జాయిన్‌ ది మీటింగ్‌ – సుజాత వేల్పూరి

‘‘ఒక కప్పు కాఫీ ఇలా పడెయ్‌, ఐదు నిమిషాల్లో కాల్‌లో జాయిన్‌ అవ్వాలి, ఇవాళ బ్యాక్‌ టు బ్యాక్‌ మీటింగ్స్‌
ఉన్నాయి’’ హడావిడి పడుతూ కిచెన్‌లోకి వచ్చాడు.

‘‘టూ మినిట్స్‌’’ సైగ చేసింది శైలూ ఆఫీస్‌ ఫోన్‌ మాట్లాడుతూ.
‘‘అబ్బ…’’ మొహం విసుగ్గా పెట్టేసి రూంలోకి వెళ్ళిపోయాడు.
డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని బఠానీలు వలుస్తున్న అత్తగారు ఇందిర వంటింట్లోకి వచ్చి ‘‘జరుగు, నేను కలుపుతాను’’ అంది.
ఫోన్‌ మాట్లాడడం ముగించి కప్పులో డికాషన్‌ అప్పటికే పోసేస్తున్న శైలూ ‘‘అయిపోయిందండీ, కలిపేస్తున్నా’’ అంది.
‘‘వాడికి తొమ్మిదింటికి కాల్‌ ఉందని తెలుసు కదా నీకు? ఆ టైముకల్లా కాఫీ కలిపేసి ఉంచితే టెన్షన్‌ ఉండదు కదా’’.
‘‘ఎవరికి? నాకేం టెన్షన్‌ లేదు. మీరే టెన్షన్‌ పడుతున్నారు. కాఫీ ఒక్క నిమిషం ఆలస్యమయితే కొంపలేం మునగవు.’’
‘‘అదికాదు శైలూ. నువ్వు ఆఫీసుకి వెళ్తున్నావ్‌ కదా. వాడేమో వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్నప్పుడు ఏ డిస్టర్బెన్సూ లేకుండా ఉండాలి కదా?’’
‘‘ఇప్పుడు ఆయన్ని ఎవరు డిస్టర్బ్‌ చేశారు? వంటంతా చేసేసి రెడీగా పెట్టాను. తినే టైముకు వేడి చాల్లేదనుకుంటే, మైక్రోవేవ్‌లో పెట్టుకోండి. ఇందాకే కలిపి ఉంచాను కాఫీ. ఫ్రెండ్‌ ఎవరో ఫోన్‌ చేశాడని మాట్లాడుతూ కూచున్నాడు. అది చల్లారిపోయింది. చల్లారిపోయిన కాఫీ వేడి చేస్తే తాగడుగా, అందుకే మళ్ళీ కలిపాను.’’
‘‘పప్పు పులుసు పెట్టినట్టున్నావ్‌, వడియాలు వేయించావా? వాడికి ఇష్ట…’’
‘‘మధ్యాహ్నం లంచ్‌కి ఎక్కువ టైం తీసుకోడు. తీరిగ్గా ఇవన్నీ తినడానికి టైముండదు. తన షెడ్యూల్‌ నాకు తెలుసు. రాత్రి వేయిస్తాలెండి, వచ్చాక.’’
‘‘ఇప్పుడే వేయిస్తే పోలా?’’
‘‘పోతుంది, నా క్యాబ్‌’’
చెప్పులు టకటకలాడిరచుకుంటూ వచ్చింది నీల. పిల్లాడిని వాళ్ళమ్మకు అప్పచెప్తూ ‘‘అమ్మా, వీడికి నిన్న మోషన్స్‌ అయ్యాయి. మధ్యాహ్నం పెరుగన్నం పెట్టు. నేను ఇవాళ అన్నం వండలేదు. చపాతీలే. వదిన వండే ఉంటుందిగా.’’
‘‘నేను మళ్ళీ మెత్తగా వండుతానులే’’ ఇందిర పిల్లాడిని ఎత్తుకుంది.
‘‘అమ్మా, మిషన్‌లో బట్టలు వెనక బాల్కనీలో ఆరేయనా? ఈ పక్క చోట్లేదు’’ అరిచింది పనిపిల్ల స్వరాజ్యం.
‘‘ఎందుకే అలా అరుస్తావ్‌? సారు మీటింగ్‌లో ఉన్నారు’’ నీల కసిరింది.
‘‘ఏంటి వదినా, అన్నయ్య కాల్‌లో ఉంటే అదలా అరుస్తుందేం? చెప్పవా దానికి?’’
‘‘మీ అన్నయ్య మీటింగ్‌ షెడ్యూల్స్‌ అన్నీ స్వరాజ్యానికి ప్రింటవుట్‌ తీసి ఇద్దాం సాయంత్రం. ఆ టైం ప్రకారం తను అరవకుండా ఉంటుంది.’’
‘‘అదేంటొదినా, అన్నయ్య…’’
‘‘ఇదిగో కాస్త కాఫీ ఉంది తాగు. మా పనమ్మాయి గురించి నువ్వు ఆట్టే కంగారపడకు, నేను ఆఫీసుకు పోవాలి. తన ఫీలింగ్స్‌ హర్ట్‌ అయ్యాయంటే మానేస్తుంది. తర్వాత తిప్పలు నీక్కాదు, నాకూ’’
ఇడ్లీలు ప్లేట్లో పెట్టుకుని చట్నీ వేసుకుని తెచ్చుకుంది శైలూ.
‘‘నాన్న తిన్నారా టిఫిన్‌’’ పేపర్‌ తిరగేస్తోంది నీల.
‘‘ఆయన వాకింగ్‌ అప్పుడే అవుతుందా ఏం? వచ్చాక కాఫీ, స్నానం, పూజ ఇవన్నీ అయితే కానీ తినరాయె’’
‘‘ఏమోనమ్మా, మా ఇంట్లో మగవాళ్ళ కంఫర్ట్‌ తర్వాతే ఏదైనా! అన్నాలు కూడా వాళ్ళు తిన్నాకే నేనూ, మా అత్తగారూ, కూచుంటాం…’’
‘‘ఎప్పుడూ? మీ అత్తగారు వాళ్ళు ఏడాదికోసారి వాళ్ళ ఊరు నుంచి మీ ఇంటికి వచ్చినపుడా?’’
‘‘అది కాదొదినా, అన్నయ్య, నాన్నగారు…’’
‘‘నీలా, నాకు ఆఫీస్‌కి టైమవుతోంది. మీ అన్నయ్య ఈ మీటింగ్‌ కాల్‌ అవగానే తింటాడు. హాట్‌ ప్యాక్‌ నిండా పెట్టుంచాను. మీ అమ్మగారు డయాబెటిక్‌ కాబట్టి తినేశారు.’’
‘‘మొగుడి కంటే ముందు తినడానికి ఆవిడకి ఒక రీజన్‌ ఉంటే, నాకో రీజన్‌ ఉంది. తెలుస్తోందా నీకు?’’
తల్లీ కూతురు ఒకరి వంక ఒకరు చూసుకున్నారు.
‘‘ఏంటో, ఎన్నాళ్ళయినా వదిన కలవదు మనలో! తన పద్ధతులే తనవి.’’
‘‘ఇదే మాట మీ ఆడబిడ్డ అంటే నీకు పీకలదాకా ముంచుకొచ్చింది మొన్న.’’
‘‘మా అమ్మ నన్ను పద్ధతిగా పెంచింది వదినా! మా ఇంట్లో ఏ పద్ధతికీ వంకపెట్టే పన్లేదు.’’
‘‘ఎవరి అమ్మ వాళ్ళని గొప్పగానే పెంచుతుంది. సమస్య ఎక్కడంటే, ఎక్కడికి పోయినా ప్రపంచమంతటా మీ ఇంట్లో పద్ధతులే ఉండాలనుకోవడంలో. మీ ఇల్లే బెంచ్‌ మార్క్‌. మీ ఇంటికి వచ్చే ఆడపిల్లలు ఈ పద్ధతులు నేర్చుకోవాలి. ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళిన ఆడపిల్లలు ఈ జెండా వేరే ఇంట్లో పాతి, ఆ ఇంట్లో పద్ధతులు మటుమాయం చేయాలి. అంతేనా?’’
‘‘శైలూ, మధ్యాహ్నం ఆఫీస్‌కి వెళ్ళే పనుంది ఒక గంట. నా డ్రెస్‌ తీసుంచవా ప్లీజ్‌’’ గదిలోంచి కేక.
‘‘రాత్రి పెరుగు కోసం ఇప్పుడే పాలు తోడుపెట్టినట్లు, మధ్యాహ్నం వేసుకోబోయే డ్రెస్‌ ఇప్పుడే తీసి పెట్టుకోవడం దేనికి. వెళ్ళేముందు తీసి వేసుకో, నాకు టైమవుతోంది.’’
‘‘డ్రెస్‌ తీసుంచడం ఎంతసేపు వదినా? గట్టిగా నిమిషమన్నా పట్టదు.’’
‘‘కదా, మీ అన్నయ్యకి చెప్పు. తనకీ నిమిషమే పడుతుందని. అవసరమైనప్పుడు తీసుకుంటాడు. అదిగో, ఆల్రెడీ క్యాబ్‌ డ్రైవర్‌ ఫోన్‌ చేస్తున్నాడు.’’
ల్యాప్టాప్‌ బ్యాగ్‌ తీసుకుని గుమ్మందాకా వెళ్ళి, ఒక్క క్షణం ఆగి మళ్ళీ వెనక్కి వచ్చింది.
మొగుడు వేసుకోబోయే ఫార్మల్‌ డ్రెస్‌ తీసి మంచం మీద పెట్టి పరిగెత్తుకుంటూ లిఫ్ట్‌ దగ్గరికి వెళ్ళింది.
అది పదిహేనో ఫ్లోర్‌కి వెళ్తోంది.
‘‘ప్చ్‌’’ అనుకుంటూ, గబగబా మెట్లు దిగుతూ జుట్టు వేళ్ళతో దువ్వుకుని పోనీటైల్‌ వేసుకుంది.
డ్రెస్‌ తీసి ఉంచకపోతే కొంపలు మునగవు. కానీ ఫ్యామిలీ వాట్సాప్‌ గ్రూప్‌ల్లో తను కుటుంబానికి చేస్తున్న ద్రోహం కథలు కథలై పారుతుంది.
తను ఉండని ‘‘ఆడపడుచుల గ్రూప్‌’’, ‘‘ఫస్ట్‌ కజిన్స్‌ గ్రూప్‌’’ ఇలాంటి వాటిలో.
… … …
వంటింట్లో పనంతా అయ్యేసరికి ఎనిమిదిన్నర అవనే అయింది. తొమ్మిదికి లాగిన్‌ అయిన వెంటనే మీటింగ్‌లో జాయిన్‌ అవ్వాలి ఇవాళ.
పది నిమిషాల్లో రెడీ అయింది.
8:55కి అత్తగారు మేడ మెట్లు దిగి కిందికి వస్తూ అంది ‘‘ఇవాళ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కదూ నువ్వు? టిఫినేం చేశావు?’’
‘‘ఇడ్లీ వేశానండి. ఒక వాయ హాట్‌ ప్యాక్‌లో పెట్టాను. రెండోది రైస్‌ కుక్కర్‌లో పెట్టేశాను. అవగానే తీసుకోవడమే.’’
‘‘రైస్‌ కుక్కరా? ఆ రైస్‌ కుక్కర్లో ఏది వండినా వాడికి నచ్చదు. ఇడ్లీలు పొడిపొడిగా ఏడుస్తాయి. ఇడ్లీ పాత్రలో పెట్టకపోయావా?’’
‘‘నేను మీటింగ్‌లో జాయిన్‌ అవాలి. మీకు మెడిటేషన్‌ టైము కదా తొమ్మిదికి? డిస్టర్బ్‌ చేయడం ఎందుకని.’’
ఆవిడేదో సణుగుతూ గదిలోకి వెళ్ళింది.
… … …
మీటింగ్‌ సగంలో ఉండగా కిర్రుమని వెనక నుంచి తలుపు తెరుచుకుంది. వీడియో కాల్‌ కాదు కాబట్టి సరిపోయింది.
ఆడపడుచు పిల్లాడిని దింపడానికి వచ్చినట్టుంది. ‘‘వదినా, అన్నయ్య లేచాడు, ఆఫీసుకు వెళ్ళాలట.’’
కాల్‌ మ్యూట్‌లో పెట్టి వెనక్కి తిరిగి ‘‘వెళ్ళమనూ’’ అంది.
‘‘అదికాదు. వాడికి లంచ్‌ సర్దావా? బయట ఫుడ్‌ వాడు తినడుగా?’’
‘‘అన్నీ రెడీగానే ఉంచాను. అన్నం చల్లార్చి కూడా ఉంచాను ప్లేటులో పెట్టేసుకోమను. లేదా అత్తయ్య సర్దుతారు.’’
‘‘ఆ రైస్‌ కుక్కర్లో ఇడ్లీ బాగోదని అమ్మ ఇప్పుడే అన్నయ్యకి బ్రెడ్‌ టోస్ట్‌ చేసింది. ఎంతసేపని నిలబడగలదు?’’
చేతిలో ఏదైనా ఉంటే విసిరి గొడకేసి కొడదాం అనిపించింది. దెబ్బకి గోడ కూడా విరిగి పడిపోయి, ఆపైన కప్పు కూలిపోయి, ఇల్లంతా ఇటుకలుగా ముక్కలుగా, మొత్తం శిథిలాలుగా తనమీద కూలిపోవాలి. అంత కోపం వచ్చింది.
‘‘మీటింగ్‌లో ఉన్నాను నీలా. చూస్తున్నావుగా?’’
‘‘సరే వదినా, కాదనట్లేదు. మీటింగ్‌లో జాయిన్‌ అయ్యే ముందు వాడికి కావలసినవన్నీ చూసుకోవద్దూ?’’
‘‘ఏం చూసుకోవాలి? ఫ్లాస్క్‌లో పోస్తే తాగడని కాఫీ కలిపి ఉంచాను. మైక్రోవేవ్‌లో పెట్టుకోవడమేగా? లంచ్‌కి అన్నీ రెడీ చేసి ఉంచాను. బాక్సులు కూడా అక్కడే విడిగా ఉంచాను…’’
‘‘మగవాళ్ళకి అవన్నీ ఏం తెలిసి చస్తాయొదినా? మనమే కాస్త సర్ది బాక్సులో పడేస్తే ఉద్యోగంలో ప్రశాంతంగా
ఉంటారు. మన ఉద్యోగాల కంటే వాళ్ళవి ముఖ్యం కదా?’’
నిన్నకాక మొన్న స్కూల్లో బిఈడీ కూడా లేకుండా ప్రైవేట్‌ స్కూల్లో టీచర్‌గా చేరి, ఉద్యోగంలో మొగుడు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చెయ్యాలో తనకి చెప్తోంది. పైగా మన ఉద్యోగాల కంటే వాళ్ళ ఉద్యోగాలు ముఖ్యమట. ఆ చివరి మాట చాలా డామేజింగ్‌గా అనిపించింది.
‘‘నీకు మీ అన్న చెప్పాడో లేదో, మీ అన్న కంటే నా ఉద్యోగం చాలా ముఖ్యం ఈ ఇంటికి. ఆయనకంటే సీనియర్‌ పొజిష్‌…’’
ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనిపించింది.
‘‘వాట్‌ డూ సే ఆన్‌ దిస్‌ ప్రణీతా?’’ టీమ్‌ లీడర్‌ అడుగుతున్నాడు అటు నుంచి.
‘‘రైస్‌ కుక్కర్లో ఇడ్లీలు బాగోవట. మొగుడు ఉద్యోగంలో ప్రశాంతంగా ఉండాలంటే…’’
ఛ తల విదిలించింది.
‘‘ఎస్‌ టిమ్మీ, గివ్‌ మి ఎ సెక్‌…’’ ఊపిరి పీల్చుకుని ఇటు తిరిగి మీటింగ్‌లో జాయిన్‌ అయింది.
తలుపు ధడేలున పడి మూసుకుంది వెనకాల.
మీటింగ్‌ నడుస్తున్నా, మెదడులో ఆ చెత్త వాదన తిరుగుతూనే ఉంది.
… … …
‘‘హౌ వజ్‌ ది డే’’ షూస్‌ విప్పుకుంటూ కాజువల్‌గా అడిగాడు.
‘‘గుడ్‌’’ రోటి పచ్చడిలో పోపు కలిపి టేబుల్‌ మీద పెట్టింది.
‘‘అబ్బ, టమాటా పచ్చడా? ఎంత ఘుమఘుమలాడుతోంది. దాంట్లో కొత్తిమీర నంజుకోవడం నాన్నగారికిష్టం.
ఉందా ఇంట్లో?’’
తలెత్తింది. కప్పులో విడిగా కట్‌ చేసి ఉంచిన కొత్తిమీర చూపించింది.
‘‘ఇంగువ అమ్మకిష్టం ఉండదు. వెయ్యలేదుగా?’’
ఎంత బాగా గుర్తుంటాయో ఇవన్నీ.
లేదన్నట్లు తలూపి జగ్‌లో నీళ్ళు నింపి టేబుల్‌ మీద పెట్టి ‘‘స్నానం చేసి రా, తినేద్దాం. అత్తయ్యని పిలుస్తా’’ అంది వాళ్ళ గదివైపు వెళ్తూ.
‘‘ఇదిగో, రేపు నాకు రోజంతా మీటింగ్స్‌ ఉన్నాయి. లండన్‌ నుంచి క్లయింట్‌ వస్తున్నాడు. బిజినెస్‌ లంచ్‌ ఉంది. రాత్రి ఏ టైమవుతుందో తెలీదు. గుర్తు పెట్టుకో, తొమ్మిదింటికల్లా బయటపడాలి.’’
సూచనో, హెచ్చరికో, అభ్యర్థనో, రిమైండరో… ఏదో తెలీలేదు.
… … …
‘‘శైలూ…’’ గావుకేక.
‘‘కాఫీ ఇవ్వు అర్జంట్‌. పొద్దున్నే అయిదింటికల్లా లేపమన్నాను. మర్చిపోయావు. తొమ్మిదికల్లా బయటకు వెళ్ళాలని చెప్పాను కదా. ఎక్కడున్నావు? ఓ మైగాడ్‌. ఆల్రెడీ ఎనిమిదయ్యింది. శైలూ…’’
‘‘ఏమైందిరా? శైలూ ఏది?’’
‘‘నేనూ అదే అడుగుతున్నాను. తొమ్మిదింటికల్లా ఆఫీస్‌కి వెళ్ళాలని రాత్రే చెప్పాను.’’
వంటింట్లోకి వెళ్ళి చూసింది తల్లి.
‘‘ఏంట్రా? కాఫీ డికాషన్‌ పాలూ కాచలేదు. టిఫినూ వెయ్యలేదు. మీ నాన్నగారు వాకింగ్‌ నుంచి వచ్చేసరికి కాఫీ, ఇడ్లీ రెడీగా
ఉండాలి. ఆయన పార్క్‌ దగ్గర ఏదో గ్రీన్‌ జ్యూస్‌ తాగొస్తారు. ఇదేంటి? ఎక్కడికెళ్ళిందీ?’’
‘‘శైలూ, శైలూ’’ నాలుగైదుసార్లు నామస్మరణ చేశారు.
‘‘ఇవాళ సూట్‌ వేసుకోవాలి నేను. గ్రే కలర్‌ సూట్‌ ప్యాంట్‌కి బటన్‌ ఊడిపోయింది. చెప్దామనుకుంటూనే మర్చిపోయాను. ఇప్పుడెలా? ఆ బ్లూ సూట్‌ డ్రై క్లీన్‌కి ఇచ్చిందట. బ్లాక్‌ సూట్‌ వేసుకుంటే? అదెక్కడుందో ఏంటో? ఓ మై… ఎలా? ఎక్కడని వెదకను? శైలూ…’’
‘‘పాల గిన్నె కనపడదు. ఆయనొచ్చే టైమైంది. రాగానే కాఫీ పడాలంటారు. ఇడ్లీ కూడా వేసేయాలి. ఎక్కడివక్కడ వదిలేసి ఎటు పోయిందిరా ఈ పిల్ల’’.
‘‘అమ్మా, ఇదిగో బుజ్జిగాడి జ్యూసూ, అదీ ఈ బ్యాగ్‌లో పెట్టాను. మధ్యాహ్నం కొంచెం పప్పేసి అన్నం పెట్టు. నాకివాళ స్కూల్లో లేటవుతుంది. అన్నట్టు ఆకు కూర వండిరదా వదిన?’’ లోపలికి వస్తూ అడుగుతోంది కూతురు.
‘‘నువ్వుండవే. శైలూ ఎక్కడికో వెళ్ళినట్టుంది. ఎక్కడి పనులు అక్కడ ఉండిపోయాయి. కాస్త ఇడ్లీ కుక్కరూ, ప్లేట్లూ తీసి కొంచెం ఇడ్లీలు వెయ్యవే నీలూ. ఈలోపు నేను అన్నయ్యకి కాఫీ ఇస్తాను. ఏంటిది? ఇల్లేనా? పొద్దున్నే లేచి పన్లవీ చూసుకోరూ?’’
‘‘ఏంటీ? నేను ఇడ్లీలు వెయ్యాలా? మా ఇంట్లో చాకిరీ చేసొచ్చి, మళ్ళీ ఇక్కడ కూడానా? ఏదో పుట్టిల్లు కదాని పిల్లాడిని ఇక్కడ వదిలి వెళ్తున్నా. స్కూలుకి రెడీ అయి వచ్చినదాన్ని పన్లు చెయ్యమంటావే? నీ కోడలేదీ? ఇలాగేనా పొద్దున్నే సంసార్ల ఇల్లుండేది? మొగుడు లేచేసరికి అన్నీ రెడీగా ఉంచితే తప్పేంటట? ఎంత ఉజ్జోగాలు చేసినా ఇంటి పన్లు తప్పుతాయా ఏంటి?’’
ధడేలున పక్క గది తలుపు తెరుచుకుంది. హెడ్‌ఫోన్స్‌తో శైలూ బయటికి వచ్చింది. వంటింట్లోకి వెళ్ళి కప్పులో కాఫీ కలుపుకుంటోంది.
‘‘శైలూ…’’ అత్తా మొగుడూ ఒకేసారి అరిచినట్లు అన్నారు, ఆశ్చర్యం కలిపి.
‘‘ఎక్కడికెళ్ళావు? ఏ పనీ అవలేదిక్కడ’’ అత్తగారు అసహనం కక్కింది.
‘‘తొమ్మిదింటికి వెళ్ళాలని చెప్పానుగా. నా బ్లాక్‌ సూటు…’’
కప్పుతో గదిలోకి వెళ్ళబోతూ వెనక్కి చూసింది.
‘‘నాకు ఇవాళ వర్క్‌ ఏడున్నరకే స్టార్ట్‌ అయింది. కొత్త ప్రాజెక్ట్‌ లాంచ్‌ ఇవాళ. కాల్‌లో ఉన్నాను. ఎవరికి ఏ పని కావాలో
వాళ్ళు ఆ పని చేసుకుని ఎవరి పనిలోకి వాళ్ళు పొండి. పదకొండు వరకూ తలుపు కొట్టారంటే…’’ పూర్తి చెయ్యకుండా లోపలికి వెళ్ళింది.
గొప్ప పిడుగులాంటి శబ్దంతో తలుపు మూసుకుంది.
ఇంకొంచెం గట్టిగా వేసుంటే ఆ గది గోడలు కూలి, పై కప్పూ, గోడలూ అన్నీ నెత్తిన పడేవే అనుకుంది నీల అయోమయంగా చూస్తూ.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.