కష్టాల్ని కవిత్వంతో అధిగమిస్తాను

-కనకదుర్గ (ఇంటర్‌వ్యూ: కె.సత్యవతి, ప్రసన్న)

నా పేరు కనకదుర్గ. మాది విజయవాడ. కాని ఇక్కడే పుట్టి పెరిగాను. నాకు 1997 లో పెళ్ళయింది. అపుడు నా వయస్సు 19 సంవత్సరాలు. 2000 లో బాబు, డెలివరీ టైములో నేను పాజిటివ్ అని వచ్చింది. బాబుకి టెస్ట్ చేయించాను, కాని రాలేదు. చెస్ట్ హాస్పిటల్‌లో కౌన్సిలర్స్ ఫలానా ఆర్గనైజేషన్ వుంది, అక్కడకు వెళ్ళి చెప్పితే సమస్యలు తీరుస్తారు అంటే మేం అక్కడికి వెళ్ళి చెప్పాం. వాళ్ళు వచ్చి మా హస్బెండ్తో మాట్లాడారు. అట్లా చేయడం మంచిది కాదు అని అన్నారు. అంతకు ముందునుంచి మా మధ్య వేరే వేరే గొడవలున్నాయి. హెచ్ఐవి మీద కాదు. పర్సనల్ ప్రాబ్లమ్స్ వున్నాయి. కాని మా అత్తయ్య నాద్వారానే తన కొడుకుకు హెచ్ఐవి వచ్చిందని నన్ను టార్చర్ చేస్తోందని ఒక సంస్థకు వెళ్ళి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంటికి వచ్చి నచ్చజెప్పారు. వాళ్ళు వెళ్ళాక రెండురోజులు మంచిగా వుండి మళ్ళీ స్టార్ట్ చేసేవారు. మళ్ళా ఆ సంస్థలోని మేడంకు చెప్పితే వాళ్ళు అన్నారు మీ మదర్ వాళ్ళ ఇల్లు ఎర్రగడ్డలోనే వుందికదా నీవు అక్కడికి వెళ్ళిపో అన్నారు. అప్పటికే మా ఆయనకు టిబి అటాక్ అయ్యింది. కొంచెం సీరియస్‌గా వున్నాడు. నీవు మీ మమ్మీ ఇంటికి వెళ్ళిపో. తర్వాత మిమ్మల్ని కలుపుతాము. నీ వస్తువులు ఏం వున్నాయో తీసుకొని వెళ్ళు అంటే అవి అన్ని తీసుకొని వెళ్ళాను. ఆ సంస్థ మమ్మల్ని కలుపుతామని చెప్పారుగాని అలా చెయ్యలేదు.

సంవత్సరంన్నర అవుతోంది, మమ్మల్ని కలుపలేదు. మధ్యలో పిల్లల ప్రాబ్లం వచ్చింది. ఇద్దరు పిల్లలు. ఒక పాప. ఒక బాబు. అమ్మవాళ్ళింటికి 2005 లో వచ్చాను. బంజారాహిల్స్ లో మా హస్బెండ్ వుండేవాడు. పిల్లలిద్దరినీ అక్కడే స్కూలులో వేసాను. పిల్లల్ని స్కూల్‌లో డ్రాప్ చేయడం,అతనిదగ్గరికెళ్ళి చూడ్డం అట్లా కొంత స్ట్రెయిన్ అయ్యాను. ఆయనకు కూడా బాధ్యత వుండాలి అని పిల్లల్ని ఆయనకు అప్పజెప్పాను. ఆయన కార్ మెకానిక్. పిల్లల్ని చూడాలంటే స్కూల్కు పోయి చూసేదాన్ని. పిల్లలతో గడపాలని వుండేది. అట్లా పిల్లలతో స్పెండ్ చేస్తానంటే, వుంచితే మొత్తానికి వుంచు లేకుంటే తీసుకెళ్ళు అనేవాడు. మేడం దగ్గరికి వెళ్ళి అడిగితే నీవు తీసుకెళ్ళాలంటే నేను పిల్లల్ని చూసుకోగలను అని రాసి ఇవ్వాలి. అలా రాసిచ్చి తీసుకెళ్ళు అంది. మొదట్లో ఆ సంస్థవాళ్ళే నీవు అమ్మవాళ్ళింటికి వెళ్ళు. నీకు జాబ్ ఇస్తాం. పిల్లల్ని హాస్టల్‌లో వేస్తాం అని అన్నారు. ఒకనెల అటెండర్ పోస్ట్ ఇచ్చారు. నేను పిల్లల్ని దింపడం, అక్కడికి వెళ్ళి వర్క్ చేయడం వల్ల స్ట్రెయిన్ అయి ఒకరోజు కళ్ళు తిరిగినాయి. నీవు పాజిటివ్ కదా, నీతో ఎలా చేయించు కుంటాం. రెండు నెలలు రెస్ట్ తీసుకో. ఒకనెల చేసినదానికి డబ్బులు ఇచ్చారు. మళ్ళీ ఖర్చులకుంటాయి అని 900 రూ|| ఇచ్చారు. ఇచ్చి ఒక పేపర్ మీద సంతకం తీసుకున్నారు. మళ్ళీ రెండు నెలలు అయ్యాక జాబ్కోసం వెళ్ళాను. కొంచెం కోలుకున్నాను. ‘మేడమ్ నా పిల్లలకోసం వస్తున్నాను, నేను కూడా బాగున్నాను, జాబ్ ఇవ్వండి’ అని అడిగాను. ‘ఇపుడు బాగుంటావు, ఫ్యూచర్‌లో కూడా బాగుంటావని గ్యారంటీ ఏంటి’ అని అనేసి జాబ్ ఇవ్వలేదు. పిల్లల్ని తీసుకెళతాను అంటే రాసి ఇచ్చి తీసుకెళ్ళు అన్నారు. నా పిల్లల్ని నేను తీసుకెళ్ళడానికి నేను రాసివ్వాల్సిన పనేంటి? మీతో రాయించి నేను పిల్లలను ఆయనకు అప్పచెప్పలేదు, మీతో రాయించి నేను తీసుకోను అన్నాను. ‘లేచి నిలబడు, నువ్వు ఎవ్వరితో మాట్లాడుతున్నావో తెలుసా, ప్రెసిడెంట్‌తో మాట్లాడుతున్నావు అని జ్ఞాపకం పెట్టుకో, సంతకం పెట్టను, చేయను అంటున్నావు, నీ పిల్లల్ని నీకు ఇచ్చేది లేదు వెళ్ళిపో’ అన్నారు. అక్కడినుంచి వచ్చేశాను. ఆ తర్వాత నాకు ఈ నెట్వర్క్ గురించి తెలిసింది. 2005 లో ఇక్కడికి వచ్చాను. స్వప్న మేడం దగ్గిర అవుట్‌రీచ్ వర్కర్‌గా చేరి ఇక్కడ జాబ్ చేస్తున్నాను. ప్రస్తుతం పిల్లలు నాతోటే వున్నారు. ఆరోజు పిల్లల్ని ఇవ్వను అని అనడంతో ఏం చెయ్యాలో తెలియక చాలా బాధపడ్డాను. తర్వాత ఉమెన్ ప్రొటక్షన్ సెల్‌లో 2006 ఆగష్టు 9 న కంప్లెయింట్ ఇచ్చాను. వాళ్ళు అతన్ని పిలిపించి మాట్లాడినారు. ‘పిల్లలు నా దగ్గర వుంటే చూసుకుంటాను. ఈవిడతో వుంటే నాకేం సంబంధం లేదు. ఆవిడకు సహాయం చేయాల్సిన అవసరం లేదు’ అని మా హస్బెండ్ అన్నాడు. సిధూర్ మేడంని కూడా పిలిచారు. ఆవిడ రాలేదు. ఆ తర్వాత మధ్యలో వచ్చి నామీద అన్ని కల్పించి చెప్పింది. నాతో ‘నీవు డబ్బులు తీసుకున్నపుడు సంతకం చేసి రాశావు గుర్తుందా? మేం హెల్్ప చేశాం గుర్తులేదా?’ అని చాలా యిదిగా మాట్లాడింది. అతను 30,000 ఇస్తాను, పిల్లలకు, ఆవిడకు కలిపి. నాకున్న స్థాయి అంతే అన్నాడు. వాళ్ళ మదర్ ఏ విషయం రేపు చెపుతాం అంది. ‘మేం 30,000 ఇస్తాం. ఆమె ఇంకముందు కూడా డబ్బులు అడుగదని గ్యారంటీ ఏంటి? ఆమెకు, మా అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదని రాసివ్వమని చెప్పండి’ అంది. మేడం వాళ్ళు అన్నారు, నీవు రాసి ఇచ్చినా ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారని కూడా లేదు. నీవు కోర్టుకు వెళ్ళితే మంచిది అన్నారు. కోర్టులో కేసు వేశాను. కేసు జరుగుతూనే వుంది. ఈలోపు సెప్టెంబర్ 9న ఆయన చనిపోయాడు. పిల్లలు నా దగ్గరే వున్నారు. అతను బాగానే వుండేవాడు. సడన్‌గా రాత్రి చనిపోయాడు అన్నారు. నాకు అనుమానమే. మా అత్తయ్యమీద అనుమానం. కాని ఏం చేయలేకపోయాను. ఆరోజు నేను, స్వప్నమేడం కలిసి వెళ్ళాం. అక్కడ కూడా చుట్టాలందరూ నామీదే అరిచారు. వాళ్ళు పిల్లల్ని కొట్టారు. మీరు ఎందుకు వెళ్ళిపోయారు, వెళ్ళిపోవడం వల్లే అతను చనిపోయాడు అని కొట్టారు. మిమ్మల్ని ఏం చేస్తామో చూడు అని బెదిరించారు. అలాంటి టైంలో మేం తప్పించుకుని వచ్చాం. స్వప్న మేడం మాకు ఆశ్రయం కల్పించారు. హోటల్‌లో రెండు రోజులున్నాం. తర్వాత మా ఇంటికి వెళ్ళిపోయాం. పాపకు ఏడు ఏళ్ళు, బాబుకు అయిదేళ్ళు. మా అమ్మ వాళ్ళ దగ్గర వుంటున్నాను.

నాకు ఈమధ్య ఆరునెలలకిందట లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అది నార్మల్ అయింది కాని ఒక దగ్గర కూర్చునే పని అయితే ప్రాబ్లమ్ వుండదు. ఎక్కువ నడిస్తే ప్రాబ్లం వుంటుంది. ఇక్కడ అవుట్‌రీచ్ వర్కర్‌గా చేస్తున్నాను.మా ఆయన ఎక్కువగా బయట తిరుగుళ్ళు తిరిగేవాడు. ఆయన మీద మొదట్లో నమ్మకం వుండేది. అలా నమ్మించాడు కూడా. ఆయన చనిపోయేవరకు తన బిహేవియర్‌ని మార్చుకోలేదు. ఇతనివల్ల చాలామందికి ఈవ్యాధి వచ్చిండొచ్చు. తొమ్మిదవ నెలలో టెస్ట్ చేయిస్తే పాజిటివ్ అని వచ్చింది. డాక్టర్ మావారి గురించి వివరాలు చెప్పినపుడు తెలిసింది ఇతనికి చెడు అలవాట్లున్నాయని. ఆ తర్వాత మా అమ్మ, అత్తయ్య వాళ్ళు గొడవ పడ్డారు. మా అమ్మాయికి ఎపుడూ ఇంత జ్వరం కూడా రాలేదు. చాలా ఆరోగ్యంగా వుండేది అని మా అమ్మ నిలదీసి అడిగింది. మీ అమ్మాయి చెకప్ కోసం వెళ్తున్నపుడు కూడా నా కొడుకు వేరే అమ్మాయితో వున్నాడు అని స్వయంగా వాళ్ళ అమ్మే ఒప్పుకుంది. నేను లేనపుడు ఇంటికి తెచ్చుకున్నాడట. మా అత్తయ్య కూడా మా మామయ్యను మ్యారేజ్ చేసుకోలేదు. తను గతంలో ఒక వేశ్యగా వుండేది. మా మామయ్యతో అలా వుండిపోయింది.

ఇవ్వన్నీ ఎంక్వయిరీ చేయలేదు పెళ్ళికిముందు. మా నాన్న ఓ తాగుబోతు. ఆయన మమ్మల్ని చాలా హింసించేవాడు. కొట్టడం, తిట్టడం ఇట్లా చాలా బాధలు పడ్డాను నా పెళ్ళికాకముందు. ఆ బాధలు పడలేక పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. త్రాగడం, వాగడం, కొట్టడం నుంచి బయటపడిపోవచ్చు అని. కాని అప్పటికి పెళ్ళి అంటే కూడా తెలియదు. కొత్త జీవితం బాగుంటుంది అని పెళ్ళి చేసుకున్నాను, కానీ నా లైఫ్ మళ్ళీ ఇటే వస్తుందని అనుకోలేదు. మా నాన్న కంటే ఇతను ఇంకా ఎక్కువ హింసించేవాడు.

ఇపుడు లైఫ్ గురించి నాకేమీ బాధలేదు. మొదట్లో చాలా బాధపడ్డాను. ఇపుడు భయం లేదు. ఎవరైనా కొత్తగా పాజిటివ్‌తో వున్నారంటే నేను అపుడు ఎలా ఫీల్ అయ్యానో వీళ్ళు అలా బాధపడకూడదు అని నా గురించి నేను చెపుతున్నాను. మంచి ఆరోగ్యపు అలవాట్ల వలన బాగా వుండొచ్చు, దీనితోనే జీవితం ఆఖరు అవ్వలేదు. ఇంకా ముందు వుంది. అది కూడా మనచేతుల్లోనే వుంది అని వాళ్ళకు చెప్పగల్గుతున్నాను. కోఠిలో నాకు డెలివరీ అయింది. అపుడు మిగతా వారికి ఎవ్వరికీ తెలియదు. డాక్టర్‌గారికి మాత్రమే తెలుసు. పక్కన వుంటే తమకి కూడా వచ్చేస్తుందని ఆ రూం నిండా బ్లీచింగ్ పౌడర్ వేశారు. రూమ్‌లోనే బంధించారు. బాత్రూంలోకి వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది అయింది. కానీ మా మదర్ సేవలు చేసింది. నన్ను చూడడానికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళతో కూడా చెప్పేవాళ్ళు ఆమెకు హెచ్ఐవి వచ్చింది, ఆ రూంలోకి ఎందుకు వెళ్తున్నారు,మీకు కూడా ఎయిడ్స్ వస్తుంది అని. మావారు వచ్చి చనిపోదాం మనం అంటే,అంతకు ముందు చాలాసార్లు మా అమ్మకు ఇలా అంటున్నారు అని చెప్పాను. అలా చనిపోవాల్సిన అవసరం లేదు, డాక్టర్ అంతా చెప్పింది. నేను వున్నానుకదా అని నాకు ధైర్యం చెప్పి ఇప్పటికి మా అమ్మ ఫుల్ సపోర్ట్ గా వుంటుంది. నా పిల్లలకు దీని గురించి తెలియదు. చెప్పాల్సిన అవసరం లేదనిపించింది. వాళ్ళు చదువుకుంటున్నారు. మా నాన్నగారి టార్చర్ నాకు ఇంకా వుంది. మా ఇంట్లో ఎందుకుంటున్నావు అంటూ ఇంకా ఎక్కువయింది. నేను ఎక్కడికి వెళ్ళలేను. ఈమధ్య హాస్టల్ కోసం ట్రై చేస్తున్నాను, పిల్లల్ని వుంచాలని. అమ్మదగ్గర ఓన్లీ షెల్టర్ మాత్రమే. నా పొట్ట, నా పిల్లల్ని నేనే చూసుకోవాలి. నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. ఏ టైము ఎలా వస్తుందో, నా పిల్లల పరిస్థితి ఏంటి? నా పిల్లలకోసం ఏం చెయ్యాలి. ఇలాంటి ఆలోచనలతో అధైర్యం వస్తుంది. అందరికి ధైర్యం చెపుతాను కాని నా వరకు వచ్చేసరికి ఒక్కోసారి చాలా బాధగా అన్పిస్తుంటుంది. కాని నాకు ధైర్యం చాలా ఎక్కువ. మళ్ళీ సంభాళించు కుంటాను. నేను కవితలు రాస్తాను. కష్టాలు నేను చిన్నగా ఉన్నప్పుడే మొదలయ్యాయి. కాని వాటి వాటి తీరులు వేరుగా వున్నాయి. నేను కవిత్వరూపంలో చాలామందికి ధైర్యం చెప్పేదాన్ని. అదే నాకు ఓదార్పుగా వుండేది. రాస్తున్నపుడు ఏదో రాస్తున్నాను అనుకుంటాను. తరువాత అది చదివితే అందులో ఎంతో అర్థం గోచరించేది. విన్నవారు చాలా బాగుంది అంటే నాకు చాలా ధైర్యం వస్తుంది. ఇంకా రాయాలనిపిస్తుంది.

ఇపుడు నా వయసు 26 సంవత్సరాలు. మొగుడు పోయాడు కదా మాతో వస్తావా? అని అడుగుతుంటారు.అపుడు నేను ఓపెన్‌గా చెప్పాను నేను పాజిటివ్ అని. మీరు కూడా అలా తొందర పడకండి. మావారు అలాగే తిరిగారు. ఆయన ద్వారా నాకు వచ్చింది. మీరు అలా వెళ్ళకండి. మీతోపాటు భార్యకు, భార్యద్వారా పిల్లలకు వస్తుంది. మీ సుఖం కోసం మీవాళ్ళను బాధపెట్టడం అవసరమా అని ఎక్స్‌ప్లేన్ చేసి చెపుతాను. వాళ్ళు నమ్మరు. పైకి బాగున్నావు కదా అంటారు. పైకి అలా వున్నా అది బ్లడ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. చాలాచోట్ల మగవాళ్ళు చెప్పినా సరే వెళ్తుంటారు. కొందరు మంచివాళ్ళు వింటారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము. కండోమ్ వాడమంటే వాడకుండా మొండిగా వెళతారు. వాడితే కూడా గ్యారంటీ తక్కువ శాతమే వుంటుంది.

మగవాళ్ళు రోడ్‌మీద, విసిటిసి దగ్గిర చూసి కూడా వెంటబడతారు. మేం పాజిటివ్ అని చెబితే కూడా వినకుండా ఎపుడైనా పోయేవాళ్ళమే కదా! అంటారు. వాళ్ళకి భయం లేదు.

నేను మటుకు ఓపెన్‌గా చెబుతాను. ఎయిడ్స్ సంస్థలో చేస్తున్నాను. దానికోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాను అని చెబుతాను. నామీద మంచి అభిప్రాయం వుంది. మా చుట్టాల్లో తెలుసు. వాళ్ళు చదువుకున్నవాళ్ళు కాబట్టి దూరం పెట్టడం లాంటివి చెయ్యడం లేదు.

సాధ్యమైనంతవరకు మేము మేముగానే ముందుకు వచ్చి చెబుతున్నాం. అదివరకు భయపడేవాళ్ళు. ఇపుడు భయం లేదు. ఇపుడు ఎవరూ తప్పు చేయకుండా మారుతారనే అనుకుంటున్నాను. మాకు ఇంకా గవర్నమెంట్ సహాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఉద్యోగాలు లేవు. ఈరోజు చేస్తున్నాం గాని రేపు వుంటుందో లేదో తెలియదు. వచ్చినది పోతే తట్టుకోలేం. మా జాబ్ల మీదే ఆధారం. పాజిటివ్‌లతో మాట్లాడి వాళ్ళ బాధలను తీసుకొని మా బాధలను మర్చిపోతున్నాం. ఆ ఒక్క ఆనందం మాకుంది. మాకు జాబ్ ఇప్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. పాజిటివ్‌గా వుండి కవిత్వం రాయడం నాకు ఇష్టమే.

చీకటి అంటే చిన్నచూపు ఎందుకు
కష్టకాలం చూస్తే కన్నీరెందుకు
తరిగిపోయే రాత్రిని చూస్తే కలవరమెందుకు
కష్టాలు, కన్నీళ్ళు అన్నీ చేదు అనుభవాలే అని తెలిసి కృంగిపోవడమెందుకు
చేదు రుచి తెలిస్తేనే కదా
తీపిలో కమ్మదనం తెలిసేది
ఈ రోజు మనకు మందు లేదని బాధపడ్తున్నాం
రేపు ఇది పూర్తిగా తగ్గిపోవడానికి మందువస్తే కష్టాలన్నీ
మర్చిపోయి అదొక తీపి
ఆనందంలో వుంటామని
అనడానికి ఇది ఒక ఉదాహరణ
-కనకదుర్గ

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.