ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం ప్రకటించి ఇప్పటికి 110 సంవత్సరాలు అయింది. దీనికి స్ఫూర్తిని ఇచ్చిన ఘటన 1857వ సంవత్సరంలో మార్చి 8వ తేదీన న్యూయార్క్ నగరంలో జరిగింది. చికాగో మహానగరంలోని ఒక జౌళి మిల్లులో పనిచేస్తున్న శ్రామిక మహిళలు తాము పనిచేస్తున్న (12 గంటల నుండి 18 గంటల వరకు) పనిగంటలలో మార్పును కోరుతూ వేలాదిమంది మహిళలు నడివీథుల్లోకి వచ్చారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ శ్రమను తగ్గిస్తూ రోజుకు 8 గంటలు మాత్రమే పనిగంటలుగా నిర్ణయించాలని డిమాండు చేశారు. పురుషులతో పాటు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఓటు హక్కును, సంఘాలను పెట్టుకునే హక్కును కల్పించాలని కోరారు. అసాధారణమైన ఆ పోరాటానికి మద్దతుగా అనేకమంది మహిళలు గళం కలిపారు. దాదాపు 146 మంది వరకు మహిళా కార్మికులు దారుణంగా కాల్చి చంపబడ్డారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయని అసాధారణమైన ఆ పోరాటంలో వేలాదిమందిని ఆనాటి ప్రభుత్వం నిర్బంధించింది. ఫలితంగా 1910 సంవత్సరంలో డెన్మార్క్ రాజధాని కోపెన్‌హగ్‌లో జరిగిన రెండవ అంతర్జాతీయ సోషలిస్టు మహిళా సదస్సులో జర్మనీకి చెందిన ‘క్లారా జెట్కిన్’ మార్చి 8 ని మహిళా కార్మికుల పోరాటదినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆ స్ఫూర్తి నుండే భారతదేశంలో కూడా అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని 1911 నుండి జరుపుకుంటున్నాం. ఈ పోరాటాల ఫలితంగా కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు, మహిళా కార్మికుల గురించి అనేక చట్టాలు చేయబడ్డాయి. 1911లో ప్రారంభమైన సరళీకరణ విధానాల ప్రభావం వలన ప్రైవేటు రంగం బలపడడంతో మహిళా కార్మికుల చట్టాలు అప్పటి నుండే కుంటుపడుతూ వస్తున్నాయి. శ్రామిక మహిళా సామాజిక, రాజకీయ, ఆర్థిక పరమైన హక్కులు క్రమక్రమంగా అర్థం మారిపోతూ శ్రామిక అనే పదం అంతర్ధానమై పోయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవమై రూపుమార్చుకుంటూ ప్రభుత్వాలు ఒక వేడుకగాను, ఒక సంబరంగాను, ఒక ఉత్సవంలా జరుపుతూ దాని ప్రాధాన్యతను, స్ఫూర్తిని దెబ్బతీయడం చూస్తున్నాం.
అనేక దేశాలతో పాటు మన దేశంలో కూడా మహిళలు అనేక సమస్యల వలయంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. ప్రతి మహిళా అభద్రతా భావంతో బతుకుతోంది. కదువాలో ఎనిమిదేండ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య జరిగితే బీజేపీ ఎమ్మెల్యేలు నేరస్తులకు మద్దతును ప్రకటిస్తారు. మహిళలు ఇంటా, బయటా శ్రమదోపిడీ మాత్రమే కాక లైంగిక దోపిడీకి కూడ గురికావడం మనం చూస్తున్నాం.
బేటీ బచావో, బేటీ పఢావో అంటూ కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ, మరోవైపు పసిపిల్లల నుండి పండు ముదుసలి వరకూ కూడా రక్షణ కల్పించలేకపోతోంది. ఆడపిల్లల్నే కాదు మగపిల్లల్ని సైతం ఒంటరిగా బయటకు పంపడానికి ఇప్పుడు తల్లిదండ్రులు మానసిక వేదనకు లోనవుతున్నారు.
మన తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ఇతర రాష్ట్రాలలో బాల్య వివాహాలు నేరమని చట్టాలు చెబుతున్నా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిరక్షరాస్యత ఒకవైపు పెరిగిపోతుండగా, నిరుద్యోగ సమస్య మరొకవైపు ముంచుకుని వస్తోంది. పాఠశాలల్లో కనీస అవసరాలు లేక, ప్రభుత్వాలు బాలికలకు తగిన రక్షణ కల్పించలేకపోతున్నాయి. ఫలితంగా మధ్యలోనే చదువు మానేసి ఆడపిల్లలు ఇళ్ళకే పరిమితమవుతున్నారు.
ఆడపిల్లలపై, మహిళలపై హింస రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆడపిల్ల ఒంటరిగా కనబడితే చాలు మానవత్వాన్ని మరచి మనిషి మృగమై పైశాచికంగా లైంగిక దాడులకు పాల్పడడం ఎక్కువైపోయింది. తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు నేరస్తులు హత్యలు సైతం చేయడానికి తెగబడుతున్నారు. పెట్రోల్ పోసి తగలబెడుతూ, ఆనవాళ్ళను చెరిపేస్తూ, పైశాచికత్వానికి పాల్పడుతున్నారు. పాశ్చాత్య సంస్కృతుల మోజుల్లో పడి యువత కన్నుమిన్నూ లేకుండా అనేక అకృత్యాలు చేస్తున్నారు. ఆడపిల్లకు కనీసం వారి ఇళ్ళల్లో కూడా రక్షణ లేకుండా పోతోంది. రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ, చట్టాన్ని అమలు చేయాల్సిన న్యాయ వ్యవస్థ ప్రభుత్వాలకు తొత్తులుగా మారి స్త్రీల మాన, ప్రాణాలతో పాటు ప్రాథమిక హక్కులను కూడా కాలరాస్తున్నాయి.
ఇలాంటి సందర్భంలో కులం, మతం ప్రాతిపదికగా ఉన్మాదం పైశాచిక రూపంతో విరుచుకు పడుతున్నది. తినే తిండి మీద, కట్టుకునే బట్టమీద, మాట్లాడే భాషమీద, కులాన్ని ఆధారంగా చేసుకుని, మతాన్ని అడ్డుగా పెట్టుకుని దాడులకు పాల్పడుతోంది. ‘లవ్ జిహాద్’ల పేరిట, ‘జై శ్రీరాం’ల పేరిటా ప్రజలను ఊచకోత కోస్తున్నది.
దళితులపైన, గిరిజనులపైన, ఆదివాసుల పైన, మైనార్టీలపైనా దాడులు చేస్తూ బీజేపీ ప్రభుత్వం హిందూ మతాన్ని ప్రజల మెదళ్ళలోకి జొప్పించి, హిందూ రాజ్యంగా మార్చే దిశగా అనేక అమానుష చర్యలకు పాల్పడుతోంది. తనకు అడ్డంగా ఉన్న వారిని హత్యలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నది.
ఈ సందర్భంలో దేశంలో నివసిస్తున్న ప్రజలందరి అస్తిత్వాన్ని నిరూపించుకోవాలని ఎన్నార్సీ, ఎన్నార్పీ, సిఎఎ చట్టాలను ప్రజలపై రుద్ది మీరు ఈ దేశ పౌరులేనా కాదా అని నిరూపించుకోండని సవాళ్ళు విసురుతూ మారణహోమాన్ని సృష్టిస్తోంది. ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చివేసే ప్రయత్నాన్ని…..(ఇక్కడ కంటిన్యుయేషన్ సరిగ్గా లేదు. గమనించ గలరు) ”షహీన్ బాగ్” పేరుతో ముస్లిం, హిందూ స్త్రీలు కూడా కలిసి దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు చేయడాన్ని సహించలేక పోతోంది. ప్రజల్లో అనేక భయాందోళనలు కల్పిస్తూ, నిరసనకారులపై దాడులు చేస్తూ భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగం భారత ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కులను సైతం కాలరాసే దిశగా ప్రజల్ని హతమార్చుతూ నెత్తురు పారిస్తున్నది. దేశ ప్రజల్లో వచ్చిన ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నది.
ఈ దేశ మహిళలు సామాజిక ఉద్యమాల్లో, ప్రజా ఉద్యమాల్లో పాలుపంచుకోవడం కొత్త కాకపోయినప్పటికీ పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అనేక ”షహీన్ బాగ్”లను ఏర్పాటు చేసి నేటి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి స్ఫూర్తిగా నిలబడి పోరాటం చేయడం ప్రత్యేకతగా మనం గ్రహించాలి. వారి స్ఫూర్తితో పౌరసత్వ చట్టాన్ని అందరం తిప్పికొట్టి ఎన్నార్పీలను వ్యతిరేకించాలని పిలుపునిద్దాం. ఎన్యుమరేటర్‌లను (సర్వేలు చేయడానికి వచ్చిన వారిని) తిప్పి పంపాలని గళం ఎత్తుదాం!