ఇన్నాళ్ళూ ప్రచురణ రంగంలో తనదైన ముద్ర వేసిన ఛాయ, ఇప్పుడు ఛాయ సాహిత్యోత్సవం చేయబోతున్నది. దేశవ్యాప్తంగా అనేక సాహిత్య ఉత్సవాలు జరుగుతున్నా అవి ఎక్కువగా ఇంగ్లీష్ కేంద్రంగానే ఉంటున్నాయి.
వాటికి భిన్నంగా తెలుగు నేలన తెలుగు సాహిత్యాన్ని ఉత్సవం చేసేందుకు పూనుకున్నది. అక్టోబర్ 25న జరిగే ఈ సాహిత్యోత్సవం ఈ ఏడాదే గాక ప్రతి యేటా అక్టోబర్ 4వ శనివారం జరుగుతుంది. వరుసగా మూడేళ్ళ పాటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దీనికి వేదికగా నిలవనుంది. ఈ సాహిత్యోత్సవానికి ప్రముఖ సంపాదకులు కె. శ్రీనివాస్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. ప్రో. చల్లపల్లి స్వరూపరాణి, కవి యాకుబ్, కుప్పిలి పద్మ మెంటార్లుగా ఉంటారు.
తెలుగు సాహిత్యంతో పాటు దక్కనీ, కన్నడ, తమిళ, మలయాళ సాహిత్య మేళవింపుగా ఈ సాహిత్యోత్సవం జరగబోతుంది. తెలుగుతో పాటు దక్కన్ సాహిత్యం మీదా రెండు ప్రత్యేక సెషన్లు ఉన్నాయి. రెండు సమాంతర వేదికల మీద ఇంగ్లీష్, తెలుగు సంభాషణలు జరుగుతాయి. అంతేగాక తెలుగు పుస్తకాలు ఆవిష్కరించుకునేందుకు 14 పుస్తకావిష్కరణ సెషన్స్ ఉన్నాయి. అందులో ఏ తెలుగు ప్రచురణ సంస్థ అయినా ముందస్తు అనుమతితో పుస్తకాన్ని అవిష్కరించుకోవచ్చు. అలాగే ఫెస్టివల్‌కి వచ్చిన రచయితలతో 14 సంభాషణ కార్యక్రమాలు ఉన్నాయి. మీకు ఇష్టమైన రచయితలతో పాఠకులుగా మీరు వారితో ముచ్చటించవచ్చు.
ప్రసిద్ధ తెలుగు రచయిత అల్లం రాజయ్య, తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్, కన్నడ రచయిత వసుధేంద్ర, మలయాళ రచయిత్రి షీలా టామీతో సహా 50కి పైగా రచయితలు 16 సెషన్స్‌లో మాట్లాడుతారు.
పుస్తక ప్రదర్శన, ఫ్లీ మార్కెట్ కూడా ఫెస్టివల్‌లో ఉంటుంది.
