‘ఉందిలే మహిళలకు మంచికాలం ముందుముందున…’
ప్రియమైన సత్యవతికి అభినందన మాలిక!
భూమిక స్థాపించినది మొదలు నేటిదాకా, అబ్బూరి ఛాయాదేవి, ఓల్గాలాంటివారూ, సంపాదకవర్గంలోనివారూ, అడ్వయిజరీ కమిటీ సభ్యులు, ఇంకెంతమందో భూమికకి తమ రచనలు పంపి స్త్రీశక్తి ఏమిటో, ఎలా వుండాలో వారివారి ఆలోచనలతోనూ, అనుభవాలతోనూ వివరిస్తూ చేస్తూన్న రచనలు, మహిళల మహోన్నతికి వేస్తున్న సోపానాలు అంటే అతిశయోక్తి కాదు. ఇంతై, ఇంతింతై, వటుడింతై అన్నట్టు నా కళ్లముందు పురుడుపోసుకున్న ‘భూమిక’ ఎదుగుదల పసితనం నుంచి ప్రౌఢత్వంలోకి కాలుపెడుతూన్న వనితలా అందచందాలు సంతరించుకుంటూ మహిళాస్ఫూర్తిగా నిలిచి వెలుగుతోంది. దీని వెనుక రాత్రింపగళ్లు మీరు చేస్తూన్న అనర్గళ కృషి ఎంత వుందో అంచనా వెయ్యడం అసాధ్యం!
మీరు ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తూన్న బస్సుయాత్రలు, రైలుప్రయాణాలు తద్వారా పరిశీలిస్తున్న మహిళా సమస్యలు, విజ్ఞానాన్నీ, వినోదాన్నీ కూడా పంచే దీపకళికలు! ఫిబ్రవరి కవర్‌పేజీ చూడడానికి రెండు కళ్లు చాలలేదు. ఎందుకంటే, ముగ్గురు సుప్రసిద్ధ మహిళామణులు, ముచ్చటగా మూడు అవార్డులు అందుకున్నవారు ఒక్కచోట కనిపిస్తే మనసు పొంగిపోయింది. ఇక, పుస్తకం లోపలికెళితే, మొదటి బహుమతి అందుకున్న (మీరు నిర్వహించిన పోటీలో) గంటి భానుమతి కథ ‘ఇదో రకం పోరాటం, ఈనాటి పోరాటం, నేటి మహిళా ఉద్యోగుల పరిస్థితిని కళ్లకి కట్టినట్టు వుంది. ఆమెకి నా అభినందనలు! కళాగోపాల్ గారి కవిత, ఈ-తరం-వివాదం-వైతరుణి!!!’ చాలా హృద్యంగా వుంది. వారికి కూడా నా అభినందన! ఈ సంచిక చూస్తూవుంటే, ‘ఉందిలే మహిళలకు మంచికాలం ముందుముందున…’ అనిపిస్తోంది అన్నట్టు భావరాజు పద్మిని గారి వ్యాసం ఎంతో విశ్లేషాత్మకంగా వుంది. ప్రభుత్వంవారు కళ్లు తెరిస్తే బాగుండు ఇది చదివాకైనా.
”పొలతి తలచుకున్న పొందునే చేకూర్చు
పడతి అలిగినపుడు ప్రళయమెపుడు
ఇంతిలోని శక్తి ఇంతింత గాదయా
వమ్ముకాదు శరదన్నమాట”! అనాలని అనిపించింది.
ఏమైనా ఇది ఫిబ్రవరి సంచిక, ముగ్గురు మణిపూసల ముఖచిత్రంతో కూడిన సంచిక, ముచ్చటగా దాచుకోవాలని హృదయంలో, అనుకుంటూ వీరందరికీ, బహుమతి పొందిన వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు అందిస్తున్నాను, నా మనసున పూచిన మల్లెల మాలలివే! భూమిక ద్వారా మీకు సత్యవతి గారూ, మీలోని శక్తిసామర్థ్యాలకు, మీ ఉత్సాహానికీ, ఊహలకి, కార్యనిర్వహణాయుక్తికీ, ఆకాశంలోని నక్షత్రాలనన్నింటినీ మాలకట్టి మీ మెళ్లో వేసినా సరిపోదు!
ఇది పొగడ్త కాదు – మనసు పలికే సత్యమైన మాట!!!
(ఈ లేఖ మార్చి సంచికలో రావాలి. ఆలస్యానికి మన్నించగలరు… ఎడిటర్)