నిరంతరాన్వేషి, నిత్య చలనశీలి – కమలాదాస్‌

”నేను ఆరేళ్ళ వయసప్పుడే చాలా సెంటిమెంటల్‌గా ఉండేదాన్ని. విషాదభరితమైన కవితలు రాసేదాన్ని. తలలు తెగిపోయి, ఎప్పటికీ తల లేకుండా ఉండే బొమ్మల గురించి కథలు రాసేదాన్ని. అలాంటి ప్రతి కవిత నన్ను ఏడిపించేది” అంటుంది తన ఆత్మకథలో.

అలాంటి ఒంటరితనపు, విషాదపు బాల్యం గడవకముందే 15 సంవత్సరాలకే తనకంటే చాలా పెద్దవాడయిన మాధవదాస్‌తో పెళ్ళి జరగడం ఆమెను మరింత నైరాశ్యంలోకి తోసేసింది. మాధవ్‌తో ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక తొలిసారి ఆమెని కలవడానికి కలకత్తా వచ్చినపుడు అతని ప్రవర్తన ఆమెను తీవ్రంగా గాయపరచడంతో పాటు అతని పట్ల విముఖతను ప్రోది చేసింది. అతని మొరటుతనం ఆమెను భయపెట్టింది. తన ఒంటరితనాన్ని దూరం చేస్తాడని భావించిన ఆమె అతని వెకిలి చేష్టలని అసహ్యించుకుంది.

”అతను నన్ను సున్నితంగా చేతుల్లోకి తీసుకోవాలని, నా చెవుల్లో ప్రేమ భాష్యాలు చెప్పాలని ఆశించాను. నాతో ప్రేమగా సంభాషించాలని, స్నేహం కురిపించాలని, వెచ్చటి స్పర్శని పంచాలని కోరుకున్నాను. తన చేతులతో నా ఒంటరితనాన్ని దూరం చేస్తాడని నేను గాఢంగా ఆశించాను”.

అలా జరగకపోగా ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు అతని మొరటు శృంగార చేష్టలు ఆమె సున్నితమైన శరీరం మీద నల్లటి, ఎర్రటి మచ్చల్ని మిగిల్చాయి. వివాహం జరిగాక తనతొలి రాత్రి అనుభవాన్ని ఇలా వర్ణిస్తుంది.

”తొలి రాత్రి ఎలాంటి హెచ్చరికలు లేకుండా అతను నా మీద పడ్డాడు. అతన్నుంచి తప్పించుకోవడానికి నేను ఎంతో ప్రయత్నించాను. నా గుండె వేగంగా కొట్టుకోవడంతో నన్ను వదలమని ఎంతో బ్రతిమాలాను. వినలేదు. ఆ రాత్రి అతని అత్యాచార పర్వం అసంపూర్తిగానే మిగిలింది. ఆ రాత్రి పదే పదే అతను నన్ను గాయపరుస్తూనే ఉన్నాడు”.

కమలాదాస్‌ ”మారిటల్‌ రేప్‌” గురించి, తన తొలిరాత్రి అనుభవం గురించి వివరంగా తన ఆత్మకథలో “wedding night” అనే ఛాప్టర్‌లో ఎంతో ధైర్యంగా రాసింది.

పెళ్ళి, భర్త లాంటి ఆలోచనలు కలగని వయసులోనే పెళ్ళవడం, వివాహ జీవితంలో కుదురుకోక ముందే 16 ఏళ్ళకే తల్లవడం జరిగిపోయాయి. కమలాదాస్‌ పెద్ద కొడుకు నల్లప్పన్‌ ఆమెకు పదహారేళ్ళకే పుట్టాడు. వెంట వెంటనే ఇద్దరు కొడుకులు పుట్టడంతో చిన్నారి కమల చిన్నపిల్లలాగే తన కొడుకులతో కలిసి ఆడేది, పాడేది. పెద్ద కొడుకు పుట్టాక, ఆమె భర్త కనబరచిన విసుగు, నిర్లక్ష్యం ఆమెను ఎంతో బాధపెట్టేవి. అతనికి సెక్స్‌ తప్ప ఇంకేది పట్టేది కాదు. ఫక్తు వ్యాపారి లాగా ప్రవర్తించేవాడని రాస్తుంది ఒకచోట. తను ఊహించుకున్న జీవితానికి, వాస్తవంతో తను బతుకుతున్న జీవితానికి ఎక్కడా పొంతన కుదరక తీవ్ర మనస్తాపం పొందేది. ఈ సంఘర్షణంతా ఆమె కవిత్వంలో పొంగి పొర్లేది. సమ్మర్‌ ఇన్‌ కలకత్తా, ది డిసెండెంట్స్‌ కవితా సంపుటిల్లో తన మానసిక కల్లోలాన్ని, కలవరాన్ని వ్యక్తం చేస్తుంది. అలాగే భర్త నిర్లక్ష్యాన్ని, తిరుగుబోతు తనాన్ని ధిక్కరిస్తూ, తాను కూడా అలాగే విశ్వాస రాహిత్యాన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకుంటుంది.

“I made up my mind to be unfaithful to him, at least physically” ఒక భవన నిర్మాణ కార్మికునితో ప్రేమ కలాపాలు సాగించడానికి ఎలా ప్రయత్నించిందీ అన్నది ఎంతో వివరంగా, ధైర్యంగా ”మై స్టోరీ”లో రాసింది.

ఈ సాహసం, తిరుగుబాటు తత్వం బతుకు పొడుగునా కలుపుకోవడం కమలాదాస్‌ ప్రత్యేకత. సంసార జీవితంలోని మొనాటనీని అత్త, భర్తల సాధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి సైతం సిద్ధపడుతుంది. అక్కడ కూడా విఫలమై రాజీ పడుతుంది. భర్తకు చాకిరీ చేయడం అతని చొక్కాలకు బటన్లు కుట్టడం, ఒళ్ళు నలిగేదాకా చాకిరీ చేయడం అలవాటు చేసుకున్నా ఆమె లోపలి ఆత్మ అనుక్షణం ఆమెని ధిక్కరించేది. తను కలలు కన్న జీవితానికి, తాను బతుకుతున్న జీవితానికి ఎక్కడా పొంతన కుదరక మానసిక సంఘర్షణని అనుభవిస్తూ, ఆ సంఘర్షణని కవితలుగా మలచడం అలవాటు చేసుకుంది.

ఒకరోజు కమలాదాస్‌ భర్త మాధవ్‌, తన పురుష ప్రేమికుడితో కలిసి తమ పడకగది తలుపులు బిగించుకున్నప్పుడు, (అదీ తన పుట్టినరోజు నాడు) కమల భరించలేక భోరున ఏడ్చింది. తన భర్త ప్రేమ తనది కాదని అర్థమై అర్థరాత్రిళ్ళు ఒంటరిగా దుఃఖంతో సతమతమయ్యేది. అలాంటి ఒక రాత్రి, కొత్త జీవితాన్ని, కొత్త భవిష్యత్తును ఆశిస్తూ

“Wipeout the paints, unmould the clay,

Let nothing remain of that yesterday”

అంటూ రాసిన కవితని అప్పటికప్పడు పత్రికకు పంపించింది. ఇంట్లో పనంతా అయ్యాక, అందరూ తిని నిద్రపొయ్యాక, అర్థరాత్రి వేళ డైనింగ్‌ టేబుల్‌ని శుభ్రం చేసుకుని అక్కడే రాయడానికి కూర్చునేది. గంటలు అలా గడిచిపోతుండేవి. ఒక్కోసారి తెల్లారిపోయేది. రాత్రంతా మేల్కొని రాస్తూ ఉండడం, పగలు మళ్ళీ కుటుంబ బాధ్యతలు వీటన్నింటితో ఆమె ఆరోగ్యం పాడవడం మొదలైంది. రచయిత్రి కావాలనుకునే స్త్రీకి ఈనాటికీ తనకంటూ ఒక గది, ఒక టేబుల్‌, కుర్చీ, సరిపడిన సమయం లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ కమలాదాస్‌ ఇలా అంటుంది.

”నేను మామూలు మధ్యతరగతి స్త్రీ గురించి ముఖ్యంగా ఎవరైనా రచయిత్రి కావాలనుకుంటున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. నావిషయానికొస్తే వంటింట్లో కూరగాయలు తరుక్కునే బల్ల, భోజనాలు తినే బల్ల ఇవే నా రచనా స్థలాలు. అదంతా శుభ్రం చేసుకుని రాసుకోవడానికి కూర్చోవాలి. అదే నేను పనిచేసుకునే స్థలం. అందరూ నిద్రపోయాక, నేనూ, నా టైప్‌రైటర్‌ మాత్రమే మేల్కొని ఉంటాం. అలాంటి సమయంలోనే నేను నా కుటుంబాన్ని పూర్తిగా మర్చిపోయి స్వతంత్ర వ్యక్తిగా మిగులుతాను. ఆ నిశ్శబ్ద నిశిరాత్రి నన్ను నేను కనుగొంటాను” అంటుంది. 1921లో వర్జీనియా వుల్ఫ్‌ ‘ఏ రూమ్‌ ఆఫ్‌ వన్స్‌ ఓన్‌” లో ”ప్రతి స్త్రీ తనకంటూ ఒక గది, తనకంటూ కొంతసొమ్ము తప్పకుండా కలిగి ఉండాలి. రచయిత్రి కావాలనుకునే స్త్రీలకి ఇవి ఖచ్చితంగా ఉండాలి” అంటుంది. కమలాదాస్‌ లాంటి సుప్రసిద్ద రచయిత్రులు కూడా డైనింగ్‌ టేబుల్‌ మీదే తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించడం నిజంగా విషాదమే కదా!

కమలాదాస్‌ నవలలు, కథలు రాసినప్పటికీ ఆమె రాసిన కవిత్వం బహుళ ప్రజాదరణ పొందింది. తనలో చెలరేగే సంఘర్షణలను, భావోద్వేగాలను, కల్లోలాలను వ్యక్తీకరించడానికి కథ, నవలకన్నా కవిత్వాన్నే ఎక్కువగా ఎంచుకుంది. ఆమె భావాల తీవ్రత, స్వేచ్చా Ûకాంక్ష కవిత్వంలో ప్రస్ఫుటంగా వ్యక్తమవుతుంది.

”పునీల్‌” అనే కవిత్వంలో…

నిజం,

ఒకటి రెండు కట్టుబాట్లని నేను మీరాను

అయినప్పటికీ దైవాన్ని కానీ, సమాజాన్ని కానీ క్షమాభిక్ష కోసం అర్థించను.

అతిక్రమణలోనే ఆనందాన్ని అనుభవించాను

నిజంగా, నన్ను నేను పునీతురాలిగానే భావిస్తాను.

పుణ్యం కోసం కాదు, పేరు ప్రతిష్టల కోసం కాదు

పరిత్యాగంలోని నిజమైన స్వేచ్ఛా సమయాల కోసం మాత్రమే!” – (తెలుగు అనువాదం: పసుపులేటి గీత)

”నాలో సుడులు తిరిగే బాధే కవితలుగా రూపెత్తాయ్‌. ప్రతి కవిత బాధలోంచే పుట్టింది” అంటుంది ఒకచోట. ఒంటరితనం, భార్యాభర్తల సంబంధంలోని బోలుతనం, యాంత్రికత, ప్రేమ రాహిత్యం కమలాదాస్‌ని నిరంతర అన్వేషణలోకి నడిపాయి. సంతోషం కోసం, నిజమైన ప్రేమ కోసం ఈ అన్వేషణ కొనసాగింది. సూటి బాణాల్లాంటి కవితల్లో తన భావోద్వేగాలను వ్యక్తీకరించడం, జనాలను షాక్‌ చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య.

‘స్టాక్‌ వెరిఫికేషన్‌’ అనే కవితలో…

మునుల తాళపత్ర గ్రంథాలు, సాధువుల ప్రవచనాలు నన్ను శాంతపరచే వేదాంతాలు, ఏవీ నామీద రుద్దకండి కాళ్ళమద్య ఓ మనిషిని బిగబట్టి ముగ్గురు కొడుకుల్ని బయటకు తెచ్చాను” అని రాయగలిగిన సత్తా కమలాదాస్‌లో మాత్రమే చూడగలం.

కమలాదాస్‌ కవిత్వం అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న వేళ, ఆమె భర్తకి కవిత్వ రచన లాభసాటి వ్యాపారంగా కనబడలేదు. రిజర్వ్‌ బ్యాంకులో ఉద్యోగం చేసే మాధవ్‌ దాస్‌ ఇంటా బయటా ఎప్పుడూ డబ్బు లెక్కల్లోనే మునిగి తేలుతుండడం, ఆమె ఏం రాస్తే డబ్బులు రాలతాయో ఆలోచించడం, ఆమెను కవిత్వం రాయడం మానేసి కథలు రాయమని నిర్దేశించడంతో కమల నవలలు, కాలమ్స్‌ రాయడం మొదలుపెట్టింది. ”అతను చెప్పినదాన్ని నేను ఏనాడూ వ్యతిరేకించలేదు. దీనివల్ల నాలో కవిత్వం ఎండిపోయింది కానీ మా దాంపత్యం మాత్రం విజయవంతంగా నడిచింది” అంటుంది. అందులోని వ్యంగ్యాన్ని, పదునును అర్థం చేసుకుంటే తప్ప కమలాదాస్‌ వేదనని అర్థం చేసుకోలేం.

కమలాదాస్‌ మళయాళ సాహిత్యాన్ని ”మాధవకుట్టి”, ఆంగ్ల సాహిత్యాన్ని ”కమలాదాస్‌” పేరుతోను రాసేది. ఆమె రాసిన ఆంగ్ల రచనలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందాయి. నోబుల్‌ సాహిత్య పురస్కారానికి కూడా! కమలాదాస్‌ ఆంగ్లంలో అయిదు కవితా సంపుటలు, ఒక నవల ”అల్ఫాబెట్‌ ఆఫ్‌ లష్ట్‌”, ”పద్మావతి ది హార్లెట్‌ అండ్‌ అదర్‌ స్టోరీస్‌” పేరుతో కథల సంపుటి, ”మై స్టోరీ” ఆత్మకథ ప్రచురించింది.

కమలాదాస్‌ కథల నిండా కలకత్తాలో ఆమె బాల్యం తాలూకు అమాయకత్వం, జ్ఞాపకాలు నిండి ఉంటాయి. ఆమె కవిత్వం ఎలాంటి దాపరికాలు లేకుండా, కుండబద్దలు కొట్టినట్లు ఉంటుంది. ”ఇల్లాలినంటూ నాకో పేరుపెట్టావ్‌/ నీకు టీ కాచడానికి పటిక బెల్లం దంచడం/ వేళ తప్పకుండా విటమిన్‌ గోలీలివ్వడం/ ఇదీ నేను నేర్చుకున్న చదువంతా” కమలాదాస్‌ ఇంటి చాకిరీ, భర్తకు సేవలు చేయడం గురించి ఇంత సూటిగా రాయడం ఇప్పుడు పెద్ద గొప్పగా, కొత్తగా అనిపించకపోవచ్చు. 80వ దశకంలో తెలుగు సాహిత్యంలోకి స్త్రీ వాద ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి వచ్చి చేరినపుడు తెలుగు కవయిత్రులు ఇంతకంటే సూటిగా, ఘాటుగా కవిత్వం రాసారు. కానీ కమలాదాస్‌ రాసిన కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆమె ఎంత విప్లవాత్మకంగా, స్త్రీవాద దృష్టి కోణంతో రాసిందో అర్థం చేసుకోవచ్చు. సహజంగానే ఆమె రచనలు సంప్రదాయ వాదుల్లో గగ్గోలు పుట్టించాయి. 1976లో ఆమె ప్రచురించిన ”మై స్టోరీ” జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు గొప్ప కీర్తిని సంపాదించి పెట్టినా అంతే స్థాయిలో ఆమెమీద విమర్శల జడివాన కూడా కురిసింది. అందులో ఆమె వర్ణించిన అనుభవాలు, వివాహేతర సంబంధాల వర్ణనలు, ఆడ స్నేహితులతో ఎదురైన అనుభవాలు, భర్త కొనసాగించిన హోమో సెక్సువల్‌ సంబంధాలు – వీటన్నింటినీ నదురు బెదురు లేకుండా తన ఆత్మకథలో రాసిన కమలాదాస్‌ సంప్రదాయవాదులతో పాటు బంధువుల ఆగ్రహానికి కూడా గురైంది. లెస్బియన్‌ రిలేషన్‌షిప్‌ గురించి ఆమె రాసిన అంశాలు చాలామందిని షాక్‌కు గురిచేశాయి. 18 సంవత్సరాల అమ్మాయి తన పట్ల వ్యవహరించిన విధానాన్ని –

”ఆమె నా పెదాలమీద ముద్దు పెట్టింది. నా చెవుల్లో నువ్వు చాలా స్వీట్‌గా ఉన్నావ్‌ అంటూ గుసగుసలాడింది. నా జీవితంలో నేననుభవించిన మొదటి ముద్దు ఇదే. మా అమ్మ నేను పసిదానిగా ఉన్నపుడు ముద్దు పెట్టిందేమో కానీ ఆ తర్వాత ఎవ్వరూ నాకు ముద్దివ్వలేదు” అంటుంది.

కమలాదాస్‌ రాసిన విషయాలు ఆనాటి మళయాళీ సమాజాన్ని ఒక కుదుపు కుదిపాయి. ఆమె నిర్భయంగా వెల్లడించిన అంశాలను చూసి గగ్గోలు పెట్టే సమాజాన్ని మరింత ఏడిపించాలనే అల్లరి ఆలోచనలు కూడా ఆమె చేసిందా అనిపించేలా ఆమె ఆత్మకథలో ఒక్కో ఛాప్టర్‌కి ఆమె పెట్టిన శీర్షికలు ఉన్నాయి. బహుశా ఆమె ఆత్మకథను సీరియలైజ్‌ చేసిన పత్రిక కూడా రెచ్చగొట్టే విధంగా శీర్షికలు పెట్టినట్లు అనిపిస్తుంది.ఎందుకంటే ఆ తర్వాత కాలంలో అవన్నీ ఉత్తుత్తి సంఘటనలే అని ప్రకటించింది కూడా!

కమలాదాస్‌ తన జీవితమంతా ఉన్నతమైన స్త్రీ పురుష సంబంధాల కోసం అన్వేషించింది.”ప్రేమతోను, నమ్మకంతోను నిండిన సంబంధాలను స్త్రీ పురుషులు ఇద్దరూ కోరుకుంటారని, అవి ఇంట్లో దొరకనప్పుడు బయట వెతుక్కుంటారని” ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వివాహం బయటి ప్రేమను వెదుక్కోవడం అనే ఆలోచననే సహించని సంప్రదాయ సమాజం, ఆమె భావాలను విని వదిలేస్తుందని భావించడం వెర్రితనమే అవుతుంది. అందుకే మాట్లాడిన ప్రతి మాట, రాసిన ప్రతి అక్షరం వివాదాస్పదమయింది. ఆమె మనస్ఫూర్తిగా నమ్మినదాన్ని చెప్పింది తప్ప సెన్సేషన్‌ కోసమో,వివాదం కోసమో చెప్పలేదు. ఆమె దృష్టిలో శారీరక, మానసిక సౌందర్యాల మధ్యన భేదం లేదు. శరీర సౌందర్యాన్ని వర్ణించడంలో ఆమె ఎలాంటి శషభిషలు పాటించలేదు. ”డాన్స్‌ ఆఫ్‌ యూనిక్స్‌”,”యాన్‌ ఇంట్రడక్షన్‌” లాంటి కవితల్లో దీన్ని మనం చూడవచ్చు.

70వ దశకంలో కొత్తగా రాస్తున్న రచయిత్రులకు ప్రతినిధిగా కమలాదాస్‌ ”వ్యక్తిగతంగా సమాజం భావించే అన్ని అంశాల మీద రాస్తూ, ఆయా అంశాలను బహిరంగపరచడానికి ఎలాంటి సంకోచం లేకుండా రాస్తూ పోయింది. అప్పటికే ఇస్మత్‌ చుంగ్తాయ్‌ రాసిన ”రిహాయి” కథ సంప్రదాయ సాహిత్య లోకంలో పెను సంచలనాలను కలిగించింది. కమలాదాస్‌ తన అనుభవాలుగా అంగీకరిస్తూ, శరీరం గురించి, కోరికల గురించి, ప్రేమ గురించి, మానవీయ స్త్రీ పురుష సంబంధాల గురించి ధైర్యంగా రాయడంద్వారా కొత్తగా రాస్తున్న రచయిత్రులకు ఎంతో స్ఫూర్తిని, నిబ్బరాన్ని ఇచ్చింది. ఎనభై దశకంలో వెల్లువెత్తిన స్త్రీవాద సాహిత్యానికీ, స్త్రీ వాద కవయిత్రులకు స్ఫూర్తిగానూ కమలాదాస్‌ రచనలు నిలిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

కమలాదాస్‌ ఏది రాసినా సంచలనమే. ఏది ఆచరించినా సంచలనమే. డిసెంబరు 16, 1999 సంవత్సరంలో 65 ఏళ్ళ వయసులో ఇస్లామ్‌ మతాన్ని స్వీకరించింది. ఆమె రచనలు ఎంత సంచలనం కలిగించాయో ఆమె ఇస్లాం మత స్వీకరణ కూడా వేడివేడి చర్చల్ని లేవనెత్తింది. అంతేకాదు బురఖా ధరిస్తూ, స్త్రీలను అణచివేసే హిందూ మతంలో కన్నా ఇస్లామ్‌లోనే స్త్రీలకు రక్షణ ఉందనే ప్రకటన కూడా చేసింది.

సహజంగానే ఇలాంటి ప్రకటనలు జనంలో ఆమె పట్ల ఆగ్రహాన్ని కలిగిస్తాయి. అయితే కమలాదాస్‌ తాను నమ్మిన దాన్ని ఆచరించడానికి, రాయడానికి, బహిరంగంగా ప్రకటించడానికి ఏనాడూ జంకలేదు. ఒక సంప్రదాయ హిందూ నాయర్‌ కుటుంబానికి చెందిన కమలాదాస్‌, భర్త మరణానంతరం ఇస్లామ్‌ మతం స్వీకరించి, పేరు మార్చుకుని తుదివరకు అలాగే బతికింది.

కమలాదాస్‌ రాజకీయాలను కూడా ఒంటబట్టించుకుని ”లోక్‌ సేవా పార్టీ”ని స్థాపించి 1984లో పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయింది.

తనను తాను ఫెమినిస్టుగా చెప్పుకోకపోయినా, తన జీవితంలోని అనుభవాలను, తాను నమ్మిన వాటిని గురించి రాస్తూ స్త్రీల జీవితాల్లోని అణచివేత గురించి రాసింది. తన గురించి రాసుకున్నా, వేరెవరి గురించి రాసినా ఆమె ఎక్కడా ఏ ముసుగులూ వేసుకోలేదు. జీవితమంతా ప్రేమ కోసం వెదుకులాటే అయింది ఆమెకి. ”నన్ను ఎవ్వరూ ప్రేమించలేదు. ప్రేమ కోసం వెదుకులాటే నా జీవితమంతా” అంటుంది ఒకచోట.

కమలాదాస్‌ తన రచనల ద్వారా ఇంగ్లీష్‌, మళయాళ సాహిత్యాల్లో అజరామరంగా నిలిచిపోతుంది. నిరంతర అన్వేషిగా జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేసింది. ఆ ప్రయోగాల పర్యవసానంగా ప్రజల ఆగ్రహాలను చవి చూసింది. తన అన్వేషణలో భాగమే ఇవన్నీ కూడా. ప్రేమతో నిండిన స్త్రీ పురుష సంబంధాల కోసం జీవితమంతా అన్వేషించింది. మనుషుల మధ్య మానవీయ సంబంధాల కోసం ఆరాటపడింది.

2006లో కమలాదాస్‌ చిట్టచివరిసారి కేరళ సందర్శించింది. తన తాతల నాటి ఇంటిని, స్థలాన్ని కేరళ సాహిత్య అకాడమీకి దానం చేసింది. తాను బతికుండగా మళ్ళీ కేరళకు రాలేననే విషయం ఆమెకు అర్థమయినట్లే ఉంది. అందుకే ఇలా అంటుంది…

”నేను మళ్ళీ నా మరణం తర్వాత ఇక్కడికి వస్తాను. మానవాకృతిలో మాత్రం కాదు. ఒక పక్షిగానో, ఒక లేడిగానో మాత్రమే వస్తాను. నేను ఈ భూభాగంలో మమేకమై ఉంటాను”

కమలాదాస్‌ తుది శ్వాస విడిచింది పూనాలోని తన రెండవ కొడుకు ఇంట్లో. 75 సంవత్సరాల తన అన్వేషణకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ మే 31న తుదిశ్వాస విడిచింది. చనిపోయేందుకు రెండు సంవత్సరాల ముందు తనను దర్శించవచ్చిన మిత్రుడు విజయ్‌ నంబీశన్‌తో ”నేను ముసలిదాన్ని అయిపోతున్నాను” అంటుంది. 75 ఏళ్ళ వయసులో తను ముసలితనంలోకి వెళ్ళినట్లు కొత్తగా చెప్పడం, గమనించడం అంటే తనలోని పసిప్రాయం లేకుండా పోయిందని అంగీకరించడమే. అలాంటి ిచిన్నపిల్లల తత్వం ఆమెలో తుదిదాక బతికుండడమే ఆమెలోని గొప్పతనం.

నిరంతరాన్వేషి, సంచలనాల చిరునామా, ప్రేమ పిపాసి, సాహసి కమలాదాస్‌కు ఇదే నా అక్షరాంజలి. తన ఆత్మకథ ద్వారా నా మీద ఎంతో ప్రభావం చూపిన కమలకు నా అశ్రు నివాళి.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.