స్త్రీవాద ఉద్యమాలు స్త్రీల అనేక సమస్యలపై ప్రశ్నించాయి. ఈ క్రమంలో వికృత అస్థిత్వాన్ని కలిగిన పురుషాధిక్యతని ఆమె అడవిని జయించింది నవల ప్రశ్నించింది. స్త్రీ భావోద్వేగాన్ని బలంగా ప్రతిఫలించిన ఈ నవలలో ‘‘సమాజం’’ ఒక అడవిగా చెప్పబడిరది.
అడవి అంటే అజ్ఞానం, అనాచారం, విశృంఖలత, అర్థంలేని బంధనాలు, కట్టుబాట్లు చీకటి తత్వాలు, సంప్రదాయాల పేరుతో కొనసాగుతున్న దాష్టీకాలు, మొదలగునవి. ఒక అడవిలో క్రూరమృగాలు ఎన్ని వుంటాయో, ఒక సమాజంలో ఆ మృగాలకు సమానమైన నిబంధనలు కేవలం స్త్రీ అస్తిత్వాన్ని కప్పివేస్తూ వుంటాయనేది కథాంశం. ఇటువంటి అడవిని ఒక స్త్రీ జయించడం లేదా గెలవడం అనేది చీకటి నుండి వెలుగులోకి ప్రవేశించడమే. అడవిని జయంచడం మాటను తిమిర సంహారంగా అనుకోవచ్చు.
ఈ నవలలో చర్చించిన అనేక అంశాలను పురుషాధిక్యత ప్రధాన అంశం. స్త్రీవాద ఉద్యమం ప్రశ్నించిన అంశాల్లో కూడా పురుషాధిక్యతే ప్రధాన అంశం. పురుషాధిక్యతలో బహుశ వ్యక్తిత్వాన్ని చర్చించిన ఈ నవల
ఉస్మానియా విశ్వ విద్యాలయం ఎం.ఎ. కోర్సులో పాఠ్యాంశంగా రావడం ఇక్కడ గుర్తించాల్సిన విషయం.
‘సంధ్య’ పాత్ర కేవలం ఏ ఒక్క మహిళనో ఉద్దేశించి కాదు. ఎందరో మహిళల అంత సంఘర్షణకు ప్రతిరూపం సంధ్య. స్త్రీ జీవితాల చుట్టూ కంచెలు నిర్మించే ఎన్నో ప్రశ్నలకు సమాధానమై సంధ్య పాత్ర ముందుకు నడుస్తుంది. ఇక్కడ ‘సంధ్య’ అనేది ఒక ఆలంబన కోసం నడిచే పాత్ర మాత్రమే. వాస్తవానికి అక్కడ కనిపించేది స్త్రీ సమస్య! సంధ్య పాత్ర చుట్టూ అనేక రకాల మానసిక సామాజిక అస్తవ్యస్త వ్యవస్థలు కనిపిస్తాయి. ఈ అన్ని అవస్థల్ని చేధించుకుని తీరాన్ని చేరే సమున్నత వ్యక్తిత్వంతో కన్పించే సంధ్య పాత్రలో ఒక స్త్రీ కాదు. స్త్రీ సామూహిక వ్యవస్థ కనిపిస్తుంది. పితృస్వామ్య బహుళ అస్థిత్వం శాఖలుగా విస్తరించి ఎన్ని ముఖాలుగా స్త్రీ అభివృద్దిని నిరోధిస్తూ ఈ సమాజంలో తన వికృతాన్ని ప్రదర్శిస్తున్నదో, సంధ్య పాత్ర చుట్టూ కల్పించిన పరిస్థితుల్లో గీతాంజలి స్పష్టంగా వివరించింది. దేశంలో స్త్రీవాద ఉద్యమాలు, పురుషాధిక్యత మీద ఎక్కుపెట్టిన ప్రశ్నలు, అనేక విధాలుగా స్త్రీలు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఘర్షణలు, వీటన్నింటి నేపథ్యంలో పితృస్వామ్య భావజాలం స్త్రీలను కూడా ప్రభావితం చేసి, సాటి స్త్రీలను శత్రువులుగా భావించే దురావస్థ గురించి కూడా గీతాంజలి నవలలో చర్చింది.
కథాంశం ఒక కుటుంబ నేపథ్యం. ఒక కుటుంబం ఆలంబనగా విభిన్న మనస్థత్వాల ఆవిష్కరణ చేయడంలో రచయిత్రి గీతాంజలి సగటు జీవితాలను కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టగలిగింది. ప్రతి పాత్ర సగటు జీవితాలకు ప్రతీక కావడం, సమాజం యధాతథంగా చిత్రించడం కథకు బలాన్ని చేకూర్చింది.
నవలా నాయకి సంధ్య. ఈమె తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి. కర్కశమైన మనసుతో వుంటాడు. కటువుగా ప్రవర్తిస్తుంటాడు. ఇంట్లో భార్యపిల్లలు తన కనుసన్నల్లో మెలిగే యంత్రాలుగా భావిస్తుంటాడు. సంధ్య తల్లి భానుమతి ఉపాధ్యాయినిగా పనిచేస్తుంది. భర్త తీరుకు విసిగిపోతుంది. మనశ్శాంతి కరువై అంత సంఘర్షణతో నిత్యం అతలాకుతలం అవుతుంది. భానుమతిది కులాంతర ప్రేమ వివాహం. ఈ కారణంగా అటు పుట్టింవాళ్ళు, ఇటు అత్తింటి వాళ్ళు దూరమౌతారు. మానసిక ఒత్తిడికి లోనవుతుంది. నిత్యం అగ్నిగుండంలా రగిలిపోతూ వుంటుంది.
సంధ్య తండ్రి కోపానికి అసహనానికి ఆత్మీయులు దూరం కావడం కూడా ఒక కారణంగా అర్థమౌతుంది. ప్రేమ వ్యామోహం మనసుల్ని ఎంతగా లోబరుచుకుంటాయో, మోహం తీరిన తర్వాత అదే ప్రేమ, వ్యామోహం అడుగంటుకుపోతాయి. జీవితాలను ఎంత చిత్రవధ చేస్తాయో పాత్రల ప్రవర్తనలతో తెలుస్తుంది. సంధ్య వాళ్ళు మొత్తం ఐదుగురు తోబుట్టువులు. వీళ్ళలో ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. శౌర్య, జగన్నాథం, యమున, చెవిటి వాళ్ళుగా వుంటారు. శౌర్య పోలియో సోకి అవిటితనంతో వుంటాడు. ఈశ్వరి, సంధ్య ఇద్దరు మాత్రమే సాధారణ ఆరోగ్యంతో వుంటారు. ఈ ఇద్దరిపై తల్లికి ప్రేమ లేనట్లుగా తోస్తుంది. అస్తమానం విసుక్కున్నట్లుగా కోప్పడుతున్నట్లుగా తోస్తుంది. అవిటితనం వున్న పిల్లల మీద తల్లి ప్రేమ వాత్సల్యాలు గొప్పగా కాకపోయినా, తిరస్కార ధోరణి మాత్రం కనిపించదు. తల్లిదండ్రుల గొడవలు వారి కోపతాపాలు, వీటి మధ్య సంధ్య బాల్యం గాయపడుతుంది. బాల్యంలో పొందాల్సిన తల్లిదండ్రుల ప్రేమ, అనుబంధం, ఇవి కొరబడి మనసు మొండిగా మారుపోతుంది. తల్లిదండ్రుల ప్రవర్తన ఆమె హృదయం మీద బలంగా ముద్రించుకుపోయి మానవ సంబంధాలు పట్ల అపనమ్మకం ఏర్పడుతుంది.
ఒకవైపు తల్లిదండ్రుల మధ్య కొరవడిన ఏకాభిప్రాయం, సఖ్యత, అనుబంధం. మరోవైపు చెవిటి వాడైన అన్న జగన్నాథం తనని శత్రువుగా చూడటం, ఇంకోవైపు చెల్లెలు యమునకు చదువు చెప్పే బాధ్యతను మోస్తూ ఎదుర్కునే ఇబ్బందులు, ఇవన్నీ సంధ్యను మానసికంగా కృంగదీస్తాయి. వైద్య విద్యార్థిగా వున్న సంధ్యకు చంద్రం పరిచయం అవుతాడు. ఇద్దరి మనసులు కలుస్తాయి చంద్రం ద్వారా మానసికంగా ఉపశమనం పొందిన సంధ్య, అతడి సహచర్యంలో బాల్యం నుండి గాయపడుతూ వచ్చిన జీవితానికి ఓదార్పును ఆలింగనాన్ని పొందుతుంది. చంద్రం విశాలమైన మనసు వున్నవాడు. ఆదర్శభావాలు కలిగినవాడు. చలం కోరిన స్త్రీ స్వేచ్చను గౌరవించడం తెలిసిన వాడు. ఇన్ని గుణగణాలతో సంధ్యలోని ప్రతి అంశాన్ని గౌరవిస్తాడు.
చంద్రం స్నేహితుడు సిద్దార్థ, అరుంధతులు సంధ్యకు పరిచయం అవుతారు. సిద్ధార్థ మంచి స్వభావం వున్నవాడే కానీ విభిన్న మనస్తత్వం కలవాడు. కాబట్టే స్నేహితుడి భార్య అయిన సంధ్య మీద ఆసక్తి పెంచుకుంటాడు. భార్యను ప్రేమించడంలో ఎటువంటి లోపంలేని చంద్రం, తన పని తాను చేసుకోవడంలో బద్దకం వహిస్తాడు. ఇతనిలో పరస్పర అనురాగం ప్రేమ వంటివి కనిపిస్తాయి. చంద్రంలో వున్న మరోక గుణం సౌందర్యారాధన. కనిపించిన ప్రతిస్త్రీని దొంగచాటుగా చూసే అలవాటు. ఇది అతని ద్వంద్వ మనస్తత్వాన్ని చూపెడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో శ్రావణమాస వ్రతాల కోసం అత్తగారిటికి బోధ్ ప్రాంతానికి సంధ్య వెళ్తుంది. అక్కడ అత్తామామలు, తోటికోడళ్ళు, ఇట్లా కుటుంబ సభ్యులతో పాటుగా బయటి వాళ్ళతో రకరకాల అనుభవాలను ఎదుర్కొంటుంది. అత్తగారింట్లో ఫ్యూడల్ పద్దతులు కూడా సంధ్యను ఆలోచింపజేస్తాయి. అక్కడ పనివాళ్ళయిన స్త్రీలమీద చూపెట్టే వివక్ష గురించి సంధ్య ఆలోచిస్తుంది.
‘‘ఒసేయ్ చెంద్రీ ` అని పిలవాలా? చెంద్రి అని పిలవలేదూ? కులవ్యవస్థ దొంతరలో వాళ్ళకున్న స్థానం వల్ల ఆ పిలుపు వాళ్ళకు కరిపోతాయి కాబోలు అని మౌనంగా అంగీకరిస్తారు’’ అంటూ అత్తింట్లో కిందిస్థాయి మహిళల్ని పిలవడం పట్ల సంధ్య సహించలేక పోతుంది. చాకలి, మంగలి, కూలి వెళ్ళే ఇతర నిమ్న వర్గాల స్త్రీలు వారి ఆత్మాభిమానం గురించి సంధ్య తనలో తనే అనేక ప్రశ్నలు వేసుకుంటుంది. సంధ్య సాధారణ కుటుంబం నుండి వచ్చినప్పటికీ అసాధారణ ఆలోచనలు వుంటాయి. సమాజానికి సేవ చేయాలనేది మొదటి లక్ష్యంగా వుంటుంది. ఒక డాక్టరుగా ప్రాక్టీసు పెట్టి తన సమాజసేవను కొనసాగించాలి అనుకుంటుంది. వివాహం తర్వాత పిల్లలు కలిగితే ఆశయానికి అడ్డంకిగా భావిస్తూ, చంద్రాన్ని కుటుంబ నియంత్రణ పాటించమంటుంది. అతడు ఒప్పుకోడు. దాంతో తానే మాత్రలు వాడుతుంది. కానీ ఒకసారి మాత్ర తప్పడంతో గర్భవతి అవుతుంది. బ్రూణహత్యలు మహాపాపంగా భావిస్తూ కడుపులోని బిడ్డను చంపుకోలేక తల్లికావడానికే సిద్దపడుతుంది. ప్రసవం కోసం అందరి ఆడపిల్లల్లా పుట్టింటికి వెళ్తుంది. తల్లి భానుమతి సంధ్యను పుట్టింటికి తీసుకువెళ్తుంది. కానీ అక్కడ సంధ్య నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటుంది. సొంత తల్లి తనను శత్రువుగా చూడటం సంధ్య భరించలేకపోతుంది. తల్లిదండ్రుల మధ్య కొరవడిన ప్రేమానురాగాలు, శత్రు వైరుధ్యం, పిల్లలపై ఎంత విపరీత వికృత ప్రవర్తనలకు దారితీస్తాయి. ఇది పరస్పర అవగాహన కొరవడిన కుటుంబాల్లోని పిల్లలు ఎదుర్కునే ప్రేమరాహిత్యానికి పెద్ద ఉదాహరణ. సమాజంలో ఎన్నో కుటుంబాల్లో ఎందరో పిల్లలు చవిచూస్తున్న చేదు భావాలకు అనుభవాలకు నిలువెత్తు సాక్షం సంధ్య.
సంధ్య ప్రసవ సమాయానికి చెల్లెలు యమున వివాహం నిశ్చయం అవుతుంది. ఇది తల్లి భానుమతి ఉద్దేశ్యపూర్వక ప్రయత్నం. సంధ్యకు ఇటువంటి పరిస్థితులు చిన్నప్పటి నుండి అలవాటు కాబట్టి నిబ్బరించుకోగలుగుతుంది. కానీ చంద్రం అత్తింటి ఇబ్బందులు తట్టుకోలేకపోతాడు. ఈ పరిస్థితిలో సంధ్య, చంద్రం ఇద్దరూ ఇంట్లో చెప్పకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతారు. సంధ్య, చంద్రంలది కులాంతర వివాహం. అయినప్పటికి చంద్ర తల్లి పుట్టిన మనవరాలిని ప్రేమగా చూసుకుంటుంది. సంధ్య కులగోత్రాల పట్ల ఆమెకు అయిష్టత వుంటుంది. బాలింతరాలైన కోడలు సంధ్య విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. సమయానికి అన్నీ సమకూర్చి పెడుతుంది. ఇక్కడ సంధ్య తల్లి తన మాతృత్వాన్ని మర్చిపోయి ప్రవర్తించడం, కనీసం తన కూతురిని సాటి స్త్రీగా అయినా ఆదరించకపోవడం, ఆగ్రహానికి గురి చేస్తుంది. ఇందుకు సాటి స్త్రీగా అత్త ఆదరించడం పట్ల కోడలు చంద్రం తల్లిపై ఎంతో అభిమానాన్ని కలిగిస్తుంది. స్త్రీలల్లో వుండే విరుద్ద స్వభావాలకు ఈ పాత్రలు పెద్ద ఉదాహరణగా కనబడతాయి.
చంద్రం చెల్లెలు సుధేష్ణ ద్వారానే సంధ్య`చంద్రంలు పరిచయం అవుతారు. సుధేష్ణ కులాంతర ప్రేమ వివాహం చేసుకుంటుంది. ఈ పెళ్ళికి సంధ్య సహకరిస్తుంది. ఈ విధంగా చంద్రం తల్లికి సంధ్య అంటే కోపం వుంటుంది. అయినప్పటికీ కోడలిగా సంధ్య విషయంలో రాజీకి వస్తుంది. సంధ్యది కూడా కులాంతర వివాహమే అయినప్పటికీ, పట్టింపులు పక్కకు పెడుతుంది. తాము భార్యాభర్తల వయసు అయిపోయాక చూసుకోవాల్సింది కోడలు సంధ్యనే కాబట్టి, కొడుకు, కోడల్ని దూరం చేసుకోవద్దనే ముందు చూపుతో అత్త ప్రవర్తిస్తుంది. సుధేష్ణ మాత్రం పుట్టింటికి పూర్తిగా దూరం అవుతుంది. తన వదినది కులం కాకపోయిన ఆదరించిన అమ్మ, తనని ఎందుకు ఆదరించడం లేదనే ప్రశ్నలతో సుధేష్ణ సంఘర్షణకు లోనవుతుంది. పర్యవసానంగా తన పెళ్ళికి సహకరించిన వదిన`స్నేహితురాలు రెండూ అయిన సంధ్యపై శత్రుత్వం పెరుగుతుంది. సంధ్యపై అందరికీ లేనిపోనివి కల్పించి చెప్పడం మొదలుపెడుతుంది.
ఇట్లా తనచుట్టూ సమాజంలో పరిస్థితుల్ని సంధ్య నిర్భయంగా ఎదుర్కుంటుంది. ఆలోచనల విశ్లేషణ అధ్యయనం వైపు లాక్కెళ్తుంటే, ఎట్టకేలకు సిద్ధార్థ ఆలోచనల నుండి బయటపడుతుంది. కానీ సమాజం, సమాజంలో వ్యక్తులు, వారి ప్రవర్తనలు, అందుకు కారణాలు, వాటిని సమీక్షించుకోవడంలో మాత్రం సంధ్య ఒక అంకిత భావంతో ముందుకు వెళ్తుంది.
‘కులాంతర వివాహాలు’ ఈ నవలలో ప్రత్యేకంగా చర్చించబడ్డాయని చెప్పవచ్చు. రచయిత్రి గీతాంజలి కులాంతర వివాహాలు` పరిణామాలు పరిష్కారాలు గురించి ప్రత్యేక చర్చ చేయలేదు. కానీ పాత్రలతో పరిణామాల గురించి స్పష్టంగా తెలియజేసింది అని చెప్పవచ్చు. మరి రచయిత్రి కులాంతర వివాహాలను సమర్ధించిందా? లేదా వ్యతిరేకించిందా అని విశ్లేషణ చేసుకుంటే సమర్థించడానికి వ్యతిరేకించడానికి మధ్య వున్న సమాజం ‘‘అపరిపక్వం’’గా వుంది అని మాత్రం పాత్రల ద్వారా తెలియజెప్పింది.
సంధ్య మానసిక మనో వైజ్ఞానిక విశ్లేషణలో తన తల్లిదండ్రల పొసగని స్వభావాలు, ఫలితంగా తల్లి భానుమతికి హిస్టీరియా రావడం, ఆమె తన సహజ వ్యక్తిత్వాన్ని తత్వాన్ని కోల్పోవడం, పిల్లల మీద తల్లిదండ్రుల స్వభావం విష ప్రభావాల్ని చూపించడం తెలుసుకోగలిగింది. అట్లాగే చంద్రం వాళ్ళది బ్రాహ్మణ కుటుంబం అయినప్పటికి సంధ్యను కోడలిగా అయిష్టంగా ఆదరించడంలో వున్న సార్థాన్ని అర్థం చేసుకోగలిగింది. చంద్రం చెల్లెలు నిమ్నకుల కుటుంబానికి చెందిన యువకుడ్ని ప్రేమించి పెళ్ళి చేసుకున్నప్పటికీ అత్తింటి వారు, పుట్టింటి వారు ఆదరించకపోవడం, ఈ రెండూ స్థితుల మధ్య సామాజిక మానసిక ఆర్థిక పరిస్థితులు మనుషుల వ్యక్తిత్వాలను నిజం నుండి ఏ విధంగా తారుమారు చేస్తాయో కూడా సంధ్య తన అధ్యయనం ద్వారా తెలుసుకోగలిగింది.
సమాజం ఒక అరణ్యం. ఈ అరణ్యంలో విభిన్న వ్యక్తిత్వాల మధ్య సంధ్య ప్రయాణం పడుతూ లేస్తూ కొనసాగింది. అంతేకాదు. ముఖ్యంగా మగవాడి మృగ ప్రవర్తన స్త్రీ జీవితాలతో ఎంత దారుణంగా ఆడుకుంటుందో పాత్రల ద్వారా తెలియజెప్పిన రచయిత్రి గీతాంజలి, ఆ పాత్రలు మానసిక విశ్లేషణ కోసం సంధ్య పాత్రను ఉపయోగించుకుంది. ఈ క్రమంలో తను పక్కింటి వనజను భర్త హింసలు పెట్టడం, అసహాయురాలుగా వనజ భర్తను భరించడం సంధ్య తట్టుకోలేకపోతుంది.
కథలో కనిపించే మరో పాత్ర అలేఖ్య. ఈ పిల్ల చంద్రం అక్క కూతురు. చదువుకోవాల్సిన వయసులో చదువుకోదు. అలంకరణకు సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ విలువైన సమయాన్ని కోల్పోతుంది. ఫలితంగా పెళ్ళయ్యాక ఆర్థిక స్వాతంత్రం లేక అత్తగారింట్లో అనేక ఇబ్బందులు పడుతుంది. ఒక స్త్రీ తన కాళ్ళ మీద తాను నిలబడలేని పరిస్థితిని సంధ్య ఒప్పుకోదు. స్త్రీ అన్ని రకాలుగా తనని నిరూపించుకుంటేనే సౌందర్యవంతురాలు అనేది సంధ్య వ్యక్తిత్వం. ఈ విధంగా వ్యక్తిగత ప్రపంచంలో స్త్రీ తనకు తానుగ పెంచి పోషించుకునే కొన్ని బలహీనతల పట్ల సంధ్య ఏహ్యభావం కలిగి వుంటుంది. ఇదంతా రచయిత్రి నేరుగా సంధ్య ప్రవర్తనలో చూపెట్టగలిగింది. తన బాహ్య ప్రపంచం చుట్టూ కనిపించే అనేక మంది స్త్రీల సమస్యల నేపథ్యంలో స్త్రీల మానసిక సమస్యలను నివారించడానికి ‘‘రిలాక్సేషన్ థెరఫి’’ కోర్సులో ప్రవేశం తీసుకుంటుంది సంధ్య. తర్వాత సంధ్య ‘‘సాధన కౌన్సిలింగ్ అండ్ ఎడ్యుకేటివ్ సెంటర్ ఫర్ విమెన్’’ సంస్థను ప్రారంభిస్తుంది.
ముఖ్యంగా తన తల్లి ప్రవర్తన గురించి తాను విసగి పోయినప్పటికీ జీవిత మూలాల్లోకి వెళ్ళి ఆలోచించి అమ్మను సంపూర్ణంగా అవగాహన చేసుకుంటుంది. ఈ క్రమంలో స్త్రీ సమస్యల కోసం తన సమయాన్ని పూర్తిగా కేటాయించి, అన్ని కోణాల్లోంచి స్త్రీల సమస్యలను అధ్యయనం చేస్తుంది. మూఢ విశ్వాసాలు, లైంగిక సమస్యలు, సైకాలజీ సమస్యలు, మతిమరుపు, తన తల్లి అనుభవించిన హిస్టీరియ వంటి రుగ్మతలు అన్నింటి మీద అధ్యయనం చేస్తూ ‘‘వ్యక్తిత్వ మహిళా విమోచన సంస్థ అధ్యక్షురాలు తేజస్వినిలో సంధ్యకు పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం ద్వారా సంకల్ప బలంతో వున్న సంధ్యకు మరింత సామాజిక తోడ్పాటు లభిస్తుంది. తర్వాత వనజ, సుధేష్ణ వంటి స్త్రీలతో పాటుగా మరెందరో స్త్రీలను బాధల నుండి విముక్తి చేయగలుగుతుంది. ఉద్యోగం, వ్యక్తిత్వం సాధికారత దిశగా చదువుతో నిమిత్తం లేకుండా స్త్రీలను ముందుకు నడిపిస్తుంది.
సంధ్య, చంద్రం, సిద్ధార్థ, ఈ ప్రధాన పాత్రలతో పాటుగా సంధ్య పుట్టిల్లు, అత్తిల్లు, అక్కడి పరిస్థితులు వ్యక్తులు నవలా క్రమంలో కనిపిస్తాయి. సందర్భాల్ని సన్నివేశాల్ని ఆలంబన చేసుకుని అనేక పాత్రలు కనిపిస్తూ కథలో జీవాన్ని ఒలికిస్తాయి. ఈ క్రమంలో సంధ్య క్లాస్మెట్స్గా వినీత, రాధ, వాసంతి, సుధ, రెడ్డి, శాస్త్రి, రాజు, రఫి, మేరి, నరసింహం వంటి పాత్రలు కనిపిస్తాయి.
సంధ్య అత్తగారింట్లో అత్తామామలు, తోడికోడళ్ళు, బావలు, ఆడపడుచులు, ఆమె భర్త పని వాళ్ళు కనిపిస్తారు. వీళ్ళలో రాధ, సుమతి, రవి, దీపిక, సుధేష్ణలతో పాటు చెంద్రి పాత్రలు కళ్ళముందు కదలాడుతూ జీవితాన్ని కళ్ళెదురుగా చూస్తున్న భ్రాంతి కలిగిస్తాయి.
ఇంకా మురళీమోహన్, గంగయ్య, జానకి, పాత్రలు కథా ప్రాముఖ్యాన్ని బట్టి వివిధ సందర్భాల్లో తారసపడ్తాయి. జగన్నాథం, వనజ, శ్రీనివాసగౌడు, తేజస్విని, మొదలగు పాత్రలు కనిపిస్తాయి. ఈ అన్ని రకాల పాత్రల మధ్య సంధ్య పాత్ర చివరకు ఒక పరిపూర్ణ శక్తిగా ఎదుగుతుంది. స్త్రీ విముక్తి పోరాటాల్లో భాగంగా నాలుగ్గోడల చర్చల మధ్య పుస్తకాల డాక్యుమెంటేషన్లతో నాకు సంతృప్తి లేదు. కార్యాచరణలేని ఏ పని ఉపయోగకరం కాదని నాకు అర్థమైంది అని సంధ్య భావించడంలో సంధ్యకు తను ప్రయాణించాల్సిన మార్గం తెలిసి వస్తుంది. సమస్త స్త్రీజాతి విముక్తికై జీవితం త్యాగమై, జాతి చైతన్యమై, ఏళ్ళ తరబడి పతనమవుతూ వస్తున్న మాతృస్వామ్య వ్యవస్థ జాగృతమై విజయంగా సంధ్య అడుగు ముందుకు పడడమే ‘‘ఆమె అడవిని జయించింది’’.
ఆధారగ్రంథాలు : 1. ఆమె అడవిని జయించింది, గీతాంజలి, గోదావరి ప్రచురణలు 2. మహిళా జీవన సమస్యలు ` మూలాల అన్వేషణ ` కాత్యాయని విద్మహే 3. ఆధునిక తెలుగు సాహిత్యం ` స్త్రీవాద భూమిక ` కాత్యాయని విద్మహే 4. ఆకాశంలో సగం ` ఓల్గా
5. స్త్రీవాదం ` కాత్యాయని విద్మహే 6. మహిళా సాధికారత, సవాళ్ళు ` సమాజ సాహిత్య స్వభావాలు ` కాత్యాయని విద్మహే
తెలుగు సహాయాచార్యులు, ఎం.వి.ఎస్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహబూబ్నగర్
