సుమారు రెండు వందల ఏళ్ళ క్రితం వ్యవస్థ అది. భారతదేశానికి స్వాతంత్య్రం అనేది సుదూరంలో కూడా లేదు. దేశం ఒక సరిహద్దులు కలిగిన దేశపటంగా, వివిధ రాష్ట్రాలుగా కూడా ఏర్పడి లేదు. కానీ 1829వ సంవత్సరం నుండీ విదేశీ పాలనా బానిసత్వంలో మగ్గిపోతున్న భారతీయ సమాజం అసాధారణమైన సంచలనాలను చవిచూసింది. బహుజన చైతన్య ఉద్యమాలు కొత్త చరిత్రను నమోదు చేయనారంభించాయి. వర్థ వ్యవస్థ వల్ల విపరీతాలు, కుల వ్యవస్థ వల్ల దురాచారాలు, వర్గ వ్యవస్థ వల్ల చీలికలు, మతస్వామ్యం, పితృస్వామ్యం, బ్రాహ్మణీయ పితృస్వామ్యం, భూస్వామ్యం వల్ల సాంస్కృతిక విధ్వంసం, ఆర్థిక వ్యత్యాసాలు, సాంఘిక అంతరాలు సమాజాన్ని విషపూరితం చేసిన కాలం. అది కాలదోషం పట్టిన రొచ్చు సమాజం. అక్కడ మనిషికీ మనిషితనానికీ గుర్తింపే లేదు. ఒక విధంగా అది అనాగరికంలో దిగబడిపోయిన సమాజం. అట్లాంటి వ్యవస్థను సవాల్ చేయడమంటే ప్రాణాల మీద ఆశ వొదులుకోవడమే. కానీ ఆ దుర్భేద్యమైన కీకారణ్యంలో భారతదేశపు సామాజిక విప్లవానికి సిద్ధాంత భూమికను అందించే ఆధునిక విప్లవ క్రాంతికారులు జన్మించారు. కుల పీడన, దారిద్య్రం, బానిసత్వం అనే జాఢ్యాలతో కునారిల్లిన భారత సంస్కృతిని హేతుబద్ధం, శాస్త్రీయం చేస్తూ పునర్జీవన ఉద్యమపు సూర్యోదయానికి వెలుతురు ద్వారాలు తెరిచారు. కరుడుకట్టిన వ్యవస్థకు దిగ్భ్రమ కలిగించారు.
డా|| బి.ఆర్.అంబేద్కర్ అన్నట్లుగా ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషల్ రెవల్యూషన్’ అనే కాగడాను చేతబట్టి జోతీరావ్ పూలే సత్యశోధనకు పూనుకున్నాడు. ఏప్రిల్, 1829న మహారాష్ట్ర పూణేలో ‘మాలి’ కులస్తుల (శూద్ర) ఇంట జోతిబా జన్మిస్తే 3 జనవరి 1831న సతారా జిల్లా నయాగావ్‌లో సావిత్రీబాయి జన్మించింది. ఆమె తల్లిదండ్రులు లక్ష్మీబాయి, ఖండోజీ నేవ్‌సే పాటిల్‌లు. 1840లో రెండు శక్తుల కలయికగా ఆమె తొమ్మిదవ ఏట 12 ఏళ్ళ జోతిబాతో వివాహం జరిగింది. పదకొండేళ్ళ వయసులో అత్తగారికింటికి పూణే వచ్చిన సావిత్రీబాయి జోతిబా ప్రోత్సాహంతో చదువుకున్నది. వారికి తోడ్పాటుగా జోతిబా మేనత్త సగుణాబాయి క్షీరసాగర్, జోతిబా మిత్రుని సోదరి ఫాతిమా షేక్‌లు కలిసారు. మత, పితృస్వామ్యాన్ని ఎదిరించిన తొలి మహిళలు ఆ ముగ్గురూ. వారు జీవించిన జీవితాలు విప్లవ కావ్య గ్రంథాలు.
1848లో జోతిబా దేశంలోనే మొట్టమొదటిదైన బాలికల పాఠశాలను ప్రారంభించాడు. దానికి సావిత్రీబాయి, ఫాతిమా షేక్‌లు
ఉపాధ్యాయులు, తరువాత దాని నిర్వహణ కూడా సావిత్రీబాయి చేసింది. 15 మార్చిన మహర్‌వాడలో బాలబాలికలకు ఏర్పాటు చేసిన పాఠశాలలో పనిచేసిందామె. 1851లో అన్నాసాహెబ్ చిప్లూంకర్ బడిలో, 1852లో పేట్ జునీగంజ్‌లో అస్పృశ్యుల బడిలో బోధన చేసింది. 1851-59 వరకు మహర్‌మాంగ్‌ల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించారు పూలేలు.
వారి సేవా కార్యక్రమాలు అసంఖ్యాకంగా ఒక ఉద్యమంగా విస్తరించాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా నాడు సంస్కరణ విప్లవంతో కూడిన అత్యంత సాహసోపేతమైనవి. సావిత్రీబాయి కేవలం భర్త నిర్దేశించిన పనులు చేస్తూపోయే ఒక అణకువగల భార్య కాదు. ఆమెలో విద్యాతృష్ణ, సామాజిక న్యాయం పట్ల ఆకాంక్ష, పీడిత మానవాళి పట్ల ఆర్ద్రత నిండిన దయాగుణం ఉన్నాయి. ఆమె మానసికంగా, శారీరకంగా ఎంతో దృఢమైన మహిళ. కష్టజీవి, కరుణామయి, సాహసశీలి.జోతిబాతో పాటుగా ఆమె కూడా థామస్ పెయిన్ రాసిన ‘మానవుని హక్కులు’ అనే పుస్తకాన్ని చదివి ప్రభావితమై బాధిత ప్రజల సేవకు అంకితమయ్యింది.
జోతిబా సహచర్యంలో, లక్ష్యసాధనలో భాగస్వామిగా ఆయన ప్రోత్సాహంతో పుస్తకాలెన్నో చదివింది. ప్రపంచాన్ని అర్థం చేసుకున్నది. సావిత్రీబాయి జ్ఞాన తపస్వీ, మానవతావాది, సంఘ సంస్కరణాభిలాషి మాత్రమే కాదు, ఆమె కవయిత్రి కూడా. 1854 సం||లో 163 సం||ల క్రితం మరాఠి భాషలో ‘కావ్యపూలే’ (కవితా పుష్పాలు) అనే 41 కవితల సంకలనాన్ని ప్రచురించింది. 2011లో మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ సాహిత్య సాంస్కృతిక శాఖ కార్యదర్శి డా|| యం.జి.మాలతి సంపాదకత్వంలో సావిత్రీబాయి పూలే సమగ్ర వాఙ్మయంలో భాగంగా ఈ సంకలనం ప్రచురణ జరిగింది. ఈ సంకలనాన్ని ఫారుఖ్‌షా, శేఖర్ పవార్‌లు హిందీ భాషలోకి అనువాదం చేసారు. ఈ సంకలనానికి అనితా భారతి సంపాదకత్వం వహించారు. అదే సంపుటాన్ని డా|| వి. కృష్ణ హిందీ నుండి తెలుగులోకి అనువాదం చేసారు. ఆమె రెండో గ్రంధం ‘భావన్‌కషి సుబోధ రత్నాకర్’ (కావ్య సంగ్రహ్). 1891లో మాతృశ్రీ సావిత్రీబాయి ఉపన్యాసాలు ప్రచురించబడ్డాయి. ఆమె సంపాదకత్వంలో జోతిబా ఉపన్యాసాలు 1 నుండి 4 భాగాలు వచ్చాయి. జోతిబాకు సావిత్రీబాయి రాసిన 3 ఉత్తరాలు (సామాజిక ప్రేమలేఖలు), వివిధ అంశాలపై ఆమె రచనలు ప్రచురింపబడ్డాయి.
ఆనాడు బ్రాహ్మణీయ కుల పితృస్వామ్యం సమాజ వికాసాన్ని తొక్కిపెట్టింది. మన దేశమంతటా ఆ శతాబ్దంలో బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా ఉద్యమాలు లేస్తున్న కాలం. ఆ నేపధ్యంలోనే సావిత్రీబాయి రాసిన కవితలను మనం చూడాలి. ఆమెను ప్రభావితం చేసిన భావజాలాన్ని అర్థం చేసుకోవాలి. ‘ఆత్మ కథనం’ అనే కవితలో తను జన్మించిన ఊరైన నయాగావ్ గురించి ”నా జన్మభూమి/ నా గ్రామం / దాని హృదయ స్పర్శ / కీర్తి వృత్తాంతాలను ఎలా వినిపించను?/అదే నయా గ్రామం / నా జన్మభూమి” అందరిలానే ఆమె కూడా తను పుట్టిన నేలను ప్రేమించింది అనడానికి ఈ కవితా పంక్తులు నిదర్శనం. తన ఊరి చెట్లనూ, పక్షులనూ ప్రకృతినీ వర్ణిస్తూ ”పూవులను పూయించమని / కోరుతుంది నా జన్మభూమి / కురిపిస్తాను పూల వర్షం / జన్మభూమి నిండా” అంటూ మనసు నిండిన ఆ మధుర జ్ఞాపకాలను కవితల్లో వర్ణిస్తుంది.ఉన్న ఊరూ కన్నతల్లిని ఎవరూ మర్చిపోరు. తనను కన్న తల్లి గురించి రాస్తూ ”మా అమ్మ ఎంతో శ్రమజీవి / ప్రేమానురాగాల గని / దయామయురాలు / నెమలి వచ్చి కూర్చున్నట్లుగా / అమ్మ మా ఇంటికొచ్చింది” అంటూ ఆమె ముందు సముద్రం కూడా చిన్నబోతుందనీ, ఆకాశం కూడా తలదించుకుంటుందనీ తల్లి ఔన్నత్యానికి కావ్య వందనాలు అర్పిస్తుంది. తల్లికి వందనాలు అర్పించిన బిడ్డ, తన జ్ఞాన మార్గదర్శి అయిన సహచరుడు జోతిబా గురించి ”జోతిబాకు వందనాలు / హృదయపూర్వక వందనాలు / మీ జ్ఞానామృతంతో మళ్ళీ మళ్ళీ / మమ్ముల్ని బ్రతికిస్తారు.. ఓ మహాత్మ జోతిబా / దీనులు శూద్రులు అతిశూద్రులు / నీవైపే చూస్తున్నారు / జ్ఞానంతో / మా మనస్సులను నింపండి / మీ జ్ఞానంతో మాకు ముక్తి లభిస్తుందని తెలుసు” అంటూ జోతిబాపై ఆమె గౌరవ ప్రేమాభిమానాలను కవితాక్షరాలతో అర్చిస్తుంది.”ఆచరణ సందేశం” అనే కవితలో అనుకున్న పనిని వాయిదా వేయకూడదనీ.. వెంటనే చేయాలని పిల్లలకు సందేశం ఇస్తూ ”పని పూర్తయిందా? లేదా? / మృత్యువు ఎప్పటికీ అడగదు కారణం!” అనే జీవన యదార్థాన్ని సందేశంగా ఇస్తుంది.
చెప్పింది చేసే స్త్రీ పురుషులే నిజమైన యోగులని ”నిజమైన యోగులు” అనే కవితలో, కోరికలు తీరాలంటే దేవుళ్ళను పూజిస్తారనీ, కానీ జీవితాన్ని వివేకంతో సుసంపన్నం చేసుకోవాలనీ ”కోరికలు” అనే కవితలో చెప్తుంది.
”కవి-కవిత్వం” అనే కవితలో కవులు కాల్పనిక దృశ్యాలకు ప్రాధాన్యతనిస్తారనీ.. ఊహలను కవితల్లో దింపుతారనీ ”స్వర్గంను మనసులోకి దింపుతాడు / నరకం గురించి పుంఖాలుగా చెప్పుతాడు!.. / దేవతలను ఆరాధిస్తూ కాకా పడతాడు” అంటూ కవుల అవాస్తవిక కవితా ధోరణులను హాస్యంతో మేళవించి చెప్తుంది. సమాజంలో దరిద్ర నారాయణులను గూర్చి రాస్తూ వారికి విద్యాజ్ఞానం ఉండదు, ఇంటినిండా పిల్లలుంటారు, సోమరిగా ఉంటారు, ఒక ఆలోచనా ఆచరణంటూ ఉండదనీ ఏ పని చేయనివాళ్ళను మనుషులని అనుకోలేననీ.. అంటూ జ్ఞానశూన్యులుగా పశుప్రాయంగా జీవిస్తున్నవాళ్ళనూ, ఇతరుల పట్ల దయా సానుభూతీ లేనివాళ్ళను, మానవత్వం లేకుండా బానిసల గురించి పట్టించుకోనివాళ్ళనూ సృష్టి సకల జీవరాశులు సమానమన్న జీవిత సత్యం తెలియని మూర్ఖులను ”వారిని మనుషులని ఎలా అనను?” అన్న కవితలో తీవ్రంగా ప్రశ్నిస్తుంది. చదువు, విద్య గురించి సావిత్రీబాయికున్న ప్రగాఢమైన కాంక్షా గౌరవాలు ”విద్య-అజ్ఞానం”, ”స్వాగత కవిత్వం”, ”చదువు కోసం చైతన్యులు కండి”, ”గొప్ప ఆసక్తి”, ”ఇంగ్లీషు నేర్చుకో”, ”బృంద కవిత్వం”, ”సుబోధ రత్నాకరం”, ”ఆంగ్లేయుల పాలన”, ”జోతిబా” అనే కవితల్లో ప్రతిబింబిస్తాయి.
ఆమె సమాజంలోని చీలికల్ని సుస్థిరం చేసిన మనువు కుటిలత్వం, పీష్వాల దుష్ట రాజ్యపాలనా, ఆంగ్లేయుల గూర్చీ, చరిత్ర వ్యక్తులైన మహారాణి ఛత్రపతి తారాబాయి, శివాజీల గూర్చీ కవితలు రాసినా ప్రకృతి పట్ల ప్రీతితో ‘వ్యవసాయం’, ‘ప్రకృతి-భూమిపాట’, సంపెంగ, గులాబీ పూవు, మల్లెపువ్వులు, సన్నజాజి మొగ్గలు, మనిషి-ప్రకృతి అనే కవితల్లో తన భావుకతను వ్యక్తీకరించింది.
‘జోతిబా సందేశం’, ‘ప్రపంచ మార్గం’ లాంటి కవితల ద్వారా తన ప్రాపంచిక దృక్పథాన్నీ, జోతిబా మార్గాన్నీ ప్రస్తుతించింది. జోతిబాతో తన సంభాషణను కవితా రూపంలో రాసింది.
వీరాంగన సావిత్రీబాయి పూలే రచయిత్రిగా తన వ్యక్తిత్వాన్నీ, లోకప్రేమనూ ప్రకటించింది. ఆమె బహుముఖ కృషిలో సాహిత్య సేద్యం కూడా ముఖ్య స్థానాన్ని పొందింది. అరుదైన వ్యక్తిత్వం, అసమాన సాహసం, మహోన్నతమైన మానవతావాదం, బానిసత్వం పట్ల స్త్రీగా చేసిన సేవలూ, త్యాగాలూ, పనులూ మహిళా దార్శనికురాలిగా, మానవహక్కుల నేతగా ఆమెను చరిత్రలో చిరంజీవిని చేసాయి. ఈ తరానికి ఆ మహనీయురాలి స్మృతి, జీవిత చరిత్ర మననం ఉద్యమస్ఫూర్తిని అందిస్తున్నది.ఆ మహోజ్వల చరిత్ర నిర్మాతకు, నిత్య స్ఫూర్తిదాతకు, జీవితోద్యమ యోధురాలికి, మహిళా లోకానికి అక్షరబిక్ష పెట్టి విద్య ద్వారా విముక్తి జరగాలని కలం పట్టిన భారతదేశపు తొలి
ఉపాధ్యాయురాలికి మన నివాళులు!