గమనమే గమ్యం -ఓల్గా

‘కన్యాశుల్కం’ నాటకం, ‘పూర్ణమ్మ’ గేయ రూపకం సాంస్కృతిక బృందాల ప్రదర్శనల్లో ముఖ్య భాగమైపోయాయి. పార్టీ సభ్యులు స్వయంగా నటించి కన్యాశుల్కం నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. సుభద్ర, సుబ్బారావు దంపతులు, కోటేశ్వరమ్మలకు కన్యాశుల్కం నాటకంతో బాగా పేరొచ్చింది. పద్మ భయం భయం అంటూనే చక్కగా నటించింది. సూర్యం సంతోషించాడు.

అంతకు ముందొకసారి ముసలి మొగుడిని పెళ్ళి చేసుకోమనే అర్థం వచ్చే పాటలు పాడారని మహిళా సంఘం వాళ్ళని తిట్టి మీకు ముసలివాళ్ళు పనికిరారా అంటూ అర్థం లేని మాటలు మాట్లాడిన కార్యకర్తలకు బాల్య వివాహాల గురించి, వాటి చెడు ఫలితాల గురించి అర్థమైంది. అలాంటి మాటలు వినిపించటం లేదు. తరచూ రచయితల సమావేశాలు జరగటంతో ఆంధ్ర ప్రాంతంలో ఒక చైతన్యం వ్యాపించింది. అది రాజకీయాలకు సంస్కారాన్ని జతగలిపే చైతన్యం. కమ్యూనిస్టులంటే సంస్కారవంతులనీ, స్త్రీలను గౌరవిస్తారనే అభిప్రాయం సామాన్య జనాలలో కూడా ఏర్పడిరది.
… … …
శారద ఇంట్లో టెలిఫోన్‌ హాల్లో కాకుండా గదిలో ఉంటుంది. శారద ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుకోవాలంటే వీలుగా ఉంటుందనీ, హాల్లో అందరి ముందూ పార్టీకి సంబంధించిన విషయాలు మాట్లాడటం మంచిది కాదనీ అలాంటి ఏర్పాటు చేశారు. ఒకరోజు ఉదయం శారద ఆ గదిలోకి వెళ్ళేసరికి మూర్తి మాట్లాడుతున్నాడు.
‘‘శారద ఉంది. విషయం ఏమిటో చెప్పండి. ఔనా? అలాగా? మంచిది. కాముడ్ని ఇక్కడ ఉంచడం కంటే మదరాసులో ఉంచటం మంచిది. మానసిక రోగులకు మద్రాసులో మంచి హాస్పిటల్‌ ఉందిగా’’.
శారద ఒక్క అంగలో ఫోన్‌ దగ్గరకు వెళ్ళి మూర్తి చేతిలో ఫోన్‌ తీసుకుంది.
‘‘హల్లో జోగయ్యా, చెప్పు. కామేశ్వరరావు కేమయింది?’’
ఐదారు నిమిషాలు అవతల వ్యక్తి చెప్పేది శ్రద్ధగా విని ‘‘కామేశ్వరరావుని ఇక్కడికే తీసుకురండి. ఇక్కడ మా ఇంట్లోనే ఉంటాడు. అతని వైద్యం నేను చూసుకుంటాను. ఏం ఫరవాలేదు. ఇబ్బంది ఉంటే నేను చెప్పనా?’’
ఫోన్‌ పెట్టేసి మూర్తి వైపు చూస్తే అతని ముఖం అవమానంతో తెల్లబోవాలో, కోపంతో ఎర్రబడాలో తెలియనితనంతో తెలుపెరుగుల కలగలపుతో ఉంది.
‘‘మూర్తీ, నా తరపున నువ్వు మాట్లాడాల్సిన పని పెట్టుకోకు. అది మనిద్దరికీ మంచిది కాదు. పార్టీ పనుల విషయాలు ముఖ్యం. మన సంబంధం ఎంత దగ్గరిదైనా నేను పార్టీలో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సభ్యురాలిని’’.
అక్కడినుంచి వెళ్ళిపోతూ ‘‘కామేశ్వరరావుకి పైన మేడమీది గది సిద్ధం చేయమని అమ్మతో చెప్తాను. మనం కొన్ని రోజులు కింద గదిలోకి మారదాం’’ అంది.
‘‘నీ ఇష్టం’’ మూర్తి కోపాన్ని అణచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
శారద అది గమనించినా గమనించనట్లు బైటికి వెళ్ళిపోయింది.
కామేశ్వరరావు బెంగాల్‌లో కరవు ప్రాంతాలను చూడడానికి వెళ్ళిన ఆంధ్ర బృందంతో పాటు వెళ్ళాడు. అక్కడి పరిస్థితులను చూసి తట్టుకోలేక మతిస్థిమితం తప్పింది. ఈ కబురు ఈ ఫోన్‌ రాకముందే తెలిసింది. అతన్ని తన ఇంట్లో ఉంచుకుని నయం చేసి పంపాలని శారద అనుకుంది. మూర్తితో చెప్పింది. మూర్తి విని ఊరుకున్నాడు. మూర్తికి అభ్యంతరం ఉంటుందని శారదకు కాస్త కూడా సందేహం రాలేదు.
ఇప్పుడు అతన్ని మద్రాసు పంపమనే సలహాను ధారాళంగా ఇస్తున్న మూర్తిని చూస్తే కోపం వచ్చింది.
నాలుగైదు రోజులు ఇద్దరిమధ్యా ముభావంగా, ముక్తసరి మాటలతో నడిచాక మూర్తి భరించలేకపోయాడు.
‘‘శారదా.. ఇది ఇల్లు, హాస్పిటల్‌ కాదు. కామేశ్వరరావుని ఆస్పత్రిలో ఉంచటం మంచిదని నాకనిపించింది. అందులో తప్పేముందో నాకర్ధం కావటంలేదు’’. శారదకు మూర్తిని చూస్తే జాలేసింది. ఇన్నేళ్ళుగా తన ఇంటికి సంబంధించిన నిర్ణయాలన్నీ తనే తీసుకునే అలవాటున్నవాడు. ఆడవాళ్ళు అమాయకులు, అజ్ఞానులు, బలహీనులు అనే ఆలోచన బాగానే ఒంటబట్టి ఉంటుంది. తను తీసుకునే తప్పు నిర్ణయాలు సరిదిద్ది తన ఇంటిని, జీవితాన్ని చక్కదిద్దాలనుకుంటున్నాడు. సున్నితంగా తెలియజెప్పాలి.
‘‘తప్పేంలేదులేవోయ్‌. ఈ విషయం గురించి మనిద్దరికీ వేరు వేరు అభిప్రాయాలున్నప్పుడు ఇద్దరం మాట్లాడుకుని నిర్ణయించుకోవాల్సింది. అలా చెయ్యకపోవటం ఇద్దరి తప్పూనూ. మనకిది కాక చెయ్యటానికి చాలా పనులున్నాయి. రేపు కాముడొస్తున్నాడు కూడా. అదుగో అలా ముఖం ఎర్రగా పెట్టుకోకు. ముద్దొస్తావు’’ అంటూ మూర్తి నుదుటిన ఒక ముద్దు పెట్టి వెళ్ళింది శారద. మూర్తి కాస్త చల్లబడ్డాడు.
మర్నాడు కామేశ్వరరావు వచ్చాడు. ఇల్లంతా సందడయింది. అతన్ని చూడటానికి ఎంతోమంది వస్తున్నారు. అందరిలో శారద కొందరిని మాత్రమే అతని దగ్గరకు పంపిస్తోంది. అది చాలామందికి కోపం తెప్పించింది.
కామేశ్వరరావు ఉన్న స్థితిలో అందరినీ ఒక్కసారే చూడటం ప్రమాదమని ఎంత చెప్పినా ముఖం గంటుపెట్టుకునే వెళ్తున్నారు.
శారద హాస్పిటల్‌ పని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముగించుకుని కామేశ్వరరావు దగ్గరకొచ్చి కూర్చుంటోంది.
మందులతో పాటు మాట్లాడటం, అతనిచేత మాట్లాడిరచటం కూడా అవసరం.
మెల్లిగా కామేశ్వరరావు బెంగాల్‌లో తను చూసిన బీభత్సం గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు.
శారద ఆ బీభత్సం వెనకాల ఉన్న మానవ క్రూరత్వాన్ని గురించి, ఆర్థిక కారణాల గురించి వివరించి చెబుతోంది.
మూర్తికి పార్టీ పనులతోనే సరిపోతోంది. మనసంతా అసంతృప్తితో నిండిపోతోంది. పార్టీ పనులలో అతనికి సహాయం చేసే వాళ్ళు తక్కువవుతున్నారు. స్థానిక సమస్యలు తెలియని వాడు పైనుంచి వచ్చాడనే అసహనం తెలియకుండానే అందరి మనసుల్లో తిష్ట వేసుకుంది.
శారదకు పార్టీ పనులు అసలు లేవని కాదు గానీ అవి ఆమెకు నల్లేరు మీద నడక. ముఖ్యంగా మహిళా సంఘం పనులు ఆమె చక్కబెట్టాలి. శారదంటే మహిళా సంఘంలో అందరికీ గౌరవమే. పనులు చకచకా జరిగిపోతున్నాయి. హాస్పిటల్‌లో శారద ఉందంటే రోగులందరికీ ధైర్యం. గర్భిణీ స్త్రీలకు, ప్రసవానికొచ్చిన స్త్రీలకైతే అదొక ఆటవిడుపులా ఉండేది. శారద నవ్వుతూ, నవ్విస్తూ, గలగలా మాట్లాడుతూ హాస్పిటల్‌ని విశ్రాంతి మందిరంలా చేసేది. శారద లేనప్పుడు సుభద్రమ్మ ఇంకో పద్ధతిలో వాళ్ళను బాధ్యతగా చూసుకునేది.
ఇంట్లో వంట బాధ్యతలన్నీ ఒకప్పుడు సుబ్బమ్మవి. ఇప్పుడు పద్మ వచ్చి ఆమెకు విశ్రాంతినిచ్చింది. శారదకు ఆ బాధ్యత ఎన్నడూ లేదు. వచ్చేపోయే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించి పంపటమే. పార్టీ నాయకులు తరచుగా వచ్చేవారు. శారద అవసరమైతే వారితో కూచునేది, లేకపోతే పలకరించి తన పనుల మీద తాను వెళ్ళేది. ఇంటి ఖర్చుల వివరాలు మాత్రం కనుక్కొని డబ్బు ఎంత కావాలో అంతా ఉండేలా చూసేవాళ్ళు శారద, సూర్యం.
ఇంటికి ఏ వేళప్పుడు ఎవరొచ్చినా వారి ఆకలి తీరాల్సిందే. మర్యాదలు జరగాల్సిందే.
మూర్తి ప్రాక్టీసు వదిలి వచ్చాడు. అతని ఆస్తి పాస్తులన్నీ మద్రాసులో కుటుంబానికి ఏ లోటూ లేకుండా చూసేందుకు వీలైనట్టు చేసి వచ్చాడు. అలా చేసేదాకా శారద ఊరుకోలేదు. మద్రాసు వెళ్ళి అప్పుడప్పుడూ వాళ్ళ మంచీ చెడ్డా చూసి రమ్మని మరీ మరీ చెప్పేది.
ఇక్కడ అతనికి ఏ లోటూ లేదు. శారద పేదవారికి ఉచితంగా వైద్యం చేస్తూ ఇవ్వగలిగిన వారినుంచి వారిచ్చినంత తీసుకునేది. సంపన్న కుటుంబాల వాళ్ళకు శారద హస్తవాసి మీద నమ్మకం. ధారాళంగానే ఇచ్చేవారు. వాళ్ళింట్లో పొలాల్లో పండే సమస్త పదార్ధాలూ పంపేవారు. పొలాల సంగతి సూర్యం బంధువుల సాయంతో, శారద సలహాలతో చూసుకునేవాడు. మేనమామలంటే శారదకు, సూర్యానికి చాలా ప్రేమ, గౌరవం.
ఇల్లు, హాస్పిటలు, పార్టీ పనులు… అన్నిటినీ శారద సమర్థతతో నిర్వహిస్తోన్న తీరు చూస్తే మూర్తికి ఒకవైపు సంతోషం, ఇంకోవైపు ఆశ్చర్యం, మరోవైపు తెలియని బాధ. వీటిలో ఎప్పుడు దేనిది పైచేయి అవుతుందో అతనికే తెలిసేది కాదు. దాంతో మనసులో ఎప్పుడూ ఒక అసంతృప్తి ఉండేది. శారద దానినంత గమనించలేదు.
కామేశ్వరరావు ఉన్నన్ని రోజులూ శారదకు మరో విషయం ఆలోచించటానికి కూడా తీరికలేకుండా పోయింది. ఒక్కోరోజు హాస్పిటల్‌కి కూడా వెళ్ళేది కాదు. రాత్రింబగళ్ళూ అతనితో మాట్లాడుతూ కూర్చోవాల్సి వచ్చేది.
మూర్తి ఒంటరితనం భరించలేకపోయేవాడు. శారద తన భార్య అనే విషయం పదే పదే గుర్తొచ్చేది. గుండెలో అహం తన్నుకొచ్చేది. కానీ ఏం చెయ్యాలో తెలిసేది కాదు.
ఒకసారి నాలుగు రోజులు వరుసగా హాస్పిటల్‌కి వెళ్ళలేదు శారద. మూర్తి పైకి వెళ్ళి గొడవ పెట్టుకోకుండా ఉండలేని స్థితికి వచ్చాడు. మూర్తి మేడ మెట్టెక్కి వస్తుంటే శారద మెట్లు దిగి వస్తోంది.
‘‘ఇవాళ కూడా హాస్పిటల్‌కి వెళ్ళవా?’’
‘‘ఓపిక లేదు మూర్తీ! రాత్రంతా కాముడు నిద్రపోనివ్వలేదు. ఇప్పుడే అతను నిద్రపోయాడు. నాకూ కాసేపు పడుకుంటే కానీ ఓపిక రాదు.’’
‘‘కానీ ఇన్ని రోజులు వెళ్ళకపోతే హాస్పిటల్‌ ఎలా నడుస్తుంది?’’
‘‘ఏం ఫరవాలేదు. సుభద్ర ఉందిగా. పాపం తనకి డిగ్రీ లేదనే గానీ చాలా అనుభవం, తెలివైనది. నేను చేసినంత తనూ చెయ్యగలదు. ఈ నాలుగు రోజుల్నుంచీ రోజుకిద్దరు ప్రసవం అయ్యారట. కంగారేం లేదని కబురు చేసింది. నేను సాయంత్రం వెళ్తాను. సుభద్ర నాకు కుడిభుజం అంటారే, అలాంటిది. హాస్పిటల్‌ గురించి నువ్వేం కంగారు పడకు. కాముడు మరో నెల రోజుల్లో మామూలవుతాడు. పాపం ఒకటే ఏడుస్తాడు. ఏమన్నా తినాలంటే ఆకలికి చచ్చినవాళ్ళను తిన్నట్టుందంటాడు. మాటల్లో పెట్టి, చిన్నపిల్లాడికి చెప్పినట్లు కథలు చెప్పి తినిపించాలి. నిద్ర పెద్ద సమస్యయింది. కళ్ళు మూసుకుంటే అవే కనిపిస్తున్నాయతనికి’’ మాట్లాడుతూనే తన గదిలోకి వెళ్ళి పడుకుంది శారద.
మూర్తికి శారద ప్రతిమాటా తప్పుగానే అర్థమైంది.
సుభద్ర హాస్పిటల్‌ చూడటమేంటి. ఆమె పార్టీ మనిషే. పార్టీలో కూడా చాలా బాధ్యతగా పనిచేస్తుంది. కానీ ఆమెకు హాస్పిటల్‌ అప్పగించి శారద ఈ పిచ్చివాడికి అన్నం తినిపించి, నిద్రపుచ్చే అల్పమైన పనులు చేయటమేంటి.
ఇలా దీన్ని సాగనియ్యకూడదు. ఇవాళ కాముడు, రేపింకొకడు… ఇప్పటికే బయట గుసగుసలు వినిపిస్తున్నాయి. మేడమీది గదిలో కామేశ్వరరావు, డాక్టరమ్మ ఉంటుంటే మూర్తిగారు కింద ఉంటున్నారని. తనకు శారద సంగతి తెలుసు. ఊళ్ళో అందరికీ ఏం తెలుసు?
భర్త ఇంట్లో ఉండగా తను వేరే మగాడితో వేరే గదిలో రాత్రింబగళ్ళూ గడుపుతుందంటే ఏమనుకుంటారు? అది శారదకెందుకు అర్థం కాదు. దీన్ని ఎక్కడో ఒకచోట ఆపాలి.
ఇల్లూ, ఊరూ అంతా హడావుడిగా ఉంది. బెంగాల్‌ కరువు గురించి సభలు, నాటక ప్రదర్శనలు, బుర్ర కథలు…
ఈ హడావుడి కొంత తగ్గాక ఒకరోజు మూర్తి సుభద్రను పార్టీ ఆఫీసుకు రమ్మని కబురు చేశాడు.
సుభద్ర పార్టీ ఆఫీసు పిలుపు అనగానే కాళ్ళు తొక్కుకుంటూ వచ్చింది. తీరా మూర్తి చెప్పింది వినగానే ఆమెకు చాలా సంతోషమనిపించింది.
‘‘ఆస్పత్రిలో ఉద్యోగం మానేసి పూర్తి కాలం పార్టీ కార్యకర్తగా పనిచేయటానికి వచ్చెయ్యాలి’’.
సుభద్రకు పార్టీ అంటే ప్రాణం కన్నా ఎక్కువ. పార్టీ కోసం ఏం చెయ్యటానికైనా ఆమె సిద్ధమే. అలాంటిది పార్టీనే లోకంగా బతకటమంటే సుభద్రకు అంతకంటే కావలసింది ఏముంది. కానీ ఆస్పత్రి పనీ ఇష్టమే. అక్కడా తను అవసరం. అందువల్ల తటపటాయించింది.
‘‘డాక్టరుగారితో ఒక్క మాట చెప్తాను. తర్వాత నిర్ణయం తీసుకుంటా. మా ఆయనతో కూడా చెప్పాలనుకోండి. కానీ ఆయన కాదనరని నా నమ్మకం’’. ఒక రకమైన ఉద్వేగంలో ఉంది సుభద్ర.
‘‘చూడమ్మా, డాక్టరుగారు కూడా పార్టీ ఆదేశానికి కట్టుబడి ఉండాల్సిందే. నేను ఆమె భర్తనే కాదు. జిల్లా పార్టీ నాయకుడినని నీకు తెలియదా? నేను నిర్ణయించి చెప్తున్నాను. నువ్వింకెవరినీ అడగక్కరలేదు. ఎవరి అనుమతీ తీసుకోనవసరం లేదు. పార్టీ నిర్ణయం, ఔనంటావా? కాదని పార్టీని ధిక్కరిస్తావా?’’
సుభద్ర కంగారుపడిపోయింది. పార్టీ ఆదేశం ధిక్కరించటమే! ప్రాణం పోయినా తనా పని చెయ్యదు.
‘‘నాకు ఇష్టమేనండీ. మీరే పని ఇస్తే అది చేస్తాను’’.
మూర్తి ఆమెకు ఆ క్షణం నుంచే పని చెప్పాడు. ఇట్నించి ఇటే ఆమె మహిళా సంఘానికి సంబంధించిన పని కోసం వెళ్ళాలి. ఆస్పత్రికి గానీ, ఇంటికి గానీ వెళ్ళే అవకాశం లేదు. పని పూర్తి చేసుకుని రాత్రికి ఇల్లు చేరుకోవచ్చు. సుభద్ర వెళ్ళిపోయాక మూర్తి బాధ, భయం, సంతృప్తి, ఉపశమనం ఇవన్నీ కలిసిన మనసుతో ఏ పనీ చెయ్యలేక పుస్తకం తీసి మనసు లగ్నం చేయటానికి ప్రయత్నిస్తూ కూర్చున్నాడు.
సాయంత్రం హాస్పిటల్‌ నుంచి కబురందుకుని వచ్చిన శారద అక్కడ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయింది. ఇద్దరు స్త్రీలు నొప్పులు పడుతున్నారు. పట్టించుకునేవాళ్ళు లేరు. ఉన్న ముగ్గురు నర్సులు ప్రసవానికి సంబంధించిన అనుభవం ఉన్న వాళ్ళు కాదు. మరో ఆలోచన లేకుండా వాళ్ళిద్దరినీ లేబర్‌ రూంకి చేర్పించింది. ఇద్దరినీ హుషారు చేస్తూ, అనునయిస్తూ ప్రసవం స్త్రీ శరీరంలో చేయగల ఎంత గొప్ప కార్యమో బోధిస్తూ వారి నుదుటి మీద ముద్దులు పెడుతూ వారిని సిద్ధం చేసింది.
ఇద్దరూ కనేసరికి దాదాపు మూడు గంటలు పట్టింది. ఒక్కతే అక్కడి పనంతా సంబాళించుకునే సరికి మరో గంట పట్టింది.
బైటికి వచ్చి చూస్తే ఆ రోజు డాక్టరు గారి దగ్గర చూపించుకోటానికి వచ్చిన వాళ్ళతో హాలు, వరండా కిటకిటలాడి పోతున్నాయి.
చకచకా ఒక్కొక్కరినే నవ్వుతూ పలకరిస్తూ, ‘‘అలా చేస్తే ఎలాగోయ్‌ నీ ఆరోగ్యం గురించి నువ్వే పట్టించుకోకపోతే ఎవరికి పడుతుంది. వేరే ఏమీ చెయ్యొద్దు. రోజూ అన్నంలో ఆకుకూర పప్పో, పచ్చడో చేసుకు తిను. సాయంత్రం ఒక వేరుశనగ పప్పుండ తిను. నెల రోజుల్లో నీరసం, గీరసం ఎగిరిపోతుంది. రక్తం పట్టాలోయ్‌ నీకు’’.
‘‘మా ఆయన ఆకుకూర ఇంట్లోకి రానివ్వరు’’.
‘‘నువ్వు తిను. ఆయనకు పెట్టకు’’.
‘‘అలా ఎలా కుదురుతుంది డాక్టరుగారూ…’’
‘‘ఎందుకు కుదరదు. గుప్పెడు కూర నీ కోసం నువ్వొండుకోలేవా? ఇంటిల్లిపాదికీ వంట చేస్తావు. ఈ స్వతంత్రం లేదా… మీ ఇల్లెక్కడ?’’
‘‘మీ ఇంటి దగ్గరేనండి’’.
‘‘ఇంకేం రోజూ పన్నెండిరటికి మా ఇంటికి రా. ఎవర్నయినా పంపు. నీకు కావలసిన ఆకుకూర మా అమ్మ చేయించి పెడుతుంది. అట్లాగే ఒక పప్పుండ ఇస్తుంది. సరేనా?’’
వెంకమ్మ లేచి శారద రెండు కాళ్ళూ పట్టుకుంది.
‘‘ఛీ! ఛీ! అదేం పనోయ్‌. నువ్వు వెళ్ళు. బైట ఎంతమందున్నారో చూశావుగా’’.
వెంకమ్మ లాంటి ఎందరికో శారద అంటే పిచ్చి ఆరాధన. పనంతా ముగించుకుని చిన్న నర్సు సరస్వతిని అడిగింది.
‘‘సుభద్రమ్మకి ఏమయింది? ఒంట్లో బాగాలేక ఇంటికెళ్ళిందా?’’
‘‘తెలియదమ్మా. మధ్యాహ్నం ఎవరో వచ్చి పిల్చుకెళ్ళారు. పార్టీ ఆఫీసుకి వెళ్తున్నాను. అరగంటలో వస్తానంది. మళ్ళీ రాలేదు.’’
దాన్ని గురించి శారద పెద్దగా ఆలోచించలేదు. ఇంత సమయం పడుతుందనుకుంటే ఎవరో ఒకరి చేత తనకు కబురు చేసే పని గదా అనుకుని ‘‘ఒకోసారి అదీ కుదరదు. అందరం ఎంత కష్టపడుతున్నాం. ఇల్లు, పని, పార్టీ పని, సుభద్రకు పిల్లలు కూడా. ఎంత ఓపికగా అన్నీ చక్కదిద్దుకుని వస్తుందో. తనకు ఇంట్లో అమ్మ ఎంత అండగానో ఉంది కాబట్టి గానీ…’’ అనుకుంటూ ఒకసారి హాస్పిటల్‌లో ప్రసవమయ్యి ఉన్న వారినీ, ప్రసవానికని వచ్చి చేరిన వారందరినీ పలకరించి, వారిని నవ్వించి ఇంటికి బయల్దేరింది.
ఇల్లు చేరేసరికి అలసట కమ్ముకొచ్చింది. అన్నం కూడా తినకుండా నిద్రపోవాలనిపించింది. కానీ మూర్తీ, సుబ్బమ్మా ఊరుకోలేదు. మూర్తి మరీ మరీ బుజ్జగించి తినిపిస్తుంటే సుబ్బమ్మ ముసిముసిగా నవ్వుకుంటూ అవతల గదిలో కూచుంది. కడుపు నిండేసరికి శారదకు ఉత్సాహం వచ్చింది. గబగబా లేచి తాంబూలం చుడుతూ
‘నను పాలింప నడచి వచ్చితివో.. నా ప్రాణ నాధ’ అంటూ త్యాగరాజ కృతి అందుకుంది. మూర్తి గొంతు కలిపాడు.
‘వనజనయన మోమును జూచుట జీ
వనమని నెనరున`మనసు మర్మము దెలసి’
అని అతను పాడితే మళ్ళీ శారద పల్లవి అందుకుంది.
ఇద్దరి మనసుల్లో పట్టరాని ప్రేమ. మూర్తి శారద చుట్టూ చేతులు వేసి నడిపిస్తుంటే శారద ఒళ్ళూ, మనసూ పులకరించింది.
‘‘మూర్తి ప్రేమ ఉంటే చాలు. ఎంత పనైనా చేసేస్తా’’ అనుకుంది. అతని కౌగిలిలో నిశ్చింతగా నిద్రపోయింది.
‘‘నిన్న ఎంత అలిసిపోయానో. సుభద్ర లేదు. పనిమీద వెళ్తున్నానని నాకు కబురు చెయ్యనూ లేదు. రెండు కాన్పులు, యాభై మందికి పైగా జనం. నువ్వు చేసిన ఉపచారం వల్లగానీ లేకపోతే ఇవాళింత హుషారుగా లేవలేకపోయేదాన్ని’’.
‘‘ఉపచారము చేసే వారున్నారని మరువకుమా’’ అన్నాడు మూర్తి.
‘‘మరువకురా… త్యాగరాజు కీర్తనలో ఒక్కక్షరం కూడా మనం మార్చకూడదు’’ సీరియస్‌గా అంది శారద. ‘‘సరేరా’’ అన్నాడు మూర్తి సరదాగా. ఇద్దరూ నవ్వుకుంటూ లేచారు. సుభద్ర వరసగా రెండు రోజులు రాలేదు. శారదాంబ ఇక ఊరుకోలేక సుభద్ర ఇంటికి వెళ్ళింది.
ఇంట్లో సుభద్ర లేదు. ఆయన పిల్లలకు ఒండి పెడుతున్నాడు. శారదను చూసి హడావుడి పడుతూ ఏం చెయ్యాలో తెలియనట్టు నుంచున్నాడు.
‘‘సుభద్ర లేదా?’’
‘‘లేదు. పార్టీ పనిమీద మచిలీపట్నం వెళ్ళింది’’.
‘‘పార్టీ పనిమీదా…’’
‘‘ఔనమ్మా. ఇప్పుడామె కూడా నాలాగే పూర్తికాలం కార్యకర్త కదా. ఇద్దరం అవస్థ పడుతున్నాం. కానీ అలవాటవుతుందిలే…’’
‘‘నాకు చెప్పనే లేదు.’’
‘‘ఎక్కడమ్మా… మూడ్రోజుల నాడు పార్టీ ఆఫీసు నుంచి వచ్చి రెండు చీరెలు సంచీలో పెట్టుకు వెళ్ళింది. రేపు పొద్దున వస్తుంది. నాకే ఏ సంగతీ సరిగా తెలియదు. పిల్లలకూ ఆమెనొదిలి ఉండడం అలవాటు లేక తిప్పలు పడుతున్నారు.’’
శారదకు మనసంతా చేదయింది. ఇదంతా మూర్తికి తెలుసు. తెలియటమేమిటి అతనే చేసి ఉండాలి. తనకు ఒక్కమాట కూడా చెప్పలేదు. చెప్పే వ్యవధానం సుభద్రకు ఇవ్వలేదు.
‘‘రేపొకసారి సుభద్రను రమ్మన్నానని చెప్పండి’’ అంటూ బైటికి నడిచింది. మూర్తితో ఈ విషయం మాట్లాడాలని కూడా అనిపించలేదు శారదకు. మనసు ఎడారయినట్లయింది.
అతనింత పని చేసి ఆ రోజు రాత్రి తనతో…
కళ్ళల్లోకి నీళ్ళు చిమ్ముకొచ్చాయి. తమాయించుకుంటూ ఆస్పత్రికి వెళ్ళింది. వెళ్ళేలోపే గుండె దిటవు చేసుకుంది. సుభద్ర తనకు కుడి భుజమే, కానీ తను ఎడం చేతితో ఎక్కువ పనులు చేస్తుంది. చేసుకోగలుగుతుంది. ప్రాక్టీసు పెట్టిన దగ్గర నుంచీ ఉన్న సుభద్రకు అన్నీ తెలుసు. పోన్లే… పార్టీలో ఎదుగుతుంది. సుభద్ర గురించి కాదు, మూర్తి సంగతేంటి?
ఆ రోజు సాయంత్రం పని ముగించుకుని డాక్టర్‌ రంగనాయకమ్మ గారి హాస్పిటల్‌కి వెళ్ళింది శారద. ఆమె దగ్గర ఎప్పుడూ ఒకరిద్దరు అనాధ స్త్రీలు నర్సులుగా శిక్షణ పొందుతూ బతుకుతుంటారు. ఎవరినైనా తన దగ్గరకు పంపితే వాళ్ళు కాస్త తెలివైన వాళ్ళయితే సుభద్ర లేని లోటు తీరుతుంది. లేకపోతే తనకు హాస్పిటల్‌లో చాలా కష్టమవుతుంది.
రంగనాయకమ్మ గారికి కాన్పు కేసు ఉండి లేబర్‌ రూంలో ఉండడంతో, శారద చనువుగా ఇంట్లోకి వెళ్ళింది. చలంగారు, పద్మావతి గారు, ఇంకొంతమంది కూర్చుని ఉన్నారు.
పద్మావతి శారదను గుర్తుపట్టి లేచి వచ్చింది.
‘‘బాగున్నారా డాక్టర్‌’’ అంటూ కావలించుకుంది. మద్రాసులో రెండు కుటుంబాల మధ్యా స్నేహం ఉండేది. శారదను ‘అక్కా’ అని పిల్చేది పద్మావతి.
‘‘నువ్వెంత బాగున్నావు పద్మా. చాలా అందంగా ఉన్నావు’’ అంది శారద.
‘‘అందుకే సినిమావాళ్ళు వెంటపడుతున్నారు’’ చలంగారు చురక వేశారు.
‘‘మీ స్నేహితురాలుండేది. ఏం పేరు… గుర్తుకు రావటం లేదు. వాళ్ళమ్మ ఇంకో అమ్మాయిని చేరదీసింది. రాజ్యం అని. ఆ పిల్ల ఇప్పుడు సినిమా ప్రపంచానికి రాణి. చాలా అందమైనదిలే. నటన కూడా తెలుసు. మీ స్నేహితురాలేం చేస్తోంది?’’
‘‘ఢల్లీిలో ఉందనుకుంటా. మంచి ఉద్యోగం, భర్త, పిల్లలు, సంసారంలో పడిపోయింది.’’
‘‘మంచి పని చేసింది. నాకు ఇల్లూ, నాటక కళా రెండూ కావాలని కష్టపడుతున్నాను. నువ్వు రాజకీయాలు, వైద్యం, ఇల్లు ఎట్లా చూసుకుంటున్నావక్కా’’
‘‘రాజకీయాలు ఆయన చూసి పెడతాడు. ఇల్లు వాళ్ళమ్మ చూసి పెడుతుంది. వైద్యం మాత్రమే ఆమె చూసుకుంటుంది. మన వొయ్యి లాగానే’’ అన్నారు చలం.
డాక్టర్‌ రంగనాయకమ్మను కుటుంబంలో అందరూ వొయ్యి అంటారు.
శారద ఆయన వంక ఆశ్చర్యంగా చూసింది. ఆయన తన గురించి అన్ని మాటలు మాట్లాడటం అదే మొదటిసారి.
శారదకు ఒక్క క్షణం ఆయనకు తన బాధ చెబుదామా అనిపించింది. మరుక్షణంలో ఆ ఆలోచనని తుడిచేసింది. తన సమస్య తానే పరిష్కరించుకోవాలి. మరెవరికీ ఆ శక్తి ఉండదు. తన సమర్ధురాలని ముందు తను నమ్మాలి. ‘‘నా రాజకీయాలు నేనే చూసుకుంటాను. నా పనులు నావే. ఇల్లంటారా? ఇల్లు ఇంకా ఫ్యూడల్‌ దశలోనే ఉంది కాబట్టి మా అమ్మ, ఆవిడ కోడలూ దాన్ని పట్టుకుని ఒదలటం లేదు. ఒదిలిన రోజు దాన్ని నేననుకున్నట్టు ఒక సామాజిక ప్రదేశంగా చేసేస్తాను. వైద్యం నేనే చేస్తానని మీరే ఒప్పుకున్నారు కాబట్టి పేచీ లేదు’’ అని గలగలా నవ్వింది శారద.
‘‘నీ నవ్వు వల్ల నీ మాటలు నమ్ముతున్నాను’’ అన్నారు చలం శారదను మెచ్చుకోలుగా చూస్తూ.
‘‘శారద గురించి నీకు తెలిసింది తక్కువ. ఎక్కువ మాట్లాడొద్దు. ఆమెలాంటి మనుషులుండరు’’ అంది పద్మావతి.
‘‘తక్కువ కాదు, అసలు మాట్లాడను’’ అంటూ మౌనంలోకి వెళ్ళిపోయారాయన. పద్మావతి సుబ్బమ్మగారెలా
ఉన్నారని అడిగింది.
‘‘ఒకసారి వచ్చి చూడరాదూ. అమ్మ సంతోషిస్తుంది. నీ గురించి ఎప్పుడూ తల్చుకుంటుంది. మీరు వేసే నాటకాల వంటివి పద్మావతి కూడా వేయరాదా అని గొణుగుతుంటుంది’’.
పద్మావతి నవ్వేసింది ‘‘ఏదో ఒక నాయకాలు వెయ్యమనే అమ్మ ఉంది నీకు. అదృష్టవంతురాలివి.’’
‘‘మీ ఆయనేమంటున్నారు? ఎలా ఉన్నాడు?’’
‘‘ఎప్పుడూ అనేదే. కొత్త ఏముంది. ఆయన సహకారం లేనిదే నా కళారాధన కుదురుతుందా?’’
శారద నవ్వుతూ ‘‘వెళ్ళేలోగా మా ఇంటికొక్కసారి రా’’ అంటుండగా రంగనాయకమ్మ వచ్చింది.
‘‘ఏంటి శారదా, నీకు మా ఇంటికొచ్చేంత తీరికెలా దొరికింది’’
‘‘తీరుకుండి కాదు, పనుండి వచ్చాను’’
శారద తనెందుకొచ్చిందో చెప్పింది. రంగనాయకమ్మ లేచి ‘‘రా హాస్పిటల్‌కి వెళ్దాం. ఒకమ్మాయిని చూపిస్తా. నీకు నచ్చితే తీసుకుపోదువు గానీ…’’ ఇద్దరూ లేచి హాస్పిటల్‌కి వెళ్ళారు.
శారదకు లక్ష్మి బాగా నచ్చింది. అంత బాగా నచ్చకపోయినా తీసుకునేదే. రంగనాయకమ్మకు థాంక్స్‌ చెప్పి లక్ష్మిని రెండు రోజుల్లో తన దగ్గరకు రమ్మని చెప్పింది. లక్ష్మి కొత్తచోటు ఎలా ఉంటుందోనని భయపడుతుంటే ‘‘ఈ దేశంలోనే ఆమెకంటే మంచి మనిషి ఉండరు. హాయిగా వెళ్ళు. మళ్ళీ నేనిటు రమ్మన్నా రావు’’ అంది రంగనాయకమ్మ.
లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తుంటే ‘‘నేను చెప్పింది నిజమే. ఆమెలాంటివాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు. నీ జీవితానికి మంచి దారి చూపిస్తుంది’’ అంది. లక్ష్మి భర్తనొదిలేసి వచ్చి రంగనాయకమ్మని ఆశ్రయించింది. ఆమె పడ్డ బాధలన్నీ విని డాక్టర్‌గా అన్ని రకాల వైద్యాలు చేసి, తన దగ్గరే ఉంచుకుంది. అలా వాళ్ళింట్లో ఎప్పుడూ నలుగురైదుగురు ఉండేవారు. కొందరు పిల్లలని డాక్టర్‌ గారి దగ్గర ఒదిలేసేవారు. వాళ్ళు ఆ ఇంట్లో పిల్లలతో పాటు పెరిగేవారు. డాక్టర్‌గా ఆమె వారిని చేరదీస్తే, చలం తన పిల్లలతో పాటు వారికీ ప్రేమాభిమానాలు పంచేవాడు. అదొక సామాజిక కుటుంబంగా చూసేవారికి కొత్తగా, వింతగా, కొందరికి రోతగా అనిపించేది.
రెండు మూడు రోజులు మూర్తి, శారదల మధ్య ముభావంగా గడిచిపోయాయి. ఇద్దరికీ మాట్లాడాలని ఉంది గానీ ఎవరూ చొరవ తీసుకోలేదు. మూర్తికి ఇంతలో మద్రాసు వెళ్ళాల్సిన పనిబడిరది.
‘‘నువ్వూ రారాదూ’’ అని అడిగాడు.
‘‘రాను, నాకు చాలా పనులున్నాయి’’ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
మూర్తి వెళ్ళాక ఒక రోజంతా ఆస్పత్రి పనులతో తీరిక లేకుండా గడిచింది. చాలా రోజుల నుండీ చేయించాల్సిన చిన్న రిపేర్లు, పాతబడిన వస్తువులు తీసెయ్యటం, కొత్తవి తెచ్చి సర్దటం… అందరితో కలిసి శారద కూడా పనిచేస్తోంది. సంక్రాంతి నెల. కాన్పుల కోసం తప్ప ఆస్పత్రికి ఎక్కువ మంది రారు. కాస్త తీరిక దొరికింది.
మహిళా సంఘం మీటింగులతో మరో రెండు రోజులు గడిచిపోయాయి. అనేక నిర్ణయాలు తీసుకున్నారు. శారద కూడా అదనపు బాధ్యతలు తీసుకోక తప్పలేదు. సుభద్రతో స్నేహంగా మాట్లాడి ఆమె బెరుకు పోగొట్టింది. రెండు రోజుల పాటు అంతమంది స్త్రీలతో గడిపి అందరి సమస్యలూ పంచుకునేసరికి శారద మనసు కూడా ఉల్లాసంగా మారింది. ముఖ్యంగా సుభద్ర తను పూర్తికాలం పార్టీ కార్యకర్త అయినందుకు పడే సంతోషం, గర్వం చూశాక, పార్టీ అంటే ఆమెకున్న అంకితభావం చూశాక మూర్తి చేసిన పని సబబుగానే తోచింది.
‘తనతో చెప్పలేదే’ అన్నదొక్కటే కలుక్కుమంటోంది మనసులో. ఆ సాయంత్రం మీటింగు ముగిశాక అందరూ వెళ్ళిపోయారు. మెల్లీ మాత్రం మిగిలింది.
‘‘నువ్వేమిటో బాధ పడుతున్నావు చెప్ప’’మని ఒత్తిడి చేసింది. మెల్లీ తనను అంతగా పరిశీలించి అర్థం చేసుకున్నందుకు ఆశ్చర్యపడుతూ అంతా చెప్పింది శారద.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.