వంటింటి సామ్రాజ్యాన కట్టిపడేసిన ఇనుప సంకెళ్లు
ఇప్పుడిప్పుడే తెగుతున్నాయని సంబరపడ్డా
ఇంటిని చక్కదిద్దిన నేర్పు…
ఊరిని వృద్ధిపథంలో నడిపే మార్గమై,
పల్లె రాజకీయ గురువుగా ఎదుగాలని
ఆశల రెక్కలతో గగన విహారం చేస్తూ
మహిళా సాధికారత మొదలైందని మురిసిపోయా
నను పంజరాన చిలుకను చేసి
పంచాయతీనేలే రాజులా నా ఇంటాయన
అధికార దాహం ఆరంభమైంది
పతి పదవీ కాంక్ష పడతి రిజర్వేషనని తెలీక
తొలి అడుగు వేయకనే బోర్లాపడ్డా
సాలెగూడులా అల్లుకునే ముళ్లకంచెను ఎరుగక
హక్కుల సాధనకై గొంతు విప్పా
పెయ్యంతా పచ్చి పుండయ్యింది
సంద్రపు కెరటాల కల్లోలం మొదలై
అనుమాన బీజం మొలకెత్తి
పాకశాల మసిగుడ్డలా…
నా బతుకున చెరగని మరకలు పులిమి
నిత్యం నిప్పుల కుంపటిలా మార్చిందీ కుర్చీ వ్యామోహం
ఇదే కదా…
వామనుడి మూడో పాదమై
అతివను అధఃపాతాళానికి తొక్కి
ఉక్కు సంకెళ్లతో బంధిస్తున్నది.