– వారణాసి నాగలక్ష్మి
డాక్టర్ కె.బి.లక్ష్మి గారి ‘వీక్షణం’ చిటారు కొమ్మ నున్న గూటిలోంచి తలబైటకు పెట్టి లోకాన్ని కలయజూస్తున్న విహంగ వీక్షణమే. కమనీయ కవితా విహాయసంలోకి దూసుకుపోవాలని రెక్కల్లోకి శక్తి పుంజుకుంటున్న కౌజు పిట్ట కుతూహలమే. ‘గమనం’ ప్రారంభించేసరికి ఆ రెక్కల నిండా విశాల గగనంలో ఎంత దూరమైనా అలుపులేక సాగిపోగల శక్తి నిండింది. అది అక్షర శక్తి. అక్షయమైన ఊహాశక్తి. ఏ భావాన్నైనా మనోరంజకంగా, వినూత్నంగా చెప్పగలిగేలా అక్షరాలను పదసమూహాలుగా కూర్చగలిగే శక్తి! వీక్షణ పూర్తైన విహంగం, వీనువీధిలోకి రివ్వున దూసుకుపోయిన వైనం… ఆ ‘గమనం’… పరితుల్ని విస్మయచకితుల్ని చేస్తుంది. కొలనులో వేగంగా ఈదే గజఈతగాణ్ణి చూస్తే ఈత ఎంత సులువో అనిపిస్తుంది. ఆ కదలిక ఎంత సుందరంగానో కనిపిస్తుంది. ఈ కవితలన్నీ అలా అలవోకగా సాగిపోతాయి! చదువరిని తమతో సునా యాసంగా తీసుకుపోతాయి. రైలుబండి కిటికీలై ఈ కవితలు, ఎన్నో ఎన్నెన్నో దృశ్యాల్ని తిలకింపజేస్తాయి. మనసుల్ని పులకింపజేస్తాయి.
ఒక దృశ్యం తాలూకు మధురానుభూతి ఇంకా చెరగక మునుపే మరో దృశ్యాన్ని, మరో రకమైన హృదయ స్పందనను అందిస్తాయి.
సంస్కృతీ సంప్రదాయాల గురించి రాసినా, బాల్య స్నేహాల తూలికా తోరణాలను వేలాడదీసినా, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి నిట్టూర్చినా, భూమన్నల బతుకు ఘోషను తలచుకుని నిరాశపడినా, ప్రోత్సాహం అందని పల్లె ప్రతిభకు తల్లడిల్లినా, ఉద్యోగినుల నైతిక విలువల్ని శంకించే కుసంస్కారుల మధ్య ఉన్నతాదర్శాల సహవాసుల కోసం పరితపించినా – అన్ని కవితల్లోనూ సమాజంతో, వ్యక్తులతో, ప్రకృతితో లక్ష్మిగారి గాఢానుబంధం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది… విహంగ ‘వీక్షణం’గా!
ఇక కె.బి.లక్ష్మి గారి ‘గమనం’, సుందర స్వప్నాల కఠోర సత్యాల జగతిని ‘సత్యం శివం సుందరం’గా వర్ణించడంతో ప్రారంభమవు తుంది.
‘అయితారం వచ్చిన పండ్గతో శెల్వు గల్సి రాలేదని’ బేజారై,
‘ఇంటి కాడుంటే గిదేలొల్లి
దఫ్తర్లనే పానం మంచిగుంటది’
పండుగంటి ”పరేషాన్”య్యే ఇల్లాలిని పరిచయం చేస్తారు. తల్లిదండ్రులు తనకిచ్చిన నజరానాలు తలుచుకుని, తన పిల్లలకి ఏం ఇవ్వాలో అర్థంకాక తల్లడిల్లే తల్లి మనసుని ”షెహనాయి రాగాల వెంట” పరుగెత్తించి, మానవతా పుష్పాల సుందర దృశ్యాల్ని దర్శింపజేసి, వందేమాతరం వరసమార్చిన నవతరం తల్లికి ఎలా సలాం చేస్తోందో చూపిస్తారు.
ఇది జవాబు. ఏది ప్రశ్న?’ అంటూ జవాబుని ప్రశ్నలోనే గడుసుగా చుట్టి పెట్టి’
మనసుతోటలో ఊహల ఎరువులేసి
నిరాశా విత్తనాలు నాటి
ఆశా వృక్షాల అనురాగ సుమాల్ని
ఆశించడం అవివేకం కాదా? అని ప్రశ్నిస్తారు!
”ధ్యానమాలిక”లో సృష్టిని సంస్కరించా లనుకోవడం ఎంత అవివేకమో తెలియ చెపుతూ జ్ఞాన వీచికల్ని ప్రసరింప జేస్తారు. పక్షినైపోయి దూర దూరాలకు వెళ్ళాలని మర్రిచెట్టు శాఖల్లాగా రెక్కల్ని విస్తరించినా, ‘ఒక స్త్రీ ఆవహించి ఉన్న ఈ శరీరం ఎంతకూ లేవదు’ అంటారు. పక్షి కావాలనుకున్న స్త్రీ రెక్కల్ని మర్రి చెట్టు శాఖలతో పోల్చడంలోనే కవయిత్రి అద్భుత కవన శక్తి మనోజ్ఞంగా కనిపిస్తుంది.
”ప్రియసఖి”తో తాను అత్యంత సుందర పంజరంలో ఉన్నాననీ తలుపులు బైటనుండి గాక లోపల్నించి గొళ్లెం పెట్టి ఉన్నాయనీ, అయినా తన స్వేచ్ఛా ప్రియత్వం ఎప్పటికైనా తన విడుదల సాధిస్తుందనే, కోపగించుకుని వెళ్ళిపోక తనను పిలుస్తూనే ఉండమనీ వేడుకునే సగటు స్త్రీ మానసిక సంఘర్షణని ఎంతో ప్రతిభావంతంగా చిత్రించారు. ప్రతి స్త్రీ ఈ కవితలో తనను తాను దర్శించు కుంటుందనడం అతిశయోక్తి కాదు.
ఉబికి వస్తున్న ఉత్సాహంతో
ఉరకలు పరుగులతో వచ్చిన ఉగాదిని
‘చెక్ పోస్ట్’ దగ్గర ఆపేశారు!
అంటూ కవయిత్రి వర్ణించిన ఉగాది వర్ణనను నిన్నటి ‘సర్వజిత్’ ఉగాదికి కూడా అన్వయించుకోవచ్చు.
కోకిలల్ని ఎవరో కిడ్నాప్ చేసినట్లున్నారు!
కుహూరాగాలు రేఖాచిత్రాలై
ప్రత్యేక సంచికల ముఖ చిత్రాల్ని హత్తుకుంటున్నాయి!
అని చదువుతూ కిటికీలోంచి దృష్టి సారిస్తే కనిపించే కాంక్రీటు అడవిలో కొమ్మాలేదు, రెమ్మాలేదు, ఇక కోకిలమ్మెక్కడా? ఎదురుగా టీపాయి మీద ప్రత్యేక సంచిక ముఖ చిత్రం విూద మాత్రం మామిడి పిందెలూ, వేపపూతలూ, కోకిలమ్మలూ రంగుల్లో కళకళలాడుతూ కనిపించాయి! లక్ష్మిగారు చిరునవ్వుతో ‘నే చెప్పేది అదే మరి’ అన్నట్టనిపించింది!
ఇక ‘జర చాయ్ తాగిపో’ కవిత చదివితే శ్రమజీవుల బస్తీలో జీవితంతో కుస్తీ పడుతున్న స్త్రీ మూర్తి జీవితాన్ని, మరిగే నీళ్ళలో చాయ్ పత్తాలాగా కాచి వడపోసి కవిత ‘కప్పు’లో పోసినట్టనిపిస్తుంది.
‘మోటారు కారు ధర తగ్గి – కారటు దరపెరిగె!
అని చదివి నిట్టూర్చబోయిన వాళ్ళంతా
‘ఔనయ్యా! ఉగాదయ్యా! నువ్వేంది! ఏడాదికోపేరు బదలాయించుకోనొస్తవ్ ?
ఇక్రం పేరు మంచిగనె వుండేననుకుంటే
షాన్ దీసినవ్!
‘మల్ల నీ పేరే దుర్దాకయితే నువ్విక మాకు చేసెడిదేందో సమ్జయితలేదు’
అని చదవగా పక్కుమని నవ్వకుండా ఉండలేరు.
లక్ష్మి గారందించిన ‘గరీబోళ్ళ చాయ్’ మనసుని మెలిపెట్టి కళ్ళలో నీటి పొరని పేర్చి, పెదవులపై నవ్వు మొలిపిస్తుంది!
అలాగే ‘పేపర్ల ఎంకటేశు, ముత్యాల ముబారక్’, తెలుసా! కవితల్లోపరిచి పెట్టిన మనస్తత్వ విశ్లేషణ మనోహరం! మొత్తం మీద కవితలన్నిటినీ కలయజూస్తే అందమైన హైదరాబాదీ సంస్కృతి కళ్ళముందు నాట్య మాడుతుంది. కవయిత్రికి అభినందనలు.