కాత్యాయని విద్మహే గారన్నట్లు ఉద్యమ చైతన్యాన్ని గుండె గుండెనా దీపంలా వెలిగించి అనేకులింకా సమూహంలో భాగం కావడాన్ని ఆశించి రజిత కవిత్వం రాస్తున్నది. నిర్భయాకాశం క్రింద నిలబడి సామూహికంగా గానం చేసే రోజు కోసం కలగంటున్నది. నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న అనిశెట్టి రజిత కవిత్వమంతా ఆపుకోలేని భావోద్వేగాలు, ఆవేదన, ఆర్తి, దుఃఖం. అవును నిజం. అందుకు నిదర్శనం ఆమె కలం నుండి పెల్లుబికిన కవితాధారల ప్రవాహం. 1984 సంవత్సరంలో తన మొదటి కవితా సంపుటిని ప్రచురించిన రజిత వివిధ కవితా, కథా సంపుటాలతో పాటు రుద్రమ ప్రచురణల ద్వారా రావడం అభినందనీయం. ఈ అభద్ర సమాజంలో మనం కోరుకుంటున్నది మన తలల మీద ”నిర్భయాకాశాన్ని” అందుకే ఈ సంపుటికి ”నిర్భయాకాశం కింద” అన్న పేరు పెట్టిన అని చెప్తూ ఈ యథాతథ వ్యవస్థను నిరసిస్తూ సామ్యవాద సమాజం కోసం స్వప్నిస్తూ తపిస్తూ సంఘర్షణాపథంలో పయనిస్తున్న ఉద్యమకారులందరికీ అంటూ ప్రారంభించడంలోనే రజిత ఆశయం, ఆదర్శం అర్థమవుతాయి.
‘మనలో చలనం అనేది నిత్య జీవన సృజనం’ అనేది రజిత కవిత్యానికి నిజమైన ప్రేరణ. ఈ ఆకాశం క్రింద మొత్తం 60 కవితలున్నాయి. వీటిలో కొన్ని పాటల రూపంలో ఉన్నాయి. మహిళా సమస్యలను తెలంగాణ ఉద్యమ సందర్భానికి, ముంపు (పోలవరం) గ్రామల ప్రజల వెతలకు, ఆదివాసీ ఉద్యమాలు, చెరువులు, అసమ సమాజంలో మానవ ప్రవర్తనలు వంటి అంశాలెన్నింటినో స్పృశిస్తూ ఆలోచింపచేసే కవితా పంక్తులను మనముందుంచింది రచయిత్రి. అవేంటో పరిశీలిద్దాం.
చలింప చేసే సౌందర్యం తమ సొత్తని / మత్తెక్కించే మాధుర్యం తమ నైజమని అనుభూతీ అనుభవాలే తమ ఉనికియని / ఇన్నాళ్ళూ నేను నమ్మిన ఆ సుమాలూ త్రుంచేస్తే వడలి వాలిపోతాయని / నలిపేస్తే నశిస్తాయనీ, అచ్చంగా ఈ దేశంలోని ముగ్ధ స్త్రీలకవి / సరైన పోలికలని ఇన్నాళ్ళు నేనూ / కొందరి వలె అనుకున్న ఆ పుష్పాలూ / నన్నూ నా నమ్మకాలను వమ్ము చేస్తూ / ఆ గులాబీలు గుబాళించడం లేదు సరికదా / సహించుటయే తెలిసిన ఆ సొగ సుందరాలు / నేడు దహించుకు పోతూ జ్వలిస్తున్నాయి / గులాబీలు విప్లవిస్తున్నాయి అంటూ స్త్రీల సహనాన్ని పరీక్షిస్తూ ఆ గులాబీల్లాగానే స్త్రీలు ప్రజ్వరిల్లక తప్పదని హెచ్చరిస్తూ రాసిన కవిత గులాబీలు జ్వలిస్తున్నాయి. మనం కదం తొక్కుతూ ముందుకు పోగా పోగా / తప్పక గొప్ప మార్పునీ మంచి రోజుల్నీ తేగలం అంట / పది మందిమి ఒక్కటై తిరగబడితే సంఘర్షిస్తే / రేపు జయం మనదైనప్పుడు ఒక్కరైనా సుఖిస్తారు / కానీ మనం బతుకు వైభవాలు / అనుభవాలు పంచుకోవాలి అంటూ కర్తవ్యాన్ని ప్రభోదిస్తుంది. ఔవ రష్ట్రaశ్రీశ్రీ రఎaరష్ట్ర ్‌ష్ట్రఱర జూతీఱరశీఅ రశీఎవ సaవ (+aఱశ్రీ శీఙఅఙవస్) ఆంగ్ల వ్యాసానికి రాసిన అనువాద కవిత ‘చెరను తుదముట్టించాలి’లో. నా సామాజిక సంఘ జీవన ప్రస్థానంలో నిత్య జీవన కష్టాలే నా చోదక శక్తులు అన్న రజిత నీవు పుట్టిన ఆ రోజున నా చిన్ని తల్లీ / అది నీరసించిన చీకటి రాత్రి నా అత్త ఆడబిడ్డా దీపాలు / వెలిగించడానికి కూడా నిరాకరించారు అని ఆవేదన వ్యక్తం చేస్తూ నీ పుట్టుకకు వైభవం / చేకూరనియ్ నా చిన్ని తల్లీ అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘ఒక ఆడపిల్ల జన్మించిన వేళ’ అనే కవితలో ఇది కూడా అనువాద కవితయే.
తన రచనలన్నీ సాహిత్య సామాజికమే అన్న రజిత ‘కలాల సైన్యం’ అనే కవితలో ప్రజల చరిత్రకు ప్రాణం పోస్తూ / సమత కోసం సంఘర్షిస్తూ / ఉద్యమాలకు ఊసై నిలుస్తూ / అణచివేతలను ఖండిస్తూ / ప్రభంజనమై ప్రజ్వరిల్లుత కలాల సైన్యం కలాల సైన్యం వస్తూందీ / కలం గొంతుతో కొత్త పాటలే రాస్తుందీ అంటూ కవుల కలాల సామర్ధ్య పటిమను తెలుపుతుంది. మనమంతా ఒకటై / ఈ చెరను తుదముట్టించాలి / ఈ ట్టుబాట్లను తెంచాలి అని మనమంతా సంఘటితమై / ఈ జీవిత ఖైదును కూల్చాలి / పోరాట జ్వాలలై లేవాలి / స్వరమెత్తి హక్కులను చాటాలి / మనమంతా ఒక్కటై ఈ చెరను తుదముట్టిద్దాం అని ఆడవాళ్ళంతా ఒక్కటై కష్టాలను అధిగమించాలని సూచిస్తుంది ‘ఈ చెరను…’ అనే కవితలో. ఇంటిలోన మొగనిపోరు పనుల కాడా దొరల జోరు / కులం పోరున కుళ్ళు లోకులు కాకులయ్యి పొడిచిరాయే / ఆడదంటే అలుసుతోని గానుగెద్దుగ నిన్ను జేసిరి / నీ ఊపిరంతా ఉసురుసురనెనే మా తల్లులూ / నీ బతుకంతా బాంచె ఊడిగమే మా అమ్మలూ అంటూ ఆడ బతుకుల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ అన్నమూ పెట్టేటి తల్లి ఆలనా జూసేటి తల్లి / ఆలనా జూసేటి తల్లి పాలనా జేసేటి తల్లి / ఆడదంటూ లేకపోతే ఆగమవును లోకమంతా / ఆడదాని శక్తితోనే నిలిచి ఉండును సృష్టి అంతా / ఈ నిజం తెలిసీ తెగువ చూపాలే మా తల్లులూ / నిను ముంచేటోల్లకు ఎదురు తిరగాలే మా అమ్మలూ అని దండం పెడుతూ స్త్రీ జాతికి సందేశమిస్తుంది ‘దండాలమ్మా’ అనే కవిత ద్వారా.
అన్యాయాన్నెదిరించుటలో ఓ మహిళా నీవు / అసమానత నెదిరించుటలో ఓ మహిళా నీవు / శతాబ్ది గాయమైతివమ్మ ఓ మహిళా నీవు అంటూ మహిళల పక్షాన నిలిచి జీవితంలో ఆమె ఎదుర్కొనే సమస్యలనెన్నింటినో చెబుతూ ఉద్యమాల లాంగ్ మార్చ్ ప్రపంచ దేశాలా / పటాలనే మార్చిందీ మన చరిత్ర రాసిందీ / పోరాటపు చాలు పోసి పోరుపాట పాడిందీ / ధిక్కారపు గొంతునిచ్చి నీకు ధీరత్వం నేర్పిందీ అని ధైర్యాన్నిచ్చి వందనాలు సమర్పిస్తుంది ‘శతాబ్ది వనితకు వందనాలు’ (మార్చి 8కి వందేళ్ళ సందర్భంగా) అనే మరో కవితలో. తేట తెలంగాణ బాసలో నీవు / బతుకు నిండార వెలుగులే నింపుకో నీవు / ఊరికొక్కా యాస – మాటకొక్కా సామెత / జాతీయములు పలుకు భాష తెలంగాణ / తేనె లొలుకును చూడు తెలంగాణ తెలుగు అని తెలంగాణ భాష యాసపట్ల మక్కువను ప్రకటిస్తుంది ‘జీవగడ్డగా చేయ…’ అనే కవితలో. ఇంకా ఈ కవితలో తెలంగాణా వైతాళికుల గురించి కూడా ప్రస్తావిస్తుంది కవయిత్రి. ఒక కంట కన్నీళ్ళు ఒక కంట మంటలూ / కాళోజీ హృదయం నిత్య కల్లోలం అంటూ కత్తితో కవితలను రాసిన కవి వీరుడూ / తన గొడవతో లోకాన్ని నిద్ర లేపేటి
ఉదయుడూ / రాజ్య హింసలను నిరసిస్తూ గళ గర్జనలు చేసే / లోక శ్రేయస్సుకై నడి సంద్రముల ఈదే / పౌర హక్కుల కొరకు ఎలుగెత్తిన స్వరం అంటూ ధిక్కార స్వరాన్ని వినిపించింది ప్రజాకవి కాళోజీ గురించి ‘కనురెప్పల కావలి వాడు కాళోజీ’ అనే కవితలో.
అంతేకాదు పాట పూచిన చెట్టురా / నా తెలంగాణ గట్టురా / అగ్నిపూల జ్వాలలున్నా – అడవి అందం తెలంగాణా / ఆత్మగల్ల తల్లులున్నా అమృత భాండం తెలంగాణ / కవి గాయక కళాకారుల – కాణాచీ తెలంగాణ / చెమట చుక్కలు తడిపినా – శ్రమ సేద్యం తెలంగాణ అంటూ ఉద్యమాల ఊపిరయ్యి – ఉబికి వచ్చిన పాటరా / జనం గుండెల చప్పుడైనా డప్పు మోతీ పాడరా అంటూ తెలంగాణ ప్రాంత గొప్పతనాన్ని ఆవిష్కరించారు ‘పాట పూచిన’ అనే కవితలో.
ఈ నరమేధం పోవాలంటే / నవ నాగరికత రావాలంటే / ఎన్ని జన్మలెత్తాలి మనం / ఎన్ని యుగాలు వేచుండాలిర మనం అంటూ జన్మనిచ్చిన స్త్రీ జాతిని / సంహరించు హంతకులు / సృష్టిని వ్యతిరేకిస్తూ / ఎదురు నిల్చు విధ్వంసకులు అని చెప్తూ భూమి పుత్రికగా మానవి / తన శక్తిని గుర్తెరిగితే / అతివ అస్త్రధారణియై / తిరగబడితే ఏమవును అని ప్రశ్నిస్తూ నీలో మృగం చావకుంటే / పుట్టగతులు నీకుండయి / మనిషిగా నువు మారకుంటె / మనిషి ఉనికి అంతమవ్వును అని మృగాల్లా ప్రవర్తిస్తున్న మగవాళ్ళ ప్రవర్తనను మార్చుకోమంటుంది మనిషిగా మారిపో… అనే కవితలో. వరం శాపమైతే అదే మరి – తరాలుగా జీవించినా / నేలను విడిచి / అల్లుకున్న ప్రకృతి / అనుబంధాలను తెంచి / బతుకు భారాన్ని తలకెత్తుకొని పొమ్మంటుంది / వలసంటే అదే మరి అంటూ ప్రభుత్వపు బూటకపు ప్రగతి బాటలో / ఎదురవుతూ ప్రమాదాలూ విలయాలూ / ఉత్పాతాలూ ప్రకృతి ప్రకోపాలూ / ఏమి పట్టవా ఏలినవారికి అని ఊళ్ళను గూళ్ళనూ / సేద్యాన్ని శ్రమతత్వాన్ని / మూలికలను వనసంపదలనూ / సమస్తాన్నీ సమూలంగా నాశనం చేస్తుంది. / దీనుల విలాపాలను ముంచేస్తుంది / అది జల సమాధి / ముంపంటే అదే మరి అంటూ ముంపు గ్రామాల గోడును చెప్తూ పాలకుల నిర్లక్ష్య ధోరణిపై ఆవేదనతో రాసిన కవిత ఇది. రచయిత్రి ముంపు గ్రామాలను ప్రత్యక్షంగా సందర్శించి సమాచారాన్ని కూడా సేకరించింది.
మా అంతర్ముఖపు పొదరింటిని ఒదిలి / కొండల గుండెల పొరలను చీల్చుకొని / ఆదివాసీ నగ్నపౌరునిగా బహిర్గతమవుతాను / నా ఆయుధాన్ని ఆత్మ గౌరవ పతాకం చేసి / గిరిజన సమూహల స్వరఘోషై ఎలుగెత్తుతాను అంటూ మా జాతుల్ని కన్నీటి యజ్ఞంలో / జల సమాధి చేయ తలపెట్టొద్దని / భారీ నీటి ప్రాజెక్టుల పేరుతో / ప్రాకృతిక సంపదల్నీ సహజ వనరుల్నీ / విధ్వంసించడం మానుకొమ్మని సూచిస్తున్నా అని ఆదివాసీ జనం ఘోషను తనదిగా చేసుకొని సూచనతో అడవి బిడ్డను మాట్లాడుతున్నా అంటుంది. రుద్రవీణలపై జనవేదనలకు రాగాలు కడ్తుంది / డోలక్ కంజీర డప్పులతో గజ్జె కట్టి ఆడుతుంది / గద్దరన్న నోట సివంగిలా దూకి గర్జిస్తుంది / ప్రజా యుద్ధ నౌకగా పోరు సైరన్ మ్రోగిస్తుంది అంటూ పాట ప్రాశస్థ్యాన్ని చెబుతూ పాటను చంపబోతే రగడబుట్టు రాజ్యమున ఎవడురా ఎవడురా ఎవడూ వాడెవడురా అని పాటకు సంకోళ్ళా అని ప్రశ్నిస్తుంది.
దుఃఖాల చెర్వులో మున్కలేస్తూ ఉన్నా సంతసపు సమయాలు పంచుకుంటున్నా / మనిషి ఉనికంటే మనసేనమ్మా / లోలోన కదలికే మనసంటేనమ్మా అని మనసున్న మనిషి గురించి చెబ్తూ మనసున్న మనిషిపుడు ఎక్కడున్నట్టో / ఎంత వెతికినా జాడ తెలియదన్నట్టు అంటూ ప్రస్తుత సమాజంలో మనసులేని మనుషులను చూసి రాసిన కవిత మనసు – మనిషి. మా ఊరికి ఊపిరి నీవు / మా జీవనగానమే నీవు / మా పశువుల కాపాడేవు / మా యవుసం సాగించేవు / నువ్వులేని ఊరే బీడు / నువ్వు లేక బతుకులు కూలు / చెరువమ్మా చెరువమ్మా / తల్లీ నా చెరువమ్మా / మా గుండె చెరువమ్మా /పల్లెకు ప్రాణం నీవమ్మా అంటూ పల్లెలకు ప్రాణం పోసే చెరువునుద్దేశించి రాసిన కవిత నా గుండె చెరువమ్మా నా కన్నీ ఉగాదులే కావాలి/ నా కోసం వసంతాలు పల్లవులు పాడాలి అంటూ సబలనై సంకల్పించాను / యుగమానవివై సమాయత్తమవుతాను / అంతం చేసిన కొద్దీ అవతరిస్తాను / నేనే యుగాదినై మహినావహిస్తాను అంటుంది ‘యుగాది మహిళ’ అనే కవితలో.
‘అవును మౌనాన్నే మాట్లాడుతున్నాను’ అనే కవితలో బాధతో చుట్ట చుట్టుకు పోయిన / విషాద గీతమై పాడుతూ / నూరేళ్ళూ నిండిన బాలికనోట / బతుకు పాటగా జారుత / జీవించే హక్కు బాకులా దిగబడిన / గర్భస్థ పిండంగా రోదిస్తూ / కన్నీట తడిపిన ప్రశ్నల్ని / కత్తుల్లా సంధిస్తూ నిలదీస్తున్నాను అంటూ అవును అంతా నిశ్శబ్దమైన వేళన / మౌనాన్నే… మాట్లాడుతున్నాను / మరో ప్రపంచపు శంఖారావం చేస్తున్నాం అంటూ మౌనాన్ని మాట్లాడించి శంఖారావం పూరించింది రజిత. కన్నీటి ఘోష కాదా కవిత్వం / కడలి భాష కాదా కవిగానం / తొలుచుకొచ్చే ప్రతిభావం కవితే / పల్లవించే పద ప్రవాహ కవితే అంటుంది. ఇంకా వెన్నెల్లో విహరించే నల్ల పావురాల్లా / చీకటిలో వికసించే తెల్ల కలువల్లా / హృదయాన్ని చిలుకుతూ ఉబికొచ్చే / అమృతాక్షరాలు ధరించవా కావ్య రూపం అంటుంది ‘కవిత్వ కాంక్ష’ అనే కవితలో. మానవ గౌరవంతో మహిళ / సాధికారమై శాంతి జీవనాన్నాస్వాదించాలి / నిర్భయాకాశం కింద నిజమైన / మార్పుని యుగాదులుగా ఆహ్వానించాలి అంటూ మనుషులందరం మధుర / సంగీతమై ప్రవహించేందుకు / వికృతాలను ఉగ్రతలను తన్ని / తరిమేస్తూ మానవ ఇతిహాసాలను రచించాలి అంటూ సందేశాత్మక ముగింపునిస్తుంది ‘నిర్భయాకాశం కింద’ అనే కవిత ద్వారా.
ఇవన్నీ కదిలీ ‘కదిలించడం కవుల పని’ అన్న అనిశెట్టి రజిత హృదయంలోంచి వచ్చినవే. ప్రజాస్వామిక ఆకాంక్షతో, ఆత్మగౌరవ చేతనతో కలం పట్టిన రజిత ఆశయం సామాజిక కవులూ, రచయితలూ మొదట నిర్భయాకాశం గురించి ఆలోచించాలని. తనదైన ప్రత్యేకమైన శైలిలో చుట్టూ అల్లుకున్న సంఘర్షణలకు, అనుభవాలకు అక్షర రూపమే అనిశెట్టి రజిత కవిత్వం. మనిషి విలువల పతనాన్ని చూసి సహించలేని మనిషితనంతో బాధ, ఆందోళన, కోపం, ఆవేశం, ఆక్రోశం ప్రస్ఫుటించే కవిత్వం రజితది. సమాజంలోని సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ, పరిష్కార మార్గాలకై అన్వేషిస్తూ కలమే తన బలమైన ఆయుధంగా ముందుకు సాగుతున్న అనిశెట్టి రజిత కలం నుండి మరిన్ని కవితా సంపుటాలు రావాలని ఆకాంక్షిద్దాం.