అగ్ని కణికలమై శత్రు నాశనం చేద్దాం తల్లులారా! ఎవరమూ ఒక్కరం కాదు
అందరమూ ఒక్కటవుదాం… లేచి నిలబడండి చావు బతుకులను ఎదిరించండి
మొండాలకు తలలు మొలుస్తాయి
ఒళ్ళంతా అస్త్రాలు చిగురిస్తాయి
అనిశెట్టి రజిత (14.4.1958-11.8.2025) ఆధునిక తెలుగు కవిత్వ చరిత్రలో తిరుగుబాటు కవయిత్రులలో అగ్రేసరులు. ప్రగతిశీల మహిళా సంఘం, ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక, తెలంగాణ రచయితులు వేదిక వంటి అనేక సంఘాలలో క్రియాశీల పాత్ర నిర్వహించారు. ప్రరవేకి జాతీయ అధ్యక్షులయ్యారు. ఆమెకు ఉద్యమ జీవితం ఉంది. ఉద్యమ సాహిత్య జీవితం ఉంది. 1969 నాటి తెలంగాణ ఉద్యమం నుండి ఆమె ఉద్యమ నిమగ్నతను అలవాటు చేసుకున్నారు. ఒకవైపు ఉద్యమాలు, మరొకవైపు రచన రెండు ప్రాణాలుగా ఆమె జీవించారు. భారతీయ సమాజంలో పెద్ద సమూహమైన పీడిత జనపక్షపాతి రజిత. స్త్రీలు, దళిత బహుజనులు, ఇతర శ్రామిక వర్గాల వైపు ఆమె నిలబడ్డారు. తెలంగాణ వాద స్వరం బలంగా వినిపించారు. విప్లవోద్యమ పునాది నుండి ఆమె కవయిత్రిగా పుట్టుకొచ్చి, దళిత బహుజన వాదిగా, స్త్రీవాదిగా, తెలంగాణ వాదిగా తనను తాను మలచుకున్నారు. ఆమె స్పష్టమైన భౌతికవాది. భౌతికవాది కాకుండా సమాజంలో శాస్త్రీయమైన మార్పు తీసుకురాలేమని ఆమెకు బాగా తెలుసు. భౌతికవాదం ప్రశ్నలు నేర్పుతుంది. తిరుగుబాటును ఆయుధంగా అందిస్తుంది. ప్రతిఘటనను పిడికిలిగా ఇస్తుంది. అనిశెట్టి రజితలో ఇవన్నీ ఉన్నాయి. ఆమె ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయారు. 1984-2023 మధ్య ‘గులాబీలు జ్వలిస్తున్నాయి’, ‘నేనొక నల్ల మబ్బు నవుత’, ‘చెమట చెట్టు’, ‘ఉసురు’, ‘అనగనగా కాలం’, ‘దస్తఖత్’, ‘గోరంత దీపాలు’, ‘ఓ లచ్చవ్వ!’, ‘మార్కెట్ స్మార్ట్ శ్రీమతి’, ‘కాలం కాన్వాస్ మీద’ అనే పదకొండు కావ్యాలు ప్రచురించారు. తన కావ్యాలలోని కొన్ని కవితలను ఎన్నిక చేసి ‘‘నిర్భయాకాశం కింద’’ అనే సంపుటిని ప్రచురించారు. ఇతర రచనలు కొన్ని ఉన్నాయి.
అనిశెట్టి రజిత కవితలలో ఏ కవితను ముట్టుకున్నా యుద్ధభాష వినిపిస్తుంది. తిరుగుబాటు చైతన్యం తొణికి సలాడుతుంది. ప్రతిఘటన తెగువ ధ్వనిస్తుంది. ఆత్మస్థైర్య ప్రబోధం వ్యాపిస్తుంది. చెడిపోయిన స్థానంలో మంచి సమాజాన్ని స్థాపించాలన్న తపన ఆమె కవితలలో అక్షరాలై పరుచుకొని ఉంటుంది. ఆమెకు అక్షరాలను మండిరచడం తెలుసు.
ఆ గులాబీలు
గుబాళించడం లేదు సరికదా సహించటమే తెలిసిన ఆ సొగసుందనాలు
నేడు దహించుకుపోతూ జ్వలిస్తున్నాయి జ్వలిస్తున్నాయి
గులాబీలు విప్లవిస్తున్నాయి (నేనొక నల్లమబ్బునవుతా:పు, 13)
మహిళగా రజిత స్త్రీ జీవితాల మీద 60కి పైగా కవితలు రాశారు. పురుషాధిక్యత మీద, భూస్వామ్య పెట్టుబడిదారి సామ్రాజ్యవాద సంస్కృతుల మీద ఆమె తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆమె స్త్రీవాద కవితలు అణచివేయబడ్డ మహిళల్ని సంఘటిత పరుస్తాయి. సమైక్య పోరాటం వైపు నడిపిస్తాయి. ఆత్మహత్యల నుండి, ఆక్రందనల నుండి, అబలా స్పృహ నుండి స్త్రీలను విముక్తం చేస్తాయి. సామాజిక పరివర్తనకు కవిత్వం ఎంత బలమైన ఆయుధమో ఆమె రుజువు చేశారు. స్త్రీలలో రావలసిన చైతన్యాన్ని గుర్తించడం, గుర్తు చేయడం మాత్రమే కాదు, స్త్రీలలో వస్తున్న చైతన్యాన్ని కూడా రజిత పసిగట్టి కవిత్వీకరించారు.
ప్రపంచంలో కెల్లా అతిపెద్ద పిడతవర్గమైన
స్త్రీ జాతి సమరభేరి మోగిస్తున్నది (నేనొక: పుట, 30)
అని తొలినాళ్లలోనే ఆమె గుర్తించారు. గురజాడ అప్పారావు ఆధునిక మహిళ చరిత్రను తిరిగి రచిస్తుంది అన్నారు. రజిత ఆధునిక మహిళలు చరిత్రను తిరిగి చేయిస్తున్నారని రుజువు చేశారు.
స్త్రీలు సంఘటితంగా పోరాడాలని ఒక వైపు చెబుతూనే, రజిత, మరోవైపు స్త్రీల పట్ల చైతన్యవంతులైన పురుషులు కేవలం సానుభూతి చూపి చేతులు దులుపుకోవడాన్ని గురించి మాట్లాడుతూ, వాళ్ళు పురుషాధిక్య స్వభావం నుండి బయటపడాలని విజ్ఞప్తి చేశారు.
నీవు మాతో బుజం బుజం కలిపి కామ్రేడై ఆచరణకు కదలనిదే
భర్తృత్వాన్ని శాశ్వతంగా త్యజించనిదే నీవు చేస్తున్న కృషికి పునాదేది…
నీవు మారితేనే కదా మిత్రమా! సమాజం నీ వెంట నడిచొచ్చేది? (చెమట చెట్టు: పుట,24)
మహిళా వాదిగా రజిత మహిళల పట్ల పురుష ప్రపంచం, కుటుంబ వ్యవస్థ ప్రదర్శించే వివక్ష, మోసపూరిత విధానాలను తీవ్రమైన పదజాలంతో గర్హించడమే కాకుండా, స్త్రీలపై జరిగే అత్యాచారాలను హత్యాచారాలను కూడా అంతే తీవ్రంగా విమర్శించారు. 1997లో ఏలూరులో స్త్రీల పైన పోలీస్ గుంపు పడి నాశనం చేసిన సంఘటన మీద రజిత ‘ఖాకీ కైపు’ అనే కవిత రాశారు అందులో
మీ జాతికి మానవత్వం సోకడానికి ఇంకెన్ని యుగాల పరిణామ క్రమం
వేచి ఉందో!!! (చెమట చెట్టు:ను,30)
అని దెప్పి పొడిచారు. వరంగల్ మ్యూజికల్ గార్డెన్స్‌లో మహిత హత్యకు గురైనప్పుడు (క్షమించొద్దు పాపా) బెల్లి లలితను రాజ్యం మక్కలు చేసి చంపినప్పుడు (పాములు మింగిన పాట), ఇంకా అనేక సందర్భాల మీద ఆమె స్త్రీ ఉద్యమ కవయిత్రిగా బాధ్యతగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కవిగా కూడా, రజిత తన కర్తవ్యాన్ని నిర్వహించారు. అనేక కవితలు రాశారు. తెలంగాణ రాష్ట్రసాధనోద్యమం తుది దశకు చేరుకున్నప్పుడు రజిత తన్మయత్వంతో తెలంగాణను వర్ణించారు. ఆ వర్ణనలో తెలంగాణ పోరాట స్ఫూర్తి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ‘‘ఉద్యమాల ఊపిరి గడ్డ’’ ‘‘విప్లవాల నెత్తుటి బిడ్డ’’ ‘‘తెలంగాణ ఎరుపెక్కిన వరి చేను’’ ‘‘లాంగ్ మార్చి తెలంగాణ’’ ‘‘ప్రజల పాట తెలంగాణ’’ ‘‘తీగలు సవరించుకుంటున్న రుద్రవీణ’’ (చెమట చెట్టు: పు,53)
అంటూ విశేషణాలతోనే తెలంగాణను రూపు కట్టించారు. తెలంగాణలో పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో ఆవేదనతో ఆమె ‘చీడ తొలిచిన బతుకులు’ కవిత రాశారు.
పత్తి పువ్వులతో తెల్లారవలసిన
రైతు రాత్రులన్నీ
పచ్చదనాన్ని మేస్తున్న కీటకాలను పండిస్తుంటే… బతుక్కు చావునే ప్రత్యామ్నాయ మార్గం చేసుకుంటున్నాడు (పైది: 52) అని రైతును అనివార్యంగా ఆత్మహత్య వైపు నెట్టుతున్న రాజ్యం మీద విమర్శగా ఆమె కవిత రాశారు. కాళోజీ నారాయణరావు, సి నారాయణ రెడ్డి వంటి సీనియర్ తెలంగాణ కవులు మరణించినప్పుడు వాళ్లను స్మరించుకుంటూ కవితలు రాసి ఆమె తెలంగాణ స్పృహనే ప్రదర్శించారు.
మొదటినుంచి రజిత మీద విప్లవోద్యమ ప్రభావం ఉంది. విప్లవదృష్టితో ఆమె రాసిన కవితలే ఇందుకు నిదర్శనం. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సమర్థిస్తూ, ఆ విప్లవానికి వెన్నుదన్నుగా నిలిచిన పౌరహక్కుల నాయకులను రాజ్యం చంపినప్పుడు రజిత విమర్శనాత్మకంగానూ, వేదనాత్మకంగానూ కవితలు రాశారు. పౌర హక్కుల నాయకులు డాక్టర్ రామనాథం గారిని చంపినప్పుడు ‘విషాదసముద్రం’ అనే కవితను, డాక్టర్ నర్రా ప్రభాకర రెడ్డిని చంపినప్పుడు ‘ప్రభాకరుడు’ అనే కవితను రజిత రచించి వారికి నివాళలర్పించారు.
జనతంత్రం హక్కుల కోసం
ప్రాణాన్ని పణంగా పెట్టిన త్యాగి ……..
గాయాలతో రక్తసిక్తమైన సంధ్యగా
చీకటి గర్భంలో నిద్రపోయాడు (నేనొక: పు71)
అని ప్రభాకర రెడ్డి మరణాన్ని వర్ణించారు. హక్కుల కోసం పోరాడే వాళ్ళను రాజ్యం చంపడం పరిష్కారం కాదని రజిత సూచన కూడా చేశారు. సూర్యునికి అస్తమయం ఉందా సలు (పైది:పు’40) అని రామనాథం హత్య సందర్భంగా ప్రశ్నించారు. గుజరాత్ మారణకాండ సందర్భంగా, సద్దాం హుస్సేన్ ఉరితీత సందర్భంగా కూడా ప్రజాతంత్రవాదిగా రజిత స్పందించారు. పెరుమాళ్ మురుగన్‌ను మతవాదులు మానసికంగా హింసించినప్పుడు రజిత మౌనం పాటించకుండా కవిత రాశారు. రాజకీయ వర్గాలలో ప్రబలిపోయిన అవినీతిని కవితలలో ఎండగట్టారు. మానవ సంబంధాలలో వికృత రూపం తీసుకుంటున్న నగర సంస్కృతిని అధిక్షేపించారు. కార్మికులతో రజిత కవిత్వ కరచాలనం చేశారు. అమ్మను నాన్నను అనేక కవితలలో నోరారా కీర్తించారు. కరోనా కష్టాలను కవిత్వీకరించారు. దేశాల పాలకులు చేసుకునే యుద్ధాన్ని నిరసించారు. మణిపూర్ దుర్మార్గాన్ని గర్హించారు. అస్పృశ్యతను చీల్చి చెండాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన విద్యను ఆమె బాగా గౌరవించారు. కుల వ్యవస్థను కుళ్ళపొడిచారు. తెలంగాణ భాషలో తెలంగాణ జీవితం గురించి రజిత అందమైన కవితలు రాశారు.
గిదెవలిరాజ్ధెమే అవ్వ లచ్చవ్వ గీడెవలది సెల్లుతదే అవ్వ లచ్చవ్వ
నువు సర్పంచువైనా, పెసిడెంటువైనా సుత గాయకురాలు కుతకుత ఉడుకయానె లచ్చవ్వ
కూడుగుడ్డలకు గతి లేనోల్లమే లచ్చవ్వ నెత్తిమీనకప్పుసుత గట్టిగా లేనోల్లం(ఉసురు:పు,28)
అంటూ పంచాయతీ ఎన్నికల్లో దళిత మహిళ సర్పంచుగా గెలిచినా పై కులాల పురుషులే పెత్తనం చెలాయించడాన్ని విమర్శించారు.
ఇలాంటి కవితలు చదువుతుంటే తెలంగాణ పొలాలలో పడి పొర్లాడిన అనుభూతి కలుగుతుంది. నాయినల్లారు, మావ్వబడి, మూడుతుకుల చీర, అవ్వరాజ్జెం రావాల్నని వంటి కవితలు పాఠకులను తెలంగాణ గ్రామాల్లోకి తీసుకుపోయి మట్టి వాసన చూపిస్తాయి. మన సొంత భాషలో ఎంత అందమైన కవిత్వం రాయ వచ్చునో అనిపిస్తుంది. రజిత తెలంగాణ భాషలో రాసిన కవితలు చదువుతుంటే, అనంతపురం జిల్లా భాషలో పద్యాలు రాసిన కోగిర జై సీతారాం గుర్తుకు వస్తారు.
కాళన్న! మా కండ్లల్ల వేలుపొడిసి గుండెల్ల ఈట గుచ్చి
మనుస్సును మర్మంగ కెలికి అబ్బా! ఎంత పుండు చేసిండు
ఎంత ఢోకజేసిండు ( ఉసురు:పు,62)
అనిశెట్టి రజిత హఠాన్మరణం బాధాకరం. ఆమెకు నా నివాళి.
ఆమె లేరు ఆమెకవిత్వముంది.
అదే ఆమె మనకిచ్చిపోయిన సంపద.
