గృహహింస నిరోధక చట్టం 2005

భారతీయ సమాజంలో కుటుంబానికి చాలా ప్రముఖమైన స్థానం ఉంది. ఉమ్మడి కుటుంబాల స్థానే వ్యక్తి కుటుంబాలు లేదా న్యూక్లియర్‌ కుటుంబాలు వచ్చాయి. ఉమ్మడి కుటుంబాలలో మహిళలు ఎన్నో ఆంక్షలను, అడ్డంకులను ఎదుర్కోవాల్సి వచ్చేది. వ్యక్తి స్వేచ్ఛకి అవకాశం వుండేది కాదు. స్త్రీల ఆకాంక్షలకు, ఆలోచనలకు విలువ ఉండకపోగా వారి మీద వివిధ స్థాయిల్లో హింస అమలవుతుండేది. పెళ్ళయి, పుట్టి పెరిగిన ఇంటిని వదిలిపెట్టి, అత్తింట అడుగుపెట్టిన కోడలికి ఆరళ్ళు స్వాగతం చెప్పేవి. ఇంటి గుట్టు బయట పెట్టకూడదంటూ అత్తింట ఎన్ని బాధలు పడ్డా మౌనంగా భరించాలి తప్ప ఎవరికీ చెప్పుకోకూడదని. ఇంటి నాలుగు గోడల మధ్య జరిగేవన్నీ వ్యక్తిగతమైనవని, భార్యని దండించే హక్కు భర్తకున్నదని ప్రచారం చెయ్యడం సర్వసామాన్యం. ఆడపిల్ల అత్తింటికి వెళ్ళేముందు ఇలాంటి నీతుల్ని బోధించి పంపడం సంప్రదాయమైంది. అందుకే భర్త తిట్టినా, కొట్టినా, సంసారం పట్టించుకోకపోయినా భార్య మౌనంగా భరిస్తుంది. కుటుంబంలో ఎంత భయంకరమైన హింస జరిగినా, తన ప్రాణాలకు ముప్పు ఏర్పడినా సరే స్త్రీలు బయటకు రాకుండా హింసను అనుభవిస్తుంటారు.
కుటుంబాల్లో జరిగే హింసని నేరంగా గుర్తించాలని, దానికోసం ఒక చట్టం చేయాలని మహిళా సంఘాలు ఎప్పటినుండో కోరుతున్నాయి. దానికోసం ఉద్యమాలు చేసారు. వీటిఫలితంగానే మొట్టమొదటిసారి ప్రభుత్వం గృహహింసని నేరంగా గుర్తించి గృహహింస నిరోధక చట్టం 2005ని తీసుకొచ్చింది. జమ్ము, కాశ్మీర్‌ తప్ప దేశమంతా ఈ చట్టం పరిధిలోకి వస్తుంది. ఇది ఒక సివిల్‌ చట్టం. నేరం చేసిన వాళ్ళను దండించడం కాకుండా బాధితులకు (స్తీలకు) ఉపశమనం కల్పించేదిశగా ఈ చట్టం ఏర్పడింది.
తన కుటుంబానికి సంబంధించినవారు, తన కుటుంబంలోని మగవారు (భర్త /బావ/మరిది/ అన్నదమ్ములు/మామ/ కొడుకు/అల్లుడు/తండ్రి) జరిపే ఎటువంటి హింస నుంచైనా  మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టం ఏర్పాటు చేయటం జరిగింది.
ఈ చట్టం మహిళలకు ఎక్కడైతే రక్షణ కొరవడిందో, తను ఎక్కడైతే హింసకు గురవుతుందో అక్కడినుంచే చట్టం సహాయంతో పోరాటం సాగించే హక్కు కల్పించింది. అంటే స్త్రీకి స్థానబలం కల్పించింది. ఇది గొప్ప వెసులుబాటు.
ఇది ఒక సివిల్‌ చట్టం అయినప్పటికీ పకడ్బందీ అమలుకోసం నేరన్యాయవ్యవస్థకు అమలు బాధ్యత పొందుపరచడమైనది.  వైవాహిక జీవితంలో అంటే సున్నితమైన బాంధవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని  పోలీస్‌ పాత్ర పరిమితం చేస్తూ మెజిస్ట్రేట్‌  కుటుంబ పెద్దగా ఆ భర్తకు / మగవారికి సంబంధించి జరిగిన తప్పును ఎత్తిచూపి సరిదిద్దుకోమని సూచించి, భార్య పిల్లల్ని తల్లిని / స్త్రీని సరిగ్గా చూసుకోమని ఆజ్ఞాపించి – అట్టి ఉత్తర్వులు అమలుపరచని పక్షంలో రక్షణ ఉత్తర్వుల ధిక్కారాన్ని మాత్రం నేరంగా పరిగణించి – శిక్షించే అధికారం కల్పించింది ఈ చట్టం. ఈ చట్టం ద్వారా మహిళలు మరియు పిల్లలు (ఆడ, మగ మగవారైతే 18 సం||లోపు) లబ్ధిదారులు.
కుటుంబ హింస అంటే…
ఒక వ్యక్తితో కుటుంబ సంబంధంలో ఉండి అతని వల్ల హింసకు గురవడం కుటుంబ హింస కిందికి వస్తుంది.
ఈ హింస చాలా రకాలుగా ఉంటుంది. మహిళలు రోజువారీ జీవితంలో అనేక హింసల్ని ఎదుర్కొంటూ వుంటారు. అవేమిటంటే-
ు    శారీరక హింస అంటే శరీరానికి నొప్పి, హాని, గాయం చెయ్యడం, ప్రాణాలకు హాని తలపెట్టడం, కొట్టడం, తన్నడం, నెట్టడం – అనగా శరీరానికి హాని, నష్టం కలిగించే చర్యలన్నీ శారీరక హింస కిందికి వస్తాయి.
ు    లైంగిక హింస అంటే బలవంతంగా సంభోగానికి ప్రయత్నించడం, ఆమెకు ఇష్టంలేకుండా లైంగిక సంబంధానికి బలవంతపెట్టడం, ఆమె గౌరవానికి భంగం కలిగించే లైంగిక చర్యలు లైంగిక హింస కిందకి వస్తాయి.
ు    మాటల, భావోద్రేక హింస లేదా మానసిక హింస అంటే అవమానకరంగా మాట్లాడటం, హేళన చేయడం, చిన్నబుచ్చడం, పిల్లలు పుట్టలేదని నిందించడం, మగపిల్లాడిని కనలేదని వేధించడం, బాధితురాలికి ఇష్టమైన వ్యక్తుల్ని శారీరకంగా హింసిస్తానని అదేపనిగా బెదిరించడం ఇవన్నీ మానసిక హింస కిందకు వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె మనస్సును నొప్పిస్తూ, క్షోభకు గురిచెయ్యడం.
ు    ఆర్థిక హింస – ఆర్థికమంటే డబ్బు లేదా వనరులు – కుటుంబ నిర్వహణకు అవసరమైన డబ్బు భార్యకివ్వకపోవడం, చట్టప్రకారం హక్కుగా పొందిన వాటిమీద ఆమెకు హక్కు లేకుండా చెయ్యడం అంటే సాంప్రదాయంకానీ, కోర్టు ఉత్తర్వుల ద్వారా గానీ ఆమెకు చెందిన నగదు, వనరులను ఆమెకు దక్కకుండా చెయ్యడం, స్త్రీధనం దక్కకుండా చెయ్యడం, ఇంటి అద్దె చెల్లించకపోవడం, ఇంటి నుంచి గెంటివేయడం ఆమె ఆదాయాన్ని గుంజుకోవడమేకాక అదనపు కట్నం తెమ్మంటూ వేధించడం ఇవన్నీ కూడా ఆర్థిక హింస లేదా వేధింపుల కిందకు వస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మహిళలు / పిల్లలకు సంబంధించి ఆ కుటుంబంలో మగవారి ద్వారా జరిగే ఎలాంటి మానవ హక్కుల ఉల్లంఘన అయినా కూడా గృహహింస అవుతుంది. భర్తే కాకుండా ఇతర సంబంధీకుల ద్వారా కూడా.
గృహహింస నిరోధక చట్టం కింద  మహిళలకు రక్షణ చేకూర్చే సంస్థలు
కుటుంబంలో శారీరక, మానసిక, లైంగిక, భావోద్వేగ లేక ఆర్థిక వేధింపులకు గురయ్యే మహిళలకు రక్షణ చేకూర్చడానికి ఈ చట్టం చక్కని ఏర్పాట్లు చేస్తూ తత్‌సంబంధిత అధికారులకు ఉత్తర్వులను జారీ చేసింది. బాధిత మహిళలకి అవసరమైన సంస్థలు, సహాయం చేసే సంస్థలూ, వ్యక్తులూ వున్నారు. రక్షణాధికారులు, సర్వీస్‌ ప్రొవైడర్లు, షెల్టర్‌ హోమ్స్‌, కౌన్సిలర్‌లు, పోలీసులు గృహహింసను అనుభవిస్తున్న స్త్రీలు ఈ సంస్థలూ, వ్యక్తుల ద్వారా ఉపశమనం పొందవచ్చు.
రక్షణాధికారులు : కుటుంబహింస నిరోధక చట్టం సక్రమంగా అమలవ్వడంలో ముఖ్య పాత్ర పోషించేది రక్షణాధికారులే. బాధితులను రక్షించాల్సిన వాళ్ళు కాబట్టి రక్షణాధికారులని వీరిని పిలుస్తున్నారు.
బాధితురాలికి తప్పనిసరిగా చట్టపరమైన సహాయం గురించి ఉచిత న్యాయసేవలు, ఆర్థిక సహాయం గురించి, పిల్లల కస్టడి గురించి, ఆశ్రయం అందించే సంస్థల గురించి వైద్యసహాయం గురించి, ఇతర సేవలను గురించి సమాచారం పొందే హక్కు ఉంది.  పై సమాచారాలను బాధితురాలికి అందజేయడం పి.ఓ. ప్రధాన బాధ్యత.
రక్షణాధికారుల విధులు: ఏదైనా ఒక ఇంటిలో కుటుంబహింస జరుగుతున్నట్లు లేదా జరిగే ప్రమాదం ఉన్నట్లు బాధితురాలి నుండిగానీ మరే ఇతరవ్యక్తి నుండి గానీ నిర్దిష్టమైన సమాచారాన్ని రాతపూర్వకంగా కానీ, మాట ద్వారా కానీ అందినపుడు దానిని రక్షణాధికారి తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
రాతపూర్వకంగా కాక నోటి మాటగా ఇచ్చిన సమాచారాన్ని రక్షణాధికారి తానే పేపర్‌పై రాసి సమాచారాన్ని ఇచ్చినవారి సంతకం తీసుకోవాలి. వారి వివరాలు తీసుకుని జాగ్రత్త చేయాలి.
ఒకవేళ కుటుంబహింస జరుగుతున్నట్లు, లేదా జరగబోతున్నట్లు టెలిఫోన్‌ ద్వారా గానీ, యిమెయిల్‌ ద్వారా గాని సమాచారం రక్షణాధికారికి అందినట్లయితే, వెంటనే పోలీసుల సహాయం తీసుకుని సంఘటనా స్థలానికి వెళ్ళి కుటుంబ సంఘటన నివేదిక (ఈళిళీలిరీశిరిబీ |దీబీరిఖిలిదీశి ష్ట్రలిచీళిజీశి) తయారు చేసి, తగిన ఆదేశాల కోసం వెంటనే మెజిస్ట్రేటు ముందు దాఖలు చేయాలి.
ఈ సమాచార పత్రం కాపీని సమాచారం అందించిన వ్యక్తికి ఉచితంగా ఇవ్వాలి. కుటుంబ హింసకు గురైన బాధితురాలికి ఆమెకు గల హక్కుల గురించి, గృహహింస నిరోధక చట్టంలోని వెసులుబాట్ల గురించి వివరించాలి.
బాధితురాలి శరీరంపై గాయాలు, దెబ్బలు వుంటే వెంటనే ఆమెకు వైద్యపరీక్షలు జరిపించి, ఆ పరీక్షల నివేదిక కాపీలను కుటుంబ హింస జరిగిన ప్రాంతపు పోలీసు స్టేషనుకు, మాజిస్ట్రేట్‌కు పంపించాలి. ఈ చట్టం క్రింద గుర్తించిన ఆసుపత్రుల వైద్యాధికారులతో మాట్లాడి బాధితురాలికి, ఆమె పిల్లలకు అవసరమైతే వైద్య సదుపాయం ఉచితంగా ఏర్పాటు చేయాలి. ఆసుపత్రులకు వెళ్ళేందుకయ్యే రవాణా ఖర్చులను రక్షణాధికారులే భరించాలి.
బాధితురాలికి అవసరమైన న్యాయ సహాయాన్ని ఉచితంగా రాష్ట్ర న్యాయసేవల సహాయ సంస్థ ద్వారా రక్షణాధికారి ఇప్పించాలి.
బాధితురాలు ఆశ్రయం కోరితే ఆమెను, ఆమె పిల్లలను ప్రభుత్వ గుర్తింపు పొందిన షెల్టర్‌ హోమ్‌లో ఉంచి, ఆ సమాచారాన్ని ఆ ప్రాంత పోలీసు స్టేషన్‌కు, మేజిస్ట్రేట్‌కి రక్షణాధికారి తెలియచెయ్యాలి. షెల్టర్‌ హోమ్‌కు వెళ్ళేందుకు రవాణా సదుపాయాన్ని కల్పించాలి.
అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే కుటుంబ హింస సంఘటన జరిగిన సమాచారం అందిన తక్షణం రక్షణాధికారి, చట్టంలో నిర్దేశించిన విధంగా ఫారమ్‌ 1లో కుటుంబ హింస సంఘటన (డి.ఐ.ఆర్‌)ను తయారు చేసి మేజిస్ట్రేటుకు అందజెయ్యాలి. ఈ నివేదిక కాపీలను ఆయా ప్రాంత పోలీస్‌స్టేషన్‌కి, సర్వీస్‌ ప్రొవైడర్‌కి అందజెయ్యాలి.
ఈ చట్టం క్రింద బాధితురాలు రక్షణ ఉత్తర్వులు కోరితే, నిర్ణీత నమూనా దరఖాస్తును రక్షణాధికారి మేజిస్ట్రేట్‌ ముందు దాఖలు చెయ్యాలి. అంతేకాదు  విధులు నిర్వర్తించడంలో మేజిస్ట్రేటుకు రక్షణాధికారి సహాయంగా వుండాలి. రక్షణాధికారి మేజిస్ట్రేటు నియంత్రణలో, పర్యవేక్షణలో వుండాలి.
మేజిస్ట్రేటు కేసు విచారణకు నిర్దేశించిన తేదీని తెలియచేస్తూ వాది /ప్రతివాదులకు మూడు రోజులు లేదా మేజిస్ట్రేటు చెప్పిన వ్యవధిలో నోటిసులు అందేలా చూడాల్సిన బాధ్యత రక్షణాధికారిదే. ఈ నోటీసులు అందచేసినట్లు దృవీకరిస్తూ కోర్టుకు ఆధారం చూపించాలి.
కోర్టు ఎక్స్‌పార్టీ ఆదేశాలు చెయ్యదలచి, ఆదేశిస్తే, బాధితురాలు / ప్రతివాది కలిసివుండే ఇంటిని  రక్షణాధికారి సందర్శించి అవసరమైన విచారణ జరపాలి. బాధితురాలికి చెందిన వస్తువులను, నగలను, కలిసివున్న ఇల్లును ఆమెకు ఇప్పించాల్సిన బాధ్యత రక్షణాధికారిదే.
మేజస్ట్రేటు ఆదేశించిన విధంగా, బాధితురాలు తన పిల్లల కష్టడీని పొందేందుకు లేదా ప్రతివాది కష్టడిలో వున్న తన పిల్లలను కలిసేందుకు రక్షణాధికారి సహాయం చెయ్యాలి.
మేజిస్ట్రేటు జారీ చేసే అన్ని ఉత్తర్వులను నివాస హక్కు ఉత్తర్వులు, పిల్లల కష్టడీ ఉత్తర్వులు, ఆర్థిక ఉపశమనం ఉత్తర్వులు, ఎక్స్‌పార్టీ ఆదేశాలను రక్షణాధికారి అమలు చెయ్యాలి.ఈ విధంగా కుటుంబ హింస నిరోధక చట్టం అమలులో రక్షణాధికారులు ముఖ్యమైన పాత్రను కలిగివున్నారు.
జి.ఓ.ఆర్‌.టి.నెం. 220,  మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, వికలాంగుల సంక్షేమశాఖ, తేది. 21.08.2007 ప్రకారం జిల్లా రక్షణ అధికారులకు సహాయ నిమిత్తం ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఇద్దరు కౌన్సిలర్లు (సోషల్‌ వర్కరు, న్యాయవాది) ఇద్దరు మెసింజర్లను, ప్రతి జిల్లా యందు నియమించుట జరిగింది మరియు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఒక జూనియర్‌ అసిస్టేంటు, డైరెక్టర్‌ ఆఫీసునందు నియమించడం జరిగింది.
సర్వీస్‌ ప్రొవైడర్లు /స్వచ్ఛంద సంస్థలు / సేవా సంస్థలు
కుటుంబ హింస నుండి మహిళలకు రక్షణ చట్టం 2005 అమలులో రక్షణాధికారులకు ఎంతకీలక పాత్ర వుందో ఈ సర్వీస్‌ ప్రొవైడర్లకు అంతే ముఖ్య భూమిక ఉంది. ఆయా ప్రాంతాలలో పనిచేసే స్వచ్ఛంద సంస్థలు సర్వీస్‌ ప్రొవైడర్లుగా ప్రభుత్వంలో రిజిష్టర్‌ చేయించుకోవాలి. మహిళల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం చట్టబద్ధంగా పనిచేసే సంస్థలు ఈ సర్వీస్‌ ప్రొవైడర్లుగా వుండొచ్చు.
మహిళా సమస్యలపై పనిచేయు 72 స్వచ్ఛంద సేవా సంస్థలను జి.ఓ.యం.ఎస్‌.నెం. 18, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, వికలాంగుల సంక్షేమశాఖ, తేది. 6.8.2007 సర్వీసు ప్రొవైడర్సుగా ఉచిత సేవలు అందించుటకుగాను రిజిస్టరు చేయటం జరిగింది.
ఆయా ప్రాంతాలలో వుండే సర్వీస్‌ ప్రొవైడర్లు, బాధితురాలు ఫిర్యాదు చేసినా, వేరెవరైనా సమాచారం అందించినా, లేదా కుటుంబ హింస సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో వున్నా, బాధితురాలికి గృహహింస చట్టం ద్వారా ఏ ఏ ఉపశమనాలు పొందవచ్చో వివరించాలి. రక్షణ ఉత్తర్వులు, నివాసపు హక్కు ఉత్తర్వులు, పిల్లల కష్టడి, ఆర్థిక ఉపశమనాలు మొదలగు వాటి గురించి బాధితురాలికి చెప్పి, వీటిల్లో ఏదైనా ఉపశమనం లేదా అన్నీ కూడా కోరవచ్చని వివరించాలి.
కుటుంబహింసకు గురైన బాధిత మహిళ కోరితే కుటుంబ హింస నివేదిక (డి.ఐ.ఆర్‌.)ను తయారు చేసి సంబంధిత ప్రాంత మెజిస్ట్రేట్‌కి, రక్షణాధికారికి అందించవచ్చు.
బాధితురాలికి గాయాలు తగిలిన పక్షంలో ఆమెకు వైద్య పరీక్షలు జరిపించి, ఆ నివేదిక కాపీలను రక్షణాధికారికి, సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కి అందచేయాలి.
బాధితురాలు కోరితే ఆమెకు షెల్టర్‌ హోమ్‌లో ఆశ్రయం కల్పించి, ఆ సమాచారాన్ని సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు తెలియచేయాలి.
బాధితుల తాత్కాలిక వసతికి, ప్రభుత్వ సహాయంతో 50 వసతి గృమాలను నడుపబడుచున్నవి.
కుటుంబ హింస జరిగిన ప్రదేశాన్ని, జరిగే ప్రమాదం ఉందన్న ప్రాంతాన్ని, జరుగుతున్న ప్రదేశాన్ని అత్యవసర పరిస్థితిగా పరిగణించి వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించి డి.ఐ.ఆర్‌.ను తయారుచేసి, తక్షణమే తగిన ఆదేశాల కోసం మేజిస్ట్రేట్‌కి అందజేయాలి. ఆ ప్రదేశాన్ని సందర్శించడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, అవసరమైతే స్థానిక పోలీసుల సహాయం తీసుకోవాలి.
గృహహింసను నిరోధించడానికి, బాధితులకు అండగా నిలబడానికి సర్వీస్‌ ప్రొవైడర్లు కృషి చెయ్యాలి. ఈ చట్టం కింద వీరు చేసే పనులకు తీసుకొనే చర్యలకు చట్టపరమైన రక్షణ ఉంది (సె.10(|||) ప్రకారం).
రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ సహాయంతో నడుపుతున్న 51 కుటుంబ సలహా కేంద్రాలను గుర్తించి వారి ద్వారా బాధితులకు కుటుంబ సమస్యల పరిష్కారానికి సహాయం అందిస్తున్నాయి.
”ఈ చట్టానికి అనుగుణంగా కుటుంబ హింసను అరికట్టేందుకు సహాయక సంస్థలు, వాటిలోని సభ్యులు సదుద్దేశంతో ఏ పని చేసినా, చేయబోయినా ఆ సంస్థపై, ఆ సంస్థలోని సభ్యులపై ఏవిధమైన దావాలు ప్రాసిక్యూషన్‌ మరే ఇతర చట్టపరమైన చర్యలు తీసుకునే వీలు లేదు”.
మేజిస్ట్రేటు బాధ్యత
కుటుంబహింసకు గురైన బాధిత మహిళ నేరుగా మేజిస్ట్రేటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆమె తరఫున రక్షణాధికారికానీ, సర్వీస్‌ ప్రొవైడర్లుకానీ దరఖాస్తు చెయ్యొచ్చు. బాధిత మహిళ ఈ చట్టం కింద ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉపశమనాలు కోరుతూ మేజిస్ట్రేటుకు దరఖాస్తు చేసుకోవడంతో ఈ చట్టం అమలు ప్రారంభమౌతుంది. (సెక్షన్‌ 12)
గృహహింస నిరోధక చట్టం 2005 కింద మేజిస్ట్రేటు ఈ క్రింద పేర్కొన్న ఉపశమనాలను ఉత్తర్వుల రూపంలో ఇవ్వవచ్చు.
సెక్షన్‌ 17 కింద ప్రతివాదితో కలిసివున్న ఇంటిలో నివసించే హక్కు
సెక్షన్‌ 18 కింద రక్షణ ఉత్తర్వులు
సెక్షన్‌ 19 కింద నివాసపు ఉత్తర్వులు (వేరుగా వుండేందుకు)
సెక్షన్‌ 20 కింద ఆర్థిక ఉపశమన ఉత్తర్వులు
సెక్షన్‌ 21 కింద ఆధీనపు ఉత్తర్వులు అంటే పిల్లల సంరక్షణ ఉత్తర్వులు
సెక్షన్‌ 22 కింద నష్ట పరిహారం ఉత్తర్వులు
సెక్షన్‌ 23 కింద బాధితురాలి పరిస్థితిని, అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యవసర పరిస్థితుల్లో మెజిస్ట్రేట్‌ సెక్షన్‌ 18 &22 ప్రకారం ఇచ్చే ఉత్తర్వులు ఏకపక్షంగా కూడా ఇవ్వవచ్చును.
మేజిస్ట్రేటు ముందు దాఖలు పరిచే దరఖాస్తుతో పాటు కుటుంబ సంఘటన నివేదిక (డి.ఐ.ఆర్‌.)ను తప్పనిసరిగా జత చేయాలి. ఈ డి.ఐ.ఆర్‌. రక్షణాధికారి లేదా సర్వీస్‌ ప్రొవైడర్ల నుండి వచ్చి వుండాలి.
ఈ దరఖాస్తు అందిన  వెంటనే బాధితురాలి పరిస్థితి బట్టి ఆమెకు ఏఏ ఉపశమనాలు అందుతాయో వివరించాల్సిన బాధ్యత మేజిస్ట్రేటుదే. కేసు విచారణ తేదీని నిర్ణయిస్తూ మేజిస్ట్రేటు నోటీసులు జారీచేసి, ప్రతివాదికి రెండు రోజుల్లో అందించ వలసిందిగా ఆదేశిస్తూ రక్షణాధికారికి ఇస్తారు. నోటీసులు ప్రతివాదికి అందాయని రక్షణాధికారి ధృవీకరించాలి. అందుకవసరమైన  ఆధారాన్ని కోర్టుకు సమర్పించాలి.
కోర్టులో కేసు విచారణ జరుగుతున్న ఏ దశలోనైనా బాధితురాలిని, ప్రతివాదిని లేదా ఇద్దరిని కౌన్సిలింగుకు హాజరుకావాలని మేజిస్ట్రేటు ఆదేశించవచ్చు. ఇందుకోసం సర్వీస్‌ ప్రొవైడర్ల వద్ద వుండే అర్హులైన కౌన్సిలర్‌లను కోరవచ్చు. ఈ కౌన్సిలింగు చేసే వ్యక్తికి ఇరుపక్షాలతో ఎలాంటి సంబంధమూ ఉండరాదు. కౌన్సిలింగు ప్రక్రియ తుది తీర్పు వెలువడే లోపు జరగాలి. (60 రోజులలోపు తుదితీర్పు వెలువడాలి) కౌన్సిలింగు ప్రక్రియ కోసం రెండు నెలల వరకు గడువును మేజిస్ట్రేట్‌ ఇవ్వొచ్చు.
గృహహింస నిరోధక చట్టం సక్రమ అమలు మేజిస్ట్రేటు మీదనే ఆధారపడి వుంది. కుటుంబంలో జరుగుతున్న హింసని ఆపుచేసే ఆదేశం వెంటనే యివ్వగలిగితే బాధిత మహిళ కొంత ఉపశమనం పొందగలుగుతుంది.
ఈ చట్టం కింద చాలా రకాల  సంఘటనలని/వేధింపులను కోర్టు నిలుపుదల చేసే అవకాశం ఉంది.
ఉదా :- వాది పని చేస్తున్న చోటుకెళ్ళి వేధించడం.
ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా, మానసిక వేదనకు గురిచేయడం లాంటి సంఘటనలను కోర్టు నిలుపుదల చేసే అవకాశం వుంది. అంతే కాదు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 125 ప్రకారం కానీ, ఇతర చట్టాల ప్రకారం కానీ మనోవర్తి మంజూరు అయినప్పటికీ కూడా ఈ చట్టంలోని సెక్షన్‌ 20 ప్రకారం మనోవర్తిని మంజూరు చేయవచ్చు.
ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. గృహహింస చట్టం ప్రకారం ఫిర్యాదు చేసిన తరువాత బాధితులు వేరే చట్టాల ప్రకారం చర్యలు తీసుకోరాదని చాలామంది అనుకుంటూ వుంటారు. కానీ అది సరైన ఆలోచన కాదు. ఇప్పటికే అమలులో ఉన్న చట్టాలకి అదనంగా మేలు చేసేది ఈ చట్టం. అందువల్ల బాధిత మహిళలు ఇతర చట్టాలను కూడా ఉపయోగించుకుని చర్యలు తీసుకుంటూ ఉపశమనాలు పొందవచ్చు. అవి సివిల్‌ చర్యలు కావచ్చు. క్రిమినల్‌ చర్యలు కావచ్చు. ముఖ్యంగా బాధితులు గృహహింస చట్టం ప్రకారం ఫిర్యాదు చేసినప్పటికీ ఐపిసి సెక్షన్‌ 498 (ఏ) ప్రకారం కూడా చర్య తీసుకునే అవకాశం ఉంది.
అంతే కాకుండా గృహహింస నిరోధక చట్టం 2005 ప్రకారం అందుబాటులో ఉన్న ఉపశమనాలని ఈ చట్టం ప్రకారం దాఖలైన దరఖాస్తుల్లోనే కాకుండా ఇతర లీగల్‌ ప్రొసీడింగులలో కూడా అడగవచ్చు. (సెక్షన్‌ 26)
ఉదా: విడాకుల కేసుల్లో, మనోవర్తి కేసుల్లో, సెక్షన్‌ 498 (ఏ) ఐ.పి.సి. ప్రకారం వున్న కేసుల్లో కూడా ఈ చట్ట ప్రకారం అందుబాటులో ఉన్న ఉపశమనాలను కోరే అవకాశముందని మర్చిపోకూడదు.
గృహహింసకు సంబంధించిన కేసులను మేజిస్ట్రేట్‌ 60 రోజులలో విచారించి తీర్పు ఇవ్వాల్సి వుంటుంది. కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల కాపీని వాది/ప్రతివాదులకు సంఘటన జరిగిన పరిధిలోని పోలీసులకి, రక్షణాధికారికి, గృహహింస సంఘటన నివేదిక సమర్పించిన సర్వీస్‌ ప్రొవైడర్‌కి ఉచితంగా అందచేయాలి.
కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఉల్లంఘిస్తే ఏడాది జైలు శిక్షగాని రూ. 20000 (ఇరవై వేలు) జరిమానా గాని రెండింటిని గాని విధించవచ్చు. మరియు రిజిస్ట్రారు (విజిలెన్సు) ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) ఆంధ్రప్రదేశ్‌ వారు రాష్ట్రంలోని ప్రధాన మరియు జిల్లా సెషన్సు న్యాయపతుల (జడ్ట్స్‌ను) కేవలం గృహ హింస నుండి మహిళలకు రక్షణ చట్టం క్రింద నమోదు అయిన కేసులను మరియు అత్యవసర కేసులను విచారించుటకుగాను, వారం/పక్షం రోజులలో ప్రత్యేకంగా ఒక రోజు మొత్తం, కేటాయించవలసిందిగా సర్కులర్‌ ఆర్‌.ఒ.సి నెం. 1246/ఇ1/2009 తేది. 27.08.2009 ను జారీ చేయడమైనది. ఇప్పటికీ 15 జిల్లాల్లో గౌరవకోర్టు గృహహింస కేసులను విచారించుటకుగాను ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించి, రక్షణ అధికారికి తెలియజేసినారు. మరియు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జీగారు, గృహహింస సంబంధిత కేసులను విచారించుటకు ప్రత్యేకంగా 3 కోర్టులు. మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు -1, మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు -111, మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు-1ఙ కేటాయించినారు.
సెషన్స్‌ కోర్టులో అప్పీలు
గృహహింస చట్టంలోని సెక్షన్‌ 29 ప్రకారం మేజిస్ట్రేట్‌ కోర్టులో వెలువడిన ఉత్తర్వులపై, ఉత్తర్వులు అందిన 30 రోజుల్లోగా సెషన్స్‌ కోర్టులో అప్పీలు దాఖలు చేసుకోవచ్చు. అయితే కొంత మంది ప్రతివాదులు సెషన్స్‌ కోర్టులో అప్పీలు చేసుకోకుండా నేరుగా హైకోర్టులో రిట్‌ ధరఖాస్తును దాఖలు చేసి, మేజిస్ట్రేటు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతున్నారు. దీనివల్ల బాధిత మహిళలు తీవ్ర ఇబ్బందులకు లోనై, హైకోర్టు దాకా వెళ్ళాల్సిన పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు.
సెషన్స్‌ కోర్టులో అప్పీలు చేసుకునే వీలున్నప్పటికీ హైకోర్టుకు వెళ్ళడం గురించి ఢిల్లీ హైకోర్టు మాయాదేవి అనే మహిళ కేసులో ఒక మంచి పద్ధతిని ప్రవేశపెట్టింది.
ఈ కేసులో ఏం జరిగిందంటే – మాయాదేవి అనే ఆమె నివాస ఉత్తర్వుల కోసం మేజిస్ట్రేటు కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది. ప్రధాన దరఖాస్తు పరిష్కారం అయ్యేవరకు ఆమెను భర్తతో కలిసివుండే భాగస్వామ్య గృహం నుండి తొలగించకూడదని మేజిస్ట్రేట్‌ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసాడు. ప్రతివాది ఈ ఉత్తర్వులని సంబంధిత మేజిస్ట్రేట్‌ కోర్టులోనే సవాలు చెయ్యొచ్చు. లేదా సెషన్స్‌ కోర్టులో అప్పీల్‌ దాఖలు చేయవచ్చు. ఈరెండు చెయ్యకుండా ప్రతివాది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 227 ప్రకారం హైకోర్టులో రిట్‌ వేసాడు. ఈ దరఖాస్తును విచారించిన ఢిల్లీ హైకోర్టు, అప్పీలు దాఖలు చేసే విషయంలో అవలంబించాల్సిన పద్ధతులను నిర్ధారించింది.
ప్రతివాది వేసిన రిట్‌ పిటీషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఈవిధంగా వ్యాఖ్యానించింది.
”మేజిస్ట్రేట్‌ జారీ చేసిన  ఉత్తర్వులకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ఉపశమనాలని  కోరాలంటే 30 రోజుల్లోగా సెషన్స్‌ కోర్టుకు అప్పీలు చేసుకోవాలని సె. 29 ప్రకారం వుంది. దాన్ని పూర్తి చేసుకోకుండా ప్రతివాది నేరుగా హైకోర్టులో సవాల్‌ చేసాడు. చట్టం ద్వారా ప్రత్యామ్నాయాలు వున్నప్పుడు వాటిని పూర్తి చేసుకున్న తర్వాతనే హైకోర్టుకి రావాలి తప్ప అవి పూర్తి చేసుకోకుండా హైకోర్టుకు రాకూడదు. అది సరైంది కాదు. (మాయాదేవి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఎన్‌.సి.టి. ఢిల్లీ మను / చ.ఈ. / 8716/2007)”
బాధిత మహిళల్ని మరింత బాధించడానికి ప్రతివాదులు హైకోర్టుకి వెళతారు. ఈ తీర్పుద్వారా ఢిల్లీ హైకోర్టు ఒక మంచి పద్ధతిని అమలులో పెట్టింది. ప్రతివాది క్రింది కోర్టులో ప్రత్యామ్నాయ ఉపశమనాలని పూర్తి చేయకుండా హైకోర్టుకు వెళ్ళకుండా ఈ తీర్పు ఉపకరిస్తుంది.
గృహహింస నిరోధక చట్టం 2005లో పోలీసుల పాత్ర ఏమిటి?
ఈ చట్టం సివిల్‌ చట్టం కాబట్టి దీని అమలులో పోలీసుల పాత్ర నామమాత్రమే. అయితే బాధిత మహిళ ఫిర్యాదు ఇవ్వడానికి ఫోలీస్‌స్టేషన్‌కి వస్తే, సెక్షన్‌ 5 ప్రకారం డి.వి. చట్టం  ఆమెకు దొరికే ఉపశమనాల గురించి పోలీసులు ఆమెకు వివరించాలి.
సర్వీస్‌ ప్రొవైడర్లు ఆమెకు సేవలందిస్తారని, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ద్వారా ఉచిత న్యాయం అందుతుందని, అది ఆమె హక్కని వివరించాలి. గృహహింస చట్టం క్రింద దొరికే ఉపశమనాలే కాక 498 (ఏ) కింద కూడా కేసుపెట్టొచ్చని బాధితురాలికి వివరించాలి. కుటుంబ హింస సంఘటన జరిగిన ప్రాంతాన్ని చూసేందుకు వెళ్ళే రక్షణాధికారి కోరితే వారితోపాటు పోలీసులూ వెళ్ళాలి. నిందితులు ఏవైనా ఆయుధాలు ఉపయోగిస్తే వాటిని స్వాధీనం చేసుకోవాలి.
ముఖ్యంగా కోర్టు జారీ చేసిన ఉత్తర్వులని ప్రతివాది అమలుపరచకపోయినా, ఉల్లంఘించినా అది నేరమవుతుంది. ఈ అంశాన్ని బాధితురాలు కోర్టు దృష్టికి గానీ, పోలీసుల దృష్టికి గానీ తేవాల్సి వుంటుంది.
మేజిస్ట్రేట్‌ జారీచేసే అన్ని ఆదేశాలను ముఖ్యంగా నివాసపు హక్కు, రక్షణ హక్కులను అమలు చేయడంలో బాధితురాలికి సహాయం చేయాలని కోర్టు ఆదేశిస్తే పోలీసులు తప్పకుండా సహకరించాలి.
ఈ చట్టంలోని సెక్షన్‌ 19(5), 19(7) ప్రకారం బాధితురాలి ఇంటి నుండి ప్రతివాదిని ఖాళీ చేయించడంలోనూ, బాధితురాలి ఇంటి వాటాకి ప్రతివాదిగాని, అతని తరఫునవారు గాని ప్రవేశించకుండా కోర్టు ఆదేశించినా, కలిసివున్న ఇంటిని (షేర్డ్‌హౌస్‌) ను అమ్మివేయకుండా ఆదేశాలు జారీ అయినా, వీటిని అమలు చేయడంలో పోలీసులు సహకరించాలి.
నేరము – శిక్ష : సెక్షన్‌ 31 కింద విచారణ అనంతరం మేజిస్ట్రేట్‌ ఇచ్చిన రక్షణ ఉత్తర్వును గాని – ఇతర ఉత్తర్వులను గాని ప్రతివాది అమలు పరచనట్లయితే అట్టి ప్రతివాదికి నేరం చేసినట్లుగా నిర్ధారించి ఒక సంవత్సరం జైలుశిక్ష రూ.20,000/- జరిమానా లేదా రెండు కూడా విధించవచ్చును. ఇట్టి విచారణ నిమిత్తం బాధితురాలు (పిటిషనర్‌) ఇచ్చిన దరఖాస్తును ఆధారంగా పోలీసులు (ఎఫ్‌.ఐ.ఆర్‌.) రిజిస్టర్‌ చేసి, చార్జ్‌షీట్‌ చేయవలెను. లేదా బాధితురాలు నేరుగా మేజిస్ట్రేట్‌ కు రక్షణ ఉత్తర్వులు అమలు కాలేదని ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకు  సంబంధించి బాధితురాలి (పిటిషనర్‌) సాక్ష్యం ఒక్కటి మాత్రమే చాలు అని చట్టం చెబుతుంది. (సెక్షన్‌ 32(2).
జి.ఓ యం.యస్‌.నెం.28, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ, తేది. 4.7.03 ద్వారా రూ. 25000లు, వరకట్న మరణం పొందిన బాధితురాలి తల్లిదండ్రులకు, న్యాయ సంబంధిత పోరాట ఖర్చుల కొరకు, మంజూరు చేయుటకు అవకాశం కల్పించబడినది. ఒక వేళ, వరకట్న చావు బాధితురాలుకు ఆడపిల్ల వున్నచో, రూ. 25000లు. ఆ బాలిక పేరు మీద బ్యాంకులో జమ చేసి, ఆ బాలికకు 20 సం.ల వయస్సు వచ్చిన తరువాత, తీసుకొనుటకు అవకాశం కల్పించబడినది.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

One Response to గృహహింస నిరోధక చట్టం 2005

  1. rameshraju says:

    ఐ. పి. సి సెక్షన 498 ఎ ను బాగా చదువుకున్న స్త్రీ లలో చాలా మంది భారీ ఎత్తున దుర్వినియోగం చేసుకుంటున్నారు. అమాయకులైన భర్తను, అత్త మామలను, ఆడ పడచులను జైళ్ళలో పెట్టించుచున్నారు. చాలా డబ్బు దోచేస్తున్నారు. భర్త లో మగతనం లేదంటున్నారు. కేవలం శారీరక అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మహా పతివ్రతలైన దేవతలు సీత, సావిత్రి, పార్వతులు ఈ కాలంలో ఉంటే ఇప్పటి అమ్మాయిలను చూసి సిగ్గుపడుదురేమో. స్త్రీ సాధికారత ను సద్వినియోగ పరచుకునే వారు కొందరే. ఇటీవల అమ్మాయిల్లో ఇది ఫ్యాషనయిపోయింది. స్త్రీ కూడా తన పవిత్రత ను కోల్పోయింది. అయితే పల్లెల్లో మాత్రం అమ్మాయిలు బాగానే ఉంటున్నారు. ఏది ఏమైనా కోడలు విషయంలో అత్తగారు పడే బాధ అమ్మాయిలకు కుమారుడు పుట్టి, వానికి పెళ్ళి చేసినప్పుడే తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.