేసుకున్నప్పటికీ ఆ నమ్మకాన్ని బలపరిచే జీవితానుభవం అటువంటి వారి దగ్గర ఉండదు. పురుషుల ఆమోదంపై తమ జీవితార్ధం ఆధార పడదని అర్ధం చేసుకుని, లెస్బియన్లు కాని స్త్రీలని గుర్తించటానికి వారిని స్త్రీలు గుర్తించిన స్త్రీలు’ అని పిలిచే వాళ్ళం. పురుషులు గుర్తించే స్త్రీలు’ అంటే పురుషులతో తమ రొమాంటిక్ సంబంధాల్లో అడ్డుపడుతున్నాయి అన్న వెంటనే స్త్రీ వాద సూత్రాలని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పక్కకి పడేసే వాళ్ళు. వీళ్ళు స్త్రీల కన్నా పురుషులనే ఎక్కువ బలపరుస్తారు, విషయాలని పురుషుల దృక్పథం నుండి ఎక్కువగా చూస్తారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక విమెన్స్ స్టడీస్ కోర్సు నేను బోధిస్తున్నప్పుడు కొంత మంది రాడికల్ లెస్బియన్ విద్యార్థులు నేను ఇంకా పురుషులతో సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నానని నన్ను నిలదీశారు. క్లాస్ అయిపోయిన తర్వాత కారు పార్కులో ఈ సంఘటన జరిగింది. అప్పుడు నన్ను సమర్ధించిన ఒకే ఒక వ్యక్తి – సెక్స్ పరిశ్రమలో అనేకమంది పురుషులతో సెక్స్‌లో పాల్గొని కూడా తన లెస్బియన్ అస్తిత్వాన్ని నిలుపుకున్న ఒక నల్ల జాతి స్త్రీ – ఈమె ఒక స్త్రీలు గుర్తించిన స్త్రీ. పురుషులతో సెక్స్ లో పాల్గొన్నా, మన ఉద్యమం తోనే ఉంటుంది అని ప్రకటించి నా రాజకీయ నిబద్ధతని స్పష్టం చేసింది.
అనేక మంది స్త్రీలు ఉద్యమం నుండి బయటకి వెళ్లి పోతుండటంతో, స్త్రీవాద రాజకీయాలకి నిబద్ధులుగా ఎలా
ఉండాలన్నది 1980 లలో కీలకమైన చర్చా విషయంగా పరిణమించింది. స్త్రీలకి నెమ్మదిగా హక్కులు లభించటంతో లెస్బియన్ ఆలోచనా పరులు, కార్యకర్తలు ఉద్యమంలోకి తెచ్చిన రాడికల్ అంశాలని, అసలు వారి ఉనికిని, వారు చేసిన పనిని అందరూ మర్చిపోవటం మొదలు పెట్టారు. ఉద్యమంలో అందరికన్నా రాడికల్‌గా, ధైర్యంగా వుండిన లెస్బియన్లలో అనేక మంది శ్రామిక వర్గ స్త్రీలే. వారికి అకడమిక్ రంగంలో ముందుకెళ్లే అవకాశం ఎప్పుడూ లేదు. స్త్రీవాదం మొత్తం అకాడమిక్‌గా మారిపోవటం వల్ల ఆయా యోగ్యతలున్న పరలింగ స్త్రీలకి మాత్రమే, వాళ్ళు అకాడెమీ బయట స్త్రీల ఉద్యమంలో ఏ మాత్రం సమయం వెచ్చించక పోయినా, ఎక్కువ గౌరవం, ఆధారం లభించ సాగాయి.
భిన్నత్వం గురించిన చర్చల్లో, ముఖ్యంగా జాతి, వర్గానికి సంబంధించిన సిద్ధాంతం, ఆచరణ విషయంలో లెస్బియన్ ఆలోచనా పరులు మిగిలిన వారికన్నా తమ దృక్పధాలని మార్చుకోవటానికి ఎక్కువ సంసిద్ధత కనపరిచారు. ప్రధాన స్రవంతి ప్రమాణాల్లో ఇమడకపోవటం వల్ల పీడనకు, దోపిడీకి గురయిన అనుభవం నుండి వచ్చిన అవగాహన వారికి వుండిరది. స్ట్రెయిట్ స్త్రీలలో కన్నా వీరిలోనే తెల్ల జాత్యహంకారాన్ని ప్రశించే ధోరణి ఎక్కువ కనిపించేది. స్ట్రెయిట్ స్త్రీలలో, వాళ్ళు స్త్రీవాదులు అయినా, కాకపోయినా, పురుషులతో తమ సంబంధాలని బలపరుచుకోవటం పైనే ఎక్కువ శ్రద్ధ కనపడేది.
గే హక్కుల కోసం, స్త్రీల హక్కుల కోసం రాడికల్ లెస్బియన్ స్త్రీలు చేసిన సంఘర్షణల వల్ల ఎవరిని ప్రేమించాలి, ఎవరితో శరీరాల్ని, జీవితాలని పంచుకోవాలనే విషయాల గురించి అందరు స్త్రీల స్వేచ్చా విస్తరించింది. స్త్రీవాద ఉద్యమంలో లైంగిక ధోరణులతో సంబంధం లేకుండా నల్ల జాతి స్త్రీలు రేసిజంని ఎదుర్కొన్నట్లు లెస్బియన్ స్త్రీలు హోమోఫోబియా (సమలైంగికతకి వ్యతిరేకత)ని ఎదుర్కోవాల్సి వచ్చింది. స్త్రీవాదులమని చెప్పుకుంటూ హోమోఫోబియాని బలపరిచే వాళ్ళు స్త్రీలందరూ సహోదరిలే అని చెప్పుకుంటూ తెల్ల జాత్యహంకార ఆలోచనని సమర్ధించే వారి లాగానే దారి తప్పిన వాళ్ళు, హిపోక్రాట్లు.
ప్రధాన స్రవంతి ప్రసార మాధ్యమాలు స్త్రీవాద ఉద్యమాన్ని చిత్రించటానికి స్ట్రెయిట్ స్త్రీలనే ఎంచుకున్నారు. ఎంత స్ట్రెయిట్ అయితే అంత మంచిది. గ్లామరస్‌గా ఉంటే పురుషులకి అంత నచ్చుతుంది కూడా. స్త్రీలు గుర్తించిన స్త్రీలు, వాళ్ళు స్ట్రెయిట్ కావచ్చు, బైసెక్సువల్ కావచ్చు, లెస్బియన్ కావచ్చు – మగవాళ్ల ఆమోదాన్ని ఎప్పుడూ మా జీవితాల్లో ప్రధాన మైందిగా గుర్తించలేదు. అందువల్లే మేమంటే పితృస్వామ్యానికి చాలా భయం. మా వంటి స్త్రీలు తమ చూపుని, కోరికని సెక్సిస్టు పురుషుల నుండి పక్కకి తిప్పేసుకుంటారు. పితృస్వామ్య మైండ్ సెట్‌తో ఆలోచించే లెస్బియన్ల వల్ల పితృస్వామ్యానికి ఏ భయం ఉండదు.
ఈ రోజుల్లో స్ట్రెయిట్ స్త్రీలలాగే, అత్యధిక శాతం లెస్బియన్లు కూడా రాడికల్ రాజకీయాల్లో ఉండట్లేదు. స్త్రీవాద
ఉద్యమంలో క్రియాశీలంగా పని చేసిన లెస్బియన్ ఆలోచనా పరులకి లెస్బియన్ స్త్రీలు కూడా స్ట్రెయిట్ స్త్రీల లాగే సెక్సిస్టు భావజాలం కనపర్చటం ఇబ్బందిగా పరిణమించింది. స్త్రీవాదం సిద్ధాంతమయితే, లెస్బియనిజం ఆచరణ అనే ఆదర్శం వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చేటప్పటికి తెల్ల జాతి లెస్బియన్ స్త్రీలు జాత్యహంకార పరిమితుల్లో – ఒకరు ఆధిపత్యం చెలాయిస్తే, మరొకరు లోబడి ఉండాలనే – ఏర్పర్చుకున్న సంబంధాలు స్త్రీ పురుషుల మధ్యలో ఏర్పర్చుకున్న సంబంధాలకంటే పెద్ద భిన్నంగా ఏర్పడలేదు. ఒకరి క్రింద ఒకళ్ళు కాకుండా ఇద్దరికీ సంతృప్తి నిచ్చే సంబంధాలు ఏర్పర్చుకోవటం స్త్రీ పురుష సంబంధాల్లో ఎంత కష్టమో ఇద్దరు స్త్రీల మధ్యలో కూడా అంతే కష్టం. లెస్బియన్ సంబంధాల్లో హింస జరుగుతుందని తెలియటం స్త్రీ పురుషుల మధ్యే కాదు, ఇద్దరు స్త్రీల మధ్య సమానత్వం కూడా అంత తేలికేమీ కాదని సూచించింది.
లెస్బియన్ స్త్రీవాదులు స్ట్రెయిట్ స్త్రీవాదులతో పోలిస్తే సాడో మాసోషిస్టిక్ లైంగిక చర్యల్లో తాము పాల్గొనటం గురించి మాట్లాడటానికి సిద్ధ పడతారు. లైంగిక సంప్రదాయ వాదులు, స్ట్రెయిట్ స్త్రీలు కావచ్చు, లెస్బియన్లు కావచ్చు, ఇటువంటి లైంగిక చర్యలని, అంగీకారంతో కూడినవైనా సరే, అనుచితమయినవి గానూ, స్వేచ్చ గురించి స్త్రీవాద ఆదర్శాలకి ద్రోహం చేసేవిగానూ చూస్తారు. ఇటువంటి తీర్పులు, ప్రతి స్త్రీకి తమకి సంతృప్తి నిచ్చే లైంగిక ఆచరణని ఎంచుకునే హక్కుని గౌరవించక పోవటం – రెండూ కూడా స్త్రీవాద ఉద్యమ స్ఫూర్తిని దెబ్బ తీసేవే. ఇద్దరు స్త్రీలు కలిసి లైంగికంగా ఏమి చేస్తారని అనుకునే వాళ్ళు, జీవితంలో ఎప్పుడూ ఇంకొక స్త్రీని కోరుకోని వాళ్ళల్లో చాలా మంది స్త్రీలు ఇతర స్త్రీలకి లెస్బియన్లు, బైసెక్సువల్‌గా వుండే హక్కు వుండటాన్ని సమర్థిస్తారు. అటువంటి సమర్ధననే తమకి నచ్చిన లైంగిక ఆచరణని పాటించే హక్కుకి కూడా ఇవ్వొచ్చు. ఇటువంటి సమర్ధన ఇవ్వక పోవటానికి ఒక ప్రధాన కారణం పైకి కనిపించని హోమోఫోబియా. ఏ స్త్రీ అయినా లెస్బియన్లు ఇతరులకి ఆమోద యోగ్యమయిన, సౌకర్యవంతమయిన నైతిక ప్రమాణాలకు లోబడి వుండాలని వాదించినప్పుడు అది హోమోఫోబియాని సమర్ధించటమే అవుతుంది. ఆ తర్వాత స్ట్రెయిట్ స్త్రీలు కూడా సాడో మాసోషిస్టు అనుభవాల గురించి మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు వారి పైన వచ్చిన విమర్శ, అది కేవలం లెస్బియన్ ఆచరణ అనుకున్నప్పుడంత కఠినంగా రాలేదు.
హోమోఫోబియాని ఎదిరించటం ఎప్పుడూ స్త్రీవాద ఉద్యమంలో ఒక భాగంగానే ఉంటుంది. స్ట్రెయిట్ స్త్రీలు లెస్బియన్ స్త్రీల పట్ల అమర్యాదగా వుండి వాళ్ళు తమకి లొంగి ఉండాలి అనుకున్నంత వరకూ స్త్రీవాద సహోదరిత్వం సాధ్య పడదు. ముందు చూపున్న స్త్రీవాద ఉద్యమం లెస్బియన్ స్త్రీల క్రియాశీలతని పూర్తిగా గుర్తిస్తుంది. రాడికల్ లెస్బియన్ స్త్రీలు, స్త్రీవాద సిద్ధాంతం, ఆచరణ రెండిరటినీ కూడా పరలింగత్వం (హెటిరో సెక్సిజం) విధించిన పరిమితుల నుండి వదులు చేసి, లైంగిక అస్తిత్వం, ధోరణులతో సంబంధం లేకుండా అందరు స్త్రీలకి తమ ఇష్టాలకి అనుగుణంగా ఉండగలిగే స్వేచ్చని కల్పించారు. ఆ వారసత్వాన్ని గుర్తించి, ప్రేమగా పరి రక్షించుకుందాం!