(హైదరాబాద్ నగరంలో 16.1.2024న ఇద్దరు పిల్లల తల్లి పుష్పలతను ఆమె భర్త తల తెగ నరికి చంపాడు. అంకురం పిల్లల హోంలో చదువుకున్న పుష్పను, ఆమె పాపని ఈ ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే కలిశాను. పుష్ప, అలాంటి అనేకమంది స్త్రీల జీవితాలు రేపిన నా లోపలి కల్లోలమే ఈ కవిత)
చిగురుటాకుల ఎర్రటి అధరాలు లేవు
వాటి కొసన వెలిగే చిరునగవులు లేవు
సోగకళ్ళ చీకటి కాటుక నేత్రాలు లేవు
నక్షత్రాల్లా వెలిగే చూపులు లేవు
సంపెంగ కొసల నాసికలు లేవు
ఆ కొసన సూర్యకిరణమై మెరిసే పుడక లేదు
చెవులకు వేలాడే లోలాకులు లేవు
అలల రెక్కల తుమ్మెద కురులు లేవు
మాటని, శ్వాసని, జ్ఞానాన్ని,
సకల భావోద్వేగాలని, నవనాడులను
నియంత్రించి, దేహాన్ని నడిపే
కోట్లాను కోట్ల న్యూరాన్ల సంగమ కూడలి
మానవ పురా రహస్య పేటికలో దాగి
ఇంకా పూర్తిగా కనుగొనని
మెలితిరిగి, ముడతలు పడిన
మెదడు అసలే లేదు
మనసు, హృదయాల ఊసన్నది
లేదు గాక లేదు
ఖండిత శిరస్ స్త్రీలకి దేహం ఉంది
రెండు చేతులున్నాయి
వాటి మధ్య రెండు రొమ్ములున్నాయి
ఆ కింద రెండు కాళ్ళు, వాటి మధ్య
ఓహో! మహాద్భుత మర్మావయము ఉంది
ఏమి చేతులవి
సమస్త చాకిరీనీ ప్రతిఫలం అడగకనే
నిరంతరం చేస్తాయి
ఏమి రొమ్ములు అవి
మెత్తటి దూది తలగడల సుఖ నిద్రని
పురుషుడికి ఇస్తాయి
శిశువులకి పాలిస్తాయి
మర్మావయం అపరిమిత ఆనందాన్ని,
వాడికి సంతానాన్ని ఇస్తుంది
అనాదిగా స్త్రీల అపజయాలను
మగవాడి గెలుపు ధ్వజస్తంభాలను నాటే
పవిత్ర బలిస్థలం అది
మొండేలు, మొండేలుగా నడిచే స్త్రీలు
వట్టి దేహమై నడిచే స్త్రీలే లోకమంతటా
పని చేసేందుకు, పడుకునేందుకు
పిల్లల్ని కనేందుకు
స్త్రీలకు తలలు ఎందుకు?
మొండేలు చాలు
వారసుల్ని, సుఖాలను ఇవ్వగల అవయవాలు,
మాంసపు ముద్దలు
వట్టి శరీరాలు గల తెగిన
శిరస్సుల స్త్రీలు చాలు
ఒక తల తెగనరికిన స్త్రీని
ఇప్పుడే సమాధి చేసి వస్తున్నాను
దుఃఖ, దుఃఖంగా ఉంది లోన
నా తల నా చేతుల మధ్య నిలిచి
అడుగుతోంది నన్ను ఇప్పుడు
నువ్వు శిరస్సు తెగిన దేహానివా
లేక శిరస్సు ఇంకా దేహానికి
మిగిలి ఉన్న మనిషివా
లేక ప్రశ్నించగల శిరస్సువా అని
వాడు దేహాలు మాత్రమే గల స్త్రీలు జన్మనిచ్చిన కొడుకైనా
వాడు దేహాలు పరిచిన స్త్రీల సఖుడైనా
వాడు అనేకమార్లు
తల్లి తల తెగనరికిన
పరశురాముడి వారసుడిగా చివరికి తేలుతాడు
తెగిన స్త్రీల శిరస్సులు నేలలో నాటిన
విత్తనాలై మొలకెత్తుతాయి
తెగిన స్త్రీల శిరస్సులు మాట్లాడతాయి
తమ బాధాకర, చిత్రహింసల జ్ఞాపకాల గురించే కాదు
నరికిన వాడి చేతులకంటిన నెత్తుటి గురించి
దేహంపై శిరస్సులు ఇంకా మిగిలిన వాళ్ళ
మౌన అంగీకారాల గురించి
అవి నిలదీస్తాయి
పరశురామా!
నీ గొడ్డలి ఈ స్త్రీల చేతులకి అందితే అప్పుడేమవుతుంది?
ఆ ముగింపు కోరకనే కదా యుగాలుగా
స్త్రీలు ఖండిత శిరస్సులైంది?
నా వలే, నీ వలే
దేహాలు మాత్రమే మిగిలిన స్త్రీలు తమ
శిరస్సులు వెతుక్కుంటూ బయలుదేరారు
పరశురామా!
(ఈ కథకు ఇక ముగింపు తప్పక పలుకుతారు వాళ్ళు)