రమ తన కుర్చీలో మౌనంగా కూర్చొని ఉంది. స్వాతి ఎదురుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఇద్దరికీ గత మూడు నెలల్లో ఒక కేసు విషయమై జరిగిన సంఘటనలు డైలీ సీరియల్‌లో సీన్ల మాదిరి గిర్రుమని తిరిగాయి…
మూడు నెలల క్రితం ఫీల్డ్ వర్కర్ అయిన స్వర్ణ ఆఫీసుకు ఒక అమ్మాయిని వెంటబెట్టుకొని వచ్చింది. ఆ అమ్మాయి వయసు సుమారు 15 సంవత్సరాలు ఉండొచ్చు. ఆఫీసులో రమ, స్వాతి ఇద్దరూ పనిలో నిమగ్నమై హెడ్ ఆఫీసుకు ఏదో అర్జంటు రిపోర్టును పంపడానికి తయారు చేస్తున్నారు.
మేడమ్, మీతో కొంచెం వివరంగా మాట్లాడాలి. మీ ఛాంబర్‌లో కూర్చొని మాట్లాడుకుందాం అంది స్వర్ణ. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, స్వర్ణతో వచ్చిన అమ్మాయి వాలకం చూస్తే అత్యవసరంగా మాట్లాడాల్సిన విషయమే అనిపించడంతో లేచి ఛాంబర్‌లోకి నడిచారు. రమ, స్వాతి, వెనకే స్వర్ణ, కొత్తగా వచ్చిన అమ్మాయి కూడా వచ్చారు. నలుగురూ కూర్చున్నారు. ‘మేడమ్, ఈ అమ్మాయి పేరు శ్రావ్య. సమస్యల్లో ఉంది. మనం ఏదైనా సాయం చేయవచ్చని తీసుకొచ్చాను’ అంటూ, ‘నేను చెప్పడం కంటే తనే చెబితే బాగుంటుంది’ అంది స్వర్ణ.
అసలు ఏమి జరిగింది శ్రావ్యా అని రమ అడగగానే మా నాన్న నాతో సరిగ్గా ప్రవర్తించలేదు అంటూ మొదలుపెట్టింది శ్రావ్య. అంటే? మెల్లగా నాకు సరిగ్గా అర్థం కాలేదు, కొంచెం వివరంగా చెబుతావా అంది రమ. ఆ మాటకు సరే, మేడమ్! అమ్మ వేరే అతన్ని పెళ్ళి చేసుకుంది, నాన్న వేరే ఆమెను పెళ్ళి చేసుకున్నాడు అంది కళ్ళ నిండా నీళ్ళతో. నా చిన్నప్పుడు అమ్మ నన్ను హాస్టల్‌లో వేసింది. నేను చదువుకునే స్కూల్‌కు నాన్న వచ్చేవాడు. నాకు చాక్లెట్లు, బిస్కెట్లు తెచ్చేవాడు, నేనంటే ఇష్టమా అని అడిగేవాడు. నాన్న నన్ను కలవడం అమ్మ చూసి పోలీస్ స్టేషన్‌లో పెద్ద పంచాయితీ పెట్టింది. పోలీసులు నీకు ఎవరి దగ్గర ఉండాలని ఉంది అని అడిగారు. నేను నాన్న దగ్గర ఉంటాను అని చెప్పడంతో నన్ను నాన్నతో పంపారు. నేను నాన్నతో వెళ్ళిపోయాను. ఈ ఊరికి దగ్గర్లో ఉండే టౌన్‌లో ఓ మురికివాడలో నాన్న, పిన్నమ్మ, పిన్నమ్మ ముగ్గురు పిల్లలు ఉండేవారు. నేను కూడా వారితో ఉండేదాన్ని. నాన్న దగ్గర్లో ఉండే స్కూల్లో నన్ను చేర్పించాడు. నాన్న, పిన్నమ్మ మగ్గం పనికి పోయేవారు, వచ్చే డబ్బులో సగం డబ్బులు నాన్నకు తాగడానికి సరిపోయేవి. నాన్నకు నా మీద ప్రేమ ఉందా, బాధ్యత ఉందా అనే ప్రశ్నకు సమాధానం లేదు కానీ మా అమ్మ మీద ఉన్న ద్వేషంతో నన్ను ఇక్కడ ఉంచుకున్నాడని మాత్రం అర్థమైంది.
మా పిన్ని, వాళ్ళ బంధువుల్లో ఒకరికి డెలివరీ అయితే, వారం రోజుల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. నేను ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను. నాన్న ఒకరోజు సాయంత్రం బాగా తాగి వచ్చాడు. నేను అన్నం పెట్టిన. తిన్నాడు. అందరం ఒకే గదిలో పడుకున్నాం. అర్థరాత్రి నాన్న నా మీద చెయ్యివేసి నాతో… ఇంకా చెప్పలేను అని భోరున ఏడవడం మొదలుపెట్టింది. ఎదురుగా ఉన్న రమ, స్వాతి, స్వర్ణ ఉలిక్కిపడ్డారు. మనం విన్నది కరెక్టేనా అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. శ్రావ్యను కొంతసేపు అందరూ ఓదార్చారు. శ్రావ్య కొంచెం తేరుకున్నాక, తర్వాత ఏం జరిగింది అంది స్వాతి.
మర్నాడు, నాన్న నిద్ర లేచి, ఏమీ జరగనట్టు రెడీ అయ్యి పనికి వెళ్ళిపోయాడు. తర్వాత అంతా మామూలుగానే
ఉంది. మా పిన్ని ఊరినుండి ఇంటికి వచ్చింది. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేను జరిగిన విషయం చెప్పాను. సరేలే, మీ నాయనను అడుగుతాను అంది. ఆ రోజు సాయంత్రం పిన్ని, ఏమయ్యా పెద్ద పాపతో అసభ్యంగా ప్రవర్తించావట అని నాన్నను అడిగింది. నాన్న నన్ను గుర్రుగా చూసి బయటికి వెళ్ళిపోయాడు. రాత్రికి బాగా తాగి వీధిలో నుండే తిట్టుకుంటూ రావడం చూసి, పిన్ని నన్ను బాత్రూమ్‌లో పెట్టి బీగం వేసింది. నాన్న నా కోసం ఇంట్లో వెతికి, బాత్రూమ్‌లో ఉన్నానని గ్రహించి, బీగం కాయ పగలగొట్టి, జుట్టు పట్టుకొని, ఇష్టానుసారంగా కొట్టాడు. మధ్యలో పిన్ని అడ్డు వస్తే, పిన్నిని కూడా కొట్టాడు. రెండు రోజులు జ్వరం, నొప్పులతో పడుకున్నాను. అంతలో కరోనా వచ్చింది. లాక్‌డౌన్ అని, అందరం ఆటోలో సామాన్లు వేసుకొని ఊరు చేరినాము. మా పిన్ని ఇంట్లో లేనప్పుడు, నాన్న నా నోరు నొక్కి నాపై అఘాయిత్యంచేసేవాడు, హింసించేవాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. ఇవన్నీ తట్టుకోలేక, తాత దగ్గరికి ఐదు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళిపోయాను. కొద్ది రోజులు అక్కడే ఉన్నాను.
ఓనాడు తాత ‘ఇంకెన్నాళ్ళు నా గ్గర ఉంటావులే బిడ్డా, మీ అమ్మ కాడికి పో’ అన్నాడు. చాలా రోజుల తర్వాత అమ్మ దగ్గరికి వచ్చాను. ఇరుగు పొరుగు వాళ్ళు, అమ్మతో నీ బిడ్డకు పొట్ట పెద్దదిగా ఉంది, ఒకసారి గమనించుకో అన్నారు. అమ్మ ఒకరోజు నన్ను నిలదీసింది. నెలసరి వచ్చి ఎన్ని రోజులైంది అని అడిగింది. చానా రోజులైంది, అయినా నాకు నెలనెల రాదులే అన్నాను. అయినా అమ్మకు అనుమానం వచ్చి, ఊళ్ళో ఉండే ఆర్‌ఎంపి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. మాత్రలు ఇచ్చాడు. వేసుకున్నా, కొంత రక్తం పోయింది కానీ కడుపు తగ్గలేదు అంది. ఇదంతా జీర్ణించుకోవడానికి కొంత కష్టంగా అనిపించి, ముగ్గురూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏం చేస్తే బాగుంటుందని ఆలోచనలో పడి, కొంతసేపు నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, పక్కన మీటింగ్ హాల్ ఉంది అని చెప్పింది. స్వాతి అంటెండర్‌ను పంపి శ్రావ్యకు భోజనం తెచ్చి ఇవ్వమని చెప్పింది.
రమ, స్వాతి, స్వర్ణ ముగ్గురూ ఇదంతా నిజంగా జరిగిందా? అని మాట్లాడుకున్నారు. ఏ కూతురూ ఇలాంటి విషయాల్లో తండ్రిమీద నింద మోపదని స్వాతి బలంగా చెప్పింది. కానీ రమ మాత్రం, తను మాత్రమే చెప్పినదాన్ని విని మనం నిర్ణయం తీసుకోకూడదు, వాళ్ళ అమ్మ ఈ ఊళ్ళోనే కదా ఉండేది, మాట్లాడితే పోలా, మనకు కూడా క్లారిటీ వస్తుంది అంది.
అర్థగంటలో శ్రావ్య కన్నతల్లి రమణమ్మ వచ్చింది. రమణమ్మతో శ్రావ్య గురించి అడిగారు. మీ దగ్గరకు ఏదో సాధించాలని వచ్చింది కదా మేడమ్ అంది. అవును అందుకే నిన్ను కూడా పిలిచింది, నిన్ను కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందామని, గొంతు పెంచి చెప్పింది రమ. నీ కూతురెందుకు నీ దగ్గర చిన్నప్పటి నుంచి లేదు అని అడిగారు. ‘మా అయ్య మంచి సంబంధమని’ నన్ను నరసయ్యకిచ్చి పెళ్ళి చేశాడు. కొద్ది రోజులు బాగానే ఉన్నాము, కూతురు కూడా పుట్టింది. మా ఇద్దరి మధ్య కొట్లాటలు జరుగుతుండేవి. అవన్నీ మొగుడు, పెళ్ళాల మధ్య మామూలే అనుకున్నాను. కానీ ఆ కొట్లాటలు పెద్దవై పంచాయతీ వరకు వచ్చి, కుల పెద్దల మధ్యలో విడిపోయాము. ఆయన తోడు చూసుకున్నాడు, నేను ఈ ఊరు వచ్చాను. బ్రతకాలంటే మగ తోడు ఉండాల. నన్ను కూడా ఒకడు చేరదీశాడు. కొద్ది రోజులు కలిసి ఉన్నాము, తర్వాత పెళ్ళి చేసుకున్నాము’. చెప్పుకు పోతుంది రమణమ్మ.
అదంతా సరే, శ్రావ్య నీ దగ్గర ఎందుకు లేదు అని నొక్కి అడిగింది రమ. ‘అదే చెబుతున్నా మేడమ్, నేను రెండో పెళ్ళి చేసుకున్నా, నా రెండో మొగుడు నా బిడ్డను చీదరించుకోలా. కానీ, మొదటి మొగుడుకి, నేను రెండో పెళ్ళి చేసుకోవడం నచ్చలా. అందుకే నా బిడ్డకు ఎరవేసి, పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ పెట్టి తీసుకుపోయి ఇట్టా చేసిండు’ అంది. నా మొగుడి మీద నేను కేసులు, గీసులు పెట్టలేను. అయినా నా కూతురుకు తిండిపెట్టే స్థోమత నాకు లేదంది.
మరిప్పుడు నీ దగ్గరే కదా ఉంది అంది స్వర్ణ.
ఎల్లకాలం నేను చూడలేను. ఈ కడుపు సంగతేందో తేలితే, నా రెండో మొగుడు డబ్బు సాయం చేస్తే ఎవరికైనా ఇచ్చి పెళ్ళి చేస్తా అంది. మరి ఈ మధ్యకాలంలో ఏదైనా ఆస్పత్రికి తీసుకెళ్ళారా మీ పాపను అని అడిగింది స్వాతి. ఆర్‌ఎంపి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం, కానీ ఆ మాత్రలతో కడుపు తగ్గలేదు అంది. సరే రమణమ్మ, నీ కూతురు మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా, తనని కూడా అడుగుదామని చెప్పింది రమ. పక్కనున్న మీటింగు హాల్లో శ్రావ్య ఉందని చెపితే రమణమ్మ వెళ్ళింది. కాసేపటికి కేసు వద్దు అని రమణమ్మ చేస్తున్న హితబోధ మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి.
రమ, స్వాతి, స్వర్ణ ముగ్గురూ కూడా శ్రావ్య గర్భవతి అని కొంతవరకూ రూఢ చేసుకున్నారు. అయితే ఎన్నో నెల అనేది మాత్రం ఆస్పత్రికి వెళ్ళి స్కానింగ్ చేస్తే కానీ తెలీదు. శ్రావ్య మైనర్. ఎటువైపు చూసినా శ్రావ్యకు ఆశించినంత సపోర్టు లేదు. ఈ దుస్థితికి కారణం ఎవరు అని మనం చెప్పలేం కానీ అన్యాయం అయితే జరిగింది. మన వల్ల అయినా సాయం చేద్దాం, అన్యాయాన్ని ఎదిరించడానికి మనం అండగా నిలబలడదాం అనే నిర్ణయానికి వచ్చారు.
రమణమ్మను, శ్రావ్యను మళ్ళీ పిలిచి, ముందుగా శ్రావ్యతో నువ్వు ఆస్పత్రికి వెళ్ళి చెకప్ అయితే చేసుకోవాలి అన్నారు. మరి నీకు జరిగిన అన్యాయానికి నువ్వు ఏం చేద్దామంటావు అని అడిగారు ముగ్గురూ. తప్పుచేసిన మా నాన్నకు శిక్ష అయితే పడాలి, అది ఎలా సాధ్యపడుతుందనేది తెలీదు, మీరే చెప్పాలి మేడమ్ అంది శ్రావ్య. మరి చట్టపరంగా కేసు పెడితే నువ్వు గట్టిగా నిలబడి ఆటుపోట్లు తట్టుకోగలవా అన్నారు. ఎస్ మేడమ్ అంది. ప్రభుత్వం తరపున నీకు ఉండడానికి హాస్టల్ వసతి ఉంటుంది, రేపు భవిష్యత్తులో నువ్వు బిడ్డ వద్దనుకుంటే గవర్నమెంటుకు ఇవ్వచ్చు అన్నారు.
మరి మీ అమ్మకు కేసు పెట్టడం ఇష్టం లేదు కదా అంటే, ఫర్వాలేదు ఇన్ని రోజులు అమ్మ ఉన్నా నేను అనాథనే, ఈ రోజు నాకు కొత్త కాదులే మేడమ్ అంది. సరే మీరు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళండి, మేము ఎస్‌ఐ గారితో మాట్లాడతాము అంది రమ, రమణమ్మ వైపు చూస్తూ!! రెండు రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాక, శ్రావ్య స్టేట్‌మెంట్ రికార్డు చేసుకుని, లేడీ కానిస్టేబుల్‌ను ఇచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు.
స్కానింగ్, ఇతర చెకప్‌లు చేస్తే ఆరవ నెల గర్భవతి అని తెలిసింది. ఇంక వెంటనే ఎఫ్‌ఐఆర్ చేసి, చిన్న పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టం క్రింద కేసు రిజిస్టర్ చేశారు. శ్రావ్య నాన్నను ముద్దాయిగా రిమాండులోకి పంపారు. శ్రావ్యను వాళ్ళ అమ్మ తిట్టిపోసింది. ఇంట్లో నుండి వెళ్ళిపో అని, ప్రత్యక్షంగా, పరోక్షంగా మాటలతో హింస పెట్టింది. కేసు విత్ డ్రా చేసుకోవాలని శ్రావ్య పిన్ని బ్రతిమలాడుకొంది, ఊరిలో వాళ్ళు కూడా కేసులు వద్దన్నారు. శ్రావ్య వినలేదు. ఈ గొడవలతో మూడు నెలలు గడిచి, డెలివరీకి ఆస్పత్రిలో జాయిన్ చేశారు. శ్రావ్యకు నార్మల్ డెలివరీ అయింది. రమణమ్మ అయిష్టంగానే ఆస్పత్రిలో ఉంది. మగబిడ్డ పుట్టాడు. రమణమ్మ బిడ్డను ఎత్తుకోలేదు. టీకాలు వేయడానికి సిస్టర్ తీసుకురమ్మంటే కూడా వెళ్ళలేదు. ఆశ వర్కర్, స్వర్ణ అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు. మరుసటి రోజు ఉదయం రమణమ్మ ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రి నుండి వెళ్ళిపోయింది. శ్రావ్య పిన్నమ్మ మధ్యలో ఒకసారి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసింది. అందుకు శ్రావ్య స్పందించలేదు. శ్రావ్య బంధువులు ఆ బిడ్డను ఎవరికైనా అమ్మే ప్రయత్నాలు కూడా చేశారు. అవకాశం దొరకలేదు. స్వర్ణ, ఆశ వర్కర్ మూడు రోజుల పాటు శ్రావ్యను, బిడ్డను కంటికి రెప్పలా చూసుకున్నారు. రమ, స్వాతి మధ్య మధ్యలో ఆస్పత్రికి వెళ్ళి కావాల్సిన ఏర్పాట్లు చూసుకున్నారు.
శ్రావ్య ఆరోగ్యం కుదుట పడ్డాక డిశ్చార్జ్ చేశారు. శ్రావ్యను కొద్ది రోజులు వాళ్ళ అమ్మ చూసుకుంటే బాగుండు అని అందరికీ అనిపించింది. కానీ చేసేదేమీ లేక, శ్రావ్యను, బిడ్డను ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తీసుకువెళ్ళగా శ్రావ్య జరిగిందంతా వివరించింది, తనకు బిడ్డ అవసరం లేదని చెప్పింది. తనకు వసతి, రక్షణ కావాలని అడిగింది. తన కోరిక మేరకు వారు వెంటనే శ్రావ్యను చిల్డ్రన్స్ హోంలో, బిడ్డను శిశు విహార్‌లో పెట్టారు. చివరిసారిగా శ్రావ్య బిడ్డకు ముద్దు పెట్టి, పాలు ఇచ్చి కన్నీళ్ళు పెట్టుకుని సిబ్బందికి అప్పచెప్పింది. తనతో పాటు వచ్చిన స్వర్ణ, ఇంకా ఇతర సిబ్బంది కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
‘ఇక్కడితో ఈ కథ ముగిసిపోలేదు స్వాతీ’ అంది రమ, శ్రావ్య కేసు తాలూకు ఆలోచన నుండి బయటపడుతూ. ఇది తాత్కాలిక ఓదార్పు మాత్రమే. ఇందులో ఎవరి తప్పు ఎంత అనేది బేరీజు వేయలేం. బాల్యంలో సంరక్షణ ఇవ్వాల్సిన తల్లిదండ్రులు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఆడపిల్ల తల్లి దగ్గర ఉంటే భరోసాగా ఉంటుందనే విషయం తెలిసినా రమణమ్మ ఏం చెయ్యలేకపోయింది. చూలింత అంటే ఎవరికైనా కనికరం ఉంటుంది, కానీ కన్నతల్లికి లేకుండా పోయింది ఎందుకనో! చేయి పట్టి నడిపించాల్సిన నాన్న కాటువేశాడన్న ఆరోపణలతో జైలులో ఉన్నాడు. శ్రావ్యకు ఎలాగోలా నచ్చచెప్పి, భర్తను జైలునుండి విడిపించుకోవాలనే ప్రయత్నంలో శ్రావ్య పిన్నమ్మ ఉంది. ఈ పసికందు భారం తాను మోయలేనని శ్రావ్య నిశ్చయించుకుంది.
శ్రావ్య వాళ్ళ నాన్న గురించి బహిరంగంగా చెప్పడానికి భయపడిరదా? అదే వాళ్ళ నాన్నకు అలుసుగా మారిందా? ఇంకా ఎవరైనా కూడా ఉన్నారా? శ్రావ్య మనసులో బయట ప్రపంచానికి తెలియని నిగూఢం ఏమైనా ఉందేమో మనకు తెలియదు. ఏది ఏమైనా కేసు తుది తీర్పు ఏ ముగింపును ఇస్తుందో చూడాలి అంటూ, మళ్ళీ ఆఫీసు పనుల్లో పడ్డారు.