రాజమండ్రికి పదిమైళ్ళ దూరంలో ఉన్న ‘ఉండేశ్వరపురం’ లోని దంతులూరి సూర్యనారాయణ రాజు, బుచ్చి సీతాయమ్మల ఆరవ సంతానంగా మే 18, 1949 లో జన్మించిన సావిత్రి అక్టోబర్ 4, 1991లో మరణించారు.
అందమైన బాల్యాన్ని, అపురూపమైన గారాబాన్ని, విద్యను వదిలేసి చిన్ననాడే లంకంత కొంపలో అత్తామామలకి, భర్తకి, మరుదులకు, ఆడపడుచులకు పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పుణ్యాలని తన జీవితాన్ని హారతి కర్పూరంలా కరిగించుకున్న తన తల్లి అంటే పంచప్రాణాలు సావిత్రికి.
సావిత్రికి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి అక్షరాలు నేర్పించి అన్నీ తానైన తొలి గురువు అమ్మ. తల్లిని ఎదగనీయకుండా చేసి ఇంటి చాకిరీతో బానిసగా చూసిన పితృస్వామ్య భావజాలంతో ఉన్న తండ్రి కుసంస్కారమే తల్లి కష్టాలకు కారణమని నమ్మింది.
చదువంటే ఇష్టమైన సావిత్రికి ఆమె పెరిగిన భూస్వామ్య వ్యవస్థలో ఆడపిల్ల చదువు అంటే చాలా చిన్నచూపు. ఎవరో ఒకరు ఏదో ఒక పని చెప్పడంతో చదువు సాగకపోయేది. అందరూ నిద్రపోయిన తర్వాత ఆమె తల్లి దీపం వెలిగించి పాఠాలు చెప్పేవారు. ఐదో తరగతి వరకు ఉండేశ్వరపురంలో, హైస్కూలు విద్య తొర్రేడులో చదివి ఏలూరు సెయింట్ థెరిస్సా కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా 1968లో పెళ్ళి చేశారు. ఆమె భర్త రాజమండ్రి పేపర్ మిల్లులో పనిచేసేవారు. ఆమె రాజమండ్రిలో ఉన్నది తక్కువ. ఆమెను తన తండ్రి సేవ కొరకు విజయనగరం జిల్లా అలమండలో ఉంచడంతో అభ్యంతరం తెలిపిన ఆమెతో ‘నువ్వు నాకు నచ్చలేదు కాబట్టి నిన్ను చేసుకున్నాను, ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళాలని. సంసారం కావాలంటే ఉండు లేదా చావు’ అనడంతో సాంప్రదాయాలకు తలొగ్గి ఉండిపోయిన సావిత్రి 1969లో అపర్ణకు, 1971లో శిరీషకు జన్మనిచ్చారు.
కుటుంబ పోకడ చదవాలన్న జిజ్ఞాసతో దొరికిన పుస్తకం చదివి, పత్రికలకు, రేడియోలకు ఉత్తరాలు రాసేవారు. తన వ్యక్తిత్వాన్ని నిలిపే రాజమండ్రి సావిత్రి అనో, ప్రభా సావిత్రి అనో, రేడియో సావిత్రి అంటే పొంగి పోయేవారు. కుటుంబ పరిధులు దాటి సాహితీ వేదిక సభ్యురాలవ్వడంతో కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. ఆమెను భర్తే సభలకు తీసుకువెళ్ళేవారు. మేడిపండు దాంపత్యమని తెలియనివారు వారిని చూసి సంతోషపడేవారట. ఆమె పేరున ఉన్న ఆస్తులను అమ్మకానికి పెట్టడంతో ఇంట్లో గొడవలు పెరిగాయి. ఇన్ని కష్టాలను అనుభవిస్తూ ఎలా బతకాలన్న సమయంలో ‘రామాయణ విషవృక్షం’ చదివిన తర్వాత బతుకుపై ఆశ, నమ్మకంతో మార్క్సిజం వైపు మళ్ళారు.
ఇంట్లో కష్టాలు పెరగడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకు వచ్చి ‘సమాచారం’ పత్రికలో ఉద్యోగంలో చేరారు. సాహితీ వేదిక ద్వారా మల్లాప్రగడ రామారావు, గోపీచంద్ మొదలైన సాహితీ సభ్యులు ఆమెకు స్నేహితులయ్యారు. రంగనాయకమ్మగారన్నా, ఆమె సాహిత్యమన్నా చాలా ఇష్టం. సామాజిక అసమానతలకు వ్యవస్థే కారణమని నమ్మి ‘సామాజిక బాధ్యత’ను సాహిత్యంతో స్వీకరించాలని అనుకున్నారు. దక్కన్ క్రానికల్‌లో ప్రూఫ్ రీడర్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పటికే టీబీ, అల్సర్‌లతో బాధపడుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు.
స్త్రీ శక్తి, ప్రగతిశీల మహిళా సంఘాలతో ఉంటూ రచనలు కొనసాగించారు. సరదాగా, హుషారుగా, సృజనాత్మకంగా, కనిపించే సావిత్రి తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చూపడానికి, చావుపట్ల తేలిక భావాన్ని ప్రదర్శించడానికి కారణం ఆమె పుట్టి పెరిగిన వాతావరణం, వ్యవస్థ పట్ల కసి, ద్వేషంతో తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చని ఆమె సన్నిహితుల ఆలోచన. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నవారు పిల్లలు, సోమయాజులు గారు.
జబ్బువల్ల కళ్ళు కనపడక ఆమె శరీరంలోని కుడిభాగం పడిపోయినా పనిచేయని కుడిచేతిని ఎడమ చేత్తో ఎత్తి పట్టుకొని మిత్రులకు ఉత్తరాలు, పుస్తక సమీక్షలు రాసేవారు. మనో నిబ్బరంతో, జీవనోత్సాహంతో అలాగే రెండేళ్ళు బతికిన సావిత్రిగారు రంగనాయకమ్మ గారి అభ్యర్థన మేరకు విశాఖపట్నంలోని ప్రగతి ఛారిటబుల్ ట్రస్ట్ వారి శాంతకుమారి గారి ఇంట్లో ఉంటూ 04-10-1991న చనిపోయారు. చనిపోయే ముందు శాంతకుమారి గారితో తాను చనిపోయిన తర్వాత కూడా దుర్మార్గుడైన తన భర్త తన మృతదేహాన్ని చూడరాదని, తన మృతదేహాన్ని కె.జి.హాస్పిటల్‌కు అప్పగించాలని కోరారు.
సావిత్రిగారి రచనలంటే ‘బందిపోట్లు’ కవిత గుర్తుకు వస్తుంది. ఆమె దాదాపు పాతిక కవితలు, అనేక వ్యాసాలు, సమీక్షలు రాశారు. సినీ నటి సావిత్రి మీద, సంక్రాంతి మీద రాసిన కవితలు తప్ప మిగతావన్నీ సామాజిక సమస్యల మీదే రాశారు. 1984లో ‘బందిపోట్లు’ కవితను చేకూరి రామారావు గారు ‘చేరాత’లో సమీక్ష చేసి ప్రాచుర్యం కల్పించారు. అనేక సదస్సులలో సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు సిలబస్‌లో పాఠ్యాంశంగా చేర్చారు. ఇంగ్లీషులో కూడా అనువదించారు. అనువదించబడిన కవిత ‘బందిపోట్లు’ మార్చి 1984 అంధ్రజ్యోతి వారపత్రికలో అచ్చయింది.
‘బందిపోట్లు’ కవిత
‘పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తానని పంతులుగారన్నప్పుడు భయమేసింది
‘ఆఫీసులో నా మొగుడున్నాడు, అవసరమొచ్చినా సెలవు ఇవ్వడ’ని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది. ‘వాడికేం మగమహారాజ’ని ఆడ, మగా వాగినప్పుడే అర్థం అయిపోయింది.
‘పెళ్ళంటే పెద్ద శిక్ష’ అని మొగుడంటే ‘స్వేచ్ఛా భక్షకుడ’ని.
మేం పాలిచ్చి పెంచే, పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోందని.
నాకు నచ్చిన కవిత సావిత్రి గారి ‘గృహిణి’ ః
ఉపాధి లేదు జీతం రాదు
సెలవులు లేవు, సేదతీర్చే నెలవే లేదు
డ్యూటీలున్నాయ్, నోటీలున్నాయ్
సూటీపోటీ మాటలున్నాయ్
బోరు కొట్టే ఈ చాకిరీకి బోనస్ లేదు, ఏవేవో భజన్లు తప్పించి ఎక్స్‌గ్రేషియా లేదు.
అయినా ప్రచార సాధనాలంటారు, నేనే పనిలేని దాన్నని.
భాషే రాని బడుద్దాయిలంటారు
భారమెంత వహిస్తున్నా నేనే భార్యనని.
సావిత్రిగారి కవిత్వంలో స్త్రీల మనోవేదన, దగాపడిన స్త్రీల ఆర్తి బహు కోణాల్లో వినిపిస్తుంది. తన కవితలన్నీ వాస్తవ జీవితంలో నుండి రాసినవే.
పదునైన మాటలలో సూటిదనం కనిపిస్తుంది. కుటుంబ వ్యవస్థలోని అణచివేతను నిరసిస్తూ రాసిన కవిత.
ఈ కవిత రెండు, రెండు పాదాలలో స్త్రీ జీవితాన్నంతటినీ కాచి వడపోసి మలచినదందులో. అలతి అలతి పదాలతో రాసిన కవిత.
”ఉపాధి లేదు, జీతం రాదు లేవు సేద తీర్చే నెలవే లేదు”
ఈ రెండు పాదాలలో మహిళా శ్రామికులకు, ఉద్యోగులకు పలు పనులు చేసే అందరికీ ఒక సమయమంటూ నిర్మితమై ఉంటుంది కానీ గృహిణికి చిన్న అవకాశం లేదని, ఎవరింటి చాకిరో కాదు కదా మన పని మనం చేసుకోవాల్సిందే. పండుగ పబ్బాలకు, బంద్‌లకు అందరికీ సెలవులు
ఉంటాయి. అలాంటి సమయంలో ఇంకా ఎక్కువ పని చేసే డ్యూటీలతో, పోటీలు లేని జీవితం ప్రతి గృహిణిదని, కనీస సానుభూతికి నోచుకోక కట్టెల్లో చేరేవరకు, స్త్రీలు పనిచేయాల్సిందే. మనపని మనం చేసుకోక ఎవరు చేస్తారంటూ స్త్రీలే ఎద్దేవా చేస్తారు.
ఎంత పని చేసినా ఏదో ఒక అసహనం. పొద్దంతా ఇంట్లోనే ఉన్నావుగా ఏం చేశావ్ అనే మాటలు. పని చేసీ చేసీ ఏ అర్థరాత్రో పడుకొని ఠంచనుగా అలారం కంటే ముందే లేచి అన్ని పనులూ చేసుకుంటూ అందరి అవసరాలు తీర్చే యంత్రమే స్త్రీ. అందరూ వెళ్ళిపోయేవరకూ కాళ్ళకు చక్రాలు కట్టుకుని తిరుగుతూనే ఉంటుంది. ఇక ఉద్యోగులైతే తమను తాము సవరించుకొని ఇంటిని సవరించుకొని బయటపడే వరకు కీ ఇచ్చిన మరబొమ్మే. ఉద్యోగ జీవితమైనా విసుగు, విరామం లేకుండా పనిచేస్తూ తమను తాము నిలుపుకుంటున్నారు. కష్టమవుతుంది అన్నారనుకో ఇంట్లోనే ఉండండి అనడానికి వెనుకాడని సభ్యులతో బతుకు వెళ్ళదీస్తున్న వారెందరో. గృహిణికి కనీసం ఓదార్పు మాటలు కూడా ఉండవు.
‘బోరుకొట్టే ఈ చాకిరీకి బోనస్ లేదు ఏవేవో భజనలు తప్పించి ఎక్స్‌గ్రేషియా లేదు”.
ఉదయం లేచిన దగ్గర నుండి ఇల్లు, పిల్లలతో ఇదే పని విసుగు విరామం లేకుండా. ఇంట్లో ఏ గాయాలైనా ఎక్స్‌గ్రేషియా లేదు. ప్రమాదాలకు గురైనవారికి ఎక్స్‌గ్రేషియా ఉంటుంది. నిత్య ప్రమాదాలతో మనసు నిండా గాయాలతో మకిలి పెట్టిన మాటలు మనసుతో వినే స్త్రీకి ఏ విధంగాను అందని సానుభూతి. ఒకవేళ ఇలా జరిగింది అని చెప్పామా ముందు ఆమెను శంకించిన తర్వాత ఎదుటివారిని అనడం పరిపాటి అయిపోయింది. అందుకే స్త్రీలు ఎదిరించగలిగితే ఎదిరిస్తున్నారు లేదా మౌనపు దారిని ఎన్నుకొని మనసులో కుమిలిపోతారు. శృతి మించినపుడు ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకుంటూ మరణమే శరణమని మట్టిలో కలిసే స్త్రీలు అనేకులు.
”అయినా ప్రచార సాధనాలంటాయి నేనే పనిలేనిదాన్నని”.
ప్రచార సాధనాలు, రేడియో టీవీలతో ఆడవాళ్ళను ఎత్తులకు పై ఎత్తులు వేసే ఆడ విలన్లుగా విలువకు ప్రాధాన్యమివ్వని సీరియల్స్‌తో, అమ్మలక్కల ముచ్చట్లు, ఎవరింట్లో ఏ లొసుగులున్నాయో లాగడమే పనిగా పెట్టుకునే నోటిపూత మనుషుల గోలను చక్కని పాదాలలో అందించారు.
”భాషరాని బడుద్దాయిలంటారు భారమెంత వహిస్తున్నా నేనే భార్యనని”
విద్య ఉన్నా లేకపోయినా మగాడైతే చాలు స్త్రీలపై పెత్తనం చెలాయించడానికి. ఇంటా బయటా ఊపిరి సలపని పనులతో సతమతమవుతూ అన్ని కార్యక్రమాలను అలవోకగా చక్కదిద్దినా, సోమరి, తాగుబోతులతో బతుకుతూ, భారం వహించి బతుకులీడ్చుకుంటూ కుటుంబాలు కుంటుబడకుండా నిలిపిన ఆమె కష్టాలను, కన్నీళ్ళను, వేదనలను, వెతలను పుట్టింటికి, మెట్టినింటికి తెలియకుండా దాచుకుంటూ జీవన సమరం సాగిస్తున్న ఆమె ఆమేనని తెలిపిన గొప్ప కవిత.
ఉన్నత వర్గాల జీవితాలు డబ్బు డాబులతో ముడిపడి ఉండి పెద్దల కనుసన్నలలో మెదిలినా స్వేచ్ఛకు ఆటంకం లేని పైలా పచ్చీసు జీవితం గడుపుతారు. ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఇష్టమైన జీవితాలను నిలుపుకోవడానికి అవకాశాలు అనేకం కలిగి ఉంటారు. నిమ్న వర్గాలు ఒకరికి ఒకరై తోడుంటే సమఉజ్జీలుగా బతుకుతారు లేదా విడిపోతారు. మళ్ళీ మనువాడి చీకూ చింతా లేని జీవితాలను గడుపుతారు.
ఏ స్వాతంత్య్రం లేని వర్గమే మధ్య తరగతి వర్గం. అంతేకాకుండా భర్త ఎంత అవమానించినా, వేధించినా, దుర్మార్గుడైనా, పుట్టింటివాళ్ళు అడిగినంత కట్నం ఇస్తూ భర్త వద్దకే పంపుతారు. అందుకే ఎంతోమంది ఆడపిల్లలు కష్టాలను భరిస్తూ బతుకుతున్నారు బలహీనమైన క్షణాల్లో తమకు తాము బలవుతున్నారు. అలాగే మందులకు తగ్గని జబ్బు కాదు సావిత్రిది. తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి తనను తాను హింసించుకొని ప్రాణాలమీదకు తెచ్చుకుంది.
తన రచనల ద్వారా ప్రేరణ ఇచ్చిన సావిత్రి చనిపోకుండా ఉండి ఉంటే ఇంకా స్ఫూర్తిదాయకమైన రచనలు పొందేవారం. ఆమె కవితలు మనందరికీ ఆదర్శం.