మమిడాల శ్యామ్‌సుందర్, పంజాల అశోక్, బి. రమేశ్
మానవ చరిత్రలోని వివిధ నాగరికతలు, మిగిలిన అంశాల సంగతెలా ఉన్నా, ఒక్క అంశంలో మాత్రం దాదాపుగా ఏకీభవించాయి. ఆ ఒక్క అంశం మహిళల్ని నిరాదరించడం. ఇలా మహిళలపై నిరాదరణ కనబరచడం, అసమానత చూపడం, పురుషుల కంటే కిందిస్థాయి అనే భావన ప్రదర్శించడం మానవ హక్కుల్ని కూడా ఉల్లంఘించడమే అవుతుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా మానవాభివృద్ధిని దెబ్బతీస్తూ వస్తోంది. ప్రత్యేకించి భారతదేశం అనేక సంస్కృతులూ, సాంప్రదాయాలు, భౌగోళిక స్వరూపాలు కలిగిన దేశం. అంతేకాదు, మన పురాణాలు మహిళలను ఎంతో ఉన్నత స్థానం మీద కూర్చోబెట్టాయి. మన రుషులు, కవులు కలకంఠి కంట కన్నీరొలకకూడదంటూ కవిత్వాలు చెప్పారు. కానీ కాలక్రమేణా ఈ గౌరవాదరణలు తగ్గిపోవడం, వాటి స్థానే స్త్రీ అంటే చులకనభావం, సమాజంలో మహిళల స్థానం పురుషుల కిందేననే అభిప్రాయం పెరిగిపోయాయి. వాటితో బాటు మహిళలను నిరాదరించడం, వారిపై హింసకు పాల్పడటం సర్వసాధారణమైపోయి. భారతదేశం పురుషాధిక్య సమాజంగా ప్రపంచమంతటా ముద్ర వేయించుకుంది.
భారతదేశానికి 63 ఏళ్ల కిందటే స్వాతంత్రం వచ్చినా ఇక్కడి మహిళలకు మాత్రం స్వాతంత్య్రం, సమానత్వం రాలేదు. మన సామాజిక నిర్మాణం, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆంక్షలు మహిళల ఆత్మగౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని దారుణంగా దెబ్బతీయడమే కాకుండా మహిళల్ని అణగదొక్కే సామాజిక దురాచారాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలు తలెత్తడానికి కారణమయ్యాయి. ఒక పక్క దేశాన్ని భారతమాతగా పిలుస్తూనే మరోపక్క దేశం మహిళలను ‘సతి’ బాల్యవివాహాల వంటి దురాచారాలకు, గృహహింసకు బలిచేస్తూ వచ్చారు. 19, 20వ శతాబ్దాల్లో సాంఘిక పునరుజ్జీవనోద్యమం జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం రేకెత్తి వీటిలో అనేక దురాచారాలు అంతమయ్యాయి. మహిళల కోసం పలు రాజ్యాంగ, న్యాయపరమైన చర్యలు తీసుకున్నారు. సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. 20వ శతాబ్దం మొదట్లో ప్రపంచ వ్యాప్తంగా మహిళల హక్కుల పరిరక్షణ కోసం, సమస్యల పరిష్కారం కోసం అనేక స్త్రీవాద ఉద్యమాలు తలెత్తాయి. వాటితోపాటు మనదేశంలో కూడా ఉద్యమాలు రేకెత్తి మహిళల సమస్యలపై అనేక గొంతులు నినదించడం మొదలైంది. అనేక స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంస్థలు ప్రత్యేకించి మహిళల హక్కు కోసం ఉద్యమించాయి. జనాభాలో సగం ఉన్న మహిళల హక్కుల కోసం ఉద్యమించాయి. జనాభాలో సగం ఉన్న మహిళలకు పురుషులతో సమానంగా ఏ రంగంలోనూ హక్కులు, అవకాశాలు అందకపోవడం, ఎంత తెలివి, ప్రతిభ ఉన్నా వంటింటికే పరిమితమైపోవడం సహించలేక మహిళలు తిరగబడటం కూడా మొదలైంది. సమాజంలో మహిళల స్థితిగతులు మెరుగు పడనిదే అభివృద్ధి సాధ్యం కాదని గ్రహించిన ప్రభుత్వం కూడా మహిళా సంక్షేమానికి పలు చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. పక్షి ఒంటి రెక్కతో ఎగరడం సాధ్యం కానట్లే మహిళా సాధికారత లేని సమాజాన్ని ఊహించడం కష్టమన్న వివేకానందుడి మాటలు అక్షరసత్యాలు.
మహిళల సమస్యలు – సాధికారత
ప్రస్తుతం భారత సమాజంలో మహిళలు కొన్ని దశాబ్దాల కిందట ఉన్న విధంగా లేరు. ప్రతీ రంగంలోనూ పురుషులతో సమానంగా పోటీ పడుతూ ముందుకు దూసుకుపోతున్నారు. ముఖ్యంగా విద్యారంగంలో మగవారికన్నా స్త్రీలే ఎక్కువగా రాణిస్తున్నారు. స్త్రీలు వంటింటికే పరిమితమన్న ముద్రను దాదాపుగా తుడిచిపెట్టి దేశ ప్రగతికి అన్ని విధాలగానూ మగవారితో సమానంగా తమవంతు కృషి చేస్తున్నారు.
అయితే ఈ అభివృద్ధి అన్ని రంగాలకూ విస్తరిస్తోందా? సమాజంలో అన్నివర్గాల మహిళలూ ఒకేరకంగా ప్రగతి సాధించగలుగుతున్నారా? దేశంలో మహిళలందరికీ సాధికారత లభిస్తోందా? దేశం ముందుకు పోయేలా చేసేందుకు అవసరమైన అధికారాలు, శక్తులు, సామాన్య మహిళలకు దక్కుతున్నాయా? అనే ప్రశ్నలకు మాత్రం జవాబు – లేదు అనే వస్తుంది. మహిళా సాధికారత అంశం భారతదేశంలో చాలాకాలంగా చర్చనీయాంశంగానే ఉంటూ వస్తోంది. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజ వేస్తున్నా ఇంకా వారిపై వివక్ష తొలగడం లేదు. వారికి సమానహక్కులు దక్కడం లేదు. ఉద్యోగాల్లోనూ, భూమి, తదితర వారసత్వ ఆస్తుల పంపకంలోనూ ఇప్పటికీ పురుషాధిక్యతే చెల్లుబాటు అవుతోంది. అన్నింటికీ మించి ఇంటా బయటా కూడా మహిళలపై హింస ఏమాత్రం తగ్గలేదు సరిగదా, ఇది ప్రపంచవ్యాప్తంగానూ మనదేశంలోనూ కూడా పెరుగుతూ వస్తోంది. మహిళా హక్కుల ఉల్లంఘనలు వారిపై ప్రదర్శించే అసమానతల కారణంగా వారు పురుషులకన్నా తక్కువనే భావనే ఇంకా సమాజంలో కొనసాగుతున్నట్లు చెప్పుకోవచ్చు. భారత ప్రభుత్వం మహిళా సాధికారత గురించి ఎన్నో పథకాలు ప్రవేశపెడుతూ వస్తోంది. రాజకీయంగా కూడా మహిళలకు సాధికారత కల్పించేందుకు మహిళా రిజర్వేషన్ల బిల్లు తయారుచేశారు. కానీ ఇవన్నీ ప్రణాళికలే, వాస్తవంగా జరుగుతున్నది మాత్రం తక్కువే. ఇప్పటికీ ఎంతో కొంత ప్రగతి, సాధికారత సాధించిన మహిళలే వీటివల్ల లాభపడుతున్నారు. కానీ నిజంగా గ్రామీణ అట్టడుగు స్థాయి మహిళలకు దక్కుతున్నది శూన్యం. ఈ వర్గాల్లోని కోట్లకొద్దీ మహిళలు ఇంకా పురుషుల కంటే కిందిస్థాయిలోనే రెండో తరగతి పౌరులుగానే జీవిస్తున్నారు. సమాజంలో పురుషాధిక్యత పూర్వం మాదిరిగా లేకపోయినా అది రూపం మార్చుకొని కొనసాగుతూనే ఉంది. మయన్మార్ దేశంలో ప్రజాస్వామ్యయుతమైన ఎన్నికల్లో ఆ ఉద్యమ నాయకురాలు ఆంగ్‌పాన్ సూకీ నెగ్గినా ఆమెకు అధికారం దక్కకుండా రెండు దశాబ్దాలకు పైగా ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. ఇదో రకం అణిచివేత కాగా, ఎందరో మహిళలు ప్రతిభా సామర్థ్యాలున్నా పురుషులతో సమానమైన పదవులు, వేతనాలు పొందలేకపోవడం వివక్షకు మరో రూపం. స్త్రీలు శారీరకంగా సమర్థులు కారనో, బలహీనులనో చెప్పి వారికి అవకాశాలే ఇవ్వని రంగాలు ఇంకా అనేకం ఉన్నాయి. కుటుంబసభ్యులు దగ్గర నుంచి సమాజంలో పౌరుల దాకా దాదాపు పురుషులంతా మహిళలకు అవకాశాలు ఇవ్వడానికి వెనుకంజ వేస్తారు. కొన్ని రంగాల్లో మహిళలు మగవారికంటే ఎక్కువ సమర్థంగా పనిచేస్తారని వారికి తెలుసు. చాలాసార్లు పురుషుల కన్నా మహిళలే తమ పనిపట్ల ఎక్కువ అంకితభావం కలిగి ఉంటారని అధ్యయనాలు కూడా రుజువు చేశాయి. ఇందుకు ఉదాహరణలుగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు, సివిల్ సర్వీసుల వంటి పరీక్షల ఫలితాలు తీసుకుంటే ఉత్తీర్ణులైన వారిలో ఆడపిల్లల శాతం ఎక్కువగా ఉండటం తరచుగా కనబడుతోంది. అయినా ఉపాధి, వేతనాల దగ్గరికొచ్చేసరికి (ప్రైవేటు రంగంలో) మహిళలు కింది స్థాయిలోనే ఉంటుండటం సర్వసాధారణం. అంతేకాదు యుద్ధసమయాలైనా, శాంతి సమయాలైనా మహిళలే సమాజంలో బలిపశువులుగా ఉంటున్నారు. అనేక రకాల హింస, వేధింపుల్ని ఎదుర్కొంటున్నారు. ఇక మహిళల మీద లైంగిక నేరాలకు అంతే లేకుండా పోతోంది.
ప్రస్తుతం ప్రపంచమంతా అన్ని రంగాల్లోనూ అతివేగంగా ముందుకి దూసుకుపోతోంది. ఇప్పటికైనా ఈ పురుషాధిక్య ధోరణి మారాల్సి ఉంది. మహిళలకు సమానత్వం దక్కాల్సిన అవసరం ఉంది. ఇటీవలి కాలంలో ఈ పరిస్థితి కొంత మారుతూ వస్తున్నా, సమూలమైన మార్పుకు భారీ కృషి చేయడం తక్షణావసరం. మహిళలకు పై స్థానం కట్టబెట్టాలనో, ఇంకా ఇంకా హక్కులు కల్పించాలనో వారు కోరడం లేదు. ప్రస్తుత మహిళలు కోరేదల్లా కేవలం సమానత్వం, అన్ని రంగాల్లోనూ సమానస్థాయి, సమానావకాశాలు. అంటే ఇందుకుగాను సమాజంలో స్త్రీ స్థానం మారాల్సి ఉంది. దేశంలో సగం జనాభా మహిళలే అయినపుడు కీలక నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలన్నింటిలోనూ వారు సగభాగాన్ని కోరడంలో తప్పేముంది? శారీరక, సామాజిక అంశాల్లో మహిళలకు, మగవారికి తేడాలున్నా చట్టం ముందు, పార్లమెంటరీ వ్యవస్థ ముందు అందరూ ఒక్కటే. అందుకే అలాంటి కీలక వ్యవస్థలో వారి పాత్ర, వాటా నిర్ణయాత్మకంగా ఉండాలంటే వాటిలో సగం స్థానాలు మహిళలకు దక్కాలి. మహిళలకు సాధికారత లభిస్తే మొత్తం సమాజమంతా లాభపడుతుంది. వారి కుటుంబాలు, పిల్లలు ప్రయోజనం పొందుతారు. అన్ని రంగాల్లోనూ ఉత్పాదకత, చైతన్యం పెరుగుతుంది.
మహిళలు – ఆర్థిక హక్కులు
శతాబ్దాల తరబడి మహిళల అణచివేత, దోపిడీలు కొనసాగడానికి ఏకైక కారణం మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడమేనన్నది నిర్వివాదాంశం. స్త్రీలు చిన్నతనం నుంచీ ఆర్థికావసరాల కోసం మొదట తండ్రి, తర్వాత భర్త, తర్వాత కుమారుడు లేదా ఇతర బంధువులు మీద ఆధారపడాల్సిన పరిస్థితి మన సమాజంలో కొనసాగుతోంది. ఏ మతం లేదా వర్గానికి చెందినవారైనా మహిళలకు ఆర్థికహక్కులు చాలా తక్కువగానే ఉన్నాయి. వారసత్వ ఆస్తులపై కూడా వారి హక్కులు పరిమితమే. ఇటీవలే 2005లో హిందూ మహిళలకు తల్లిదండ్రుల ఆస్తులపై వారసత్వ హక్కులు ఇవ్వబడ్డాయి. మహిళా కార్మికులకు సంబంధించి కంపెనీలుగానీ, ట్రేడ్ యూనియన్లు గానీ ఎలాంటి సదుపాయాలూ కల్పించే ఆలోచనే పెట్టుకోవని అంతర్జాతీయ కార్మిక సంస్థ వ్యాఖ్యానించింది. మహిళా సమస్యలు తీర్చేందుకు పై రెండూ సంస్థలు అంత తేలిగ్గా ముందుకి రావు. ఎందుకంటే కంపెనీల్లో ఉద్యోగుల సంస్థలు, ట్రేడ్ యూనియన్లలో మహిళా ప్రతినిధులు, నాయకులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి. ఇక బాలకార్మికుల విషయానికొస్తే అక్కడ కూడా బాలికలు తీవ్రంగా కనిపించని దోపిడికి గురవుతుంటారు. ఎందుకంటే ఇలాంటి బాలికల్లో ఎక్కువమంది ఇళ్ళలో పనివారిగా ఉంటారు. అక్కడ తరచుగా ఆర్థికంగా, శారీరకంగా, లైంగికంగానూ దోపిడికి గురవుతుంటారు కాబట్టి, గ్రామీణ మహిళలకు ఇప్పటికీ ఉన్నతవిద్య అనేది సుదూర స్వప్నంగానే ఉంటూ వస్తోంది. కనుక వారికి ఆర్థిక స్వేచ్ఛ లభించడమనేది గగనకుసుమమే. అయినా గ్రామాల్లో వ్యవసాయంలోనూ, చేతివృత్తుల్లోనూ ఎక్కువ సంఖ్యలో మహిళలే ఉంటున్నందున ఉత్పాదకతలో వారి వాటా తక్కువేమీ కాదు. కానీ వారు గడించిన సొమ్మును వారు ఖర్చుపెట్టుకునే స్వాతంత్య్రం మాత్రం వారికి దక్కడం లేదు. నగరాల్లో ఉద్యోగాలు చేసే మహిళల విషయంలో కూడా ఇది చాలావరకూ వర్తిస్తుంది. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితి కొంత మారుతూ వస్తోంది.
వ్యవసాయరంగం
వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మహిళలు ఉత్పత్తిదారులుగా, కార్మికులుగా, వినియోగదార్లుగా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ రంగాల్లో వీరి విజ్ఞానాన్ని పెంచి, చైతన్యవంతుల్ని చేసేటందుకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారి పరిస్థితులు మెరుగుపరచవలసి ఉంది.
పరిశ్రమలు (ఉత్పత్తిరంగం, సర్వీసులు)
భారీ పరిశ్రమల్లో మహిళల సంఖ్య బాగా తక్కువే అయినా, ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక రంగం, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు, చిన్నతరహా వృత్తులు, దుస్తుల తయారీ వంటి రంగాల అభివృద్ధిలో మహిళల పాత్రే కీలకం.అందుకే ఈ రంగాల్లో వారికి కార్మిక చట్టాలు వర్తింపజేయడం, సామాజిక భద్రత, ఇతర సదుపాయాలు కల్పించడం అత్యవసరం. ముఖ్యంగా పిల్లలకు శిశుకేంద్రాలు, డే కేర్ సెంటర్లు తదితరాల్ని మహిళలు పనిచేసే స్థలాలలో ఏర్పాటు చేయాలి. ప్రపంచంలో పలుదేశాల్లో స్త్రీలకు ఇలాంటి సదుపాయాలున్నా భారత్‌లో ఇవి చాలా తక్కువగానే ఉంటున్నాయి. అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలకు కేటాయించిన నిధుల్లో 30 శాతం మహిళలకు కేటాయించాలని 9వ ప్రణాళికలో స్పష్టంగా పేర్కొన్నా, ఆచరణలో అది చిత్తశుద్ధిగా అమలవటంలేదు. ఈ వ్యూహాన్ని ఈ ప్రణాళికలో విమెన్స్ కాంపానెంట్ ప్లాన్‌గా గుర్తించారు. దీన్ని సమీక్షించే పని మహిళా శిశు అభివృద్ధి శాఖకు ఇచ్చారు.
మహిళల ఆస్తి హక్కులు
అయిదో ప్రణాళికా కాలం నుంచీ (1974-78) విధానకర్తలు, మహిళల సంక్షేమం నుంచి వారి అభివృద్ధి, సాధికారతల దిశగా దృష్టి మళ్లించారు. 1956 నాటి హిందూ వారసత్వ చట్టం కుమార్తెకు కుమారుడితో సమానంగా ఆస్తిహక్కు ఇచ్చింది. 2005లో దీనికి సవరణ జరిగింది. అప్పటినుంచి తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెలకు సమాన వాటా ఇవ్వడం అమలు జరుగుతోంది. 1973 నాటి చట్టం ప్రకారం విడాకులు తీసుకున్న మహిళకు భర్త నెల నెలా భరణం చెల్లించడం తప్పనిసరి చేశారు. 1985లో షాబానో కేసులో సుప్రీంకోర్టు దీన్ని అన్ని మతాలవారు పాటించడం న్యాయమని పేర్కొంది. వివాహితులైన మహిళలకు కూడా తండ్రి ఆస్తిలో వాటా కల్పించే చట్టం 80వ దశకంలోనే వచ్చింది.
మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వ పథకాలు:
స్వయం సిద్ధ :
స్వయం సహాయక బృందాలు, సేవల ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధికి, సాధికారతకూ సమీకృతంగా కృషిచేసే ఈ పథకాన్ని 2001వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. మహిళలు సూక్ష్మస్థాయి వ్యాపారాలు చేసుకొనేందుకు, ఉపాధి కల్పించుకొనేందుకు సూక్ష్మరుణాలను అందించేందుకు ప్రోత్సాహం లభిస్తుంది. దీన్ని ”ఇందిరా మహిళా యోజన”గా కూడా పిలుస్తారు. దీని కింద ఈ పథకం అమలు చేసే సంస్థల ద్వారా (ఆజీళిశీలిబీశి |ళీచీజిలిళీలిదీశిరిదీవీ జువీలిదీబీరిలిరీ) నాలుగైదేళ్ల పాటు కొనసాగే బ్లాకుస్థాయి ప్రాజెక్టుల, ప్రణాళికల రూపకల్పన, అమలు సమీక్ష జరుగుతాయి. ఈ సంస్థలు ప్రభుత్వానికి సంబంధించినవైనా కావచ్చు, ప్రభుత్వేతర సంస్థలయినా కావచ్చు, రాష్ట్రప్రభుత్వాలు గుర్తించినవైనా కావచ్చు. ఇప్పటిదాకా దీనికింద దేశవ్యాప్తంగా 659 బ్లాకుల్లో 52,016 స్వయం సహాయక బృందాలేర్పడ్డాయి.
స్వశక్తి పథకం :
1998 అక్టోబర్‌లో మొదలైన ఈ పథకాన్ని మొదట్లో గ్రామీణ మహిళల అభివృద్ధి, సాధికారతల పథకంగా పిలిచారు. పూర్తిగా కేంద్రం ఆధ్వర్యంలోని పథకమైన దీన్ని ఐదేళ్ళపాటు రూ.186 కోట్ల వ్యయంతో బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో అమలు చేశారు. బండచాకిరీని తగ్గించుకొని జీవిత ప్రమాణాలను పెంచుకునేటందుకు అవసరమైన గృహోపకరణాల్ని కొనుగోలు చేయడానికి మహిళలకు ఆర్థికపరంగా సాయపడటం, విద్య ఆరోగ్య రంగాల్లోనూ నైపుణ్యాల్ని పెంపొందించుకునేటందుకూ అవకాశాలు కల్పించడం, ఉపాధి దొరికే కార్యక్రమాల రూపకల్పన చేసి మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. దీనికింద 17,647 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ పథకానికి ప్రపంచబ్యాంకు, వ్యవసాయాభివృద్ధి అంతర్జాతీయ నిధి సంయుక్తంగా నిధులందించాయి.
మహిళల ఉపాధి, శిక్షణా కార్యక్రమాలకు మద్దతు (ఐఊజూఆ) :
ఎనిమిది సాంప్రదాయ ఉపాధి కల్పనా రంగాలైన వ్యవసాయం, పశుపోషణ, పాలకేంద్రాలు, మత్స్య పరిశ్రమ, చేనేత, చేతివృత్తులు, ఖాదీ, గ్రామోద్యోగ పరిశ్రమలు, పట్టుపురుగుల పరిశ్రమ వీటిలో మహిళల నైపుణ్యాలు పెంపొందింపజేసి కొత్త సాంకేతికతలకు అనువుగా సర్దుబాట్లు చేసుకునే విజ్ఞానాన్ని అందించడం దీని లక్ష్యం. ఈ పథకాన్ని ప్రభుత్వరంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, సహకార సంస్థలు, సమాఖ్యలు, స్వచ్ఛంద సంస్థలు (కనీసం మూడేళ్లు పనిచేసినవి) తదితరాల ద్వారా అమలుచేస్తున్నారు.
స్వావలంబన :
మహిళకు ఉపాధి లేదా స్వయంఉపాధి కల్పనకు తోడ్పడే విధమైన నైపుణ్యాల నేర్పడం, శిక్షణనివ్వడం దీని లక్ష్యం. కంప్యూటర్, ప్రోగ్రామింగ్, మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్, ఎలక్ట్రానిక్ అసెంబ్లింగ్, వినియోగ ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మతు, రేడియో, టీవీ మరమ్మతులు, దుస్తుల తయారీ, చేనేత, చేతివృత్తులు, సెక్రటేరియల్ నైపుణ్యాలు, సామాజిక వైద్యసేవలు తదితర అంశాలలో శిక్షణ ఇస్తారు.
శిశుకేంద్రాలు (క్రెష్‌లు)
పనిచేసే మహిళలు, వ్యాధులతో బాధపడే మహిళల పిల్లల కోసం (0-5 వయస్సు మధ్యగల పిల్లలు) శిశుకేంద్రాల ఏర్పాటు పథకం ప్రారంభించారు. నెలకు రూ.1800 ఆదాయం మించని కుటుంబాల్లోని పిల్లలకు ఇక్కడ ఉచితసేవలు, సౌకర్యాలు లభిస్తాయి. కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ, మరో రెండు స్వచ్చంద సంస్థలు (బాలల సంక్షేమ కేంద్రం, భారతీయ ఆదిమజాతి సేవక సంఘం) ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి.
వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు :
ప్రస్తుతం ఉన్న హాస్టల్ భవనాల విస్తరణ, కొత్తవాటి నిర్మాణం; వాటిలో శిశుకేంద్రాల (డే కేర్ సెంటర్ల నిర్మాణం) తదితరాలన్నీ ఈ పథకం కింద 1972 నుంచి అమలవుతూ వస్తున్నాయి. దీని కింద ఎన్జీవోలు, సహకార సంస్థలు, మహిళా సంక్షేమ సంఘాలు, మహిళాభివృద్ధి సంస్థలు, ప్రభుత్వాలు మొదలైన వాటన్నింటికీ మహిళా హాస్టళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. స్వంత ఊరికి దూరంగా ఉద్యోగాలు, పనులు చేసే ఒంటరి మహిళలకు, విదార్థినులకు చవకగా, సౌకర్యవంతమైన నివాసస్థలం అందించడమే దీని లక్ష్యం.
స్వాధార్ :
ఏ ఆధారమూ లేని వితంతువులు కుటుంబాల చేత వదిలిపెట్టబడ్డవారు, సమస్యల్లో చిక్కుకున్న మహిళలు తదితరులందరికీ పూర్తిస్థాయిలో సమీకృత సేవలందించేటందుకు గాను ఈ పథకాన్ని 2011-02లో ప్రవేశపెట్టారు. వీరేకాక జైలు నుంచి విడుదలైన మహిళా నేరస్తులు, ప్రకృతి వైపరీత్యాల్లో అందరినీ కోల్పోయి దిక్కులేనివారిగా మిగిలిన పేదలు, వ్యభిచార గృహాల నుంచి రక్షింపబడినవారు. వివిధ కారణాల వల్ల తమ స్వగృహాలకు వెళ్ళలేని మహిళలు వీరందరికీ కూడా ఈ పథకం ద్వారా ఆర్థికసాయమే కాకుండా తిండి, బట్ట, వసతి మొదలైనవి కల్పించడం జరుగుతుంది. వాటితోబాటు వైద్య, ఆరోగ్య సేవలు, న్యాయసహాయం, సామాజిక, ఆర్థిక పునరావాసం కోసం విద్యా సౌకర్యాల కల్పన, చైతన్యపరచడం, నైపుణ్యాలు మెరుగుపరచడం తదితరాలు కూడా అందిస్తారు. ఆపదల్లో ఉన్న మహిళలకు సాయపడటం కోసం ఒక హెల్ప్‌లైన్ కూడా దీనికింద పనిచేస్తోంది.
రాష్ట్రీయ మహిళాకోశం :
మహిళల కోసం ”జాతీయ రుణ నిధి”గా పిలిచే ఈ పథకం సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం-1860 కింద 1993 మార్చి, 30వ తేదీన రిజిస్టర్ అయింది. పేద మహిళలు స్వయంఉపాధికల్పన కోసం పాల ఉత్పత్తి కేంద్రాలు, వ్యవసాయ సంబంధిత వృత్తులు చేతివృత్తులు ఏర్పాటు చేసుకునేందుకు సూక్ష్మ రుణాలు అందించడం దీని లక్ష్యం.
స్త్రలిదీఖిలిజీ ఔతిఖివీలిశిరిదీవీ లేద మహిళల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు :
2005-06 సంవత్సరం నుంచి ఈ రకమైన బడ్జెట్ కేటాయింపు వ్యవస్తీకృతం చేశారు. దీనికింద బడ్జెల్‌లోని ప్రతీ అంశంలోనూ మహిళలకు ప్రత్యేయకించి కేటాయింపులు చేస్తున్నారు.
ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు :
2009 నవంబర్‌లో భారత ప్రభుత్వం బాలింతలు, శిశు మరణాల రేట్లను (ఎం.ఎం.ఆర్, ఐ.ఎం.ఆర్) తగ్గించడం కోసం నవజాత శిశు సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికింద వీరి సంరక్షణ కోసం ఆరోగ్య కేంద్రాల్లోని సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందజేస్తారు. బాలింతలు, నవజాత శిశువులకు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడటం, చలి, తదితర కారణాల వల్ల అనారోగ్యం బారిన పడకుండా చూడటం, నవజాత శిశువుకు వెంటనే తల్లిపాలు తాగించే పద్ధతులు తదితరాల గురించి శిక్షణ అందిస్తారు. జనాభా స్థిరీకరణకు కూడా ఈ పథకం ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ స్థాయికి చేరుకున్నాయి. భారతదేశంలో ఒక్కో మహిళకు బిడ్డల్ని కనే రేటు (ఊళిశిబిజి ఓలిజీశిరిజిరిశిగి) 2007 నాటికి 2.7గా ఉంది దీన్ని 2010 నాటికి 2.1గా చేయాలని మొదట లక్ష్యం నిర్దేశించుకున్నారు. అయినా అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. 2015 నాటికి దీన్ని సాధించడం వీలవవచ్చు.
జాతీయ మహిళా అక్షరాస్యతా మిషన్ :
2009 సెప్టెంబర్ 8వ తేదీన దీన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 2012 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 7 కోట్ల మందికి కనీస అక్షరాస్యత కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ ఏడుకోట్లలో ఆరుకోట్లమంది మహిళలు. ఆ విధంగా స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యత అంశంలో ఉన్న తేడాను అధిగమించి, మహిళలకు ఉపాధి కల్పన అవకాశాల్ని మెరుగుపరచాలని నిర్ణయించారు. ఆర్థికరంగంలో మౌలిక వసతుల రంగం, సామాజికంగా మహిళల అక్షరాస్యత ఈ రెండింటికీ అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించడం గమనార్హం. ఈ పథకానికి సాక్షరతా భారత్ మిషన్ అనే పేరు పెట్టారు.
కౌమార, యుక్త వయసులోని బాలికల పోషకాహార స్థాయి పెంచడం, పోషకాహార లోపాలు తొలగించడం, ఆరోగ్యం, పరిశుభ్రత, పునరుత్పత్తి, లైంగిక ఆరోగ్యం తదితర అంశాల్లో వారి చైతన్యం పెంచడం, వారికి వృత్తిపరమైన శిక్షణ అందించడం, తదితరాల ద్వారా ఆ బాలికలకు సాధికారత కలిగించడం లక్ష్యాలుగా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని పేరు రాజీవ్‌గాంధీ కౌమార వయసు బాలికల సాధికార పథకం (ష్ట్రస్త్రఐజూజుస్త్ర) లేదా సబల! ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి శాఖ కింద నడుస్తున్న కిశోర శక్తియోజన, మహిళా శిశు అభివృద్ధి శాఖ కింద నడుస్తున్న కిశోర శక్తియోజన, మహిళా శిశు అభివృద్ధి శాఖ కింద నడుస్తున్న కౌమార బాలికల పోషకాహార కార్యక్రమాల్ని 2011-12 నాటికి ఇందులో కలిపేస్తారు. దీన్ని అంగన్‌వాడీల ద్వారా అమలు చేస్తారు. దేశంలో మొత్తం 8 కోట్ల మంది కౌమారదశ బాలికలు (అంటే మొత్తం దేశ మహిళా జనాభాల్లో 17 శాతం) దీనివల్ల ప్రయోజనం పొందనున్నారు రోజుకి ఒక్క బాలికకూ రూ|| 5లకు 500 కాలరీల ఆహారం అందజెయ్యాలన్నది దీని లక్ష్యం.
సాయుధ దళాల్లోకి ఎంపిక చేసిన మహిళలకు (షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లు) అదే స్థాయిలోని పురుషులతో సమానంగా శాశ్వతంగా ఉద్యోగం (కమిషన్) కొనసాగించాలని డిల్లీ హైకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. సరైన కారణాలు చూపకుండా వారిని శాశ్వతంగా కొనసాగించకపోవడం మహిళల పట్ల వివక్షగా పరిగణించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. వివిధ అంశాల్లో మహిళలకు సమానత్వం కల్పించడంలో ఈ తీర్పు మార్గదర్శకమవుతుందని అశిస్తున్నారు.
సురక్షిత, గౌరవ పూర్వకమైన పర్యాటక రంగం :
మహిళలు, పిల్లలకు సురక్షిత, గౌరవ పూర్వక సౌకర్యాలు కల్పించే విధంగా పర్యాటకరంగాన్ని తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ఇటీవల కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పర్యాటక సేవలందించే సంస్థలకు ఒక ప్రవర్తనా నియమావళిని, రూపొందించారు మన సంస్కృతి, విలువలు, వారసత్వాన్ని కాపాడే విధమైన, సుస్థిర బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. మహిళలకు భద్రత కల్పించడానికి ప్రాధాన్యతనిచ్చారు.
నిశ్చయ్ :
గ్రామీణ మహిళలు స్వయం పరీక్షా కిట్ల ద్వారా గర్భ నిర్ధారణ చేసుకునేందుకు వీలుగా చైతన్య పరిచేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా అమలు చేస్తున్నారు. ఈ కిట్లు (ఐలిజితీ జుఖిళీరిదీరిరీశిలిజీలిఖి ఆజీలివీదీబిదీబీగి ఊలిరీశి చరిశి) గ్రామీణ మహిళలకు ఏక్రిడిటెడ్ సోషల్ హెల్త్ ఏక్టివిస్ట్స్ (జుఐకజు) సంస్థ దగ్గర గానీ, స్థానిక గుర్తింపు పొందిన నర్సులు / మత్రసానుల దగ్గర ఉచితంగా దొరుకుతాయి. ఈ పథకం బాలింతలు, శిశు మరణాల రేట్లను తగ్గించేందుకు, గర్భిణుల ఆరోగ్యం గురించి చైతన్యం కల్పించేందుకు ఉద్దేశించబడింది. ఇంకా తల్లిపాల ప్రాధాన్యత, పోషకాహారం, కాన్పు తర్వాత పరిశుభ్రత పాటించడం, బిడ్డల మధ్య ఎడం ఉంచడం మొదలైన వాటి గురించి కూడా తెలియజేస్తుంది.
స్వయం సహాయక బృందాలు :
స్వయం సహాయక బృందాల భావనను బంగ్లాదేశ్ అనుభవం నుంచి భారత్ స్వీకరించింది. అక్కడ నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనస్ గ్రామీణ సేదలు, ప్రత్యేకించి మహిళల సాధికారత కోసం ఈ పథకాన్ని రూపకల్పన చేసి అద్భుత విజయాలు సాధించారు. దాదాపు పదిమంది వ్యక్తులతో బృందాలు ఏర్పాటు చేస్తారు. ప్రతి బృందానికి ఏదో ఒక ఉత్పాదక, ఆర్థిక కార్యక్రమం ఏర్పాటుకు కొంత ధనాన్ని అందిస్తారు. తాకట్టులేని ఈ రుణాలపై వడ్డీ రేట్ల కాస్త ఎక్కువగానే వసూలు చేస్తారు. వారు ప్రారంభించిన పథకాల విజయానికి, రుణం వాపసు ఇవ్వడానికీ బృందంలోని వారంతా సమానంగా బాధ్యత వహించాలి.
సూక్ష్మఋణాలు :
దేశంలో మహిళలకు గృహ వినియోగం, ఉత్పత్తి పెంపు కోసం రుణాలందిచేందుకుగాను సూక్ష్మరుణాలు అందించే యంత్రాంగం ఒకటి రూపుదిద్దుకుంది. దీన్ని మరింత బలపరచడం, సూక్ష్మ ఆర్థిక సంస్థలను ఉద్యమాల ఆధారంగా నెలకొల్పడం వీటిద్వారా మహిళలకు సాయపడటం తదితరాలు ఇంకా బాగా విస్తరించాల్సి ఉంది. వీటిద్వారా దారిద్య్రరేఖకు దిగువనున్న మహిళలకు సులువుగా రుణాలందించే సౌకర్యాలు కూడా కల్పించాలి.
గతంలో ఈ స్వయం సహాయక బృందాలు, సూక్ష్మ రుణాల కార్యక్రమాలు అత్యంత విజయవంతంగా దేశంలో అమలు జరిగాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా బృందాలు ఈ దిశగా అద్భుత ప్రగతి సాధించాయి. కానీ తర్వాత ఈ ఉద్యమం చల్లారింది. ప్రస్తుతం ఇందులో మళ్లీ పునరుత్తేజం కల్పించాల్సి ఉంది. ఇలాంటి బృందాలు మహిళల మధ్య సహకారం, తోడ్పాటు, కలిసి పని చెయ్యడం తదితరాలను పెంపొందింపజేసి వారికి ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందిస్తాయి వారి ఆత్మవిశ్వాసం పెంపొందింపజేస్తాయి. తద్వారా మహిళా సాధికారిత సాధ్యమవుతుంది.
రిఫరెన్స్ :
1) జు.చ. ఆబిదీఖిలిగి : స్త్రలిదీఖిలిజీ జూవితిబిజిరిశిగి బిదీఖి ఇళిళీలిదీ జూళీచీళిగీలిజీళీలిదీశి, జుదీళీళిజి ఆతిలీజిరిబీబిశిరిళిదీ, ఆఖీశి. ఉశిఖి. 2) మహిళాసాధికారత జుఆఖజుజుఐ (మాసపత్రిక)
3) మహిళల స్థితిగతులు
(రిసెర్చ్ విద్యార్థులను ప్రోత్సహించడం కొరకు ప్రచురించిన వ్యాసం)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
మహిళాసాధికారత గురింంచి ఆమూలాగ్రంం స్పృృశి0చారు. విషయంం చాలా బాగుంంది.