అమరుడు కాళ్ళ సత్యనారాయణ – డా.గుఱ్ఱం సీతారాములు

 

కాళ్ళ అని ఇష్టంగా పిలుచుకునే కాళ్ళ సత్యనారాయణ గారు నాకు డా.హరీష్‌ ద్వారా పరిచయం. ఖమ్మం పాత సిపియం ఆఫీస్‌ పక్కనే ఉన్న ఒక చిన్న షాప్‌లో ఆయన స్టూడియో. అంటే ఏదో హంగుల పొంగులతో ఉంటుందనే భ్రమలు వద్దు. ఒక్కటే గది, అందులో చిన్న స్క్రీన్‌ ప్రింటింగ్‌ మిషన్‌, ఒక చిన్న టేబుల్‌, కుర్చీ, నిరంతరం రంగుల మాయాజాలంలో కాళ్ళ. ఒంటిమీద ఏ మాత్రం శ్రద్ధ ఉండదు. చింపిరి గడ్డం, అపసవ్యంగా ఉండే జుట్టు, అన్యమనస్కంగా కాళ్ళ. మొదటిసారి చూసినప్పుడు కాళ్ళ ఒక పట్టాన అర్థం కాడు. కాస్త దగ్గరయితే ఆ ప్రేమ లోతు కొలవడానికి యంత్రాలు సరిపోవు. మనిషి నలుపు కానీ మనసు రంగుల సింగిడి. ఆయన నిత్యం రంగులతో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఆయన బొమ్మలు నున్నగా, కళ్ళకు హృద్యంగా ఉండవు. పెచ్చులు ఊడిన గోడల మీద ఆదిమానవుడు చెక్కిన పురాతన జ్ఞాపకాల్లా ఉంటాయి. నేను చూసిన చాలా బొమ్మల్లో బ్రైట్‌గా నైరూప్య చిత్రాలు. ఆయన మాటల్లో క్లుప్తత, సూటిదనం, తక్కువ మాట్లాడడం, విస్తారమైన అధ్యయనం, సాహిత్య, సాంస్కృతిక జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల మీద సునిశితమైన దృష్టి. ఇతమిద్దంగా ఆయన రాజకీయాలు ఒక పట్టాన అర్థం కావు. ఆ పాడుబడిన లోగిలి ముందు తచ్చాడే కవులు, కళాకారులు, మేధావుల లిస్టు చూస్తే ఒకింత ఆశ్చర్యం కలగక మానదు.

శివసాగర్‌ కవిత్వం సంకలనం సేకరణ ప్రచురణ క్రమంలో పుస్తకానికి ఆయన మూడు బొమ్మలు గీశాడు. ఒకటి ‘నరుడో భాస్కరుడా’ కవితలో ఒక మొరటు మనిషి లాఘవంగా గురి చూసి విసిరే గండ్ర గొడ్డలి, మరొకటి రక్త నది, అందులో మొలిచిన ఎగిరే పావురాలు. శివసాగర్‌ యాభై ఏళ్ళ కవితా ప్రస్తానం ఒక బొమ్మలో ఇమిడిపోయింది. మొత్తానికి మూడు, నాలుగు నెలలు పట్టింది కవర్‌ పేజీ పూర్తి కావడానికి. పుస్తకం వచ్చా కాళ్ళకు నేను బాగా దగ్గరయ్యా. ఆ స్నేహం ఐదారేళ్ళు నడిచింది. పరిశోధన కోసం నేను ఇఫ్లూకి మారాక ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. మా నాన్న కాలం చేసినప్పుడు ఇంటికి వచ్చాడు. ఒకటి, రెండుసార్లు ఇఫ్లూకి వచ్చాడు. మధ్యలో తన కొడుకు పెళ్ళికి వెళ్ళా. ఇఫ్లూలో సతీష్‌ పోడ్వాల్‌, మధుమిత కలిస్తే కాళ్ళ శ్రీనివాసప్రసాద్‌, హిందూ సురేంద్ర గారు ముచ్చట్లు.

ఎక్కడో విజయనగరంలో పుట్టిన కాళ్ళకు మా ఖమ్మానికి ఏమిటి సంబంధం? ఖాదర్‌ మొయినుద్దీన్‌ వాళ్ళ పెద్దన్న రహమాన్‌ గారు ఖమ్మంలో ఉండేవారు. ఆయన, కౌముది, హరీష్‌ గారు ముగ్గురూ కలిసి ‘సరిత’ అనే సాహిత్య పత్రిక తీసుకొని రావాలి అనుకునే సమయంలో ఒక ఆర్టిస్ట్‌ కోసం వెతికే క్రమంలో ఖాదర్‌ అన్న అప్పట్లో విజయవాడలో ఉంటున్న కాళ్ళను ఖమ్మంవైపు నడిపాడు. మొదట్లో రెహమాన్‌, కౌముది గారు హరీష్‌ సహచరి మాధురి గారి పేరు మీద ‘మాధురి ప్రెస్‌’ నడిపారని విన్నా. కొంతకాలం నడిచిన ఆ ప్రెస్‌ మూతపడింది. ఆ పత్రిక మొదలు కాలేదు. ఖమ్మం వచ్చిన కాళ్ళ మళ్ళీ వెనక్కు వెళ్ళలేదు.

1948 ఏప్రిల్‌ 10న ఉత్తరాంధ్ర విజయనగరంలో పైడమ్మ, సన్యాసిల కడుపున పుట్టిన కాళ్ళ ప్రయాణం కుటుంబం బ్రతుకు దెరువులో భాగంగా మొదట ఏలూరు, ఆ తర్వాత బెజవాడ అంతిమంగా ఖమ్మం దిశగా సాగింది. ఆయనది ఒక్క మజిలీ కాదు. ఆయన స్నేహాలో, రాజకీయాలో, వృత్తి, ప్రవృత్తి వ్యాపకాలో ఆయనను ఒక దగ్గరే ఉండేలా చేయలేదు. అంతిమంగా ఆయన ప్రయాణం ఖమ్మంలోనే ముగిసిపోయింది. 40 ఏండ్ల క్రితం రంగుల కుంచెను భుజాన వేసుకుని ఖమ్మం చేరుకున్న ఆయన బాల్యం, యవ్వనాలు ఉమ్మడి కమ్యూనిస్టు ఆచరణలో సాగాయి. పార్టీ విడిపోయాక ఆయన ఏ నిర్మాణాలలోనూ ఇమడకపోయినా ఆయన గీసిన బొమ్మలు నిర్మాణాలకన్నా ఎక్కువే పనిచేశాయి. డెబ్భై ఏళ్ళ జీవితంలో బతుకుతెరువు కోసం అగ్గిపెట్టె లాంటి ఆయన స్టూడియోలో పెళ్ళి, విజిటింగ్‌ కార్డులు ముద్రించాడు. ఎవరయినా అడిగితే లోగోలు ఇచ్చేవాడు. తనకు కనీసం బువ్వ పెట్టని రంగుల లోకంలో విహరించాడు. ఎవరన్నా ఆయనను చూస్తే అన్నం మానేసి కనీసం ఏళ్ళయినా అయి ఉండొచ్చనే భావన కలగొచ్చు. ఎంత నవ్వినా తొణకడు, బెణకడు.

గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఆయన ఎక్కడ ఉన్నాడో ఎలా బ్రతికాడో తెలియదు. ఖమ్మం శివారు పాండురంగాపురం పొలాల మధ్య ఒంటరి చుక్కలాగా ఆయన ఇల్లు, ప్రహరీ లేదు. పంట పొలాలకి ఆసరాగా పాకిన కంప చెట్లే ఆయననూ, పొలాలనూ కాపాడాయి. ఆయన సహచరి కోటమ్మ, నలుగురు అమ్మాయిలు, ముగ్గురు కొడుకులు. కొడుకులు శ్రీను, రాజు ఫైనార్ట్స్‌ చదువుకున్నారు, అందులో ఏవో చిన్నపాటి కొలువులు చేసుకుంటున్నారు. కోటమ్మగారు ఇటీవలే మరణించారు.

కాళ్ళ గుర్తుకువస్తే నాకు ప్రపంచ ప్రఖ్యాత స్పానిష్‌ చిత్రకారుడు ‘ఫ్రాన్సిస్‌ కో గోయ’ యాదికి వస్తాడు. ప్రపంచ చిత్రకారుల్లో ఆయన చిట్ట చివరి ప్రాచీనుడు, మొట్టమొదటి ఆధునికుడు. పద్దెనిమిదో శతాబ్దం మధ్య భాగం, పందొమ్మిదో శతాబ్దం ప్రథమార్ధం అంటే ప్రాచీన ఆధునిక సంధి దశలో పుట్టిన ఆయన శైలి నేను కాళ్ళ బొమ్మల్లో చూశాను. ఆయన కూడా చిట్టచివరి సనాతనుడిలా, తొట్ట తొలి ఆధునికుడిగా రంగులతో ప్రయోగాలు చేశాడా అనిపించింది. ఎందుకో ఆయన బొమ్మలు సవ్యంగా ఉండవు. గోయ బ్రతుకు ‘రాజాస్థానాల’లో గడిచింది. కాళ్ళ బ్రతుకు ప్రజల కష్టాలు, కన్నీళ్ళ మధ్య గడిచింది. డా.హరీష్‌ గారు అన్నట్లు ”కాళ్ళ ఒక గీత, శృతి, అపశృతుల సంగీతం, మనిషి మాత్రం పిట్టంత, అతని నీడ చెట్టంత, అతను నల్లగా, మెత్తగా, నిజాయితీగా, పచ్చిగా, మనిషి వాసన కొట్టే నీడ” అన్నాడు. ఈ ప్రపంచంలో కాళ్ళ మీద హరీష్‌ గారికి మాత్రమే సాధికారత ఉంది. ఇప్పుడు ఆయన చరిత్ర, నిబద్ధత, బొమ్మల తాత్విక లోతు చెప్పడానికి హరీష్‌ లేడు, వినడానికి కాళ్ళ లేడు.

ఆయన గీతల్లో వికారమైన తలలేని మొండాలు, సాగిన చేతివేళ్ళు, మనల్ని వెంటాడే నీడలు, చుట్టూ ఆవరించి

ఉన్న సమస్త వైకల్యాలు, స్త్రీల వేదనలు, డంకేల్‌ దుర్మార్గాలు, లాతూర్‌ విషాదాలు, కాస్ట్రో, అలెండీ వీరోచిత గాథలూ, ఛిద్రమైన అద్దాలు, గడ్డ కట్టిన కన్నీళ్ళు, ఏకాంత మృత్యువు, తెగిన దారాలు, మాతృభంగం, దూదిపింజలు ఆయన కాన్వాస్‌ మీద యుద్ధం చేస్తాయి. కాళ్ళ బొమ్మలు ఏ ఒక్క అంశాన్నో తడమలేదు. గడిచిన ఐదు దశాబ్దాల సాహిత్యాన్ని పలవరించి కలవరించిన అలసట లేని ప్రయాణం ఆయనది. ఆయన కుంచెకు శాశ్వత విరామం దొరికినా మనల్ని వెంటాడే, వెన్నాడే బొమ్మలు ఎన్నో ఈ వ్యవస్థ మీద సంధించి వెళ్ళాడు. అవి కేవలం బొమ్మలు మాత్రమే కాదు. నాగరిక జీవనం మీద మొలిచిన గాయపు మరకలు.

పుట్టింది ఉత్తరాంధ్ర, పెరిగింది ఏలూరు, బెజవాడ అయినా ఆయన బ్రతుకంతా తెలంగాణ గడ్డమీదే గడిచింది. ఆయనను ఏమి నడిపించిందో, ఎందుకు నడిపించిందో కానీ ఖమ్మం ఆయనను కడుపులో పెట్టుకొని సాకింది. ఖమ్మం అంటే ముఖ్యంగా డా.హరీష్‌ గారు ఆయన వెనక ఉన్న చోదక శక్తి. ఆయన చోదక శక్తి కనుక హరీష్‌ ఏమి చెబితే అది చేసే మనిషి కాదు. నిత్యం పనుల మధ్య సతమతమయ్యే డాక్టర్‌గారు అలా కాళ్ళ స్టూడియోకి వచ్చి ఒక కాఫీ తాగి కాళ్ళ బొమ్మలో ఒకసారి తల దూర్చి ఇద్దరూ రంగుల విన్యాసాల మీద కుస్తీ పడేవారు. అలా సినిమాలు, రంగులు, బొమ్మలు, పుస్తకాలు, డంకేల్‌, దండకారణ్యం, గోద్రా మీదుగా నడిచి మళ్ళీ ఇంకో దానిలోకి మారేవారు. డాక్టర్‌గారు వచ్చారు కనుక ఒద్దికగా చేతులు కట్టుకొని నిల్చునే మనిషి కాడు. ఆయన బొమ్మల లోకంలో ఆయన ఉండేవాడు. నాలాంటి పిపీలికాలకు వాళ్ళ రంగుల లోకం అర్థమై చచ్చేది కాదు. నాకు ఇప్పటికీ కాళ్ళ బొమ్మ అర్థమై చావదు. ఇదేంటి కాళ్ళా అంటే అలా అంటే ఏం చెప్పాలి బాబూ అనేవాడు. అర్థం చేసుకునే శక్తి ఉంటే ఆయన బొమ్మలో ఆదిమ కాలాన గుహలలో బ్రతికిన యాది గుర్తులు చూడొచ్చు. క్రూర జంతువులు దాడి చేసినప్పుడు గోడలమీద చిందిన రక్తపు చారికలూ చూడొచ్చు. మధ్యయుగాల నుండి ఆధునిక యాంత్రిక లోకం దాకా మనిషి నడిచొచ్చిన సమస్త నాగరిక గుర్తులూ ఆయన గీతల్లో చూడొచ్చు. అభాగ్యుని ఆకలి కేకలు, ఆకలిగొన్న పశువులా అబలమీద దాడిచేస్తే ఆ కళ్ళల్లో ఒలికే భయాన్నీ చూడొచ్చు. ఎగిరే ఎర్రజెండాలో అమరుని విశ్వాసాన్ని చూడొచ్చు. ఒక దారం సుండి తిరిగి తనను తాను ఉరేసుకునే కార్మికుని సంక్షుభిత ముగింపు చూడొచ్చు. పెత్తందారీ పెద్దన్న ఒంటికన్ను ర్షాసుడిగా ఈ సమాజాన్ని కబళించే డాలర్‌ వికృతాన్ని చూడొచ్చు. శిలువ మోస్తున్న రైతన్న వ్యథను, గ్రాహం స్టెయిన్‌ చెదిరిన కలనూ, పిండాలకు గుచ్చిన త్రిశూలాలు, తెగిన తలలూ, విరిగిన విగ్రహాలూ, తొంభయ్యో దశకంలో ఆధునిక కవితా చోదక శక్తులయిన రక్తస్పర్శ కవుల ద్వేషంలో, బ్రతికిన క్షణాల వలపోతల్లో, పునరపిలో, నరుడో భాస్కరుడు విసిరిన గండ్రగొడ్డలి ఒడుపులో, గులాంగిరి అట్టమీద దైన్యంగా కూర్చున్న శ్రామికుడి నుదుటి స్వేదంలో, కాలకూట విషంలా మానవత్వం మీద దాడిచేసిన గోద్రా గుజరాత్‌ గాయపు కన్నీటి చారికల్లో, దళిత రాజకీయాల్లో, భామ కరుకు సంగతులో, కేశవరెడ్డి నవలల అట్టమీద బొమ్మల్లో, ఒకటా రెండా వేలాది బొమ్మల్లో ఆయన మార్క్‌ గీత అర్థం కావాలంటే ముందు కాస్త రంగు అర్థం కావాలి. వర్తమాన వాద, వివాదాల లోతు తెలియాలి. ముఖ్యంగా రవివర్మ బొమ్మల్లో సుకుమారం, ఆహ్లాదం వెతికే బాపతు గాళ్ళకు కాళ్ళ బొమ్మలు నచ్చవు. ఆరించుల కంప్యూటర్‌ మీద టెక్నాలజీ చేసే విన్యాసపు తంత్రీ వెలుగులకు అలవాటు పడ్డ వాళ్ళకు కూడా కాళ్ళ బొమ్మలు అర్థం కావు. అవి అర్థం కావాలంటే పాలరాతి గదులు ఊడ్చి, శుచి శుభ్రాన్ని ప్రసాదించిన కూలి తల్లి చేతికి అంటిన మరకలు తెలియాలి. అరచేతిలో అరిగిపోయి అదృశ్యమయిన గీతల ఆనవాళ్ళు తెలియాలి. అదిగో అప్పుడు కాళ్ళ సత్యనారాయణ సాక్షాత్కారం మీకు లభిస్తుంది.

ఖమ్మం మేడినోవా డా.హరీష్‌ గారి ఛాంబర్‌లో గోడమీద పెద్ద మ్యూరల్‌ పెయింటింగ్‌ చూడొచ్చు. దానిపేరు కాలం. స్థల, కాలాల మధ్య మనిషి ప్రస్థానం వలయాలు, వలయాలుగా నైరూప్య కుడ్య చిత్రమది. ఆయన వేసిన బొమ్మల్లో బాగా పేరు సంపాదించుకున్నది. ఉండడానికి ఎక్కడో మారుమూల డంజన్‌లో ఉన్నా ఆయన దృష్టి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చిత్రకళలలో వచ్చిన ధోరణులు, కళలు, సాహిత్య గమనాలు, ఆధునిక అత్యాధునిక ధోరణులు, సాల్వెడార్‌ డాలీ, ఇంకా నాకు నోరు తిరగని పాశ్చాత్య చిత్రకారుల నడవడికతో పోటీ పడతాడు కాళ్ళ. తెలుగు సమాజాన ఆకలితో, అవమానాలతో బతికే బడుగు జీవుల ఆర్తనాదాలు, పికాసో గుయర్నికా విధ్వంసాన్ని నేను మొదటిసారి కాళ్ళ బొమ్మల్లోనే దర్శించాను. గోయా, పికాసో బొమ్మల్లో బీభత్సాన్ని తెలుగునాట వర్తమాన కన్నీళ్ళు ఆయన కాన్వాసును తడిపాయి. ఆయనకు ఎంతమంది ఎన్నిరకాలుగా ఎంత చేయూత ఇచ్చినా జీవితాంతం లేమిలోనే బతికాడు.

ఆయన ఎప్పుడూ శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి కథల గురించి చెప్పేవాడు. పతంజలి, చలం, ప్రేమ్‌చంద్‌, కో.కు. అన్నా ప్రేమ. బొమ్మలూ, సినిమాలూ, సాహిత్యం ఆయనకు ఇష్టమైన వ్యాపకం. మొత్తం పుస్తకం చదివితే తప్ప బొమ్మ వేసేవాడు కాదు. తొందరపెడితే అసలే వేయడు. ఆయన ‘బొమ్మలను నేను అమ్ముకోను, అవి నా బిడ్డలు’ అనేవాడు. ఒకసారి కాళ్ళ గురించి తెలిసిన నాటి ఖమ్మం కలెక్టర్‌ అరవిందకుమార్‌ ఆఫీసుల్లో బొమ్మలు వేయండి, కాసిని డబ్బులిస్తాం అంటే ‘ఆ పనికి చాలామంది ఉన్నారు నేను చేయను’ అని సున్నితంగా తిరస్కరించాడు. ఈ బొమ్మలు బువ్వ పెట్టకుంటే నా రిక్షా నాకుంది అనే తెగింపు. ఆయన ఆకలిని ఎక్కువగా ప్రేమించి ఉంటాడు. ఆయన కన్నీళ్ళు, పేగులు ఎప్పుడో ఎండిపోయి ఉండొచ్చు. ఆయన సహచరి కోటమ్మ గారు, ప్రియమిత్రుడు డా.హరీష్‌ గారు పోయాక మరీ ఒంటరివాడు అయ్యాడు. ఒకరకంగా ఆయనను ఆ రెండు మరణాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. అందుకే చావు కూడా నిర్దయగా ఆయనను దొంగ దెబ్బ తీసింది.

కాళ్ళ ఆయన పూర్వీకుల నుండి పొందిన ఆస్థులూ, అంతస్థులూ, జ్ఞానమూ ఏమీ లేదు. తండ్రి ఒక సాధారణ రిక్షా కార్మికుడు. కాళ్ళ కూడా బ్రతుకు దెరువు కోసం రిక్షా తొక్కాడు. ఖమ్మంలో రెండు గదుల ఇల్లు తప్ప ఆయనకు మిగిలింది ఏమీ లేదు. ఇప్పుడు ఇవ్వడానికి ఆయన వారసులకూ ఏమీ మిగల్చలేదు, తన తండ్రి మిగుల్చుకున్న నిజాయితీ మినహా. అది కాళ్ళ కడుపు నింపలేదు. ఆయన వారసుల కడుపూ నింపదు. తాను బ్రతికినంతకాలం కీర్తికీ, ప్రచారాలకీ, ఆడంబరాలకీ దూరంగా తాను ఈ లోకంలోకి ఎంత నిరాడంబరంగా వచ్చాడో అంతే నిదానంగా నిష్క్రమించాడు. ఆయన బొమ్మలకి విలువ కట్టే సాహసం మనం చేయలేము. మన మధ్యే బ్రతికిన ఒక మహా చిత్రకారుడి అమూల్యమైన సంపద ఎలుకలకూ, పందికొక్కులకూ బలి కావడమే ఈ కాలపు విషాదం. ఇది ఒక కాళ్ళకు జరిగిన నష్టం కాదు. ఒక మహా చిత్రకారుడి నిష్క్రమణ ఈ లోకానికి తెలియకుండా పోవడం వెనుక మనందరి సామూహిక వైఫల్యం ఉంది. ఆయన బొమ్మలు ముందు తరాలకూ చేర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదే మనం కాళ్ళకు ఇచ్చే నివాళి.

జోహార్‌ కాళ్ళ! జోహార్‌!! జోహార్‌!!!

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.