పురుషాధిక్య రాచనాగు సదాశివం – వేములపల్లి సత్యవతి

సంగీత సామ్రాజ్యానికి రాణిగా ఖండఖండాంతరాలలో ఖ్యాతి నార్జించిన మహోన్నత మహిళ ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి తన మామ (భర్త సదాశివం) రాచసాగువలె తనను కాపాడినాడని తెలియజేసింది. రాచనాగుని కాదని బయటకొస్తే అంతకంటే భయంకరమైన కాలనాగులు, కొండచిలువలు, తిమింగలాలకు బలి కావలసి వస్తుందని గ్రహించిన సుబ్బులక్ష్మి తన ఆకాంక్షలు తీరవని తెలుసుకుని రాచనాగు సదాశివంకు బందీ అయింది. గృహిణిగా జీవించాలన్నది దేవదాసీ కులంలో పుట్టిన సుబ్బులక్ష్మి ప్రగాఢ ఆకాంక్ష. ఆమె జన్మకు కారకుడయి, తండ్రిగా చెప్పబడుతున్న పురుషుడు అర్థరాత్రివేళ తనను ఎత్తుకొని ముద్దులాడడాన్ని, పెద్దయిన తర్వాత సుబ్బులక్ష్మి ఏవగించుకుంది. దేవదాసీ వృత్తి నుంచి బయటపడి, ఒకే వ్యక్తిని వివాహమాడి గృహస్థ జీవితం గడపాలని, తన కడుపున పుట్టిన బిడ్డలకు తండ్రి అయినవాడు, అర్థరాత్రి కాకుండా బహిరంగంగా బిడ్డలను ముద్దులాడాలని కోరుకుంది. దేవదాసీలంటే మన సమాజంలో పడుపు వృత్తి చేసేవారన్న అపోహ పాతుకుపోయింది. సంగీత, నృత్య కళలకు ఆద్యులు దేవదాసీలు. ఆ కళలలో ఆరితేరి, నిష్ణాతులయినవారే కాకుండా బెంగుళూరు నాగరత్నమ్మ లాగా సాహిత్య ప్రవేశమున్న దేవదాసీలుండేవారు. దేవాలయాలలో దేవుని ఎదుట పాటలు పాడి, నాట్యం చేసేవారు. సుబ్బులక్ష్మిని సంగీత కచేరీలకు, నృత్య ప్రదర్శనలకు తన వెంట మద్రాసు తీసుకెళ్ళేది ఆమె తల్లి. ఆమె తల్లి సుబ్బులక్ష్మిని చిన్నప్పటినుంచే సంగీత కచేరీలలో పాల్గొనేలాగ చేసింది. కచేరీలు చేయడానికి, నృత్య ప్రదర్శనలు ప్రదర్శించడానికి సుబ్బులక్ష్మి తల్లి తన కుటుంబాన్ని మధురై నుంచి మద్రాసుకు మార్చుకుంది.

మద్రాసులో సదాశివం ఒక తమిళ పత్రిక సంపాదకునిగా ఉండేవాడు. తరచుగా సుబ్బులక్ష్మి అమ్మగారింటికి రాకపోకలు సాగించాడు. అతని కన్ను తన కూతురు సుబ్బులక్ష్మిపై పడిందని ఆమె గ్రహించింది. వెంటనే మధురైకు మకాం మార్చివేసింది. సుబ్బులక్ష్మికి 20 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి, తల్లి ఆమెకు తగిన సంరక్షకుడిని వెదకసాగింది. సుబ్బులక్ష్మి తల్లికి తన మనసులోని కోరిక తెలిపింది. అందుకామె, దేవదాసీ కులంలో పుట్టిన మనను ఎవరూ పెండ్లి చేసుకోవడానికి ముందుకు రారని, ఒకవేళ ఎవరైనా ముందుకొస్తే రెండవ లేదా మూడవ పెండ్లికి తయారయినవారే ఉంటారని, అదికూడా సాధ్యం కాని పనేనని, తన అభిప్రాయాలను మార్చుకోమని సుబ్బులక్ష్మికి హితబోధ చేసింది. సంరక్షకుని వెదికే పనిలో నిమగ్నురాలయింది. తల్లి తన ప్రయత్నాలు మానుకోలేదని, ముందుగా ఎవరికీ తెలియకుండా బయటపడాలని తలచింది సుబ్బులక్ష్మి. ఆలోచించి చివరకు తనకు తెలిసిన మద్రాసుకు రహస్యంగా వచ్చేసింది. పేరు ప్రఖ్యాతలున్న కాంగ్రెస్‌ నేత బులుసు సాంబమూర్తి గారి వద్దకు వెళ్ళింది. చెరసాలలకు భయపడని నేత దేవదాసీ యువతికి ఆశ్రయమివ్వడానికి వెనుకంజ వేశారు. తనకు పరిచయమున్న పత్రిక సంపాదకుడు సదాశివం వద్దకు పంపించారు. ఆడబోయిన తీర్థమెదురైనట్లు అయింది సదాశివం పని.

సదాశివం సాంప్రదాయ బ్రాహ్మణుడు. వివాహితుడు. ఇద్దరు బిడ్డల తండ్రి. అతని ఇంటి చుట్టుపక్కల బంధువులు, అతని సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. సదాశివం సుబ్బులక్ష్మిని తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. అందుకు చుట్టాల నుంచి కానీ, అతని సామాజిక వర్గం నుంచి కానీ ఎటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నట్లు లేదు. అతని అంతరంగ ఉద్దేశ్యాన్ని గ్రహించిన సదాశివం భార్య ఆత్మహత్య చేసుకుంది. అదే నిమ్న కులాలలోనైతే కుల కట్టుబాట్లను ఎదిరించినందుకు కుల తప్పు కింద జరిమానా (డబ్బు) చెల్లించాలి. కొన్ని కులాలలో తమ కులం నుంచి వెలివేస్తారు. అగ్ర వర్ణానికి చెందినవారికి తప్పులూ ఉండవు కాబోలు. క్షత్రియ రాజు, భార్యకు సంతానం కలగకపోతే రాణి బ్రాహ్మణోత్తముని ద్వారా సంతానవతి కావచ్చునట. అదే బ్రాహ్మణుని భార్య సంతానవతి కానిచో క్షత్రియరాజుతో సంతానం పొందకూడదు. చతుర్వర్ణాలలో ప్రథమ వర్గానికి చెందినవారికే ఆ హక్కు ఉన్నదట. వేదకాలానికి పూర్వం సనాతన ధర్మం ఉండేదట. ఆ కాలంలో ఆ సాంప్రదాయం ఉండేదట. అందుకేనేమో సదాశివంకు ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు. సదాశివంను పెండ్లి చేసుకోక ముందు వీణధనమ్మ కూతుళ్ళతో సదాశివంను చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెపుతుంది. అందుకు వారు రెండు సంవత్సరాల నుంచి సదాశివం దగ్గరున్న నిన్ను ఎవరూ పెండ్లి చేసుకోరని, అతనినే చేసుకోమని సలహా ఇచ్చారు. ధనమ్మ కూడా దేవదాసీనే. వీణ వాయించడంలో నిష్ణాతురాలయింది. ఆమెను వీణ ధనమ్మగా పిలవసాగారు. సదాశివం సుబ్బులక్ష్మికి ఏది చేసినా తన స్వార్థం కొరకు, లాభాన్ని దృష్టిలో పెట్టుకుని చేశాడు. ఆమెను సినిమాల్లో చేర్పించాడు. కోకిల కంఠస్వరాన్ని మైమరపించిన సుబ్బులక్ష్మి రూపవతి కూడా. సినిమాల ద్వారా వచ్చిన పారితోషికాలలో తన పత్రికకు సొంత భవనాన్ని కట్టించాడు. పత్రిక కోసం చేసిన అప్పులు తీర్చివేశాడు. శకుంతల సినిమాలో నటించేటపుడు ఆమెతోపాటు నటించిన సహ నటుడు, కర్నాటక విద్వాంసుడు జి.ఎస్‌.సుబ్రమణియన్‌ పట్ల ఆకర్షితురాలయింది. తన మనసులోని కోరికను తెలియజేస్తూ (1938లో) అతనితో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపింది. ఆ సంగతి తెలిసిన సదాశివం ఉత్తరాలు రాయకుండా కట్టడి చేశాడు. ‘తనకు నేను ఏమైనా స్వంత మేనమామనని అనుకుందా! పెండ్లి చేసి పంపడానికి’ అన్నాడు సదాశివం. సినిమా రంగంలో నిలదొక్కుకున్న తర్వాత నీ చేతుల్లో నుంచి చిలుక ఎగిరిపోతుందని, సినిమాలు మాన్పించమని సదాశివం మిత్రుడొకరు అతనికి సలహా ఇచ్చారు. వెంటనే సినిమాలు మాన్పించాడు. సంగీతంలో నిష్ణాతురాలిగా తీర్చిదిద్దడానికి యోగ్యుడయిన గురువును ఏర్పాటు చేశాడు. అంతకు ముందునుంచే తల్లితో కలిసి సంగీత కచేరీలో పాల్గొన్నది సుబ్బులక్ష్మి. సదాశివం సంగీత కచేరీలు ఏర్పాటు చేశాడు. కచేరీల నిర్వాహకులతో ఏర్పాట్లను గురించి మాట్లాడడం, డబ్బుకు సంబంధించిన లావాదేవీలన్నీ సదాశివం చేసేవాడు. కచేరీలలో పాడడం వరకే సుబ్బులక్ష్మి పాత్ర.

సుబ్బులక్ష్మిని సొంతం చేసుకోవాలన్న ఆలోచన కలిగినపుడే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నాడు సదాశివం. దేవదాసి పొందు కావాలి, ఆమె కడుపున పుట్టినవారికి తండ్రి కాకూడదన్నది సదాశివం ఆలోచన. తన కడుపున పుట్టిన బిడ్డలను బహిరంగంగానే ముద్దాడే తండ్రి కావాలన్న సుబ్బులక్ష్మి ప్రగాఢమయిన కోరిక కల్ల. బయటకు వెళ్తున్నప్పుడు సదాశివం ఇంటికి బయట తాళం వేసేవాడట. అతని ఇద్దరి బిడ్డలను కన్న తల్లికంటే మిన్నగా ప్రేమతో పెంచి పెద్దచేసింది సుబ్బులక్ష్మి. సుబ్బులక్ష్మి తల్లితోను, తోబుట్టువులతోను సంబంధం పెట్టుకోకుండా కట్టడి చేశాడు సదాశివం. ఎప్పుడైనా ఆమె అన్న చూడడానికి వస్తే సదాశివం అతన్ని కనీసం పలకరించేవాడు కాదు, అతను చెల్లితో మాట్లాడి భోజనం చేసి వెళ్ళేవాడు. ఒకసారి సుబ్బులక్ష్మికి ఆమె తల్లి వీణ పంపింది. అది చూసి సదాశివం ఆ లం… దాని వస్తువు తన ఇంట్లో ఉండకూడదని తెచ్చిన వ్యక్తితో చెప్పి దాన్ని పంపించివేశాడు. మరి ఆ లం… దాని కడుపున పుట్టిన దాన్ని వివాహం ఎందుకు చేసుకున్నాడో? ఈ మాటల వలన, అతని చేష్టల వలన సదాశివం సంస్కార హీనుడే కాకుండా క్రూరుడు, కర్కోటకుడు అని తేటతెల్లమవుతుంది. సుబ్బులక్ష్మి తల్లి చావు బ్రతుకుల్లో ఉంది. కడసారి కన్నతల్లిని చూడడానికి కూడా వెళ్ళనివ్వని కిరాతకుడు సదాశివం. చనిపోయిన తర్వాత కూడా కర్మకాండలకు పోనివ్వలేదు. ఎంత మానసిక క్షోభను అనుభవించి ఉంటుందో కదా! సదాశివం సుబ్బులక్ష్మికన్నా ముందే చనిపోయాడు. అతను ఆమెకన్నా 15, 20 సంవత్సరాలు పెద్దవాడు. సుబ్బులక్ష్మి గారు సినిమాలో నటించేటపుడు ఆమెను ఎవరో సహనటుడు సుబ్రమణియన్‌తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల సంగతిని ప్రస్తావించారు. అందుకామె ‘ఉన్నమాటే కదా!’ అని సమాధానం చెప్పారు. దేశ విదేశాలలో, ఖండాంతరాలలో త్యాగరాజు కృతులను ఆలాపించి, అజరామర కీర్తినార్జించిన సుబ్బులక్ష్మి ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించారు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.