ఈశాన్య రాష్ట్రంలో ఒక్కసారిగా మంటలు భగ్గుమని మండలేదు. కొన్ని దశాబ్దాలుగా ఇరు జాతుల మధ్య ఉన్న అనేక వైరుధ్యాలు, వైషమ్యాలతో పాటు వలసవాద రాజకీయాలు వారి మధ్యన జొచ్చి వర్గపోరుకు దారులు తీయించింది. 1981లో భారత రాజ్యాంగం, 371సి
ఆర్టికల్ ప్రకారం ఆదివాసులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించబడ్డాయి. అందులో 90% ఆదివాసుల భూములు ఆదివాసేతరులకు అమ్మడానికి, దానం చేయడానికి వీలు లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే, 2014 తర్వాత దేశ పాలనాధికారం చేపట్టిన బీజేపీ పార్టీ అనేక రాష్ట్ర శాసనసభల్లో మార్పులు చేస్తూ వస్తున్నది. అందులో మణిపూర్ రాష్ట్రంలో నివసించే మేటీ వర్గీయులు లోయ ప్రాంత ఆదివాసులు అయినప్పటికీ, భారత రాజ్యాంగ ప్రకరణల దృష్ట్యా కుకీలకు మాత్రమే ఎస్టీ హోదాను ఇచ్చి, తమకు ఎస్టీ హోదా ఇవ్వలేదని, రోజురోజుకూ పెరిగిపోతున్న జనాభాకు సరిపోయే భూమి తమకు లేకపోవడం వల్ల, ప్రస్తుతం మేటీలు ఉన్న మైదాన ప్రాంతం (ఇంఫాల్) వైశాల్యంలో కుకీలతో పోలిస్తే చాలా తక్కువ అన్నది వారి వాదన. అందువల్ల తమను కూడా కొండ ప్రాంత వాసులుగా గుర్తించాలని, తమకూ కుకీల వలే ఎస్టీ హోదాను కల్పించాల్సిందిగా ‘మణిపూర్ హైకోర్టు’ న్యాయమూర్తికి అర్జీ పెట్టుకున్నారు. ఆ అర్జీపై ‘మణిపూర్’ హైకోర్టు న్యాయమూర్తి స్పందిస్తూ మేటీ వర్గీయుల కోరికను పరిశీలించవలసిందిగా ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. తమ డిమాండ్స్ కోరుతూ మేటీలు ఆందోళనలు కూడా చేస్తున్నందువల్ల అప్పుడప్పుడూ ఇరు వర్గాల నడుమ తరచూ చెదురు, మదురు దాడులు జరగడం అక్కడ అతి సామాన్యమైన విషయం. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా, ఆ ఉత్తర్వులు సహజంగానే కుకీ జాతీయులను భయాందోళనలకు గురిచేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ, ‘ఆదివాసీ పరిరక్షణ చట్టం’ కింద కుకీ, నాగా, మిజో, చిన్, జోమీ లాంటి అనేక కొండజాతి వాసులకు రక్షణ కల్పించాలని కొందరు యువకులు భారీ ర్యాలీని తీయడంతో మేటీ వర్గీయులు ఆ నిరసన ర్యాలీని జీర్ణించుకోలేకపోయారు. దాంతో నిరసన తెలుపుతున్న వారిపై రాళ్ళు రువ్వుతూ, కొందరు మేటీ ఆందోళనకారులు ఆ ర్యాలీని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా జరిగిన దాడిలో కుకీ మరియే మేటీ వర్గీయుల నడుమ అసహనం పెరిగిపోయి, అది చిలికి చిలికి గాలివాన అయినట్లుగా పగ, ద్వేషాలు, కక్షల రూపం దాల్చి పరస్పర దాడులు చేసుకునేలా ప్రేరణకు దోహదపడ్డాయి.
సహజంగా ఏ మనిషి ఎలా మారిపోయినా, ఆ సమయంలో మారణాయుధాన్ని పట్టుకోవాలని ఎవ్వరూ కోరుకోరు. యుద్ధం చేయాలని కూడా ఎవ్వరూ అనుకోరు. అందరికీ అన్నీ అందుబాటులో ఉన్నంతకాలం ఏ ఒక్కరికీ పోరాటం అనే పదం కూడా గుర్తుకురాదు. ఎవ్వరైనా తమ జోలికి లేదా తమ ప్రాంతం లేదా తమ వారి జోలికి వచ్చినప్పుడు, ముందుగా అక్కడినుంచి మౌనంగా తప్పుకుని వెళ్ళిపోతారు. పదేపదే వారిపై దాడులు జరుగుతుంటే ముందుగా శాంతియుత చర్చలు మొదలు పెడతారు, ఆ తర్వాత హెచ్చరిస్తారు. అప్పటికీ వినకపోతే కొట్లాటలకు దిగుతారు. ఇంకా సద్దుమణగకపోతే ఇరు వర్గాల పెద్దలు కూర్చొని చర్చించుకుంటారు. అవీ ఫలించకపోతే తప్పని స్థితిలో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడడానికి కూడా వెనుకాడరు. అప్పటివరకు వ్యక్తిగతంగా ఉన్న సమస్య ఎప్పుడైతే వర్గాలకు పాకుతుందో అది సామూహికమై ఇరువర్గాల మధ్య యుద్ధానికి దారితీస్తుంది. ఈర్ష్య, అసూయ, పగ, ద్వేషాలతో పాటు దౌర్జన్యకరమైన దాడులు చేయడానికి కూడా వారు వెనుకాడరు. బలమైన వర్గం ఎప్పుడూ బలహీన వర్గంపై దాడులు చేసినప్పుడు ఎక్కువ నష్టం బలహీన వర్గం వారిపైనే జరుగుతుంది. ముఖ్యంగా ఏ యుద్ధంలోనైనా ముందుగా బలైపోయేవారెప్పుడూ మహిళలు, పిల్లలు మాత్రమే. ఇది తరతరాలుగా జరుగుతున్న సామాజిక చరిత్ర. ప్రతి యుద్ధంలో ఇరు వర్గాల వారికీ కొన్ని మెలకువలు, పన్నాగాలు ఉంటాయి. పాలక వర్గాలు, పోలీసు వ్యవస్థ ఒక వర్గానికి మాత్రమే సాయపడితే, మూకుమ్మడి దాడులకు తెగబడితే ఫలితం బలహీన వర్గ ప్రజలు తమ ప్రాంతాలు, దేశాలు వదిలి ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని పారిపోవడం సహజం. అందులో భూ ఆక్రమణ, సంపదే ధ్యేయంగా జరిగే యుద్దాలలో కేవలం వాటిని దోచుకోపవడమే ప్రధాన హేతువు అవుతుంది. కానీ, ఏ యుద్ధంలోనైనా ముందుగా బలయ్యేది మాత్రం స్త్రీలు, పిల్లలు, వృద్ధులు మాత్రమే. అలాంటి సందర్భంలో గత నాలుగు నెలలుగా తడి ఆరని దుఃఖాలుగా మణిపూర్ రాష్ట్ర కుకీ తెగకు చెందిన ఆదివాసులు మన ముందు ప్రశ్నార్థకమై కనబడడం మనం చూస్తూ ఉన్నాం. పాలకులు, వారి మీడియాలు ఒకవైపు అణగారిన వారికి సానుభూతిని చూపుతూనే, మరోవైపు బలమైన వర్గానికి కొమ్ముకాస్తూ రెండు తెగల మధ్య జరుగుతున్న మారణకాండను ఎగదోస్తూ ఉండడం ఇప్పుడు అక్కడ నడుస్తున్న చరిత్ర.
అసలు ఈ కుకీలు ఎవరు? మేటీలు ఎవరు? ఎందుకు ఒకరిపై మరొక ఆదివాసీ తెగ తెగబడి మూకదాడులు, హింసలు చేసుకుంటున్నారు? కుకీలతో పాటు సహజీవనం చేస్తున్న ఇతర 36 ఆదివాసీ తెగలు ఉన్నప్పటికీ, మేటీ వర్గీయులు కేవలం కుకీ వర్గీయులపై మాత్రమే ఎందుకు దాడులు చేస్తూ వారి ధన, మాన, ప్రాణాలను హరిస్తున్నారు అన్నది తెల్సుకోవాలనుకున్నప్పుడు ముందుగా మనం ఆ జాతుల చరిత్రలోకి వెళ్ళాల్సి ఉంటుంది.
మేటీ వర్గానికి చెందిన ఆదివాసీలు అందరూ ‘సనామహి’ అనే ప్రాచీన వైష్ణవ సాంప్రదాయాన్ని ఆచరించే సనాతనులు. మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ మైదానం లేదా లోయ ప్రాంతం. బ్రిటిష్ కొలోనియల్కు పూర్వం ‘మణిపూర్’ మహారాజుల ఆధీనంలో ఉండేది. వారిది సర్వ స్వతంత్ర రాజ్యం. బ్రిటిష్ పాలకులు మణిపూర్‌ను ఆక్రమించుకుని, తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత మణిపూర్ మహారాజు వారికి సామంత రాజుగా మారిపోయాడు. స్వాతంత్య్రానంతరం కూడా మేటీలు తమ సనామహి సాంప్రదాయమైన వైష్ణవ మతాన్ని మాత్రమే ఆచరించేవారు. బ్రిటీషర్స్ కన్నా కూడా, ముందుగా ఇంఫాల్ ప్రాంతంలో ఎక్కువగా ‘కెనడా’ దేశ మిషనరీలు ప్రవేశించాయి. వారి ప్రాబల్యంతో ముందుగా అక్కడి 10% ప్రజలు మాత్రమే క్రిస్టియానిటీని స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత ఇంఫాల్ నగరం, మరియు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో బ్రిటిస్ వారు క్రైస్తవ చర్చిలను ఎక్కువగా స్థాపించడం వల్ల అక్కడి ప్రజలకు విద్య, వైద్య సదుపాయాలతో పాటు బాప్టిస్ట్ క్రైస్తవ మతవ్యాప్తి జరిగింది. అందువల్ల అక్కడి పౌరులలో 55% మంది ప్రజలు ‘సనామహి’ వైష్ణవ సంప్రదాయాన్ని, 40% మంది ప్రజలు క్రైస్తవులు, మిగిలిన 5`7% మంది పౌరులు ముస్లింలుగా ఉన్నారు. ఆ సమయంలోనే ఆర్ఎస్ఎస్ మరియు వారి అనుబంధ సంస్థలు బ్రిటిష్ పాలకులకు తమ మద్దతును తెలిపి, వారికి ఊడిగం చేయడమే కాదు, అణగారిన వారిని అణచివేయడంలో సహకరించింది. 1945లో జరిగిన రెండవ ప్రపంచయుద్ధంలో కుకీలు భారతదేశం పక్షం వహిస్తే మేటీలు మత్రం ఇండియాకు వ్యతిరేకంగా, బ్రిటిషర్స్‌కు తమ మద్దతును ప్రకటించి వారి రాజ్యాధికారానికి సహకారం అందించారు.
ఆ తర్వాత, భారతదేశ స్వాతంత్య్రానంతరం కూడా మేటీలు ఇండియాలో కలవడానికి అసమ్మతిని ప్రకటించి స్వతంత్ర మణిపూర్ దేశంగానే ఉండిపోయారు. కొన్ని దశాబ్దాల పాటు మేటీలు భారతదేశం పట్ల, రాజ్యాంగం పట్ల విధేయతగా ఉండడానికి వ్యతిరేకించారు. బీజేపీ పాలకులు మణిపూర్ భాగాన్ని ఆక్రమించుకునేంత వరకు కూడా భారతదేశపు మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేయడానికి, జాతీయగీతాన్ని ఆలపించడానికి కూడా మేటీలు తమ విముఖత్వాన్ని చూపారు. 2014 తర్వాతనే మెల్లమెల్లగా మణిపూర్‌లోని మేటీలు, ముఖ్యంగా ఇంఫాల్ ప్రాంతంలో నివసించే మేటీలందరూ ‘సనామహి’ సంప్రదాయానికి దగ్గరగా ఉన్న హిందూమతంలో చేరడం మొదలుపెట్టారని, కాంకోపి జిల్లాలో నివసించే ఊరి పెద్దలు, చర్చి ఫాదర్స్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు.
2023 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం మణిపూర్ జనాభా మొత్తం 32 లక్షలకు పైగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో 53% మేటీలు, 24% నాగాలు, 16% కుకీలు, మిగిలిన వారిలో ఇతర తెగలు, 7% ముస్లింలు కూడా ఉన్నారు. కుకీలలో 36 తెగలు ఉండగా, నాగాల్లో ఆరు తెగలు ఉన్నాయి. కుకీల నుండి ప్రస్తుతం పదిమంది ఎమ్మెల్యేలు ఉండగా, నాగా జాతినుండి పది మంది ఎమ్మెల్యేల వరకు ఉన్నారు. మణిపూర్ 17 జిల్లాలుగా విభజించబడిరది. ఈస్ట్`వెస్ట్ ఇంఫాల్ మైదాన ప్రాంతం తప్ప మిగిలిన ఈశాన్య పర్వత ప్రాంతాలన్నీ కుకీ, నాగాల స్థావరాలుగా ఉన్నాయి. ఇక మారణకాండ విషయానికి వస్తే అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ పార్టీ మణిపూర్ రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత ‘సనామహి’ ఆచారం గల వారందరూ హిందూమత వ్యాప్తిలో భాగస్వాములు కావడం చెప్పుకోదగ్గ పరిణామం.
మణిపూర్ భారతదేశ మణిహారంగా చెప్పుకుంటాం. ఈ ప్రాంతం జానపదులతో కూడిన గొప్ప సంస్కృతిని కలిగి ఉంది. వీరి ఆర్థిక వ్యవస్థకు పుష్టిని ఇచ్చేది వీరి వ్యవసాయమే. మణిపూర్ చుట్టూ తొమ్మిది కొండలు, ‘ఓవల్ (అండాకారపు)’ ఆకారపు లోయలతో కూడిన సహజసిద్ధమైన ఒక ఆభరణంగా ఉంటుంది. భారతదేశానికి ప్రకృతి ప్రసాదించిన కానుకగా దీన్ని చెబుతారు. 1891 ఆంగ్లో`మణిపూర్ యుద్ధంలో ఓటమి తర్వాత ఈ ప్రాంతం రాచరిక రాష్ట్రంగా మారింది. 1949 ‘ప్రిన్స్లీ’ స్టేట్ ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. 1972లో, భారతదేశం యొక్క పూర్తిస్థాయి రాష్ట్రంగా ఏర్పడిరది. దీని భూగోళ వైశాల్యం 22,327 చదరపు కిలోమీటర్లు. 90% కొండ ప్రాంతంలో కప్పబడి ఉంటుంది. ఇక్కడి జాతులన్నీ గత కొన్ని శతాబ్దాలుగా సామరస్యతతో నివాసముంటున్నాయి. వీరి పురాణ గాథలు, ఇతిహాసాలు, నృత్యాలు, జానపద కథలు, చేనేత కళాఖండాలు పేరెన్నికగన్నాయి. ఇక్కడి ప్రజల సంప్రదాయ ఆట ‘పోలో’గా ప్రసిద్ధి చెందింది. మణిపూర్ రాష్ట్రంలో చాలా భాగం… చురాచాంద్ పూర్, కాంకోపి, సేనాపతి మొదలగు జిల్లాలన్నీ కుకీల స్థావరాలు. ఇంఫాల్‌లో ఉన్న జనాభాలో ఎక్కువ శాతం మేటీలు ఉండగా, చాలా తక్కువ శాతం కుకీలు, ముస్లింలు ఉంటారు. అందువల్ల మేటీలకు అది బలమైన స్థావరంగా ఉంది. కుకీలు మాత్రం ఎక్కువ శాతం కొండ ప్రాంత వాసులైతే, మేటీలు మైదాన ప్రాంత వాసులుగా స్థిరపడ్డారు. నిత్యం పెరుగుతున్న జనాభాలో ఎక్కువ శాతం మేటీ వర్గీయులు ఉన్నారు. కొండ ప్రాంతాలలో నివసించే కుకీ జాతీయుల కన్నా మేటీ జాతీయులు విద్య, వైద్యం, ఇతర రంగాలలో బాగా వెనుకబడి ఉంటారు. మేటీలు వ్యాపారస్తులుగా, పెట్టుబడిదారులుగా, మొదటి నుంచి గుజరాత్ ప్రాబల్యంతో రాజకీయ చాతుర్యం కలిగిన వారుగా ఉన్నారు. కుకీలు మిషనరీ సంస్థల ప్రోత్సాహంతో ఉన్నత విద్యారంగంలో గొప్ప ప్రావీణ్యత కలిగి ఉన్నందున కీలక ప్రభుత్వ వ్యవస్థల్లో పైచేయిగా ఉన్నారు. కుకీలు సామాజిక, ఆర్థిక, న్యాయ రంగాలలో ఉన్నత పదవులలో ఉండటంతో, మేటీలకు అన్ని పాలనా వ్యవస్థలలో కుకీల సహకారం అవసరం పడుతూ ఉంటుంది. పరిపాలనా విధానంలో సహజంగానే కుకీ అధికారుల సమ్మతిని తీసుకోవాల్సిన స్థితిలో ఈనాటికీ ఉండటం మేటీలకు మింగుడుపడని విషయం. రాజకీయ, పెట్టుబడి, వ్యాపార రంగాలలో కుకీల కన్నా మేటీలు ఎప్పుడూ అగ్ర స్థానంలోనే ఉంటారు. అందువల్ల కూడా మేటీలు మొదటి నుంచి కుకీలపై ఒకరకమైన ఆధిపత్యాన్ని, అసహనాన్ని పెంచుకుని ఉన్నారు. కుకీలు బర్మా మరియు మయన్మార్ దేశాల నుండి వలస వచ్చిన వారన్న చిన్నచూపు కూడా వారిలో ఉండడం వల్ల పూర్తి ఈశాన్య కొండ ప్రాంతాలన్నీ కుకీలే ఆవరించి ఉన్నారన్న అక్కసు కూడా గత కొన్ని దశాబ్దాలుగా మేటీల మనసులను తొలిచివేస్తున్న విషయం. అందువల్లే మేటీలు కుకీలపైన నిలువెత్తు ద్వేషాన్ని నింపుకోవడానికి ముఖ్య కారణమయింది. అందులో ‘స్పెషల్ ఫారెస్ట్ ఆఫ్ యాక్ట్’ ప్రకారం కుకీల అడవి ప్రాంతం చాలా విశాలంగా ఉండటం, ఎస్టీలకు అందే అన్ని రిజర్వేషన్ సదుపాయాలు కుకీలకు ఉండటం, వాటి ఫలితాలను వారు గత దశాబ్దాల నుండి అనుభవించడం చూస్తున్న మేటీ వర్గానికి, కుకీల ఎదుగుదల కంటగింపుగా ఉండి, వారిలో ఈర్ష్య, అసూయ, ద్వేషాలకు దారితీసింది. ఇది సహజంగానే మేటీలు, కుకీలపై చిన్నచూపుకు, కక్ష, పగలు పెంచుకోవడానికి కారణభూతమైందన్నది నిర్వివాదాంశం.
ఇరువర్గాల నడుమ ఉన్న వైవిధ్యాలు, విభిన్న కోణాలను దృష్టిలో తీసుకున్నప్పుడు, మనుషుల నడుమ ఉన్న సహజసిద్ధమైన జెలసీలు ఎక్కువగా పనిచేస్తుండడం వలన అప్పుడప్పుడూ మేటీలు తమ ఆధిపత్యాన్ని కుకీల మీద చూపుతూ దాడులు చేయడం అక్కడ పరిపాటి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మేటీలు అడవి ప్రాంతాన్ని ‘లీజు’ పద్ధతిలో తీసుకున్న కొండ ప్రాంతపు సాగుభూమిలో గంజాయి లాంటి మాదకద్రవ్యాల పంటలను పండిరచటం, కొండ ప్రాంత ప్రజలైన కుకీలు, తమ పేదరికం కారణంగా ఆ భూములలోనే కూలీలుగా పనిచేస్తూ తమ జీవనాధారం చేసుకోవడం వలన కూడా మేటీల మనసులో కుకీలు తమకన్నా తక్కువ స్థాయి వారన్న చులకన భావం కలిగి ఉన్నారు. తాము లీజుకు తీసుకున్న భూములపై పూర్తి అధికారం కుకీలకు మాత్రమే ఉన్నదన్న విషయం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి పంట భూములపై పూర్తి హక్కును పొందాలంటే తమను కూడా ఎస్టీ జాబితాలో చేర్చగలిగే ఆయుధం, భారతదేశ రాజ్యాంగ పరిధిలోకి తాము వెళ్ళినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందన్నది వారికి తెలుసు. కుకీల హక్కుగా ఉన్న కొండ ప్రాంతంలో తాము కూడా స్వేచ్ఛను కలిగి ఉండాలంటే తాము ఎస్టీ జాబితాల్లోకి వెళ్ళడం తప్ప మరో మార్గం లేదన్న వాస్తవ గ్రహింపుతోనే కుకీలపై సహజంగానే మేటీలు ద్వేషాన్ని పెంచుకున్నారు. అందువల్లనే వారిరువురి నడుమ నిరంతరం జరిగే చిన్న చిన్న ఇగోల దాడులు. ఆ దాడులే ఇప్పుడు మేటీలు (రాజకీయ కారణాలు వేరే ఉన్నా) ఉధృతం చేయడం, అందుకు వారికి రాజకీయ పలుకుబడి, పోలీసు వ్యవస్థ వెన్నుదన్నులు ఉండడంతో బలమైన వైరానికి నాంది పలికింది. మేటీలు ఆ అవకాశాన్ని అదనుగా తీసుకోవడమే నాలుగు నెలలుగా తెగబడి జరుగుతున్న ఈ దాడులు. ఈశాన్య ప్రాంతంలో జరుగుతున్న ఈ దాడుల మారణకాండకు అక్కడి ప్రభుత్వం కూడా బాధ్యత వహించడం వల్ల, అక్కడి ప్రజల కోపానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అజ్యం పోసినట్లయింది.
1972కు పూర్వం వరకు భారతదేశ విధేయతను ఒప్పుకోలేని మేటీలు, ఇప్పుడు ఒక ప్రధాన జాతీయ రాజకీయ పార్టీ పంచన చేరడమే కాదు, మణిపూర్ రాష్ట్ర పగ్గాలను కూడా వారి చేతిలో పెట్టింది. ఆ రాజకీయ పార్టీ ప్రోద్భలంతో తమను కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని మేటీలు డిమాండ్ చేస్తూ, కుకీలు తమలా మూలవాసులే కాదని, వారు బర్మా, మయన్మార్ ప్రాంతాల నుండి వలస వచ్చిన శరణార్ధులని అంటూ, మణిపూర్ ‘హైకోర్టు’ నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. 1949కు పూర్వమే బ్రిటిష్ కొలోనియా కాలం నాటి నుండి కుకీలకు సంక్రమించిన అటవీ భూములను, వారి ప్రాంతాలను చేజిక్కించుకోవాలన్న దురాశే ఈ మారణహోమానికి ముఖ్యమైన కారణం. మణిపూర్ హైకోర్టు తీర్పును నిరసిస్తూ ‘ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్’ తీసిన ఒక ప్రదర్శనను వ్యతిరేకించి మేటీలు మే మూడవ తేదీన ఇంత దారుణానికి పాల్పడడం వెనుక కేవలం కుకీలను భయపెట్టి, హతమార్చి వారినుండి అటవీ భూములను ఆక్రమించుకోవడానికే అన్నది నిర్వివాదాంశం.
మొదటి నుంచి భారతదేశంలో పూర్తి బాధ్యతాయుత పౌరులుగా ఉన్న కుకీలు, భారత రాజ్యాంగపరంగా సంక్రమించిన చట్టాల ఆధీనతలో ఉన్నామని, తమని మేటీలు కవ్విస్తూ కయ్యానికి కాలుదువ్వి, రెచ్చగొట్టడమే కాకుండా, తమ జాతి నిర్మూలనే ధ్యేయంగా కంకణబద్ధులై ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు బలగాలు కూడా వారికి వెన్నుదన్నుగా ఉన్నాయి కనుకనే తమపై తెగబడి దాడులు చేస్తూ, మారణహోమాన్ని సృష్టిస్టున్నారని కుకీల వాదన. వృద్ధులు, పిల్లలు అని కూడా చూడకుండా అనేక కుటుంబాలను వాళ్ళ ఇళ్ళల్లోనే బంధించి సజీవ దహనం చేశారు మేటీలు. కుకీలను వారి ప్రాంతాల నుండి తరిమి కొట్టడమే కాదు, కనిపించిన వారిని కనిపించినట్లు హతమార్చారు. ఎంతోమంది స్త్రీలను వివస్త్రలుగా చేసి ఊరేగించడమే కాక అత్యాచారాలు, హత్యలు కూడా చేశారు. కొందరి శవాలు ఇప్పటివరకూ దొరకడం లేదన్న వారికి సమాధానాలు లేవు. అంతేకాదు, ఎన్నో చర్చిలలో తలదాచుకున్న కుకీ ప్రజలలో ఎంతమంది సజీవదహనం అయ్యారో తెలియదు. చనిపోయినవారు చనిపోగా, మిగిలిన వాళ్ళలో ఎంతోమంది క్షతగాత్రులయ్యారు. పారిపోయిన వారు కొందరు అటవీ ప్రాంతంలో తలదాచుకోగా, మరికొందరు ఇతర ప్రాంతాలలో ఉన్న శిబిరాలలో తమ ప్రాణాలను కాపాడుకున్నారు. పారిపోయి వచ్చిన చాలామంది కుకీలు కాంకోపి పట్టణంలో మిషనరీ సంస్థలు స్థాపించిన శరణార్థుల శిబిరాలలో తలదాచుకున్నారు. కొంత ఆర్థిక స్థోమత ఉన్నవారు ఢల్లీిలాంటి ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు. ఏది ఏమైనా, భూ ఆక్రమణ కోసమే మేటీలు తెగబడి, తమను తరిమి కొట్టేశారన్నది కుకీల బలీయమైన వాదన. కుటుంబాలకు కుటుంబాలు ఎక్కడి వస్తువులు అక్కడే పడేసి, ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని అడవుల గుండా పారిపోయి వచ్చిన వారిలో మహిళలు, పిల్లలు, వృద్ధులు మాత్రమే ఎక్కువగా
ఉన్నారు. దాదాపు 50% యువత యుద్ధభూమిలో సైనికుల్లా తమ జాతి హక్కుల కోసం ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నారు.
విద్వేషం నింపుకున్న మేటీలు దురుద్దేశంతోనే తమను తమ ప్రాంతాల నుండి బలవంతంగా పారద్రోలే ప్రయత్నంలో భాగంగానే ఈ దాడులు చేస్తున్నారని కుకీలు భావిస్తున్నారు. మేటీలు ఎస్టీ హోదాను కోరడం వెనుక మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్ర కూడా ఉందని, అందుకు కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా కారణమన్నది వారి ముఖ్య వాదన. పెట్టుబడిదారులైన ‘అదాని’, ‘అంబానీ’లకు అటవీ ప్రాంతాన్ని అప్పనంగా అప్పజెప్పడమే ధ్యేయంగా అక్కడి ప్రభుత్వం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నందు వల్లనే మేటీలకు ఆయుధాలను అందిస్తున్నదన్నది కూడా వారి మరో ముఖ్యమైన వాదన. అటవీ భూములను పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పజెప్పే పన్నాగంలో భాగమే ఈ దాడులు అని వారు భావిస్తున్నారు. కొందరు మతతత్వ వాదులు కూడా వారి అగ్నికి ఆజ్యం పోసి, మేటీలతో అంటకాగుతూ వారికి లాభం చేకూర్చుతున్నారన్న వాదన నమ్మశక్యంగానే ఉంది. కూడా భూ అక్రమణే మేటీల ధ్యేయం కాబట్టి తమ స్వలాభాపేక్ష కోసం కలిసి ఎన్ని దారుణాలు చేయడానికి కూడా వెనుకాడడం లేదన్నది నిర్వివాదాంశం. ఒక జాతిని నిర్మూలించి, వారి హక్కుగా ఉన్న అటవీ భూముల ఆక్రమణే తప్ప మరొకటి కాదన్నది వారి భావన.
1990`92 మధ్య కాలంలో నాగా మరియు కుకీ జాతీయుల నడుమ జరిగిన యుద్ధంలో కుకీలు నష్టపోయినప్పటికీ నాగాలు తాము కోరుకున్నట్లుగా స్వరాష్ట్రం లేదా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోగలిగారు. ఆ వాతావరణం సద్దుమణిగిన తర్వాత ఇరువురి నడుమ శతృత్వం సన్నగిల్లి, దాని స్థానే సత్సంబంధాలు ఏర్పడ్డాయి. కొందరు నాగాలు ఇప్పటికీ కుకీ ప్రాంతాలలో కలిసి, మెలిసి ఉంటున్నారు. నాగాలతో కుకీలకు ఎటువంటి అభ్యంతరాలు, అసహనాలు ఇప్పుడు లేవు. కుకీల సంఖ్యా బలం కన్నా నాగాల సంఖ్యా బలం ఎక్కువగా ఉండడం వలన మేటీలు, కుకీలపై దాడులు చేసినట్లుగా నాగాలపై చేయడానికి సాహసించరు. నాగాలపై దాడి చేయడానికి మేటీలు భయపడతారు. నిజానికి మేటీలకు నాగాలతో కూడా కొన్ని రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, ఒకే సమయంలో ఇద్దరిపై దాడులు చేస్తే సంఖ్యాబలం ఎక్కువ ఉన్న నాగాలు, అల్ప సంఖ్యాకులైన కుకీలు కలిస్తే, తమ అస్థిత్వానికి ముప్పు అన్నది మేటీలకు తెలుసు కాబట్టే నాగాలపై దాడులు చేయకుండా కేవలం కుకీలను మాత్రమే సెలక్టివ్‌గా ఎంచుకొని దాడులు చేయడం ఇక్కడ రాజకీయ కుట్రలో భాగం కావడం విశేషం. ఆ కోణంలోనే ముందుగా కొండ ప్రాంతాల నుండి తరిమివేస్తూ కుకీలపై దాడి చేయడం జరిగింది. ఆ దాడుల ఫలితంగానే కుకీలు, నాగాలు కలిసి ఉన్న ప్రాంతాలలో నాగాల జోలికి పోకుండా కేవలం కుకీలను ఆయా ప్రాంతాల నుండి, నాగాల నుండి వేరుచేస్తూ, వెంటాడి వేధిస్తూ, భయాందోళనలకు గురిచేయడంతో కుకీలు తమ ధన, మాన, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పారిపోయి వచ్చి శిబిరాలలో తలదాచుకున్నారు.
కొన్ని శిబిరాలలో నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, మరికొన్ని శిబిరాలలో వివిధ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. కాస్త ఆర్థిక స్థోమత కలిగిన కొంతమంది ఉద్యోగులు, ప్రొఫెసర్లు, లాయర్లు తమ తమ కుటుంబాలతో అద్దె ఇళ్ళలో ఉంటున్నవారు కూడా, ఆర్థిక ఇబ్బందులు పడుతూ పునరావాస కేంద్రాలలో భోజనాలు చేస్తున్నారు. ఎవరిని పలుకరించినా, దుఃఖసంద్రాల ఆటుపోట్లే! ఎవరిని తట్టినా, భయానక గాయాల తలపులే! ఇరువర్గాల మధ్య ఉన్న వైరుధ్య, వైషమ్యాలు పోవాలంటే తమకు ‘ప్రత్యేక హోదాతో కూడిన రాష్ట్రం’ కావాలని అందుకోసం తాము తమ ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కుకీ జాతీయులందరూ ఏక కంఠంతో నినదించడం కొసమెరుపు.