విశ్వజనీన కవిత్వానికి నిలువెత్తు నిదర్శనం – బి.ఎస్‌. రాములు

మహాకవి, దార్శనికుడు డాక్టర్‌ కత్తి పద్మారావు గారి నవ కవితా సంపుటి ‘ప్రేమ కిరీటాలు ధరించండి’. ఈ సంపుటిలో ఎలాంటి కవితలుంటాయో పుస్తకం పేరే చెపుతుంది. కత్తి పద్మారావు గారిది ప్రేమ తత్వం. మానవాళిపై ప్రేమ. మంచితనంపై ప్రేమ. ఈ కవితల్లో మనందరిపై ప్రేమ జల్లులు కురిపిస్తారు. దళిత మహాసభ ఉద్యమ నాయకుడిగా ఆయన ఉగ్రరూపాన్ని ప్రసంగాల్లో, నినాదాల్లో, కవితల్లో, పాటల్లో చూసినవాళ్ళకి కత్తి పద్మారావు బుద్ధిజంలో పరివ్యాప్తమవుతున్న క్రమంలో మలుపు తిరిగిన ఆయన తాత్విక ధార, శైలీ, శిల్పం, కవితావస్తువు పరిణతి పరిణామక్రమం ఇది.

‘లండన్‌ నుండి విసిరి వేయబడ్డ నేరస్తుడు / సిడ్నీలో మహానగరం కట్టుకున్నాడు.’
కావ్యంలో చరిత్రను ఎంత చక్కగా సంక్షిప్తీకరించి కవిత్వీకరించారో ఈ పాదంలో చూడవచ్చు. ఈ వలసలు మనుషులకే కాదు. పక్షులకు కూడా ఉన్నాయి. కొల్లేరు ఒక గొప్ప వలస పక్షుల కేంద్రం. సిడ్నీని, లండన్‌ను, కొల్లేరును కలిపి ఒక చారిత్రక పరిణామాన్ని…
‘నిజమే! కొల్లేరుకు ఖండాంతరాల నుండి ….
వీర వైష్ణవం, వీర శైవం తునుమాడిన తలల పుర్రెలు
ఇంకా బౌద్ధ కథలు చెబుతున్నాయి
ఇలా ఏ చరిత్ర నుంచి ఏ చరిత్ర దాకా సమన్వయపరుస్తారో సమకాలీన సంఘటనలకు, చారిత్రక సంఘటనలను అనుసంధానించి ఎలా అర్థం చేసుకోవాలో, దానిని కవిత్వంలో ఎలా దృశ్యీకరిస్తారో ఈ సంపుటిలో చూడవచ్చు.
డా॥ కత్తి పద్మారావుగారి ఏ కవిత చూసినా, చదివినా అందులో చారిత్రక అంశాలు, కవిత్వీకరించిన తాత్వికత, కవితాత్మక వర్ణన, దృశ్యీకరణ ఉంటుంది. ఈయన దశాబ్ద కాలంగా రాస్తున్న కవితల్లో సామాజిక చరిత్రతో పాటు తక్షణ సంఘటనలు, దృశ్యాలు సంశ్లేషిస్తూ కవితా నిర్మాణం కొనసాగిస్తున్నారు. తద్వారా వీరి కవితా నిర్మాణశైలి ఒక విశిష్టతను సంతరించుకుంది. కవితా అభివ్యక్తి, వర్ణన విలక్షణత, సంఘటనల మేళవింపు, ప్రకృతి వర్ణన, పర్యావరణ చిత్రం, తల్లి సంస్కృతితోపాటు ఒక సందేశం, ఒక కర్తవ్యం దృశ్యమానమవుతుంది.
ఆ పబ్బుల్లో ఆ సెలబ్రిటీల కుమార్తెలు…
వందేళ్ళుగా ఎదుగుతూ వస్తున్న వచన కవిత అనేక కోణాల్లో విస్తరిస్తూ వస్తున్నది. అనేక దశలు దాటుతూ వచ్చింది. అనేక ప్రయోగాలు కనపడతాయి. వచన కవితకు రూల్స్‌ ఆండ్‌ రెగ్యులేషన్స్‌ పద్య కవితలోనో, పాటలోనో ఉన్నట్లుగా ఉండవు. గనుక ఎక్కువ సులభం, ఎక్కువ కష్టం. అంటే రాయడం సులభం. గొప్పగా రాయడం చాలా కష్టం. తన ఛందస్సును, తన లయను, తన శైలినీ, శిల్పాన్ని తానే నిర్మించుకోవాల్సి ఉంటుంది.
అందువల్ల ప్రతి వచన కవి తనదైన శైలీ శిల్పాన్ని, ప్రత్యేకతను స్వయంగా సాధించుకోవాల్సి వచ్చింది. కత్తి పద్మారావు నాలుగు దశాబ్దాలుగా ఈ అభ్యాసం చేస్తూ వస్తున్నారు. ప్రతి కవితా సంపుటి ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న తీరును ప్రతిఫలిస్తుంది. ఇలా కత్తి పద్మారావు వచన కవిత ఆయనకే ఒక ప్రత్యేక శైలీ శిల్పం అన్నట్లుగా రూపుదిద్దుకుంటూ వచ్చింది.
జాషువా పద్య కవిత్వాన్ని వచన కవిత్వంకన్నా సరళ సుందరంగా కొనసాగించారు. హాలుని ‘గాథాసప్తశతి’, గుణాఢ్యుని ‘బృహత్కథ’ శైలీ శిల్పాలకు ఆధునిక వారసత్వంగా దేదీప్యమానంగా తోస్తుంది. సంగీతానికి, గానానికి అనువుగా పరివర్తన చెందుతుంది. శ్రీశ్రీ కవిత్వం కూడా వచన కవిత్వం కాదు. కొందరు అది వచన కవిత్వమని భావిస్తుంటారు. అది పొరపాటు. అది గేయ కవిత్వం. ఎందుకోగానీ వచన కవిత్వం, శబ్దాలంకారాలను, గేయ కవిత్వం, సంగీతంలలోని సౌందర్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. తిరిగి కవితా నిర్మాణంలో ఎంతో కొంత లయాత్మకత కోసం తాపత్రయ పడటమూ కనిపిస్తుంది. ఇప్పుడు అనేక తంటాలు పడుతూ వచన కవులు కోల్పోయిన కవితా సౌందర్యాన్ని, లయాత్మకతను స్వీయ నియంత్రిత ఛందస్సును ఆవాహన చేసుకుంటూ, వాటికి కొత్త కొత్త ప్రక్రియల పేర్లు పెట్టుకుంటూ రాస్తూ వస్తున్నారు.
వీటన్నిటిని అధ్యయనం చేస్తూ కత్తి పద్మారావు తనదైన ప్రత్యేక శైలిని రూపొందించుకుంటూ వస్తున్నారు. వీరి కవిత్వంలో సమకాలీన సంఘటనలుంటాయి. వాటిని విప్పి చెప్పేదాక కేవలం అలంకారాలో, వర్ణనలో అనుకుంటారు. అవన్నీ ఈ ముందుమాటలో విప్పి చెప్తే అదొక పరిశోధన గ్రంథం అవుతుంది. ఎంఫిల్‌, పిహెచ్‌డీ పరిశోధక విద్యార్థులు ఈ పని చేయాలి.
‘ప్రేమ కిరీటాలు ధరించండి’లోని ప్రతి కవితా అనేకానేక అంశాలను గుది గుచ్చిన పూల దండ. ప్రతి కవితా ఒక దీర్ఘ కావ్యంలా సాగుతుంది. వర్ణనలు, ప్రతీకలు శర పరంపరగా కొనసాగుతుంటాయి.
డా॥ కత్తి పద్మారావు గారి కవితల్లో ఎరుక ఉంటుంది. ఎరుక క్రమం ఉంటుంది. అంతిమంగా విజ్ఞాన ధార ఉంటుంది.
ఆత్మ నిర్భరత అంటే జీవన వ్యవస్థల విధ్వంసమా?….
అంతిమ విజయం ఈ మూలవాసులదే. ..
కత్తి పద్మారావు గారి కవితల్లో ఆవేశం ఉంటుంది. ధర్మాగ్రహం ఉంటుంది. మొక్కవోని దీక్ష ఉంటుంది. ప్రవక్తగా ప్రబోధం ఉంటుంది. ఎవరికీ పట్టుబడని వస్తు సాంద్రత ఉంటుంది. అసలు సిసలు మానవీయ మూలాల అన్వేషణ ఉంటుంది. కత్తి కవిత సత్యనిష్ట గలది. నిత్యాన్వేషణలో.. సత్యాన్వేషణ అనితర సాధ్యంగా సాగే చరిత్ర అల్లిక వీరి కవిత.
‘ఆ పడతి నడకలో సౌందర్యం ఉంది’ అనే చరణంలో ‘ఆ’ అనే పదం, కవితలో కవితాధార కంటిన్యుటీ కోసం తీసుకునే పదం. దాంతోపాటు ‘ఆ’ అని ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అక్కడ మరొక వస్తువును, వర్ణనను తీసుకువచ్చి, కవితను మరో మలుపు తిప్పుతున్నారు. అలా అనేక సందర్భాల్లో ‘ఆ’ అనే పదం గొప్ప సౌకర్య సాధనంగా స్వీకరించారు. అంతేకాదు. ఇదే పదం ద్వారా అంతకన్నా ముందు జరిగిన అనేక సంఘటనలను, సన్నివేశాలను ఆ నేపథ్యంలో చెప్పకుండానే గుర్తు చేస్తున్నారు అన్నమాట.
కత్తి పద్మారావు కవిత్వం శ్రమైక జీవన సౌందర్యం. ఈయన ప్రసంగం లేకుండా దళిత మహాసభకు ఉత్తేజం లేదు. ఈయన దర్శన స్పృహ లేకుండా కవితాధార లేదు.
ఆకాశం వంగి భూమిని తాకుతుంది…
నీ స్వరంలో నుండి నిప్పు రవ్వలు కురుస్తున్నాయి…
కత్తి పద్మారావు రాత్రంతా చదువుతారు. ఎంత రాత్రయినా కనీసం రెండు గంటలయినా చదవకుండా నిద్రపోయేది లేదు. తిరిగి ఉదయమే లేస్తారు.
వీరు ఎంతటి వాస్తవికవాదో అంతగా ఊహల్లోనూ విహరిస్తారు. వాస్తవాలను వదిలేసిన ఊహాలోకం కాదు ఆయనది. వాస్తవాలనే ఊహాలోకంగా మార్చి కవిత్వీకరించే తత్వం గల మనిషి. సాహిత్య అధ్యయన సాంద్రత వల్లనే ఈ సామర్థ్యం, ప్రతిభ అబ్బుతుంది. ఆయన ఉపన్యాసం ఎంత బలంగా ఉంటుందో, కవిత్వంలో ప్రతీకలు, విశ్లేషణ, సందేశం, కర్తవ్యం అంతే బలంగా ఉంటుంది. ఈ కవిత్వాన్ని గొంతెత్తి చదివినప్పుడు వినాలి. దాని గాఢత మరింత పెరుగుతుంది. అందులో లీనమవుతాము. అందుకే ఆయా కవితల్ని ఆడియో రూపంలో వాట్సప్‌, ఫేస్‌బుక్‌, యుట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమాలలో మనకు వినిపిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరికరాలనన్నిటినీ సద్వినియోగం చేసుకుని తన గళం వినిపిస్తున్నారు. ఇప్పుడే కాదు. 1978 నుండే వీరి ప్రసంగాలను క్యాసెట్లుగా మార్చుకొని వందలాది గ్రామాలలోని ప్రజలు వింటుండేవారు. కవిత్వమూ అదే స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడానికి నేటి ఆధునిక ప్రక్రియలను చక్కగా వినియోగిస్తున్నారు.
వర్తమాన సంఘటనలను కవిత్వీకరించడంలో కత్తి పద్మారావుది విలక్షణ శైలి. ఏదో ప్రాచీన సాహిత్యంలాగా ప్రకృతి వర్ణనలు చేయడం వేరు. అది చాలామంది చేస్తారు. వర్తమాన ప్రకృతి వర్ణన కూడా చాలామంది చేస్తారు. కానీ దానిని సామాజిక అంశంగా మార్చడంలో వీరి ప్రతిభ కనబడుతుంది. వీరు చెప్పే సామాజిక అంశానికి ఆకర్షణీయత కలిగించడం కోసం ప్రకృతి వర్ణనను ఉపయోగిస్తారు. అందువల్ల ఆయా సంఘటనలు కేవలం వార్తలు చదివినట్లుగా కాకుండా, కవిత్వం చదివిన అనుభూతికి గురవుతాము. ఈ రెంటి మధ్యన సమన్వయం సాధించకపోతే అది కవిత్వంగా నిలవడం కష్టం. ఆ విషయం తెలుసు కనుకే ప్రశాంతమైనటువంటి మానసిక స్థితిలో కళ్లు మూసుకొని ఆయా సంఘటనలను, ఊహా చిత్రాలను, పద చిత్రాలను ఒక ఆర్టిస్టు పెయింటింగ్‌లాగా గీతలు వేసి అల్లుకుంటూ చెప్తూ పోతుంటారు. అలా చెప్పడంలోనే ఒక లయాత్మక కవితాధార సహజంగానే వచ్చిపడుతుంది. కేవలం రాసే వచన కవిత్వానికి, చెప్తూ వెళ్లే వచన కవిత్వానికి వ్యత్యాసం ఉంటుంది. చెప్తూ వెళ్లే వచన కవిత్వం పాటల్లాగా జ్ఞాపకం ఉండే అవకాశం ఉంటుంది. సిరిసిల్లకు చెందిన గజభీంకార్‌ దేవరాజ్‌, ఎన్నెం సత్యం, అజంతా తదితరులు తమ కవిత్వాన్ని పుస్తకం చూడకుండానే ప్రసంగంలాగానో పాటలాగానో మొత్తం పుస్తకాన్ని ఆశువుగా వినిపిస్తుంటారు. అలాంటి కవితాధారే కత్తి కవిత్వంలో కనపడుతుంది. గోరటి వెంకన్న గుక్క తిప్పుకోకుండా వినిపించే ‘బ్రీత్‌లెస్‌ సాంగ్‌’ అనే ప్రక్రియలో గొప్పగా రాశారు. ఏకపాత్రాభినయంలాగా అదంతా బట్టీ పట్టి ఐదు, పది నిమిషాలు పుస్తకం చూడకుండా పాట పాడుతూ వెళ్ళడం కొందరికే సాధ్యమైంది. అందెశ్రీ, జయరాజు, మాస్టార్జీ… ఇలా ప్రజా ఉద్యమ కవులు, ఆధునిక కవిత్వంలో ఇతర కవులకన్నా చాలా ముందున్నారు. మొదట్నుండి వారికి పాట తెలుసు. జానపద కళలు, ప్రదర్శన రూపాలు తెలుసు. సంగీతం వారి జీవితంలో భాగం. అందువల్ల వచన కవిత్వాన్ని పాటల్లోనూ ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళారు.
కత్తి పద్మారావు కవిత్వంలోనే ఊహల్లో విహరిస్తారు. మరోలోకం సృష్టికి తెరతీస్తారు. ఆనాటి దృశ్యాలు సంఘటనలు అల్లుకుంటారు. అవి నల్లని మేఘాలవుతాయి. కవిత్వంగా వర్షధార అవుతుంది. ఫోన్‌ తీస్తారు. అవతల గంట మోగుతుంది. ఇవతలి నుండి నిస్తంత్రీలో అవతల కాగితాల మీదకు ప్రవహిస్తుంది. కవిత్వం సంభాషణ వలె ప్రవహిస్తూనే ఉంటుంది. కత్తి పద్మారావు గారి కవితా సంప్రదాయం ఇలా ఆశు శ్రవ్య కవితా సంప్రదాయం. వారి వచన రచనలు కూడా శ్రవ్య సాంప్రదాయమే! అలా చెప్తూ పోతుంటారు. ఇలా కాగితాల మీద అక్షరాల ధార కురుస్తుంది. కవితలతో పాటు, చరిత్ర, సాంఘిక శాస్త్రాలు, వ్యక్తిత్వ నిర్మాణ గ్రంథాలు కూడా మహా గ్రంథాలుగా రూపొందుతాయి. నిజానికి శ్రవ్య సంప్రదాయం వైదిక సంప్రదాయం అనుకుంటారు గానీ అంతకు రెండు వేల ముందటి హరప్పా సింధుజనుల జన పదాల నిర్మాతలైన ద్రవిడులది. దళితులది.
కత్తి పద్మారావు గారి అధ్యయనం ఒక ఆకాశం. కవిత్వం మాత్రం భూమ్మీదే! వీరు మహామహుల్నెందరినో చదివారు. సరళంగా చెప్పడమే సౌందర్యమని గ్రహించారు. వీరి కవిత రబ్బరులా సాగదీసి నానార్థాలు వెలిగించే భగవద్గీత కాదు. కత్తి కవిత సూటిగా ఉంటుంది. గుండె పొరల్లో ఎరుక క్రమమై ఆలోచనాంతర్గతం చేస్తుంది. మనిషిని మేల్కొలుపుతుంది.
రాళ్లపాలు చేసే మీరు పాలబొట్టు పుట్టుకకే గాటు చేస్తున్నారు…
మీరు మీ మిత్ర హస్తాన్ని ఛేదిస్తున్నారు మీరు మార్మిక ఇనుపకచ్చడాలు…
ఇలా తాపీ ధర్మారావు రచనలైన ‘దేవాలయాలపై బూతు బొమ్మలు ఎందుకు?, పెళ్లి పుట్టు పూర్వోత్తరాలు, ఇనుప కచ్చడాలు’ వంటి గ్రంథాలను గుర్తు చేస్తారు. అప్పుడే మార్మికంగా కొనసాగుతున్న ఇనుపకచ్చడాలు ఏమిటో తెలుస్తాయి. ఇలా అధ్యయన ఆవశ్యకతని పాఠకుల్లో కలిగిస్తారు కవి.
కవిత్వానికి రకరకాల నిర్వచనాలు, వాటికి అందని కవిత్వం ఉంటుంది. కత్తి పద్మారావు గారి కవిత్వం ఒక పట్టాన నిర్వచనాలకు ఒదిగిపోదు. వాటి పరిధి గీతలను దాటి ప్రవహిస్తుంది. కత్తికి ఎదురు లేదు. కత్తికి బెదురు లేదు. కత్తి పద్మారావు కవిత్వానికి కొత్త నిర్వచనం రూపొందించాలి. ఖలీల్‌ జిబ్రాన్‌ కవిత్వానికి ఒక కొత్త నిర్వచనం ఎలాగైతే రూపొందించారో అలా కత్తి పద్మారావు కవిత్వానికి ఓ కొత్త నిర్వచనం అవసరం. ఎందుకంటే కొందరు ‘కవిత్వం కప్పి చెపుతుంది. వ్యాసం విప్పి చెపుతుంది’ అని నిర్వచించారు. కత్తి పద్మారావు గారి కవిత్వం విప్పి చెపుతుంది. అర్థం కాకపోతే వివరించి చెపుతుంది. అందులో లేని అర్థాలను గెలికి వెలికి తీసే అవకాశం ఇవ్వదు.
‘స్నేహం మానవ జీవన ప్రవాహిక స్త్రీ ఒక సౌర కుటుంబ సామూహిక
సూర్యుళ్లు, చంద్రుళ్లు’… ఆకాశం అంచుల దాకా నడుస్తున్న విజేత…..
కత్తి పద్మారావు ఎంతటి గొప్ప స్త్రీవాదో, పురుషాధిపత్య భావజాలానికి వ్యతిరేకో ఈ కవిత మరోసారి స్పష్టం చేస్తుంది. ఆయన తల్లి సంస్కృతి పక్షపాతి.
1985 నుండి ఉద్యమ చరిత్రకు కత్తి పద్మారావు గారొక పునాది. దీప స్తంభం. వామపక్ష ఉద్యమాల నుండి దళిత బహుజన ఉద్యమాల వైపు తిరిగి మలుపు తిరగడానికి కెజి సత్యమూర్తి, గద్దర్‌, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, కంచ ఐలయ్య, జి కళ్యాణ్‌ రావు… మాతో సహా లక్షలాది మందికి స్ఫూర్తి దాయక ఉద్యమ నిర్మాతగా నిలిచారు. వామపక్ష వాదం నుండి ఫూలే అంబేద్కరిజం వైపు ప్యారడైమ్‌ షిఫ్టుకు కారంచేడు ఉద్యమం కారణమైతే, దానికి ఉత్తేజాన్నిచ్చినది కత్తి పద్మారావు. అరసం, విరసంలాంటి సంస్థలు తమను తాము సరిచేసుకునే ప్రయత్నం చేశాయి.
‘కవితకేదీ కాదనర్హం’ అని శ్రీశ్రీ చెప్పినా, జాషువా అనేక విషయాలు రాసినా చాలామంది కవులు వస్తు వైవిధ్యం లేక అణగారిపోతున్నారు. చెప్పిందే చెప్పినట్టుగా వారి కవిత్వం నిండిపోయి గిడసబారిపోతుంది. తనను తాను కాపీ కొట్టుకున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. లేదంటే ఇంగ్లీషులాంటి పర భాషల కవిత్వాన్ని చదివి అనువదించే బదులు తన కవిత్వంగానే మార్చి రాసేవాళ్ళున్నారు. పేర్లెందుకు గానీ, వచన కవిత్వంలో గొప్ప కవిత్వంగా చెలామణీ అవుతున్న కవితలో ఈ కవిత్వానిదే పెద్దపీట. అందువల్లే వాళ్ళు ఎక్కడెక్కడియో విదేశాల కొటేషన్లు ఇస్తుంటారు. గోరటి వెంకన్న, అందెశ్రీ, గూడ అంజయ్య, జయరాజు, ప్రొ॥ఎండ్లూరి సుధాకర్‌, ఎ.విద్యాసాగర్‌(రి), చంద్రబోసు, సుద్దాల అశోకతేజ తదితర బహుజన కవులు దేశీయ కవిత్వాన్ని, దేశీయ ప్రతీకల్ని తీసుకొనే రాయడం గమనించవచ్చు. అది అత్యంత సహజంగా ఉండడంవల్ల సినిమా పాటలు గానీ, తెలంగాణ ఉద్యమంలో గానీ, ప్రజల హృదయాల్లో గొప్పగా నిలిచిపోయాయి. కదిలించాయి.
కత్తి పద్మారావు గారి కవిత్వంతో ఒక నూతన అలంకార శాస్త్రం రూపొందించ వచ్చు. పరిశోధక విద్యార్థులు అందుకు పూనుకుంటే ప్రతాపరుద్ర యశోభూషణం, కావ్యాలంకార సంగ్రహం వంటి గ్రంథం రూపొందుతుంది. కల్లూరి భాస్కరం, నీలకంఠ వంటి విద్వత్‌ సంపన్నులు తమ శక్తి సామర్థ్యాలను, పాండిత్యాన్ని పాతదాన్ని తోమి తోమి కొత్తదిగా మెరిపిస్తారు. మంత్ర కవాటం తెరిస్తే మహా భారతం మన చరిత్రే అని మళ్లీ మనమీద రుద్దుతారు.
ఇలా ప్రతిచర్య ఎప్పటికప్పుడు కొత్త వ్యాఖ్యానాలు వెలయించి వాటి ఆధిక్యతను నిలిపి పెంచి పోషిస్తారు. కొత్తది రాయలేరు. పాతది విడువ లేరు. అందుకని పాతదాన్నే కొత్తగా మెరిపిస్తారు. వాటికి డి ఎన్‌ ఏ పరిశోధన ఫలితాలను జోడిస్తారు. అంతే తప్ప బౌద్ధాన్ని ముందుకు తేరు. తాపీ ధర్మారావులా జరిగిన అసలు పరిణామాలను వెలికి తీయరు.
హిందీలో పురాణ ప్రలాపం రాసినట్లు సాహిత్యంలోని అవక తవకలను, అపసవ్యతను వెలికి తీయరు. రంగనాయకమ్మలా ఖండిరచకపోగా ఆరాధించడానికి తమ పాండిత్యాన్నీ, అధ్యయనాన్నీ ఉపయోగిస్తారు. రామ భజన, మహా భారత్‌ భజన చేసే వారికే మరిన్ని కొత్త ఆయుధాలు అందిస్తారు. ఇదంతా ఆధునికత పేరిట మనుధర్మ, వర్ణ, కుల, ఆర్య త్రైవర్ణిక ఆధిక్యకతను నెలకొల్పుతారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టక ఆహా ఓహో అని మురిసిపోతారు. చాగంటి, సుందర చైతన్యానంద, మైసూరు దత్త స్వామి వంటి వారు నలుదిక్కులా ఆవహించి ముంచేస్తున్నారు. కవులు దీన్ని పట్టించుకున్నారా? వారందరికీ తన కవిత్వంలో సమాధానాలు చెప్పే కర్తవ్యం స్వీకరించారు కత్తి పద్మారావు. అందువల్ల వర్ణనలు, ప్రతీకలు, దృశ్యాలు, ప్రకృతి, పల్లెలు, మూలవాసులు మూల వస్తువుల్లో భాగమవుతున్నాయి. తమ చుట్టూ జరిగే పరిణామాలకు స్పందన, ప్రతిస్పందన ఎప్పటికప్పుడు ఈ కవితల్లో జోడిరపబడుతూ వస్తున్నది. ఇలా సమకాలీన చరిత్రను కవిత్వంలోకి తేవడం జరుగుతున్నది.
జీవితం భవిష్యత్తులో ఉంది ఎక్కడో ఒకచోట యుద్ధం
జరుగుతూనే ఉంది… ఆ ఏటి ఒడ్డున చెట్టుకొమ్మన
ఒకే ఒక పక్షి జీవన గానం చేస్తుంది…
ఇలా కత్తి పద్మారావు గారి కవిత్వం కేవలం ప్రశ్నించే కవిత్వం కాదు. భవిష్యత్తుకు మార్గదర్శనం చేసే ఒక తాత్వికుడు. ఇలా రాయడానికి తత్వం తెలిసి ఉండాలి. మనస్తత్వం చదివి ఉండాలి. సామాజిక శాస్త్రాలు చదివి ఉండాలి. భావావేశం ఒక్కటే చాలదు. వాటికి ఇవన్నీ తోడు కావాలి. వెనుకట రాజులకు అడవుల్లో తపస్సు చేసుకునే మునులు, ఋషులు, సన్యాసులు సలహాలు ఇచ్చినట్లుగా, ఈనాటి కవులు దార్శనికులుగా, తత్వవేత్తలుగా ఈ ప్రభుత్వాల పరిపాలనను ఎలా నడపాలి? ఏం చేయాలి? అనే విషయాలను సూచించగలగాలి. మార్గదర్శనం చేయగలగాలి. మార్గదర్శనం చేసినవాడే మహాకవి, దార్శనికుడు. అది ఏ ప్రక్రియలో చేసినా అతడు మహాకవి, మహాదార్శనికుడు. అందుకే కత్తి పద్మారావు, కంచె ఐలయ్య, బి.ఎస్‌. రాములు, కె.ఎస్‌. చలం తదితరులు నిరంతరం వ్యాసాలు రాస్తుంటారు. ఆ వ్యాసాల్లో ప్రభుత్వాలకు మార్గదర్శకాలు చేస్తుంటారు. కేవలం విమర్శ అనేది ఎవరైనా చేయవచ్చు. సరిjైున సూచన చేయడం రావాలి. సకాలంలో సరైన ఆచరణీయ సూచనలు చేయాలి. అలా సకాలంలో ఆచరణీయ సూచనలు చేయడం వల్లనే కత్తి పద్మారావు కోరినట్లుగా 125 అడుగుల డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహాన్ని హైదరాబాద్‌లో, విజయవాడలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం విజయవంతంగా పూర్తి చేశాయి.
‘మీరు కోల్పోతున్నది మిమ్మల్నే ఎవర్నో కాదు
మిమ్మల్ని మీరు కోల్పోయాక మీరు ఎవరిని పొందుతారు….
ఈ కవితలో స్త్రీవాదుల స్వేచ్ఛా జీవితంలో ఎదురవుతున్న ఒంటరి తనాన్ని, స్వేచ్ఛ పేరిట కొనసాగుతున్న దురవస్థను చెప్పకనే చెప్తున్నారు. ఒక మహాకవి, ఒక దార్శనికుడు ఊరకే ఉండడు. సమాజంలో ఉంటూనే సమాజంలో ఎప్పటికప్పుడు ఎదురయ్యే సమస్యకు పరిష్కారాన్ని, ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుతారు. వివరిస్తారు. దారి చూపుతారు.
కత్తి పద్మారావు గారిది ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పే సాధికారిక కవిత్వం. ప్రశ్నించడమే కాకుండా ప్రశ్నలకు జవాబులు చెప్పి ఇదీ ఈ లోక రీతి. ‘పద! దీన్ని మార్చుకుందాం.’ అని మార్గనిర్దేశం చేస్తారు. సాంస్కృతిక భావజాల విప్లవమే అసలైన విప్లవం. సమగ్ర సమాజ వికాసమే సమగ్ర సామాజిక విప్లవం అని స్పష్టం చేస్తారు.
ప్రజల నుంచి వచ్చే కవి, ప్రజల జీవితాన్ని ఎంత ఆత్మీయంగా కవిత్వీకరిస్తారో గోరటి వెంకన్న కవిత్వంలో చూడవచ్చు. కత్తి పద్మారావు కవిత్వంలో చూడవచ్చు.
ఆమె చేతులు తడుపుతున్నప్పుడు
ఆ వేళ్ళ కొసలను చేపపిల్లలు ముద్దాడుతున్నాయి….
అదిగో పూరి గుడిసె ఆ నల్ల రాతి శిల్పం లాంటి పడతి పడుతున్న ప్రసవ వేదనలో పుట్టిన శిశువు రాజ్యం ఏలడమే అసలైన క్రాంతి అంటారు కవి!.
కత్తి పద్మారావు గారిది కేవలం ధిక్కార స్వరం మాత్రమే కాదు. ధిక్కారం, తిరుగుబాటు అపజయానికి దారి తీస్తాయి. కత్తి పద్మారావు గారిది అధికార స్వరం. ప్రవక్తగా ప్రవచించే ప్రబోధాత్మకం. అదంత సులువుగా అందుకో గలిగింది కాదు. ప్రపంచాన్నంతా తనలో భాగం చేసుకున్నప్పుడే అది సాధ్యం. కత్తి పద్మారావుగారు వయస్సు పెరిగిన కొద్దీ అధ్యయనం, అనుభవాలు విస్తరించినకొద్దీ బుద్ధుడుగా పరివర్తన చెందిన, చెందుతున్న పరిణామమే ఈ కవితా సంపుటి. మనిషనేవాడు ఎలా వుండాలో నిర్దిష్ట మానవీయ విలువలు సంస్కృతి నేర్పడమే కవి నిర్వహిస్తున్న కర్తవ్యం. ప్రతి కవిత ఒక కావ్యం. మరింత విస్తరిస్తే ఆధునిక నవల. విశ్లేషిస్తే ఆదిమ కాలం నుండి ఆధునిక కాలం దాకా నిక్షిప్తం చేసుకున్న చరిత్ర. కథా కథన కావ్యం. కనుక పాఠకులు ఏ కోణంలో చదివితే ఆ కోణం హృదయ నేత్రాలకు ప్రస్ఫుటమవుతుంది.
ప్రశ్నించడం విమర్శించడం చాలా సులువు. ఆ దశను దాటి సరైన సూచనలిచ్చి ముందుకు నడిపే గురువుగా పరిణతి సాధించడం అంత సులువు కాదు. ఏది సాధ్యమో దాన్ని ప్రతిపాదించి కార్యరూపం దాల్చేందుకు ఉద్యమాలు రూపొందించడం కత్తి పద్మారావు ప్రత్యేకత. మొదటి నుండి వారి డిమాండ్లను, సూచనలు, ప్రతిపాదనలు గమనిస్తే మనకు అర్థమవుతుంది. కులాంతర వివాహాలు, కారంచేడు రక్తక్షేత్రం నిర్మాణం, చీరాలలో పునరావాసం, దళితులపై అత్యాచార నిరోధక చట్టం, చుండూరు ఉద్యమంలో దళితుడే రాష్ట్రపతి కావాలి మొదలైనవి అలా సాకారం చేసారు.. కవిత్వంలోనూ ఇలాంటి సూచనలు ప్రతిపాదనలు చూడవచ్చు. కత్తి పద్మారావు మనిషిని ప్రేమిస్తారు. మానవీయ మాతృత్వ సంస్కృతిని ప్రేమిస్తారు. ప్రకృతిని ప్రేమిస్తారు. సమాజాన్ని ప్రేమిస్తారు. సామాజిక రాజకీయ అంశాలను కవిత్వంలోకి వంపుతున్నపుడూ ప్రకృతి, పర్యావరణం, మాతృ సంస్కృతిని ఆహ్లాదకరంగా వర్ణించి సమన్వయిస్తారు. ‘ఆ పడతి..’ అంటూ ఒక దృష్టిని ఆవిష్కరిస్తారు.
‘ఆ జాలరులు..’ అంటారు. ‘ఆ’ అనే పదం వచ్చిన ప్రతిచోటా ఒక దృశ్యం ఆవిష్కృతమవుతుంది. కవితాంశం, వస్తువు ఇతివృత్తం పీఠికల్లో నాటుకోవడానికి పల్లవిని మళ్లీ రిపీట్‌ చేయడం పాట లక్షణం. వచన కవితలో దాన్ని ప్రవేశపెడితే గేయస్వభావం సంతరించుకుంటుంది. మరో శైలి ఉంది. అది అనేక దృశ్యాల ద్వారా ఒకే అంశానికి మరింత బలం చేకూర్చడం.
దేశాన్ని నిర్మించిన వారు మేల్కొంటున్నారు….
అంతిమ విజయం ఈ మూలవాసులదే…
ప్రతాపరుద్ర ‘యశోభూషణం, కావ్యాలంకార సంగ్రహం’ వంటి అలంకార శాస్త్రాల్లో ఎంతో హృద్యంగా వర్ణిస్తారు. కాళిదాసులో దీన్ని గమనించవచ్చు.
కత్తి కవిత్వంలో కాళిదాసు కన్నా ఒక ఆకు ఎక్కువ కనపడుతుంది. అది సామాజికత, సమకాలీనత, రాజకీయ చైతన్యం. కాళిదాసు నుండి ఇవి ఆశించలేము. ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలోనే ఇది సాధ్యం. అందువల్ల రాజరికాల, భూస్వామ్య, వర్ణ కుల పునాదిపై నిర్మాణమైన గ్రామీణస్వయం పోషక వ్యవస్థలో ఆలోచన కుల ధర్మానికి, వర్ణ ధర్మానికి పరిమితం చేశారు. అందువల్ల వెనకటి కాలపు కవిత్వంలో, సాహిత్యంలో, అలంకార శాస్త్రాల్లో, తత్వశాస్త్రాల్లో, సంస్కృతిలో, భాషలో, భావ వ్యక్తీకరణలో ఆ పరిమితులుంటాయి. అవి ప్రజాస్వామ్య పూర్వ దశలను తెలుపుతాయి. కొందరు సనాతన ధర్మం పేరిట వాటినే తిరిగి నెలకొల్పే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ కవి వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ స్వేచ్ఛ, సమానత్వం, బౌద్ధం, మాతృహృదయం, మానవీయత, ప్రేమ, కరుణ, సంవేదన, సహానుభూతి సంస్కృతితో పరిపుష్టం చేస్తారు.
ఆధునిక అలంకార శాస్త్రాలు ఆయా ప్రక్రియల వారీగా విస్తరించాయి. అలా బి.ఎస్‌. రాసిన కథలబడి కథాసాహితి అలంకార శాస్త్రం, పాటపుట్టుక, మహమ్మద్‌ ఖదీర్‌బాబు రాసిన కథలు ఇలా కూడా రాస్తారు, బిక్కి కృష్ణ రాసిన వచన కవిత్వ డిక్షన్‌ వంటి గ్రంథాలు వెలువడ్డాయి. కత్తి పద్మారావు కవిత్వ పరిణామంతో వచన కవిత్వ అలంకార శాస్త్రం రాయవచ్చు. రాయ వలసివున్నది. చేకూరి రామారావు, జి. లక్ష్మీనర్సయ్య వంటివారు రాసే ఖండికలు ఈ విస్తృతిని పట్టుకోలేవు. కోయి కోటేశ్వరరావు వంటి వారు ప్రసంగంలో విశ్లేషించినపుడు ఆ విస్తృతి కళ్లకు కడుతుంది. ఇలా కాళిదాసు కవిత్వం మల్లినాథ సూరి వ్యాఖ్యతోనే దాని గొప్పతనం అర్థమైనట్టు కత్తి పద్మారావు కవిత్వానికి ఖలీల్‌ జిబ్రాన్‌ కవిత్వానికి వలె విశ్లేషణ అవసరం.
ఈ సంపుటి అంతా కలిసి ఒక నవలాకృతి తోస్తుంది. నాస్తిక హేతువాద దళితవాద, బౌద్ధ, మాతృ తాత్వికత, అంబేద్కర్‌, జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే చూపు కనపడుతుంది. వీటన్నిటి గుండా సాగిన ప్రయాణం వాటిని కవిత్వంలో జీవితంలో ఉద్యమ స్వభావంలో కలుపుకొని సాగుతున్నది.
కత్తి పద్మారావు కవిత్వంలో దళిత సాంస్కృతిక చైతన్యం ఒక ప్రవాహంగా సాగుతుంది. అధిక్షేపంలో సంక్షిప్తత అవసరం. అవహేళన, అపహాస్యం, వ్యంగ్యం, ఖండన, నిరసన కవిత్వంలో సంక్షిప్తత శోభనిస్తుంది. నినాదంగా పదునెక్కుతుంది. శతృవు గుండెను చీల్చుతుంది. అలిశెట్టి ప్రభాకర్‌, సతీష్‌ చందర్‌లు ఎంతో బలంగా దీన్ని ప్రయోగించి విజయం సాధించారు. కత్తి పద్మారావు ప్రసంగాలు, తొలి, మలిదశ కవిత్వం ఈ దశలోనే సాగాయి. హేతువాద, దళితవాద, అపహాస్య, వ్యంగ్యం, కాఠిన్యం వదిలి బౌద్ధ తాత్వికత పరిణతి బాటసారిగా ప్రజలను ఓపికగా ఒప్పించే శైలికి మలుపు తిరిగారు. పిల్లలను బుజ్జగించి తమదారికి తెచ్చుకున్నట్టు కవిత్వంలో విస్తరణ, పౌనఃపున్యాలు కావాలి. అందుకు అనేక దృశ్యాలు ఉదాహరణలు సంఘటనలు అవసరమవుతాయి. మొదటిది నిర్మూలన తత్వం. రెండవది నిర్మాణ తత్వం. బౌద్ధానిది నిర్మాణ తత్వం. హేతువాదానిది నిర్మూలన తత్వం. అంబేద్కర్‌ నిర్మూలన తత్వం నుండి బౌద్ధ నిర్మాణ తత్వంలోకి పరిణతి చెందాడు. రాజ్యాంగ రచనలోనూ దీన్ని గమనించవచ్చు. కత్తి పద్మారావుగారిదీ అదే బాట! అవసరమైనపుడే వ్యంగ్యం అవహేళన చురకత్తులను విసురుతారు.
మంచు పచ్చికబయళ్లపై ముత్యాలు చల్లుతూ వెళుతుంది ఆ పచ్చికపై తెల్ల పావురం వర్ణాంతరాన్ని గానం చేస్తుంది
దృశ్యాదృశ్యాలుగా జీవితమే రంగుల మయమౌతుంది కదా!…
ఏ ముఖాన్నీ ఎవరూ గుర్తించడం లేదు….
ఆధునికతలోని డొల్లతనాన్ని, కోల్పోతున్న సహజత్వాన్ని ఇలా అనేక కవితల్లో వర్ణిస్తారు కవి.
కామం దావానలంలా మండుతోంది స్త్రీ వ్యక్తిత్వం మీద
మగ మృగాల దాడి… కలకత్తాలో అర్థరాత్రి
అబల గుండెల్లో గునపాలు దించిన దుండగుల వీరంగం…
ఇలా ఏక కాలంలో స్త్రీలపై జరుగుతున్న దాడులను, వారి సంఘర్షణలు, వైరుధ్యాలను పాఠకుల ముందుంచుతారు. కవి తాను స్వయంగా వాటిని ఆవాహన చేసుకుంటే (పరకాయ ప్రవేశం చేసుకొని) గానీ ఇంత లోతుగా, విస్తారంగా రాయడం సాధ్యం కాదు. ప్రతి పాత్ర పట్ల కవి, రచయిత ఆయా క్షణాల్లో ప్రేక్షకుడి పాత్ర నుండి ఆయా పాత్రల స్వభావంలోకి చొచ్చుకొని వెళ్లినప్పుడే వాటిని రాయడం సాధ్యం. అందువల్ల కొందరు క్రౌర్యం, హింస, దౌర్జన్యాల గురించి, హత్యాచారాల గురించి విస్తృతంగా రాస్తున్నారంటే వారి గుండెల్లో, వ్యక్తిత్వంలో అంతర్లీనంగా అవి కొనసాగుతున్నాయని గమనించాలి.
సినిమాల్లో హింస, టీవీల్లో హింస, రచనల్లో హింస, ఆయా వ్యక్తుల, కవుల, సినిమా దర్శకుల, రచయితలలో అంతర్లీనంగా కొనసాగుతున్న హింసా ప్రవృత్తే అని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తుంటారు.
‘ఔను! నాకు మూడు పదుల వయస్సున్నప్పుడు
కలకత్తా వీధుల్లో తిరుగుతూ మట్టి ముంతలో వేడి చాయ్‌ తాగిన గుర్తు…
మహిళా స్వరాలు ఆత్మ గౌరవాన్ని నినదించిన జ్ఞాపకం’…
కవిత్వంలో కవి స్వీయానుభూతులు అంతర్లీనంగా ఎలా కొనసాగుతాయో ఈ కవితలో స్పష్టంగా గమనించవచ్చు. ఒక రచయిత, ఒక కవి, ఒక సినీ దర్శకుడు, ఒక తత్వవేత్త, ఒక దార్శనికుడు తన అనుభవంలోకి, అధ్యయనంలోకి, ఊహల్లోకి, ఊహాకల్పనలోకి, అభివ్యక్తి వంటివాటి పరిధిలోకి రానిది, రాలేనిది రాయలేడు. ఖలీల్‌ జిబ్రాన్‌, ఉమర్‌ ఖయామ్‌, పాబ్లో నెరుడా, వర్డ్స్‌వర్త్‌, జాన్‌ మిల్టన్‌ కవిత్వం కేవలం ఆత్మాశ్రయ స్వీయానుభూతి కవిత్వం మాత్రమేనా? అది సార్వజనీన, విశ్వజనీన కవిత్వంగా మలిచిన స్వీయాత్మక అనుభవాలు, అనుభూతులు, భావాలు. కత్తి పద్మారావు కవిత్వం నిర్దిష్ట స్థల కాలాలను, సమకాలీనతను సమన్వయించుకొని విస్తరించిన విశ్వజనీన కవిత్వం.
ఇలా ప్రతి రచన, భావం ఆయా కవుల, రచయితల, దర్శకుల, దార్శనికుల, వ్యక్తిత్వంలో, స్వీయ చరిత్రలో, స్వీయ అనుభవంలో, స్వీయానుభూతుల్లోనూ భాగం కూడా. కత్తి పద్మారావు ఈ సంపుటిలో ఎన్నో అనుభూతులను, వేదనలను, ధర్మాగ్రహాన్ని వ్యక్తీకరించిన తీరును గమనించవచ్చు. గతంలోవలె పలువురు కవులను ఆహ్వానించి ఒక రోజంతా ఈ పుస్తకంపై పొన్నూరులో ఆత్మీయ సెమినార్‌ నిర్వహించి, ఆ ప్రసంగాలను పుస్తకంగా వెలువరిస్తే ఈ కవిత్వంలోని వివిధ కోణాలు, విశిష్టతలు వెల్లడవుతాయి.
కవి ఒక తత్వవేత్త అయివుంటే రాజ్యానికి, సమాజానికి, ప్రజలకు, ఏలికలకు గురు స్థానంలో ఉండేవిధంగా ఎదగాలి. ముందుకు నడపాలి. కత్తి పద్మారావు తాత్విక కవిగా ఈ పుస్తకంలో ఆ పనే చేశారు.
కవిత్వంలో వర్ణన లేకపోతే వస్తువు ముడి పదార్థంలా, కేవల వచనంలా కనపడుతుంది. ఈ ప్రమాదం వచ్చినపుడు ఆ పడతి.. ఆ దృశ్యం అంటూ మలుపు తిప్పుతారు. గద్దర్‌ తన మాట పాటలో అదిగో హ.. హు.. అనే ఊనిక పదాలతో దృశ్యం మార్చుతాడు. గుండెల్ని తట్టి లేపుతాడు. వచన కవిత్వంలో ‘ఆ’ అనే ఒక పదంతో దీన్ని సాధించే ప్రయోగం చేస్తారు.
భారతీయ సాహిత్యాన్ని సరిగ్గా అధ్యయనం చేయనివారు పాశ్చాత్య కవిత్వంలోనే సిమిలీలు, ప్రతీకలు, బహువ్రీహి అలంకారాలు, సర్రియలిజం వంటి వాటిని ఆశ్రయిస్తారు. కత్తి పద్మారావు కవిత్వంలో దేశీయ సంస్కృతి, దేశీయ అలంకార శాస్త్ర నైపుణ్యాలు కనపడతాయి. అలా ఈ కవిత్వంలో భాష నుడికారం దేశీయతను సంతరించుకుంది. ఇందులోని కథన చాతుర్యం పట్టుకోగలిగితే కత్తి పద్మారావులా కవిత్వంలో బహుముఖీన వస్తు వైవిధ్యాన్ని ఒకే కవితలో సాధించవచ్చు.
ఒక నవలా ప్రక్రియగా ఎదిగిన వచన కవితా సంపుటి ఇది. డా॥ సి. నారాయణ రెడ్డి ‘విశ్వంభర’ ఒక దీర్ఘకావ్యం, ఖలీల్‌ జిబ్రాన్‌ ‘ప్రవక్త’ ఒక దీర్ఘకావ్యం, కత్తి పద్మారావుగారి ‘ప్రేమకిరీటాలు’ కూడా ఒక దీర్ఘకావ్యం. ఇలా పలువిధాలుగా అర్థం చేసుకోగలిగిన అర్థ విస్తృతి, కావ్య విస్తృతి కలిగిన అనేక కావ్యాల సంపుటి ఈ ‘ప్రేమ కిరీటాలు’. విశ్వజనీన కవిత్వంతో తెలుగులో నూతన ఒరవడిని సృష్టిస్తున్న కత్తి పద్మారావుగారికి హృదయపూర్వక అభినందనలు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.