భారతీయ శిక్షాస్మృతిలోని 498కి అదనంగా 498ఏ చేర్చేవరకు అత్తింట హింసకు గురవుతున్న మహిళకు ఊరటనిచ్చే సెక్షనేదీ లేదు. వివాహిత స్త్రీలు మెట్టినింట అనుభవించే హింసవల్ల ఎంతో మంది స్త్రీలు మరణాలపాలయ్యారు, అవుతూనే వున్నారు. చిన్ని ఆశాకిరణంలాంటి ఈ చట్టం దుర్వినియోగమౌతోందని పెద్ద ఎత్తున విష ప్రచారం జరుగుతోంది. భారతదేశంలో అన్ని చట్టాలు దుర్వినియోగమౌతున్నాయని ఎవరూ గొంతెత్తడం లేదు. హింసలో మగ్గుతున్న మహిళలు ఈ చట్టాన్ని వినియోగించుకోవడాన్ని దుర్వినియోగమవడం ఎంత దుర్మార్గమో ఆలోచించండి. దీనికి మంచి ఉదాహరణ ఇటీవల రాజ్యసభ పిటీషన్‌ల కమిటీ డిసెంబరు 27న అన్ని జాతీయ స్థాయి వార్తా పత్రికలలోను ప్రకటించిన నోటిఫికేషన్. ఢిల్లీకి చెందిన డా.అనుపమ్ సింగు అనే వ్యక్తి ఐపిసి 498ఏ దుర్వినియోగమౌతుందని, స్త్రీలు తమ వ్యక్తిగత అవసరాల కోసం, సౌకర్యాల కోసం, దీనిని దుర్వినియోగం చేస్తున్నారని ఇక్కడ రాయడానికి సాధ్యంకాని అసభ్యభాషలో ఒక పిటీషన్‌ని రాజ్యసభకివ్వడం, దానిని యధాతథంగా స్వీకరించి ఐపిసి 498ఏ సవరణకోసం పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. దేశ అత్యున్నత శాసనవ్యవస్థ, పెద్దల సభ అసభ్యకర పదజాలంలో దేశ మహిళల్ని కించపరిచిన పిటీషన్‌ని ముందు వెనుకా చూడకుండా స్వీకరించి, పేపర్ ప్రకటన కూడా ఇవ్వడంద్వారా జనాభాలో సగ భాగాన్ని అవమానించింది. దీనిపై భూమిక చాలా తీవ్రంగా ప్రతిస్పందించి నగరంలోని మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి ధర్నాచౌక్‌లో నల్ల వస్త్రాలు ముఖానికి కట్టుకుని తమ నిరసనని, వ్యతిరేకతని తెలియజేసింది. పత్రికా గోష్టి నిర్వహించి ఐపిసి 498ఏ నేపథ్యాన్ని, హింసలో మగ్గుతున్న స్త్రీలకు దాని అవసరం గురించి వివరించింది. తన నిరసన పిటీషన్‌ని రాజ్యసభకి పంపించింది. 23వ తేదీని ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి స్త్రీల సంఘాలు, సంస్థల సమావేశంలో పాల్గొని, ఈ సమావేశానికి ఆహ్వానించిన రాజ్యసభ ప్రతినిధికి నేరుగా తమ వాదాన్ని, నిరసనని తెలియచేసింది. ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టం 2005ను సక్రమంగా, నిజాయితీగా, నిబద్ధతతో అమలు చేసిన నాడు ఐపిసి 498 ఏ అవసరం బాధిత మహిళలకు వుండదు. గృహహింస నిరోధక చట్టం వచ్చి నాలుగేళ్ళయినా మహిళలపై హింస పెచ్చు మీరిందేకానీ తగ్గు ముఖం పట్టిన దాఖలాలు లేవు. జాతీయ నేరాల చిట్టానే దీనికి రుజువులు. ఐపిసి 498ఏనిగాని, మరే చట్టాన్ని కాని దుర్వినియోగం చేయగల స్థితిలో మహిళలుండి వుంటే వారిపై ఇంత హింస, ఇన్ని నేరాలు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి సమాధానాలు కావాలి? – ఎడిటర్ వివాహిత మహిళలపై హింసకి వ్యతిరేకంగా వచ్చిన చట్టం డబ్బుకోసం భార్యని భర్తే కాకుండా అతని బంధువులు, తల్లీ తండ్రి, ఆడపడుచులు హింసిస్తున్న సంఘటనలు మనకు ప్రతిరోజూ కోకొల్లలుగా కన్పిస్తున్నాయి. ఇది సర్వసాధారణమైపోయింది. కొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్యకు వచ్చిన కొత్త కోడలు జీవితం ఇలాంటి మనుషుల మధ్య దుర్భరమై పోతుంది. వారి క్రూరత్వం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ శారీరక క్రూరత్వం, మానసిక క్రూరత్వం అమానుషమైనదైనప్పటికీ, దానికి తగిన శిక్ష చట్టాలలో ఇంతకు ముందు లేదు. ఈ అవసరాన్ని గుర్తించి శాసనకర్తలు భారతీయ శిక్ష్మాస్మృతిలో కొత్త నిబంధనని (498.ఏ) పొందుపరిచారు. పెళ్ళైన యువతి పట్ల ఆమె భర్తగానీ అతని బంధువులు గానీ క్రూరంగా వ్యవహరించినప్పుడు అది నేరమవుతుంది. వాళ్ళు శిక్షార్హులు అవుతారు. భర్తగానీ, ఆమె బంధువులు గానీ ఉద్దేశ్యపూర్వకంగా చేసిన చర్యల వల్ల పెళ్ళైన యువతి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించినప్పుడు ఆమె శరీరానికి, జీవితానికి తీవ్రమైన హాని కలిగించే పరిస్థితులు కల్పించినప్పుడు అది క్రూరత్వమవుతుంది. చట్ట వ్యతిరేకమైన డిమాండు చేస్తూ ఆమెను గానీ, ఆమె బంధువులుగానీ, కట్నం గానీ ఇతర కోరికలు గానీ తీర్చమని ఒత్తిడి చేసినప్పుడు దానిని క్రూరత్వమంటారు. ఈ నేరం ఋజువు కావాలంటే…. ఆమెకు పెళ్ళైందని, ఆమె హింసించబడిందని, ఆ హింస (క్రూరత్వం) ఆమె భర్తచేగానీ అతని బంధువులచే గానీ జరిగిందని ఋజువు చేయాల్సి వుంటుంది. ఈ నిబంధన కింద కేసుకును ఈ స్త్రీ బతికి వున్నప్పుడు గానీ, చనిపోయినప్పుడు గానీ పెట్టవచ్చు. ఆమె వైవాహిక జీవిత కాలపరిమితితో సంబంధం లేదు. ఈ నేరం కాగ్నిజబుల్ నేరం. ఈ నేరం గురించిన సమాచారం పోలీసులకి అందిన వెంటనే వాళ్ళు దర్యాప్తు ప్రారంభించవచ్చు. ఈ సమాచారాన్ని ఆమె రక్త సంబంధీకులుగానీ, ప్రభుత్వ ఉద్యోగి గానీ, ఆ స్త్రీ గానీ పోలీసులకి అందజేయవచ్చు. ఇది నాన్ బెయిలబుల్ నేరం. అంటే బెయిల్ ఇవ్వడమనేది మేజిస్ట్రేట్ విచక్షణాధికారం పై ఆధారపడి ఉంటుంది. ఈ నేరాలని ప్రథమ శ్రేణి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గానీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గానీ విచారిస్తారు. కోర్టులు నేరుగా ఫిర్యాదులను స్వీకరించవచ్చా ? పోలీసుల చార్జిషీట్‌తో నిమిత్తం లేకుండా, కోర్టులు ఆమెగానీ, ఆమె తల్లిదండ్రులు గానీ, అన్నదమ్ములుగానీ, అక్కాచెల్లెళ్ళు గానీ, మేనత్తలు గానీ, మేనమామలు గానీ ఫిర్యాదు చేసినప్పుడు విచారిస్తాయి. కోర్టు అనుమతించినప్పుడు ఆమె రక్త సంబంధీకులు కూడా ఫిర్యాదు దాఖలు చేయవచ్చు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags