స్త్రీల జీవితాల్లోని వాస్తవాలను ప్రతిబింబించని సినిమాలు

– శివలక్ష్మి

2007 మార్చి 23వ తేదీ నుంచి మార్చి 29 వరకూ మన హైదరాబాద్లో సినిమా పండగలు బ్రహ్మాండంగా జరిగాయి. 22వ తేదీ సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్లోని లలిత కళాతోరణంలో గౌతమ్ ఘోష్ ”యాత్ర” చిత్రంతో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభమైంది. ఈ ఏడు రోజులూ ఉదయం 9 గంటల నుంచి రోజుకి నాలుగు సినిమాలచొప్పున నాలుగు ధియేటర్లలో ఒకే టైముకి ప్రదర్శించారు. సినిమా ప్రేమికులు తమ సమయాన్ని ఎంతగా మానేజ్ చేసుకుని ఇటూ అటూ ఎంత హడావిడి పడి పరుగులు పెట్టినప్పటికీ కొన్ని మంచి సినిమాలను మిస్కాక తప్పలేదు. మొత్తానికి సినీప్రియులందరికీ ఇష్టమైన స్నేహితులతో కలిసి సినిమా చూడడం గొప్ప అనుభూతి నిచ్చింది.

మొత్తం ప్రదర్శనకు వచ్చిన చిత్రాలు 105. అందులో ప్రపంచ సినిమాలు 25, డాక్యుమెంటరీలు 60, మన తెలుగు సినిమాలు మాభూమి, ముత్యాల ముగ్గు, మల్ల్లీశ్వరి, కళ్ళు, శంకరాభరణం, ఊరుమ్మడి బ్రతుకులు, దేవదాసు, పోతేపోనీ, కమ్లి లతో పాటు సరికొత్త సినిమాలు బొమ్మరిల్లు, పోకిరీలను కూడా ప్రదర్శించారు. ప్రపంచ సినిమా, ఇండియన్ సినిమా, తెలుగు పాప్యులర్ సినిమా, క్లాసిక్స్తో పాటు లఘు చిత్రాలకు కూడా సముచిత స్థానం ఇవ్వడం వల్ల అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈసారి ఒక సమగ్రతను సాధించింది. 15 నిమిషాలు, 30 నిమిషాలు నిడివి గల చిన్న చిత్రాలు అవార్డులకు ఎంపికయ్యాయి. సినిమా గురించి అహర్నిశలూ ఆలోచిస్తూ, కలలు గంటున్న యువదర్శకులకు కొత్త కొత్త ఆశలు చిగురించాయి.

ప్రజలు మంచి సినిమా గురించి ఆలోచించాలంటే ఊరూరా ఫిలింసొసైటీలు స్థాపించాలని సత్యజిత్రే అన్నారొకసారి. సకల అవలక్షణాలతో ఒక అపసవ్య సంస్కృతిని విస్తరింపజూస్తున్న నేటి వ్యాపార సినిమాకి ప్రత్యామ్నాయంగా గత పాతిక సంవత్సరాలుగా హైదరాబాద్ ఫిలింక్లబ్ ఒక ఉద్యమాన్ని దీక్షగా నడుపుతోంది. ఈ చిత్రోత్సవం హైదరాబాద్లో మొదటిసారే అయినప్పటికీ విజయవంతం కావడానికి కారణమైన హైదరాబాద్ ఫిలింక్లబ్ అసోసియేషన్ వారికి సినీ ప్రేక్షకులందరూ అభినందనలు చెప్పాలి.

ప్రపంచ వ్యాప్తంగా సినిమాల్లో స్త్రీల పాత్రల్ని చూసినప్పుడు నిరాశా, నిస్పృహలు ముంచుకొస్తాయి. అగ్ర రాజ్యాలతో సహా ఏదేశంలోనైనా ఎదగడానికి అడ్డంగా ఇల్లు-ఇంట్లోని కిచెన్ ఒక కీకారణ్యం. భర్త ఒక భూతం. పిల్లలు పిశాచాలు, అంటే నా ఉద్దేశ్యం స్త్రీలు తమ మెదళ్ళనీ, శక్తియుక్తులన్నిటినీ ఇంటిమీదా, భర్తకు ఎప్పుడేది కావాలో జాగ్రత్తగా అమర్చి పెట్టడానికీ, వళ్ళంతా కళ్ళు చేసుకొని పిల్లల్ని పెంచడానికీ కేంద్రీకరిస్తారు. ఇంతా చేస్తే ఏదేశంలోనైనా పిల్లలు ప్రయోజకులైతే పురుషులు అంతా తమ ఘనతేనన్నట్లు నా పిల్లలని గర్వంగా చెప్పుకుంటారు. పిల్లల్లో ఎక్కడైనా ఒకరు మాటవినకపోయినా, సమాజం దృష్టిలో ప్రయోజకులు కాకపోయినా వెంటనే, ”ఆమె పెంపకం, ఆమె తిన్నగా ఉంటే కదా, పిల్లలు సక్రమంగా తయారవ డానికి” అని నిందిస్తారు. స్త్రీలు ఎదగడం సంగతటుంచి చేస్తున్న శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. వీటికి తోడు సమాజం ఆమె వేసే ప్రతి అడుగుకీ, చేసే ప్రతి ఆలోచనకీ ప్రతిబంధకాలు. అన్నిదేశాల సినిమాల్లో ఇదే వాతావరణం కనిపిస్తుంది. యుద్ధాలు, విప్లవాలు, ఉద్యమాలు నేపధ్యంగా తీసిన సినిమాలలో అయితే అసలు సృష్టిలో పురుషులతో పాటు స్త్రీపాత్రలు లేని సినిమాలు కూడా బోలెడున్నాయి. ఒకవేళ ఒకటో, రెండో స్త్రీ పాత్రలున్నా అవి మనుషుల్లా కాక మరబొమ్మలుగా ఉంటాయి.

ప్రపంచ సినిమాలలో కొన్ని ఊతపదా ల్లాగా, చాలా సాధారణంగా కొన్ని వందల సార్లు అశ్లీలమైన బూతుపదాలు వినిపిస్తాయి. ఆ పదాలు ఆయా సమాజాల రోగస్థ స్థితిని తెలుపుతున్నాయని, వాళ్ళకది మామూలేనని వదిలెయ్యడానికి వీల్లేదు. ప్రపంచ వ్యాప్తంగా అసలు పురుషుల్ని తిట్టడానికి ఆయా- సందర్భాలకు తగినట్లుగా తిట్లెందుకు లేవో మనందరం ఆలోచించాలి. ఎంత మృగ సమానుడైన మగవాణ్ణైనా తిట్టడానికి, తెరవెనక ఉన్న వాళ్మమ్మల్ని బయటికి తెచ్చి ”బాస్టర్డ్” అంటూ ఎందుకు తిడతారో ఖచ్చితంగా మనం చర్చించాలి. మన దేశంలో అయితే ”వెధవ” అనే ఉన్న ఒక్క తిట్టుక్కూడా ”వెయ్యేళ్ళు ధనముతో వర్థిల్లు” లనే అర్థాన్ని కనిపెట్టారు. మనుధర్మమా, మజానా!.

ఇక ఇండియన్ సినిమా విషయాని కొస్తే, 1931లో మన సినిమా మాట నేర్పింది మొదలు, అయితే పురాణాల్లోని ఆదిశక్తిని తలపించే ధీరవనితలూ, గయ్యాళులు లేకపోతే నయవంచకిలూ, ఎటువంటి దుర్మార్గానికైనా వెరవని విలన్లు. అదీ, యిదీ కాదంటే సమాజం విధించిన అన్ని నియామలకీ లోబడి నడచుకునే వినయశీలురు. బాలీవుడ్ సినిమాల్లో హోరెత్తించే సంగీతం, డ్యాన్సులుంటాయి. మహిళలకి కళ్ళుమిరు మిట్లు గొలిపేే వస్త్రధారణలు. అవి సహజంగా ఉండనే ఉండవు. పురుషులు ఫుల్ సూట్లల్లో ఉంటారు. స్త్రీలు అర్థనగ్న సుందరీమణులు. భారతదేశంలో బట్టకే కరువైనట్లు రకరకాల పీలికలతో అవయవ సౌందర్యాన్ని కళ్ళకి కట్టిస్తారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లే భారతస్త్రీని పూజిస్తామనీ, గౌరవిస్తామనీ డైలాగులు వల్లిస్తారు. అవార్డు కేటగిరీ సినిమాల్లో పేదరికం, కాలుష్యం కథావస్తువులు. డైరెక్టర్ ఎంత గొప్ప నిష్ణాతుడైనా పేద మహిళలు అత్యాచారాలకు బలికావలసిందే. అసభ్యంగా, అశ్లీలంగా, అసహ్యంగా, పరమ జుగుప్సాకరంగా సెక్స్ని చూపించడానికి ఒక కూృరమైన, వికృతమైన, భూస్వామినో, జమిందారునో సృష్టిస్తారు. నిజానికి నరరూప రాక్షసుడనుకున్న వాడికైనా, అతని ఆనందం కోసమైనా కొంచెంసేపు శరీరంపట్ల శృంగారపు భావాల్ని మనసులో ఊహించుకొని కామంతో నిండిన చూపులు చూస్తాడుగాని ప్రతిసారీ వికృతమైన జంతువులా మారిపోలేడు. అలా మారిపోతే అతనిక్కావలసిన సుఖాన్నీ, తృప్తినీ పొంద లేడు. అసలైన వికారమంతా దర్శక నిర్మాతల మనసుల్లోనే ఉందా అనిపిస్తుంది. చూస్తున్న వాళ్ళకి ఆ మహిళ మీద సానుభూతి, అతని మీద చంపేంత కోపం రావడం సంగతి అటుంచి, ఏమాత్రం సున్నితత్వం మిగలకుండా జీవితం మీద విరక్తి పుడుతుంది. మహిళల మీద కనీస గౌరవమున్న వారెవరైనా మహిళల్ని ఇంతగా అవమానపరుస్తారా? అనే సందేహం కలుగుతుంది. సమాజంలో ఉన్న ఎన్నో దురాగతాల్లో లైంగిక దోపిడీ కూడా ఒక క్రూరాతి క్రూరమైనదని ప్రేక్షకులకు అర్థమయ్యేలా కాస్త నాగరికంగా తియ్యాలనే దృష్టే ఉండదు. అనుమానం కలుగుతుందేమో ననిపిస్తుంది. మహిళల మీద గౌరవంతో కాకపోయినా అంతర్జాతీయ ఖ్యాతికోసమైనా మన దర్శక నిర్మాతలు జాగ్రత్తపడితే మంచిదేమో!

మంచి ఎక్కడున్నా గ్రహించి పాటించ వలసిందే. ఇరాన్ సినిమాలన్నీ ఉదాత్తంగా, అద్భుతంగా ఉంటాయి. జీవితం ఎంత వైవిధ్యమైందో వాళ్ళ సినిమాల్లోని ఇతివృత్తాలు కూడా అంతే వైవిధ్యంగా ఉంటాయి. చిన్న చిన్న అంశాలను తీసుకుని సహజత్వం ఉట్టిపడేలాగా మలుచుకుంటూ వస్తారు. ”మీ మహిళల్ని మేమెంతో గౌరవిస్తాం” అనే విషయాన్ని డైలాగులు వల్లించకుండా పాత్రల తీరుతెన్నుల్ని కళ్ళక్కట్టించడం ద్వారా చూపిస్తారు. ఎక్కడా అసభ్యత, అశ్లీలతలు దర్పణంవేసి వెదికినా కనిపించవు. ప్రతి సినిమాలోనూ ఒక భోజనం సీనుంటుంది. బట్టలుతికే సీను తప్పనిసరిగా ఉంటుంది. శ్రమను గౌరవిస్తామని చెప్పే మన డైరెక్టర్లెవరూ ఇక్కడి సంస్కృతి, ప్రజల జీవన విధానం, శీతోష్ణ పరిస్థితులు, అందువల్ల సంతరించుకున్న ఆహారపుటలవాట్లు – ఇవేవి మన సినిమాల్లో టచ్ చేయ్యరు. సత్యజిత్రేని నన్ను క్షమించమని వేడుకుంటాను. ఆయన చాలా సినిమాల్లో బెంగాలీ భోజనాన్ని, చేపల వంటకాల్ని చూపిస్తారు. రేతోపాటు శ్యాంబెనగల్, గిరీష్కాసరవెల్లీ, రిత్విన్ ఘటక్, శాంతారామ్, బిమన్ రాయ్, గురుదత్ మొదలైన మహానుభావులు స్త్రీల మనసు నర్థంచేసుకుని గౌరవించారు.

మార్చి 25న ప్రదర్శించిన ”కమ్లి” చిత్రానికి రెండు అంతర్జాతీయ, ఆరు జాతీయ అవార్డులొచ్చాయి. చాలా ఆశగా వచ్చినవాళ్ళకి ఈ చిత్రం నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. శాస్త్రిగారు ‘కమ్లి’ జీవితంలోని పేదరికాన్ని గానీ, పుట్టిన పిల్లల్ని ఆదుకోవలసివచ్చిన పరిస్థితుల్లోని విషాదాన్ని గానీ ఆడశిశువుల చుట్టూ తాండవిస్తున్న మృత్యు ఛాయల్ని గానీ చేయవలసినంతగా ఫోకస్ చేయ్యలేదు. నేపధ్యం లోని సామాజిక పరిస్థితుల్ని చర్చించలేదు. ఎంతసేపూ కమర్శియల్ సినిమాలోలాగే నందితాదాస్ అందంమీద, అందాన్ని ఫోకస్ చెయ్యడం మీదే దృష్టిని కేంద్రీకరించారు. ధర్నా చేస్తున్నప్పుడు ఆర్భాటంగా వచ్చిన మీడియా, పిల్లవాడు దొరకగానే గప్చిప్గా కథనాయిక బిడ్డతో బిచాణా ఎత్తివేయడం కనిపిస్తుంది. మగబిడ్డని మాయంచేయడం అనే ఒక పెద్దనేరం ఒక బాధ్యతగా ఉండవలసిన ప్రభుత్వాసుపత్రిలో జరిగినప్పుడు – అది ఏ సామాజిక కారణాలవల్ల, ఏపరిస్థితుల్లో, ఎవరి వల్ల జరిగిందనే దానికి జవాబు దారీతనం గానీ, ప్రశ్నలుగానీ ఏమీలేకుండా సినిమా ముగుస్తుంది. ఆర్థిక స్వావలంబనతోపాటు అన్ని రంగాలలో పురుషులతో స్త్రీలు సమానస్థాయికి చేరుకున్నప్పుడు ఆడపిల్లలను కనడం గర్వకారణంగా భావిస్తారు తలిదండ్రులు.

‘వనజ’ సినిమా తెలంగాణా ప్రాంతపు దొరతనం మీద తీశానని చెప్తూనే ఎందుకోగాని డైరెక్టర్ శ్రీకాకుళం ప్రాంతంలో షూటింగ్ జరిపారు. చిన్నపాపమీద అత్యాచారం చేస్తాడు దొర. సమాజంలో జరుగుతున్న దుష్పరిణామాలేమీ అర్థం చేసుకునే వయసు పాపకు లేదు. తన శరీరంలో మార్పులొచ్చి ఒక బిడ్డకి తల్లైనా సరే శరీరపు మార్పులు మనసుకేమీ అంటించుకోదు వనజ. ఎప్పటిలాగే ఫ్రెష్గా తనమానాన తను స్నేహితురాలితో ఆటలకు తయారైపోతుంది. స్త్రీలందరూ వనజలాగా పసితనపు అమాయ కత్వాన్ని కాపాడుకోగలిగితే బాగుండు ననిపించింది.

స్వంత వ్యక్తిత్వంతో, ఆత్మవిశ్వాసంతో, గౌరవంకలిగేలాగా ప్రవర్తించిన స్త్రీ పాత్రలున్న సినిమాలేమైనా ఉన్నాయా అని ఆలోచిస్తున్న ప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన సి. ఉమా మహేశ్వరరావు గారి అంకురం, సినిమా ఒక్కటే గుర్తొచ్చింది.

రాజకీయ అవగాహన కలిగించే గౌతమ్ఘోష్ ”మాభూమి” ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం. ‘యాత్ర’ చూడలేక పోయాను. తెలుగులో మృణాల్సేన్, శ్యాంబెనగల్, గౌతంఘోష్, బి.యస్. నారాయణ గార్లు వాస్తవానికి దగ్గరగా ఉండే సినిమాలు తీసి ఎన్నదగిన కృషి చేశారు. 50వ దశకం నుంచి 70వ దశకం లోపు తీసిన సినిమాలలో ఎక్కడో ఒకటి తప్పించి అన్నీ అద్భుతమైన దృశ్యకావ్యాలే. అప్పటి డైరెక్టర్లకి గొప్ప విజన్తోపాటు సామాజిక బాధ్యత కూడా ఉంది. రైతుబిడ్డ, రోజులుమారాయి, కన్యాశుల్కం, మాలపిల్ల మొ| సినిమాల్లో స్త్రీపాత్రలు నిండు వ్యక్తిత్వంతో ఆకట్టు కుంటాయి. ఆ కాలపు సామాజిక వాతా వరణంలో, ఆయా పరిమితుల్లోనే స్త్రీల కిష్టంలేని విషయాలకి వెంటనే స్పందించడం, నిరసన చూపడం, నిలదీయడం, ఎదిరించడం కనిపిస్తుంది. కుదరకపోతే ”కన్యాశుల్కం” లోలాగా” ”చిన్నపిల్లని ముసలివాడికిచ్చి పెళ్ళిచేస్తే నూతిలోపడి ఛస్తా”నని బెదిరించడం కూడా చూస్తాం. దేవదాసు పార్వతి, ”నీకేనా అమ్మా నాన్నా ఉన్నది, నాకులేరూ” అంటుంది. పార్వతి ఆరోజుల్లోనే నీ అమ్మా నాన్నా నీకెంతముఖ్యమో నా అమ్మా నాన్నా నాకూ అంతే ముఖ్యమని సూచిస్తుంది. ఇప్పటి ఆడపిల్లలు పెద్ద చదువులు చదివి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లై తలిదండ్రుల్ని వాళ్ళత్తమామలకీ, మొగుడికీ అప్పజెప్పి అలుసు చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళని తిట్టినా గుడ్లప్పగించి చూడడం ఇప్పటి సామాజిక విషాదం. ఇక ‘మాలపిల్ల’ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి డైలాగ్ ఈ క్షణానిక్కూడా వర్తించేటట్లు ఎంతో హృద్యంగా ఉండి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చి హాలు చప్పట్లతో మారుమోగిపోయింది. మాటలెవరు రాశారనుకున్నారు? స్త్రీలోకాన్ని అమితంగా ప్రేమించి, స్త్రీలకోసం జీవితాంతం వేదనపడిన మన చలం. అందుకే ప్రతి మాటా సూటిగా తగిలి ప్రేక్షకుల హృదయాలని హత్తుకుంది.

ఇంకో మంచి విషయం మీ అందరితో పంచుకోవాలనుంది. ‘నిశాంత్ శ్యాంబెనగల్ సినిమాలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నన్ను వివశురాలిని చేసింది. మధురాతి మధురంగా, వీనుల విందుగా, హృదయ రంజకంగా ఉంది. ఆ తియ్యని కంఠం, ఆ పాడిన తీరూ, సినిమాలో ఆ సంగీతం అద్భుతంగా అమరిన మలుపులూ నన్నెంతో అలరించి ఆ సుస్వర కంఠం మన అన్వేషి లలితగారిదని అరుణోదయ రామారావు గారి ద్వారా తెలుసుకొని అద్భుతమైన థ్రిల్కి లోనయ్యాను. ఉద్వేగంతో ఊగిపోయాను.

నాకు నచ్చిన రెండు సినిమాల గురించి చెప్తాను. సౌత్ ఆఫ్రికన్ యస్టర్డే (Yesterday) డైరెక్టర్ డారెవ్ జేమ్స్ రూడట్. కథానాయిక పేరు యస్టర్డే (సౌలభ్యం కోసం డే అని పిల్చుకుందాం) పాపపేరు బ్యూటీ. సినిమా అందంగా మొదలౌతుంది. వేసవికాలం. పల్లెటూరి పొడవైన రోడ్డు వారు నడుచు కుంటూ వెళ్ళి చేరాల్సిన గమ్యం చాలా దూరంలో ఉంది అన్నట్లు సూచిస్తూ తల్లీ పిల్లా నడుస్తూ ఉంటారు. పాపతల్లిని పదే పదే ”అమ్మా! నేనెందుకు పక్షినై పుట్టలేదు? అని ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వు బ్యూటీవి. పక్షివెందుకవుతావు? అంటూ తల్లి బుజ్జగిస్తూ ఉంటుంది. చిన్నారి పాదాలతో అంతంత దూరం నడవలేక అదే ఎందుకు పక్షిలా పుట్టలేదు, పక్షినై ఉంటే ఎంచక్కా ఎగిరేదాన్ని నిన్నూ తీసికెళ్ళేదాన్ని కదా? అంటుంది. ”నాన్నెప్పుడొస్తాడు? మనం మోటార్ కార్ ఎప్పుడు కొనుక్కుంటాం?” అనడుగుతుంది. రెండుసార్లు తల్లీకూతుళ్ళు నడిచి వెళ్ళి డాక్టర్ దగ్గరున్న చాంతాడంత క్యూలో డేకి తనవంతు వచ్చేసరికి టైమై పోతుంది. ‘అయ్యో, నాకు చాలా అనారోగ్యంగా ఉంది, దగ్గుతో ఊపిరాడటం లేదు’ అని చెప్పినా ఎవరూ వినిపించుకోరు. రెండుసార్లూ నిరాశగా తిరిగొస్తారు. పొలం దున్నడం కట్టెలు కొట్టి తెచ్చుకోవడం, పంపు దగ్గర నీళ్ళు మన పాతపంపుల దగ్గరలాగే కొట్టుకోవడం- ఇలాంటి సంఘటనల ద్వారా డే పేదరికాన్నీ, అంతులేని శ్రమ చేసే తత్వాన్నీ మనకి బోధపరుస్తాడు డైరెక్టర్. ప్రతి పనిలోనూ పాప తల్లికి చేదోడు వాదోడుగా ఉంటుంది. తల్లి బట్టలుతుకుతున్నప్పుడు, ”అమ్మా! నది ఎక్కడ మొదలవుతుంది? ఎక్కడ దేనితో కలుస్తుంది? ఎక్కడ ఆగిపోతుంది? అనడుగుతుంది. అబ్బ! ప్రశ్నల మీద ప్రశ్నలేస్తున్నావు అనంటుంది డే. ఆ వూరికి కొత్తగా వచ్చిన టీచర్తో స్నేహం కుదురుతుంది. అంతదూరం నడుచుకుంటు వెళితే డాక్టర్ని కలుసుకోలేవని, టాక్సీలో వెళ్ళమనీ టీచర్ చెప్తుంది. డే తన దగ్గరంత డబ్బులేదని నిస్సహాయంగా చూస్తుంది. ఆశ్చర్యంగా ఒకరోజు ఉదయాన్నే ఇంటిముందుకి టాక్సి వస్తుంది. డ్రైవర్ టాక్సీ బిల్లు ముందే చెల్లించబడిందనీ త్వరగా బయలుదేరమని వేగిరపెడతాడు. పాపని టీచర్ దగ్గర వదిలిపెట్టి డాక్టర్ని కలుసుకుంటుంది డే. డాక్టర్ ఎంతో ఆప్యాయంగా పలకరించి వైద్యం చేస్తుంది. రక్తంతీసి మళ్ళీ రమ్మని చెప్తుంది. ఏంపేరు? అని డాక్టరడిగితే ”Yesterday” అని చెప్తుంది. అదేం పేరని అడిగితే నిన్నటి కంటే ఈరోజు, ఈరోజుకంటే రేపు బాగుండాలనే ఆశతో మా నాన్న నాకా పేరు పెట్టాడని చెప్తుంది. క్రమంగా టీచర్తో స్నేహం రోజురోజుకీ బలపడు తుంది. డే డబ్బులివ్వబోతే తీసుకోదు. నీస్నేహం నాకెంతో విలువైంది. అందరితో స్నేహం చెయ్యలేము కదా అంటుంది టీచర్. గ్రామంలో తననెవరూ మొదట్లో రిసీవ్ చేసుకోలేదనీ అలవాటు పడడానికి సంవత్స రం పట్టిందనీ చెబుతుంది డే. రెండోసారి డాక్టర్ భర్త గురించి వివరాలడిగి అతన్ని కూడా పరీక్షలు చెయ్యాలి, పిలవ మంటుంది. హెచ్.ఐ.వి భర్త ద్వారా సంక్రమించిందని డే తెలుసుకుంటుంది. ఫోన్ చెయ్యబోతే కలవదు. బ్యూటీని టీచర్ కప్పజెప్పి భర్త ఉండే చోటి కెెళ్తుంది. భర్త డే ని చూడగానే ఒక పలకరింపూ పాడూ ఏమిలేకుండా చిరాగ్గా మొహంపెట్టి బ్యూటీ కేమైనా అయిందా?” అంటాడు. కాదంటుంది. ”డబ్బు కావాలా? అంటాడు. అఖ్ఖర్లేదంటుంది. ఇక మనకి డేని మొగుడు గొడ్డుని బాదినట్లు బాదటం కనిపిస్తుంది. ఆ సీన్ని అంతటితో కట్ చేసి, డే మళ్ళీ బస్సులో తిరిగి వస్తునట్లు చూపిస్తాడు. దాన్ని గనక పొడిగిస్తే ఆ విషాదాన్ని ప్రేక్షకులు భరించలేరు. అప్పటికే పేదరికాన్ని భరిస్తూ, ఒంటరిగా పొలం పన్లు చేస్తూ, విత్తనాలు చల్లుతూ, నీళ్ళు మోస్తూ, కట్టెలు కొట్టి మోసు కొస్తూ, పసిబిడ్డతో జీవితంలో ఒంటరి పోరాటం చేయడాన్ని చూస్తున్న ప్రేక్షకులు నీళ్ళుకారిపోతున్నారు. హెచ్.ఐ.వి. అని తెలిశాకహృదయాలు ద్రవించుకుపోతున్నాయి.

ఇంటికొచ్చి గుండెదిటవు చేసుకొని మళ్ళీ ఒంటరిపోరాటం సాగిస్తుంది. ఒకరోజు పొలం నుంచి వచ్చేసరికి ఎదురుగా క్ష్షీణించిన ఆరోగ్యంతో, ఒళ్ళంతా పుళ్ళతో, శిధిలమైన శరీరంతో భర్త వచ్చి నిరీక్షిస్తూ ఉంటాడు. అతని రోగం గురించి ఒళ్ళు గగుర్పొడిచేలా వివరించి చెప్తాడు. ఇద్దరి దుఃఖాన్నీ చాలా దయనీయంగా చూపిస్తాడు. ఈసారి డాక్టర్ నీ శరీరం రోజు రోజుకీ క్షీణించడానికి బదులు బలపడుతుంది, దృఢమవుతుంది అంటుంది. అప్పుడు చూడాలి డే అద్బుతమైన నటనని. ”శరీరం కాదు డాక్టర్, నామనసు రోజు రోజుకీ గట్టిపడుతుందని చెప్తుంది. నాకు స్కూలంటే ఏమిటో తెలీదు. నా బ్యూటీ స్కూలు కెళ్ళేవరకూ బతకాలని నిశ్చయించు కున్నానంటుంది. అది విన్న డాక్టర్కీ, చూస్తున్న మనకీ దుఃఖం కట్టలు తెంచు కుంటుంది కానీ డే చాలా నిబ్బరంగా, నిశ్చలంగా ఉంటుంది.

సమ్మర్-వింటర్-మళ్ళీ సమ్మర్ ఫోటోగ్రాఫ్లో అద్భుతంగా కళ్ళకి కడతాయి. డే జీవితం కళ్ళముందు హృద్యంగా సాగిపోతూ అది మనం రోజువారీ చూస్తున్న, పడుతున్న, ఘర్షణల్లాగే ఉంటుంది. ఇంకా కొద్ది రోజుల్లో చనిపోతానని తెలిసినప్పుడు హృదయాన్ని అతలాకుతలం చేసే స్పందనలన్నింటినీ పాపవైపు ఆశగా తిప్పుకొని కూతుర్ని స్కూలు యూనిఫాంలో మురిపెంగా చూసుకుంటుంది. ఇంత విషాదంలోనూ వేసవిలో చిరుజల్లులా టీచర్ స్నేహం-స్పర్శ డేకి రవ్వంత ఊరటనిస్తాయి. డే తరచూ డాక్టర్ని కలిసేటప్పుడూ, ఊరంతా వెలివేసిన భర్తని ఊరిబయట డే చూసుకుంటున్న క్రమంలో పాప టీచర్కి దగ్గరౌతుంది. టీచర్ కూడా పాప ఎంతో తెలివిగలదనీ, బ్యూటీ బాధ్యతని తనే తీసుకుంటాననీ చెప్తూ ఉంటుంది మధ్య మధ్యలో కలిసిన స్నేహాన్ని చివరివరకూ నిలుపుకోగలిగిన స్నేహితులిద్దరి సౌశీల్యాలు మన గుండెలకంటుకుంటాయి.

రెండే రెండు స్త్రీ పాత్రలు మధ్యలో పాప. డే పాత్రని దర్శకుడు ఎంత ప్రేమగా, ఆర్తిగా, ఉదాత్తంగా చిత్రించాడంటే ఎన్ని పెను తుఫానులొచ్చినా స్త్రీలందరూ తమ లక్ష్యం సాధించేవరకూ డే అంత గట్టిగా నిలబడాలని చెప్పకనే చెప్తాడు. ఎయిడ్స్ సబ్జ్క్ట్ మీద డాక్యుమెంటరీలతో సహా మూడు, నాలుగు సినిమాలొచ్చాయి. ”Yesterday” మనసులో నిలిచిపోయింది! మహిళలందరి వేదనలకీ ప్రదేశం, భాష – వీటన్నిటికీ అతీతమైన ఒక అంతర్జాతీయత ఉంది. రకరకాల సమస్యలతో సతమతమయ్యే స్త్రీలు డేని చూసినప్పుడు ఒక ఆశనీ, ఒక గట్టిదనాన్నీ పొందుతారు. నిరాశా నిస్పృహలు కాకుండా అలాంటి అనుభూతి నివ్వగలిగితే ఇంకేంకావాలి Leleti khualu అనే నటి అద్భుతంగా పాత్రలో జీవించింది.

ఇంకో నచ్చిన సినిమా ”Sophie Scholl-the final days అనే జర్మన్ సినిమా డైరెక్టర్ Marc Rothemund కథానాయిక Julia Jentsch” పెద్ద కథేమీ లేదు. ఒక అన్నా చెల్లెళ్ళు నాజీలదుర్మార్గాలని బహిర్గతం చేస్తూ కరపత్రాలు తయారు చేస్తారు. సినిమా ప్రారంభంలో అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒక మహత్తరకార్యానికి తమని తాము సిద్ధం చేసుకున్నట్లుగా ఆప్యాయంగా అలింగనం చేసుకుంటారు. బ్రీఫ్కేసులు సర్దుకుంటారు. యూనివర్శిటీలో ప్రవేశిస్తారు. అడ్డగించిన వాళ్ళకు సైకాలజీ (బయాలజీ? సరిగా గుర్తులేదు) డిపార్టుమెంట్లో ఫలానా ఫ్రోఫెషర్… ఉంచుతారు. ఒకచోటు నుంచి ఇంకోచోటికి, అక్కన్నుంచి మరోచోటికి వేగంగా, మెరుపుతీగల్లా ప్రత్యక్షమౌతూ మొత్తం కరపత్రాల్ని ఖాళీ చేస్తారు. పూర్తయ్యాక ఖాళీసూట్కేసులతో ఏమీ తెలియనట్లు కిందికి దిగుతుండగా సెక్యూరిటీ గమనించి ఇద్దర్ని పట్టుకుని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ అయిన రోజునుంచి ఇంటరాగేషన్, జడ్జిమెంట్, ఉరితీయడం వరకూ చివరి ఆరురోజులూ జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా వృత్తాంతం.

ఇంటరాగేషన్ లోని సంభాషణ చాలా ఆసక్తిదాయంగా ఉండి గుండెలు పగిలే ఉద్వేగానికి లోనవుతాం. కనురెప్పలు వేయడం మర్చిపోతాం. సన్నివేశం ద్వారా తెలుస్తున్న ఉదాత్తమైన విషయాలు మనసుని మనం లగ్నంచేసే అవసరంలేకుండా సినిమానే తనలోకి ప్రేక్షకుల్ని లాగేసుకుంటుంది. మనుషుల్ని చిక్కుల్లో పడేసే ఎన్ని ప్రజావ్యతిరేక వ్యవహారాలుంటాయో, మనకి తెలియని ఎంత ప్రపంచం ఉందో మనసుగ్గబట్టుకుని చెవులు రిక్కించివింటాం. జూలియా, ఆశలు, పథకాలు, విశ్వాసాలు మనకి తెలుస్తాయి. నాజీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ప్రజలకోసం పడే తపన నిజాయితీ తన మాటల్లోనూ, చూపుల్లోనూ కనపడుతుంది. ఇంటర్వ్యూ చేసే అధికారిని ముప్పతిప్పలు పెడుతుంది. ప్రతి వంకర ప్రశ్నకీ తొణక్కుండా, బెణక్కుండా నిర్భయంగా సమాధానాలిస్తుంది. బాత్రూమ్ కెళ్ళినప్పుడు, ఒంటరిగా రూమ్లో కేర్టేకర్తో ఉన్నప్పుడూ భయంకరమైన సంఘర్షణకి లోనవుతుంది. మిత్రుడికి ఉరిశిక్ష అని తెలిసినప్పుడు అతని భార్యకెవరూ లేరనీ, పసిబిడ్డలున్నారనీ దుఃఖపడుతుంది. 60 ఏళ్ళ తల్లిని తలచుకొని ఈ వయసులో ఎలా తట్టుకుంటుందో అనుకుంటుంది. 50 ఏళ్ళ తండ్రిని తలచుకొని ఫరవాలేదు – తట్టుకో గలడు అనుకొని వాళ్ళ పెంపకమే తననీ తన సోదరుణ్ణీ ఇంత ఉదాత్తమైన మానసిక చర్యలకు ప్రేరేపించిందని. రూమ్లో ఉన్న ఆమెకి చెప్తుంది. తన హృదయంలో వేళ్ళుతన్నుకున్న విశ్వాసాలను వ్యక్తపరుస్తూనే – 21 సంవత్సరాలకు తను తెలుసుకోగలిగిన ఒకే ఒక ఆనందం – ఇతరులకోసం బతక గలగడమని చెప్తుంది. భవిష్యత్తుకోసం ఎంగేజ్ అయిన ప్రియుడితో ఉద్వేగంతో ఎన్నో కలలూ, కోరికల్ని అనురాగాల్ని తెలుపుతూ, వర్తమానంలోని విచారానికి చింతిస్తూ ఉత్తరం రాస్తుంది. ”ఎత్తైన విగ్రహం, నల్లటి జుట్టు, చల్లని చూపులు, నన్నెప్పుడు ఆహ్లాదంగా ఉంచుతాడు అని చెప్తుంది. ముందు ఏ నేరాన్నీ ఒప్పుకోదు. రుజువైనప్పుడు ”ఔను” నాప్రజలకోసం నేనిలా చేయగలిగినందుకు గర్వపడుతున్నానంటుంది.” అసాధారణమైన జ్ఞానంతో వెలిగే స్వయంజ్యోతిలా తన ఆలోచనల్ని చూసేవాళ్ళ హృదయాల్లోకి ఇంకేలా చేస్తుంది. ఎంత గొప్పగా ఆకట్టుకుందంటే తల్లీ తండ్రితో పాటు ఉరిశిక్ష అమలు చేసేముందు ఇంటరాగేట్ చేసిన అధికారి కూడా వచ్చి ఆరాధనగా ఆమెని చూస్తాడు. జడ్జిమెంట్ సీను మొత్తం గోర్కి అమ్మ నవలలూ పావెల్ మాటల్ని గుర్తుతెస్తాయి. ఇవాళ కాకపోతే రేపైనా మీరు మామాటలు నిజమని నమ్ముతారంటారు. ముగ్గురూ ఉరికంబాని వెళ్ళబోతూ సోదరుణ్ణీ, మిత్రుణ్ణీ చెరోచేత్తో దగ్గరికి తీసుకుంటుంది. ఆ సీను ఎంతో అపురూపంగా ఉంటుంది.

” The sun is still shining”

“Long live freedom” అంటూ ఉరికంబమెక్కుతుంది. అంత చిన్న వయసులో జూలియా సాధించిన పరిణతనీ, నిబ్బరాన్నీ చూసి మన హృదయాలు కల్లోల సంతోషా లతో నిండిపోతాయి. అప్పుడు ఒక కర పత్రాన్ని కూడా బైటకి పొక్కనివ్వలేదు నాజీ ప్రభుత్వం ఇప్పుడవి “The German leaflet manifesto to the students of munich” – గా బహుళ ప్రాచుర్యంలోకి వచ్చాయి. నాకీ సినిమా విపరీతంగా నచ్చింది. ఎంతసేపూ పురుషుల చైతన్యాన్ని వాళ్ళు చేసే గొప్ప పనుల్నీ గ్లోరిఫై చేస్తుంది పురుషాధిపత్య సంస్కృతి. అలాంటి గొప్ప వాళ్ళు స్త్రీలలోనూ ఉన్నారని గుర్తించి అద్భుతమైన దృశ్యకావ్యాన్నందించిన Mark Rothemund కి చేతులెత్తి నమస్కరించాలనిపించింది.

”జాతీయమైన కథలు చిత్రాలుగా తీయండి, ప్రపంచ ప్రజలందరూ వాటిని తప్పక చూస్తారు. ఇతర దేశాలకథలను అరువు తెచ్చుకోవద్దు” – అని అన్న ఫ్రాంక్ కాప్రా మాటల్ని కొడవటిగంటి కుటుంబరావు గారు తన సినిమా వ్యాసాల్లో చెప్పారు. ఎవరి కష్టాలని, కన్నీళ్ళని, ఆనందాల్ని వాళ్ళే చెప్పాలనుకున్నప్పుడు స్త్రీల దృష్టి కోణంలోంచి మన మీరానాయర్, అపర్ణాసేన్, కల్పనాలాజ్మి, దీపా మెహతా బ్రహ్మాండమైన సినిమాలు తీశారు. మనందరం హోమ్ ధియేటర్ గురించి ఆలోచించి అందరం కలిసి చూచి, చర్చించుకుంటే అద్భుతాలు చేయొచ్చు ఆలోచించండి!!

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.