పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేసిన జిల్లాల పునర్విభజన – యమ్‌. హేమా వెంకట్రావ్‌

తెలంగాణ అపారమైన సహజ వనరులకు ఆలవాలం. ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ సంపద కోసం ఎన్నాళ్ళుగానో దేశ, విదేశీ గుత్త పెట్టుబడిదారులు, వాటి సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. ఎటువంటి నిఖార్సయిన నిబంధనలు లేకుండానే వారిని ఆహ్వానిస్తున్నారు. వీరి దోపిడీకి సహకరించడానికి తెలంగాణను భౌగోళికంగా సిద్ధం చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కోసం సుపరిపాలన, సౌలభ్యం పేరిట రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా ముక్కలు చేసి జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి పెట్టుబడిదారీ వర్గానికి అతి సులువుగా దోచుకోవడానికి రంగం సిద్ధం చేయబడుతోంది. అవసరమైతే ఇదే ప్రజల పేరిట సామ్రాజ్యవాదపు సంస్థలైన ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్‌. ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకుల నుండి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చి రోడ్డు, రవాణా, కమ్యూనికేషన్‌ ఇన్ఫర్మేషన్‌, విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులను నిర్మిస్తుంది. ఈ లూటీకి సహకరించ డానికి రాజకీయ నాయకుల నుంచి స్థానిక ఆధిపత్య కుటుంబాల వరకూ ఆసరా తీసుకోవాలి. అందుకు అందరికీ తలా  యింత పందేరం వెయ్యాల్సిందే. ఈ క్రమాన్ని దోపిడీ రాజ్యానికి సామాజిక పునాదిగా మారుతున్న వైనం మనం చూస్తాం. ఈ దోపిడీకి జిల్లాల విభజన, వాటి అండదండలు బ్యూరోక్రసీ, పోలీసు దన్ను అవసరం. ఈ పెత్తందార్లు, రాజకీయ నాయకులను మనం ప్రజాహితులుగానో, ప్రజాప్రతినిధులుగానో చూసే ప్రమాదం వుంది. వీరు సహజ వనరుల దోపిడీలో సామ్రాజ్య వాద దళారి బూర్జువా పెట్టుబడికి సామాజిక పునాదిగా పనిచేసే శక్తులుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ విప్లవోద్యమ శక్తులు మరింత బలపడకుండా, వనరుల దోపిడీని మరింత సులభతరం చేయడానికి చిన్న ప్యాకెట్లు అవసరం. పోలీసు (ఎస్‌.పి. స్థాయి) బలగాలతో, ఔట్‌ పోస్టులతో జిల్లాలో మోహరించవచ్చు. దోపిడీ వర్గాల సాయుధ బలగాలకు, ప్రజా పోరాట గెరిల్లా వర్గాల మధ్య ఘర్షణ మొదలైతే విప్లవోద్యమాలను తేలికగా అణిచివేయడానికి వీలుగా చిన్న జిల్లాల ప్రతిపాదన. అంతేకాకుండా ఆధిపత్య కులవర్గాల సామూహిక సంస్థానాలను ఏర్పరచుకోవడానికి టీ.ఆర్‌.ఎస్‌.కు వీలుబాటు అవుతుంది. రాజ్యం మరింత శక్తివంతమ వుతుందని విప్లవోద్యమ ప్రభంజనాన్ని తిప్పి కొట్టవచ్చునని, వ్యూహాత్మక ఎత్తుగడతో పాటు హిందూ రాజ్య స్థాపన ధ్యేయం కూడా యిందులో యిమిడి వుంది.

గత కొన్ని నెలలుగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఈ విషయం మీద ప్రజలు, ప్రజా సంఘాలు తమ అభ్యంతరాన్ని తెలుపుతూ సభలను నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాలకు, ఆ ప్రాంతాల ప్రజలకు గల అస్థిత్వాలను ప్రశ్నించే స్థాయిలో, కనుమరుగు చేసే రీతిలో కొత్తగా జిల్లాల ప్రక్రియ సాగుతుందని తెలియచేశారు. ప్రతి అస్థిత్వ పోరాటం వెనుక ఆ జాతుల, ప్రాంతాల ప్రజల ఆకాంక్ష వుంది. ఆ ఆకాంక్ష బలంగా ఉద్యమ రూపుదిద్దు కుని మన తెలంగాణ ఏర్పడింది. అయితే ఈ జిల్లాల విభజన దేశానికి గానీ, రాష్ట్రానికి గానీ కొత్త కాదు. టి.ఆర్‌.ఎస్‌. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పింది కూడా. కానీ ఆ విభజన ప్రక్రియ విధి, విధానాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు ప్రజాభీష్టం మేరకు తీసుకోవాల్సి వుంటుంది. మరి ఉద్యమ పథంలో నడచి తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడిన హీరోగా తనను తాను ప్రకటించుకునే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గారికి, అతని ప్రభుత్వానికి ప్రజా ప్రయోజనాల పట్ల నిబద్ధత వుందా? లేదా, అతని రాజకీయ లబ్ది కోసం చేస్తున్నాడా అనేది ఆలోచించాలి. ఆ కోణాల నుంచి చూస్తేనే జిల్లా పునర్విభజన, దాని లోతుపాతులను అర్థం చేసుకోగలం.

దేశంలో ఇప్పటికి 684 జిల్లాలు వున్నాయి. రమారమి 18.5 లక్షల ప్రజలు వున్నారు. తెలంగాణలో చూసినట్లయితే దానికి రెండింతల జనాభా  వున్నారు. సుమారు 12 వేల కిలోమీటర్ల విస్తీర్ణం వున్న జిల్లాలు వున్నాయి. దేశంలో అత్యధిక విశాలమైన జనాభా కలిగిన జిల్లా మహారాష్ట్రలోని థానే. హిమాచల్‌ ప్రదేశ్‌లోని గోమాంగ్‌ వ్యాలీ 800 మంది జనాభా కలిగి వుండగా, పాండిచ్చేరి కేవలం 8 కిలోమీటర్లతో చిన్న జిల్లాగా వుంది. 1956కి ముందు ఉమ్మడి రాష్ట్రంలో మన భద్రాచలం, తూర్పు గోదావరి, కృష్ణ, పశ్చిమ గోదావరి, వరంగల్‌ జిల్లాల్లోని కొన్ని మండలాలను కలిపి ఖమ్మం జిల్లాగా ప్రకటించారు. అందుకే ఉమ్మడి రాష్ట్రం విడిపోతున్నపుడు ఆంధ్ర ప్రాంతం వారు భద్రాచలం అంశాన్ని లేవనెత్తారు. అలాగే శ్రీకాకుళంలోని కొంత భాగాన్ని విశాఖపట్నంలోని కొంత భాగాన్ని కలుపుతూ విజయనగరం జిల్లాగా ఏర్పడింది. 1956కి ముందు జనగాం నల్గొండ జిల్లాలో వుండేది.

1974లో 1/74 జిల్లాల చట్టం వచ్చింది. దాని ప్రకారం జిల్లాల పరిధిని పెంచవచ్చు, తగ్గించనూ వచ్చు. ఆ తర్వాత 1983లో ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చాక మండల వ్యవస్థలను తీసుకువచ్చాడు. పట్వారి పద్ధతిని రద్దు చేశాడు. బి.సి., ఎస్‌.సి.లకు రాజకీయ రిజర్వేషన్‌ ఏర్పాటు చేశాడు. మన దేశాన్ని ప్రజాస్వామిక దేశంగా ప్రకటించుకున్న తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గద్దెనెక్కిన నాయకులు కనీస ప్రాథమిక హక్కుల సూత్రాలకు, విధి విధానాల సాంప్రదాయాలకు తూట్లు పొడిచి తమ ఇష్టారాజ్యంగా జిల్లాలను రోజుకొక తీరుగా, సంఖ్యగా ప్రకటిస్తున్నారు. కొన్నిసార్లు 23 అని, మరికొన్నిసార్లు 26 అని, రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదని ప్రజాభీష్టం ముఖ్యమని రకరకాల ప్రకటనలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు.

1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినపుడు ఫజిల్‌ అలీ కమిషన్‌ రెండు సంవత్సరాల పాటు దేశంలో పర్యటించి ప్రజల ఇష్టాలు, అభిప్రాయాలు కొంత మేరకైనా తెలుసుకుని ప్రభుత్వానికి కొన్ని సలహాలు, సూచనలు యిచ్చింది. కానీ యిప్పటి ప్రభుత్వానికి కనీసం ఒక విధాన రూపకల్పన అవసరమని తోచలేదు. ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి ఒకవైపు ఆగస్టు 22, 2016లో ప్రకటించి సెప్టెంబరు 25 వరకు ప్రజల అభిప్రాయం కోరుతూనే తాము అనుకున్న జిల్లా హెడ్‌క్వార్టర్‌లు తీసుకుని సున్నాలు, మరమ్మతులు కూడా చేసుకుంటున్నారు. ఇంక ప్రజాభీష్టం ఏముంటుంది?

ఒక దేశం గొప్పదనం ఆ దేశ ప్రజలకు కల్పించిన హక్కులపై ఆధారపడి వుంటుందని హెచ్‌.జె.లాస్కి అంటారు. ప్రభుత్వాలు తమ అధికారాలను రాజ్యాంగానికి లోబడి ప్రజల హక్కులకు భంగం కలిగించకుండా వినియోగించుకోవాలి. స్వేచ్ఛా, స్వాతంత్య్రం హక్కు రాజ్యాంగంలో పొందుపరిచారు. 19 (1-బి) ప్రకారం శాంతియుతంగా నిరాయుధంగా సమావేశాలను నిర్వహించుకునే హక్కు వుంది. ఆదివాసీలకు ప్రత్యేక జిల్లాలు కావాలనో, చారిత్రాత్మక, సాంస్కృతిక ప్రాతిపదికన జిల్లాలు కావాలనో ప్రజలు ప్రతిఘటిస్తే తోసిపుచ్చుతుంది. రాజ్యాంగ అధికరణ ప్రకారం ప్రజలకు వ్యతిరేకంగా చట్టాలు చేయరాదు, నడుచుకోరాదు. అలా చేస్తే న్యాయస్థానాలు వాటిని చెల్లవని ప్రకటించవచ్చు. అలాగే చట్టం ముందు అందరూ సమానులేనని రాజ్యాంగం చెబుతోంది. సమ న్యాయ పాలన కూడా వక్కాణించారు. కానీ జిల్లాల పంపకం చూస్తుంటే ఈ సమ న్యాయ పాలన వైఖరి కనిపించదు.

ఆదివాసీల కోసం 5వ షెడ్యూలు, ఈశాన్య ప్రాంత తెగలకు 6వ షెడ్యూలులో ప్రత్యేక హక్కులు కల్పించారు. అడవి, నీరు, వనరులపై ఆదివాసీలకు హక్కు వుంటుంది. దీనిపై కేవలం గవర్నర్‌కే నిర్ణయాధికారం వుంటుంది. వారికి ఆ హక్కులు దక్కనీయకపోవడం వల్ల అనేక ఉద్యమాలు పోటెత్తాయి. శ్రీకాకుళం నక్సలిజం పోరాటం తర్వాత ఆదివాసీలు 1996లో 1/70 చట్టం, 2006లో అడవి హక్కుల చట్టాన్ని తెచ్చుకోగలిగారు. అయినా వాటి అమలు నామమాత్రమే. ఫారెస్ట్‌ రిజర్వ్‌డ్‌ ఫారెస్ట్‌ అయింది. హరితాంధ్ర, హరిత తెలంగాణలో గిరిజనుల పోడు హక్కు చేజారింది. చెట్లు నాటే కార్యక్రమం పేరిట తరాలుగా పోడు చేసుకుంటూ జీవనాన్ని వెళ్ళదీస్తున్న వారి బ్రతుకులు మైదానంలో పడ్డాయి. వారి భూమిలో సగానికి పైగా ఆదివాసేతర భూస్వాముల చేతుల్లోకి పోయింది. ఆర్థిక మండలాలు, మైనింగ్‌ కాంట్రాక్టుల పేరిట పెట్టుబడి వర్గానికి యిప్పటికే భూమిని అప్పచెబుతున్నారు. ఇక గిరిజనేతర వలసలు చెప్పనక్కర్లేదు. వారి జీవితాల్లో భాగమైన అడవి వారికి తప్ప అందరికీ ఉన్నతిని తెచ్చిపెట్టింది. వాటికి చట్టబద్ధత లేదు. అందుకే షెడ్యూలు ప్రాంతాలలోని మండలాలను విడగొట్టి మైదాన ప్రాంతంలో కలుపుతున్నారు. ఈ ప్రాంతాల నుండి ఆదివాసీలను వెళ్ళగొట్టడమే కాకుండా క్రమంగా మైదాన ప్రాంతంగా మార్చవచ్చు. అప్పుడు షెడ్యూల్డు వారికి నిబంధనలు వర్తించవు.

ఆదిలాబాద్‌ నుండి భద్రాచలం వరకూ గోదావరి పొడవునా షెడ్యూల్డ్‌ ప్రాంతమంతా భౌగోళికంగా, నైసర్గికంగా ఒకే ప్రాంతంగా వుంటుంది. రాజ్యాంగ పరంగా షెడ్యూల్డ్‌ ప్రాంతమైన ఈ ప్రాంతం మొత్తాన్ని ఒకే పరిధిలోకి తీసుకువచ్చి వీలైనన్ని ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేయవచ్చు. ఆదివాసీల డిమాండ్‌ కూడా యిదే. కానీ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోకి షెడ్యూల్డ్‌ మండలాలైన బయ్యారం, గార్లలు మైదాన ప్రాంత జిల్లా మహబూబాబాద్‌కు వెళ్తాయి. వరంగల్‌లోని షెడ్యూల్డ్‌ మండలాలైన కొత్తగూడెం, గూడూరు, శానాపురంలను మహబూబాబాద్‌లో కలుపుతున్నారు. 40 లక్షల జనాభా గల హైదరాబాద్‌ను ముందు రెండు జిల్లాలుగా ప్రకటించి తర్వాత మాట మార్చారు. 12,210 చ.కి.మీ. వరంగల్‌ను నాలుగు జిల్లాలుగా విభజించారు. 13,132 చ.కి.మీ. వైశాల్యం గల ఖమ్మం జిల్లాను రెండు జిల్లాలు, 848 చ.కి.మీ. గల మెదక్‌ను మూడు జిల్లాలు, 7400 చ.కి.మీ. కరీంనగర్‌ను మూడు జిల్లాలుగా విభజించారు.

ఆదివాసీ జిల్లాలను ముక్కలు చేయడానికి కారణం వారి అస్థిత్వాన్ని, ప్రాంత అస్థిత్వాన్ని దెబ్బతీయడమే కాక మరో కోణం వుంది. దేశ విప్లవోద్యమానికి భూమిక ఈ ఆదివాసీల అటవీ ప్రాంతం. కొమరం భీం మొదలు నేటి జనతన సర్కారు వరకు ఆదివాసీలు రాజ్యంపై తమ హక్కుల కోసం పోరాడుతూనే వున్నారు. అసలు పోరాటమే వారి జీవన విధానం కూడా. ఆ చరిత్ర మన ముఖ్యమంత్రికి, ప్రధాన మంత్రి మోడీకి కూడా బాగా తెలుసు.వీలైనంతవరకు షెడ్యూల్డ్‌ ఏరియాను ముక్కలు చేసి మైదాన ప్రాంతంలో కలిపి తద్వారా వారి పోరాట స్ఫూర్తిని నీరుగార్చడం ముఖ్యోద్దేశం. అందుకే చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లా తొమ్మిది ముక్కలైంది. విప్లవోద్యమాన్ని అణచివేయడానికి జిల్లా పునర్విభజన ఒక ఎత్తుగడగా వాడుకుంటున్నారు. ఈ ప్రక్రియకు ముందే పోలీసులకు అధికార హంగులు, ఇన్నోవా లాంటి ఖరీదైన కార్లు సమకూర్చారు. కేంద్రాన్ని సహాయం కోసం అర్థించారు. ఉద్యమాల అండదండలతో అధికారం చేజిక్కించుకున్న కె.సి.ఆర్‌.కు వీటి ప్రభావం బాగా తెలుసు. అవెక్కడ తనవైపు గురి పెడతాయో తెలిసిన ఆయన ముందు జాగ్రత్తగా చేస్తున్న పనులలో ఒకటి జిల్లాల పునర్విభజన పేరుతో ఆడుతున్న నాటకం.

మరొక్క అంశం ఏమిటంటే యిప్పుడు ప్రభుత్వం చాలా భూమిని ప్రాంతాలవారీగా పరిశ్రమలకు, కొంత భాగాన్ని కొత్తగూడెం విమానాశ్రయానికి అప్పగించింది. ఈ భూభాగమంతా దాదాపు గిరిజన ప్రాంతంలో వున్నదే. కొత్తగూడెం విమానాశ్రయాన్నే తీసుకుందాం. ఇది అడవి, నీరు, ఖనిజాలకు ప్రసిద్ధి. ఇక్కడ గిరిజనులు పోడు చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. అక్కడి వనరులను కొల్లగొట్టడానికి విమానాశ్రయం అవసరం. దానికి భూమి అవసరం. ప్రజలు తిరగబడితే పోలీసు బలగాలు అవసరం. దానికి అతి దగ్గరగా జిల్లా హెడ్‌క్వార్టర్స్‌ అవసరం. కాబట్టి ఈ రోజు కొత్తగూడెం, భద్రాద్రి ఒక జిల్లా అయింది. డీఎస్పీ స్థాయి పోలీసు బలగం వున్న చోట జిల్లా ఎస్పీల స్థాయి పెరుగుతుంది. అప్పుడు సునాయాసంగా వనరులు దోపిడీ జరుగుతుంటే దానికి ప్రజలు తిరగబడితే వేగంగా ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. అందుకే భైగోళిక విస్తీర్ణం నైసర్గిక స్వరూపం గానీ, జనాభా అంశాల ప్రాతిపదిక కంటే కూడా గుత్త పెట్టుబడి దారీ వర్గాన్ని, పరోక్షంగా సామ్రాజ్యవాదానికి బాటలు వేయడానికి ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం పావులుగా  మారడానికి సిద్ధపడుతున్నారు. వారి వర్గ ప్రయోజనాలను కాపాడదలచుకున్నారు. మనం ప్రశ్నిస్తే ఆదివాసీలకు అభివృద్ధి అవసరం లేదా అని మనల్నే ప్రశ్నిస్తారు. వారి అభివృద్ధి వారి అభిప్రాయాలు, ఆకాంక్షల మీద ఆధారపడాలే కానీ పాలకుల నమూనాతో రుద్దబడకూడదు. చరిత్రలో ఆదివాసీలు రాజ్యాలు ఏర్పాటు చేసుకుని వారి అభీష్టం మేరకు పాలించిన చరిత్ర వారికి వుంది.

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పరిశీలిస్తే కుల, వర్గ, రాజకీయ స్వరూపం కూడా బయటపడుతుంది. ప్రస్తుత తెలంగాణలో రెండు ఆధిపత్య కుల వర్గాల ప్రాబల్యం వుంది. ఒకటి జనాభా రీత్యా తక్కువ శాతం వున్నప్పటికీ అధికార రీత్యా పై చేయిలో వుంది. మరో వర్గం జనాభా రీత్యా ఎక్కువ కాబట్టి వాటి మధ్య ఘర్షణ నిత్యం నివురు గప్పిన నిప్పులా వుంటుంది. అది ఎప్పటికైనా ప్రమాదమే. వీరే కాకుండా పాత తెలుగుదేశం మిత్రులు తమ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. కాంగ్రెస్‌ నుంచి వలస వచ్చిన తమ ప్రాంత భూస్వాములు వున్నారు. వీరితోపాటు కుటుంబ ఆశ్రితుల ప్రయోజనాలు వున్నాయి. ఒకే జిల్లాలో నాలుగైదు వర్గాలు వున్నాయి. వీరందరినీ సంతృప్తి పరచనిదే అధికారం నిభాయించడం కష్టం. అందుకే ప్రజలకు సౌకర్యం, పాలనా సౌలభ్యం కోసం జిల్లాల ఏర్పాటు అని పైకి బుకాయిస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ స్వప్రయోజనాలకు, పెట్టుబడిదారీ వర్గానికి కొమ్ము కాస్తోంది. పెరగనున్న అసెంబ్లీ నియోజక వర్గాల బ్లూప్రింట్‌ సిద్ధం చేసుకొని వాటి ఆధారంగా కొత్త జిల్లాలు రూపురేఖలు దిద్దుకుంటున్నాయి. సంస్థానాలను తమ అనుచరగణానికి సమతుల్యంగా  అప్పగించే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ ముందడుగు వేస్తోంది. తమకు రాజకీయంగా ప్రతికూలంగా వున్నా, ప్రతిపక్ష పార్టీలకు ప్రాబల్యం వుందనుకున్న అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని మండలాలను విడదీసి రెండు, మూడు జిల్లాలకు పంపిస్తున్నారు. అందుకే ఎన్నికల సంఘం చేయబోయే డీలిమిటేషన్‌ ప్రక్రియను కూడా ప్రభుత్వం యిప్పుడే పూర్తిచేస్తోంది.

ప్రతి జిల్లాలోని మండలాలకు అస్థిత్వ, చారిత్రక రాజకీయ నేపథ్యం వుంటుందన్నది వాస్తవం. ఈ జిల్లాల విభజన కూడా ఒక్క తీరున పేర్కొనలేదు. మొదట వరంగల్‌తో పాటు జనగాం, భూపాలపల్లిని ప్రతిపాదించారు. తర్వాత జనగాంకు బదులు మహబూబాబాద్‌ను ప్రకటించారు. తర్వాత హన్మకొండ, వరంగల్‌ జిల్లాలలో నోటిఫికేషన్‌ ప్రకటించారు. జనగాం కావాలని జనగాం గర్జన, డి.కె.అరుణ రాజీనామాతో వాటిని జిల్లాలుగా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్ర వలస వాదుల నుంచి ప్రాంతీయ అస్థిత్వ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సాధించిన ప్రజలకు మళ్ళీ పెత్తందారి తనంతో వారి ఇష్టానికి వ్యతిరేకంగా జిల్లాల విభజన చేశారు. ఉదా: వరంగల్‌ జిల్లాలోని దొడ్డి కొమరయ్య, బందగీ ఉద్యమ ఉత్తేజాన్ని ప్రజలు ఇప్పటికీ నెమరు వేసుకుంటారు. ఆ ప్రాంతాన్ని ముక్కలు చేసి వేర్వేరు జిల్లాల్లో కలుపుతుంటే ప్రజలు తిరగబడుతున్నారు. హుజురాబాద్‌, హుస్నాబాద్‌ నియోజక వర్గాలు కరీంనగర్‌లో వుంటే వరంగల్‌లో కలపడానికి కారణం వరంగల్‌  జిల్లాలోని నల్గురి వందిమాగదులకు అక్కడి భూభాగం చాలకపోవడంతో ఈ మండలాలను కలపడానికి ప్రయత్నిస్తున్నారు.   ప్రతిపాదిత జిల్లా కేంద్రం మంచిర్యాలలో భాగంగా వున్న శ్రీరాంపూర్‌ మండలాన్ని పెద్దపల్లిలో కలపడానికి కూడా ఇదే ఏలినవారి ప్రయోజనాలు వున్నాయి.

లౌకిక దేశమైన భారత్‌లో భాగమైన తెలంగాణలో అన్ని కులవర్గాల వారూ వున్నారు. సుమారుగా ఆదివాసీ జనాభా 10%, దళితులు 12%, మైనార్టీ వర్గాలు 12% కాక ఇతర బడుగు, బలహీన వర్గాలు, పేద ప్రజలు వున్నారు. వారు ఏమి కోరుకుంటున్నారన్నది ప్రభుత్వానికి అప్రధానమయింది. గత దశాబ్ది కాలం నుంచి భారతదేశం హిందూ రాజ్యం కావడానికి అనేక హిందూ మతోన్మాద శక్తులతోపాటు ఆరెస్సెస్‌, భజరంగదళ్‌ తీవ్రంగా పనిచేయగా, 2014లో కేంద్రంలో బి.జె.పి. అధికారంలోకి వచ్చింది. మన ముఖ్యమంత్రి ఉద్యమకారుడని చెప్పుకుంటూనే యజ్ఞయాగాదులు, హోమాలతో వారికంటే ముందు వరుసలో వున్నారు. స్వామిలోర్లకి, పుణ్యక్షేత్రాలకు పెద్ద దిక్కుగా మారిన ఆయన అతి చిన్న గుట్ట యాదగిరిగుట్ట భూభాగాన్ని, ఇతర జిల్లాల భూభాగాలతో కలిపి యాదాద్రి జిల్లాగా చేసి చినజియరు స్వామికి కానుకగా యిస్తానన్న మాటను నిలబెట్టుకుంటున్నట్లు వినికిడి. వారి రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాలు ఎలాగూ వున్నాయి. తెలంగాణ ఆవిర్భావానికి ముందు నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అని ప్రకటించుకున్న కెసీఆర్‌ హిందూత్వ శక్తులకంటే తన థార్మిక విధానాలను బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. యాదాద్రి, భద్రాద్రి, రాజాద్రి… యింకెన్నో మరి. 1956లో భాషానుయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు జిల్లాలు సెక్యులర్‌ పేర్లతోనే వున్నాయి. అన్నవరం పుణ్యక్షేత్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా  అన్నవరం జిల్లాగా మారలేదు. సింహాద్రి అప్పన్న వున్న విశాఖపట్నం సింహాద్రి జిల్లాగా, తిరుపతి కలిగి వున్న చిత్తూరు జిల్లా అవే పేర్లతో కొనసాగించారు. మరొక గమనించవలసిన అంశం ఏమిటంటే, 84 లక్షలు అంటే 25% తెలంగాణ జనాభా కలిగి ఉన్న హైద్రాబాద్‌ జిల్లాను హైద్రాబాద్‌, సికింద్రాబాద్‌ జిల్లాలుగా విభజిస్తామన్నారు, కానీ చేయలేదు. దానికి కారణం హైద్రాబాద్‌లో 70% మైనార్టీ ముస్లింలే. విభజిస్తే హైద్రాబాద్‌లో ముస్లింల పట్టు పెరుగుతుందనే భావనతో దాన్ని రెండు జిల్లాలుగా విడగొట్టలేదన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. ఇది దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న ఫాసిస్టు పాలనకు ప్రతిరూపం.

మరి జిల్లాలను ఎలా పునర్విభజించాలి అన్న ప్రశ్న మనముందుంటే దానికి సమాధానమొక్కటే. స్వప్రయోజనాలు, నిధులు, నీళ్ళు, భూమి, ఉపాధి, జనాభా, వైశాల్యం కోణాలే కాకుండా ఆ జిల్లాల సంస్కృతి, చారిత్రక నేపథ్యం, రాజకీయ సారూప్యం కలిగిన వాటిగా వుండాలని కోరుకుంటున్నారు. ఆ రాష్ట్ర ఆదాయంతో పోలిస్తే ఉత్పత్తి వనరులు ఆ జిల్లాలో ఒకేలా వుండాలి. జిల్లాలో వివిధ ప్రాంతాలను, ఆ ప్రాంతాల ప్రజలకు గల అస్థిత్వాలను ప్రశ్నించే స్థాయిలో, కనుమరుగు చేసే రీతిలో కొత్త జిల్లాల ప్రక్రియ కొనసాగకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. విప్లవ పార్టీలు మరింత ముందుకెళ్ళి రాష్ట్రంలోకి షెడ్యూల్డ్‌ ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని వాటిని క్రమబద్ధంగా విభజించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆదిలాబాద్‌, కొమరం భీం (అసిఫాబాద్‌), కరీంనగర్‌ జిల్లాల్లో మూడు సెమీ షెడ్యూల్డ్‌ మండలాలతో ఇల్లందు, భద్రాచలం కేంద్రంగా నాన్‌ షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో మిగిలి వున్న 42 గిరిజన గ్రామాలను కలుపుతూ ఆదివాసీ జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లాల ప్రతిపాదనలను ప్రజాభీష్టాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. ప్రజల ఆకాంక్షల ఆధారంగా విధి విధానాలను రూపొందించాలి. వాటిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా మద్దతు సంపాదించాలి. అంతేకానీ జిల్లాల ఏర్పాటు రాజకీయ లబ్ది కోసమో, ఉన్నత వర్గాల ఆర్థిక, రాజకీయ, సామాజిక ఆధిపత్య వర్గాల కోసమో ఉండకుండా రాజ్యాంగం నిర్దేశించినట్లుగా వుండాలి. రాష్ట్రాల ఏర్పాటుకు ఒక మేరకు స్పష్టత వుంది. జిల్లాల అంశం రాష్ట్రాలది కావడం వల్ల 7/74 చట్టం వున్నప్పటికీ ప్రజల అవసరాలు, మౌలిక సదుపాయాల కల్పన, అస్థిత్వం తదితర కారణాల పట్ల స్పష్టత లేకపోవడంవల్ల పాలకులు యిష్టారాజ్యంగా చేస్తున్నారు. కాబట్టి ఈ చట్టాన్ని మరింత విస్తృతపరచి హేతుబద్ధత, శాస్త్రీయత కల్పించాలి. జిల్లా పునర్విభజనలో రాజ్యాంగ షరతులకు లోబడి విధి విధానాలు పాటించాలి.

రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గిరిజనేతర వ్యక్తిగా చూడాలని సుప్రీంకోర్టు సమతా తీర్పులో చెప్పింది. అయిన్పపటికీ కెసీఆర్‌ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి షెడ్యూల్డ్‌ ప్రాంతాలను విడగొట్టి ఆదివాసీ హక్కులకు తూట్లు పొడుస్తోంది. రాజ్యాంగ బద్ధతతో వచ్చిన హక్కులతో ఆదివాసీ స్వయంపాలిత జిల్లాలను ఏర్పాటు చేయవలసిన బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నందుకు గవర్నర్‌ చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. కానీ అది జరిగేనా? ఆర్టికల్‌ 244(1) పార్ట్‌-సి (6సి) ప్రకారం రాష్ట్రాల విభజన క్రమంలో ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, ఆదివాసీ, నాన్‌షెడ్యూల్డ్‌ గ్రామాలను షెడ్యూల్డ్‌ తెగల కౌన్సిల్‌ ద్వారా 6వ షెడ్యూల్డ్‌ను పోలిన స్వయం పాలిత జిల్లాలుగా ఏర్పాటు చేసుకోవచ్చని 1996లో భూరియా కమిషన్‌, 2014లో కలేల్కర్‌ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ సూచించినా పాలక వర్గాలకు ఖాతరు లేదు. సుమారు 35 లక్షల జనాభాతో 17,582 చ.కి.మీ. విస్తీర్ణంలో వున్న ఆదివాసీలు తమ పోరాటాన్ని ఎక్కుపెడితే కానీ, తమ హక్కులను కాపాడుకోలేమన్న స్పృహకు మరింత పదును పెడితే కానీ ప్రభుత్వం దిగిరాదు.

ప్రజా ప్రతిఘటనలకు పుట్టినిల్లయిన తెలంగాణ గడ్డ పరిపాలనా సౌలభ్యం పేరిట ప్రజా విద్రోహ చర్యలకు పాల్పడితే గద్దెనెక్కించిన ప్రజలే బుద్ధి చెబుతారు. భౌతికంగా ప్రజల వద్దకు పాలన ముసుగులో తమకు యిష్టమొచ్చిన అభివృద్ధి నమూనాల జిల్లాల పునర్విభజనతో ముందుకెళ్ళిన ప్రభుత్వానికి ప్రజలే తగిన సమాధానం చెబుతారు. దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌ అన్న గురజాడ వాక్కులు మరచి ఈ మట్టినే సరుకుగా, మార్కెట్టుగా మార్చే ప్రభుత్వ ద్వంద్వ నీతి గుట్టును ప్రజలే విప్పుతారు. భూమి అంటే యుద్ధభూమి కూడా కదా! భూమి కోసం తరాలుగా తెలంగాణ యుద్ధభూమిగా మారిన చరిత్ర వుంది. ప్రతి ఒక్క తెలంగాణావాది దేశ విదేశీ కార్పొరేట్‌ శక్తులకు దాసోహమంటున్న, సామ్రాజ్యవాద, దళారి పాలనకు ద్వారాలు తెరుస్తున్న ప్రభుత్వాన్ని, ఆ నాయకత్వాన్ని గమనిస్తున్నారు. ”సొంత గడ్డలో సొంతవారే అన్యాయం చేస్తే వారిని పాతరెడతారు” అన్న మహాకవి కాళోజీ స్ఫూర్తిని ఏలిన వారు గుర్తుంచుకుంటే మంచిది లేదా చరిత్ర పునరావృతమవుతుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.