కొండల సందుల నుండి
చందమామ తొంగి చూస్తుంది
కొబ్బరి ఆకుల నుండి సూర్యకిరణాలు
నదిని తాకుతున్నాయి
అవును, నీళ్ళల్లో ప్రతిబింబం చూసుకోవడం ఓ అనుభూతి
ప్రేమకు భాషా భేదం లేదు కదా!
ప్రేమ ఓ ప్రకృతి
ప్రకృతి విచ్ఛేదనం అసహజం
సముద్రాలు, నదులు కలుస్తున్నప్పుడు ఒక వరవడి
చంద్రుడు కొలనులో దాక్కున్నాడు
వల విసిరాడు ‘చందవా’ పడింది
అవును! కళ్ళల్లో వెన్నెల సోపానాలున్నాయి
సూర్యుడు నొసటిలో దాక్కున్నాడు
స్వర మాధుర్యం తేనియలు గొంతులో పోసినట్టు
ప్రతి రాగం తేనెల్లో అద్దుకొని
అభివ్యక్తి అవుతోంది
అవును! ఆ చెరువుగట్టున కొబ్బరి చెట్టు
కొమ్మలు కాయలు గుత్తులు గుత్తులు
రాలిపడుతూనే ఉన్నాయి
ఏ మొక్కైన ఎదుగుతున్నప్పుడు
ఓ సొబగు కంకె అయినప్పుడు ఓ వెన్నెల
గింజను అంటుగడితే ఓ పుట్టుక
అవును! ప్రతి గట్టు హద్దు కాదు
అంచు మాత్రమే
అవును! ఆమె అతన్ని ప్రేమించింది
ప్రేమకు కులం లేదు
అతడు ఆమెను అనుభూతం చేసుకొన్నాడు
అనుభూతికి వర్ణం లేదు
మబ్బులు కమ్మాయి
నల్లనివి, తెల్లనివి
ఒకదాని వెంట ఒకటి
ఆకాశంలో ఫెడేల్‌మని శబ్దం
అవును! మబ్బుల్లో నీటి బుగ్గలే కాదు
మెరుపులూ దాగున్నాయి
అవును! ఆ జున్నులో యాలకులు వేశారు
అందుకే అది అంతరుచి
లేతపాలు కాగి కాగి
యాలకుల పరిమళంతో గుభాళిస్తుంది
ఆహారం అంతా వర్ణాంతరమే
అనంత రసాయనాల సమ్మిశ్రితమే
భావాలన్నీ పాశ్చాత్యమైనవి
ఆఫ్రికన్‌వి భారతీయులవి కలబోతలే!
అవును అక్బర్ రాజపుత్ర కన్యను
చేసుకొంటే జేజేలా!
మిర్యాలగూడలో మాత్రం అది నిషిద్దమా!
కరవాలం ఎవరిమీద విసురుతున్నారు
సుపుత్రికను వరించినవాడు వరుడు కాడా
అవర్ణుడా
నృత్య సృజనాన్ని త్రైవర్ణంలో నుండి
ఓ సూర్యోదయాన్ని ఆహ్వానించలేవా
అవును! ప్రపంచం అంతా
వర్ణ సంకరంలో ఉంది
అర్జునుడు సుభద్రను
చిత్రాంగదను, ఉలూచినీ చేసుకొన్నపుడు
విజయ విలాసమని మీరు
గొప్పలు చెప్పుకొన్నారు
ఉలూచి నాగరాజు కూతురు
ఆమె సౌందర్యం అసమానం అన్నారు
భీముడు హిడింబిని చేసుకొన్నప్పుడు
ఘటోత్కచుడు భీమునికి పుట్టినపుడు మీరు
కధాగానం చేశారు కదా!
మీరు చెప్పే కథలన్నీ
వర్ణసంకరం నుండి జనించినవే కదా!
ఒక స్త్రీతో ఒక పురుషుని కలయిక
మరి ఈ కులం ఎక్కడిది?
నల్లని భూమితో పచ్చని మొక్క
దానికి తెల్లని పత్తి పువ్వు కాసింది
నేత అద్దకంలో అనేక రంగులు
ఆ కలనేత వస్త్రాలు ఎలా ధరిస్తున్నారు
అవును! మేధస్సు, మనస్సు, ఉషస్సు
సమన్వయంలో ప్రపంచ విజ్ఞానం
ప్రపంచమంతా స్త్రీ, పురుషుల
ప్రేమాను రాగాల పల్లవి
ప్రేమించడం జన్మ హక్కు
ప్రేమను రక్షించడం
ప్రేమను ఆహ్వానించడం మన కర్తవ్యం
వధించువాడు హంతుకుడు
వధించబడినవాడు ప్రేమికుడు
ప్రణయ్ అమరుడు
కారంచేడులో మీరు నెత్తురు చిందించారు
అక్కడ ఓ నగరం వెలిసింది
చుండూరులో మీరు వీరులను వధించారు
అక్కడ ఓ విద్యాలయం వెలిసింది
మీ వధను నిరోధించాలంటే
మేము యుద్ధం చేయాల్సిందే
అయితే, మీ భౌతిక శరీరం మీద కాదు
మీ మానసిక వ్యవస్ధ మీద
మీ ఆలోచనా ధోరణి మీద
‘కులం మనం సృష్టించుకున్నదే’
అని మీరు నమ్మే వరకు ఈ యుద్ధం సాగాల్సిందే
నిజమే వర్ణాంతర సంధ్యలోనే పరిణయం, ప్రజ్వలనం
(అమృతను కులాంతర వివాహం చేసుకున్నందుకు 14-9-2018న 23 యేండ్లకే మామ మారుతీరావు (వైశ్య) ద్వారా హత్యకు గురైన దళిత యువకుడు ప్రణయ్ కుమార్‌కు అంకితం)