లింగ వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచే ఉద్యమించి, సామాజిక, సాంస్కృతికోద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన జ్యోత్స్న భౌతికంగా మనకు దూరమయ్యారు. రాజస్థాన్ లో జరిగిన రోడ్ ప్రమాధంలో తను మృత్యువాత పడిరదనే నిజాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది.
మనసు నిండా జ్యోత్స్న జ్ఞాపకాలే రాయాలని కలం పట్టుకుంటే అక్షరాలు ముందుకు కదలటం లేదు. తన మరణం కుటుంబానికే కాదు ఆమెతో అనుబంధం ఉన్న వారికి, మరీ ముఖ్యంగా మహిళా చైతన్యం కోసం తను స్థాపించి ముందుకు నడిపిస్తున్న సేఫ్, తరుణీతరంగాలకు పూడ్చలేని లోటు.
కలిగినింటి పుట్టినా ఏనాడూ ఆమె భేషజాలకు పోలేదు. విద్యార్ధి దశ నుండి అసమానతలు లేని సమాజాన్ని ఆశించి ఆ దిశగానే తుది వరకు తన ప్రయాణం సాగించింది. తండ్రి వృత్తిరీత్యా బదిలీలు వుండటంతో జోత్స్న బాల్యంలో పెద్దమ్మ సరోజనమ్మ వద్ద పెరిగింది. విజయవాడ ఎస్ఆర్ఆర్, మాంటిస్సోరి, స్టెల్లా కాలేజీల్లో చదివి ఎం.ఏ పూర్తి చేసింది. మోటూరి హనుమంతరావు, ఉదయం గార్లతో సాన్నిహిత్యం తనను ఎంతగానో ప్రభావితం చేసారు. ఎం.హెచ్ ప్రోత్సాహాంతో దినపత్రికలతో పాటు అభ్యుదయ సాహిత్యాన్ని, మార్క్సిస్టు సిద్దాంత గ్రంధాలను అధ్యయనం చేసింది. ‘ఇంటి చాకిరీ’ కారణంగా మహిళలలోని సృజనాత్మక శక్తి అణగారిపోతుందని మహిళలు సామాజిక ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే ఆర్థిక స్వేచ్ఛ పొందగలుగుతారన్న లెనిన్ మాటలు తనని ఆలోచింప చేసాయి.సోషలిస్టు విప్లవం విజయవంతమై లెనిన్ నాయకత్వాన సోవియట్ యూనియన్ ఏర్పడిన తర్వాత మహిళా విముక్తి కోసం ఆ దేశం చేపట్టిన చర్యల గురించి తెలుసుకొని అలాంటి సమాజం రావాలని కోరుకుంది.
విద్యార్థి దశ నుంచే అభ్యుదయ భావాలతో
విద్యార్థి దశలోనే అధ్యయనం` పోరాటం అనే ఎస్.ఎఫ్.ఐ నినాదాన్ని అందుకొని విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పని చేసింది. విద్యార్థినుల విభాగానికి కన్వీనర్‌గా చురుకైన పాత్ర వహించింది. మోటూరు ఉదయం గారి నాయకత్వంలో కరాటే శిక్షణా శిబిరానికి విద్యార్థినులను సమీకరించి తనూ శిక్షణలో పాల్గొంది. తన భావాలే కలిగి విద్యార్ధి ఉద్యమంలో పనిచేస్తున్న సుంకర రాజేంద్రప్రసాద్‌కు, జ్యోత్స్నకు 1982 మే 2వ తేదీ పెద్దల సమక్షంలో నిరాడంబరంగా వివాహం జరిగింది. వివాహానంతరం మహిళా సంఘం, సిపిఎం విజయవాడ నగర కమిటీలో సభ్యురాలిగా, ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యింది. నెల్లూరులో దూబగుంట రోశమ్మ ప్రారంభించిన సారా వ్యతిరేక ఉద్యమాన్ని మహిళా సంఘం రాష్ట్రవ్యాపిత పోరాటాలుగా నడిపిన నాడు విజయవాడ నగరం ఉద్యమంలో పోలీసుల లాఠీలు ఆరెస్టులు ఎదుర్కొంది. విజయవాడ నగర అభివృద్ధి కమిటీ సభ్యురాలిగా స్థానిక సమస్యలను అధ్యయనం చేసి డిమాండ్స్ రూపొందించి పరిష్కారానికి జరిగిన కృషిలో జ్యోత్స్న తనకు ఇచ్చిన బాధ్యతను అమలు చేసింది.
మహిళలకు బాసటగా
1992లో మానికొండ సూర్యావతి, బిక్షావతిగార్ల సారధ్యంలో బాధిత మహిళలకు అండగా కృష్ణాజిల్లా న్యాయ సలహా సంఘాన్ని స్థాపించాము. ఆ కౌన్సిలింగ్ సెంటర్‌ను వారానికి ఒక రోజు జ్యోత్స్న, నేను నిర్వహించే వాళ్లం. రాజేంద్రగారి ఆఫీసునే లీగల్ సెల్‌కి ఉపయోగించే వాళ్లం. ఒంటరి మహిళలకు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా కూడా ప్రయత్నాలు చేశాము. శ్రామిక విద్యాపీఠం డైరెక్టరు విద్యాఖన్నా గారి ద్వారా సర్ఫ్, సబ్బులు, జామ్‌లు, జ్యూస్‌లు, చట్నీలు తయారీలో శిక్షణ నిప్పించాం. జనవిజ్ఞాన వేదిక, ఐలూ తో కలిసి పుట్టుక దగ్గర నుంచి చనిపోయే వరకు వివక్ష రూపాలు, చట్టాలపై ఫోటో ఎగ్జిబిషన్ తయారు చేసి రాష్ట్ర వ్యాపితంగా ప్రచారం నిర్వహించాము. ఇందులో జ్యోత్స్న, రాజేంద్ర గారిది ప్రధాన పాత్ర. 1998 నుండి 2001 వరకు ఫ్యామిలీ కోర్డు లోకాలద్లో సభ్యురాలిగా తీసుకొన్నారు. న్యాయస్థానానికి వచ్చిన దంపతుల మధ్య వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో చురుకైన పాత్ర వహించింది.
పాలనా పగ్గాలు చేపట్టిన మహిళలకు శిక్షణలోనూ కీలకంగా :`
73వ రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన 33 శాతం రిజర్వేషన్‌తో 1994వ సంవత్సరంలో దేశంలో స్థానిక సంస్థలకు ప్రతినిధులుగా 10 లక్షల మంది మహిళలు ఎన్నికయ్యారు. అయితే పాలనా బాధ్యతల్లోకి నేరుగా మహిళలకు అవకాశం ఇవ్వకుండా పెత్తందార్లే పాలన సాగిస్తూ మహిళల హక్కును కాలరాస్తున్న సమయంలో ఈ దోరణీని వ్యతిరేకిస్తూ ఐద్వా ఆందోళనకు దిగింది. అ సమయంలో ఐద్వా నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆ తర్వాత 1996లోనూ, 2001లో గెలిచిన మహిళలను చైతన్యపర్చేందుకు, పరిపాలనా మెళకువులు నేర్పేందుకు హైదరాబాద్ రాజేంద్రనగర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో సర్పంచులకు శిక్షణ ఇచ్చేందుకు సిలబస్ తయారు చేసి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులకు ట్రైనింగ్ ఇవ్వటానికి ఫెసిలిటేటర్‌గా ప్రభుత్వం నియమించింది. నాతోపాటు ఈ కార్యక్రమంలో జ్యోత్స్న ఇన్వాల్వ్ అయ్యింది. ఈ ట్రైనింగ్ ద్వారా మహిళలు చైతన్యమై మంచి ఫలితాలు సాధించారు. ఎంతో మంది మహిళలు తమ శక్తి సామర్ధ్యాలను నిరూపించుకుని జాతీయ అవార్డులు అందుకున్నారు.
తరుణీ తరంగమై
2018లో విజయవాడ నగరంలో అభ్యుదయ మహిళా సంస్థలు, వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖలతో కలిసి ‘తరుణీ తరంగాలు’ ఏర్పాటు చేశాం. మహిళలు, యువతులు, విద్యార్ధినుల్లో ఉన్న సృజనాత్మకతను, కళలను వెలుగులోకి తెచ్చేందుకు ఆ వేదిక ద్వారా ప్రయత్నం చేశాం. ఐదు సంవత్సరాలు నిర్విఘ్నంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ఈ కార్యక్రమాల్లో భాగంగా కల్చరల్, ఎకడమిక్ అంశాలను నిర్ణయించటంలోనూ, పోటీలను నిర్వహించటంలోనూ టీంతో పాటు జ్యోత్స్న ప్రధాన కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు.
మహిళా సాధికారత కోసం అడుగు ముందుకు
2022లో ‘మహిళా రక్షణ ` సామాజిక బాధ్యత’ అనే థీమ్‌తో ‘‘మహిళా సాధికారిత కోసం ఒక అడుగు ముందుకు వేద్దాం’’ (స్టెఫ్ ఎహెడ్ ఫర్ ఈక్వాల్డీ ` సేఫ్) అనే కాన్సెఫ్ట్‌తో స్వయంగా సేఫ్‌ను స్థాపించింది. అనతి కాలంలోనే సుమారు 21 కాలేజీల్లో సేఫ్ కమిటీలు ఏర్పాటు చేసి నిర్విఘ్నంగా విద్యా, వైజ్ఞానికమైన బహుముఖ కార్యక్రమాలు నిర్వహించింది.
మహిళల రక్షణ సామాజిక బాధ్యతగా గుర్తిద్దాం. ఇంటి నుండే సమానతకు నాంది పలుకుదాం. ఇంటా బయటా స్త్రీలు పలికే ‘నో’ కు విలువ, గౌరవిద్దాం. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరిగే లైంగిక దాడులను వ్యతిరేకిద్దాం. పోక్సో మరియు అశ్లీల సాహిత్యం, అశ్లీల చానల్స్ పట్ల అప్రమత్తంగా ఉందాం. మాదకద్రవ్యాలు, మద్యం నుండి యువతను కాపాడుకుందామని పిలుపు నిచ్చింది. కాలేజీల్లో సెమినార్లు, వర్క్‌షాపులు నిర్వహణ ద్వారా సామాజిక స్పృహ కల్పించాలని, శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించాలని, మహిళలు తమ ఇష్టమైన రీతిలో ఇంటా, బయటా స్వేచ్ఛగా, గౌరవంగా జీవించటానికి రాజ్యాంగం కల్పించిన హక్కులను, కాలరాయరాదనే అంశాలపై సేఫ్ తరుపున కాలేజీల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. వీటితో పాటు ఎస్.ఆర్.ఆర్ కాలేజీలో రెండు రోజులు మహిళల వివక్షత, అసమానత, లైంగిక వేదింపులపై వర్క్‌షాప్ నిర్వహించింది. లయోలా కాలేజీ యాజమాన్యంతో కలిసి 2023లో సైన్స్ ఫేర్ రెండు రోజులు ఘనంగా జరిపింది.
ఆలోచనల్లో నిత్య నూతనం
జ్యోత్స్న ప్రవహించే నదిలా నిత్య నూతనంగా కొత్త కొత్త ఆలోచనలతో ప్రణాళికలు సిద్ధం చేసేది. ఆమె సృజానాత్మకత, అధ్యయనం, క్రియాశీలత, పట్టుదల ప్రతి కార్యక్రమంలో వ్యక్తమయ్యేది. విజయవాడ నగరంలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, సేఫ్ మొదలైన 10 సంఘాలు కలిసి 2023, 2024 సంవత్సరాల్లో ప్రత్నామ్నాయ కల్చర్‌ను అభివృద్ధి చేసేందుకు దసరా సాంస్కృతికోత్సవాలు ఘనంగా నిర్వహించాం. దసరా సాంస్కృతికోత్సవంలో చెడు దునుమాడుదాం` మంచిని పెంచుదాం అనే థీమ్‌తో కాలేజీ స్టూడెంట్స్, యువతీ, యువకులకు మహిళా సమస్యలు, లైంగిక వేదింపులు, ఆత్యాచారాలు, పోర్న్, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాలు, పర్యావరణం, మత సామరస్యం మొదలైన అంశాలపై వివిధ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు, యువతి, యువకులకు 22 ఈవెంట్స్‌లో పోటీలు జరిగాయి. 2018 నుండి ఏటా జరుగుతున్న అమరావతి బాలోత్సవాలు ` పిల్లల పండుగలో ప్రత్యేక శ్రద్ధతో క్రియాశీల పాత్ర నిర్వహించింది.
ఆమె వ్యక్తిత్వం, సృజానాత్మకత, క్రియాశీలత, అధ్యయనం, నిరంతర శ్రమ, పట్టుదల, ఇన్ని అంశాలు ఒక వ్యక్తిలో నిబిడీకృతం ఉండటం చాలా అరుదు. జ్యోత్స్నలో తను తీసుకున్న బాధ్యతను విజయవంతంగా తన శక్తి సామార్థ్యాలు ప్రదర్శించేది. విద్యార్థి, మహిళా ఉద్యమాల్లో, తరుణీ తరంగాలు, సేఫ్, అమరావతి బాలోత్సవాలు, దసరా సాంస్కృతికోత్సవాలు నిర్వహణలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకొంది.తను తీసుకున్న బాధ్యత ఏదైనా విజయవంతంగా నిర్వహించగలిగే శక్తి సామర్థ్యాలు జ్యోత్స్నలో మెండుగా ఉన్నాయి.
ఇంటా బయటా సమన్వయం
బయట ఎంత బిజీ షెడ్యూల్డ్ ఉన్నా కుటుంబానికీ అంతే బాధ్యతగా అన్నీ తానై నిలిచింది. పిల్లల చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించింది. ఇంటి పైన టెర్రస్ గార్డెన్, రూఫ్ గార్డెన్ నిర్వహణ తనదే. ఇంటికి వచ్చిన వారు గార్డెన్ చూసి అబ్బుర పడతారు. కుటుంబ వ్యవహారాలన్నీ జ్యోత్స్న సక్రమంగా నిర్వహించడటం వలన రాజేంద్ర గారు ఐలూ బాధ్యతలోనూ, ప్రాక్టీస్‌లోనూ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగించటానికి వీలు కల్గింది.
సహజంగా సమాజంలో నీవు ఆడదానికి నీకేం తెలుసు అని తేలికగా తీసేస్తారు. అవకాశాలు లభిస్తే ఎందులోనయినా రాణించగలమని కుటుంబ వ్యవహారాల్లోనూ, ఉద్యమాల్లోనూ తన ప్రతిభా పాటవాలను, సృజనాత్మకతను నిరూపించుకుంది.
దసరా సాంస్కృతికోత్సవాలే చివరి సంతోషాలు
సెప్టెంబర్ 26`28 తేదీలలో జరిగిన దసరా సాంస్కృతికోత్సవాలే జ్యోత్స్నతో కలిసి మేము పంచుకొన్న చివరి సంతోషాలు. ఆ ఉత్సవాల నిర్వహణలో మెమెంటోలు, బ్యానర్స్, బ్రోచర్స్, సర్టిఫికేట్స్ అన్ని విషయాల్లో తను ప్రత్యేక శ్రద్ద తీసుకుంది. ఆక్టోబర్ 1వ తేదీన బాలోత్సవ భవన్లో మేము ముగ్గురం కలిసి దసరా ఉత్సవాల పై చర్చించుకొన్నాము. సక్సెస్ మీట్ గురించి ప్రస్తావిస్తే నేను లేకపోయినా అలస్యం చేయకుండా వెంటనే జరపండని సలహా ఇచ్చింది. దసరా ఉత్సవాల ప్రారంభ సభలో సనాతన ఆచారాలు, మూఢనమ్మకాలు, మతం, కులం, యువతలో వస్తున్న మార్పులు, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, మహిళలపై హింస మొదలైన విషయాలపై ప్రసంగించింది. అదే తన చివరి ప్రసంగం.
1985 నుండి జ్యోత్స్నతో నాకు పరిచయం ఉన్నా 1988లో నేను కృష్ణాజిల్లా కార్యదర్శిగా ఉన్న కాలంలో పరిచయం పెరిగింది. నేను, జ్యోత్స్న, విజయ ముగ్గురం అనేక ఉద్యమాల్లో కలిసి పని చేశాము. ఉద్యమ స్నేహం మా మధ్య బలమైన బంధంగా మారింది. నాకు సంబంధించిన అన్ని విషయాల్లో విజయతో పాటు ఎంతో శ్రద్ద వహించే జ్యోత్స్న అకాల మరణం తన కుటుంబంతో పాటు వ్యక్తిగతంగా నాకు కూడా తీరని లోటు. సాధికారిత కోసం పరితపించే శక్తులకు పెద్ద లోటు, జ్యోత్స్న ఆశయాలను ముందుకు తీసుకువెళ్లటమే మనం ఆమెకు ఇచ్చే నివాళి. (ఐద్వా సీనియర్ నేత)