ఈనాడు ప్రపంచంలో 23 లక్షల మంది పిల్లలు హెచ్ఐవికి గురై వున్నారు. వీరిలో అధిక సంఖ్యాకులకి తల్లినుండి బిడ్డకు వ్యాధి సంక్రమించడమే కారణం. ఏటా 7 లక్షల మంది పిల్లలు పుట్టుకతోనే తల్లినుంచి ఎయిడ్స్ వ్యాధిని పొందుతున్నారు.
తల్లినుంచి బిడ్డకు ఎయిడ్స్
గర్భస్థ శిశువుకి తల్లినుంచి హెచ్ఐవి సంక్రమించడం అనేది తల్లి ఆరోగ్య పరిస్థితుల బట్టి, ఆమెలో వున్న వైరల్ లోడ్ బట్టి, కాన్పు సమయంలో తీసుకునే జాగ్రత్తలు బట్టి, బిడ్డలో ఉన్న రోగనిరోధక శక్తి బట్టి వుంటుంది. అందుకని హెచ్ఐవి వున్న తల్లికి పుట్టే పిల్లలందరికీ హెచ్ఐవి సంక్రమించడం జరగదు. తల్లిలో వైరల్ లోడ్ చాలా తక్కువ వుంటే పుట్టే బిడ్డకి హెచ్ఐవి సంక్రమించే అవకాశాలు చాలా తక్కువ.
ఎయిడ్స్ మొదటి దశలో తక్కువ సంక్రమణ
హెచ్ఐవి సోకిన మొదటి సంవత్సరాలలో ఆమెకు పుట్టే బిడ్డకి ఎయిడ్స్ రావడం చాలా తక్కువ. దానికి కారణం హెచ్ఐవి వచ్చిన మొదటి సంవత్సరాల్లో వైరల్ లోడ్ తక్కువగా వుంటుంది. సిడి 4 కౌంట్ అంతగా తగ్గిపోదు. సాధారణ ఆరోగ్యం మెరుగ్గా వుంటుంది. తల్లి ఆరోగ్యం కూడా చక్కగా వుంటుంది. దాంతో బిడ్డకి ఎయిడ్స్ సంక్రమణ చాలా తక్కువ. తల్లికి హెచ్ఐవి సంక్రమించి 5 నుంచి 10 సంవత్సరాలు దాటితే బిడ్డకు హెచ్ఐవి సంక్రమించే అవకాశాలు కూడా ఎక్కువగా వుంటాయి.
విటమిన్ ‘ఎ’ ఎయిడ్స్ ని నిరోధిస్తుంది
హెచ్ఐవి తల్లిలో విటమిన్’ఎ’ లోపం ఉన్నట్లయితే గర్భస్థ శిశువుకి హెచ్ఐవి సంక్రమణ నాలుగు రెట్లు ఎక్కువ వుంటుంది.
పౌష్టికాహారం ఎయిడ్స్ కి బ్రేక్ వేస్తుంది
హెచ్ఐవి ఉన్నట్లు తెలుసుకున్న గర్భిణీ స్త్రీ పౌష్టికాహారం తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, విశ్రాంతి తీసుకోవడం, వైద్యసలహాలు పొందడం చేస్తే మంచి ఫలితాలు వుంటాయి. హెచ్ఐవి వున్న గర్భిణీ స్త్రీ ఎటువంటి మానసిక వత్తిడి లేకుండా చూసుకోవాలి. అలసిపోకూడదు. కంటినిండా నిద్రపోవాలి. ఆల్కహాల్, స్మోకింగ్ పనికిరావు. సిడి4 కౌంట్ డౌన్ అవకుండా చూసుకోవాలి.
(వాసవ్య మహిళా మండలి సౌజన్యంతో)