బాబోయ్!
మన వంశంలో జన్మించిన
నిరీక్షణా ఫలాన్ని
అనేక వ్రతాల నోముల వరాలపంటని
మీ కనుపాపల్లో ఊయల లూగాను మహలక్ష్మినై
పసుపు కుంకుమల పసిడి శృంగార కడప
వాకిట విచ్చిన రంగవల్లులు నా చేతి జాలువారులే
పట్టు కుచ్చుల పావడాతో ఇల్లంతా సందడి చేశాను
అడబిడ్డగా అనురాగ కాంతులు వెలిగించాను
పసికందుగా వున్నపుడు ………
నా చల్లని మృదువైన చేతుల పాదాల
స్పృశిస్తూ మురిసిపోయే వాడివట
జారిపోయినా విడవకుండా ఎత్తుకునేవాడివట
నీ గుండెలపై నా సిరిమువ్వ సవ్వడులెన్నో!
అల్లరి చిన్నారిని కదూ………….
నీ ముఖానికి నా చిట్టి ముఖాన్ని ఆన్చి
జుట్టుతో ఆడుకున్న ఆటలెన్నో!
నీవు అన్నయ్యా నేను ఒకరిని విడిచి ఒకరము
వుండేవాళ్ళమా?
ఆటలు, పాటలు, కథలు ముచ్చట్లు, చదువు భోజనం
అంతా కలిసే కదూ!
ఒకసారి ………..
ఏదో అడ్డు తగిలి పడిపోబోతుంటే
పరుగున వచ్చి నన్ను పట్టుకున్నపుడు
అమ్మా నాన్నా నీతో ఏమన్నారో గుర్తుందా…..
నాన్న తర్వాత నాన్న అంతటి వాడివి
కంటికి రెప్పలా కాపాడుకో
ఏ ఆపద రాకుండా రక్షించుకో అంటూ
విశ్వాస భాష్పలురాల్చారు.
ప్రేమగా, మురిపెంగా…….
చిన్నాన్నా, సిచ్చాజీ, చాచా దాదా, కాక అంటూ
ఇలా ఎన్నో రకాల పిలుచుకునేదాన్ని
కాని, నా చిన్ని తండ్రి…..
కొన్నాళ్ళ నుండి నిన్ను చూస్తే భయం వేస్తుంది
నీ చూపులో స్పర్శలో ఏదో అపశ్రుతి
చీకటి నన్ను బంధించినట్టు
అగాధంలో కూరుకుపోతున్నట్లు
వ్యక్తపరచలేని అసౌకర్యం
సుడిగాలికి చిగురుటాకు వణికినట్లు
భయంకరమైన నీడ ఏదో నాపై నీ రూపంలో
పడబోతున్నట్లు
మనస్సు, శరీరం కంపిస్తుంది…
టి.వి, సినిమా, మీడియా, సెల్ఫోన్లు
ఇంటర్నెట్ పెద్దల పరివేక్షణను
పరిహసిస్తున్నాయి.
శృంగార, పత్రికలు రెండర్థాల మాటలు,
లైవ్షోలు, అశ్లీల నృత్యాలు
ఇంగితాన్ని వికసిస్తున్న ఆశయ, ఆదర్శాలను
అణగారుస్తున్నాయి…..
వావి వరుసల హరిస్తున్నాయి.
మాయపొర మనస్సులను, మనుషులను
విడదీయబోతుంది…….
మనం ఒకరికొకరం దూరమై బ్రతకగలమా?
ఉన్నత, సంస్కార రక్తసంబంధం మనది
అత్యున్నత బంధుత్వ పవిత్ర వరుసలు మనవి
చిన్నాన్నా……..
నిన్ను చుట్టేసుకుని బావరుమనాలని వుంది
చీకట్లో కలిగిన చీకటి వికృతులు పగటి వెలుగులను కప్పివేస్తున్నాయి
నీ అంతరాత్మ ‘పాసి’ అంటూ తీవ్రంగా
శపిస్తుంది.
ఆత్మన్యూనతా అపరాధ భావన కృంగదీస్తుంది
బ్రతుకంతా వెంటాడి వేధిస్తుంది
నిన్ను అనుసరిస్తున్న అన్నయ్యగతి ఏమైపోను?
తద్వారా సమాజం?!
ఈ కొనసాగింపు అవాంచిత వాంచలు
నిన్ను రేపిస్టుగా మృగముగా హంతకుడిగా
మార్చగలవు
తొటివారు అసహ్యించుకుంటారు
సంఘం వెలివేస్తుంది
చట్టం ‘దోషి’వంటూ శిక్షిస్తుంది.
హారతి వెలుగుల దీవెనలిచ్చు
ఆడకూతురు శాశ్వతంగా దూరమవుతుంది…..
అయ్యయ్యో…….దు:ఖిస్తున్నావా?
తలబాదుకుంటున్నావా?
పశ్చాత్తాపమే నీకు నిష్కృతి
ఇప్పుడిపుడే మనది యావనంలో అడుగిడుతున్నప్రాయం
ఆదర్శాÛలకు ఆశ్రయం మన వయస్సు
చైతన్యవంత పురోగమన మన మనస్సు
సంకల్పం ప్రతిభాపాఠవం మన సొత్తు
మనం ఆరోగ్యంగా సహజ మనస్కంగా జీవిద్దాం
ఈ దుష్ప్రభావాలకు ప్రలోభాలకు దూరంగా
విషసంస్కృతికి వ్యతిరేకంగా పోరాడుదాం
యువత చైతన్యవంత కార్యక్రమాలు చేపడదాం
ఆడ, మగా పవిత్రంగా మానవీయంగా కలిసిపోదాం
వాడిపోతున్న మానవ విలువలకు నీరుపోద్దాం
ఆడజాతికి అండగా నిలుద్దాం….