` సేకరణ : డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
(నెల్లూరు ప్రొగ్రెసివు యూనియను వారు ప్రతివత్సరమును ఆంధ్ర స్త్రీలకు వ్యాసరచమున పోటీ పరీక్ష నొకదానిని నిర్వహించుచున్నారు. ఈ పరీక్షకు గాను పంపబడు వ్యాసములలో నుత్తమమగు దానికి డాక్టరు కే.ఎన్. కేసరిగారు ఒక స్వర్ణపతకమును ఇచ్చుచుండుట వాడుక.
ఈవత్సరము పోటీ వ్యాసము ‘స్త్రీ అబల కాదు’ అను విషయమును గూర్చి. ఇందుకు పండ్రెండుగురు స్త్రీలు పోటీ చేసిరి. అందు శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మ గారి వ్యాసము బహుమానార్హమని పరీక్షాధికారులు నిర్ణయించిరి. బహుమానము పొందిన ఆ వ్యాసమిచ్చట పూర్తిగ ముద్రించుచున్నారము. మిగిలిన వ్యాసములలోని ముఖ్యభాగములనెత్తి పై మాసము ప్రచురింతుము. శ్రేష్ఠతమమైన వ్యాసము వ్రాసి ‘కేసరి స్వర్ణపతకమును’ బహుమానమందిన శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మ గారిని ఈపట్టున మన:పూర్వకముగ అభినందించుచున్నాము. ఆమె పాండితీగరిమ మాకు సుపరిచితమైనది. ఆమె వ్రాసి పంపు వ్యాసములు అక్షరము మార్చకుండనే అచ్చునకీయవచ్చునంతటి నిర్దుష్టములై యుండునని అనుభవముచే చేయెత్తి చెప్పుచున్నాము. శ్రీ వరలక్ష్మమ్మగారి శైలిలో ఒక విధమైన వేగమున్నది. అలతి పదములచే కూర్పబడిన చిన్నివాక్యము లావేగమునకు ముఖ్య పరికరములు. ఆమెకు గల వస్తు పరిశీలనా శక్తి ఆమె వ్యాసములందలి ప్రతి వాక్యమున పొడగట్టుచుండును. శైలికి వ్యక్తిత్వము నీయగల సామర్థ్యము, వస్తువులను పరిశీలించుటలో అపూర్వమైన శక్తి, విషయముల నుండి మంచి నీతిని వడపోసి ప్రదర్శింపగల ప్రతిభ శ్రీ వరలక్ష్మమ్మ గారికి సహజ గుణములు. అవి ఈ వ్యాసమున బాగుగ ప్రదర్శితములైనవి. వ్యాసము ముగించుటలో ఈమె కొంత తొందరపాటు చూపించినను ఎత్తుగడ, నిర్వహణమును ప్రశస్తముగనున్నవి. పరీక్షాధికారులీ వ్యాసమునకు నూటికి నలుబదితొమ్మిది మార్కుల నిచ్చిరి. ` సంపాదకుడు.)
చరాచరాత్మకంబగు విశాల సృష్టికి హేతువులు ప్రకృతి పురుషులు. పురుషుఁడన పరమాత్మ. ఆ పరమాత్మ స్వరూపము యొక్క సంకల్ప వికారమే ప్రకృతి. ఆ ప్రకృతియే మాయయనియు, శక్తియనియు వేదాంత శాస్త్రమున వచింపఁబడుచున్నది. శక్తియననేమి? బలము.
శక్తియొక్క తోడ్పాటు లేక జగములుత్పాదింపఁబడుట లేదు, పెంపొందుట లేదు, లయమగుట లేదు. ఈ విశ్వమునందలి ప్రతి పరమాణువును శక్తిసహితమైయే యున్నది. సృష్టిస్థితిలయ కారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరు లేమి, దేవేంద్రాది దిక్పాలకులేమి, శక్తి సహాయముననే తమ తమ కృత్యముల దక్షతతో నిర్వర్తింపగలుగుచున్నారు. సూర్యచంద్రాది గ్రహములును పృథివ్యాపస్తేజో వాయురాకాశములనెడి పంచమహాభూతములను శక్తి సహాయముననే నిజధర్మముల నెఱపుచున్నవి. ఈ బ్రహ్మాండము నందలి స్థావర జంగమాత్మకంబగు సమస్త పదార్థమునకును నిట్టి సామర్థ్య మొసఁగుచున్న యాశక్తి యెయ్యది గలదో అదియే జగన్మాత, ఆదిశక్తి. శివుని యిల్లాలు శివ. ఈమె శక్తికి అధిష్ఠాన దేవత. ఈమె పెనిమిటి కర్థాంగమై దేహ బలమును గూర్చుచున్నది. ధాత యిల్లాలు వాణి. ఈమె సమస్త విద్యలకు అధిష్ఠాన దేవత. ఈమె పెనిమిటి వాక్కున నిలిచి వాగ్బలమును జేకూర్చుచున్నది. విష్ణువునిల్లాలు రమ. ఈమె సంపద కధిష్ఠాన దేవత. ఈమె పెనిమిటి మన:పీఠమున నిల్చి మనోబలమును గలిగించుచున్నది. వ్యవహార సౌకర్యమునకై ముమ్మూర్తులు కల్పించి మూడభిధేయములఁ బిలువబడుచున్నను యీ మువ్వురును మూడు మూర్తులా? కాదు. ఒక్కటే పరమాత్మ స్వరూపము. మూడు మూర్తు లొక్కటైనపుడు ముగ్గురు దేవేరులొక్కటియే గదా! కాన మనోవాక్కాయకర్మంబులకు బలంబు చేకూర్చెడి ప్రకృతి స్వరూపయగు జగన్మాతయు నఖండమే. ఆ యఖండ జ్యోతిర్మయ స్వరూపము నుండి యుద్భూతమైన యొకానొక కళయే స్త్రీ.
కావుననే మన భారతవర్షమున స్త్రీ శక్త్యంశ సంభూతగా నెన్నబడుచున్నది. శక్తియన బలమని యర్థము కదా. కాన శక్త్యంశ సంభూతయగు స్త్రీ యబలయెట్లగును? కాదు. స్త్రీ యొక్క యాత్మబలమనుపమానమైనది. ఒకప్పుడు స్త్రీ యొక్క యాత్మ బలము బొందితో స్వర్గమున కుద్గమింప గలిగెను. దివి నుండి భువికి వాహినిjైు ప్రవహింప గలిగెను. సూర్యోదయము కాకుండ కాలము నరికట్టగలిగెను. ముమ్మూర్తుల ముద్దుబాలుర గావింప గలిగెను. రాళ్లు శనగలు చేయజాలెను. దండధరునితోఁ బోరాడి భర్తృజీవములను గొని రాగలిగెను. కనుల జూడకనే సమస్తమును జూడగలిగెడు శక్తి, చెప్పకయే సర్వమును తెలిసికొనెడు సామర్థ్యము, నస్త్రశస్త్ర ప్రయోగము లేకయే యెదిరిని నిర్జింపజాలెడు మహామహిమయు నాత్మశక్తిచే స్త్రీ సంపాదింపఁజాలెను. అహో! స్త్రీ యొక్క యాత్మబల మెంత నిరుపమానము!
స్త్రీ యొక్క కంఠ మాధురిమయు, వాక్సౌజన్యమును, నసదృశ్యములు. సర్వసంగ పరిత్యాగులై కాఱడవులఁ జేరి నిట్రుపాసంబుల గడుసు తపంబులు సల్పెడు సంయమివర్యుల నిశ్చలచిత్తములను సైతము చలింపఁ జేయఁ జాలినదనినచో స్త్రీ యొక్క గానశక్తి యొక్క బలీయత వేఱే వివరింపనేల? ‘‘శ్రీర్వాక్చనారీణాం స్మృతిర్మేధా ధృతిక్షమా’’. స్త్రీల యందుండెడి సంపద, వాక్కు, స్మృతి, బుద్ధి, ధైర్యము, ఓర్పు నేనేయని భగవద్గీత యందు శ్రీకృష్ణభగవానుఁడు వాక్రుచ్చియున్నాఁడు. కాన శ్రీ గీతావచనము ప్రకారము స్త్రీ వాక్కునందు దేవాంశ గలదు. దేవాంశ గల వాక్కు స్త్రీకిఁ గలిగి యుండ వాగ్బలమున స్త్రీలబలలెట్లగుదురు? మృదులము, మధురము, మనోజ్ఞమునగు స్త్రీ వాక్కు బహుసత్వము గలది. ఒకప్పుడు స్త్రీ వాక్కు మృదులమై దీనజనులయెడ కరుణార్ద్రమై దీనజనోద్ధారకమగును. మఱియొకచో తీక్ష్ణమై యలసులగు దేశీయుల యుత్సాహము నుద్దీపింపఁ జేయఁజాలును. వేఱొకచో కఠినతమమై శత్రుహృదయవిదారణచణమగును. మఱొకచో శాంతమై ధర్మయుతమై మహాసభల ధర్మప్రసంగములఁ జేయఁ జాలి యుండును. ఒండొకచో లలితశృంగార భావ సమన్వితమై రసికజన మనోభిరామమై యలరారును. స్త్రీ యొక్క వాగ్బలిమి యెందును నిస్సత్వము గాదు. జనకునితో వాదించిన సులభ, యాజ్ఞ్యవల్క్యునితో వాదించిన మైత్రేయి, ఆదిశంకరునితో వాదించిన సరసవాణి, దండధరనితో ప్రసంగించిన సావిత్రి, స్త్రీల వాక్పాటవమును నిరూపింపగల తార్కాణలు గదా!
దేహబలమున గూడ స్త్రీలబలలు గారు. బలప్రదర్శన మనేక విధములుగ నుండును. అందు సమరము సేయుటనునది బలనిరూపణ యందధికమైనది. పౌరాణిక యుగముననేమి, ఐతిహాసిక యుగముననేమి, చారిత్రక యుగముననేమి పెక్కుమంది స్త్రీలు యుద్ధము చేసినట్లు గ్రంథముల వలన తెలిసికొనుచున్నాము. నేఁడు భారతదేశమున కట్టి యుద్ధావసరములు లేకపోవుటచే తారాబాయి, రుక్మాబాయి వంటి బలవంతురాండ్రగు నారీమణులను వినోదార్థముగ సర్కసులలోఁ గనుచున్నాము.
పౌరాణిక యుగమున సత్యభామ నరకునితో బోరి దేహబలమున స్త్రీ యబల కాదని నిరూపించెను. చారిత్రక యుగమున గూడ పెక్కుమంది నారీమతల్లు లశ్వారోహణ గజారోహణాది విద్యల యందును, సాముగరిడీల యందును, నస్త్రశస్త్ర ప్రయోగముల యందును నిపుణులై యుద్ధములు చేసినట్లు నిదర్శనము పెక్కులున్నవి గదా. కావున దేహ బలమున స్త్రీ యబల కాదు.
త్రికరణముల చేతనే గాక సత్వరజస్తమంబులనెడి త్రిగుణములచేతను స్త్రీ యొక్క బలిమి యల్పము గాదని నిరూపింపనగును. ఏది మనస్సుచే మనస్సును జ్ఞానబలముచే జయింపఁ జాలునో యది సాత్విక బలము. అట్టి బలమునకు కాయముతో బనిలేదు. మైత్రేయి యొక్క జయము, సులభ యొక్క జయము, సరసవాణి యొక్క జయము యిట్టి సాత్విక బలముతో లభ్యమైనది. మహాభారతములో చెప్పబడిన పతివ్రత, దురహంకారియగు కౌశికుని యహంకృతిని గుర్తించినదిట్టి సాత్వికయుతమైన జ్ఞానబలము చేతనే. కుసుమము యొక్క శోభ చెడకుండనే భ్రమరము మకరందము నాస్వాదించునట్లు సాత్విక బలము మనుష్యుని శరీరము నొవ్వఁజేయకనే మనస్సును జయించి వశీకృతము గావించుకొనును.
అస్త్రశస్త్రాది సాధనముల చేత నొకరినొకరు జయించుట రాజస బలము. సత్యభామాది శూరనారీమణులు యుద్ధము చేసిన చందమిట్టి రాజస బలమునకుఁ జెందినది. తాటకాది యంగనల బలము తామస గుణయుతమైనది. ఈ తామస బలమునందు నెట్టి ధర్మసూక్ష్మతయు లేదు. కేవలము క్రౌర్యయుతమైన హింస యొక్క వికారమే తామస బలము యొక్క నైజము. త్రిగుణవికార సత్యము నందు గూడ స్త్రీలబలలు గారనుననది నిరూపించుటకే యీ యంశము ప్రస్తావింపఁబడినదిÑ కాని గర్హ్యమగు తమోబల విషయమున స్త్రీలబలలై యుండుటయే యొప్పు.
ఇఁక యుగవిభాగముచే స్త్రీ బలిమిని విచారింతము. వేద యుగమున స్త్రీ పురుషునితో సమానముగ బ్రహ్మవాదినిjైు వేదములను, వేదాంతములగు నుపనిషత్తులను కూడ రచియించెను. ఏకాగ్రతతో బ్రహ్మ విచారము సల్పి బ్రహ్మ సాక్షాత్కారము బడసెను. అవివాహితమై వీర వైరాగ్యము ననుష్ఠించెను. తత్వజ్ఞిjైు మహాసభలలో తత్వప్రసంగములు గావించెను. సన్యసింపఁబోయెడి పెనిమిటితో శాస్త్రప్రసంగము గావించిన మైత్రేయియు, జనకుని సభలో యాజ్ఞవల్క్యునితో వాదించిన గార్గియు, జనకునితోఁ జర్చ చేసిన సులభయు వేద యుగమునకుఁ జెందినవారే. వేదయుగ స్త్రీ యగు ఆత్రేయి, సుమధుర సామగానమునకుఁ జొక్కి పశుపక్ష్యాది జంతు జాలము గూడ నాహారవాంఛ మాని తన్మయతతో నిలువబడి పోయెనన స్త్రీ యొక్క వేద పఠనా బలిమి వేఱె వర్ణింపనేల?
పౌరాణిక యుగమున స్త్రీ నిజ పురుషునకును బరమాత్మకును నభేదము నుపలక్షించి యామహాప్రభావతచే యనేక మహామహిమంబుల జూపగలిగెను. అనసూయ, అరుంధతి, సుశీల, సీత మున్నగు మహా పతివ్రతల కాకరమైన కాలమదియే.
బౌద్ధ యుగమున స్త్రీ యొక్క శక్తి మఱొకమాఱుజ్వలముగఁ బ్రజ్వలించెను. ఆనాడు స్త్రీ పురుషునితో సమానముగ శ్రమణిjైు భోగము లుజ్జగించి, శరీరాభిమానమును జంపుకొని, గురుశుశ్రూషలు చేసి, బౌద్ధమత గ్రంథములు పఠించి, తత్వదర్శినిjైు గౌతమబుద్ధుని యహింసా మతమును బోధింపుచు నానాదేశములు పాదచారిణిjైు గ్రుమ్మరెను. ఆ కాలమున సామాన్య స్త్రీలే గాక కాశీసుందరి, మాలిని, సంఘమిత్ర మున్నగు రాజకుమారికలు కూడ సన్యాసినులై బౌద్ధమత వ్యాప్తికి మహాకృషి చేసిరి. అవివాహితయగు కాశీసుందరి నిరుపమాన శేముషికిని, సౌందర్యమునకును మోహితులై రాజకుమారులు కొందఱామెను పరిణయమాడ నుత్సహించి గురువుకడ తత్వబోధలందుచున్న యామెను బలాత్కారముగ గొనిపోవ నుంకించిరి. యోగశక్తిచే నామె మింటికెగసెను. అమ్మహాసామర్థ్యమును గని రాజకుమారులు తమ యకృత్యమునకు సిగ్గిలి పశ్చాత్తాపతప్త హృదయులై యామెను క్షమింప వేడిరి. మాలిని యను మఱియొక రాజకుమారి హిందూమతాభిమాని యగు తండ్రిచే ప్రవాస శిక్ష వేయబడినదై, తాను వెడలిపోవు సమయమున మహాసభలో వారము దినములు తత్వ ప్రసంగము సేయుటకు తండ్రిచే యనుజ్ఞవడసి ధర్మప్రసంగము చేసెను. విద్వద్వర్యుల తోడను, మంత్రి సామంతాది మహాజనుల తోడను బరివేష్టితుండగు తండ్రి సమక్షమున మాలిని చేసిన ధర్మ ప్రసంగమునకు సభ్యులు ముగ్ధులైపోయిరి. హింసా ప్రాధాన్యమగు కర్మకాండతో నొప్పిన హిందూ మతమును తుండెములుగా ఖండిరచి, బౌద్ధ మతము నందలి మహోదారతను వివరింపుచుండ ఆ సభా పరివేష్టితలగు పండితులలో నొక్కరికైన యామె వాదమును కాదను సామర్థ్యము లేదాయె. అందఱామె వాదమునకు ముగ్ధులై తలలూపుచుండిరి. వారము దినముల యుపన్యాసము పూర్తియయ్యెను. ఎల్లరకును హిందూ మతమునందు భక్తి తొలఁగి పోయెను. బౌద్ధ మతము నందనురక్తి గలిగెను. మహాతత్వజ్ఞురాలగు నారాజకుమారి కడ తండ్రి మొదలుగా సమస్త సభాసదులును బౌద్ధమత దీక్షఁ గొనిరి. ఒకరు గాదు. ఇద్దఱు గాదు. పదివేల మంది గృహస్థులను హిందూ మతాభిమానులైన వారిని నొక్కమాఱుగా బౌద్ధ మతమును స్వీకరింపఁ జేయజాలిన పాండిత్య గరిమ యెంత యుత్కృష్టమో గదా? అహో! ఎట్టి వాగ్మిని!
అశోకుని తనయ యగు సంఘమిత్ర కేవలము తన దేశమున బౌద్ధమత ప్రచారము గావించుటతో దృప్తిఁ గనలేదు. ఆమె బౌద్ధ శ్రమణులతోఁ గలిసి సుమిత్ర, జావా, చీనా, జపాను, సింహళము మున్నగు పలుదేశముల కేగి బౌద్ధ మతమును వ్యాపింపఁ జేసెను. గౌతమ బుద్ధుని ప్రేమమయమగు నహింసాతత్వ మానాడు సంఘమిత్ర రమణీయమంజుల సుధామయోక్తుల మఱింత సొబగుదేఱి నానాదేశములఁ దన జయ పతాకలను బ్రతిష్టింపఁ గలిగెను. ఈ విధముగా బౌద్ధ యుగపు స్త్రీ తన సేవాపరాయణతచే, నపూర్వ త్యాగముచే, కార్యదీక్షచే, వైదుష్య సంపదచే, తత్వజ్ఞానముచే మనోవాక్కాయ కర్మంబుల స్త్రీలబలలు గారని నిరూపింపఁ గలిగినది.
మహమ్మదీయ యుగమున స్త్రీకి ఘోషా. అటు నిటు స్వేచ్ఛగా మసలుటకును, జదువుటకును స్వాతంత్య్రము లేదు. అయినను నూర్జహాను, జహనారా మున్నగు మొగలాయి రాజకుటుంబ స్త్రీలు రాజ్య తంత్రములలోఁ బాల్గొని స్త్రీ బుద్ధి వైశద్యము సామ్రాజ్యములను బాలింపఁ జాలినదని చాటిరి. ఉయ్యెలలూచు హస్తములే సామ్రాజ్యముల బాలింపఁ జాలునను సామ్యము వారివలన రూఢయియ్యెను.
రాజపుత్ర యుగమున స్త్రీ యొక్క అపూర్వ త్యాగము, క్షమాశీలత యనుపమానము. రజపూత కాంతల యొక్క బలప్రదర్శన మొకవిధమైనది గాదు. అసాధారణమైన మతివిశేషము, అసదృశ్యమైన కార్యదీక్ష, అజేయమైన సంగ్రామ కుశలత, అపూర్వమైన ఆత్మార్పణము, అకుంఠితమైన దేశాభిమానము, అనితరమైన యాత్మగౌరవము నాదిగాగల యసామాన్య గుణములచే విరాజితమైనది రాజపుత్ర యుగము నాటి నారీవ్యక్తి! ఆ యుగపు నారీమూర్తి యందు స్త్రీ యొక్క యంత:శక్తులన్నియు నసమానముగాఁ బ్రకాశించినవి. ఉజ్వలమై దుర్నిరీక్ష్యమైన యా తేజోరేఖకు ఖండఖండాతరములును నిప్పటికిని జోహారు లర్పించుచున్నవనినచో యా రసపుత్ర నారీరత్నము యొక్క బలశౌర్యములు వేఱె వర్ణింపనేల?
పైని వర్ణితములైన బహువిధ నిదర్శనములచే ప్రాచీన కాలమున స్త్రీ యే విషయమునను ననగా త్రికరణములను, త్రిగుణములను గూడ అబల కాదని విదితమయ్యెను. వర్తమాన యుగము నందును స్త్రీ యబలగా నుండుట లేదు. రాజకీయముగను, సాంఘికముగను, విద్యా విషయమునను, నార్థికముగను, కళా విషయముగను గూడ నాధునిక స్త్రీ బలసంపన్నత యల్పము గాదనుటకు నేడు స్త్రీలుత్తీర్ణులగుచున్న బహువిధ యుత్తమ పరీక్షలు, నడుపుచున్న మహా సంస్థలు, చేయుచున్న మహత్కార్యములు, ఇచ్చుచున్న మహోపన్యాసములు, పొందుచున్న మహోన్నత పదవులే తార్కాణ(ములు). స్త్రీ యొక్క భవిష్యమింతకంటె తేజోవంతమై, సత్వవంతమై విరాజిల్లఁ గలదు. ఇపుడు స్త్రీల కొనగూర్పఁ బడుచున్న నవీన శాసనములు స్త్రీ సామర్థ్యమును బహుముఖముల విశదీకరించుటకు సాధనములు కాగలవు.
అయితే, స్త్రీ కబలయను పేరేలఁ గలిగినది? ఈవిషయమింక విచార్యము. స్త్రీ యొక్క బుద్ధిశక్తులవకాశము లభించినచోట నుజ్వలముగాఁ బ్రజ్వలించినను, నవి యథేచ్ఛముగా నెపుడును విజృభింపఁబడలేదు. పురుషుని స్వార్థ మనీష యెప్పుడును స్త్రీ ప్రాబల్యము నడచి వేయుటకే యత్నించినది. స్త్రీకి వేద కాలమున గల విద్యావైవాహిక స్వాతంత్య్రము స్మృతుల కాలమున లేదు. స్మృతుల కాలమున గల స్వాతంత్య్రము పౌరాణిక కాలమున లేదు. పౌరాణిక కాలమున గల స్వాతంత్య్రము చారిత్రక కాలమున లేదు. ఈ విధముగా యుగయుగమునను స్త్రీ యొక్క సహజ శక్తులు, బుద్ధి వైశద్యము శాస్త్ర వచనలముల చేతను, మత విధుల చేతను, సాంఘికములగు కట్టుబాటుల చేతను, ఆచార పాశముల చేతను, కుటుంబ పరిస్థితుల చేతను, నవిద్యాప్రాబల్యము చేతను నణచివేయఁ బడుచుండెను. స్త్రీ పురుషుల మధ్య సమత్వధర్మము పోయి పాలక`పాలిత పద్ధతియు, యజమాన`బానిసీ ధర్మములును ప్రవేశించెను. ఇట్టి దుర్భర నిర్బంధములచే క్రమక్రమముగా స్త్రీ పురుషుని భోగోపకరణము గాను, జడపదార్థము గాను మాఱిపోయెను. దురతిక్రమణీయములగు నిట్టి నిర్బంధములు స్త్రీ వికాసావకాశమును నిరోధింపుచుండ నారీ హృదయము దుర్బలమగుటలో నాశ్చర్యమేమి? కాని యిట్టి నిర్బంధ పరిస్థితులలో గూడ సమయము చిక్కినప్పుడెల్ల స్త్రీ యొక్క బుద్ధిబలము గాని, వాగ్బలము గాని, దేహబలము గాని పురుషునకుఁ దీసిపోలేదు. ఎన్ని నిర్బంధవిధుల బద్ధపఱచినను స్త్రీ శక్తిని పూర్తిగాఁ దుడిచి వేయుటకు ఎవరికిని సాధ్యము కాలేదు. అల్పముగానైన స్త్రీ సామర్థ్యమును గుర్తింపకుండ నిరసించుటకు ధర్మశాస్త్రములకైన వీలుకాలేదు. స్త్రీ సహాయము లేని పురుషుఁడు నిస్సహాయుఁడు. కావుననే యవివాహితుడగు పురుషుని యర్ధశరీరునిగా శాస్త్రములు వాకొని యున్నవి. ‘‘స్త్రీ పుంసయోరాత్మ శక్తోరైకత్వ సంపాదనం వివాహ:’’ ‘‘ధర్మార్థకామమోక్షాణాందారా: సంప్రాత్తిహేతవ:’’ ఇత్యాది శాస్త్ర వచనముల చేత స్త్రీ యొక్క ప్రాముఖ్యత వివరింపఁబడినది. స్త్రీశక్తి గాని పురుషుని శక్తి గాని యేదియు పరిపూర్ణము గాదనియు, వివాహ బంధముచే నీయుభయశక్తుల నేకీభవింపఁజేయుట చేతనే మానవశక్తి యొక్క పరిపూర్ణత యేర్పడుననియు పై శాస్త్ర వచనముల తాత్పర్యమని చెప్పవచ్చును. కాన కాలక్రమమున బహువిధ విధినిషేధములచే దేశమునకు, సంఘమునకు సంబంధించిన ఘనకార్యములకు స్త్రీ దూరము చేయఁబడినను స్వగృహమునందు స్త్రీ యొక్క కార్యభారమమితముగనే యుండెను. స్వగృహమున స్త్రీ పురుషున కాలోచనఁ జెప్పునెడ మంత్రిణిగను, హితము గఱపునెడ నొజ్జగను, నుపచారములు సేయునెడ పరిచారికగను, శృంగార విలసమున గృహమునకు శోభదెచ్చెడి లక్ష్మిగను, గృహచ్ఛిద్రముల సహించునెడ సహనవతిjైున భూదేవతగను, భోజనభాజనాది సౌకర్యములు గలిగించునెడల దల్లిగను, భోగావసరమున రంభగను, సుఖోచిత సంభాషణలయందానందమును గల్గించెడి మిత్రురాలుగను, ఆపద లనుభవించుతఱి నర్ధాంగిగను స్త్రీ వినియోగపడుచుండెను. ఇంతియే గాదు. దేవగురు పితృపూజ, బంధు సత్కారము, అతిథి యభ్యాగత సమారాధనము, గృహనిర్వాహకత్వము, శిశుపోషణాది బహువిధ కార్యనిర్వాహములకు గూడ స్త్రీయే బాధ్యురాలు. ఇన్ని కార్యభారములు తన శిరముపైఁగల నారీమణి యబల యగుటకు సాధ్యమా? గర్భధారణాది క్లేశములు గూడ నీశ్వరుడబల పైనే యిడెను గదా.
అయినను సహజముగా కోమల హృదయయు, మృదుల వచనయు, శిరీషకుసుమపేశల సదృశ సుకుమార శరీరయునగు మన భారత మహిళకు బహుకాలముగా నబలయను నామము వాడుకయందు గలదు. ఈ యబలా నామము యొక్క ఉత్పత్తికి హేతువులు తొలుదొలుత పురుషునకు స్త్రీయందుండెడి ప్రేమయు, గౌరవమును, కారుణ్యమును కారణము గావచ్చును. కాని రానురానీయబలాభిధేయము స్త్రీకి బంధహేతువై పోయినది. ఏమన? ‘అబల’ గదా యేమిచేయునను భావము మగవానికిని, ‘అబల’ను నేనేమి చేయగలనను తలంపు స్త్రీకిని మనస్సున నాటిపోయినది. ఇందువలన స్త్రీయనిన చులకన మగవానికిని, స్వసామర్థ్యమునం దవిశ్వాస మాడుదానికిని యేర్పడినది. బహ్వనర్థదాయకమగు నీయబలానామము స్త్రీజాతికిఁ గలిగించిన నష్టము కొంచెము గాదు. అయితే యీ యబలా నామము భారతదేశముననే గాని పశ్చిమఖండములలో లేదు. పాశ్చాత్య దేశములలో స్త్రీయొక్క యబలానామ మిదివఱకే తుడిచివేయఁబడినది. ఆ దేశమునందలి స్త్రీ మత సాంఘిక రాజకీయార్థిక సారస్వతకళాద్యనేక విషయములందు పురుషునితో సరితూగి, యొకచో మిన్నjైు, తన శక్తి సామర్థ్యములు పురుషుని శక్తి సామర్థ్యములకుఁ దక్కువ గాదని నిరూపించియున్నది. కావుననే యా దేశము నందలి పురుషవరేణ్యులు స్త్రీయొక్క శక్తిని గూర్చి యిట్లు వాక్రుచ్చియున్నారు. ‘‘స్త్రీలు బుద్ధిమంతులైనచో వారొక గొప్ప శక్తి కాగలరు…..స్త్రీ యొక్క ఆశీర్వాదయోగముచే ప్రపంచమున నూతనశక్తి యావిర్భవించునని నా విశ్వాసము.’’ హెన్రీఫోర్డు కోటీశ్వరుని యొక్క యీ యభిప్రాయ మఖిల పశ్చిమఖండాభిప్రాయమని చెప్పనొప్పును.
నేటి భారతదేశావసరములు గూడ స్త్రీ యబలా నామము యొక్క యనర్థకమును గుర్తింపవలసినదిగా నున్నవి. సర్వతోముఖముగా పునర్నిర్మాణమును గోరుచున్న భారతదేశమున స్త్రీ యొక్క సహాయ మత్యవసరము. స్త్రీ యొక్క సహాయము లేక యే మతము గాని వ్యాప్తినందదు. ఏ సాంఘిక వ్యవస్థయుఁ జక్కఁబడదు. ఏ సంస్కారము గాని ప్రచారమునకు రాదు. ఏ శిథిలరాజ్యము గాని పునరుద్ధరింపఁబడదు. ఏ పరాధీన దేశము గాని స్వాతంత్య్రమును బడయదు. కాన భారత మహిళ తన శక్తిని గుర్తింపక, యింకను ‘నబల’నను భావముతో నుండుట దేశ పురోవృద్ధికి భంగకరము. ఎప్పుడు స్త్రీ పురుషునితోఁబాటు తన మనోధ్రఢమిను, ధీశక్తిని, వాగ్నైపుణిని, దేహ బలమును దేశ పురోభివృద్ధికి వినియోగించునో యప్పుడే యే దేశమైనను సత్వరాభివృద్ధిఁ గాంచును. అయితే స్త్రీయందంతర్గర్భితమై నిద్రాణమై యున్న యీ మహచ్ఛక్తిని జాగరిల్లఁజేయు కర్తవ్యము మాత్రము పురుషులది. మహాప్రభావము గల నీశక్తియే యుద్దీపించెనేని దాని ఫలము సామాన్యము గాదు. అవకాశ మొసగినచో స్త్రీ శక్తి రాజ్యముల నిర్మించును. రాజతంత్రముల నడుపును. యుద్ధములఁ జేయును. శాస్త్రముల రచియించును. కవితలల్లును. కళలఁ బోషించును. ప్రసంగముల సల్పును. శూరులఁ బుట్టించును. జ్ఞానుల నుత్పాదింపఁ జేయును. దేశభక్తుల ప్రసాదించును. పండితప్రకాండుల నొసంగును. కళాకోవిదుల సృష్టించును. అహా! స్త్రీమేధ కతీతమైన విషయమెద్ది గలదు? సమస్త పదార్థ యుత్పత్తికిని భూదేవతవోలె, సర్వమానవ సృష్టికిని మాతృదేవతయగు స్త్రీదాస్థానము. యోగ్యయగు జననిగఱపుటయే బిడ్డకు మొదటి పాఠశాల. ఆమె పాడు పాటలే బిడ్డకు రెండవ బోధనాలయము. శైశవమున నామె చెప్పెడి నీతులు, నేర్పెడి వినీత వర్తనమే బిడ్డకు మూడవ శిక్షణాలయము. మాతృత్వము యొక్క బాధ్యతను గుర్తెఱింగి తల్లి సుశిక్షనొసంగెనేని యా బిడ్డల భవిష్యమెంత యుచ్ఛముగనుండునో చెప్పవలెనా?
కాకతీయాంధ్ర రాజ్యరమను బాలింపజాలిన ధీపటిమ, పల్నాటి వీర పౌరుషము నుద్దీపింపఁజేయఁ జాలిన కార్యకౌశలము, జ్యోతిశ్శాస్త్ర సారమును గనుగొనజాలిన పాండిత్య గరిమ, గణిత శాస్త్రమును విరచింపఁ జాలిన మహామేధ, మహామనీషులకు సైతమక్కజమనిపింపఁ జాలిన జ్ఞానసంపత్తి, అసువులే తృణముగా వర్జింపఁజాలిన మహత్కార్యము, సమస్త భూతనిచయమునందును బరమాత్మను దర్శింపఁజాలిన పరమభక్తి, ఖండఖండాంతర వాసులెల్ల రాహ్వానింపఁజాలిన వాగ్వైభవము గల స్త్రీ యబలయా? కాదు. కావుననే యొక ఆధునిక కవిశేఖరుఁడు స్త్రీ సామర్థ్యము నిట్లు గానముసేయుచున్నాడు.
‘‘చదువనేర్తురు పూరుషుల్ బలెనె శాస్త్రంబుల్ పఠింపించుచో
నదమన్నేర్తురు శత్రుసేనల ధనుర్వ్యాపారముల్ నేర్పుచో
నుదితోత్సాహముతోడ నేలఁగలరీయుర్విన్ బ్రతిష్ఠించుచో
ముదితల్ నేరగరాని విద్యగలదే? ముద్దారనేర్చించినన్.’’
(ఈ పునర్ముద్రిత వ్యాసం బ్రిటీష్ పాలనా కాలం నాటి భారతదేశంలో/ ఆంధ్రలో బలమైన మహిళోద్యమాన్ని నిర్మించిన ప్రముఖ మహిళా మేధావీ, క్షేత్రస్థాయి కార్యకర్తా అయిన కనుపర్తి వరలక్ష్మమ్మ సుమారు వంద సంవత్సరాల కిందట రాసినది. ప్రారంభంలోనే పేర్కొన్నట్లు, నెల్లూరులోని ‘ప్రోగ్రెసివ్ యూనియన్’ ‘‘స్త్రీ అబల కాదు’’ అనే అంశంపై నిర్వహించిన వ్యాస రచన పోటీలో నూటికి 49 మార్కులు సాధించి, ‘‘కేసరి స్వర్ణ పతకము’’ను బహుమానంగా పొందిన ఈ వ్యాసాన్ని గృహలక్ష్మి అనే ప్రముఖ స్త్రీల పత్రిక 1930వ సంవత్సరం మే సంచికలో ప్రచురించింది (సంపుటము 3, సంచిక 2, పు. 132`140). ప్రారంభంలో బ్రాకెట్స్‌లో వున్న భాగం గృహలక్ష్మి సంపాదకుడైన డాక్టర్ కే.ఎన్. కేసరి యిచ్చిన వివరణ.
ఈ వ్యాస రచన పోటీలో వరలక్ష్మమ్మతో పాటు మొత్తం 12 మంది స్త్రీలు పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్నవారు (‘‘పరీక్షాధికారులు నిర్ణయించిన వరుస క్రమమున’’) : శ్రీమతి శిఖరం కమలాంబ, శ్రీమతి సీరిపి అచ్చమాంబ, శ్రీమతి వురిటి సూర్యనారాయణమ్మ, శ్రీమతి ఆచంట సత్యవతమ్మ, శ్రీమతి కృష్ణవేణి భిషగ్రత్న, శ్రీమతి అక్కరాజు సీతారామమ్మ, శ్రీమతి సూరపరాజు రుక్మిణమ్మ, శ్రీమతి జి. వీరమ్మ, శ్రీమతి అద్దంకి అనసూయాదేవి. ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమంటే స్త్రీలు అబలలు కాదు అని నొక్కివక్కాణించిన ఈ స్త్రీలందరూ శ్రీమతులు.
కనుపర్తి వరలక్ష్మమ్మది ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరైనప్పటికీ, కొన్ని విశేషాల్ని స్థూలంగా తెలుసుకుందాం. వరలక్ష్మమ్మ 1896 అక్టోబరు 6న బాపట్లలో జన్మించారు. తల్లిదండ్రులైన హనుమాయమ్మ, పాలపర్తి శేషయ్యలు ఆర్వేల నియోగి బ్రాహ్మణులు. అప్పటి ఆచారాన్ననుసరించి సుమారు 13 సంవత్సరాల వయసులో 1909లో ఆమెకు పెళ్ళైంది. భర్త కనుపర్తి హనుమంతరావు స్త్రీ జనాభ్యుదయవాది. తన జిజ్ఞాసకు భర్త ప్రోత్సాహం తోడవడంతో పెళ్ళికి ముందు కేవలం నాలగవ తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగిన వరలక్ష్మమ్మ, అంచెలంచెలుగా ఎదిగిందిÑ మేధావిగా మహిళోద్యమ నాయకురాలిగా తనను తాను తీర్చిదిద్దుకుంది. ఆమె పేరుతోపాటే గుర్తుకొచ్చేవి రెండు సంపుటాలుగా ప్రచురితమైన శారద లేఖలు. అనసూయ లో ప్రారంభమై, ఆంధ్రలక్ష్మి, గృహలక్ష్మి లలో కొనసాగిన ఈ అద్భుతమైన లేఖలు, సమకాలీన సమస్యలపై తక్షణం స్పందించి, అభ్యుదయం వైపు మొగ్గే పబ్లిక్ ఇంటెలెక్చువల్‌గా వరలక్ష్మమ్మను నిలబెడతాయి. ఆమె రాసిన ‘కథ ఎట్లా వుండాలె?’, ‘ఒట్టు’, ‘చట్ట సభల్లో మెజారిటీ మీదేగా!’ లాంటి కథల గురించి చాలా మందికి తెలుసు. అయితే, బాల్యవివాహ దురాచారానికి బలైన బాల భార్యల బాధల్నీÑ వయసులో పెద్దవాడై అనుమానప్పురుగైన భర్తతోనూÑ చీటికీ మాటికీ చాడీలు చెప్పి, భర్తతో కొట్టించే ఆడపడుచుతోనూ వేగలేక నీళ్ళలో దూకి చచ్చిపోయే నిర్భాగ్య స్త్రీల జీవితాలనూ హృదయవిదారకంగా చిత్రించిన ‘కనకవల్లి’, ‘ప్రేమలత ` స్వీయ చరిత్రము’ లాంటి పెద్ద కథలు వుండాల్సినంత చర్చలో వుండకుండా పోయాయి. స్థూలంగా చెప్పాలంటే ఈ రెండూ సంస్కృతి చేసిన గాయం చెప్పిన కథలుÑ క్షుభిత హృదయల దీనగాధలు.
సమకాలీన పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వెలువడిన వరలక్ష్మమ్మ రచనలు (కథలూ, వ్యాసాలూ, తదితరాలు) ఆమెను నిఖార్సైన ప్రజా మేధావిగా నిలబెడితే (అప్పటి సందర్భం దృష్ట్యా), వివిధ మహిళా సంఘాల ద్వారా మహిళోద్యమం నిలదొక్కుకునేందుకు క్షేత్రస్థాయిలో ఆమె చేసిన పని ఆమెనో అంకితభావంగల కార్యకర్తగానూ, ‘చేతల మనిషి’ గానూ నిర్ద్వంద్వంగా నిరూపిస్తుంది. (చాలా మంది మాటలు కోటలు దాటుతుంటాయి గాని కాలు మాత్రం గడప దాటదని మనందరికీ తెలిసిందేగా!) స్థలాభావం కారణంగా అన్నీ తెలుసుకోలేము గాని 1931లో బాపట్లలో స్థాపించిన ‘స్త్రీ హితైషిణీ మండలి’ అనే మహిళా సంఘాన్ని గూర్చి మాత్రం తప్పకుండా చెప్పుకోవాలి. ఈ సంఘానికి వెలగపూడి సరస్వతమ్మ అధ్యక్షురాలు గానూ, వరలక్ష్మమ్మ సెక్రెటరీ గానూ పని చేసి విజయవంతంగా నడిపించారు. ఇక్కడ వారానికి రెండుసార్లు సమావేశమైన స్త్రీలు పత్రికలు చదవడంÑ దూర`దూర ప్రాంతాల నుండి పిలిపించిన వారు యిచ్చిన ఉపన్యాసాలు వినడంÑ తామే వివిధ విషయాలపై ఉపన్యాసాలివ్వడం లాంటివి చేసేవారు. 1941లో స్త్రీల కోసం ప్రత్యేకంగా ‘‘వేసంగి పాఠశాల’’ (సమ్మర్ స్కూల్) నడపడం వరలక్ష్మమ్మ విశిష్టత. మహిళాభివృద్ధి కోసం చక్కగా పని చేసిన కొన్ని యితర మహిళా సంఘాల్లా కాకుండా ‘స్త్రీ హితైషిణీ మండలి’ స్వాతంత్య్రానంతరం కూడా విజయవంతంగా కొనసాగింది. మల్లాది సుబ్బమ్మ కూడా కొంత కాలం దీనికి సెక్రెటరీగా పనిచేసింది (స్త్రీ స్వేచ్ఛ, ఆగస్టు 2001, పు. 50). స్త్రీల అసలైన సమస్యల్ని పట్టించుకోకుండా, కాలక్షేపానికి మాత్రమే పరిమితమైన మహిళా సంఘాలను వరలక్ష్మమ్మ తీవ్రంగా విమర్శించేది. ఇలాంటి సంఘాల్ని హేళన చేస్తూ ‘లేడీస్ క్లబ్బు’ అనే వ్యంగ్య రచన చేసింది. (గృహలక్ష్మి, ఏప్రిల్ 1942, పు. 89`95). 1930ల ప్రారంభానికల్లా మహిళోద్యమ నాయకురాలిగా ఆమె ఎంతగా ఖ్యాతి గడిరచిందంటే, 1933లో గృహలక్ష్మికి యేర్పడిన సలహా సంఘంలో (‘గృహలక్ష్మి సలహా సంఘము’) వుండమని కే.ఎన్. కేసరి ఆమెను కోరాడు. 1934లో ‘గృహలక్ష్మీ స్వర్ణ కంకణం’తో సత్కరించాడు. (భూమిక కవర్ మీద ప్రచురించిన ఫొటొగ్రాఫ్ ఆ సందర్భంలో తీసిందే). జీవితాంతం మహిళాభ్యుదయం కోసం తపించిన వరలక్ష్మమ్మ 1978 ఆగష్టు 13న చనిపోయింది.
ఇక వరలక్ష్మమ్మ వ్యాసాన్ని ప్రచురించిన గృహలక్ష్మిని గూర్చి కొద్దిగా తెలసుకుందాం. మాస పత్రిక అయిన గృహలక్ష్మి 1928 మార్చిలో ప్రారంభమై, 1960ల దాకా కొనసాగింది (1949`47 మధ్య కొంతకాలం ఆగిపోయింది). డాక్టర్ కే. ఎన్. కేసరి సంపాదకుడు. 1940 నాటికే 2000 మంది చందాదారులతో చిన్న`చిన్న పట్టణాలకు కూడా చేరేది. స్త్రీల రచనలను విశేష ప్రాధాన్యంతో ప్రచురించిన గృహలక్ష్మి లో స్త్రీల సమస్యల్ని వివిధ కోణాల్లో విశ్లేషించిన రచనలు ప్రచురితమయ్యేవి. ఒక ప్రత్యేక సమస్యను తీసుకొని దానిమీద స్త్రీలలో చర్చను ప్రోత్సహించడం గృహలక్ష్మి విశిష్టత. ఉదాహరణకు ‘విడాకుల చట్టం’ అవసరమా? లేదా? అనే విషయంపై జరిపిన చర్చ. అలాగే భారత స్త్రీకి ‘సంపూర్ణ స్వేచ్ఛ’ ఎప్పుడు వస్తుంది? అనే విషయంపై జరిగిన చర్చ చాలా ఆసక్తికరంగా వుంది. పందొమ్మిదవ శతాబ్దం నాటి సంఘ సంస్కరణోద్యమ అంశాలైన బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహోద్యమం, స్త్రీ విద్య మొదలైన వాటితోపాటు వరకట్న దురాచారం, స్త్రీలకు ఆస్తి హక్కు, రాజకీయ హక్కులు మొదలైన అనేక అంశాలపై లోతైన ఆలోచనలు కలిగిన రచనల్ని ప్రచురించడం గృహలక్ష్మి యింకో విశిష్టత. ఉదారవాద పితృస్వామి అయిన సంపాదకుడి ఆలోచనలతో ఎంతమాత్రమూ ఏకీభవించని రచనల్ని సయితం ప్రచురించి చర్చనూ, భిన్నాభిప్రాయాల్నీ ప్రోత్సహించేది. గుండె రగిలిన వారు తమ బాధల్ని వెల్లగక్కడానికీ గృహలక్ష్మి వేదిక అయ్యింది. ఉదాహరణకు కమ్మ కులానికి చెందిన ఒక ‘యువతి’ తన ప్రేమను గురించి దీనంగా రాసింది. కమ్యూనిస్టులై అభ్యుదయం గురించి మాట్లాడే తన అన్నా, బాబాయి లు తన ప్రేమ విషయం దగ్గరికొచ్చేసరికి తమ అభ్యుదయాన్ని భద్రంగా పెట్టెలో దాచిపెట్టి తాళం వేసుకోవడాన్ని ప్రశ్నిస్తూ, ‘ఇదా నవయుగము!’ అని సమాజాన్ని ఈసడిరచుకుంది. దీనిపై సంపాదకుడైన కే.ఎన్. కేసరి స్పందించిన తీరు మాత్రం చాలా ప్రశంసనీయం. ఒక వేళ ఆమె చెప్పింది వాస్తవమైతే, ఆమెకు అన్ని విధాలుగా సహాయం చెయ్యడానికి సిద్ధంగా వున్నానని పత్రికాముఖంగా ప్రకటించాడు. (తర్వాత ఏమైందని తెలుసుకోడానికి చాలా ప్రయత్నించాను గాని దీనికి సంబంధించిన సమాచారం దొరకలేదుÑ నా ప్రయత్నం యింకా కొనసాగుతూనే వుంది.) స్త్రీలలో తమ ఆరోగ్యానికి సంబంధించిన చైతన్యాన్ని కలిగించడంలో గృహలక్ష్మి చేసిన కృషి అంతా యింతా కాదు. సంపాదకుడు స్వయానా ఆయుర్వేద వైద్యుడు కావడం ఒక కారణం కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే వలసాంధ్ర స్త్రీల మేధో వికసన క్రమమనే కొండను గృహలక్ష్మి అనే అద్దంలో స్పష్టంగా చూడవచ్చు.)
ముగింపునకు మారుగా : ఇంతకీ సమాజమంతా స్త్రీలు అబలలు కాదని అంగీకరించినట్టేనా?
అక్టోబర్ 6 కనుపర్తి వరలక్ష్మమ్మ జయంతి.
