-డి.విజయకుమారి
(భూమిక నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)
కోటమ్మ బాల్కనీలో కూచుంది, కొన్ని వందల సార్లు అలారమ్ గడియారం వంక చూసుంటది. ఇంకా తెల్లవారుజాము మూడే అయింది. తెల్లవారాలంటే మూడు గంటలయినా ఎదురు చూడాలి. తన గది తలుపులు తెరవాలంటే ఎనిమిది కావలిసిందే, అది తన కొడుకు ఆర్డర్. రోజూ వుండేదే అయినా ఈరోజు ఎందుకో మనసంతా కలతగా వుంది. మధ్య రాత్రినుండి అలా కూర్చునే వుంది.
మనసు గతంలోకి పరుగుపెడ్తుంది. వద్దనుకుంటున్నా ఆలోచనలు కందిరీగల్లా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిన్న పొద్దున్నే పేపర్‌లో చదివింది. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల విశాల ప్రపంచం కుగ్రామమే అయిపోయిందట. సముద్రాల అవతల వున్న వారితోనైనా ఒక్క సెకనులో సంభాషించవచ్చు. అవును అభివృద్ధి విశాల ప్రపంచాన్ని గుప్పిటిలో ఇమిడేలా చేసింది. దానితో పాటు మనుషుల ఆలోచనలను సంకుచితం చేసేసింది ఒకే ఇంట్లో వుండే మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడాలంటే ఎన్నో అడ్డుగోడలు. 75 సంవత్సరాల కోటమ్మ మనసులో గత స్మృతుల సుడిగుండాలు ఊపిరి ఆడనివ్వడం లేదు.
వద్దనుకుంటూనే గతంలోకి జారిపోయింది. ఎక్కడ పుట్టింది తను, ఎక్కడ మొదలయింది తన జీవితయాత్ర. వరంగల్లు జిల్లాలో నెక్కొండలో పుట్టింది. తన తల్లిదండ్రులకు తను 20 వ సంతానం. తమకు సంతానం చాలని “సాలమ్మ”అని పేరు పెట్టారట. ఇంకో సంతానం కలిగితే తల్లి దండ్రులు మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనే మూఢనమ్మకానికి భయపడి ఆ పేరు పెట్టారు. తనకు 7 వ ఏటనే పెళ్ళి చేశారు. అత్తగారు “కోటమ్మ” అని పేరు పెట్టారు. అమ్మ పెట్టిన సాలమ్మ అనే పేరు ఎక్కడ పోయిందో ఏడేళ్ళ వయసు వచ్చేవరకు తల్లిపాలు తాగిందట తను. పాలు మరవకముందే తన ప్రమేయం లేకుండానే పెళ్ళి జరిగిపోయింది. అంతా బొమ్మలాటలాగ. తన పదహారవ ఏట కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా. గాజుల శెట్టి సాయంతో బెజవాడ చేరారు కోటమ్మ, వాళ్ళాయన బ్రహ్మయ్య. అక్కడ వాళ్ళాయన రోజంతా పనిచేస్తే రూపాయి, ఆరణాలు ఇచ్చేవారు. అది సరిపోక కోటమ్మ ఏదైనా పని చేస్తానంటే వాళ్ళాయన ఒప్పుకునేవాడు కాడు, వారం రోజులు పస్తయినా వుంటాను కాని ఏ పనికి పంపను అనేవాడు. ఎన్ని కష్టాలయినా పడటానికి సిద్దంగా వుండేది తను.
బెజవాడలో అన్నపూర్ణమ్మ స్నేహం జీవితం గురించి చాలా నేర్పింది. అన్నపూర్ణమ్మ వాళ్ళాయన పిల్లల మర్రి వెంకటేశ్వరరావు ఏదో ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. కడలూరు జైలుకు. ఆ జైలుకు వెళ్ళినవారు తిరిగి వస్తారని నమ్మకం వుండేది కాదు. పోలీసులు వాళ్ళను అక్కడే కాల్చేస్తారని భయం వుండేది. అన్నపూర్ణమ్మ, పిల్లల మర్రి వెంకటేశ్వర రావుది కులాంతర వివాహం. ఆమె బ్రాహ్మణ స్త్రీ, అతను కమ్మ. ఇద్దరూ ఉద్యమంలో పనిచేసేవారు.
కోటమ్మ, అన్నపూర్ణమ్మల స్నేహం కూడా విచిత్రంగా జరిగింది. ఆ రోజు ఒక సంఘటన జరిగింది. కోటమ్మ వీధిపంపు దగ్గర నీళ్ళు పడుతోంది. పక్కనే మురికి కాలువలో ఏదో కదులుతుంది, పంది పిల్లో , కుక్కపిల్లో అని ముందు పట్టించుకోలేదు. కాని ఏదో తేడా అనిపించింది. అటువైపు చూసింది. ఎవరో పిల్లాడు మురికి కాలువలో కొట్టుకుంటున్నాడు. పరుగున వెళ్ళి బయటకు లాగి, బిందె పక్కకు పెట్టి పంపు కింద కూర్చోపెట్టి కడిగింది. అప్పటికే ముక్కుల్లోకి, నోట్లోకి ఆ మురికంతా చేరింది. అంతా శుభ్రం చేసి చెవుల్లో గట్టిగా వూదింది. పిల్లవాడు కళ్ళు తెరిచాడు. ఈలోపు చుట్టుపక్కలవాళ్ళు చుట్టుమూగారు. అన్నపూర్ణమ్మ కొడుకని గుర్తుపట్టారు. ప్రక్క డాబా పైవాటాలో అద్దెకుంటుంది ఆమె. కోటమ్మతో పాటు కొందరు ఆడవాళ్ళు అన్నపూర్ణమ్మ ఇంటి తలుపు తట్టారు. కొడుకును ఆ స్థితిలో చూసి బావురుమంది అన్నపూర్ణమ్మ. జరిగిందంతా విని కోటమ్మను ఎంతో మెచ్చుకుంది. తన కొడుక్కి ప్రాణ భిక్ష పెట్టావంది. అప్పడినుండి వాళ్ళిద్దరికి స్నేహం కుదిరింది. అన్నపూర్ణమ్మ తరువాత తన కులాంతర వివాహం గురించి, ఉద్యమంలో పనిచేయడం గురించి, వాళ్ళాయన జైలుకు పోవడం అంతా వివరంగా చెప్పింది.
అంతా విన్న కోటమ్మకు ఆమె మీద ఎంతో గౌరవభావం కలిగింది. ఆమె మీద ఆరాధన ఏర్పడింది. తను కూడా ఆమెలాగా ఆదర్శవంతంగా, నీతి, నిజాయితీతో నలుగురి కోసం ఏదో చేయాలనే తపనను పెంచు కుంది. అప్పట్నుండి అన్నపూర్ణమ్మతో కలిసి మీటింగులకు వెళ్ళేది. వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొనేది, గుడిసెల్లో ఉన్న ఆడవాళ్ళకు చదువుచెప్పడం, కొన్ని సమస్యలను మహిళా సంఘాల ద్వారా పరిష్కరించుకోవడం వంటివి తనకు బాగా నచ్చేవి. అయితే తనకు చదువురాదు. చదువుకోవాలని ఆశగా వుండేది. అదే విషయం వాళ్ళాయనతో చెప్పింది. వెంటనే అక్షరాలు తలుపు వెనుక వ్రాసి నేర్చుకోమని పనికెళ్ళేవాడు కోటమ్మ వాళ్ళాయన. పొద్దున పనికి వెళ్తే సాయంత్రం అయితే కాని వచ్చేవాడు. ఎటూ బయటకు వెళ్ళొద్దనేవాడు. అన్నపూర్ణమ్మతో స్నేహం తెలుసు కాని, ఆమెతోపాటు మీటింగులు, కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి ఆయనకు తెలియదు.
ఒకసారి రామారావు అనే కార్యకర్త వివాహం సంఘం ద్వారా జరిపించారు. వాళ్ళ కులం అమ్మాయే. డబ్బులేని కారణంగా తల్లి తండ్రులు ఒప్పుకోవడం లేదు. అందుకని సంఘం తరపున పెళ్ళి జరిపించారు. అప్పుడు తెలిసింది కోటమ్మ వాళ్ళాయనకు. ఎందుకు లేనిపోని విషయాల్లో తలదూర్చడం, ఎక్కడి నుండో వచ్చాం. మనకెవరూ తెలియదు. సమస్యలెదురయితే కష్టం అన్నాడు.
సర్ది చెప్పింది. నలుగురికోసం మనముంటే, నలుగురు మనకుంటారంది. ఆమాట నచ్చింది ఆయనకు, ఊరుకున్నాడు. పేదరికంలో ఎన్నో సమస్యలు. ఒకపూట అన్నం తిని ఒక పూట గంజి త్రాగి వుండేది. ఎదుటివారికి చేతనైన సాయం చేసేది. ఆ రోజులు ఆనందంగా, స్వతంత్రంగా గడిపినట్టే ఆమె భావన.
తరువాత కాలం గిర్రున తిరిగింది. బంధువులు రాయభారాలు నడిపారు, వెతుక్కుంటూ వచ్చారు, తిరిగి వాళ్ళ ఊరు వచ్చేశారు.
ముగ్గురు పిల్లలకు తల్లయింది. భర్త ఒక్కడే పనిచేస్తే ఇల్లు గడవడం కష్టమయింది. కుటుంబ అవసరాలకు తను పని చేయాల్సి వచ్చేది. పిల్లలను ఉన్నతంగా పెంచాలని, బాగా చదివించాలని భార్యా భర్తలిద్దరికీ వుండేది.
అలా మొదలయ్యింది తన సంపాదన. చిన్న చిన్న వ్యవసాయ పనులకు పోయేది. మొదట్లో కష్టంగా ఉన్నా తరువాత అలవాటు చేసుకుంది. ఎండలో పొలాల్లో పనిచేయడం కష్టంగానే వుండేది. పొలాల్లో వేసే మందులకు కాళ్ళు వాచేవి, పాదాలు చెడి చెదలు తిన్నట్లయ్యేవి, అలవాటు లేని పని బాధగా వుండేది. అయినా తన పిల్లలను చదివించాలి.
చివరికి కూలి పని చేయలేక వ్యవసాయ కూలీలకు అరిసెలు, మురుకులు, బీడీలు, చుట్టలు, అగ్గిపెట్టెలు వంటి అవసరమయిన వస్తువులను గంపలో పెట్టుకొని పొలాల్లోకి తీసుకుపోయి అమ్మేది. పొద్దున్నే కొన్ని తండాల్లో, కుటుంబాల్లో అవసరమయిన వస్తువులను గంపలో పెట్టుకొని అమ్ముకొని వచ్చేది. మళ్ళీ వచ్చి వంటచేసి రాత్రి మురుకులు అరిసెలు వండటానికి బియ్యం తడిపి పెట్టి పగలంతా పొలాల్లో అమ్ముకు వచ్చేది. రాత్రికి పిండి దంచి అరిసెలు, మురుకులు వండి గంపలోకి సర్ది ఎప్పుడో మధ్య రాత్రి నిద్రకుపక్రమించేది.
ఈ మధ్య కాలంలో ఆమె భర్తలో మార్పు వచ్చింది. తాగుడుకు అలవాటు పడ్డాడు. పని చేయాలన్నా చేయలేని స్థితి. చూస్తుండగానే ఆడపిల్లలు పెద్దవాళ్ళయ్యారు. అందరికళ్ళు వాళ్ళమీదే. వీళ్ళకు చదువెందుకు, కోటమ్మ, బ్రహ్మయ్య పిల్లలకు పెళ్ళి చెయ్యగలరా? సంపాదనంతా తాగుడుకే ఖర్చుపెడ్తాడు. ఇలా చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు అనే మాటలకు కోటమ్మకు భయం వేసేది. పెద్ద పిల్ల ఇంటరు, చిన్నపిల్ల 10 వ తరగతిలో వుండగానే ఉన్న ఇల్లు అమ్మి అంతకు దగ్గ గంతలకు ఇచ్చి పెళ్ళి చేసింది. తన బాధ్యత తీరిపోయింది. మిగిలింది మగపిల్లవాడు. వాడెలాగయిన బతుకుతాడు అనుకున్నారు మొగుడూ, పెళ్ళాలు.
అన్ని కష్టాల్లో కూడా ఆనందం వుండేది. తనకు కావలసినంత స్వేచ్ఛ వుండేది. తన లక్ష్య సాధనకు అడ్డూ అదుపూ లేని స్వాతంత్య్రం, శ్రమైక జీవన సౌందర్యాన్ని అనుభవించిన అనుభూతి అంతా ఆనందమే.
పెళ్ళయిన తరువాత కూడా ఆడపిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. కొడుకు పెద్దవాడయ్యాడు. వాడి చదువుకోసం ఉన్న కొద్దిపాటి బంగారం, విలువయిన వస్తువులకు రెక్కలు మొలిచి ఎగిరిపోయినా బాధ కలగలేదు. పైగా ఆనందం. తను ఎక్కడనుండి వచ్చింది? ఏమాత్రం చదువులేని నిరుపేద కుటుంబం నుండి. ఇప్పుడు తన పిల్లలు ఉన్నత విద్యలు సాధించారు. పేదరికం ఛాయలు లేని జీవితాన్ని అనుభవిస్తున్నారన్న తృప్తే కాని…
ఇప్పుడు కోటమ్మకు స్వేచ్ఛ లేదు. తను ఎవరితో మాటాడకూడదు. ఎవరైనా వచ్చినపుడు బయటకు రావద్దు. ఒక సమయం దాటిన తరువాత తన గది దాటి బయటకు రాకూడదు. కొడుకు అపార్టుమెంటు కల్చర్ తన స్వేచ్ఛకు ప్రతిబంధకమయ్యింది. కొడుకు, కోడలు సంపాదన కోసం వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నా తన పిల్లలను పెంచినట్లే మనవరాలిని సాదింది కాని, తన మూలాలు మరచిపోతున్న మనుషుల ప్రవర్తనకు రాజీ పడలేక పోతుంది. వృద్ధాప్యపు ఛాదస్తపు ఆలోచనలు తనవి అని సరిపెట్టు కోలేకపోతుంది.
కోటమ్మ స్నేహితురాలు లచ్చుమమ్మ శ్రీకాకుళం ప్రాంతానికి చెందినది. వంటిపై జాకీటు తొడగని సంప్రదాయం నుండి వచ్చింది. భర్త చిన్నతనంలోనే మరణిస్తే ఒక్క కూతురు – ఒక్క కొడుకును కష్టపడి పెంచింది. బిడ్డ పెళ్ళి చేసింది. కొడుకును చదివించింది, కొడుకు కోసం స్వంత ఊరొదిలి భాగ్యనగరం చేరింది. కొడుకుకి ఓ ప్రైవేటు బడిలో ఉద్యోగం దొరికిన తరువాత మేనకోడల్నిచ్చి పెళ్ళి చేసింది. కోడలు మంచిదే, కొడుక్కు తల్లి పొడ నచ్చలేదు. జాకీటు లేకుండా తిరిగితే పరువు పోతుందంటాడు. చిన్నతనం నుండి అలానే పెరిగింది. ఇప్పుడు తను మారలేదు. కొడుక్కి ఒక వంక దొరికింది తల్లిని వదిలించు కోవడానికి. ఇల్లొదిలి దగ్గరలో గుడిలో ఊడ్చే పనికి కుదిరింది. గుడి మెట్లమీద పడుకునేది.
జీవిత లక్ష్యంగా పెంచిన కొడుకుల్లో ఎంత స్వార్ధం అనేది కోటమ్మ, లచ్చుమ్మల బాధ. తాము జీవితకాలం నీతి, ధర్మం, నిజాయితీతో పెంచిన తమ సంతానంలో ఇంత స్వార్థం ఎందుకు, తమ మూలాలను ఎందుకు మరిచిపోతున్నారు.
కోటమ్మకు ఒకటే ఆలోచన. ప్రపంచీకరణలో భాగంగా కోడలు, కూతుళ్ళు చాలా ముందుకు వెళ్ళారు. తాననుభవించిన స్వేచ్ఛను వారనుభవించలేకపోయారు. వారికి అందిన స్వేచ్ఛను సద్వినియోగ పరుచుకోలేక పోయారేమో అనిపిస్తుంది. ప్రపంచీకరణ అభివృద్ధి మేధస్సుకే కాని మనసు అనే పదార్థం ఏమయింది. కుచించుకుపోయింది. కొంచెం కొంచెంగా మాయమయ్యింది. దీనికి కారణం ఎవరు? ఎవరు బాగు చేయాలి అనేది ఆమెకు అంతుపట్టని ప్రశ్న.
పాల వ్యాను వచ్చినట్టుంది. అయినా తన గది తలుపులు 8 గంటలవరకు తెరువబడవు. విశాల ప్రపంచంలో సంకుచితమయిన గృహ బంధీ తను. ఎక్కడో చదివింది స్వార్ధాన్ని మించిన జాడ్యం లేదు. దాన్ని వదిలి తానే కొన్నింటికి సర్దుకుపోవాలి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక అవసరాల మీద ఆధారపడి ఉన్నాయి మరి. ఇలా ఎంతమంది కోటమ్మలు నిస్సహాయంగా, నిర్వేదంగా చచ్చేదాక బతకాలనే భావనలో ఉన్నారో…
చాలా బాగు0ది. నిజమే.మమతల సంకెళ్ళు తెంచుకుని స్వేచ్చ సాధించామనుకోవడం,మూలాలు మరచి మిధ్యా ప్రపంచంలో మిణుగురు లా తిరగడం ఈ కాలం లో సర్వ సాధారణం అయిపోయింది.కోటమ్మ లాంటి వాళ్ళు ఇప్పుడు కోట్ల సంఖ్యలో వున్నారు.
ఈ కధ లో కోటమ్కోఎందుకు బందీ గా ఉందో చెప్ప లేదు. కధ అలా మొదలు పెట్టి ఆవేశం లో అసలు విషయం మరచిపోయారనిపించింది
సీతారాం గారు,
కథను మల్ల ఒక సారి కింది నుండి మీదికి చదవండి, మీకే అర్థమైతది !