ఎప్పుడూ చిరునవ్వు చెదరని వదనం, రోగికి ధైర్యాన్నిచ్చే మాటతీరు, మృదు మంజుల కంఠస్వరం… పిల్లలైనా పెద్దలైనా ఆరోగ్య సమస్యలతో ఒక డాక్టర్ దగ్గరకెళ్ళేటపుడు ఆ వ్యక్తిలో ఏయే లక్షణాలు ఉంటే బావుంటుందని కోరుకుంటారో అవన్నీ డాక్టర్ కట్టా సునీత గారిలో కనిపిస్తాయి. హోమియో వైద్యంలో ఖ.ఈ. చేసి నిరంతర అధ్యయనంతో తన ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటూ, నేడు ప్రతిరంగంలోనూ కనిపిస్తున్న వ్యాపారధోరణికి భిన్నంగా కనిపించే డాక్టర్ సునీత శ్రీనగర్ కాలనీ దగ్గరున్న కృష్ణానగర్‌లో తమ ఇంటిలోనే క్లినిక్ నడుపుతూ గృహిణిగా తన బాధ్యతను, డాక్టర్‌గా తన వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. ఆధునిక స్త్రీ అంతరంగాన్ని ఒక సమర్ధురాలైన డాక్టర్ దృష్టికోణం నుండి చూడాలనే ప్రయత్నం క్రింది ప్రశ్నోత్తరాలుగా రూపుదిద్దుకుంది.
నేను ఖమ్మంలో పుట్టానండి. అమ్మ గృహిణి. నాన్నగారు సివిల్ కంట్రాక్టర్‌గా పనిచేసేవారు. వాళ్ళ సంతానంలో నేనే పెద్దదాన్ని. నా తర్వాత చెల్లెలు, తమ్ముడు. స్కూలు చదువులు కరీంనగర్‌లో పూర్తిచేసుకుని తర్వాత హైదరాబాద్‌లో చదువుకున్నాం. మా నాన్నగారిని స్త్రీవాదిగా చెప్పుకోవచ్చండి. మా కుటుంబ వాతావరణంలో నిజానికి పెళ్ళికున్నంత ప్రాముఖ్యత చదువుకి లేదు. ఇరవై సంవత్సరాలలోపే మా బంధువుల్లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు జరిగిపోయేవి. మా నాన్నగారు మాత్రం ఆడపిల్లకి ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని, పెళ్ళి కన్నా చదువు ముఖ్యమని భావించేవారు. అమ్మకి కూడా చాలా స్వేచ్ఛ ఉండేది ఇంటి విషయాల్లో. అలా ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగాం. కోరుకున్న చదువు చెప్పించారు. మా కాలేజిలో ‘మేల్ డామినేషన్’ బాగా ఉండేదండి. ఆడపిల్లల్లో చదువుకి అంతగా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్లు ఉండేవారు కాదు. చాలా ‘కాజువల్’గా, పెళ్ళి కుదిరేవరకే చదువు అన్నట్టు ఉండేవారు చాలామంది. మగపిల్లలు కూడా ‘వీళ్ళేం చదువుతార్లే’ అన్నట్టే చూసేవారు. ఇప్పటికీ నా సహాధ్యాయుల్లో చాలామంది అమ్మాయిలు డిగ్రీ తీసుకుని కూడా ప్రాక్టీసు చెయ్యకుండా ఇంట్లోనే ఉండిపోయారు.
ముందే చెప్పా కదండి. నేను పెరిగిన వాతావరణాన్ని బట్టి నా చదువుకీ, వృత్తికీ నేను చాలా ప్రాధాన్యత ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాక్టీసుని నిర్లక్ష్యం చేయలేదు. అప్పట్లో అంటే 20 సంవత్సరాల క్రితం హోమియో వైద్యానికి అంత విలువిచ్చేవారు కాదు. కొంత చులకనగా చూసేవారు. ఈ వైద్యం అసలు పనిచెయ్యదనో, లేకపోతే చాలా మెల్లిగా పనిచేస్తుందనో, ఒకరకంగా పనికిరాని విధానంగా జమకట్టేవారు చాలామంది. నిజానికి సరైన మందు ఇవ్వాలంటే రోగలక్షణాలను, రోగి లక్షణాలను సరిగ్గా గమనించి ‘డయాగ్నసిస్’ సరిగ్గా చెయ్యాలి. అదే జరిగితే కొన్ని రకాల కాన్సర్స్‌ని కూడా నయం చెయ్యచ్చు.
సవాళ్ళు అంటే ముఖ్యంగా పేషెంట్‌లో ‘సరైన మందు ఇక్కడ దొరుకుతుంది, నా వ్యాధి నయం అవుతుంది’ అనే నమ్మకాన్ని ఏర్పరచడం. దీన్ని నేను తేలికగా ఎదుర్కోగలను. రెండో సవాలు ఏమిటంటే కన్సల్టేషన్ కావలసిన పేషెంట్స్ ఎవరైనా కొంత పరిచయం ఏర్పడగానే, ఫోన్ చేసి, ‘క్లినిక్ సమయమా, డాక్టర్ ఇంటిలో వ్యక్తిగతమైన పనుల్లో సతమతమై ఉండే సమయమా, విశ్రాంతి సమయమా’ అని కూడా చూడకుండా ఫోనులోనే వ్యాధి లక్షణాలు చెప్పేసి, ‘మనుషుల్ని పంపిస్తాం, మందులిచ్చి పంపిస్తారా?’ అని అడుగుతూ ఉంటారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. బంధుమిత్రుల్లో కూడా ఈ విధంగా వ్యవహరించేవాళ్ళు ఉంటూంటారు. ఒక డాక్టరుగా, ఒక గృహిణిగా రెండు పార్శ్వాలనూ సమన్వయం చేసుకుంటూ ఉండే వ్యక్తికి సమయం ఎంతో విలువైనది. ఒక ప్రణాళిక ప్రకారం నా దినచర్య నడుస్తుంది. దాన్ని ఇతరులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పైగా టెలిఫోనిక్ కన్సల్టేషన్స్ సరైన ఫలితాలను సంపూర్ణంగా ఇవ్వలేవు. ఇదే నేను ముఖ్యంగా ఎదుర్కొంటున్న సవాలు.
మావారు మృదుస్వభావి అనే చెప్పాలి. ఆధిపత్య ధోరణి చూపడం గాని, డిమాండ్ చెయ్యడం గాని ఉండదు. పిల్లల చదువు విషయాలు, ప్లానింగు అంతా నేనే చూసుకుంటాను. మిగిలిన విషయాల్లో ఆయన సహకరిస్తారు.
సొంత అస్తిత్వం గురించి బాధ లేదండి. ఎందుకంటే నా వృత్తి, ప్రవృత్తి ఒకటే. ఒక హోమియో డాక్టర్‌గా సమాజానికి సేవ చేస్తూ నాకు ఆర్థిక స్వేచ్ఛని పొందాలనుకున్నాను. నా వృత్తి ద్వారా అదే చేస్తున్నాను. కాకపోతే సొంత సమయం అంటూ లేదని కొంత లోటు ఫీలవుతాను. ఇష్టమైన పుస్తకాలు చదువుకున్నెందుకు, ఏవైనా కొత్త ప్రదేశాలు చూడడానికి సమయం దొరకదు. వత్తిడి ఎంత ఎక్కువ అనిపించినా హౌస్‌వైఫ్‌గా ఉండిపోవాలని ఎప్పుడూ అనిపించలేదండి. నా పనిలో నిమగ్నమవడం ద్వారా నేనెంతో తృప్తిని పొందుతాను. అయితే నా వృత్తి వల్ల పిల్లల పెంపకం ఎఫెక్ట్ అయిందని మాత్రం కొంచెం బాధ కలుగుతుంది. చిన్నపాప పుట్టాక, ఇద్దరు పిల్లల్నీ చూసుకోవడంలో కొంత లోటు చేశానని అనిపిస్తుంది. ఒకోసారి క్లినిక్‌లో పేషెంట్స్‌ని చూస్తుంటే గదిలో పాప ఏడుస్తూ ఉండేది. పిల్లలకి ఇవ్వవలసినంత సమయం ఇవ్వలేకపోయాననిపిస్తుంది. ఒకప్పుడు ఇంటిపని పూర్తిగా ఆడవాళ్ళదే అనుకునేదాన్నండి. మన సమాజంలో సర్వత్రా ఉన్న భావమే నన్నలా అనుకునేలా చేసింది. మావారు కూడా కొంత సాయం చేస్తే బావుండునని ఉండేది. ఇపుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆదర్శవంతమైన సమాజం ఎలా ఉండాలి అనే ప్రశ్న వస్తే ఇంటిపని ఇద్దరూ పంచుకోవాలని, అలా ఉండడం వల్ల స్త్రీలుకూడా తమ వృత్తిని గాని, ఉద్యోగాన్ని గాని మరింత సమర్ధంగా సులువుగా కొనసాగించగలుగుతారని అనిపిస్తుంది. తమ అస్తిత్వాన్ని నిలుపుకోగలుగుతారని ఆశ కలుగుతుంది. ఎందుకంటే స్త్రీ సహజంగా ‘మల్టీ టాస్కింగు’ చేయగలుగుతుంది. అందువల్ల ఎక్కువ అలసటకు గురౌతుంది. మాతృమూర్తిగా పిల్లల విషయంలో ఎక్కువ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుంది. ఆమెకు భర్త సహకారం దొరికి, ఇంటిపనినుంచి కొంత వెసులుబాటు దొరికితే సమాజంలో మంచి మార్పు వస్తుంది.
నా దృష్టిలో మహిళా సాధికారత అంటే మహిళలు బాగా చదువుకుని, ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడాలండి. చదువు పెళ్ళికి అర్హత కోసం అన్నట్టుగా ఏదో చదువుకుని పెళ్ళయ్యాక ఇంటికే అంకితమై పోవడం సరికాదు. నాతో పాటు చదువుకున్నవాళ్ళలో నాలాగా వృత్తి మీద ఇంత శ్రద్ధ పెట్టినవాళ్ళు చాలా కొద్దిమంది. నా అంకితభావం వల్ల, కృషి వల్ల ఎన్నో కుటుంబాలని ‘హోమియో ఫామిలీస్’గా మార్చగలిగాను. ఇప్పటికీ ఎంతో చెయ్యాలనే ప్రణాళికలున్నాయి. ఒక హోమియో హాస్పిటల్ నెలకొల్పాలని ఉంది. ప్రొఫెషన్ విషయంలో నేను చెయ్యాలనుకున్నవి ఎన్నో చెయ్యలేకపోయాను. ఎందుకంటే స్త్రీగా నాశక్తి, సంపాదన రెండూ ఇంటికే ఎక్కువగా వినియోగించడం వల్ల. అయితే ఒక సంతృప్తి – పిల్లలిద్దర్నీ సెల్ఫ్ సఫిషియంట్‌గా పెంచాను. స్త్రీపురుషులిద్దరూ పనులు పంచుకుంటే బావుంటుంది గాని, స్త్రీలు ఒకరి మీద ఆధారపడి ఉండిపోకూడదు. తమకవసరమైన పనులన్ని తామే చేసుకోగలిగేలా వాళ్ళని తల్లిదండ్రులు పెంచాలి. చదివించాలి. పెళ్ళికన్నాముందు చదువుకి సార్థకత గురించి ఆలోచించాలి. మగవాళ్ళు భార్య విషయంలో అయినా, పిల్లల విషయంలో అయినా పనిని పంచుకుందుకు ముందుకు రావాలి. అప్పుడే మహిళా సాధికారత సిద్ధిస్తుంది. ఎన్నో ప్రతికూలతల్ని ఎదుర్కుంటూ చదువుకుంటున్న ఆడపిల్లలకి సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి, వాళ్ళనే టార్గెట్ చేసి యాసిడ్ ఎటాక్స్, ఇతర హింసాత్మక చర్యలు చేపట్టేవారిని ప్రభుత్వం, సమాజం తీవ్రంగా శిక్షించాలండి. మెచ్యురిటీ లేని ‘టీనేజ్ లవ్’ సినిమాలకి అనుమతి ఇవ్వకూడదు. ప్రకృతిలో సగమైన స్త్రీలపై దాడుల్ని ఖండించాలి, అరికట్టాలి. వీటికి మూలకారణాన్ని కనిపెట్టి నిర్మూలించాలి. మీకే కృతజ్ఞతలు చెప్పాలి. ఇలా నా గురించి, నా భావాల గురించి మాట్లాడడం వల్ల నా గురించి నేనే తెలుసుకున్నట్టైంది.
ఇంటర్వ్యూ :వారణాసి నాగలక్ష్మి
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
April 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Pingback: పుస్తకం » Blog Archive » రచయిత్రి వారణాసి నాగలక్ష్మి