సంపాదకీయం – యువ కెరటాలు : ఇలాగే ఎగిసి పడాలి

అనకాపల్లి వెళ్లింది ఓ అవార్డ్‌ పంక్షన్‌లో అతిధిగా పాల్గోడానికి. ‘సమాలోచన’ సంస్థను నడిపే చక్రధర్‌ నెలరోజుల క్రితం ఫోన్‌ చేసి జూలై 20న అనకాపల్లి రావాలని, బాషా చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించే అవార్డు ప్రదానోత్సవంలో ముఖ్యఅతిధిగా పాల్గొనాలని ఆహ్వానించాడు. అవార్డు వివిరాలు అడిగితే… చాలా చిన్న వయసులో చనిపోయిన బాషా అనే అబ్బాయి, మంచి సామాజిక కార్యకర్త అని అతని పేరు మీద మూడేళ్ళ క్రితం ఈ అవార్డును ఏర్పాటు చేసామని చెప్పాడు. అవార్డు ఎవరికిస్తున్నారు అంటే తమ్మినేని నిర్మల అనే యువ సామాజిక కార్యకర్త ‘గట్టు’ అనే గ్రామంలో చాలా స్ఫూర్తివంతంగా పనిచేస్తున్నారని… ఈ ‘గట్టు’ మహబూబ్‌నగర్‌లో అత్యంత వెనుకబడిన ప్రాంతమని ఆమెకు ఈ అవార్డునివ్వాలని జ్యూరీ నిర్ణయించారని చెప్పాడు. ఈ మధ్య ఈ ‘గట్టు’ మండలం గురించి ప్రశాంతి, మహిళా సమత ప్రాజెక్ట్‌ డైరక్టర్‌ చాలా చెప్పింది. కర్ణాటక, ఆంధ్ర బోర్డర్‌లో వున్న ఇరు రాష్ట్రాలు నిర్లక్ష్యంగా వదిలేస్తున్న ‘గట్టు’ మండలంలో ప్రజలకి చాలా సమస్యలున్నాయని, అక్కడ పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రశాంతి అంది. అలాంటి ‘గట్టు’ ప్రాంతంలో పనిచేస్తున్న నిర్మల అవార్డుకి అర్హురాలనిపించింది. తప్పకుండా వస్తానని చక్రికి చెప్పాను.

19న గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో అనకాపల్లి బయలుదేరాను. 5 గంటలకి అనకాపల్లి స్టేషన్‌ వస్తుందని ఫ్రెండ్‌ జయ చెప్పింది. 4.45కి అలారం పెట్టుకుని ముసుగేసి నిద్రపోయాను. మెలుకువ వచ్చేసరికి తెల్లగా తెల్లారుతోంది. టైమ్‌ 5.15.. అనకాపల్లి వెళ్ళిపోయిందా? అని పక్క సీటామెని అడిగితే ఇప్పుడే వెళ్ళిపోయింది, చెపితే లేపేదాన్ని కదా… మీరు నిద్రపోతుంటే వైజాగేమో అనుకున్నాను అందావిడ. ఫోన్‌ తీసి చూస్తే… అలారం మూగనోము పట్టినట్టుంది. చక్రి మిస్డ్‌ కాల్‌ వుంది. ఏం చెయ్యాలి? చక్రికి కాల్‌ చేసాను. ‘మేడమ్‌! మీరు దువ్వాడ దిగేయండి. అక్కడికి వెహికల్‌ పంపిస్తాను’ అన్నాడు. ఓ పావు గంటలో దువ్వాడ వచ్చింది దిగేసాను. సన్నగా తుంపర పడుతోంది. చుట్టూ పచ్చటి కొండలు. కళ్ళకి హాయిగా వుంది. ఒకరో ఇద్దరో అక్కడ దిగిన వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తం ప్లాట్‌ఫామ్‌ మీద నేనొక్కదాన్నే. జయకి ఫోన్‌ చేసి జరిగింది చెప్పాను. ‘నువ్వు ఇలాంటి వేవో చేస్తావు నాకు తెలుసు’ అంది జయ. సూట్‌ కేస్‌ అక్కడ బెంచిమీద పడేసి స్టేషన్‌ బయటకొచ్చి అలాగే నిలబడిపోయాను. అద్భుతం… ఎదురుగా పచ్చటి కొండ. ఆ కొండ మీద బుద్ధుడు … భలే వుంది. ఈ దారిలో వెళుతున్నప్పుడు ఎప్పుడూ చూడలేదు. మరో రెండు బుద్ధుడి విగ్రహాలు కనిపించాయి. బహుశా… ఈ అందమైన కొండని, ఆ కొండ శిఖరాగ్రాన కూర్చున్న బుద్ధుడిని చూడడానికే నేను అనకాపల్లి స్టేషన్‌ ‘మిస్‌’ అయ్యుంటాను అన్పించింది. సూట్‌కేస్‌ వదిలేసి వచ్చిన సంగతి గుర్తొచ్చి స్టేషన్‌ లోపలికొచ్చాను. అదక్కడే వుంది. మరోపది నిమిషాల్లో వెహికల్‌ వచ్చింది. అనకాపల్లికి బయలుదేరాను.

నన్ను రిసీవ్‌ చేసుకోవడానికి వచ్చిన ప్రియ అనే అమ్మాయి వాళ్ళింట్లోనే మాకు వసతి ఏర్పాటు చేసారు. ఆ ఇల్లు పక్కా పల్లెటూరులాగా చుట్టూ పంటపొలాలు, కూరగాయల పాదులతో కళకళ లాడుతోంది. నిర్మల కూడా అక్కడే వుంది. చాలా సేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. నాకున్న మొక్కల పరిజ్ఞానంతో అక్కడున్న… అమృతవల్లి, నేలఉసిరి, గాయపాకు, అలొవీరా, ఆముదం, గుంటగలగరాకు చూపించి వాటి మెడిసినల్‌ వాల్యూస్‌ గురించి ఉత్సాహంగా చెప్పాను. నేను సంకలనం చేసిన హెర్బల్‌ మెడిసిన్‌ బుక్‌ ఇచ్చాను. అలాంటి పొలాలు, వాటి పరిసరాలు చూస్తుంటే ఒక్కో మొక్కని అలా చూసుకుంటూ తిరగాలన్పిస్తుంది. 9.30 కి హాల్‌ దగ్గరకు వెళ్ళాలట అని ప్రియ చెప్పింది. సరేనని తయారై…. ఆ పొలాలకు బై చెప్పి… మీటింగ్‌కి బయలు దేరాం.

పదిన్నరకి మీటింగ్‌ మొదలైంది. హాలంతా కలియ తిరుగుతూ కనబడిన యువతీ యువకుల్ని చూస్తుంటే చాలా సంతోషమైంది. ఆదివారం, ఉదయమే తరలివచ్చిన సభికుల్ని చూస్తే ఆశ్చర్యమైంది. చాలా మంది కుర్రాళ్ళు బాషా గురించి చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. బాషా ఆశయాలను మరింత విస్తరించుకుంటూ పనిచేస్తామని వాగ్దానం చేసారు. బాషా ఏమీ చదువుకోలేదని, చాలా సామాజిక స్పృహ ఉన్నవాడని, అనకాపల్లిలో అందరికీ తలలో నాల్కలా వుండేవాడని, ఏ ఉద్యమ వ్యక్తులకైనా అనకాపల్లిలో బాషానే వారధి అని, అతని ద్వారానే హెచ్‌.ఆర్‌.ఎఫ్‌ లాంటి సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహించాయని, వడదెబ్బకి తట్టుకోలేక అతను మరణించిన తర్వాత మాత్రమే బాషా అసలు స్వరూపం అతని మితృలకు అర్ధమైందని, అతను కామ్‌గా పనిచేసుకుంటు వెళ్ళిపోయేవాడని… అతని మరణానికి చింతిస్తూ వచ్చిన సందేశాలు, సంస్మరణ సమావేశాలు అందరినీ ఆశ్చర్యపరిచాయని వక్తలు వివరించారు. అలాంటి బాషా పేరు మీద మూడేళ్ళ క్రితం నెలకొల్పిన అవార్డును, ‘గట్టు’లాంటి వెనబడ్డ గ్రామంలో పనిచెయ్యడానికి ముందుకొచ్చిన నిర్మలకు ఇవ్వడం చాలా సముచితమని నేను చెప్పాను. తొమ్మిదేళ్ళు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేసి, ఆ పని తృప్తినివ్వక, 2008లో ఇండియాకి తిరిగొచ్చి, చాలా గ్రామాలు తిరిగి, అత్యంత వెనుకబడిన ‘గట్టు’ను ఎంచుకుని తన సామాజిక సేవను ప్రారంభించిన నిర్మల ఈ అవార్డుకు అన్ని విధాలా అర్హురాలని చెప్పాను.  గ్రామంలోనే నివాసముంటూ అక్కడి ప్రజల్ని ‘మహాత్మాగాంధి గ్రామీణ ఉపాధి పథకం’ గురించి చైతన్యవంతం చేసి, హక్కుల గురించి ప్రశ్నించేలా వారికి స్ఫూర్తినిచ్చిన తమ్మినేని నిర్మల అత్యంత అభినందనీయురాలు.

ఈ అవార్డు ప్రదానోత్సవ సభ మొదలు నుండి తుది వరకూ అత్యంత ఉద్వేగభరితంగా సాగింది. మాజీ ఐఎఎస్‌ అధికారి ఇ.ఏ.ఎస్‌.శర్మ, సి.ఎస్‌. అజయ్‌కుమార్‌, చక్రధర్‌ తదితరులు మాట్లాడారు. బాషా తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనం ఆరగించి… వారితో మాట్లాడి మితృల్ని కలవడానికి నేను వైజాగ్‌ బయలుదేరాను. బాష, నిర్మల లాంటి యువ వయస్కులు సామాజిక సేవలోకి రావడం అత్యంత స్ఫూర్తిదాయకం. బాషా నా మనసులో నిలిచిపోయాడు.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.