ఆ రోజు పాడె మీద స్వేచ్ఛ ముఖాన్ని చివరిసారిగా చూసినప్పటి నుండి నా ప్రవర్తనలో నాకు అర్ధం కాని కొన్ని మార్పుల్ని గమనిస్తున్నాను. ఎప్పుడూ రిలాక్సెడ్గా, సంతోషంగా ఉండే నేను కోపంగా, అసహనంగా తయారయ్యాను. నాతో పని చేస్తున్న వాళ్ళ పట్ల కూడా కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నాను. కోపంగా ఉంటున్నాను.
ఇదంతా ఏమిటి? స్వేచ్ఛతో అంత ఎక్కువ సాన్నిహిత్యం లేదు. చాలా తక్కువ సార్లే కలిసాను. ఒక రోజు బుక్ ఫెయిర్‌లో కలిసి నన్ను హత్తుకుని ‘‘మీరు హిమాలయాలు, నేను ఆకాశం’’ అన్నప్పుడు నాకు గొప్ప సంతోషమైంది.
అలా మీటింగుల్లో కొన్ని సార్లు కలిసినప్పుడు జలపాతం ఎగిసిపడుతున్నట్టనిపించేది.స్వేచ్ఛకి ప్రతిరూపంలా కనబడేది. సంతోష తరంగంలా, గలా పారుతున్న సెలయేరులా ఉండేది. పసిపిల్లల నవ్వులా తన నవ్వు ఎంత తేటగా ఉండేది. నేను ఆకాశాన్ని అంటూ ఆకాశంలో పక్షి ఎగురుతున్నంత ఉల్లాసంగా కనబడేది. ఫేస్బుక్లో తన పోస్టులు, ఫోటోలు ఆ ఉల్లాసాన్నే ప్రతిబింబించేవి.
సంపూర్ణ సాధికారత సంపాదించిన జర్నలిస్టులా కనబడే స్వేచ్ఛ… చనిపోవడమేమిటి? తింటూ తింటూ ఉన్న కంచం పారేసి ఉరితాడుకి వేళ్ళాడమేంటి. ఆమె మనస్సును ఎంతగా గాయపరిస్తే అంత హఠాత్ నిర్ణయం తీసుకుని ఉంటుంది.
ఒక దుర్మార్గమైన, అమానవీయ కెమెరా ఆమె ఇంట్లో చొరబడి ఆమె చివరి క్షణాలను చిత్రీకరించిన తీరు, కంచంలో మిగిలిన రొట్టె ముక్క దృశ్యం నన్ను చాలా గాయపరిచింది. అలా చిత్రీకరించే హక్కు ఎవ్వరికీ లేదు. దొంగలాగా ఇంట్లోకి చొరబడి ఆమెకు సంబంధించిన పర్సనల్ స్పేస్‌లోకి వెళ్ళే హక్కు ఎవ్వరికీ లేదు. ఎంతో దుఖంలో ఉన్న ఆమె బిడ్డ ముందు కెమెరాలు పెట్టి వేధించిన వీడియోలు, పతనమైన మీడియా విలువలు మరింత దుఖాన్ని ప్రోది చేసాయి.
సైబర్ క్రైంలో కంప్లైంట్ ఇచ్చాకా మనసు కొంత కుదుటపడిరది. ఆ చెత్త వీడియోలను సోషల్ మీడియాలోంచి తీసెయ్యమని చిక్కడపల్లి పోలీస్ ష్టేషన్కు కూడా వెళ్ళాను. ఇవన్నీ నాలో రగులుతున్న కోపాన్ని తగ్గించుకోవడానికే చేసాను.
అన్నిటి కన్నా నన్ను ఎక్కువ బాధిస్తున్న అంశం ఇలా ఎంతమంది వ్యక్తిగతంగా వేదన పడుతున్నారు. మనసులో మెలిపెడుతున్న అంశాలని పంచుకోవడానికి మనం ఏదైనా సిస్టం, సిస్టర్ హుడ్ లాంటివి ఏర్పాటు చేసుకున్నామా. మారిన సామాజిక పరిస్థితుల నేపధ్యంలో మనం ఎలాంటి ఎరుకతో ఉండాలి. చాలా క్లిష్టంగా మారిపోతున్న మానవ సంబంధాలు, స్త్రీ పురుష సంబంధాలు వీటిని ఎలా నిభాయించుకోవాలి. ప్రేమల్ని, భావోద్వేగాలని ఎలా అర్ధం చేసుకోవాలి… ఇవన్ని చర్చలోకి రావాల్సిన అంశాలుగా నాకు అనిపిస్తున్నాయి.
ప్రేమ కంటే జీవితం గొప్పదని నేను నమ్ముతాను. జీవితం మిగిలి ఉంటే ప్రేమ మళ్ళీ దొరుకుతుంది. ఒకే మనిషి మీద ప్రేమ, స్నేహం శిలాజంలాగా ఉండిపోతాయని నేను నమ్మను. రోజులు గడుస్తున్న కొద్దీ సంబంధాలు యాంత్రికమై పెళుసుబారి విరిగి పోతుంటాయి. అవే స్నేహాలు, ప్రేమలు దారుణంగా గాయపరిచే పరిస్థితులూ ఎదురౌతాయి. అదిగో అప్పుడే మనం నిటారు చెట్టులా నిలబడగలగాలంటాను. ఊపిరాడనివ్వని, చివరికి ఊపిరిని బలి కోరే ఆ బంధాల్నుంచి బయటపడేసే, తీర్పులివ్వని సిస్టర్‌హుడ్‌ని మనం ఎందుకు అభివృద్ధి చేయలేకపోయామనే బాధ నన్ను నలిపేస్తోంది.
బుద్ధుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాక ఒంటరితనంతో, దుఖంతో విలవిల్లాడిన యశోధర ఏమి చేసింది? తనలాంటి బాధితుల్ని కలేసి, గుండ్రంగా కూర్చోబెట్టి వారి గురించి, వారి దుఃఖాల గురించి మాట్లాడిరచేదట. 2600 సంవత్సరాల క్రితమే సోదరీ భావంతో మెలగడం అంటే ఏమిటో యశోధర చేసి చూపించింది. మనమెందుకు విఫలమయ్యాం, అలాంటి ఒక సోదరీ సమూహాన్ని మనమెందుకు అభివృద్ధి చేసుకోలేకపోయాం.
ఫెమినిస్ట్ ఆచరణలో ముఖ్యమైంది ఈ సోదరీ సంబంధమే. మనం ఎక్కడ విఫలమయ్యమో మనం మాట్లాడుకోవాలి. నా లోపల రగులుతున్న కోపం నా మీదే.
