– వేములపల్లి సత్యవతి
ఫరా బీహార్లోని భౌనాత్పూర్ అనే చిన్న పట్టణంలో పుట్టింది. ఫరా అమ్మా-నాన్న ఆమెను ఘోషాలో వుంచి, పరదాచాటున పెంచలేదు. వివక్షతలేకుండా ఎంతో స్వేచ్ఛగా పెంచారు. చిన్నప్పుడే ఫరా సైకిల్ మీద పట్టణమంతా తిరిగి వచ్చేది. హైస్కూల్ చదువు పూర్తయిన తర్వాత ఉన్నత విద్యాభ్యాసానికి ఆలీఘడ్ యూనివర్శిటీలో అడుగు పెట్టింది. యూనిర్శిటీ క్యాంపస్లో నడిచి క్లాసులకు వెళ్లేది. ఒకరోజు మోటార్బైక్ మీద వెళుతున్న యిద్దరు యువకులు నడిచి వెడుతున్న ఫరాదుపట్టా (ఓణీలాంటిది)ను లాగివేశారు. దానికి ఫరా అవమానభారంతో కుతకుత లాడింది. ఆ సంగతిని విధ్యార్థి సంఘానికి ఫిర్యాదుచేసింది. ఆ సంఘంవారు ఆ దురాగతాన్ని ఖండించకపోగా, ”నీకు తగిన శాస్తి బాగానే జరిగిందని” ఎగతాళి చేశారట. సాంప్రదాయకమైన దుస్తులు సల్వార్ పైజామా వేసుకోకుండా జీన్ప్యాంట్ ధరించటం అశ్లీలదుస్తులు ధరించటమేనన్నారట. అప్పుడప్పుడు ఆమె నడచి వెళుతూ వుంటే వెనకనుంచి వెంబడించి ‘సాదాకీర్ఖేల్’ (వుంపుడు గత్తె అని అర్థం) అనిగేలి చేసేవారట. రకరకాల వేధింపులు మొదలైనవి. ఆమె వెనకాలబడి వెకిలికూతలు, అసభ్యకరమైన మాటలంటూ 40మంది చదువుకుంటున్న పోకిరీ వెధవలు (విధ్యార్థులు) ఫరాను చుట్టు ముట్టారు. అయినా ఫరా రవ్వంత కూడా చలించలేదు. బెదరలేదు. ఎదురుతిరిగింది.
”నేనొక ఆడపిల్లని, ముస్లింని అయినంత మాత్రాన నాస్వతంత్ర వ్యక్తిత్వాన్ని-నా భావాలను ఎందుకు చంపుకోవాలి? నాకేపని చేయాలనిపిస్తే ఆపనే చేస్తాను”. అంటుంది ఫరా. స్ట్రగుల్ అగెయినిస్ట్ డిస్క్రమేషన్ అండ్ ఏలియేషన్) అనే సంఘంలో సభ్యురాలుగా చేరింది. గ్రంథాలయాలలోగాని, క్యాంటిన్లలోగాని, యూనివర్శిటీ పార్కుల్లోగాని, లాన్లలోగాని యూనివర్శిటీలో చదివే ఆడప్లిలలు కనిపించరు. పేరుకు మాత్రం యూనివర్శిటీ నిబంధనలప్రకారం ఆడపిల్లలకు, మగపిల్లలతోపాటు అన్నింటా సమాన హక్కులున్నాయి. ఆచరణలో మాత్రం అన్నీ శూన్యమే. మగపిల్లలు, ఆడపిల్లలను వెకిలి చేష్టలకు, వేధింపులకు గురిచేస్తుంటే పట్టించుకొనే నాధుడేలేడంటుంది. చెప్పుకోవటానికి దిక్కుకూడ లేదంటుంది ఫరా. అలా అని నిరాశచెంది వూరుకోలేదు ఆమె ఆందోళన చేపట్టింది. విషయం మీడియావరకు చేరింది. పత్రికలలో వార్తలు ప్రచురితమయినవి. అప్పుడు చేసేది లేక యూనివర్శిటీవారు కంటితుడుపుగా ఒక కమిటీని వేశారు. ఆమెను నిందించిన రిజిస్టారే అందులో తీర్పరి. ఇక న్యాయవిచారణ ఏలా వుంటుందో వేరే చెప్పాలా? ఫరాను, నీవు సిగరెట్లు తాగుతావా? మగవాళ్లతో మాట్లాడుతావా? లాంటి పసలేని చెత్త ప్రశ్నలు వేశారు. పైగా యూనివర్శిటీకి చెడ్డపేరు తెస్తున్నావని, పరువు నష్టం దావా వేస్తామని బెదిరించారు. అయినా ఫరా భయపడలేదు. ఇంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మీకు భయంవేయలేదా? అని ప్రశ్నించిన వారికి, యింతవరకు వేయలేదని చిరునవ్వుతో జవాబు చెప్పింది.
యూనివర్శిటీ వదలి వెళ్ళిన తర్వాత మేము చేపట్టిన పనిని కొనసాగించగలిగే అమ్మాయిలను తయారుచేస్తానని చెప్పింది. భవిష్యత్లో తాను సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటానంది. తనను తాను ఒక మహిళగానో, లేక ముస్లింస్త్రీగానో భావించనని తన అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించగలిగే వ్యక్తిత్వం కలిగివుండాలని తన అభిప్రాయాలను వెల్లడించింది. భవిష్యత్లో జర్నలిస్టుగాను, సామాజిక కార్యకర్తగాను కొనసాగాలన్న కోరికను వెల్లడించింది. ఫరా లక్ష్యం నిరభ్యంతరంగా, నిరాటంకంగా నెరవేరాలని కోరుకుందాము.
నేటి యువతులు ఫరాను ఆదర్శంగా తీసుకొని, స్పూర్తినొంది పోకిరీవెధవల వెకిలి చేష్టలకు ధైర్యంగా ఎదిరించి అడ్డుకట్టవేయాలి.