ఆనంద తాండవమాడిరచిన జక్కీకు నవల – కొండవీటి సత్యవతి

తప్పెట్లు, తాళాలు వాయిస్తూ అపర్ణ తోట, దాసరి శిరీష గారి పేరుమీద ప్రింట్‌ చేసిన జక్కీకు నవల చదవడం ఇప్పుడే పూర్తి చేశాను. నవల చదువుతున్నంతసేపు మనసంతా గొప్ప ఆనందం తాండవమాడిరది. ఎండపల్లి భారతి చాలాకాలంగా తెలుసు.

జాతీయ స్థాయి మహిళా జర్నలిస్టుల సమావేశాలకు భారతి నవోదయం గ్రామీణ పత్రిక తరపున హాజరయ్యేది. ఆ సమావేశాల్లో చాలాసార్లు నేను భారతిని చూశాను. వెలుగు ప్రోగ్రాం కింద చిత్తూరు జిల్లాలో నడుస్తోన్న నవోదయం గ్రామీణ మహిళల పత్రిక చాలా ప్రాచుర్యం పొందింది. ఆ పత్రికలో రచయితలు, రిపోర్టర్లు, సంపాదకీయం రాసేవారు అందరూ మహిళలే ఉండటం విశేషం. నవోదయంలో గ్రామీణ మహిళల సమస్యల మీద చిన్న చిన్న ఆర్టికల్స్‌ ప్రచురించేవారు. అట్టడుగు గ్రామ గ్రామాల్లో కూడా ఈ రిపోర్టర్లు తిరుగుతూ ఆర్టికల్స్‌ను సేకరించి ప్రచురించేవారు. భారతి వారి టీం అందరూ చాలా సంవత్సరాలుగా తెలుసు. తను కథకురాలిగా ఎదిగి ‘బతుకీత’, ‘ఎదారి బతుకులు’, ‘జాలారి పూలు’ కథా సంపుటాలను ప్రచురించి ఎన్నో అవార్డులను పొందింది.
ఇప్పుడు జక్కీకు నవల గురించి నేను వివరంగా మాట్లాడాలనుకుంటున్నాను.
ప్రస్తుతం తన గ్రామంలో, తన గ్రామంలోనే కాదు, అన్ని గ్రామాల్లోను టీవీలలో వచ్చే సీరియళ్ళ చుట్టూ గిరికీలు కొడుతున్న గ్రామస్తుల గురించి, అలాగే సెల్‌ఫోన్లు, సినిమాలు, ఇవన్నీ ఇంతకుముందు తామందరూ కలిసి పండగలా జరుపుకునే జక్కీకు ఆటపాట గురించి, అది మరిచిపోయిన నేపథ్యాల గురించి భారతికి చాలా ఆవేదన ఉంది. ఎలా అయినా ఆ సంవత్సరం మొలకలు పున్నమికి గ్రామస్తులందరినీ కలగలిపి జక్కీకు ఆట ఆడిరచాలని ఆమె చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా తన ఇంటి పని, పొలం పని, వీటన్నింటితో పాటు ఊళ్ళో ఎంతోమందిని కలుస్తూ ఈ సంవత్సరం ఎలాగైనా సరే మనమందరం జక్కీకు ఆట ఆడాలని చెబుతూ, ఒప్పిస్తూ తిరుగుతుంది. తాను కలిసిన వారిని పరిచయం చేసే పద్ధతి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది.
ఆయా వ్యక్తుల మనస్తత్వాలు, అలవాట్లు, కోపతాపాలు, ప్రవర్తనలు వాటన్నింటిని ఆమె పరిపరి విధాల వర్ణిస్తూ అద్భుతంగా రాస్తుంది. ఈ సంవత్సరం ఎలాగైనా జక్కీకు ఆడాలని ఇంటింటికీ తిరుగుతూ, వారి వారి మనస్తత్వాలకు అనుగుణంగా మాట్లాడుతూ, ఒప్పిస్తూ ఊరి మొత్తాన్ని ఒక తాటిమీదకి తీసుకొస్తుంది.
నవల చదువుతున్నంతసేపూ ఒక తన్మయత్వం కమ్ముకుంటుంది. ఆమె వర్ణనలు, భాష, తాను కలిసిన ప్రతి ఒక్కరి గురించి అద్భుతంగా రాస్తుంది. మంచివాళ్ళా, చెడ్డవాళ్ళా, పిసినిగొట్టు వాళ్ళా, ఎలాంటి వాళ్ళు అనే విషయాలన్నిటిని తన పరిశీలనలోంచి ఎంతో వివరంగా రాస్తుంది.
గ్రామీణ జీవితాన్ని ఔపోసన పడితే తప్ప ఇలాంటి వర్ణనలు చేయడం సాధ్యం కాదు. ముఖ్యంగా మాదిగవాడ మనుష్యుల గురించి, వారి తిండి తిప్పల గురించి, వారి ఆటపాటల గురించి సునిశితంగా పరిశీలిస్తే తప్ప రాయడం సాధ్యం కాదు. నిజానికి, భారతి ఈ నవల కోసం చాలా పరిశోధన చేసింది. ఒక పరిశోధక విద్యార్థినిలా సూక్ష్మమైన అంశాలన్నింటినీ కూడా పొల్లుపోకుండా వర్ణించగలిగింది. మనసారా అభినందనలు భారతి.
ఈ నవలని దాసరి శిరీష గారి జ్ఞాపకార్ధం ప్రచురించడానికి ఎంపిక చేసిన ఎ.కె.ప్రభాకర్‌, పింగళి చైతన్య, తాషీ… ఈ ముగ్గురికి అభినందనలు చెప్పాల్సిందే. టీం దాసరి శిరీష జ్ఞాపిక పేరుతో ఈ ముగ్గురు ఎన్నో నవలలను చదివి భారతి నవలను సెలక్ట్‌ చేయడం చాలా సంతోషించాల్సిన అంశం. ఈ జ్ఞాపికకు ఖచ్చితంగా ఈ నవల తగినది.
ఈ నవల చదువుతున్నంతసేపూ నేను కూడా మా ఊరి మారెమ్మ తీర్థంలోకి వెళ్ళిపోయాను. మా సీతారాంపురం గ్రామ దేవత మారెమ్మ. ప్రతి సంవత్సరం మే నెలలో మా ఊళ్ళో ఈ మారెమ్మ తీర్థం జరుపుతారు. ఎక్కడినుండో ఆసాదుల పేరుతో కుమ్మరి కులానికి చెందిన కొందరు వచ్చి తలలపైన గరగలు పెట్టి అద్భుతంగా నాట్యం చేస్తారు. అలాగే మోళీ పేరుతో ఒక మ్యాజిక్‌ షో కూడా చేస్తారు. ఈ తీర్థం ఒక నాలుగు రోజుల పాటు జరుగుతుంది. మా చిన్నప్పుడు చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా పిల్లలందరం ఈ తీర్థంలో పాల్గొనడం… అందులో ముఖ్యంగా భారతి తన నవలలో వర్ణించిన మొలకల బుట్టలు లాగా, మేము జాజారి బుట్టలు పేరుతో తాటి ఆకులతో చేసిన చిన్న చిన్న బుట్టల్లో ఇసుక వేసి దాంట్లో నవధాన్యాలు పోసి తొమ్మిది రోజుల పాటు రోజూ నీళ్ళు పోస్తూ మొలకలు వచ్చేవరకు జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళం. తొమ్మిదవ నాటికి పెద్ద పెద్ద మొలకలు ఆకుపచ్చగా మెరిసిపోతూ వచ్చేవి. మారెమ్మ తీర్థం రోజు పిల్లలందరం మంచిగా తలస్నానం చేసి, మంచి బట్టలేసుకుని పచ్చగా మెరిసిపోతున్న జాజారి బుట్టలను తలమీద పెట్టుకొని, ఆసాదులు డప్పుల్తో తలలమీద గరగలు పెట్టుకొని డ్యాన్స్‌ చేస్తూ ముందు వెళ్తోంటే, పిల్లలమంతా పచ్చటి జాజారి బుట్టలు నెత్తిమీద పెట్టుకొని వారి వెంట నడిచి వెళ్ళేవాళ్ళం. మా ఇంటికి, మారెమ్మ గుడికి కొంత దూరం ఉండేది. ఆ దారంతా ఆకుపచ్చ తివాచీని మోసుకెళ్తున్నట్లుగా కనిపించేది. ఆ బుట్టలన్నీ తీసుకెళ్ళి గుడిముందు పెట్టి ఆ తర్వాత గుడి చుట్టూ పేర్చేవాళ్ళం. గుడి మొత్తం పచ్చగా మెరిసిపోయేది. భారతి రాసిన మొలకల బుట్టల గురించి చదివినప్పుడు, వారంతా బుట్టలు తీసుకుని గుడికి వెళ్ళే దృశ్యం గురించి చదివినప్పుడు నా మనసంతా మా ఊరి మారెమ్మ తీర్థం, జాజారి బుట్టలు మోసుకెళ్ళడం అనే అందమైన దృశ్యంలో మునిగిపోయింది. నిజానికి ఇప్పుడు ఈ జాజారి బుట్టలను మోసుకెళ్ళడం, నవధాన్యాలను సేకరించడం, బుట్టలో మట్టితో కలిపి పోయడం, ప్రతిరోజు మొలకలు ఎంతవరకు వచ్చాయి అని చూడడం లాంటి ఆనందాలు గ్రామాల్లో దాదాపు కనుమరుగైపోయాయి. భారతి చెప్పినట్లుగా టీవీ సీరియళ్ళు, సినిమాలు, మొబైల్‌ ఫోన్లు సామూహిక సంబరాలను, ఆనందాలను దూరం చేసేశాయి. అందరూ కలిసి చేసుకునే గ్రామీణ పండుగలన్నీ దూరమైపోయాయి. అందరం కలిసి సంబరం చేసుకోవడం, సంతోషాన్ని పంచుకోవడం అనేవి మర్చిపోయారు. ఇప్పుడు చేసుకునే కొత్త పండుగలు విపరీతమైన శబ్దాలతో, ఆడంబరంగా, ఆనందం ఏమీ లేకుండానే చేసుకుంటున్నారు. భారతి నవలంతా ఈ సామూహిక ఆనందం అంటే ఎలా ఉంటుంది, దాన్ని ఎలా కోల్పోయాము, మళ్ళీ ఎలా సంపాదించుకోవాలి అనే ఆలోచన చుట్టూ తిరుగుతుంది. జక్కీకు ఆట మాత్రమే అందరినీ ఒకే స్థాయిలో సంతోషసాగరంలో ముంచుతుందని నమ్మి తన ప్రయత్నాన్ని చాలా ముమ్మరంగా చేసి, సాధించి అందరికీ ఆనందాన్ని పంచి ఇచ్చింది. జక్కీకు ఆటలో పాల్గొన్న ఒక్కొక్క మనిషి గురించి రాస్తూ వారి చింతల్ని, వారి దుఃఖాన్ని, వారి బాధల్ని అన్నింటినీ ఎక్కడెక్కడో వదిలేసి కేవలం ఆనందం కోసం ఆడుతూ అన్నీ మర్చిపోయిన వైనాన్ని అద్భుతంగా రాస్తుంది.
ఆట సాగిన తీరు ఆకాశంలో పూర్ణచంద్రుడు, నేలమీద రేగుతున్న దుమ్ము ఎలా తమతో పాటు ఆడి పాడారు అనే అంశాన్ని అద్భుతంగా రాసింది. అసలు ఆ పోలికలు భారతి కలంలోంచి అలవోకగా ఎలా జాలువారాయో అని చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ వాక్యం చూడండి, ‘‘ఆ భూదేవి తల్లి కూడా దుమ్మయి మాతో పాటు ఆడే దానికి పైకి లేచింది’’. ఎంత అద్భుతమైన వాక్యం ఇది. వారంతా ఎగురుతూ, దుముకుతూ, పాడుతూ తిరుగుతున్నప్పుడు పైకి లేచిన దుమ్ము కూడా తమతో ఆడడానికి పైకి లేచింది అని రాయడం అద్భుతం. ఇలాంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి. మనం ఏరుకోవాలే గానీ, అద్భుతమైన వాక్యాలు, వర్ణనలు ఈ నవలలో చాలా చాలా ఉన్నాయి.
ఆడి, ఆడి అలసిపోయిన అందరిలోనూ ఆనందం చిందులు వేయడం గురించి ఇలా రాసింది.
ఈలలకు, కూతలకు, కేకలకు, పాటలకు, దరువులకు, చిడతల శబ్దాలకు, గజ్జెల మోతలకు ఆ లోకం, ఈ లోకం ఒకటే ఆనందం కమ్ముకుంది. ఆడి ఆడి, పాడి, ఎగిరి ఎగిరి ఆయాసం తన్నుకొచ్చి అలసిపోయి ఆగినాక ఆనంద కన్నీళ్ళు ఆ భూదేవిని అంటున్నాయి అంటూ భారతి ఈ నవలను ముగించింది. ఏ సామూహిక ఆనందం కోసం జక్కీకు ఆడాలని తపనపడి ఎంతో ప్రయత్నం చేసి విజయవంతంగా ఆడిన తర్వాత మిగిలింది ఆనందం మాత్రమే అని భారతి చివరగా చెప్పింది. ఇంత అద్భుతమైన, స్వచ్ఛమైన, ఒరిజినల్‌ నవలను దాసరి శిరీష గారి జ్ఞాపకంగా ఎంపిక చేసి, ముద్రించిన అపర్ణకి బోలెడన్ని హగ్గులు. అలాగే టీం దాసరి శిరీష జ్ఞాపిక ముగ్గురికీ కూడా చాలా చాలా అభినందనలు, ధన్యవాదాలు. కిరణ్‌ కుమార్‌ గారి అర్థవంతమైన కవర్‌ పేజీ, లోపలి బొమ్మలు చాలా బావున్నాయి.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.