గంగ అలవాటు ప్రకారం పొద్దున్నే నిద్ర లేచింది. కళ్ళల్లో ఇసుక కూరినట్లు మంటగా వుంది. కళ్ళు తెరవలేకపోయింది. మంచం మీద అలాగే కూలబడింది. రాత్రంతా కంటిమీద కునుకు లేదు. నిన్న సాయంత్రం జరిగిన సంఘటనలు పదే పదే సినిమా రీళ్ళల్లా కళ్ళముందు కదలాడ్డం, అవమానంతో, ఉక్రోషంతో మంచం మీద పడుకోలేక పోయింది. కన్నీళ్ళ చారికలు తెల్లారాక కూడా అలాగే వున్నాయి.
బలవంతంగా మంచం మీంచి లేచి అద్దం దగ్గరికి వెళ్ళి కళ్ళకేమయిందో అనుకుంటూ చూసుకుంది. కళ్ళు చింతనిప్పుల్లా వున్నాయి. కన్రెప్పలు ఉబ్బి ముఖమంతా జేవురించింది. ఇది తన ముఖమేనా? తన ముఖమెంత ప్రశాంతంగా వుండేది. ఎంత హాయిగా నిద్రపోయేది. రాత్రి పడుకుంటే పొద్దున వరకు లేచేది కాదు. కళ్ళనిండా నిద్రపోయి ఎంత కాలమైంది? ఏమైంది తనకి? మళ్ళీ మంచంలో కూలబడింది. లేచి బయటకు వెళ్ళాలన్పించడం లేదు గంగకు. ఈ చీకట్లో అలాగే పడుకోవాలన్పిస్తోంది. వెలుగు ముఖం చూడాలన్పించడం లేదు. చుట్టు పక్కల వాళ్ళకు ముఖం చూపించాలంటేనే గంగకు ఇష్టమవ్వడం లేదు. అందరికీ తలలో నాలుకలా వుండే తనకు ఈ సమస్య ఎందుకొచ్చిందో గంగకు తెలుసు. ఆ సమస్య నుండి ఎలా బయటపడాలో మాత్రం అర్థం కావడం లేదు. మంచం మీద వెల్లకిలా పడుకుని అటకవేపు చూస్తోంది. చూపు ఒకచోట నిలవడం లేదు. కళ్ళు మూసుకు పడుకుందామంటే కళ్ళు మూతలు పడడం లేదు. ఇంట్లో అలికిడి లేదు. కొడుకు పొలమెళ్ళిపోయి వుంటాడు. కోడలు దూళ్ళ దగ్గరుండి వుంటుంది. ఇంత పొద్దెక్కినా తనని ఎవరూ లేపలేదు. నిన్న తనకి జరిగిన అవమానం వాళ్ళ ముందే జరిగింది. ఎవరిని ఎవరూ అపే పరిస్థితి లేదు. ఎవరిని ఎవరూ ఆదుకునే ప్రయత్నం లేదు.
***
గంగకి తాను మొదటిసారి డ్వాక్రా గ్రూపు మీటింగ్‌కి వెళ్ళిన రోజు గుర్తుకొచ్చింది. ఎంత ఉత్సాహంగా వెళ్ళింది. ఊళ్ళో ఆడవాళ్ళంతా సమావేశమైన సందర్భమది. గంగకి మొదటిసారి తాను విన్న ఉపన్యాసం గుర్తొచ్చింది. ఏదో గవర్నమెంటు ఆఫీసునుంచి వచ్చినావిడ మాట్లాడుతుంటే ఎంతో ఆసక్తిగా విన్నది తాను.
“మీరందరూ పొదుపు చెయ్యాలి. పదిహేను మంది కలిసి ఒక గ్రూపుగా ఏర్పడాలి. మీ పొదుపు సొమ్మును బ్యాంకులో వేసుకోవాలి. దానిమీద మేము రుణాలిస్తాం. ఆ సొమ్ముతో మీరేదైనా వ్యాపారం చేసుకోవచ్చు. అందరూ కలిసి కూడా బిజినెస్ చెయ్యొచ్చు. డబ్బు కోసం మీరు మీ భర్తల మీద ఆధారపడక్కరలేదు. మీ చేతుల్లో నాలుగు డబ్బులాడితే మీ గౌరవం పెరుగుతుంది.” అంటూ చాలా చక్కగా చెప్పింది. గంగతో సహ వింటున్న ఆడవాళ్ళ ముఖాల్లో ఎంతో ఆసక్తి. ఇలాంటి విషయాలు వాళ్ళ జీవితంలో ఎపుడూ వినలేదు. ఇంతమంది ఆడవాళ్ళు ఆరుబయట సమావేశమవ్వడం వాళ్ళెపుడూ చూడలేదు.
ఆవిడ ఇంకా ఇలా చెప్పింది. ఊళ్ళో ఆడవాళ్ళందరూ ఏకమైతే బావుంటుంది. నెల్లూరులోని ఒక గ్రామంలో ఆడవాళ్ళందరూ ఏకమై సారాకి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేసారు. మీరంతా కూడా ఐకమత్యంతో వుంటే ఏదైనా సాధించవచ్చు అంటూ ఎన్నో విషయాలు చెప్పింది. ఆమె నెలకొకసారి వచ్చి ఇలా మీటింగ్‌లు పెట్టి ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్పేది. గంగకి ఆమె చెప్పే విషయాలు చాలా నచ్చేవి. అడిగి అడిగి తెలుసుకునేది. ఇన్ని రోజులూ మగవాళ్ళే వ్యాపారాలు చేసి, సంపాదించడం తెలుసు. తాము కూడా వ్యాపారం చేయ్యొచ్చని ఆమె చెప్పడం ఎంతో వింతగా అన్పించింది. ఏ ఇద్దరు ఆడవాళ్ళు కన్పడినా ఈ విషయాలే మాట్లాడుకునేవారు. గవర్నమెంటామె లేకుండా తాము మొదటిసారి కలుసుకుని మాట్లాడు కొన్న సంగతులు గుర్తొచ్చాయి గంగకి.
***
ఊళ్ళోని పదిమంది ఆడవాళ్ళు సిగ్గుపడుతూ, బిడియంగా గంగవాళ్ళింటికి వచ్చారు. మొగాళ్ళు పొలాలకి, పనులకి వెళ్ళిపోయాక వాళ్ళు కలుసుకుందామను కున్నారు. వాళ్ళొచ్చేసరికి గంగ తయారుగా వుంది. వీధరుగు మీద ఈతాకుల చాప పరిచింది. గంగ ప్రేరేపణతోటే వాళ్ళంతా ఊళ్ళోని పదిమంది ఆడవాళ్ళు సిగ్గుపడుతూ, బిడియంగా గంగవాళ్ళింటికి వచ్చారు. మొగాళ్ళు పొలాలకి, పనులకి వెళ్ళిపోయాక వాళ్ళు కలుసుకుందామనుకున్నారు. వాళ్ళొచ్చేసరికి గంగ తయారుగా వుంది. వీధరుగు మీద ఈతాకుల చాప పరిచింది. గంగ ప్రేరేపణతోటే వాళ్ళంతా వచ్చారు.
“గంగొదినా! నువ్వు రమ్మన్నావని వచ్చాను గానీ మా ఆయనకిష్టం లేదు” అంది. గంగ ఇంటిపక్కనే వుండే వెంకమ్మ.
“అవునొదినా! నేనూ అంతే. ఆ గవర్నమెంటామె ఏమేమో చెబుతుంది గాని అవన్నీ మన వల్ల అవుతాయంటావా? రాజమణి అంది.
“మీరేమైనా అనండి. ఆమె చెప్పే విషయాలు నాకు చాలా బావుంటున్నాయి. మనందరం కలిసి ఒక గ్రూపుగా అవుదాం. పొదుపు చేద్దాం. దీన్లో తప్పేముంది” అంది గంగ.
“పొదుపు చెయ్యడానికి మనకి డబ్బులెలా వస్తాయొదినా! అయినా ఈ పొదుపులు అవీ చేసి ఏం చేయాలి మనం” ఆదెమ్మ సందేహం.
“ఆదెమ్మా! నాకు మాత్రం ఏం తెలుసు చెప్పు. మండలాఫీసు నుంచి ఆమె వస్తానందిగా. ఆమెనే అడుగుదాం”.
“రాజమణీ! కొత్తగా గేదెను కొన్నట్టున్నారు. పాలిస్తుందా”
“ఎక్కడ పాలూ. సూడిగేదె. వచ్చే వినాయక చవితి నాటికి ఈనుతుంది”
“అలాగా! అయితే మాకందరికి జున్ను దొరుకుతుందన్నమాట” అందరూ నవ్వారు ఆ మాటకి.
ఆ మాటా ఈ మాటా మాటాడుకుంటూ కూర్చున్నారు. ఇంటి విషయాలు , భర్తల, పిల్లల విషయాలు మాట్లాడుకుంటూ, పరాచకాలాడుకుంటున్న సమయంలో మండలాఫీసునుంచి అరుంధతి వచ్చింది. ఆమె రాగానే అందరూ లేచి నిలబడ్డారు. ఆమె కోసం కుర్చీ తెచ్చి వేసారు గాని అరుంధతి వాళ్ళతో పాటే కిందే చాపమీద కూర్చుంది.
“అందరూ వచ్చినట్టేనా! ఇంకా ఎవరైనా రావాలా?”
“ఆయ్! అందరూ వచ్చేసారండి” అంది గంగ. అరుంధతి పొదుపు చేయడంలోని లాభాల గురించి, అన్ని గ్రామాల్లోను ఆడవాళ్ళు ఎలా పొదుపు చేయడం మొదలు పెట్టారో చాలా వివరంగా చెప్పసాగింది.
వింటున్న ఆడవాళ్ళకి ఎన్నో అనుమానాలొచ్చాయి. అన్నింటికి చాలా ఓపిగ్గా అరుంధతి సమాధానాలు చెప్పింది.
“మేము పదిహేను మందిమి పోగడ్డాం. పొదుపు మొదలుపెట్టొచ్చా?” గంగ ఉత్సాహంగా అడిగింది.
“ఆ… మొదలు పెట్టొచ్చు. మీ గ్రూప్కి ఒక పేరు పెట్టుకోండి” అంటూ వివరాలన్నీ చెప్పింది.
“కనకదుర్గమ్మ పొదుపు సంఘమని పేరు పెట్టుకుంటాం” అంది ఆదెమ్మ.
“వెరీగుడ్, పేరు కూడా పెట్టేసు కున్నారా? మరింక అడ్డేముంది?” పొదుపు చేసిన డబ్బును పోస్టాఫీసులో ఎలా వెయ్యాలో, పుస్తకాల్లో ఎలా రాసుకోవాలో వివరాలన్నీ అడిగి తెలుసుకుంది గంగ.
***
రాత్రి భోజనాల వేళపుడు భర్తకి ఉత్సాహంగా అన్ని విషయాలు చెప్పింది. శ్రీనివాసులు ఉలుకు పలుకు లేకుండా విన్నాడు.
“నేనింత ఉత్సాహంగా చెబుతుంటే ఏం మాట్లాడవేంటి”.
“ఏం మాట్లాడను. నువ్వు ఇల్లొదిలి ఊరిమీద తిరుగుతానంటే నోరు మూసుక్కూచోక ఏమనమంటావ్” నోరు విప్పాడు.
“ఊళ్ళో ఆడాళ్ళం కలిసి మాట్లాడు కోవడం అంటే ఊరిమీద తిరగడమేనా?” గయ్మంది గంగ.
“అబ్బ! నీ చావేదో నువ్వు చావు. నా జోలికి రాకు”. తింటున్నవాడల్లా కంచం తోసేసి లేచిపోయాడు శ్రీనివాసులు.
గంగ ఉస్సురంది. తన ఉత్సాహం మీద పేడనీళ్ళు చిలకరించినట్టన్పించి నిట్టూర్చి తనూ లేచిపోయింది.
***
శ్రీనివాసులు చీదరించినా గంగలో ఉత్సాహం తగ్గలేదు. కనకదుర్గమ్మ సంఘానికి ప్రెసిడెంటయ్యింది. వారం వారం సంఘం వాళ్ళు కలవడం మొదలుపెట్టారు. మొదట్లో పొదుపు గురించే మాట్లాడుకునేవాళ్ళు. నెలకోసారి అరుంధతి వచ్చి మీటింగ్ పెట్టేది. పక్క గ్రామాల్లో ఏం జరుగుతోందో చెపుతుండేది. అకౌంటు పుస్తకాలు ఎలా రాసుకోవాలో, వసూలైన పొదుపు సొమ్మును పోస్టాఫీసులో ఎలా జమ చేసుకోవాలో చెప్పేది. గంగ చాలా శ్రద్ధగా విని, అరుంధతి చెప్పేవన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేసేది.
ఒకసారి అరుంధతి మీటింగ్‌లో ఒక కొత్త విషయం చెప్పింది. గ్రామాల్లోని అన్ని సంఘాల ప్రెసిడెంట్లకు నాయకత్వ లక్షణాల గురించి జిల్లా స్థాయిలో ఏలూరులో శిక్షణ నిస్తున్నారని, గంగను కూడా హాజరవ్వమని చెప్పింది.
“నాయకత్వ లక్షణాలా? అవేంటి? ఏలూరెళ్ళాలా? మా ఆయనొప్పుకోడు” అంది గంగ.
“నాయకత్వమంటే మరేంలేదు. నువ్వు చేసిందే. మీ గ్రామంలో సంఘం పెట్టడానికి నువ్వెంతో చొరవ చూపించావు. నలుగుర్ని కూడేసావు. వాళ్ళందర్ని ఒప్పించి సంఘం పెట్టుకునేలా చేసావు. ఇవే నాయకత్వ లక్షణాలంటే. చాలా గ్రామాల నుంచి చాలా మంది ఆడవాళ్ళు వస్తారు. వాళ్ళందరిని కలవొచ్చు” అంది అరుంధతి.
“ఊళ్ళో మీటింగ్‌కే వద్దంటాడు నా మొగుడు. ఏలూరెళతానంటే ఒప్పు కుంటాడా?” అనుమానంగా అంది గంగ.
“ప్రయత్నం చెయ్యండి. వెళితే మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు”. అంటూ సమావేశం ముగించి అరుంధతి వెళ్ళిపోయింది.
***
శ్రీనివాసులు ససేమీరా వెళ్ళొద్దన్నాడు. సంఘాలు పెట్టి ఊళ్ళోని ఆడవాళ్ళు చెడిపోతున్నారని రంకెలు వేసాడు. జల్సాలు చెయ్యడానికే ఏలూరెళుతున్నారని తిట్టాడు. గంగ దేనికీ బెదరలేదు. నయానా, భయానా చెప్పి ఒప్పించింది. ఊళ్ళోంచి ఆరుగురు ఆడవాళ్ళు బయలుదేరి ఏలూరు వెళ్ళారు. గంగ ఇంతకు ముందెపుడూ ఏలూరు చూళ్ళేదు. అంతమంది ఆడవాళ్ళని చూళ్ళేదు. శిక్షణా తరగతుల్లో తనలాంటి ఆడవాళ్ళు ఎంతో ధైర్యంగా ఎన్నో విషయాలు మాట్లాడ్డం చూసి గంగ ఆశ్చర్యపోయింది. ఆ శిక్షణలో ఆరోగ్యం గురించి, ఆడవాళ్ళ హక్కుల గురించి, ఐకమత్యం గురించి, పొదుపు గురించి తన జీవితంలో ఇంతకు ముందెన్నడూ వినని విషయాలు వింది. లోకంలో ఇన్ని సంగతులున్నాయా అని ఆశ్చర్యపోయింది. ఆడవాళ్ళూ, మగవాళ్ళూ సమానమేనని, మగవాళ్ళకున్న అన్ని హక్కులూ ఆడవాళ్ళకి కూడా వున్నాయని విన్నపుడు నమ్మలేకపోయింది. శిక్షణా తరగతులు పూర్తయ్యేసరికి గంగలో మార్పు కొట్టొచ్చినట్టు కన్పడింది. కొత్త విషయాలు, కొత్త ఆలోచనలు మనసునిండా నింపుకుని గ్రామానికి తిరిగి వచ్చింది.
***
కనకదుర్గమ్మ సంఘం సమావేశాలు రెగ్యులర్‌గా జరుగుతున్నాయి. గంగ ఆధ్వర్యంలో సంఘం పొదుపులో ముందుంది. ప్రభుత్వ రుణం కూడా మంజూరైంది. తనకు వచ్చిన రుణంతో గంగ ఒక గేదెను కొంది. శ్రీనివాసులు కూడా మునపటిలా నసపెట్టడం మానేసాడు. గ్రామానికి వచ్చే అధికారులు గంగతో మాట్లాడేవారు. గంగ వాళ్ళతో ధైర్యంగా మాట్లాడ్డం అతనిలో కొంత మార్పు తెచ్చింది. గంగ పట్ల మర్యాదగా మసలక తప్పదని అతనికి అర్థమైంది. ఇపుడేమో గంగ ఇంటికోసం పాడిగేదెను కొనగలిగింది. తన వల్లకాని పనిని గంగ చేసి చూపించింది. గంగ మీటింగులని తిరుగుతున్నా శ్రీనివాసులు ఏమీ అనలేకపోతున్నాడు.
సంఘం మీటింగుల్లో పొదుపే కాకుండా అనేక ఇతర విషయాల గురించి కూడా చర్చించడం మొదలు పెట్టారు. శిక్షణా తరగతుల్లో నేర్చుకున్న విషయాల గురించి మాట్లాడుకోవడం, గ్రామంలో సమస్యల గురించి చర్చించడం తమకి ఏమైనా అనుమానాలుంటే అరుంధతిని అడగడం చేస్తున్నారు. సంఘంలో ఒక సభ్యురాలికి ఏదైనా కష్టం కలిగితే అందరూ ఆదుకోవడం, ఇంటి విషయాలు అందరూ పంచుకోవడంతో సంఘంలోని వాళ్ళకి ఒకరిపట్ల మరొకరికి అవగాహన పెరిగింది.
***
“గంగొదినా! ఈ సంగతి ఇన్నావా?” అంటూ వచ్చింది ఈశ్వరి.
“ఏం సంగతి? నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుంది” అంది గంగ.
“రాత్రి ఆదెమ్మ మొగుడు తాగొచ్చి నానా గొడవా చేసాడంట. ఆదెమ్మను కొట్టి బయటకు గెంటేసాడంట”.
“ఏం పోయేకాలమొచ్చిందంట. రాత్రి నేను ఏలూరు నుంచి వచ్చేటప్పటికి బాగా ఆలస్యమైంది. ఎందుకు గొడవైందసలు”.
“ఎందుకేంటొదినా! మనం రుణం కింద డబ్బులు తీసుకున్నాం కదా! అవి తనకివ్వమని కొడుతున్నాడంట”
“తాగి తందనాలాడ్డానికా? పద ఆదెమ్మ ఇంటికెళదాం”
ఇద్దరూ ఆదెమ్మ ఇంటికి బయలు దేరారు. దారిలో మిగతా సంఘం సభ్యుల్ని కూడా పిలుచుకుంటూ, ఆమాటా ఈమాటా చెప్పుకుంటూ ఆదెమ్మ ఇంటికొచ్చారు.
“ఆదెమ్మా! ఏం చేస్తున్నావ్ లోపల” గంగ పిలిచింది.
“ఆదెమ్మ రాదు. ఫొండి… దొంగ…” ఆదెమ్మ మొగుడు బయటకొచ్చి బూతులందుకున్నాడు. పట్టపగలు ఫుల్‌గా తాగున్నాడు.
“ఈడికేం పోయేకాలం! ఇంత పొద్దున్నే తాగేసాడు”
“ఆదెమ్మా! లోపలున్నావా?” గంగ గట్టిగా కేకేసింది.
“నీ యమ్మ! అది రాదంటే ఇనపడలేదా! దొంగ లం…” నోటికొచ్చిన బూతులు తిడుతున్నాడు.
ఆదెమ్మ ఏడుస్తూ బయటకొచ్చింది. ఆమె జుట్టు పట్టుకుని లాగుతూ లోపలకు గెంటేసాడు. ఆదెమ్మ కిందపడిపోయింది. కింద పడిన ఆమెను ఇష్టం వచ్చినట్టు కాళ్ళతో తన్నడం మొదలెట్టాడు. చూస్తున్న ఆడవాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. అంతే. ఒక్కసారిగా అతని మీదకి లంఘించి, బయటికి ఈడ్చుకొచ్చారు. అతను పెడబొబ్బలు పెడుతూ తిట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఎవరో తాడు తెచ్చారు. పెరట్లో వున్న కొబ్బరి చెట్టుకు అతన్ని కట్టేసారు. ఈ గొడవకి ఊళ్ళోని చాలామంది అక్కడ చేరారు. ఆదెమ్మ భయపడుతూ నిలబడి వుంది.
గంగ ఆవేశంతో ఊగిపోతూ “ఈరోజు నుండి ఊళ్ళో తాగొచ్చి పెళ్ళాలని కొట్టేవాళ్ళకి ఇదే శిక్ష. మేం రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తే మీరు తాగొచ్చి మమ్మల్ని తంతారా?”
మిగతా ఆడవాళ్ళంతా కూడా “అంతే… అంతే…” అంటూ గట్టిగా అరిచారు. తాగుబోతుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి.
***
ఆ సంఘటన తర్వాత కనకదుర్గ సంఘం సభ్యులంటే ఊళ్ళో గౌరవం పెరిగింది. మగవాళ్ళు తాగుడు మానేయలేదు కాని గొడవలు చేయడం తగ్గించేసారు. లేకపోతే ఆదెమ్మ మొగుడికి పట్టిన గతే తమకీ పడుతుందని భయపడ్డంతో ఇళ్ళల్లో కొంత శాంతి నెలకొంది.
పొదుపు సంఘాల సమావేశాలలో పొదుపు విషయాలే కాక, తమ సమస్యల గురించి చర్చించేవారు. ఇంటి గొడవల్ని ఒకరితో ఒకరు పంచుకోవడం, ఎవరికి కష్టం వచ్చినా ఆదుకోవడం చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసి సంపాదిస్తున్నారు కాబట్టి ఇళ్ళల్లోను గౌరవం పెరిగింది.
***
గంగ కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి. తమ సంఘం సభ్యులంతా ఎంతో సఖ్యంగా, తోడు నీడగా మసలేవాళ్ళు. అలాంటి వాళ్ళే నిన్న తనపట్ల ఎంత పరుషంగా ప్రవర్తించారు. ఆదెమ్మ… భర్త కొడుతుంటే తామంతా ఆదుకున్న ఆదెమ్మ ఎన్నిమాటలంది. ఇదంతా ఎలా జరిగింది.
గంగకి ఆరోజు బాగా జ్ఞాపకం వుంది. తమ సంఘం సమావేశం పూర్తయి, అందరూ సరదాగా మాట్లాడుకుంటూ కూర్చుని వున్నపుడు, ఊళ్ళో కుర్రాడొకరు లోపలికొచ్చి,
“గంగ పెద్దమ్మా! నీకోసం ఎవరో వచ్చారు” అని చెప్పి తుర్రుమన్నాడు.
“ఎవరూ” అంటూ బయటకొచ్చి… అపరిచిత వ్యక్తిని చూసి ఆగిపోయింది.
“గంగగారూ! నమస్కారం. నాపేరు రాఘవయ్య. మీతో… అంటే మీ సంఘం సభ్యులతో మాట్లాడాలని వచ్చాను”
రెండు చేతులు జోడించి నిలబడ్డాడు.
ఈ సరికి అందరూ బయటకొచ్చారు. రాఘవయ్య వేపు ఆసక్తిగా చూస్తూ నిలబడ్డారు.
“చెప్పండి! అందరం ఉన్నాం” అంది.
“కూర్చోని మాట్లాడుకుంటే బావుంటుంది కదా”
అందరూ మళ్ళీ లోపలికెళ్ళి కూర్చున్నారు. అందరూ రాఘవయ్య వేపు ఆసక్తిగా చూస్తున్నారు.
“నేను అస్మిత అనే సంస్థ నుంచి వచ్చాను”
“అస్మిత! అదేం సంస్థ” అందరూ అడిగారు.
“చెబుతాను. మా సంస్థ మీలాంటి ఆడవాళ్ళకి రుణాలిస్తుంది. ఆ రుణాలమీద చాలా తక్కువ వడ్డీ వుంటుంది. మీరు మా దగ్గర అప్పు తీసుకుంటే మేము బీమా కూడా చేయిస్తాం.”
అప్పులిస్తాము అనగానే అక్కడ కూర్చున్న ఆడవాళ్ళందరిలో చాలా ఆసక్తి కలిగింది.
“అప్పు ఎలా ఇస్తారు? దేనిమీద ఇస్తారు?” గంగ అడిగింది.
“ఏమీ పూచీకత్తు అవసరం లేదు. మీ సంఘ సభ్యులే ఒకరికొకరు పూచీకత్తు. అంతేకాదు ఒకరు తీసుకున్న అప్పు తీరకుండానే మళ్ళీ రుణం తీసుకోవచ్చు”.
ఆడవాళ్ళంతా నమ్మలేనట్లు చూసారు. తమ సంఘంలో అయితే తీసుకున్న అప్పు మొత్తం తీరేదాక మరో అప్పు ఇవ్వరు. ఇదేదో బావుందే. అనుకున్నారు.
రాఘవయ్య వివరంగా చెప్పాడు. అందరూ రకరకాల ప్రశ్నలు వేసారు. అన్నింటికీ సమాధానాలు చెప్పాడు.
***
వారం తిరక్కుండానే కనకదుర్గమ్మ సంఘం స్త్రీలు అస్మిత సంస్థ దగ్గర అప్పు తీసుకున్నారు. ఈ అప్పు వారం వారం కట్టాలని రాఘవయ్య చెప్పాడు. కడతామని అందరూ ఒప్పుకున్నారు. తీసుకున్న అప్పుసొమ్ము వ్యాపారాల్లో కొందరు మదుపు పెడితే, కొందరు ఇంట్లో ఇబ్బందులకు వాడేసుకున్నారు.
పదిహేను రోజుల తర్వాత ‘ ఉండమ్మా! బొట్టుపెడతా’ పేరుతో మరో సంస్థ గ్రామంలోకి దిగింది. వాళ్ళిచ్చిన రుణాలు తీసుకున్నారు. వారం వారం కిస్తులు కట్టడం మొదలు పెట్టారు. మొదట్లో బాగానే కట్టేయగలిగేరు. అప్పు మీద అప్పు పుట్టడంతో వాళ్ళకేమీ ఇబ్బంది కల్గలేదు. వారంలో శుక్రవారం అస్మిత అప్పుకి కిస్తు, బుధవారం ఉండమ్మా బొట్టుపెడతా అప్పు, సోమవారం ‘షేర్’ అప్పుకి కిస్తు కట్టడం.
***
గంగ మరో గేదెను కొంది. కొంత సొమ్ము ఖర్చుపెట్టి ఇల్లు బాగుచేయించింది. రెండు గేదెలు పుష్కలంగా పాలు ఇవ్వడంతో వారం వారం అప్పులకు వాయిదాలు కట్టడంతో మొదట్లో కష్టమేమీ అన్పించలేదు. అయితే ఊళ్ళో ఆడవాళ్ళ ప్రవర్తనలో మాత్రం విపరీతమైన మార్పు వచ్చింది. ఇంతకు ముందు ఎవరో ఒకళ్ళింట్లో సమావేశ మయ్యేవాళ్ళు. ఎన్నో విషయాలు మాట్లాడు కునేవాళ్ళు. ఒకరి కష్టసుఖాలు ఒకరు చెప్పుకుంటూ , ఎవరికైనా ఏమైనా సమస్య వస్తే అందరూ కలిసి దానిని పరిష్కారం చేయడానికి పూనుకునేవాళ్ళు. ముఖ్యంగా, సరదాగా నవ్వుకుంటూ, ఎకసెక్కాలు, వేళాకోళాలు ఆడుకుంటూ కలిసి మెలిసి వుండేవాళ్ళు.
అలాంటిది మైక్రోఫైనాన్స్ వాళ్ళు ఏరోజు ఆ ఊళ్ళో అడుగుపెట్టారో, అప్పు మీద అప్పులిచ్చి వడ్డీలు వసూలు చేసుకోవడం మొదలెట్టారో, ఊళ్ళోని ఆడవాళ్ళకి వేరే ప్రపంచం లేకుండా పోయింది. మీటింగుల్లేవు. సరదా ముచ్చట్లు లేవు. తెల్లారితే ఎవరి బకాయి కట్టాలి? కిస్తు సొమ్ము ఎలా సమకూర్చుకోవాలి? కట్టకపోతే ఎదురయ్యే అవమానాల్ని ఎలా ఎదుర్కోవాలి? ఇవే ఆలోచనలు. మైక్రో ఫైనాన్స్ కంపెనీల వాళ్ళు వాళ్ళ కిస్తు వసూళ్ళకోసం ఈ ఆడవాళ్ళని ఒకరిమీదికి మరొకరిని ఉసిగొల్పి తమ పబ్బం గడుపుకోవటం మొదలెట్టారు. శుక్రవారం అస్మిత వాళ్ళ అప్పు కట్టాలి. గ్రూపులో అందరూ కిస్తు చెల్లించేవరకు ఎవరూ కూర్చున్న చోటునుంచి కదలకూడదు, కూలికెళ్ళకూడదు. ఎవరైనా కట్టలేకపోతే గ్రూపులోని ఏ ఒక్కరూ అక్కడినుండి కదలడానికి లేదు. సాయంత్రం వరకు కూర్చోవలసిందే. సాయంత్రానికి కూడా ఎవరైనా కట్టలేకపోతే వాళ్ళ పరిస్థితి అధ్వాన్నంగా తయారౌతుంది. ఉదయం నించి పనులన్నీ మానుకుని కూర్చున్న వాళ్ళంతా అసహనంతో, కోపంతో కట్టనివాళ్ళమీద విరుచుకుపడతారు. నోరు నొప్పెట్టేవరకు తిడతారు. అప్పులిచ్చిన వాళ్ళు చిద్విలాసంగా కూర్చుని ఈ అమానవీయ దృశ్యాల్ని చూస్తూ, వాళ్ళని మరింత రెచ్చగొడతారు. దీంతో గ్రామంలోని ఆడవాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని పరిస్థితుల్లోకి నెట్టేయబడ్డారు. సరదాగా, సరస సల్లాపాలతో చెమత్కారా లాడుకునే ఆడవాళ్ళు బద్ధ శతృవుల్లా తయారయ్యారు. వారం వారం కట్టాల్సిన అప్పు కిస్తులు తప్ప వాళ్ళ మనసుల్లో వేరే ఆలోచన లేకుండా పోయింది. నిద్రలో కూడా అవే కలలు. పీడ కలలు పీడించడంతో, నిద్రలేక, తిండి తినలేక రకరకాల రోగాలు మొదలయ్యాయి. డబ్బు కట్టాల్సిన రోజు వస్తోందంటే గుండెల్లో దడ, వణుకు. అవమానాన్ని ఎలా తట్టుకోవాలనే బెంగ. ఆ ఊరి ఆడవాళ్ళందరి పరిస్థితి అలాగే వుంది. ఎవరితో చెప్పుకోలేరు. కష్టాన్ని వినే మనిషే లేకుండా అయ్యారు. అందరికి అప్పుల కష్టాలే.
***
గంగకి క్రితం రోజు సాయంత్రం జరిగిన విషయాలు గుర్తొచ్చాయి. కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. తన దురదృష్టం కాకపోతే తన గేదె ఎందుకు చచ్చిపోవాలి. మాయదారి పాము కాటేయ్యకపోతే, తన గేదె ఎందుకు చచ్చిపోతుంది. గేదె పోయింతర్వాత తను అప్పు కట్టలేకపోయింది. మూడు వారాల్నించి ఎవరికి కట్టలేక నానా తిట్లూ తింటోంది. తానే కాదు నిన్న చాలామంది కట్టలేదు. ఒకరినొకరు కాట్లకుక్కల్లా తిట్టుకున్నారు. ఆదెమ్మ రెచ్చిపోయి మీదిమీదికొచ్చింది. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ. అస్మిత వాడు మాత్రం కుర్చీలో కాలుమీద కాలేసుకుని కూర్చుని వీళ్ళని ఎంత రెచ్చగొట్టాలో అంతా రెచ్చగొట్టాడు. వచ్చేవారం మొత్తం కట్టకపోతే కుదరదని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. ఆడవాళ్ళు లేచి, ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టు ముఖాలు వేలాడేసుకుని, జీవంలేని వాళ్ళల్లా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారు. తాను మాత్రం చాలాసేపు అక్కడే కూర్చుండిపోయింది. చస్తే పీడ విరగడవు తుందని చాలా సార్లు అనుకుంది. కోడలొచ్చి ఇంటికి తీసుకెళ్ళింది. పచ్చి మంచినీళ్ళయినా ముట్టకుండా అలాగే నిస్త్రాణంగా పడుకుంది రాత్రంతా.
***
పది గంటలవేళ అరుంధతి గంగ వాళ్ళింటికొచ్చింది. ఈమధ్య కాలంలో అరుంధతి పిలిచినా వీళ్ళెవరూ వెళ్ళడం లేదు. మీటింగ్ పెట్టినా ఎవరూ హాజరవ్వడం లేదు. ఊళ్ళోకి రాగానే నిన్న రాత్రి జరిగిన గొడవ అరుంధతికి తెలిసి, గంగను చూడ్డానికి వచ్చింది. అరుంధతిని చూసి గంగ వెక్కి వెక్కి గుండెలవిసి పోయేట్టు ఏడ్చింది. తన బతుకిలా కావడానికి అరుంధతే కారణమన్పించింది గంగకి. మాట్లాడకుండా కూర్చుంది. గంగ పరిస్థితి చూసి అరుంధతి చాలా బాధపడింది. ఆమె మనసులో జరుగుతున్న కల్లోలాన్ని అర్థం చేసుకోగలిగింది.
“గంగా! ఊరుకో. జరిగిన విషయాలన్నీ నాకు తెలుసు. ఇలా బాధపడుతున్నది నువ్వొక్కదానివే అనుకోకు. నీకు తెలుసా కృష్ణా జిల్లాలో నీలాంటి ఆడవాళ్ళందరూ తిరగబడి కలెక్టర్‌కి కంప్లయింట్ చేసారు.”
గంగకి అర్థం కానట్టు చూసింది.
“మైక్రో ఫైనాన్స్ వాళ్ళు మీ ఊళ్ళోనే కాదు అన్నిచోట్ల అప్పులిస్తున్నారు. కృష్ణాజిల్లాలో ఇంకా ఎక్కువ. ఈ అప్పులు కట్టలేక నలుగురు ఆడవాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు”
“నిజంగానా?” గంగ నమ్మలేక పోయింది కానీ నిన్న తనకీ అన్పించింది చచ్చిపోవాలని.
“అవును గంగా. వసూళ్ళలో వాళ్ళు పాటిస్తున్న ఘోరమైన విధానాలు ఆడవాళ్ళని శతృవులుగా మార్చేసాయి. కొన్ని రోజుల తర్వాత జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. వాళ్ళు వినతి పత్రం ఇచ్చేవరకు కలెక్టర్‌కి గాని, బయట ప్రపంచానికి గాని మైక్రో ఫైనాన్స్ వాళ్ళ ఆగడాలు తెలియలేదు. మా డిపార్ట్‌మెంటు కూడా దీనిమీద ఏదైనా చెయ్యాలని చూస్తోంది. మీరంతా మళ్ళీ కలిస్తేగాని మేము ఏమీ చెయ్యలేం” అరుంధతి అంది.
“మేం మళ్ళీ కలవడమా! నిన్న పోట్లగిత్తలా పోట్లాడుకున్నాం. మా ఆడవాళ్ళకి అప్పులు తిరిగి కట్టడం తప్ప మరో ఆలోచన లేకుండా పోయింది. ఎవ్వరూ రారమ్మా”
“నేను ప్రయత్నిస్తాను. గంగా !ఇదిగో కృష్ణా జిల్లా ఆడవాళ్ళు కలెక్టర్‌కిచ్చిన వినతి పత్రం కాపీ. ఇది చదివితే మీకు అర్థమౌతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థల్ని నిషేధించారు తెలుసా?”
“అంటే”
“అంటే ఏం లేదు. వీళ్ళు అప్పులివ్వడానికి లేదు. ఇచ్చినా వడ్డీ తగ్గించాలి. కిస్తులు వారానికి కాకుండా నెలకోసారి వసూలు చెయ్యాలి. ఇంకా చాలా విషయాలున్నాయి మీకు చెప్పాల్సినవి. వచ్చేవారం మీటింగ్ పెడదాం”
“ఈ విషయాలు మాకు తెలియక పోయేనే! మీటింగా? ఏమో! కష్టం” నసిగింది గంగ. నిన్న తనని అంత అవమానించి, చీదరించిన వాళ్ళతో తనెలా మాట్లాడగలుగు తుంది. తానూ కూడా ఒకసారి కాదు ఎన్నోసార్లు కట్టలేని వాళ్ళని తిట్టిన విషయం గుర్తొచ్చింది గంగకి. తనేమైనా తక్కువ తిట్టిందా? తన రెండు గెదెలు పుష్కలంగా పాలు ఇచ్చినపుడు సక్రమంగా బాకీలు చెల్లించినపుడు తనకీ కళ్ళు నెత్తికెక్కాయి. తనూ తిట్టిపోసింది.
“సరే గంగా! జరిగిందానికి బాధపడకు. ఏం చెయ్యాలో ఆలోచించు. ఈ గ్రామంలో సంఘం మొదలు పెట్టించింది నువ్వే. మీరంతా ఎంతో సరదాగా, పరాచకాలాడు కుంటూ కలిసి మెలిసి వుండేవాళ్ళు.మీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడానికి కారణం మాత్రం మీరు కాదు. ఒకళ్ళ మీదికి ఇంకొకరిని ఉసిగొల్పి తమ పబ్బం గడుపుకుంటున్నవాళ్ళు బాగానే వున్నారు. మీరు ఎందుకు ఇలా అయ్యారో ఆలోచించు. వచ్చేవారం మీటింగ్ జరిగేట్టు వుంటే నాకు కబురు చెయ్యి” అని చెప్పి అరుంధతి వెళ్ళిపోయింది.
గంగ అలాగే కూర్చుండిపోయింది. అరుంధతి చెప్పిన విషయాలు ఆమె మనసులో సుళ్ళు తిరుగుతున్నాయి. ఏవో చిక్కుముడులు విడుతున్నట్టుగా అన్పించింది. నిజమే! ఈ అప్పులిచ్చేవాళ్ళు రాకముందు తామంతా ఎంత బాగా వుండేవాళ్ళు. వాళ్ళిచ్చిన అప్పులు తమ బతుకుల్ని ఏమైనా బాగుచేసాయా అంటే అదీ లేదు. అప్పు మీద అప్పు ఎరచూపి, ఎక్కువ వడ్డీలు గుంజి రాబందుల్లా పీక్కు తింటున్నారు. తమలో తమకి పోట్లాటలు పెట్టి కాలుమీద కాలేసుకుని కూర్చున్న రాఘవయ్య గుర్తొచ్చి ఆమెకి కోపం ముంచు కొచ్చింది. దీనికంతటికీ కారణం రాఘవయ్యే! అరుంధతి కాదు, ఆదెమ్మ కాదు అని అర్థమైంది గంగకి. ఆదెమ్మ కూడా ఒకసారి అప్పు కట్టలేక ఎన్ని తిట్లు భరించిందో గుర్తొచ్చింది గంగకి. వెంటనే అరుంధతి ఇచ్చిన కాగితాలన్నీ తీసుకుని ఆదెమ్మ ఇంటివేపు నడిచింది. అప్పటివరకు దైన్యంగా కన్నీళ్ళు కార్చిన గంగ, ధైర్యంగా తలెత్తుకుని వీధుల్లోకి నడవడం గమనించిన ఆమె కోడలు విస్తుపోయి చూస్తూ నిలబడింది.
ఇ లొన్స ను సక్రమంయౌఉపయొగించి కున్నచొ ఇవి బగ ఉపయొగపదతై